“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

31, ఆగస్టు 2017, గురువారం

నా పాటల అభిమానులకు ఒక సూచన

'ఆలోచనా తరంగాలు' బ్లాగులో నా పాటలు క్లిక్ చేస్తే అవి రావడం లేదని నా అభిమానులు చాలామంది నాకు మెయిల్స్ చేస్తున్నారు. వారికోసం ఈ పోస్ట్ !!

నా పాటలన్నీ MP3 ఫార్మాట్ లో weebly hosting వెబ్ సైట్ లో ఉంచడం చాలాకాలం నుంచీ జరుగుతున్నది. ఈ మధ్యనే ఈ సైట్ ను భారత ప్రభుత్వం నిషేధించింది. ఎందుకంటే ఈ సైట్ ను వాడుకుని చాలామంది ఇస్లామిక్ ముష్కరులు భారతదేశానికి వ్యతిరేకంగా వ్రాతలు వ్రాస్తున్నారట. కనుక ఇండియాలో ఈ సైట్ ఓపన్ కావడం లేదు. అందుకని నా పాత పాటలనూ మీరిప్పుడు నా 'ఆలోచనా తరంగాలు' బ్లాగ్ నుంచి వినలేరు, మీరిప్పటికే వాటిని డౌన్లోడ్ చేసుకుని ఉంటే తప్ప.

ఈ పాటలన్నింటినీ ఇంకొక హోస్టింగ్ వెబ్ సైట్ కు మార్చే ప్రయత్నం జరుగుతున్నది. ఇది కొన్ని రోజులు పట్టవచ్చు. ఎందుకంటే, నేను లెక్కపెట్టలేదుగాని, ఇప్పటికే ఈ పాటలు దాదాపు 200 దాటాయని నా ఊహ. కనుక అవన్నీ మళ్ళీ ఇంకో హోస్టింగ్ సైట్లో అప్లోడ్ చెయ్యడానికి కొంత టైం పడుతుంది. అంతవరకూ కొంచం ఓపిక పట్టండి. ఆ తర్వాత మళ్ళీ నా బ్లాగ్ లో పాటలను మీరు వినవచ్చు.

ఈ పని చెయ్యడంలో ఓపికగా నాకు సూచనలు అందించి సహాయపడిన నా పాటల అభిమాని మాలా రంగనాద్ గారికి నా కృతజ్ఞతలు.
read more " నా పాటల అభిమానులకు ఒక సూచన "

28, ఆగస్టు 2017, సోమవారం

ఛిన్నమస్తా సాధన - 6

వజ్రయాన బౌద్ధంలో చాలామంది ప్రముఖ గురువులున్నప్పటికీ వారిలో ముగ్గురి పేర్లు ప్రముఖంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. వారు ఇంద్రభూతి మహారాజు, ఆయన చెల్లెలు లక్ష్మీంకర, ఆయన కుమారుడు పద్మసంభవుడు.

Maha Siddha King Indrabhuti
ఇంద్రభూతి అనేవాడు రాజేగాక తాంత్రిక సిద్ధుడు కూడా. ఈయన అస్సాం ప్రాంతంలో క్రీ.శ. 700-800 మధ్యలో రాజ్యం ఏలాడు. ఈయన వజ్రయోగిని/చిన్నమస్తా ఉపాసన చేసినట్లు ఆధారాలున్నాయి. ఈయన 'జ్ఞానసిద్ధి' అనే తంత్రగ్రంధం వ్రాశాడు. రాజులలో ఈయన జనకమహారాజు వంటివాడు. రాజ్యం చేస్తూ కూడా ఈయన సాధన గావించి సిద్ధిని పొందాడు.


ఈయన చెల్లెలు లక్ష్మీంకర. ఈమెకు శ్రీమతి అని కూడా పేరుంది. ఈమె చిన్నముండావజ్రవారాహి సాధనలో నిష్ణాతురాలని తెలుస్తున్నది. ఈమె బోధలు ఇండియానుంచి నేపాల్, టిబెట్ లకు విస్తరించాయి. మహాసిద్దులలో ఈమె కూడా ఒకరు. 84 మహాసిద్ధులలో నలుగురు స్త్రీలున్నారు. వాళ్ళు లక్ష్మీంకర, మేఖల, కనఖల, మణిభద్ర.

చిన్నముండా వజ్రవారాహి సాధనను  మహాసిద్దురాలు లక్ష్మీంకర తన శిష్యులకు ఉపదేశించింది. ఈమె జీవితం సాధకులకు ఎంతో ఉత్తేజకరంగా ఉంటుంది. అందుకే ఆమె జీవితాన్ని క్లుప్తంగా ఇక్కడ ఇస్తున్నాను.

Maha Siddha Lakshminkara
లక్ష్మీంకర రాజకుటుంబానికి చెందిన వనిత. ఈమె ఇంద్రభూతి మహారాజు చెల్లెలు. చిన్ననాటి నుంచీ ఆధ్యాత్మిక భావాలతో ఉండేది.ఎంతో అల్లారుముద్దుగా పెంచబడింది. ఈమెకు పక్క దేశపు రాజైన జలంధరుని కుమారునితో వివాహం నిశ్చయం అయింది. అయితే, ఇంద్రభూతి బౌద్ధుడు. జాలంధరుడు హిందువు. అత్తగారింటికి ఎన్నో బహుమతులతో ఎంతో బలగంతో వెళ్ళిన లక్ష్మీంకర ఆ ఊరికి అనుకున్న దానికంటే కొన్ని రోజులు ఆలస్యంగా చేరుకుంది. ఆ రోజు మంచిరోజు కాదని రాజజ్యోతిష్కులు చెప్పడంతో మర్నాడు రాజప్రాసాదంలోకి అడుగుపెడదామని అనుకుని వారందరూ కోట బయటే మకాం చేశారు.

ఉన్నట్టుండి వారు కోలాహలంగా వస్తున్న ఒక పెద్ద సైన్యాన్ని చూచారు. ఆ సైన్యం - యువరాజు (ఈమెకు కాబోయే భర్త) తో బాటు వేటకు వెళ్లి నానా జంతువులనూ వేటాడి తిరిగి వస్తున్న గుంపు. తను చంపిన జంతువును నిర్లక్ష్యంగా భుజాన వేసుకుని రక్తం ఓడుతూ గర్వంగా వస్తున్న తనకు కాబోయే భర్తను చూచి ఆమె భరించలేకపోయింది. సున్నితమైన ఆమె మనస్సు ఇలాంటి క్రూరాత్ములైన దురహంకార రాజుల కుటుంబంలో కోడలు కావడం తట్టుకోలేకపోయింది. వేటకు వెళ్లి నానా జంతువులను చంపి తెచ్చి వాటిని వండుకుని తినడమూ, కరుణ, దయ, ధ్యానసాధన మొదలైన మంచి లక్షణాలు ఏవీ లేని ఆ రాజునీ అతని కొడుకునీ చూచి ఆమె సున్నిత హృదయం తట్టుకోలేక పోయింది. ఆధ్యాత్మికత అంటే ఏమాత్రమూ తెలియని ఇటువంటి కుటుంబానికి కోడలుగా వచ్చినందుకు ఆమె మానసికంగా చాలా నలిగిపోయింది. 

అక్కడికక్కడే ఆమె ఒక కఠోరనిర్ణయం తీసుకుంది. వెంటనే తను తెచ్చిన వజ్ర వైడూర్యాల పెట్టెలన్నీ తెరిపించి అక్కడ చేరిన ప్రజలకు ఆ సంపదనంతా పంచి పెట్టేసింది. తన నగలన్నీ తన చెలికత్తెలకు ఇచ్చేసింది. తనతో వచ్చిన వారినందరినీ వెనక్కు పంపేసింది.

మర్నాడు, ఆమెను రాజభవనంలోకి ఆహ్వానించారు. ఏ మందీ మార్బలమూ లేకుండా ఒక్కతే లోపలకు వెళ్ళిన ఆమె తన గదికి లోపల గడియ పెట్టుకుని ఎవరితోనూ పలక్కుండా వింతగా పిచ్చిదానిలా ప్రవర్తించసాగింది. దగ్గరకు వచ్చిన వాళ్ళమీద వస్తువులు విసిరేసి, జుట్టు విరబోసుకుని, బట్టలు చించేసుకుని, ఒంటికి దుమ్మూ బురదా పూసుకుని పిచ్చిగా మాట్లాడుతూ నిజంగానే 'పిచ్చిది' అని ముద్ర వేయించుకుంది. ఈ గోలంతా చూచి కాబోయే భర్త ' ఈ పిచ్చిది నాకొద్దు' అని పెళ్లిని రద్దు చేశాడు. సరిగ్గా ఈమెకు కావలసింది కూడా అదే !!

ఆ పెళ్లి పెటాకులైనందుకు లక్ష్మీంకర సంతోషంతో ఉప్పొంగిపోయింది. ఒకరోజున రాత్రి బుద్ధునివలె అకస్మాత్తుగా రాజభవనాన్ని వదిలేసి బయటకొచ్చిన ఈమె, పిచ్చిదానిలా నటిస్తూ ఊరిబైట ఒక స్మశానంలో నివశించసాగింది. ఒక రాణిగా రాజభోగాలను అనుభవించే అవకాశం వచ్చినా దానిని త్రోసిపారేసి జ్ఞానసిద్ధి కోసం అలాంటి  కఠోరమైన నిర్ణయం తీసుకుంది. అదికూడా ఈ సంఘటన జరిగినది వెయ్యి సంవత్సరాల క్రితం రాజరిక సమాజంలోనన్న విషయం గుర్తుంచుకోవాలి !!  ఇదెంత గొప్ప త్యాగమో ఒక్కసారి ఆలోచించండి !!

సరే రాణి పదవిని తృణప్రాయంగా త్యజించి శ్మశానంలో నివాసం ఏర్పాటు చేసుకుంది. పిచ్చిదానికి, అందులోనూ శ్మశానంలో ఉండేదానికి తిండి ఎవరు పెడతారు? అందుకని, కుక్కలకు వేసిన ఆహారాన్ని ఆ కుక్కలతో కలసి తినసాగింది.

Maha Siddha Kambala
ఆ సమయంలో ఈమెను చూచిన ఒక మహాసిద్ధుడు ఈమెకు దీక్షను అనుగ్రహించి సాధనామార్గాన్ని ఉపదేశించాడు. అతని పేరు మహాసిద్ధ కంబళుడు. ఇతనికి లవపాదుడు అనే పేరు కూడా ఉంది. ఇతను ఒక కంబలి మాత్రమె కట్టుకుని ఒక గుహలో ఉంటూ సాధన చేసేవాడు. ఇతని చరిత్ర కూడా చాలా అద్భుతమైనది. ఇతనే 'స్వప్నసాధన' కు ఆద్యుడు. ఈయననుంచి ఈ సాధనను టిబెటన్ గురువైన తిలోపా నేర్చుకున్నాడు.

ఆ రకంగా శ్మశానంలో ఉంటూ కుక్కలతో కలసి పారేసిన తిండి తింటూ ఎడతెగని సాధనను ఏడేళ్ళపాటు ఈమె కొనసాగించి తంత్రసిద్ధిని పొంది మహాసిద్ధులలో ఒకరుగా స్థానం సంపాదించింది.అందుకే మహాసిద్ధులలో ఒకరైనప్పటికీ ఈమెకు 'పిచ్చిరాణి' అని పేరుంది. ఈమె జీవితం బుద్ధుని జీవితానికి ఏమీ తీసిపోదు. అంతటి త్యాగమూర్తి ఈమె.

ఈమె ఆ విధంగా స్మశానంలో ఉంటూ సాధన చేసిన ఏడేళ్ళూ ఈమెను తరచుగా దర్శిస్తూ సేవ చేస్తూ దుఖండి అనే ఒకతను నమ్మకంగా ఉండేవాడు. అతను రాజభవనంలో పాకీవాడు. ఈమె మొదటి శిష్యుడు అతడే. కాలక్రమేణా అతనూ సాధన గావించి మహాసిద్దులలో ఒకడైనాడు.

ఈమె ఉపదేశాల నుంచి ఒక మచ్చు తునక.

నీ తలను ఒక వెన్న ముద్దపైన ఉంచి దానిని నరికి పారెయ్
ఆ తర్వాత గొడ్డలిని కూడా ధ్వంసం చెయ్
ఆ తర్వాత పిచ్చిగా నవ్వు
కప్ప ఏనుగును మ్రింగుతుంది చూడు

ఓ మేఖలా ! ఇది చాలా ఆశ్చర్యకరమైన సాధన
నీకింకా అర్ధం కాలేదా?
నీ ఆలోచనలను తీసి పక్కన పెట్టు

నా గురువు నాకేమీ చెప్పలేదు
నేనేమీ నేర్చుకోలేదు
కానీ ఆకాశంలో పూలు వికసించాయి

ఓ మేఖలా ! ఇది చాలా ఆశ్చర్యకరమైన సాధన
నీకింకా అర్ధం కాలేదా?
నీ సందేహాలను విసరి అవతల పారెయ్

ఈమె ఎప్పుడైతే సిద్ధిని పొంది అతీత శక్తులను ప్రదర్శించడం సాగించిందో అప్పుడు లోకం ఈమెకు పాదాక్రాంతమై ఈమెను గౌరవించసాగింది. పిచ్చిలోకానికి మహిమలే కదా కావలసింది ! 'ఈ పిచ్చిది నాకొద్దు' అని తిరస్కరించిన రాజు కూడా చివరకు ఈమె నివసిస్తున్న కొండ గుహకు వచ్చి, తనను శిష్యునిగా స్వీకరించమని ప్రార్ధిస్తూ దీక్షకోసం ఈమెను అర్ధించాడు. కానీ ఈమె అతన్ని చాలాకాలం పాటు నమ్మలేదు. పరీక్షిస్తూ వచ్చింది. చివరకు అతని నిజాయితీని మెచ్చుకుని 'నీ గురువు నేను కాదు. అతను నీ దగ్గరే ఉన్నాడు. అతను నీకు దీక్ష ఇస్తాడు. స్వీకరించి సాధన చెయ్యమని చెప్పింది.' నాదగ్గరే ఉన్నాడా? ఎవరతను?' అని ఆశ్చర్యపోయిన ఆ రాజుకి ' అతను ఎవరో కాదు. దుఖండి అనే పేరుతో నీ లెట్రిన్ క్లీన్ చేస్తున్న పాకీవాడే నీ గురువు' అని చెప్పి అతని చేత రాజుకు దీక్ష ఇప్పించింది. ఆ రోజులలో ఇలాంటి విప్లవాత్మకములైన పనులను చెయ్యడం ఎంత అసాధ్యమో ఒక్కసారి ఆలోచించండి. నేటి సో కాల్డ్ సంఘసంస్కర్తలు ఇలాంటి జీవితాలను చదివి సిగ్గుతో తలలు దించుకోవాలేమో !

ఈమె జీవితానికీ దాదాపు అదే కాలానికి చెందిన శైవయోగిని అక్కమహాదేవి జీవితానికీ పోలికలున్నాయి.

ఈమె శిష్యుడు విరూపుడు. ఇతను 'చిన్నముండా సాధన నామ' అనే తంత్ర గ్రంధం వ్రాశాడు. ఇతని నుంచి ఈ సాధన టిబెట్ కు పాకింది. 

కులవ్యవస్థను పెంచి పోషించినది అగ్రవర్ణాలైన రాజులూ బ్రాహ్మణులూ అని కులవిషం తలకెక్కిన మనుషులు నేడు ఇష్టం వచ్చినట్లు తెలిసీ తెలియని మాటలు మాట్లాడుతున్నారు. తంత్ర/ పురాణ యుగంలో కులవ్యవస్థను బ్రేక్ చేసిన వాళ్ళు రాజులూ బ్రాహ్మణులే. అయితే వీరి భావాలు లౌకికమైనవి కావు. ఆధ్యాత్మిక కోణంలో దీనిని వాళ్ళు బ్రేక్ చేశారు. నిజమైన తపనా, జిజ్ఞాసా ఉన్న వారికి కులంతో పనిలేకుండా ఆయా మహాసిద్ధులూ గురువులూ దీక్షలిచ్చారు. సాధన చేయించారు. వారిని కూడా తమంతటి మహాసిద్దులుగా గురువులుగా మార్చారు. ఈ విషయాలు నేటి కులపిచ్చి గాళ్ళకు ఏమాత్రం తెలియవు. వారు చరిత్రను తెలుసుకోవలసిన అవసరం ఉన్నది. అందుకే దీనిని ఇంత వివరంగా వ్రాస్తున్నాను.

'భక్తేర్ జోతి నోయ్' అని శ్రీ రామకృష్ణులు తరచుగా అనేవారు. 'సాధకులలో కులం లేదు' అని దీని అర్ధం. అయితే దీనిని నేటి ఆయన భక్తులే పాటించడం లేదు. అది వేరే విషయం అనుకోండి.

పోయినేడాది మా అబ్బాయికి పెళ్లి సంబంధం చూద్దామని, నేను ఒక వ్యక్తిని కలిశాను. ఆయనా రామకృష్ణుల భక్తుడే. వాళ్ళ అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారో లేదో అడుగుదామని ఆయన్ను కదిలించాను. వాళ్ళూ రామకృష్ణుల భక్తులన్న ఒక్క విషయమే నేనాయన్ని అప్రోచ్ కావడానికి గల ఒకే ఒక్క కారణం. స్టేటస్ ను కూడా పక్కన పెట్టి నేనా పని చేశాను. కానీ ఆయనిలా అన్నాడు - ' మేము వైదీకులము. మీ నియోగులలో మేం సంబంధం చేసుకోము.' నాకు మతిపోయినంత పనైంది. ఆయనతో ఇలా చెప్పాను - 'మీరు రామకృష్ణుల భక్తుడినని చెప్పుకోవడం సిగ్గుచేటు'. 'భక్తేర్ జోతి నోయ్' అని ఆయన బోధ. మరి మీరేమో బ్రాహ్మణులలోనే ఇంకొక శాఖతో సంబంధం కలుపుకోమని అంటున్నారు. మీ హృదయం ఇంత సంకుచితమని తెలీక మిమ్మల్ని ఈ విషయం కదిపినందుకు నేను సిగ్గుపడుతున్నాను. సారీ ! ఇప్పుడు మీరడిగినా సరే, మీ సంబంధాన్ని నేనే ఒప్పుకోను'.

తెల్లనివన్నీ పాలని అమాయకంగా మనం అనుకుంటాము. కానీ అవి నీళ్ళు కూడా కాదనీ, పాల రూపంలో ఉన్న ఫినాయిలనీ మనకు తరచుగా తెలుస్తూ ఉంటుంది. ఫినాయిలు కూడా తెల్లగానే ఉంటుంది కదా మరి !! భక్తులమని బడాయిలు చెప్పుకునే వారి నిజస్వరూపాలు ఇలా ఉంటాయి. వారి భక్తి, మాటల వరకేగాని, చేతలలోకి రాదు. ఇలాంటి భక్తి ఆ పేరుకు తగదు. దీనిని నేనస్సలు ఒప్పుకోను.

ఈరోజుల్లో దీక్షలిచ్చే గురువులూ వాటిని స్వీకరించే శిష్యులూ కుప్పలు తెప్పలుగా ఉంటున్నారు. కానీ వీరిలో ఎవరూ కూడా ఈ మహాసిద్ధుల స్థాయికి కనుచూపు మేరలో కూడా చేరుకోలేకపోతున్నారు.కారణం ఏమిటి? కారణం ఒకటే. నేటి మనుషులలో నిజాయితీ లేదు. శ్రద్ధ లేదు. నమ్మకం లేదు. మనసులో ఏవేవో ఆలోచనలు కోరికలు పెట్టుకుని ఇలాంటి వేషాలు వెయ్యబోతారు. అందుకే వీరికి ఆ స్థాయి రావడం లేదు.

నిజమైన జ్ఞానాన్నీ, సిద్ధినీ పొందాలంటే ఎంత కష్టపడాలో లక్ష్మీంకర వంటి మహాసిద్ధుల జీవితాలు మనకు నిరూపిస్తాయి. మనింట్లో మనం ఉంటూ హాయిగా సినిమాలు షికార్లు తిరుగుతూ ఎప్పుడో ఏమీ తోచనప్పుడు కాసేపు ధ్యానం అంటూ కళ్ళు మూసుకుని, అయిదు నిముషాలకంటే కూచోలేక లేచిపోయి - ' గురువుగారూ నాకు ఆలోచనలు కంట్రోల్ కావడం లేదు. నాకు మోకాళ్ళు నెప్పిగా ఉన్నాయి. నాకు నడుము నెప్పి పుడుతోంది.' అని నంగినంగిగా మాట్లాడే వారికి ఎన్ని జన్మలకి సిద్ధి కలిగేను?

చక్కని ఉపదేశం ఇచ్చినా సాధన చెయ్యకుండా ఏవేవో కాకమ్మ కబుర్లూ కుంటిసాకులూ చెబుతూ కాలక్షేపం చేస్తూ, నానారకాల గ్రూపు రాజకీయాలు చెయ్యాలని చూసేవారికి సిద్ధి ఎలా వస్తుందో? ఇలాంటి వాళ్ళు లక్ష్మీంకర వంటి మహనీయుల జీవితాలను ప్రతిరోజూ పొద్దున్నే పారాయణం చేస్తేనైనా వారికి బుద్ధి వచ్చి, సాధన అంటే ఎంత కష్టపడాలో, ఎన్నింటిని తమంతట తాము వదులుకోవాలో తెలుస్తుందో లేదో మరి??

(ఇంకా ఉంది)
read more " ఛిన్నమస్తా సాధన - 6 "

27, ఆగస్టు 2017, ఆదివారం

Jane Bahar Husn Tera Bemisal Hai - Mohammad Rafi


Music Director Ravi Shankar Sharma
Jane Bahar Husn Tera Bemisal Hai

అంటూ మహమ్మద్ రఫీ మధురాతి మధురంగా ఆలపించిన ఈ గీతం 1963 లో వచ్చిన Pyar Kiya Tho Darna Kya అనే చిత్రం లోనిది. సంగీత దర్శకుడు రవిశంకర్ శర్మ నిజంగా కారణజన్ముడే. లేకుంటే ఇంతమంచి రాగాలను కూర్చి ఇప్పటికీ మనం పాడుకునే ఇలాంటి మధురగీతాలను అందించలేడు. ఇక రఫీ సంగతి చెప్పనక్కర్లేదు. అద్భుతంగా ఈ పాటను ఆలపించాడు. సాహిర్ లూదియాన్వి ఈ పాటను అద్భుతంగా వ్రాశాడు. ఈ పాటలో షమ్మీ కపూర్, సరోజాదేవి నటించారు.

ఈ పాటను పాడటం చాలా కష్టం. ఇది మాల్కోస్ అనే హిందూస్తానీ శాస్త్రీయ రాగమే గాక ఎన్నో ఆరోహణా అవరోహణలతో, వేరియేషన్స్ తో కూడిన రాగం. క్రింది స్థాయిలో ఎత్తుకుని చాలా పై స్థాయికి వెళ్లి మళ్ళీ క్రిందకు దిగి రావాలి. కష్టమైనా ఇష్టంగా పాడితే బాగానే ఉంటుంది కదా !!

నా స్వరంలో కూడా ఈ పాటను వినండి మరి.

Movie:-- Pyar Kiya Tho Darna Kya (1963)
Lyrics:-- Sahir Ludhianvi
Music:-- Ravi Shankar Sharma (Ravi)
Singer:-- Mohammad Rafi
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
--------------------------------------------
jan-e-bahar husn tera bemisal hai
jan-e-bahar husn tera bemisal hai
wallah kamal hai are wallah kamal hai
jan-e-bahar husn tera bemisal hai

aayi hai mere pas tu iss aan-ban se
aayi hai mere pas tu iss aan-ban se
utri ho jaise koyi pari aasman se
mai kya kahu khushi se ajab mera hal hai
jan-e-bahar husn tera bemisal hai
wallah kamal hai are wallah kamal hai - haay
jan-e-bahar husn tera bemisal hai

haye yeh teri mast adaye ye bakpan
haye yeh teri mast adaye ye bakpan
kirno ko bhi mai chhune na dunga tera badan
tujhse najar milaye ye kiski majaal hai
jan-e-bahar husn tera bemisal hai
wallah kamal hai are wallah kamal hai
jan-e-bahar husn tera bemisal hai

mai khushnasib huke tujhe maine pa liya
mai khushnasib huke tujhe maine pa liya
tune karam kiya mujhe apna bana liya
aise mile hain ham ke bicchhadhna muhal hai
jan-e-bahar husn tera bemisal hai
wallah kamal hai are wallah kamal hai
jan-e-bahar husn  tera bemisal hai

Meaning

O Goddess of spring season
Your beauty is incomparable
O my God ! You are a wonderful beauty
What a stupendous beauty you are !!

You have come to me with such a dignity
as if a fairy has descended from the sky
What should I say?
I am overfilled with joy

Ah ! Your intoxicating charm and exquisite beauty
I wont allow even sun rays to touch your body
It is through some unknown grace that we met each other
O my God ! You are a wonderful beauty !!
What a stupendous beauty you are !!

I am damn lucky to have you as my sweet heart
You have accepted my love with a kind heart
The way we have met, it is just impossible to part
O my God ! You are a wonderful beauty
What a stupendous beauty you are !!

O Goddess of spring season
Your beauty is incomparable
O my God ! You are a wonderful beauty
What a stupendous beauty you are !!

తెలుగు స్వేచ్చానువాదం

ఓ వసంత దేవతా !
నీ అందం అపురూపమైనది
ఎంత సుందర రూపం నీది? ఎంత అందం నీది?

నా దగ్గరకు ఎంత సొగసుగా ఎంత హుందాగా వచ్చావు?
ఆకాశం నుంచి నాకోసం దిగి వచ్చిన అప్సరసవా నీవు?
ఏం మాట్లాడాలో నాకు తెలియడం లేదు
నా హృదయం ఆనందంతో ఉప్పొంగుతోంది

నీ వన్నెలూ చిన్నెలూ ఎంత సొగసైనవి?
సూర్య కాంతిని కూడా నిన్ను తాకనివ్వను
మన చూపులు కలవడం ఏ దేవత వరమో?

నువ్వు నాకు లభించడం నా అదృష్టం
నా ప్రేమను నువ్వు అంగీకరించడం ఇంకా గొప్ప వరం
మనం కలిసిన తీరు ఎలా ఉందంటే
ఇక విడిపోవడం అసాధ్యం

ఓ వసంత దేవతా !
నీ అందం అపురూపమైనది
ఎంత సుందర రూపం నీది? ఎంత అందం నీది?
read more " Jane Bahar Husn Tera Bemisal Hai - Mohammad Rafi "

Baba Ram Rahim Singh Chart Analysis

బాబా రాం రహీం సింగ్
పంజాబ్ హర్యానా రాజస్థాన్ రాష్ట్రాలు నేడు నిప్పుల కుంపటిలా ఉడకడానికీ, ఆ రాష్ట్రాలలో యుద్ధవాతావరణం రావడానికీ కారకుడు బాబా రాం రహీం సింగ్. ఈయన్ను అరెస్ట్ చేసినందుకు నిరసనగా వేలాదిమంది అతని అనుచరులు రోడ్లెక్కి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. ఆర్మీతో యుద్దానికి కూడా తలపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈయనకు అయిదు మిలియన్ల మంది భక్తులూ/ శిష్యులూ ఉన్నారు. ఈయనదొక విలక్షణమైన బహుముఖ వ్యక్తిత్వం. ఈయన జాతకాన్ని పరిశీలిద్దాం.


ఈయన 15-8-1967 న (స్వాతంత్ర్య దినోత్సవం రోజున) రాజస్థాన్ లో జన్మించాడు. 1967 లో గురువు ఖగోళంలో ఉచ్చస్థితిలో ఉన్నాడని మనకు తెలుసు. ఎవరి జాతకంలో అయితే గురువు ఉచ్చస్థితిలో ఉంటాడో వారికి జీవితంలో కనీస అవసరాలకు లోటుపాట్లు ఉండవు. అయితే ఆయా లగ్నాలను బట్టి కొంతమంది జీవితంలో బాగా ఉన్నతస్థాయికి చేరుకుంటారు. మరికొందరు అంత ఉన్నత స్థాయికి చేరుకోలేరు. కానీ వారి జీవితాలు కూడా ఉన్నంతలో బాగానే నడుస్తుంటాయి.

ఈయన జనన సమయం తెలియదు గనుక ఇతర పద్ధతుల ద్వారా పరిశీలిద్దాం. ఆరోజున చంద్రుడు రెండు నక్షత్రాలలో ఉన్నాడు - జ్యేష్ట 4, మూల 1. నక్షత్ర లక్షణాలను బట్టి ఈయన మూలా నక్షత్రంలో పుట్టాడని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మూలా నక్షత్రం అయితేనే గురువుగారి ప్రభావంలో ఉంటుంది మరియు ఇందులో పుట్టిన వాళ్ళు రాక్ స్టార్స్ లాంటి స్టేజీ గాయకులూ అవుతారు. ఈయన ఒక గురువేగాక పాటలు పాడి ఆల్బమ్స్ రిలీజ్ చెయ్యడమూ, సినిమాలు తియ్యడమూ వాటిల్లో నటించడమూ చేస్తుంటాడు. ఈయనకు "రాక్ స్టార్ బాబా" అనే పేరుంది. 


ధనాధన్ సద్గురు
అంతేగాక ఈ నక్షత్రం ఈ పాదం అయితేనే చంద్రుడు నవాంశలో కుజునితో కలసి మేషంలోకి వస్తాడు. అప్పుడే ఈయనకు రోషమూ, పట్టుదలా, స్పోర్ట్స్ యాక్టివిటీస్ మొదలైనవి కలుగుతాయి. అంతేగాక మూలా నక్షత్రానికి గురువు, కేతువుల లక్షణాలు కలగలసి ఉంటాయి. దీనికనుగుణంగానే వీరిలో చాలామంది గురువులై గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. గొప్ప ఆశయాలతో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. కానీ కేతు ప్రభావం వల్ల తమ చర్యలతో తమను తామే నాశనం చేసుకుని తోకచుక్కలా అకస్మాత్తుగా రాలిపోతూ ఉంటారు. ఇవన్నీ ఈయనలో ఉన్నాయి గనుక ఈయనది మూలానక్షత్రం అని నేను భావిస్తున్నాను. అదే నిజమైతే ఈయన మధ్యాన్నం పదకొండున్నర తర్వాత నుంచి సాయంత్రం అయిదు లోపల జన్మించి ఉండాలి. ప్రస్తుతం ఇంతకంటే జననకాల సంస్కరణ అవసరం లేదుగనుక ఇంతటితో ఆపుదాం.

ఈ విధంగా నక్షత్రమూ నక్షత్ర పాదమూ తెలిస్తే చాలు మనిషి మనస్తత్వాన్నీ అతని జీవిత రహదారినీ తేలికగా చదివెయ్యవచ్చు.

రాక్ స్టార్ బాబా
రవి బుధ, ఉచ్ఛ గురువులతో కూడి కర్కాటకంలో ఉన్న యోగం ఈయన జాతకంలోని బలం. నవాంశలో రాహుకేతువుల ఉచ్ఛస్థితి వల్ల జీవితంలో ఉన్నత స్థితికి సులువుగా చేరుకున్నాడు. పది/ఏడు స్థానాలకు అధిపతి అయిన బుధుడూ, తొమ్మిదో అధిపతి అయిన సూర్యుడూ, లగ్నాధిపతి అయిన ఉచ్ఛగురువుతో కలసి బలమైన మతగురువుగా యోగాన్నిచ్చారు. కానీ ఇది అష్టమంలో ఉండటంతో రహస్య కార్యకలాపాలు కూడా ఆశ్రమంలో జరుగుతాయని సూచన ఉన్నది.

అష్టమంలో నాలుగుగ్రహాల బలమైన సన్యాసయోగం వల్ల సంసారి అయి, భార్యాపిల్లలున్నప్పటికీ ఒక బలమైన మతసంస్థకు గురువయ్యాడు. ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్ ను సంపాదించాడు. అయిదింట పంచమంలో రాహువు వల్ల హిందూ, ఇస్లాం, సూఫీ మార్గాల కలగలుపు అయిన సిక్కు మతంలో ఒక శాఖకు గురువయ్యాడు. ఈయనకున్న బలమైన దళితఓటు బ్యాంకు వల్ల కాంగ్రెస్ నుంచి బీజీపీ వరకూ ప్రతి రాజకీయ పార్టీ ఈయన్ను ఇరవై ఐదేళ్లుగా దువ్వి బుజ్జగిస్తూ వస్తున్నాయి.


వరద బాధితులను ఓదారుస్తూ
ఈయనకు ఆరేళ్ళ చిన్న వయసులోనే ఆధ్యాత్మిక అనుభవాలు కలిగాయంటారు. ఈయనను చూచి బాగా ఇష్టపడిన 'డేరా సచ్చా సౌదా' గురువు సంత్ సత్నాంసింగ్ ఏడేళ్ళ వయసులో చిన్నపిల్లగాడిగా ఉన్న ఈయనకు దీక్షనిచ్చాడు. ఆ సమయంలో ఈయనకు కేతు మహాదశ నడిచింది. కేతుదశలో ఉన్నప్పుడు ఆధ్యాత్మిక యోగాలున్న జాతకులకు మంచి అతీతమైన అనుభవాలు కలగడం నిజమే. కనుక చిన్నతనంలో ఈయనకు ఆధ్యాత్మిక అనుభవాలు కలగడం నిజమే కావచ్చు. ఆ తర్వాత సెప్టెంబర్ 1990 లో ఈయన్ను తన వారసునిగా ప్రకటించాడు. అప్పటికి ఈయనకు 23 ఏళ్ళు.

నవమ దశమ అధిపతుల యోగం ఉచ్ఛగురువుతో కలసి ఈయనకు అద్భుతమైన రాజయోగాన్నిచ్చింది. అయితే మత కార్యకలాపాలకు సూచిక అయిన తొమ్మిదో స్థానంలో వక్ర శుక్రుని వల్లా, పదకొండులో కుజశుక్రుల వల్లా ఈయనలో శ్రీకృష్ణ పరమాత్ముని లక్షణాలు కొన్నున్నాయని అర్ధమౌతున్నది. తులలో ఉన్న కేతువు ఇక్కడ శుక్రుని సూచిస్తున్నాడని గుర్తుంచుకోవాలి.

శుక్రుడు ఈ రాశికి మంచివాడు కాదు గనుక పదకొండో అధిపతి అయిన శుక్రుడు సూచించే ఒక శిష్యురాలి వల్లనే ఈయనకిప్పుడు మూడింది. లాభస్థానం నుంచి ఇరుగూ పొరుగూ, స్నేహితులూ, పనివాళ్ళూ, లాభాలూ, రోగాలూ కూడా సూచితాలౌతాయి.  ఈ విధంగా జాతకంలోని వివిధ అంశాలు జీవితాన్ని సూక్ష్మంగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. అవేంటో ముందుగా గమనించి గ్రహించి వాటిని దిద్దుకుంటూ ఆయా దశలలో ఎంతో జాగ్రత్తగా నడవడమే జ్యోతిషం తెలిసినవారి కర్తవ్యం. అయితే ఇంత స్థాయిలో అధికారాన్నీ హోదానూ ఎంజాయ్ చేస్తున్నవారికి అహంకారంతో కళ్ళు పొరలు కమ్మి ఇవేవీ కనపడవు. కనుకనే పతనం అవుతూ ఉంటారు. 'నేను దైవాంశ సంభూతుడినే' అని ఈయన నమ్ముతూ ఉంటాడు. బహుశా ఈ మితిమీరిన నమ్మకమే ఈయన తాత్కాలిక పతనానికి కారణం అయి ఉండవచ్చు.

చంద్రుడు మూలానక్షత్రంలోకి వచ్చినపుడు మాత్రమే ఈయన జాతకంలో సూర్యుడు ఆత్మకారకుడౌతాడు. లేదంటే చంద్రుడు వృశ్చికరాశి చివరలో ఉంటాడు గనుక చంద్రుడే ఆత్మకారకుడౌతాడు. ఈయనలో చంద్రుని లక్షణాలు లేవు బలంగా ఉన్న సూర్యుని లక్షణాలే ఉన్నాయి గనుక గనుక మనం చేసిన 'బర్త్ టైం రెక్టిఫికేషన్' కరెక్టే అని దీనివల్ల తెలుస్తున్నది. తన జాతకంలో సూర్యుడు ఆత్మకారకుడు గనుకనే ఈయన పొడుగాటి గడ్డం పెంచి సింహంలాగా కనిపిస్తూ ఉంటాడు. ఈయన తీసే సినిమాలలో కూడా ఆయనకు 'లయన్ హార్ట్' అనే పేరు ఉంటూ ఉంటుంది. ఈ విధంగా మన జాతకంలోని గ్రహాలను బట్టే మన వేషమూ, మనం కనిపించే తీరూ, అంతేగాక మన పేర్లూ, డ్రస్సులూ, వాటి రంగులూ అన్నీ డిసైడ్ అవుతూ ఉంటాయి. జీవితానికీ జాతకానికీ ఇదొక సూక్ష్మమైన లింక్.

కారకాంశ లగ్నమైన మీనం నుంచి పంచమంలో గురువు ఉచ్ఛస్థితిలో ఉన్నందువల్ల ఇది ఒక గట్టి ఆధ్యాత్మిక యోగం అయినందువల్ల ఈయన పూర్తిగా మోసగాడని చెప్పలేము. గతంలో కంచి శంకరాచార్య జయేంద్ర సరస్వతి మీద కూడా చండాలమైన అభియోగాలు మోపబడ్డాయి. కానీ అంతమాత్రం చేత ఆయన మహనీయుడు కాకుండా పోలేదుగా? కాకుంటే, అష్టమంలో ఉన్న కుజకేతు యోగం ఈయన జాతకంలో ఉన్న రసికత్వాన్ని చూపిస్తున్నది మరి !!

'పెంపుడు' కూతురు హనీ ప్రీత్ ఇన్సాన్ తో
ఈయన జాతకానికీ రావణుని జాతకానికీ చాలా పోలికలున్నాయి. ఈయనకు రావణుని వేషం వేస్తే చాలా బాగా సూటవుతుంది. రావణునిది కూడా మూలా నక్షత్రమే. ఆయన కూడా తనలో ఎన్ని మంచి లక్షణాలున్నప్పటికీ, తానొక దైవాంశ సంభూతుడినన్న గర్వంతో అహంకారంతో కళ్ళు పొరలు కమ్మి తనకు నచ్చిన స్త్రీలను ఇష్టానుసారం చెరబట్టే కార్యక్రమంలో, సీతాదేవిని కూడా అలాగే చెయ్యబోయి పతనం అయిపోయాడు.

రావణుడు చేసిన మంచి పనులు ఎన్నో ఉన్నాయి. రావణుని ప్రజలను అడిగితే ఆయనకంటే మంచి రాజు ఎక్కడా లేడనే చెబుతారు. అలాగే ఈయన కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాడు. ఈయన అధిపతిగా ఉన్న 'డేరా సచ్చా సౌదా' అనే సంస్థ చాలా పెద్దది. ఇది ఎన్నో పయనీర్ కార్యక్రమాలు చేసింది. గిన్నీస్ రికార్డులు సొంతం చేసుకుంది. దీనికి వందలాది కోట్ల ఆస్తులున్నాయి. స్వచ్చత, పరిశుభ్రత, గోవధా నిషేధం, మొక్కలు పెంచడం, నిరక్షరాస్యతా నిర్మూలన, స్పోర్ట్స్ ఎంకరేజ్ మెంట్, వరదలు వంటి ప్రకృతి విలయాలు జరిగినప్పుడు సేవా కార్యక్రమాలు చెయ్యడం వంటి ఎన్నో సామాజిక కార్యక్రమాలు ఈయన చురుకుగా చేశాడు. అదే గాక ఒక రాక్ స్టార్ లాగా పాటలు పాడి ఆల్బమ్స్ రిలీజ్ చెయ్యడం, సినిమాలు తీసి వాటికి దర్శకత్వం వహించి వాటిల్లో నటించడం వంటి పనులూ చేశాడు. ఈయన 'పెంపుడు' కూతురు హనీ ప్రీత్ ఇన్సాన్ కూడా సినీ దర్శకురాలే. ఆమె ఒకే సినిమాలో 21 వేషాలు వేసి వరల్డ్ రికార్డ్ బద్దలు చేసింది.

ఇన్ని కోణాలు ఈయనలో ఉన్నాయి గనుకనే ఈయన జాతకానికీ రావణుని జాతకానికీ చాలా పోలికలున్నాయని నేనంటాను. వీళ్ళిద్దరి నక్షత్రాలు కూడా ఒకటే.

2008 సెప్టెంబర్ లో ఈయన మీద కేసు విచారణ మొదలైంది. తమను చాలాసార్లు రేప్ చేశాడంటూ ఇద్దరు డేరా సన్యాసినులు 'మూడేళ్ళ తర్వాత' ఇచ్చిన స్టేట్ మెంట్ ను సీబీఐ తమ కేసులో ప్రధాన ఆధారంగా తీసుకుంది. ఆ సమయంలో జననకాల చంద్రుడు ఒకవైపు రాహువు (శని) తోనూ, ఇంకో వైపు వక్ర గురువుతోనూ అప్పచ్చి అయ్యాడు. అప్పుడే ఈయనకు కష్టాలు మొదలయ్యాయి.

2002 లో రంజిత్ సింగ్ మరియు రాం చందర్ చత్రపతి అనే ఇద్దరి చావులకు ఈయనే కారకుడని కేసులు బుక్ అయ్యాయి. వీరిద్దరిలో రంజిత్ అనేవాడు డేరా సన్యాసిని ఒకామె అప్పటి ప్రధానమంత్రి వాజపేయికి వ్రాసిన కంప్లెయింట్ కాపీలను విస్తృతంగా అందరికీ పంచడం వల్లనే చంపబడ్డాడని అతని తల్లిదండ్రులు అంటున్నారు. రాం చందర్ అనే జర్నలిస్ట్ కూడా ఆశ్రమంలోని చీకటి కోణాలపైన పరిశోధన చేసినందుకు తన ప్రాణాలతో మూల్యం చెల్లించాడని పుకారుంది. ఆ సమయంలో రాంరహీం జాతకంలో రాహుకేతువులు ఆరు పన్నెండులో ఉచ్ఛస్థితిలో ఉన్నారు. శని సప్తమంలో ఉండి చంద్రలగ్నాన్ని చూస్తున్నాడు. గురువు అష్టమంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. గురు అనుగ్రహంతో కేసుల ప్రభావం ఈయన్ను తాత్కాలికంగా ఏమీ చెయ్యలేదు.

ఈయనకు ప్రస్తుతం ఏలినాటి శని మొదలైంది. వెంటనే కష్టాలూ ప్రారంభమయ్యాయి. ఈయన అనుచరులు ఈయనకు వ్యతిరేకంగా వచ్చిన కోర్టు తీర్పు పైన అప్పీల్ చేస్తున్నారు. ఈయనకున్న రాజకీయ పలుకుబడి వల్లా, ప్రజల్లో ఉన్న ఫాలోయింగ్ వల్లా, అన్నింటినీ మించి ఈయన ఉండేది ఇండియాలో గనుక అంతిమంగా ఈయనకు ఏమీ కాదని నా ఊహ.

ఇది ఈయన మీద మోపబడిన దొంగ కేసనీ, చివరకు ఈయన క్షేమంగా బయటకొస్తాడనీ, జైలుకు పోయినంతమాత్రాన కేసు రుజువైనట్లు కాదనీ ఈయన అనుచరులు వాదిస్తున్నారు. లక్షలాది మంది అనుచరులు ఈయన దైవాంశసంభూతుడే అని నమ్ముతున్నారు. ఇప్పటివరకూ జరిగిన గొడవలలో దాదాపు నలభై మంది చనిపోయారు. వందలాది మంది గాయపడ్డారు. సౌత్ నుంచి నార్తిండియాకు వెళ్ళే దాదాపు ౩౦ రైళ్ళు రద్దైపోయాయి. అయినా సరే, రోజుల తరబడి కుటుంబాలతో సహా రోడ్లమీదే ఉంటూ, ఆర్మీకి కూడా ఎదురు తిరిగి పోరాడటానికి ఈయన శిష్యులూ భక్తులూ సిద్ధంగా ఉన్నారు.

సొసైటీకి ఏమీచెయ్యకుండా ఊరకే సెవెన్ స్టార్ ఆశ్రమంలో కూచుని ఎంజాయ్ చేస్తుంటే ఇంత ఫాలోయింగ్ ఈయనకెలా వచ్చిందో తెలియదు.

చూద్దాం ఏం జరుగుతుందో?
read more " Baba Ram Rahim Singh Chart Analysis "

25, ఆగస్టు 2017, శుక్రవారం

Chu Lenedo Naazuk Hoton Ko - Mohammad Rafi


Chu lenedo naazuk hoton ko
Kuch aur nahi hai jaam hai ye

అంటూ మహమ్మద్ రఫీ మధురాతి మధురంగా ఆలపించిన ఈ గీతం 1965 లో వచ్చిన Kaajal అనే సినిమాలోది. ఇదికూడా మధుర సంగీత దర్శకుడు రవిశంకర్ శర్మ సృష్టించిన ఒక మరపురాని మధురగీతమే. ఈ పాటలో రాజ్ కుమార్, మీనాకుమారి నటించారు. దీని కాపీగానే తెలుగులో ఘంటసాల పాడిన 'నీ లేత గులాబీ పెదవులతో కమ్మని మధువును త్రాగాలి' అనే పాట వచ్చింది. దానిలో హరనాద్, జమున నటించారు.  ఈ పాటను చాలాకాలం క్రితమే ఆలపించాను.

ఈ పాట హిందూస్తానీ రాగం మాల్కోస్ ఆధారంగా స్వరపరచబడింది. ఇది చాలా మధురమైన రాగం. రవికి ఇది చాలా ఇష్టమైన రాగం. ఆయన చాలా పాటలను ఇదే రాగచ్చాయలో చేశాడు. కర్నాటక సంగీతంలో ఇది హిందోళం అనే రాగానికి దగ్గరగా ఉంటుంది. 

ప్రస్తుతం ఈ పాటను కూడా నా స్వరంలో వినండి మరి.

Movie:--Kaajal (1965)
Lyrics:--Sahir Ludhianvi
Music:--Ravi Shankar Sharma
Singer:--Mohammad Rafi
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
------------------------------
Chu lenedo naazuk hoton ko 
Kuch aur nahi hai Jaam hai ye
Kudrat ne jo hamko bakshaa hai
Vo sabse hasi eenaam hai ye
Chu lenedo naazuk hoton ko 
Kuch aur nahi hai Jaam hai ye
Chu lenedo naazuk hoton ko 

Sharma ke na yoohi kho dena
Rangeen jawani kee ghadiyaa
Betaab dhadakthe seeno ka
Armaan bhara paigaam hai ye
Chu lenedo naazuk hoton ko 

Achchon ko bura saabith karna
Duniya ki puraani aadat hai
Is mai ko mubaarak cheej samajh
manaake bahoth badnaam hai ye

Chu lenedo naazuk hoton ko 
Kuch aur nahi hai Jaam hai ye
Kudrat ne jo hamko bakshaa hai
Vo sabse hasi eenaam hai ye

Meaning

Allow it to touch your delicate lips
It is nothing but a goblet
What is gifted by Nature to us
is such a most valuable gift
Allow me to touch your delicate lips

We should not allow the youthful moments
to just pass away in shyness and hesitation
My heartbeats are very restless
and calling you out with a passionate message

It is the oldest habit of the world
to always try to prove the good as bad
This wine has a very bad reputation
but look, it is very good and innocent

Allow it to touch your delicate lips
It is nothing but a goblet
What is gifted by Nature to us
is such a most valuable gift
Allow me to touch your delicate lips

తెలుగు స్వేచ్చానువాదం

నీ లేత పెదవులను తాకనివ్వు
ఇది ఒక మధుపాత్ర అంతే! భయపడకు
ప్రకృతి మనకిచ్చిన ఒక విలువైన బహుమతి ఇది
నీ లేత పెదవులను తాకనివ్వు

యవ్వనపు మధురక్షణాలను వృధాగా పోనివ్వరాదు
నిలకడలేని నా గుండె చప్పుళ్ళు
నీతో ఒక వాంఛాసందేశాన్ని చెబుతున్నాయి విను

మంచివారిని చెడ్డవారుగా చిత్రించడం లోకానికున్న
పురాతమైన పాడు అలవాటు
ఈ మధువుకు చాలా చెడ్డపేరుంది
కానీ చూడు ఇదెంత మంచిదో !!

నీ లేత పెదవులను తాకనివ్వు
ఇది ఒక మధుపాత్ర అంతే! భయపడకు
ప్రకృతి మనకిచ్చిన ఒక విలువైన బహుమతి ఇది
నీ లేత పెదవులను తాకనివ్వు
read more " Chu Lenedo Naazuk Hoton Ko - Mohammad Rafi "

24, ఆగస్టు 2017, గురువారం

ఛిన్నమస్తా సాధన - 5

బౌద్ధంలో పంచ కులములు
తంత్రయానం, మంత్రయానం, వజ్రయానం అనేవి మూడూ దాదాపుగా ఒకటే విషయాన్ని చెబుతాయి. బుద్ధత్రిపిటకాలలో ఉన్న సూత్రాలు బట్టీ పట్టడం, ఉత్త మేధాపరమైన చర్చలలో కాలం గడపడం, అనవసరమైన చాదస్తపు నియమాలు పాటించడం మొదలైన అబ్యాసాలను తంత్రయానం నిరసిస్తుంది.

సరాసరి ఇప్పుడే ఇక్కడే జ్ఞాన/మంత్ర/తంత్రసిద్ధిని అందుకోవడమే తంత్రం యొక్క ముఖ్యోద్దేశ్యం. దానికోసం మనిషికి తెలిసిన అన్ని కట్టుబాట్లనూ, ఆచారాలనూ, బంధాలనూ త్రెంచి అవతల పారెయ్యమని అది చెబుతుంది. బుద్దుడు అదే చేశాడు. నేడు బుద్ధుని పూజించేవాళ్ళందరూ ఇళ్ళల్లో కూచుని కాఫీలు త్రాగుతూ కబుర్లు చెబుతున్నారు. కానీ బుద్ధుడు అలా చెయ్యలేదు. రాజ్యాన్ని గడ్డిపోచలాగా తృణీకరించి బయటకొచ్చాడు. నేడు చాలామంది అంటారు. 'బుద్ధుడు చేసింది పిచ్చిపని. ఆయన రాజుగా ఉండికూడా అది సాధించవచ్చు.' అని. వాళ్ళేం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. ఇళ్ళలో ఉండి అందరూ అన్నీ సాధించగలిగితే పాతకాలంలో ఋషులందరూ అడవులలో ఆశ్రమాలు కట్టుకుని ఎందుకున్నారు? పైగా అప్పుడు క్రూరమృగాల నుండి దొంగల నుండీ రక్షించుకోడానికి వాళ్లకు మనలాగా గన్స్ లేవు. అయినా సరే వాళ్ళు ప్రాణాలకు తెగించి అడవులకూ హిమాలయాలకూ పోయేవారు. తపస్సు చేసేవారు. అదీ అసలైన తెగింపు అంటే. అంతేగాని నేటి కుహనా గురువులలాగా ఏసీ ఆశ్రమాలలో నివసిస్తూ, టీవీలలో ఉపన్యాసాలివ్వడం కాదు.

తానే మానసికంగా ఎన్నోరకాలైన బంధాలలో చిక్కుకుని ఉన్నవాడు బయటకు ఎన్ని ఆచారాలు నియమనిష్టలు పాటించినా ఏమీ ఉపయోగం లేదు. అన్ని బంధాలకూ అతీతుడుగా వెళ్ళడమే బుద్ధత్వం అయినప్పుడు ప్రతి నిముషమూ అనేక బంధాలలో ఇరుక్కుని ఉన్న మనిషి దానిని ఎలా చేరుకోగలడు? అని తంత్రం ప్రశ్నిస్తుంది. ఇది చాలా సరియైన ప్రశ్న.

అయితే 'బంధాలను దాటడం' అంటే విచ్చలవిడి సెక్స్ జీవితాన్ని గడపడం కానే కాదు. చాలామంది తంత్రం అంటే ఇక్కడే తప్పుగా అర్ధం చేసుకుంటారు.తంత్రమంటే సెక్స్ లో పాఠాలు నేర్చుకోవడమనే భావన పాశ్చాత్యదేశాలలో ముఖ్యంగా అమెరికాలో ఎక్కువగా ఉంది. ఇది పూర్తిగా తప్పు భావన. కామాన్ని జయించడానికి తంత్రం అనేక విధాలైన విప్లవాత్మక మార్గాలను సూచిస్తుంది. వాటినే తంత్ర సాధనలంటారు. అవి indulgences కానేకావు. దానిలోనే ఉంటూ దానినే జయించే మార్గాలవి. అయితే ఈ విధానాలు బయటవాళ్ళకు అస్సలు అర్ధం కావు. ఈ రహస్యాలను అర్ధం చేసుకోలేని సో కాల్డ్ అమెరికన్ తంత్రాటీచర్స్ అమెరికాలో ముఖ్యంగా కాలిఫోర్నియా ప్రాంతాలలో కుప్పలు తెప్పలుగా ఉన్నారు. వీళ్ళంతా ఎక్కువగా ఓషో శిష్యులు. వీళ్ళు నేర్చుకున్న తంత్రం అంతా ఓషో ఆశ్రమంలో రాత్రి పదకొండు గంటల తర్వాత జరిగే 'తంత్రా వర్కుషాపు'కే పరిమితం. ఈ వర్కుషాపును నేను 1998 లో దగ్గరనుంచి చూచాను. అదొక sexual orgy. అందులో పాల్గొనే వాళ్ళంతా అమెరికన్లూ యూరోపియన్లూను. అది అసలైన తంత్రం కాదు. ఈ విషయాన్ని నేను పూనాలోని ఓషో ఆశ్రమంలో 1998 లో ఉన్నప్పుడు గమనించాను. వారికి అసలైన తంత్రం తెలియదు.

'కామాన్ని నువ్వు జయించాలిరా బాబూ' - అని తంత్రం చెబుతుంటే మోడరన్ తంత్రగురువులేమో 'బెటర్ సెక్స్ ఎలా ఎంజాయ్ చెయ్యాలో మేము నేర్పిస్తాం. అదే తంత్రం' అని తప్పుడు భావాలను పాశ్చాత్య దేశాలలో ప్రచారం చేస్తున్నారు. ఇదే కలిమాయ అంటే !!

అయితే ఈ రహస్యాలను ఎవరు నేర్పిస్తారు? వీటిని అభ్యాసం చెయ్యడం ఎలా? అంటే దానికి సమాధానం ఒక్కటే. ఇది రహస్యమైన మార్గం. నువ్వు ఆ దారిలో నడిస్తేనే నీకు ఆ రహస్యాలు బోధించబడతాయి. అలా నడవాలంటే నీకు కొన్ని అర్హతలుండాలి. అవి లేకపోతే నీకు తంత్రయానం అర్ధం కాదు. ముందసలు అందులోకి ప్రవేశమే నీకు లభించదు. అందుకే తంత్రసాధన నీకు కావాలంటే "నీ అర్హతను నువ్వు ముందు నిరూపించుకో" అని తంత్రం చెబుతుంది. అయితే ఈ అర్హతలు లక్షమందిలో ఒకరికో ఇద్దరికో మాత్రమే ఉంటాయిగాని అందరికీ ఉండవు. తంత్రం అంటే అందరికీ సరదాగా ఉంటుంది. కానీ ఎవరు బడితే వారు తంత్రసాధనకు అర్హులు కారు. కొన్ని కొన్ని కులాలలో పుట్టినవారే దీనికి అర్హులు.కులం అంటే మనకు తెలిసిన కులం కాదు. కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఉండటమే 'కులం' అనే పదానికి అర్ధం.

బుద్ధధర్మంలో అయిదు కులాలనేవి ఉన్నాయి. కులం అనే పదం బుద్ధుని కంటే ముందుగా మన సమాజంలో ఉన్నప్పటికీ బుద్ధధర్మంలో కూడా ఈ పదం ప్రవేశించింది. కులం అంటే ఒక గుంపు అనేది అసలు అర్ధం. ఒకే రకమైన ఆచారాలు పద్ధతులూ పాటిస్తూ ఉండే ఒక గుంపుకు 'కులం' అని పేరు.

నిజమైన హిందూమతమంటే ఎలాగైతే హిందువులలో చాలామందికి తెలియదో, నిజమైన బౌద్ధమతం అంటే కూడా బౌద్దులలో చాలామందికి తెలియదు. బుద్దుడు కులవ్యవస్థను నిరసించాడనీ, వేదాలను నిందించాడనీ, సమాజాన్ని సంస్కరించాలని ప్రయత్నించాడనీ చాలామంది అపోహ పడుతూ ఉంటారు. ఈ భావనలేవీ నిజాలు కావు.

బుద్ధుడు సంఘసంస్కర్త కాడు. సంఘాన్ని సంస్కరించాలని ఆయన అనుకుంటే రాజుగానే ఆ పని చేసేవాడు. దానికి భిక్షువు కావాల్సిన పని లేదు. రాజుగా చెయ్యలేని పనిని భిక్షువుగా అస్సలు చెయ్యలేడు. కనుక బుద్ధుని ఉద్దేశ్యాలు ఇవేవీ కావు.

'దుఃఖనాశన మార్గాన్నే' ఆయన వెదికాడు. దానిని సాధించాడు. దానినే బోధించాడు. ఆ మార్గానికి కలిసిరాని అన్నింటినీ, అవి వేదాలైనా సరే, దేవుళ్ళైనా సరే, సమాజపు కట్టుబాట్లైనా సరే, వాటిని త్రోసివెయ్యమన్నాడు. ఆయన ప్రాధమికంగా ఒక అనుభవజ్ఞాని. తను పొందిన జ్ఞానానికి దారిని అర్హులైనవారికి బోధించాడు. ఆ దారిలో వారిని నడిపించాడు. అంతే.

బుద్ధుడు మొదట్లో బోధించినది ఒకటే ధర్మం అయినప్పటికీ కాలక్రమేణా దానిలో అయిదు శాఖలు ఏర్పడ్డాయి. అవే పంచకులాలు. అవి - రత్నకులం, వజ్రకులం, పద్మకులం, కర్మకులం.  తధాగతకులం. వీటిలో అక్ష్యోభ్యుడు, వైరోచనుడు, అమితాభుడు, రత్నసంభవుడు, అమోఘసిద్ధి అనేవారు అధిష్టానదేవతలు. వీరినే బౌద్ధంలో కులేశ్వరులంటారు. వీరితో సంభోగంలో (అంటే ఒకటిగా కలసి) ఉండే స్త్రీదేవతా మూర్తులను "కులేశ్వరి" అంటారు.

వీరిలో వజ్రయానానికి అక్షోభ్యుడూ, పద్మయానానికి అమితాభుడూ, రత్నయానానికి రత్నసంభవుడూ, కర్మయానానికి అమోఘసిద్దీ, తధాగతయానానికి వైరోచనుడూ దేవతలు. ఈ కులాల నుంచే కులాచారం, కౌలాచారం, కౌలమార్గం అనేవి పుట్టుకొచ్చాయి. దీనిని హిందూ తంత్రాలు కాపీ కొట్టాయి.  వీటిలో వజ్రకులమే వజ్రయానం లేదా తంత్రయానం అయింది. ఇవి వరుసగా, భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశ మార్గాలుగా భావించబడ్డాయి. వీటిలో జలం అనేది స్వాదిష్టానచక్రాధి దేవత గనుకా, అది శుక్రగ్రహం అధీనంలో ఉంటుంది గనుకా, శుక్రుడూ స్వాధిష్టాన చక్రమూ కామాన్ని కంట్రోల్ చేసే శక్తులు గనుకా వజ్రయానంలో సంభోగం అనేది ముఖ్యసాధనగా వచ్చింది. ఎందుకంటే కామాన్ని సబ్లిమేట్ చెయ్యందే (జయించనిదే) ఈ సాధన కుదరదు.    

ఇవి హిందూతంత్రంలో చెప్పబడిన పంచకోశాలకూ పంచభూతాలకూ పంచమార్గాలకూ సూచికలు. శైవంలో ఇవే పరమశివుని అయిదు ముఖాలైన సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన ముఖాలుగా వర్ణింపబడ్డాయి.


కురుకుళ్ళా దేవత
బౌద్ధతంత్రాలలో ఈ అయిదు మార్గాలూ అయిదు తంత్ర యానాలుగా చెప్పబడ్డాయి. అవే క్రియాతంత్రము, చర్యాతంత్రము, యోగతంత్రము, యోగోత్తర తంత్రము, అనుత్తర తంత్రము. ఈ అయిదూ కూడా మన్మధుని పంచ పుష్పబాణాలకు సంకేతాలు. అవిద్య, రాగము, ద్వేషము, గర్వము,అసూయ అనే అయిదు పాశాలకు కూడా ఇవి సంకేతాలు. ఈ పుష్ప బాణాలు అనేవి మన్మధుని చేతిలోనూ లలితాదేవి చేతిలోనూ ఉన్నట్లు మన సాంప్రదాయంలో చూస్తాం. అలాగే బౌద్ధంలో ఉన్న కురుకుళ్ళా దేవతను మనం చూస్తే ఈమె చేతిలో ఒక పుష్పధనుస్సూ, అయిదు పుష్పబాణాలూ ఉంటాయి. మిగతా రెండు చేతులలో పాశమూ అంకుశమూ ఉంటాయి. సరిగ్గా లలితాదేవి చేతిలో కూడా చెరుకుగడ దనుస్సూ, అయిదు పుష్పబాణాలూ, పాశమూ అంకుశమూ ఉంటాయి. కనుక లలితాదేవియే బౌద్ధ తాంత్రికదేవత ఐన కురుకుళ్ళ. దీనికి రుజువుగా, బౌద్ధతంత్రాలలో వాడబడిన అనేక పదాలు యధాతధంగా మనకు లలితా సహస్రనామాలలో దర్శనమిస్తాయి.

"కులకుండాలయా కౌలమార్గ తత్పర సేవితా" - అనేది లలితా సహస్ర నామాలలోని ఒక నామం.ఈ నామం అందరికీ తెలుసు. కానీ ఇది దేనిని గురించి చెబుతున్నదో ఎవరికీ తెలియదు. మనవాళ్ళు అర్ధాలు తెలుసుకోకుండా ఊకదంపుడు పారాయణాలు చెయ్యడంలో సిద్ధహస్తులు కదా !

ఈ నామం కులమార్గాన్ని గురించి చెబుతుంది. కౌలమార్గం అనేది కూడా మొదటగా బుద్ధమార్గంలోని అయిదు కులాల నుంచే వచ్చింది. ఈ కులాలలో దేనికో ఒక దానికి చెందిన వారిని కౌలాచారులు లేదా కౌలమార్గావలంబులు అనేవారు. వారిచే పూజించబడే దేవత గనుక లలితాదేవికి "కౌలమార్గ తత్పర సేవితా" అనే నామం వచ్చింది. బౌద్ధంలో ఉన్న తారాదేవియే హిందూమతంలో అనేకరూపాలలో పూజింప బడుతూ ఉంటుంది. అందులో ఒక రూపమే లలితాదేవి. బౌద్ధంలో తారాదేవిని అందరు బుద్ధులకూ తల్లిగా భావిస్తారు.

లలితా సహస్రనామాల అసలైన అర్ధాలు తెలుసుకోవాలని అనుకునేవారు వచ్చే నెలలో రాబోతున్న నా పుస్తకం ' లలితా సహస్రనామ రహస్యార్ధ ప్రదీపిక' చదవండి.

ప్రాచీనకాలంలో బయట ప్రకృతికీ, లోపలి సాధనా మార్గానికీ సమన్వయం చెయ్యాలని అనేక ప్రయత్నాలు ప్రతి మతంలోనూ జరిగాయి. దాని ప్రభావాలే బౌద్ధతంత్రంలోనైనా హిందూ తంత్రంలోనైనా ఈ శాఖోపశాఖల సృష్టి. ఈ క్రమంలో, హిందూ, బౌద్ధ, జైన మతాలలోని దేవతలందరూ కలసిపోయారు. ఎందుకంటే ప్రాధమికంగా ఇవన్నీ ఒకటే మూలం నుంచి, వేదమూలం నుంచి, పుట్టిన శాఖలు కాబట్టి. అందుకే ఈ మతాలన్నింటిలోనూ, బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన అనేకమంది వేదకాలపు దేవతలు మనకు కనిపిస్తారు. వీరే గాక అనేకమంది తాంత్రికదేవతలు కూడా ఈ తంత్ర/పురాణ కాలంలో సృష్టించబడ్డారు. అందుకే హిందూ బౌద్ధ తంత్రాలలో అనేక దేవతలు కామన్ గా మనకు దర్శనమిస్తారు.


21 తారారూపాలు
ఉదాహరణకు - లలితా సహస్రనామాలు చదివే అందరికీ ఈ నామం సుపరిచితమే - "కురుకుళ్ళా కులేశ్వరీ". ఇందులో కురుకుళ్ళ అనే తాంత్రిక దేవత గురించి చెప్పబడింది. ఈమె మనకు హిందూతంత్రాలలో ఎక్కడా కనిపించదు. ఒక్క తంత్రరాజ తంత్రమే ఈమె సాధనను ఉపదేశించింది. కానీ బౌద్ధంలో ఈమె తారాదేవికి ఒక రూపంగా మనకు దర్శనమిస్తుంది. తంత్రసాధనలో తారాదేవికి 21 రూపాలు/ అవతారాలున్నాయి. కురుకుళ్ళా దేవతను 'అరుణతార' అని బౌద్ధంలో పిలుస్తారు. ఈమె రంగు అరుణవర్ణమని అంటే లేత ఎరుపురంగని చెప్పబడింది. లలితాదేవి ధ్యానశ్లోకాలలో కూడా 'అరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం...' అని ఉంటుంది.  కురుకుళ్ళా దేవత కూడా నృత్యం చేస్తూ పుష్పబాణాన్ని సంధిస్తున్న భంగిమలో ఉంటుంది. కనుక ఈ ఇద్దరూ ఒక్కరే అనేది నిర్వివాదాంశం.

వజ్రయాన బౌద్ధంలో కురుకుళ్ళా దేవతకు 'ఆర్యతారా కురుకుళ్ళా కల్పం' అనే గ్రంధం ఉన్నది. దీనిని అతిశ దీపాంగారుని శిష్యుడైన మృత్యుంజయుడు టిబెటన్ భాషలోకి అనువదించాడు. ఈమెకు తారోద్భవ కురుకుళ్ళ అని కూడా పేరుంది. ఈమె ప్రాధమికంగా ఒక జ్ఞానదేవత అయినప్పటికీ ఈమె మంత్రాన్ని ఎక్కువగా వశీకరణంలో, సమ్మోహనక్రియలో ప్రయోగిస్తారు. ఒక వ్యక్తిని మనం వశం చేసుకోవాలంటే ఈమె మంత్రప్రయోగం అత్యుత్తమం. ఈ గ్రంధంలో కామ్యకర్మలకు వాడవలసిన అనేక మంత్రతంత్ర విధానాలు ఇవ్వబడ్డాయి. కల్ప గ్రంధాలన్నీ ఇలాంటివే.

తంత్రాన్ని లౌకిక ప్రయోజనాలకు వాడటం మీద అయిదేళ్ళ క్రితం కొన్ని పోస్టులు వ్రాశాను. నిజానికి ఇలాంటి పనులు నిషిద్ధం అయినప్పటికీ కొన్నికొన్ని సార్లు మంచి ఉద్దేశ్యంతో ఇలా వాడవలసి వస్తుంది. అయితే చెడు పనులకు వాడితే మాత్రం దాని ప్రతిఫలం తప్పకుండా అనుభవించవలసి ఉంటుంది. ఇది ప్రతి తాన్త్రికుడూ గుర్తుంచుకోవాలి.

తంత్రాన్ని నిత్యజీవితంలో నాలుగు రకాలుగా వాడవచ్చు.

1. శ్వేతకర్మ. దీనినే శాంతికర్మ లేదా White Magic అని అంటారు. జాతకంలోని మొండిదోషాలను తొలగించడానికి, తగ్గకుండా పీడిస్తున్న రోగాలను తగ్గించడానికి, భూత ప్రేతాలను వదిలించడానికి దీనిని వాడాలి. దీని దేవతలు తెల్లగా ఉంటారు. ఉదాహరణకు శ్వేతతార.

2. కాలకర్మ లేదా రౌద్రకర్మ. దీనిని Black Magic అంటారు. ఇతరులను నాశనం చెయ్యడానికి (మారణం) దీనిని వాడాలి. నిజానికి సాధనలో అడ్డు వస్తున్న మొండి దుష్ట సంస్కారాలను కర్మను నాశనం చెయ్యడానికే దీనిని ఉపయోగించాలి. దీనిలో ఉపాసింపబడే దేవతలు నల్లగా ఉంటారు. ఉదాహరణకు కాలతార, క్రోధకాళి, స్మశానకాళి, చిన్నమస్త, చాముండ.

3. పీతకర్మ లేదా పుష్టికర్మ. దీనిని Yellow Magic అంటారు. ధనధాన్య వృద్ధికి, సంపద వృద్ధికి, కుల వృద్ధికి, అధికార వృద్ధికి, అన్నిరకాలుగా ఔన్నత్యం కలగడానికి దీనిని వాడాలి. ఈ దేవతలు పసుపురంగులో ఉంటారు. ఉదాహరణకు స్వర్ణతార.

4.అరుణకర్మ లేదా వశ్యకర్మ. దీనిని Red Magic అంటారు. మనకు నచ్చిన స్త్రీలను, క్రూరజంతువులను, శత్రువులను వశం చేసుకోవాలంటే దీనిని వాడాలి. ఈ దేవతలు ఎర్రని రంగులో ఉంటారు. లలితాదేవి, కురుకుళ్ళ, అరుణతార మొదలైన దేవతలు ఈ కోవలోకి వస్తారు.

తెలుపురంగు శాంతికీ, నలుపురంగు మరణానికీ, పసుపురంగు వృద్ధికీ, ఎరుపురంగు సంమోహనానికీ సూచికలు. కొద్దిసేపు ఆ రంగుల మీద ధ్యానం చేస్తే వాటి ఆరాలు ఏమిటో బాగా అర్ధం అవుతాయి. చిన్న ఉదాహరణ ఇస్తాను. ప్రకృతిలో ఎర్రగా ఉన్న ప్రతిదీ మనిషిని ఆకర్షిస్తుంది. తెల్లనిది ప్రతిదీ శాంతిని కలిగిస్తుంది. ఈ రంగుల గుణాలు ఇలా ఉంటాయి. అలాగే ఒకే తారాదేవి అయినా కూడా ఆమె ఉన్న రంగును బట్టి ఆమె మంత్రంలో ఉన్న వైబ్రేషన్ ను బట్టి ఆమె చేసే పని ఉంటుంది.

సరే ఇవన్నీ కామ్యకర్మలు. వీటిని ఇలా ఉంచి మన సబ్జెక్ట్ లోకి వద్దాం.

పైన చెప్పబడిన అయిదుగురు బుద్ధులకు కులేశ్వరులని పేరుందని చెప్పాను. వీరితో ఉండే స్త్రీదేవతా శక్తులకే 'కులేశ్వరీ' అని పేరు. ఇదే నామం మనకు లలితా సహస్రనామాలలో "కురుకుళ్ళా కులేశ్వరీ" అంటూ కనిపిస్తుంది.

నిజానికి తంత్ర/పురాణకాలంలో (క్రీ.శ. 300 నుంచి 800 వరకూ) కొత్తగా వచ్చిన అనేకమంది బౌద్ధదేవతలనే ఈనాడు మనం హిందూమతంలో పూజిస్తున్నాం. వీరిలో చాలామంది నలందా, విక్రమశిల విహారాలలోని ఆచార్యులు సృష్టి చేసిన వారే. ఈ ఆచార్యులందరూ సంస్కృత, ప్రాకృతాలలోనూ, కొందరు టిబెటన్, చైనీస్ భాషలోనూ మహా పండితులు. వీళ్ళు అనేక తంత్ర గ్రంధాలను వ్రాసి వాటిని ప్రచారంలోకి తెచ్చారు.

ఉదాహరణకు చూస్తే - సరహుడు బుద్ధకపాల తంత్రాన్నీ, చక్రసంవర తంత్రాన్నీ, లూయిపా సిద్ధుడు యోగినీ సంచర్యా తంత్రాన్నీ, కంబలుడూ సరోరుహుడూ హేవజ్రతంత్రాన్నీ, క్రిష్ణాచార్యుడు సంపుటతిలక తంత్రాన్నీ, కుక్కురి మహామాయా తంత్రాన్నీ, పిటాచార్యుడు కాలచక్ర తంత్రాన్నీ సృష్టించారని బౌద్ధ తంత్రాలు చెబుతున్నాయి. ఈ తంత్రాలలో అనేక మంది తాంత్రిక దేవతలు మనకు దర్శనమిస్తారు. వీరిలో చాలామంది ప్రస్తుతం మనకు హిందూమతంలో కూడా వివిధ రకాలైన పేర్లతో పూజింపబడుతూ ఉన్నారు.

ఈ దేవతలను సృష్టించిన బౌద్ధ గురువులందరూ క్రీ.శ. 600-800 మధ్యలో ఒరిస్సా బెంగాల్ ప్రాంతాలలో ఉన్న విహారాలలో బౌద్దాచార్యులు. వీరిలో చాలామంది హిందూకుటుంబాల నుంచి వచ్చిన బ్రాహ్మణులే. నేటి దేవతలూ పూజావిధానాలూ అన్నీ వీరి సృష్టే. వీరిలో సరోరుహ అనే ఆచార్యుడు గుహ్యసిద్ధి అనే తంత్రాన్ని ఆచరించాడు. ఇదే హిందూ తంత్రాలలో గుహ్యసమాజ తంత్రం, గుహ్యాతిగుహ్య తంత్రం అయింది. డోంబి హేరుకాచార్యుడు నైరాత్మ్యతంత్రాన్ని బోధించాడు. ఈయన నైరాత్మ్య యోగినీ సాధన, ఏకవీరా సాధన, గుహ్యవజ్ర తంత్రరాజ తంత్రం అనే గ్రంధాలను వ్రాశాడు. ఈ చివరి గ్రంధమే హిందూ తంత్రాలలో తంత్రరాజతంత్రంగా అవతరించింది. ఇందులోనే మనకు కురుకుళ్ళా దేవత వివరాలూ, చిన్నమస్తా దేవత వివరాలూ లభిస్తున్నాయి.

ఈ 'నైరాత్మ్య' దేవతే వేదాలలో ఉన్న 'నిఱ్ఱుతి' అనే దేవత అని తంత్రపరిశోధకుల అభిప్రాయం. దిక్కులలో నైరుతిదిక్కుకు ఈమె అధిష్టానదేవత. జ్యోతిశ్శాస్త్రంలో రాహువు ఈ దిక్కుకు అధిపతి గనుకా, ఈమె బౌద్ధ తంత్రాలలోని దేవత గనుకా బౌద్ధమతానికి రాహువు అధిదేవత అనే కారకత్వం మనకు జ్యోతిష్య గ్రంధాలలో ఇవ్వబడింది. అంతేగాక, కురుకుళ్ళా దేవత యొక్క కాళ్ళక్రింద రాహువు తొక్కబడుతూ ఉన్నట్లు మనం ఆమె చిత్రంలో చూడవచ్చు.అంటే ఈమె ఉపాసన పూర్వకర్మ యైన రాహువును తొక్కేస్తుందని అర్ధం. ఇలా దేవతల కాళ్ళక్రింద పడి తొక్కబడుతూ ఉన్నట్లు మనకు అనేక చిత్రాలలో అనేకమంది కనిపిస్తారు. అంటే ఆయా క్షుద్ర శక్తులను ఈ దేవతలు అణిచి పారేస్తారని అర్ధం.

ఉదాహరణకు నటరాజు కాళ్ళక్రింద ఒక చిన్నరాక్షసుడు తొక్కబడుతూ ఉండటం మనం చూడవచ్చు. ఈ రాక్షసుడు బద్ధకానికి, అలసత్వానికి, లేదా శనీశ్వరునికి సూచిక. బద్దకాన్ని జయిస్తేనే కదా నాట్యాన్ని నేర్చుకోగలిగేది?  అలాగే దక్షిణామూర్తి కాళ్ళక్రింద కూడా ఒక రాక్షసుడు తొక్కబడుతూ ఉన్నట్లు మనం చూడవచ్చు. వీడు అజ్ఞానానికి సూచిక. అంటే అజ్ఞానాన్ని తొక్కేసి జ్ఞానాన్ని ఇస్తాడని దక్షిణామూర్తి స్వరూపానికి అర్ధం. అలాగే ఛిన్నమస్తాదేవి కాళ్ళక్రింద రతీమన్మధులు సంభోగంలో ఉన్నారంటే అర్ధం ఈ దేవతోపాసన కామాన్ని అణచిపారేస్తుందని, కామజయాన్ని అందిస్తుందని.

కామాన్ని జయించకుండా తంత్రసిద్ధి ఎన్నటికీ కలగదని ఎన్నోసార్లు ఇంతకు ముందే వ్రాశాను.

(ఇంకా ఉంది)
read more " ఛిన్నమస్తా సాధన - 5 "