“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

14, జులై 2024, ఆదివారం

మా హిందీపుస్తకం 'మధుశాల' విడుదల

ఈరోజు మా హిందీపుస్తకం 'మధుశాల' విడుదలౌతున్నది. ఇది మా సంస్థ నుండి వెలువడుతున్న 66 వ పుస్తకం, మరియు మొదటి హిందీ పుస్తకం.

ఇది నా తెలుగు పుస్తకం 'మధుశాల' కు హిందీ అనువాదం. తెలుగు, ఇంగ్లీష్ భాషలలో ఆదరణను పొందడంతో. దీనిని హిందీ లోకి అనువాదం చేసి విడుదల చేస్తున్నాం.

ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్ నుండి హిందీలోకి చాలా త్వరగా అనువాదం చేసిన నా శిష్యురాలు పూజా బగాడియాకు కృతజ్ఞతలు మరియు ఆశీస్సులు తెలుపుతున్నాను. శుద్ధమైన, సరళమైన హిందీలోకి ఈ అనువాదం జరిగింది.

ప్రస్తుతం 'ఈ-బుక్' గా విడుదల అవున్నప్పటికీ, త్వరలో ఇది ప్రింట్ పుస్తకంగా కూడా వస్తుంది.

హిందీ అభిమానులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం.

read more " మా హిందీపుస్తకం 'మధుశాల' విడుదల "

5, జులై 2024, శుక్రవారం

The Wine House ఇంగ్లీష్ పుస్తకం విడుదల


ఈరోజు మా క్రొత్తపుస్తకం The Wine House విడుదలౌతున్నది. ఇది మా సంస్థ నుండి వెలువడుతున్న 65 వ పుస్తకం.

ఇది నా తెలుగు పుస్తకం 'మధుశాల' కు ఇంగ్లీష్ అనువాదం. తెలుగుపుస్తకం మంచి పాఠకాదరణను పొందింది. అందుకని దానిని ఇంగ్లీష్ లోకి అనువాదం చేద్దామన్న సంకల్పం కలిగింది.

కేవలం రెండునెలల లోపే 'మధుశాల' ను ఇంగ్లీష్ లోకి అనువాదం చేసిన నా శిష్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.  అంతేకాదు, ఈ పుస్తకం హిందీ అనువాదం కూడా అయిపోయింది. పదిరోజులలో అది కూడా मधुशाला అనే 'ఈ బుక్' గా హిందీరాష్ట్రాల ప్రజలకు అందుబాటులోకి వస్తుంది.

నా పుస్తకాలన్నీ తెలుగు, ఇంగ్లీష్, హిందీ మూడుభాషలలోనూ వస్తాయని ఇంతకు ముందు చెప్పాను. అది నేడు The Wine House తో మొదలుపెట్టబడింది.

ప్రస్తుతం 'ఈ-బుక్' గా విడుదల అవున్నప్పటికీ, త్వరలో ఇది ప్రింట్ పుస్తకంగా కూడా వస్తుంది.

ఏకాంత ధ్యానసాధనను ఇష్టపడేవారికి ఈ పుస్తకంలోని 140 చిన్నికధలు ఎంతో సహాయపడతాయి. అంతేకాదు, నా ఫిలాసఫీ మొత్తం ఈ పుస్తకంలో అతి తేలికమాటలలో చెప్పబడింది. ప్రయత్నించండి.

read more " The Wine House ఇంగ్లీష్ పుస్తకం విడుదల "

24, జూన్ 2024, సోమవారం

ప్రపంచ యోగ దినోత్సవం - 2024

జూన్ 21 2024 న వేసవి అయనాంతపు రోజు. ఆ రోజున  ప్రపంచమంతా యోగదినోత్సవాన్ని జరుపుకుంది. పంచవటి సాధనామార్గాన్ని అనుసరించేవారందరూ, ఆనాడు మా శైలిలో యోగవ్యాయామాన్ని చేసి ఈ పర్వదినాన్ని జరుపుకున్నారు. 

మాకిది ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే చేసే మొక్కుబడి తంతు కాదు. ఇది మా రోజువారీ దినచర్యలో భాగం.

యోగసాధనలో ఆసనాలు, ప్రాణాయామాలు మొదటిమెట్లు మాత్రమే. కనీసం వీటి విలువనైనా ప్రపంచం నేడు గుర్తిస్తోంది. రోగాలకు భయపడి కొందరైనా యోగాన్ని చేస్తున్నారు. కొంతలోకొంత నయం.

మన ప్రధానమంత్రి మోదీగారు మన దేశానికి చేసిన గొప్ప మేళ్లలో ఇదీ ఒకటి. మనం మర్చిపోతున్న మన విజ్ఞానాన్ని మనకు, ప్రపంచానికి గుర్తుచేసిన ఈ మహానుభావుడికి దేశం మొత్తం ఋణపడి ఉంది. కానీ ఆయనకు మనం ఓట్లు వెయ్యం. మెజారిటీ ఇవ్వం. మనకు మేలు చేసేవాడు మనకు అక్కర్లేదు. మనల్ని నాశనం చేసేవాళ్ళే మనకు కావాలి. వాళ్లనే గెలిపించుకుంటాం. నాశనమౌతూనే ఉంటాం. ఇది మెజారిటీ ఇండియన్స్ పరిస్థితి.

అదలా ఉంచితే, పంచవటి సభ్యులందరూ ఎవరి ఇళ్లలో వారు చేస్తున్న యోగసాధనా కొలేజ్ ను ఇక్కడ చూడవచ్చు. 


read more " ప్రపంచ యోగ దినోత్సవం - 2024 "

19, మే 2024, ఆదివారం

మా క్రొత్త పుస్తకం 'మధుశాల' విడుదలైంది

మా క్రొత్త పుస్తకం 'మధుశాల' విడుదలైంది ఇది నా కలం నుండి వెలువడుతున్న
64 వ పుస్తకం. ఆశ్రమం ప్రారంభించిన తర్వాత నేను విడుదల చేస్తున్న రెండవ పుస్తకం.

ఈ పుస్తకంలో 140 సంఘటనలు, సంభాషణలు ఉన్నాయి. అవి చిన్నవే. నిత్యజీవితంలో మనకు రోజూ ఎదురయ్యేవే. కానీ అవే మనల్ని ఆలోచింపజేస్తాయి. జీవితపు లోతులను స్పృశింపజేస్తాయి. వాటిలో ప్రధాన పాత్రధారి సాకీ. వీటన్నిటిలోనూ, సాకీ అడుగుతుంది. నేను చెబుతూ ఉంటాను. నేనెవరో మీకు తెలుసు.

ఈ ‘సాకీ’ ఎవరు?

ఉమర్ ఖయ్యాం పేరును వినని సాహిత్యపిపాసి ఉండడు. ఆయన వ్రాసిన "రుబాయత్" ను, దువ్వూరి రామిరెడ్డిగారు, ‘పానశాల’ అనే పేరుతో తెలుగులో పద్యాలుగా వ్రాశారు. అది చదవని సాహిత్యాభిమాని కూడా ఉండడు. ఇదే రుబాయత్ ను, హిందీకవి హరివంశరాయ్ బచ్చన్ ‘మధుశాల’ అనే పేరుతో హిందీలో వ్రాశాడు. హిందీ అభిమానులు దానిని తప్పకుండా చదివి ఉంటారు. పరమహంస యోగానంద గారు కూడా దీనిపైన వ్యాఖ్యానించారు.

ఉమర్ ఖయ్యాం స్వప్నసుందరి సాకీ. ఈ సాకీ అనే పాత్ర, మధుశాలలో మధువును పొసే అమ్మాయి. అనేకమంది కవులు అనేకవిధాలుగా సాకీని తీసుకున్నారు. ఒక మంచి స్నేహితురాలిని, ప్రియురాలిని, ఊహాసుందరిని, ఆత్మసహచరిని, సమాధిస్థితిలో కలిగే మత్తును, చివరకు దైవానుభూతిని కూడా ‘సాకీ’ అంటూనే కొందరు మార్మికవాదులు పిలిచారు.

ఏతావాతా, ఈ సాకీ, ఒక మానవవనిత కాదు. కల్పితభావన మాత్రమే. సాకీ అనే పేరులోనే ఏదో గమ్మత్తుంది. బహుశా మన 'సఖి' కి ఇది పార్సీ రూపమై ఉంటుంది. మన తెలుగుకవులలో కూడా ఎవరి సాకీ వారికుంది.

వారందరినీ వదిలేసి, ఉమర్ ఖయ్యాం స్వప్నసుందరిని నేను కాజేసినందుకు ఆయనకు క్షమార్పణలు చెబుతున్నాను. కాకపోతే, మేమంతా ఒకటే కాబట్టి, ఆయన ఏమీ అనుకోడనే నా భావన.

కవి చెప్పాలనుకున్నదానిని, కల్పితపాత్రల ద్వారా చెప్పడం, చెప్పించడం, సాహిత్యప్రక్రియలో సర్వసాధారణం. ప్రాచీన కవులందరూ అదే చేశారు. నేనొక కవినని చెప్పను గాని, నేనూ అదే చేశాను.

ఉమర్ ఖయ్యాం సాకీ ఎవరో అందరికీ తెలుసు. మరి, నా రచనలో ప్రత్యక్షమయ్యే ‘సాకీ’ ఎవరు? అని చాలామంది నా శిష్యులు, అభిమానులు అడిగారు. దీనికి జవాబును ఎలా చెప్పాలి?

నా నిత్యజీవితంలో ఎదురైన, ఎదురౌతున్న అనేక సంఘటనలలో పాత్రధారులైన మనుషులందరూ సాకీలే. వారిలో నా శిష్యులున్నారు, పరిచయస్తులున్నారు, స్నేహితులున్నారు. దారిలో ఎదురయ్యే సంబంధంలేని మనుషులున్నారు. అందరూ సాకీలే.

ఏమంటే, ప్రతివారినుంచీ నాకొక వెలుగు కనిపిస్తుంది. ఒక క్రొత్త దృక్కోణం గోచరిస్తుంది. ఒక క్రొత్త మెరుపు దర్శనమిస్తుంది. నేను నేర్చుకున్నదంతా జీవితం నుంచే నేర్చుకున్నాను. అవన్నీ వ్రాయాలంటే కొన్ని వేలున్నాయి. కానీ వాటన్నిటి సారం మాత్రం ఒకటే. వాటినే, దానినే, ఈ 140 చిన్న చిన్న సంభాషణలుగా ఈ పుస్తకంలో మీకందిస్తున్నాను.

నా మిగతా పుస్తకాలు చిక్కటి వేదాంతగ్రంధాలు. వాటి భాష చాలామందికి అర్థం కాకపోవచ్చు. ఇబ్బంది పెట్టవచ్చు కూడా. కానీ వాటిల్లో ఏముందో ఈ చిన్న పుస్తకంలో కూడా అదే ఉంది. చాలా తేలికైన భాషలో ఉంది.

చిక్కటి వేదాంతాన్ని అతి సులభమైన తేలికభాషలో చెప్పడం రామకృష్ణులు, జిల్లెళ్ళమూడి అమ్మగార్ల విధానం. మామూలు మాటలను కూడా అర్థంకాని కవితాధోరణిలో చెప్పడం జెన్ సాధువుల, మార్మికకవుల విధానం. ఈ పుస్తకంలో నేనీ రెంటినీ అనుసరించాను.

‘మధువు’ అనే పదానికి కొంచెం వివరణ అవసరం. మధువంటే తేనె. మధువంటే సారాయి. అదే విధంగా, మధువు అంటే బ్రహ్మానుభూతి కూడా. ఉపనిషత్తులలో ‘మధువిద్య’ అనే విద్య ఉన్నది. కనుక మధువు అనే పదానికి చాలా అర్థాలున్నాయి.

మధువంటే మనకందరికీ తెలిసిన సారాయి కాదు. మధువంటే అనుభూతి. ఆ అనుభూతి భౌతికం కావచ్చు, అంతరికం కావచ్చు. చాలాసార్లు అది అంతరికమైనదే అయి ఉంటుంది.

భావప్రపంచంలో లీనుడై కవి బాహ్యప్రపంచాన్ని మరచిపోతాడు. ఇంద్రియప్రపంచాన్ని అధిగమించిన యోగి మనుషులకు తెలియని ఏదో చోట తన ఆత్మను లీనం చేస్తాడు. సారాయికి బానిసైన చవకబారు మనిషి ఆ మత్తులో కొద్దిసేపు తన బాధలను మరచిపోతాడు. మౌలికంగా ఇవన్నీ ఒక్కటే అనడం సాహసమే అయినప్పటికీ, ‘మత్తు’గా ఇవన్నీ ఒక్కటే అని చెప్పాలి. ఆ మత్తు యొక్క గుణంలోనూ, జీవితానికి అదిచ్చే పరిణతిలోనూ తేడాలుండవచ్చు. కానీ మౌలికంగా చూచినపుడు, అన్నీ మత్తులే.

జీవితమే మధుశాల అనేది నా అభిప్రాయం. ఏమంటే, లౌకికులైనా, వేదాంతులైనా, సామాన్యులైనా, అసామాన్యులైనా, ఎవరైనా ఇక్కడ బ్రతకవలసినవారే. అందరికీ అదే రంగస్థలం. దీనిని విడచి ఎవరూ సాము చెయ్యలేరు. ఎవరికి కలిగే అనుభవాలైనా ఇక్కడనుంచే కలుగుతాయి. కనుక, దీనికంటే వేరే మధుశాల లేదని నా ఉద్దేశ్యం. దీనిని విడచి వేరే మధుశాలకు పోవలసిన పని కూడా లేదని నేనంటాను.

నీ నిత్యజీవితాన్ని విడచి, ఆధ్యాత్మికమంటూ వేరే ఎక్కడా లేదు. ఇదే నా అభిప్రాయం. జీవితాన్ని 50 ఏళ్లపాటు పరిశీలించినమీదట నేనీ నిశ్చితాభిప్రాయానికి వచ్చాను. ఇదే మాటను జిల్లెళ్ళమూడి అమ్మగారు కూడా అనేవారు.

ఇందులో నేనొక త్రాగుబోతుగా మీకు కనిపిస్తాను. సరదాగా నేను వేసిన నాటకాలలో చాలా పాత్రలు ధరించాను. అలాగే, ఇదికూడా ఒక పాత్ర. ఈ పాత్రపోషణ ద్వారా లోతైన జీవితసత్యాలను తేలికైన మాటలలో మీకు వివరించే ప్రయత్నాన్ని చేశాను. ఈ నాటకంలో నా సహపాత్రధారిణి సాకీ. నా జీవితంలో నాకెదురైన అందరూ సాకీలే. అసలు నా జీవితమే పెద్ద నాటకం.  అందులో అన్నీ పాత్రలే.

త్రాగుడును నేనస్సలు సమర్ధించను. మనిషి జీవితానికి అది అవసరమైనది కాదు. దాని జోలికి పోవద్దని మీకందరికీ సలహా ఇస్తాను కూడా. ఈ పుస్తకంలో చెప్పబడిన మధుసేవనం అంతర్మధనమే గాని, సారాయిని త్రాగడం కాదు.

జీవితమే మధుశాల. అందులో, మనకిష్టమైనవారు, మనతో వారి మనస్సును అరమరికలులేకుండా పంచుకునే వారు, ఆత్మీయంగా మనతో మాట్లాడేవారు, అందరూ సాకీలే. ఈ కోణంలో మాత్రమే మీరు ఈ పుస్తకాన్ని, ఇందులో కనిపించే సాకీని అర్థం చేసుకోవాలి.

జీవితంలో ప్రతి సన్నివేశమూ మనల్ని అలౌకికమైన అనుభూతి మత్తులో ముంచుతున్నపుడు వేరే మధువు యొక్క అవసరం మనకు ఏముంటుంది?

మనసు పెట్టి చదివితే, ఈ చిన్నపుస్తకం మీ జీవితాన్ని ఎంతో ఉన్నతంగా మార్చివేస్తుంది. ఈ మాట మాత్రం గట్టిగా చెప్పగలను.

ఈ పుస్తకాన్ని వ్రాయడంలో నాకు తోడుగా ఉన్న నా శ్రీమతి సరళాదేవి,  శిష్యులు, శిష్యురాళ్ళు, అఖిల. లలిత, ప్రవీణ్, శ్రీనివాస్ చావలి లకు, పంచవటి సభ్యులందరికీ నా కృతజ్ఞతలు, ఆశీస్సులు.

సాకీలకందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. వారెందరో ఉన్నారు, అందరి పేర్లూ వ్రాయలేను. అందుకే సాకీ పేరుతోనే వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

యధావిధిగా ఈ 'ఈబుక్' ఇక్కడ నుండి మీకు లభిస్తుంది. త్వరలో ప్రింట్ పుస్తకంగా కూడా వస్తుంది.
read more " మా క్రొత్త పుస్తకం 'మధుశాల' విడుదలైంది "

12, మే 2024, ఆదివారం

బ్లాగు పోస్టుల తొలగింపు

ఈ మధ్యన నా బ్లాగులో వ్రాతలను చాలావరకూ తగ్గించిన విషయం మీకందరికీ తెలుసు. దానికి కారణం ఆశ్రమ జీవితం.

అర్హులైనవారికి వ్యక్తిగత బోధన, సాధన మాత్రమే ప్రస్తుతం ఎక్కువౌతుంది. వ్రాతలు తగ్గుతాయి.

త్వరలో రాబోతున్న 'మహనీయుల జీవితాలు - జాతకవిశ్లేషణలు' అనే నా లేటెస్ట్ గ్రంధం దృష్ట్యా, ఇప్పటివరకూ నా బ్లాగులో ఉన్న మహనీయుల జాతక విశ్లేషణలనన్నింటినీ (దాదాపు నూరు పోస్టులను) తొలగిస్తున్నాను.

గమనించండి. 

read more " బ్లాగు పోస్టుల తొలగింపు "

21, ఏప్రిల్ 2024, ఆదివారం

UAE లో విపరీత వర్షాలు వరదలు - హిందూ దేవాలయ ప్రతిష్ఠాపనా మహత్యమా?

'బిడ్డొచ్చిన వేళ, గొడ్డొచ్చిన వేళ' అని  మనకొక సామెతుంది. 'కోడలు అడుగుపెట్టినవేళ' అని కూడా ఇంకొకటుంది. అంటే, కొంతమంది ఇంటిలో అడుగుపెడితే, మంచో చెడో కొన్ని సంఘటనలు తప్పకుండా జరుగుతాయని అర్ధం. ఈ సామెతల వెనుక చాలా అనుభవము, పరిశీలన, చరిత్ర ఉన్నాయి. ఇవన్నీ నిజాలే. 

మన పల్లెటూరి సామెతలను మనం ఏమాత్రమూ నమ్మం. కానీ ఇంగ్లీష్ వాడొచ్చి, Coming events cast their shadows అంటే మాత్రం 'అబ్బా  ఎంత బాగా చెప్పాడో తెల్లోడు?' అని తెగ మురిసిపోతాం. మన సారాయి అయినా సరే, తెల్లసీసాలో ఉంటే దాని విలువ ఒక్కసారిగా మారిపోతుంది మరి !

అలాంటిదే 'UAE లో విపరీత వర్షాలు వరదలు' అనే న్యూస్.

ఏడాది మొత్తం ఎంత వర్షం పడుతుందో అంతకు ఒకటిన్నర రెట్ల వర్షం ఒక్క రోజులో అక్కడ పడింది. దుబాయ్ విమానాశ్రయమూ, సిటీ అన్నీ నీళ్లలో మునిగిపోయాయి. ఇదంతా ఇప్పటిదాకా UAE చరిత్రలో లేదు.

క్లౌడ్ సీడింగ్ చెయ్యడం వల్లే ఈ వర్షాలని కొందరంటే, ఉత్త క్లౌడ్ సీడింగ్ ఒక్కటే ఇంత పని చెయ్యలేదు, మారుతున్న వాతావరణం కూడా కారణమని మరికొందరి మాట ! 

ఇదంతా ఇలాగుంటే, దుబాయ్ లో హిందూదేవాలయం కట్టడం వల్లే ఈ వర్షాలు వరదలు వచ్చాయని కొందరు తురుష్కులు తెగ బాధపడిపోతున్నారని ఉవాచ.

దానికి మనవాళ్ళు, 'ఇంకా మరిన్ని హిందూ దేవాలయాలు కట్టండి. నెలకొక వర్షం చొప్పున వర్షాలు పడి మిడిల్ ఈస్ట్ అంతా సస్యశ్యామలం అవుతుంది' అని సలహాలిస్తున్నారు.

నిజమే కదా. మొన్న ఫిబ్రవరిలో అక్కడ హిందూదేవాలయం కట్టబడింది. వేదఘోష అక్కడ ప్రతిధ్వనిస్తున్నది. మరి వర్షాలు పడకుండా ఎలా ఉంటాయి? రెండు నెలలు తిరక్కుండా, ఆ దేశాల చరిత్రలోనే కనీవినీ ఎరుగనంత వర్షం పడింది. దీన్నేమనాలి మరి ! 

ఈ మొత్తం విషయానికి మన పురాణాలతో లింకుంది.

సీతాన్వేషణలో లంకా నగరానికి వెళుతుంటే సముద్రం అడ్డుగా ఉందని, దానిని ఎండగట్టడానికి ఆగ్నేయాస్త్రం ప్రయోగించబోయాడు శ్రీరామచంద్రుడు. దానికి సముద్రుడు గడగడలాడి, వేదవిరోధులు, ధర్మవిరోధులు ఉన్న వాయవ్యదిశగా దానిని ప్రయోగించమని సూచించి, లంకకు వెళ్ళడానికి దారినిచ్చాడు. మనకు వాయవ్యమంటే భూమికి మిడిల్ ఈస్ట్ అవుతుంది. శ్రీరాముని ఆగ్నేయాస్త్ర ప్రభావం చేత సౌదీ ప్రాంతాలలో అంతా చెట్లూ చేమలూ నశించి ఎడారిగా మారిపోయింది. ఇది పురాణవచనం. ఇదంతా రామాయణంలో రికార్డ్ కాబడి ఉంది.

ఇన్ని వేల ఏళ్లకు మళ్ళీ మన దేవాలయం అక్కడ కట్టబడటం వల్ల మళ్ళీ ఆ ప్రాంతానికి శాపవిమోచనం కలిగి, శ్రీరాముని ఆగ్నేయాస్త్ర ప్రభావం నశించి, అక్కడ వర్షాలు పడుతున్నాయని మరికొందరి ఊహ. ఈ ఊహ చాలావరకూ సత్యానికి దగ్గరగానే ఉంది.

అజ్ఞాతవాస సమయంలో పాండవులు ఎక్కడ దాక్కున్నారో తెలుసుకోవడానికి దుర్యోధనుడు ఒక ప్లాను వేస్తాడు. ధర్మరాజు సత్యాన్ని తప్పడు గనుక, ఆయన ఎక్కడుంటే అక్కడ నెలకు నాలుగు వానలు ఖచ్చితంగా పడతాయి గనుక, ఏ రాజ్యంలో (ఏ రాష్ట్రంలో) వర్షాలు సక్రమంగా పడుతూ, పంటలు బాగా పండుతూ, ప్రజలు సుఖసంతోషాలతో హాయిగా ఉన్నారో అక్కడ పాండవులు దాక్కున్నారని భావించాలని ఆయన సహచరులు ఆయనకు సలహా ఇస్తారు. ఇదీ నిజమే ! ఇదంతా లాజికల్ గానే ఉంటుంది.

ఎక్కడ దేవాలయాలు, దేవతా విగ్రహాలు కూలగొట్టబడతాయో అక్కడ వర్షాలు పడవని, పంటలు పండవని, కరువు కాటకాలు తాండవిస్తాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి. దీనికి నిదర్శనాలు ఎన్నో చరిత్రలో మనకు కనిపిస్తాయి. భారతదేశాన్ని ఏకచత్రాధిపత్యంగా 50 ఏళ్లపాటు పరిపాలించి, లెక్కలేనన్ని దేవాలయాలను కూలగొట్టిన ఔరంగజేబు, చివరకు తన సైన్యానికే కాదు, తన బాడీగార్డ్స్ కు కూడా నెజీతాలు  ఇవ్వలేని కటిక నిరుపేద పరిస్థితిలో చనిపోయాడు. అతను రాసిన చివరిలేఖలో ఇది స్పష్టంగా ఉంది.

ఇప్పుడు మన కాంగ్రెస్ వాదులకు, లెఫ్టిస్ట్ లకు, నాస్తికులకు, హేతువాదులకు ఒక ధర్మసందేహం వస్తుంది.

'ఇదంతా నిజమైతే, మరి హైదరాబాద్ లో నీటికరువు ఎందుకు రాబోతోంది? కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే ఎందుకు వచ్చేసింది?బెంగుళూర్ లో బిందెడు నీటికి కొట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చేసింది. జనాలంతా మాల్స్ కి వెళ్లి అక్కడ టాయిలెట్స్ లో స్నానాలు చేస్తున్నారు. ఇదంతా ఎవరి శాపం? ఏ అస్త్రం ప్రభావం? చెప్పండి?' అని వారు అడుగుతారు.

దానికి మన దగ్గర ఆన్సర్ రెడీ గా ఉంది.

ఇదంతా కాంగ్రెసాస్త్ర ప్రభావం. కమ్యూనిష్టాస్త్ర ప్రభావం. బీజేపీతో విభేదించే పార్టీ అస్త్రాల ప్రభావం.

దేశాభివృద్ధిని ముఖ్యంగా  చూడకుండా, సరిహద్దు రక్షణను ప్రధానంగా చూడకుండా, కులమతాలను రెచ్చగొట్టి, ఉచితపథకాలను అమలుచేస్తూ, దేశాన్ని  ప్రాంతాల పరంగా చీల్చి, అప్పుల ఊబిలోకి నెట్టి, లా అండ్ ఆర్డర్ ను నీరుగార్చి, వ్యవస్థలన్నిటినీ నిర్వీర్యం చేసిన ఘనత ఈ ప్రభుత్వాలదే. అందుకే ఈ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలోనే నీటి కరువు వచ్చింది. అవి అల్లకల్లోలాలు అవుతున్నాయి.

మరోప్రక్కన, యోగి ఆదిత్యనాధ్ వంటి నిజమైన మహనీయులు పరిపాలిస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాలలో ముందుకు దూసుకుపోతూ, అప్పులరాష్ట్రం అనే బిరుదు నుండి బయటపడి, బడ్జెట్ సర్ ప్లస్ రాష్ట్రంగా పేరు తెచ్చుకుంది. 

ప్రపంచదేశాల మధ్యన 75 ఏళ్ళనుంచీ నవ్వులపాలౌతున్న భారతదేశం, మోదీగారి రామరాజ్య పరిపాలనలో కేవలం 8 ఏళ్లలో ఊహించలేని అభివృద్ధిని సాధించి, అగ్రదేశాలతో సమానంగా గర్వంగా తల ఎత్తుకుని నిలబడే స్థితిలో నేడు ఉంది.  ఇదే సమయంలో అయోధ్యలో రామాలయ నిర్మాణం కూడా జరిగింది. ఇదంతా కాకతాళీయం ఎలా అవుతుంది? 

ధర్మస్వరూపుడైన శ్రీరాముని దేవాలయం ఉన్నచోట, ప్రజలు ధర్మాన్ని తప్పకుండా ఉన్నచోట, ప్రకృతి కూడా తన ధర్మాన్ని ఖచ్చితంగా పాటిస్తుంది. వర్షాలు ఖచ్చితంగా పడతాయి. ఇది తిరుగులేని సత్యం ! ఇప్పుడు UAE లాంటి దేశాలలో కూడా ఇది రుజువైంది.

ఇప్పుడు చెప్పండి. ఏ శాపం వల్ల కర్ణాటకలో నీళ్లు లేని పరిస్థితి వచ్చింది? తెలంగాణాలో ఎందుకు ఇప్పటికే రాబోతోంది? ఏ పార్టీ ప్రయోగించిన అస్త్రాలివి? ధర్మస్వరూపుడైన శ్రీరాముడిని, శక్తిస్వరూపిణి అయిన అమ్మవారిని ద్వేషించే ప్రభుత్వాలున్న రాష్ట్రాలలో వర్షాలు ఎలా పడతాయి? అవి సస్య శ్యామలంగా ఎలా ఉంటాయి?

రామబాణం మహిమ అంటే ఇలా ఉంటుంది. అది రాక్షసభూములను ఎడారిగా మార్చగలదు. బుద్ధి తెచ్చుకుని పశ్చాత్తాపపడితే, ఎడారిలో కూడా వర్షాలను కురిపించగలదు.   UAE ఉదాహరణ చాలదా? ఇంకా చాలకపోతే మరిన్ని ఉదాహరణలు భవిష్యత్తులో చూద్దురుగాని సిద్ధంగా ఉండండి !

'గ్రహబలమేమి రామానుగ్రహ బలము గాని? (What can planets do if there is Lord Rama's grace?)'  అని త్యాగరాజస్వామి వంటి మహనీయులు ఊరకే అన్నారా?

read more " UAE లో విపరీత వర్షాలు వరదలు - హిందూ దేవాలయ ప్రతిష్ఠాపనా మహత్యమా? "

1, ఏప్రిల్ 2024, సోమవారం

విజయవంతంగా ముగిసిన 3 వ సాధనా సమ్మేళనం
గత మూడురోజులపాటు మా చండ్రపాడు ఆశ్రమంలో జరిగిన మూడవ స్పిరిట్యువల్ రిట్రీట్ నిన్న విజయవంతంగా ముగిసింది. 

పాత క్రొత్త శిష్యులందరూ మూడు రోజులపాటు ఆశ్రమంలో ఉండి, వారి  జీవితానికి మరింత నిండుదనాన్ని అద్దుకుని, ఆనందంతో నిండిన మనసులతో వారివారి ఇండ్లకు తిరిగి వెళ్లారు.

క్రొత్తవారికి పంచవటి సాధనామార్గంలో ప్రాధమిక దీక్షనివ్వడం జరిగింది. పాత శిష్యులకు ఉన్నతస్థాయికి చెందిన యోగసాధనా మార్గాలను ఉపదేశించడం జరిగింది.  పంచవటి సాధనా మార్గంలో పాటించవలసిన నియమాలను, విధివిధానాలను, జీవితంలో తెచ్చుకోవాల్సిన మార్పులను వారికి స్పష్టంగా వివరించడం జరిగింది.

దేహాన్ని నిర్లక్ష్యం చెయ్యడం ఎంతమాత్రమూ మా విధానం కాదు. కనుక, మా యోగసాధనా మార్గాన్ని అనుసరిస్తూ, గత రెండు నెలలలో 15 కేజీలనుండి 5 కేజీల వరకూ ఆరోగ్యవంతంగా బరువును తగ్గినవారికి బహుమతులు ఇవ్వడం జరిగింది.

అదేవిధంగా, బరువు పెరగవలసిన కేటగిరీలో, 4 నుండి 9 కేజీల వరకూ బరువు పెరిగిన వారికి కూడా బహుమతులు ఇవ్వడం జరిగింది.

జ్యోతిష్యశాస్త్రపు లోతుపాతులను అందరికీ పరిచయం చేస్తూ, 1887 BCE కి చెందిన గౌతమబుద్ధుని అసలైన జాతకచక్రాన్ని వారికి వివరించడం జరిగింది. నా విశ్లేషణా విధానాన్ని బుద్ధుని జాతకచక్రం యొక్క విశ్లేషణతో వారికి అర్ధమయ్యేలా వివరించడం జరిగింది. బుద్ధుని యొక్క ఈ అసలైన జననతేదీని వెలుగులోకి తెచ్చినవారు ప్రఖ్యాత భారతీయ చరిత్ర పరిశోధకులు కోట వెంకటాచలం గారు.

త్వరలో వెలువడబోతున్న 'మహనీయుల జాతకాలు - జీవిత విశ్లేషణలు' అనే 500 పేజీల మా జ్యోతిష్యశాస్త్ర పరిశోధనా గ్రంధంలో ఈ జాతక విశ్లేషణను మీరు చూడవచ్చు.

ఇకపోతే, పదేళ్ళనుండీ నేను చెబుతూ వస్తున్న రీతిలోనే మా ఆశ్రమం నేడు ఎదుగుతున్నది. అసలైన హిందూమతాన్ని కులానికతీతంగా ఆచరణాత్మకంగా అందరికీ బోధిస్తూ, అజ్ఞానపు మురికిని వదిలిస్తూ, శిష్యుల దేహ-ప్రాణ-మానసిక స్థాయిలను సరిచేస్తూ, ఆధ్యాత్మిక మార్గదర్శనం ద్వారా నిజమైన హిందువులను, నిజమైన మనుషులను తయారు చేస్తూ,  అప్రతిహతంగా ముందుకు సాగుతున్నది.

తిరిగి, మూడు నెలల తర్వాత, జూలైలో వచ్చే నా పుట్టినరోజు సందర్భంగా గురుపూర్ణిమా రిట్రీట్ జరుగుతుంది. ఇప్పటివరకూ ఉపదేశించిన సాధనలలో మంచి పరిపక్వతను అందుకుని, అసలైన హిందువులుగా అసలైన యోగులుగా తయారై ఆ రిట్రీట్ కు రావలసిందిగా శిష్యులనందరినీ కోరుతున్నాను.

క్రొత్తగా మా వద్ద దీక్షాస్వీకారం చేసి మా సాధనామార్గంలో నడవాలనుకునేవారు ఈ క్రింది 5 పుస్తకాలను తప్పకుండా చదివిన తర్వాత మాత్రమే మమ్మల్ని సంప్రదించగలరు. లేనిచో మా మార్గంలో ప్రవేశం లభించదు. గమనించండి.

1. శ్రీవిద్యా రహస్యం

2. లలితా సహస్రనామ రహస్యార్థ ప్రదీపిక

3. తారా స్తోత్రం

4. ధర్మపథం

5. వెలుగు దారులు లేదా MUSINGS

read more " విజయవంతంగా ముగిసిన 3 వ సాధనా సమ్మేళనం "

8, మార్చి 2024, శుక్రవారం

శివరాత్రి అంతరార్ధం

కాదేదీ వ్యాపారానికనర్హం

శివరాత్రి నవరాత్రి

సంకురాత్రి తొలిరాత్రి

ఏదైనా సరే


వాళ్ళు చూద్దామా అంటే ...


శివరాత్రి వైపు జనాన్ని పోనివ్వకుండా

'దేవుడితో ఒక రాత్రి' అంటాడొకడు

నవరాత్రులు చేసుకోనివ్వకుండా

'దేవతతో ఒక రాత్రి' అని ఆహ్వానిస్తాడొకడు


శివరాత్రి అంటే

రాత్రంతా డాన్సులంట

'దేవుడితో ఒక రాత్రి' అంటే

రాత్రంతా ఛాన్సులంట

కాదేదీ వ్యాపారానికనర్హం


పోనీ వీళ్ళు చూద్దామా అంటే...


శివరాత్రి అంటే

శివుడికి నీళ్లు పోస్తారంట

వీళ్ళు పోసుకోవడం ఎప్పుడో?


శివరాత్రి అంటే

జాగారం చేస్తారంట

జాగృతం ఎప్పుడో?


శివరాత్రి అంటే

ఉపవాసం ఉంటారంట

సహవాసం ఎప్పుడో?


శివరాత్రి అంటే

పూజలు చేస్తారంట

పూనకం ఎప్పుడో?


శివరాత్రి అంతరార్ధం

ఎవరికి కావాలి?

అసలు శివరాత్రి ఎలా జరపాలో

ఎవరికి తెలియాలి?


కాదేదీ వ్యాపారానికనర్హం

శివరాత్రి నవరాత్రి

సంకురాత్రి తొలిరాత్రి

ఏదైనా సరే

read more " శివరాత్రి అంతరార్ధం "

7, మార్చి 2024, గురువారం

మూడవ స్పిరిట్యువల్ రిట్రీట్ (ఈ నెల 29, 30, 31 తేదీలలో)

ఎన్ని ప్రవచనాలు వినినా, ఎన్ని పుస్తకాలను చదివినా, ఎన్ని యూట్యూబ్ వీడియోలు చూచినా, ఎన్ని కబుర్లు చెప్పినా, అసలైన ఆధ్యాత్మికమార్గంలో ప్రాక్టికల్ గా నడవనిదే దమ్మిడీ ఉపయోగం కూడా ఉండదు. మిగతావన్నీ టైం వేస్ట్ పనులు మాత్రమే.

ఇది సత్యం.

అందుకే 'పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్' ఉద్భవించింది. తపన ఉన్న జిజ్ఞాసువులకు, సాధకులకు అసలైన ఆధ్యాత్మికలోకపు దారులు చూపిస్తుంది. నడిపిస్తుంది.

అందుకే ఈ ఆహ్వానం.

ఈ నెల 29, 30, 31 తేదీలలో మా ఆశ్రమంలో మూడవ స్పిరిట్యువల్ రిట్రీట్ (పంచవటి సాధనా సమ్మేళనం) జరుగుతుంది.

ఈ మూడు రోజులు, ఉదయం 4 నుండి రాత్రి 7 గంటల వరకు. మధ్యాహ్నం భోజనవిరామం తప్ప, మిగిలిన సమయమంతా వివిధరకాల సాధనలలో మీరు సమయాన్ని గడపవలసి ఉంటుంది. ఆ వివరాలన్నీ, ఇక్కడకు వచ్చిన తర్వాత చెప్పబడతాయి. నేర్పబడతాయి.

ఎదురుచూస్తున్నవారికి ఇదే ఆహ్వానం.

ఈ రిట్రీట్ లో రెండు విభాగాలు ఉంటాయి.

ఇప్పటివరకూ ఆశ్రమానికి రాని క్రొత్తవారికి, మొదటిరోజున అంటే మార్చి 29 తేదీన, అవగాహనా సమ్మేళనం ఉంటుంది.  ఈ ఒక్క రోజు మాత్రమే వారికి ఆశ్రమంలో మాతోబాటు ఉండే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో పంచవటి సాధనామార్గం గురించి వారికి వివరించబడుతుంది. మీ మీ సందేహాలను తీర్చుకునే అవకాశం కలుగుతుంది.

పాతవారికి మరియు గతంలో అటెండ్ అయినప్పటికీ, దీక్షాస్వీకారం చెయ్యని క్రొత్తవారికి ఈ సారి ఆశ్రమంలో  మూడు రోజులు ఉండే అవకాశం ఇవ్వబడుతుంది. వారు సీనియర్ సభ్యులతో కలసి మూడు రోజులు ఆశ్రమంలో ఉండవచ్చు, కలసి సాధనలు చెయ్యవచ్చు. మా మార్గం యొక్క లోతుపాతులను మీ శక్తిమేరకు గ్రహించవచ్చు.

ఆశ్రమంలో మినిమమ్ సౌకర్యాలు మాత్రమే ఉంటాయి. కంఫర్ట్స్ ఉండవు. వేసవి ఎండలు బాగా ఉంటాయి. వాటికి తట్టుకునే సంసిద్ధత ఉన్నవారు మాత్రమే రాగలరు. ఆశ్రమంలో ఉన్నపుడు ఆశ్రమ నియమాలను పాటించవలసి ఉంటుంది. మీరు ఏవైనా మందులను వాడుతూ ఉంటే, వాటిని తెచ్చుకోవడం మరచిపోకూడదు. 

రాదలచుకున్నవారు 98493 - 89249 అనే నంబర్ లో పంచవటి ఫౌండేషన్ సెక్రటరీ శ్రీ రామమూర్తి గారిని సంప్రదించగలరు.

read more " మూడవ స్పిరిట్యువల్ రిట్రీట్ (ఈ నెల 29, 30, 31 తేదీలలో) "

27, ఫిబ్రవరి 2024, మంగళవారం

R.I.P Pankaj Udhas
నిన్న పంకజ్ ఉదాస్ చనిపోయాడు. ఈయన 72 ఏళ్ళు బ్రతికాడు. కొద్ది నెలలుగా పాంక్రియాస్ కేన్సర్ తో బాధపడుతున్నాడు.

ఘజల్స్ పాడటంలో ఈయనదొక ప్రత్యేకశైలి.  ఈయన తండ్రిగారు, ఇద్దరు అన్నలు ఆందరూ గాయకులే. వీరిది గుజరాత్ లోని రాజకోట్ దగ్గరలో ఒక జమీందారీ కుటుంబం. ఫరీదా అనే పార్శీ వనితను ఈయన ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 

ఈయన మే 17, 1954 న గుజరాత్ లో పుట్టాడు. ఈయన జనన, మరణ జాతకాలను ప్రక్కన చూడవచ్చు. 

ఈయన గాయకుడే  గాక, తబలా, వయోలిన్, పియానో, గిటార్ లను వాయించడంలో ప్రావీణ్యం ఉన్న బహుముఖ కళాకారుడు.

ఈయన పౌర్ణమినాడు పుట్టాడు. రాహుకేతువులు నీచ స్థితులలో ఉన్నారు. వేరే కులం, వేరే మతం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వివాహజీవితం బాగానే నడిచింది.

ఈ రెండు చార్ట్ ల పరిశీలన కొన్ని జ్యోతిష్య రహస్యాలను తెలియజేస్తుంది.

ఈయన వివాహజీవితం, కెరీర్, చివరకు పాంక్రియాస్ కేన్సర్ ఇవన్నీ ఈ చార్ట్ లు  స్పష్టంగా చూపిస్తున్నాయి.

read more " R.I.P Pankaj Udhas "

21, ఫిబ్రవరి 2024, బుధవారం

మీ దగ్గర చేతబడి ఉందా?

హైదరాబాద్ బుక్ ఫెయిర్ ముగిసింది.  అన్ని స్టాల్స్ లాగే మా స్టాల్ కూడా మూసేసి ఇంటిదారి పట్టాము.

'ఎలా ఉంది ఈ పదిరోజుల అనుభవం?' మూర్తిని ఫోన్ లో అడిగాను

'చాలా దారుణంగా ఉంది. ఒక పక్కన ఎండలు, మరోప్రక్కన జనాల విచిత్ర మనస్తత్వాలు, మైండు బ్లాంక్ అయిపొయింది' అన్నాడు.

ఈసారి కూడా మాకు పడమర వైపు స్టాలే వచ్చింది. మధ్యాహ్నం నుండి అందరికీ ఎండ పేలగొట్టింది.

'ఏమైంది? వింతమనుషులందరూ కనిపించారా?' అడిగాను.

'అవును. చాలామంది మాకు బోధలు చెయ్యడానికే స్టాల్ దగ్గరకు వచ్చినట్లుగా ఉన్నారు' అన్నాడు.

'ఇప్పుడు అందరూ యూట్యూబ్ యూనివర్సిటీ పీ హెచ్ డీ లే. అందులో చూడటం, ఇక కనిపించిన వారికందరికీ బోధలు చెయ్యడం. ఇదే ప్రస్తుతం నడుస్తున్నది' అన్నాను.

'కొందరైతే, 'ఈయనొక క్రొత్త గురువా? ఇప్పటికి ఉన్నవాళ్లు చాలరా? ఈయనను మేమెందుకు నమ్మాలి? రామాయణం భారతాలలో లేనిది క్రొత్తదేమైనా ఈయన చెబుతున్నాడా? అవి చాలవా? కొత్తకొత్తవి ఎందుకు?' అన్నారు.

'రామాయణ భారతాలకంటే ముందు వేదాలున్నాయి. మరి వేదాలలోనే అంతా ఉంది కదా? ఇవెందుకు?' అని నువ్వు అడిగి ఉండాల్సింది' అన్నాను.

మరి కొంతమంది, 'బుద్ధుడు మాకు నచ్చడు' అంటూ ధమ్మపదం పుస్తకాన్ని అటూ ఇటూ తిప్పి అవతలపడేశారు' అన్నాడు.

'అవును. సాంప్రదాయ చాదస్తపు హిందువులకు బుద్ధుడు నచ్చడు. మనకు నచ్చుతాడు. మనకే కాదు, బుద్ధుని తత్త్వాన్ని అర్ధం చేసుకుంటే ఎవరికైనా నచ్చుతాడు' అన్నాను.

ఇంకొకాయనైతే మీ ఫోటోను చూస్తూ, ' నేనుకూడా ఇలా ఒక గ్రూపు మెయింటెయిన్ చేద్దామని చాలాకాలం నుండి అనుకుంటున్నాను. కుదరడం లేదు. ఈ లోపల ఎవరు పడితే వాళ్ళు ఆశ్రమాలు పెట్టేస్తున్నారు' అంటూ తెగ ఫీలై పోయాడు. తన జెలసీని కనీసం లోపల దాచుకోవడం కూడా అతనికి కుదరడం లేదు' అన్నాడు మూర్తి.

'పాపం ! అంత కుతకుత ఉందన్నమాట లోపల. కూల్ డ్రింక్ ఒకటి ఆఫర్ చెయ్యకపోయావా. కొంచెం చల్లబడేవాడు' అన్నాను.

'ఒకామె అయితే, 'నేను గురువుల దగ్గరకు వెళ్ళను. వాళ్లే నన్ను వెతుక్కుంటూ రావాలి' అంది మన స్టాల్ దగ్గర కొచ్చి.' అన్నాడు మూర్తి.

'చాలా కరెక్ట్ గా చెప్పింది. ఎవడికి అవసరమైన దానిని వాడు వెతుక్కుంటాడు, తప్పేముంది?' అన్నాను.

'ఇంకొకడైతే రావడం రావడం 'చేతబడి ఉందా?' అని అడిగాడు. కనీసం 'చేతబడి మీద బుక్స్ ఉన్నాయా' అని కూడా అడగలేదు. 'చేతబడి ఉందా' అంట, ఐస్ క్రీమ్ ఉందా అన్నట్టు' అన్నాడు మూర్తి.

'లోపలుంది పిలుస్తా ఉండండి' అని మన రమేష్ ని పిలిచి ఉండాల్సింది. వాడికి స్పాట్లో చేతబడి చేసి ఉండేవాడు' అన్నాను.

'మరీ ఇంత దరిద్రంగా ఉన్నారేంటి మనుషులు?' మూర్తికి అనుమానం వచ్చింది.

'అంతే. 'పాపట్లో నెరిసిన తర్వాత పాప పతివ్రత అయింది' అని సామెతుంది. అలాగే, అన్ని రకాలుగా భ్రష్టు పట్టిన తర్వాతే ఆధ్యాత్మికంలోకి వస్తారు. అదంతే' అన్నాను.

' అసలైన తత్త్వం ఎవరూ అడగడం లేదు. ఎవరిని చూసినా, పూజలు, మంత్రాలు, కుండలిని, తంత్రం, రెమెడీలు, క్షుద్రవిద్యలు, ఇదే గోల ! ఇదేం ఖర్మ గురూజీ. లోకం ఇలా తయారైంది?' అన్నాడు 

' ఇలాగే ఉంటుంది. అసలు విషయం చెప్తా విను. ఆధ్యాత్మికులమని చెప్పుకునేవారిలో 50 శాతం మంది నిజానికి మెంటల్ పేషంట్లు, వారికి సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయి, వాళ్లకు ట్రీట్మెంట్ అవసరం. మరొక 45 శాతం మంది విజ్ఞానప్రదర్శకులు, మోసగాళ్లు. ఆ 50 మందిని ఈ 45 మంది మోసం చేస్తుంటారు. ఎక్కడో విని, లేదా చదివి, వీరికి చెబుతుంటారు. అనుభవం ఉండదు. వారికి ఆసరా కావాలి. వీరికి గొప్పలు కావాలి.  మిగతా ఒక్క అయిదు శాతం మాత్రమే నిజమైన జిజ్ఞాసువులు, సాధకులు ఉంటారు. ఎక్కడైనా ఇంతే' అన్నాను.

'ఆ అయిదు శాతం ఎక్కడుంటారు?' అడిగాడు.

'మన పంచవటిలో ఉంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే, బయట అంతా నకిలీనే. కాకపోతే ఆ 95 శాతం కూడా 'మేమే అసలైన వాళ్ళం ' అని చెబుతారు. అసలైన అయిదు శాతాన్ని నకిలీ అంటారు. అదే కలిమాయ' అన్నాను.

'అర్ధమైంది గురూజీ, మరి ఇదంతా తెలిసికూడా మాచేత స్టాల్ ఎందుకు పెట్టించారు?' అడిగాడు.

'జస్ట్ ఫర్ ఫన్. మెంటల్ పేషంట్లలో ఎన్ని రకాలుంటారో మీకు ప్రాక్టికల్ గా అర్ధం కావడం కోసం పెట్టించాను. ఈ పదిరోజులలో బాగా అర్థమైందా?' అడిగాను.

'అయింది, ఇప్పుడు మమ్మల్నేం చెయ్యమంటారు?'

'ఏమీ చెయ్యద్దు. జస్ట్ ఎంజాయ్ లైఫ్. కొన్నాళ్లపాటు హాయిగా వేళకు తిని, నిద్రపొండి. మళ్ళీ వచ్చే నెలలో మన స్పిరిట్యువల్ రిట్రీట్ ఉంది. దానికి రెడీ అవ్వండి' అని ఫోన్ కట్ చేశాను.

read more " మీ దగ్గర చేతబడి ఉందా? "

19, ఫిబ్రవరి 2024, సోమవారం

అబూదాబీలో అతిపెద్ద హిందూమందిరం - జయహో మోడీ జీ !

స్వామి నారాయణ్ సంస్థచేత నిర్మించబడిన అతిపెద్ద  హిందూమందిరం అబూధాబిలో ఈ నెల 14 న ప్రారంభం అయింది. ఇది మోడీజీ ప్రభుత్వపు ఘనవిజయాలలో మరొకటి

దీనిపేరు BAPS Hindu Mandir.

మోడీజీ ప్రభుత్వపగ్గాలు చేపట్టిన ఇన్నేళ్ళలో మన దేశచరిత్రను తిరగవ్రాస్తూ సాధించిన ఘనవిజయాలు ఎన్నో ఉన్నాయి. అన్నింటినీ వ్రాస్తూ పోతే ఒక పెద్ద పుస్తకమే అవుతుంది. గత 75 ఏళ్లుగా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్రాలలో ప్రాంతీయపార్టీలు చేసిన దుర్మార్గాలను, అరాచకాలను, దేశద్రోహాలను సరిద్దుతూ ఈ విజయాలు సాగుతూ వస్తున్నాయి. 

అలాంటిదే ఈ విజయం కూడా !

ఒక అరబ్ దేశంలో హిందూదేవతలు అనేకమంది పూజింపబడే ఒక  అతి పెద్ద దేవాలయం కట్టబడటం ఊహకే సాధ్యం కాని పని. కానీ సాధ్యం అయింది.

గత వెయ్యేళ్ళుగా మన దేశంలోని వేలాది చిన్నా పెద్దా దేవాలయాలను తుర్కులు, అరబ్బులు, మొఘలులు, కూలగొట్టారు. మన గ్రంధాలను వేలాదిగా తగులబెట్టారు. లక్షలాదిమంది హిందువులను, ముఖ్యంగా బ్రాహ్మణులను, గురువులను చంపేశారు. చరిత్రలో వీటికి సాక్ష్యాలున్నాయి.

అటువంటిది చరిత్రలో మొదటిసారిగా ఒక అరబ్ దేశంలో హిందూదేవాలయం కట్టబడింది. ఇది కుహనా ముస్లిములకు, ముఖ్యంగా ఇండియా, బాంగ్లాదేశ్, పాకిస్తాన్ ముస్లిములలో చాలామందికి, ముఖ్యంగా జాకీర్ నాయక్ బ్యాచ్ కి అస్సలు మింగుడుపడదు. కానీ UAE ఒప్పుకుంది. వారి దేశంలో ఒక హిందూదేవాలయాన్ని ఆహ్వానించింది. అరబ్బులందరూ దుర్మార్గులు కిరాతకులు కారని ఈ విషయం రుజువు చేస్తున్నది. 

నిజానికి మతపిచ్చి, తీవ్రవాద క్రిమినల్ ధోరణులు అందరు ముస్లిమ్స్ లో ఉండవు.  ముల్లాలు, మౌల్వీలు, కాంగ్రెస్ పార్టీ సహాయంతో, ఇంకా కొన్ని ప్రాంతీయపార్టీల సహాయంతో ముస్లిములను రెచ్చగొడుతుంటారు. అంతేగాని ముస్లిములందరూ దుర్మార్గులు కారు. నా స్నేహితులలో ఎంతోమంది మంచి ముస్లిములున్నారు. వాళ్ళూ కొన్ని తరాల క్రితం హిందువులేగా. పేర్లు మార్చుకున్నా, DNA మారదుగా.

ఈ బృహత్తర ఆలయం గురించి కొన్ని వివరాలను చూద్దాం.

 • ఈ ఆలయం కట్టడానికి ప్రాసెస్ 1997 లో మొదలైంది.
 • 2019 లో 27 ఎకరాలను ఈ ఆలయనిర్మాణం కోసం ఇస్తూ UAE యువరాజైన షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యా ఒక ఆర్డర్ ఇచ్చాడు.
 • ఈ ఆలయనిర్మాణానికి కావలసిన గులాబీరంగు ఇసుకరాయిని రాజస్థాన్ నుంచి, మార్బుల్ ను ఇటలీ నుంచి తెచ్చారు.
 • బ్రిటన్, అమెరికా, ఇండియా, ఆఫ్రికా, గల్ఫ్, UAE ల నుండి 200 మంది వాలంటీర్లు ఈ నిర్మాణంలో పనిచేశారు.
 • ఈ ఆలయంలో 402 స్తంభాలున్నాయి. 
 • నగిషీలు చెక్కిన రాతిపలకలు 25,000 పైనే ఉన్నాయి.
 • ఈ ఆలయం ప్లాన్ వేసింది ఒక కాథలిక్ క్రిస్టియన్.
 • నిర్మాణ పర్యవేక్షణ చేసినది ఒక పార్సీ సంస్థ.
 • మే 2023 లో 30 దేశాల రాయబారులు ఈ ఆలయాన్ని దర్శించారు.
 • జనవరి 2024 లో 42 దేశాల ప్రతినిధులు ఈ ఆలయాన్ని దర్శించారు.
 • ఫిబ్రవరి 14, 2024 న ఒక వైదిక హోమం తో ఈ ఆలయం ప్రారంభమైంది.
 • నిన్నటినుంచి పబ్లిక్ కోసం తెరవబడింది.

వెయ్యి ఏళ్లుగా, మిడిల్ ఈస్ట్ దేశాల చేతిలో తన్నుడు, చంపుడు, విధ్వంసం, ఇవి మాత్రమే మనం చవిచూచాం. కానీ నేడు UAE లో మనదైన అతిపెద్ద దేవాలయాన్ని కట్టగలిగాం.

ఇది చరిత్రను తిరగవ్రాయడం కాదా ?

దేశద్రోహపార్టీలు ఏవైనా ఈ పనిని చేయగలిగాయా? అవి జాతీయ పార్టీలైనా సరే, ప్రాంతీయ పార్టీలైనా సరే.

ఇది మోదీజీ ప్రభుత్వం సాధించిన అనేక విజయాలలో మరొకటి.

ఇప్పుడు చెప్పండి. వచ్చే ఎన్నికలలో మనం ఎవరిని ఎన్నుకోవాలి?

మన దేశప్రతిష్ఠను హిమాలయశిఖరాలపైన నిలబెట్టిన బీజేపీ నా?

దేశాన్ని ముక్కలు చేయాలని శతవిధాలుగా ప్రయత్నిస్తున్న ఇతర పార్టీలనా?

ఆలోచించండి.

read more " అబూదాబీలో అతిపెద్ద హిందూమందిరం - జయహో మోడీ జీ ! "

15, ఫిబ్రవరి 2024, గురువారం

దొంగ మొగుడు - దొంగ పెళ్ళాం

'బుక్ ఫెయిర్ లో శివరాం సార్ కనిపించాడు' అన్నాడు రవి పొద్దున్నే ఫోన్ చేసి. గొంతు చూస్తే బాగా ఉద్వేగంతో ఉన్నాడు.

రవి ఈ మధ్యన ఫోన్ చెయ్యడం తగ్గించాడు. దానికొక కారణముంది.

ఇంతకు ముందు ఇద్దరం సర్వీసులో ఉండేవాళ్ళం గనుక, పొద్దున్నే వాకింగ్ సమయంలో మాట్లాడేవాడు. నేనుకూడా ఏదో ఒక పని చేసుకుంటూ తనతో మాట్లాడేవాడిని. ఇప్పుడేమో తను కూడా రిటైరయ్యాడు. కానీ వాకింగ్ మానలేదు. మనకేమో వాకింగ్ అప్పుడూ లేదు, ఇప్పుడూ లేదు. కానీ ప్రస్తుతం ఆశ్రమవాసినయ్యాను గనుక, మన టైం టేబుల్ వేరుగా ఉంటుంది,

ఉదయం మూడు నుంచి తొమ్మిదివరకూ జపమో, తపమో, మంత్రమో, తంత్రమో, యోగమో, వియోగమో ఏదో ఒకటి నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఫోన్ కాల్స్ మాటలాడటం కష్టం. అయినా సరే, ముప్పై ఏళ్ల  స్నేహం కదా అని అప్పుడప్పుడూ మాత్రం ఫోనెత్తుతూ ఉంటాను.

అప్పుడు ఇలాంటి షాకింగ్ న్యూసులు చెబుతూ ఉంటాడు.

ఒక రకంగా చెప్పాలంటే, బయటి ప్రపంచంతో నాకున్న కొన్ని సంబంధాలలో రవి ఒకడు. లేకపోతే, ప్రపంచంలో ఏం జరుగుతోందో మనకు తెలీదు, 

మనకు అనవసరం కూడా.

'ఎవరా శివరాం ఏమా కథ' అన్నాను కూల్ గా.

'శివరాం కాదు శివరాం సార్ అనాలి' అన్నాడు ఏదో నేరం జరిగిపోయినట్టు బాధపడుతూ.

'ప్రతివాడినీ సార్ అనాల్సిన ఖర్మ నాకేంటి? విషయం చెప్పు' అన్నాను.

'శివరాం సార్ బుక్ ఫెయిర్ కొచ్చి, ఆధ్యాత్మిక పుస్తకాలు బోలెడన్ని కొనుక్కుని ఒక బండిల్ గా చేసి కారులో పెట్టుకుని తీసికెళ్ళాడు. నేనే కళ్లారా చూశాను' అన్నాడు.

'ఇందులో వింతేముంది? ఎంతోమంది సాహిత్యాభిమానులు అలా చేస్తూ ఉంటారు, బుక్ ఫెయిర్ పెట్టిందే బుక్స్ కొనుక్కోడానికి' అన్నాను.

'అది కాదు. అందరూ రావడం వేరు. సార్ రావడం వేరు' అన్నాడు రవి.

'ఏం? అందరూ నేలపైన నడిస్తే ఈయన గాలిలో ఎగురుకుంటూ వస్తాడా?' అడిగాను.

'అదికాదు. ఈయన అవతారం కదా? ఈయన బుక్ ఫెయిర్ కి రావడం ఏంటి?' అన్నాడు ఏడుపు గొంతుతో.

నవ్వీ నవ్వీ పొట్ట చేత్తో పట్టుకున్నాను.

'అవతారమా? ఎవరి అవతారం?' అన్నాను నవ్వాపుకుంటూ.

'వెంకటేశ్వరస్వామి అవతారం' అన్నాడు కూల్ గా.

'ఏంటి పొద్దున్నే పిచ్చెక్కిందా? శివరాం సార్, వేంకటేశ్వరస్వామి అవతారమా? సరే అయితే అయ్యాడు. నువ్వెందుకు దానికి బాధపడటం?' అన్నాను నవ్వుతూ.

'అవును. అలా అని పెద్ద ప్రచారం జరుగుతోంది. ఆయనకు చాలామంది భక్తులు కూడా ఉన్నారు. ఇన్నాళ్లూ ఇదంతా నిజమని నేనుకూడా నమ్మాను. ఇప్పుడు చాలా సిగ్గుగా ఉంది' అన్నాడు.

'ఒకవేళ అవతారమే అయితే, తిరుమల కొండమీదకి పోయి కూచోమను.  మనకెందుకు?' అన్నాను.

'అదికాదు. నా డౌటేంటంటే, ఆయన వెంకటేశ్వరస్వామి అవతారమే అయితే, బుక్ ఫెయిర్ లో అన్ని స్టాల్సూ తిరిగి ఆధ్యాత్మిక పుస్తకాలు కొనడం ఏమిటి? ఇదే నాకర్ధం కావడం లేదు' అన్నాడు రవి.

'ఇందులో అర్ధం కావడానికేముంది? వెరీ సింపుల్. స్వామికి కొండమీద బోరు కొట్టింది. హైద్రాబాద్ బుక్ ఫెయిర్ కొచ్చి బుక్స్ కొనుక్కుంటున్నాడు. అంతే' అన్నాను.

'జోకులాపు. నాకేమనిపిస్తోందో చెప్పనా? ఈయన అవతారం అనేది కొంతమంది మోసగాళ్ల ప్రచారం మాత్రమే.  అది నిజం కాదు. అది కేవలం బిజినెస్ ప్రొమోషన్, అంతే' అన్నాడు.

'ఈ విషయం నీకెప్పుడో చెప్పాను. నువ్వే మర్చిపోయి, ఇవాళ మళ్ళీ నాకే తిరిగి చెబుతున్నావు, రిటైరైన తర్వాత నీ  మైండు మైదాపిండి అయిపోయింది, అందుకే ఆశ్రమానికొచ్చి నా దగ్గర ఒక నెలరోజులుండు. మళ్ళీ యంగ్ గా తయారౌతావ్' అన్నాను కోపంగా.

'అన్నీ తెలిసినవాడు నీలాగా పుస్తకాలు వ్రాయాలి గాని, పుస్తకాలు కొనుక్కు పోవడమేంటి? అంటే, ఆ పుస్తకాలన్నీ చదివి, అందులో విషయాలకు కొంత మసాలా కలిపి తన సోకాల్డ్ భక్తులకు చెబుతున్నాడన్నమాట శివరాం సార్?' అన్నాడు రవి.

'ఎవడైనా చేస్తున్నది అదే. చాలామంది మన స్టాల్లో పుస్తకాలు కొనేవాళ్ళు కూడా అదే చేస్తున్నారు. కొంతమంది ఓపెన్ గా మనకావిషయాన్ని చెప్పారు కూడా. అంతెందుకు? గత పదేళ్లుగా మన బ్లాగు నుంచి ఎంత మెటీరియల్ సినిమాలకు, యూట్యూబు వీడియోలకు ఉపయోగపడిందో తెలుసా నీకు?' అడిగాను.

'మరి ఇలాంటి మోసగాళ్ల వలలో పడి ఎంతమంది బకరాలైపోతున్నారో తలుచుకుంటేనే బాధగా ఉంది' అన్నాడు దాదాపు ఏడుపుగొంతుతో.

'మరీ అంత బాధపడకు. వినేవాళ్ళు నిజమనుకుంటారు' అన్నాను.

'అదికాదు. ఈ సమస్యకు పరిష్కారం కావాలి. లేకపోతే నాకు నిద్రపట్టదు. నా సంగతి నీకు తెలుసు కదా?' అన్నాడు.

రవికి ఓవర్ యాంగ్జైటీ బాగా ఎక్కువ. దేనినీ తట్టుకోలేడు. ఒప్పుకోలేడు. తన సంగతి నాకు బాగా తెలుసు. 

'సరే. ఈ సమస్య పరిష్కారానికి నేనొక సలహా చెప్పనా?' అన్నాను.

'చెప్పు'.

'విను. మొగుడి సంగతి పెళ్ళానికి తెలిసినట్లు ఎవరికీ తెలీదు. అవునా?' అన్నాను.

'అవును' ఒప్పుకున్నాడు.

'అలిమేలుమంగమ్మ అవతారాన్నని చెప్పుకుంటూ చాలాకాలంగా ఒక అమ్మ జనానికి బాగా టోపీ వేస్తున్నది. ఆమె ఎవరో నీకూ తెలుసు నాకూ తెలుసు. ఆమెనడిగితే సరి. శివరాం సార్ వెంకటేశ్వరస్వామా? కాదా? తేలికగా చెప్పేస్తుంది. తన మొగుడి సంగతి తనకు తెలుస్తుంది కదా? ఇంతకంటే యాసిడ్ టెస్ట్ ఇంకేముంటుంది?' అన్నాను.

'భలే ఐడియా ! నేను రేపే మంగమ్మమాత దగ్గరికి వెళ్లి ఈ విషయం అడిగేస్తాను. ఆమె శిష్యుడు ఒకాయన నాకు బాగా పరిచయమే' అన్నాడు రవి.

'ఇప్పుడు నాదొక సందేహం?' అన్నాను.

'నీకు సందేహమా? చెప్పు వింటాను' అన్నాడు రవి.

'ఒకవేళ శివరాం సార్ వెంకటేశ్వరస్వామే అని మంగమ్మమాత చెప్పిందనుకో, అప్పుడు మంగమ్మమాతకే ప్రాబ్లమ్ అవుతుంది. వీళ్ళిద్దరూ విడివిడిగా ఎందుకుంటున్నారు? ఉండకూడదు కదా? కాబట్టి ఇద్దరూ అర్జెంటుగా మేరేజి చేసుకోవాలి. కొండపైన సహజీవనం స్టార్ట్ చేయాలి. అలా కాకుండా,  'ఈయన అవతారం కాదు' అని మంగమ్మ మాత చెప్పిందనుకో, అప్పుడు ఈయనకు ప్రాబ్లమ్ వస్తుంది. ఈయన తన షాపు మూసుకోవాల్సి వస్తుంది' అన్నాను.

'ఇప్పుడు నాదొక డౌటు' అన్నాడు.

తను కూడా నాలాగే లా గ్రాడ్యుయేటే. మా బుర్రలన్నీ ఒకే విధంగా ఆలోచిస్తాయి మరి.

'ఏంటది చెప్పు' అడిగా టీ సిప్ చేస్తూ.

'ఏం లేదు? అసలు మంగమ్మమాత అలిమేలుమంగే అని గ్యారంటీ ఏముంది? ఆమె ఇచ్చిన సర్టిఫికెట్ ను మనం వాలిడ్ గా ఎలా తీసుకోగలం? ఆమెనే నకిలీ కావచ్చు కదా?' అన్నాడు రవి. 

'వెరీ గుడ్ పాయింట్. ఆమె అవతారమా కాదా అని శివరాం సార్ నే అడుగుదాం. పెళ్ళాం సంగతి మొగుడికి తెలీదా?' అన్నాను.

'ఇద్దరూ జినైన్ అయితే నువ్వు చెప్పేది ఓకే, కానీ ఇద్దరూ ఫేక్ అయినపుడు ఎలా? ఎవరి మాటను నమ్మాలి?' అడిగాడు.

'అప్పుడు ఇద్దరి మాటనూ నమ్ముదాం. ఇద్దరికీ దగ్గరుండి మేరేజి చేయించి తిరుమల కొండమీదకు తీసికెళ్ళి అక్కడ అడివిలో వదిలేద్దాం. అదొక్కటే ఈ సమస్యకు పరిష్కారం' అన్నాను.

పెద్దగా నవ్వాడు రవి.

'ఎక్కడ వదిలేద్దాం? మొన్నా మధ్య ఒక చిన్నపిల్లను పులి ఎత్తుకుపోయింది చూడు. ఆ ప్రాంతంలో వదిలేద్దామా? ఒక ఏడాదిపాటు ఏ పులీ ఇక భక్తుల జోలికి రాకుండా ఉంటుంది' అన్నాడు.

'అంతే, వెరీ గుడ్ ఐడియా. నువ్వు రేపే శివరాం సార్ ని కలువు. ఆ తర్వాత మంగమ్మమాత దగ్గరికి వెళ్లి ఆ పనిమీదుండు' అన్నాను.

'థాంక్స్ రా. మంచి ఐడియా ఇచ్చావ్. రిటైరయ్యాక పనీ పాటా లేకుండా పోయింది. ఈ పనిమీదుంటాను' అని ఫోన్ పెట్టేశాడు.

నేను ఎదురుగా ఉన్న వెంకటేశ్వరస్వామి ఫోటోకి భక్తిగా నమస్కరించుకుని, 'స్వామీ ఏమి నీ లీల?' అనుకున్నాను.

'నా లీల కాదు నాయనా. ఇదంతా మీ గోల' అంటూ స్వామి స్వరం నా చెవులలో ప్రతిధ్వనించింది.

read more " దొంగ మొగుడు - దొంగ పెళ్ళాం "

9, ఫిబ్రవరి 2024, శుక్రవారం

హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో మా స్టాల్ ప్రారంభం

హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో మా స్టాల్ (నం. 67) ప్రారంభం అయింది.

సందర్శించండిread more " హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో మా స్టాల్ ప్రారంభం "

8, ఫిబ్రవరి 2024, గురువారం

హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో పంచవటి స్టాల్ ను సందర్శించండిహైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ - 2024, ఈ నెల 9 నుంచి 19 వరకూ జరుగుతున్నది. దానిలో పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్ కు స్టాల్ నంబర్ 67 కేటాయించబడింది. ఈ రోజు స్టాల్ ను సెటప్  చేయడం జరిగింది. పుస్తకాలు రేపటినుండి పెట్టబడతాయి. మా పుస్తకాలు కావలసినవారు ఈ స్టాల్ ను సందర్శించండి.

అక్కడ పంచవటి ఫౌండేషన్ సెక్రటరీ శ్రీరామమూర్తిని, ఇతర సభ్యులను మీరు కలుసుకోవచ్చు. సనాతన ధర్మం పైన, ఆధ్యాత్మిక ప్రయాణం పైన, మా సాధనా మార్గం పైన, మీమీ సందేహాలను వారితో మాట్లాడి తీర్చుకోవచ్చు. పంచవటిలో సభ్యత్వాన్ని తీసుకోవచ్చు. మాతో కలసి ప్రయాణం చేయవచ్చు.

హైదరాబాద్ లో ఉన్నవారు, మమ్మల్ని కలవాలని ఎంతోకాలంగా అనుకుంటున్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
read more " హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో పంచవటి స్టాల్ ను సందర్శించండి "

ఉడుంభిళా హోమం చేస్తున్నాం. చూచి తరించండి.

'నమస్తే  గురూజి. ఫలానా స్వామి ఈ మధ్యనే పెద్ద యాగం ఒకటి చేశాడు' అన్నాడు అన్నామలై భక్తితో బద్దలైపోతూ.

అన్నామలై అంటే నా శిష్యుడే. తమిళనాడు బీజేపీ లీడర్ అనుకునేరు. కాదు. ఇతని పేరు సుబ్బారావు. అన్నామలై అని పేరు మార్చుకున్నాడు. ఎందుకో  నాకైతే తెలీదు. పేరు మార్చుకున్నప్పటినుంచీ తిరువణ్ణామలై లో ఉంటున్నాడు.  అంతకుముందు ఉద్యోగం చేసేవాడు, 

'ఎన్నాళ్ళు చేస్తావ్ వెధవ ఉద్యోగం? మానెయ్' అని నేనే చెప్పాను. మానేశాడు.

నేను మాత్రం చక్కగా రిటైరయ్యేదాకా ఉద్యోగం వెలగబెట్టాను. కానీ అందర్నీ మాత్రం ఉద్యోగాలు మానిపిస్తుంటాను. అది నా హాబీ. 

' ఆ తర్వాతేం చెయ్యాలి? అని తనూ అడగలేదు.

తను అడగలేదు గనుక నేనూ చెప్పలేదు.

ప్రస్తుతం తిరువణ్ణామలై లో కొండకి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాడు. మిగతా సమయంలో ఏం చేస్తాడో నేనడగను. తను చెప్పడు.

మన సబ్జెక్ట్ లోకి వచ్చేద్దాం.

'ఏంటి స్వామీజీ హోమం చేశాడా? అందులో వింతేముంది? గౌరవనీయులైన నేటి స్వామీజీలు చెయ్యగలిగింది అంతే కదా. చెయ్యనీ' అన్నాను.

'దానివల్ల లోకకల్యాణం అవుతుందని ఆయన భక్తులందరూ తెగ నమ్ముతున్నారు' అన్నాడు.

'ఇప్పటికి అయిన కల్యాణాలు చాల్లే. కొత్త కొత్త కల్యాణాలెందుకు?' అన్నాను.

'అదేంటి గురూజీ. అలా తేలిగ్గా తీసేశారు. కొన్ని కోట్ల ఖర్చు అయింది  ఆ హోమానికి' అన్నాడు కోపంగా.

'ఏం నీ చెయ్యి కూడా కాలిందా హోమంలో?' అడిగాను.

'ఆబ్బె లేదు. నా దగ్గరేముంది బూడిద?' అన్నాడు అన్నగారి స్టైల్లో.

'పోనీ అంతంత పెద్ద మాటలు ఎందుకులేగాని. ఆ హోమంతో హమాస్-ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపమను. ఆ తర్వాత లోకకల్యాణం సంగతి చూడొచ్చు' అన్నాను.

' కళ్యాణం చేయడం తేలిక, యుద్ధం ఆపడం కంటే' అన్నాడు సీరియస్ గా.

'అంతేలే. ఆ తర్వాత ఎలాగూ మొదలయ్యేది యుద్ధమేగా' అన్నాను.

'సరే గురూజీ. ఇదంతా ఎందుకు? మనం కూడా ఒక పెద్ద హోమం చేద్దాం' అన్నాడు.

'ఎవరో వాత పెట్టుకుంటే మనం కూడా పెట్టుకోవాలా నీకసలు బుద్దుందా?' అరిచాను కోపంగా.

'కాదు కాదు గురూజీ. ప్లీజ్. మనం పాపులర్ కావాలంటే ప్రస్తుతం ఇదొక్కటేమార్గం' అన్నాడు.

'ముందు పాపులర్, ఆ తర్వాత బాటా, ఆ పైన అంబాసిడర్. ఈ గోల మనకెందుకు చెప్పు. ఏం పాపులర్ కాకపోతే నష్టం ఏంటి?' అన్నాను విసుగ్గా.

'ప్లీజ్. నాకోసం కాదనకండి. కావాలంటే మీ పేరుమీద  ఇంకొక నాలుగు ప్రదక్షిణాలు చేస్తా కొండకి' అన్నాడు ఉక్రోషంగా.

నిజంగా చేస్తాడేమో అని తెగ భయమేసింది. ఆ పాపం నాకెందుకులే అని ఇలా చెప్పాను.

'సరే. అయితే విను మనం చెయ్యబోయే హోమం మామూలుగా ఉండదు. కళ్ళు గిర్రున తిరగాల్సిందే' అన్నాను.

'ఎవరికీ?' అడిగాడు అనుమానంగా.

'చేసేవాళ్ళకి. ఎందుకంటే హోమం చేసిన పదిరోజులూ కటిక ఉపవాసం ఉండాలి. నీళ్లు మాత్రం బిందెలు బిందెలు తాగొచ్చు, అయితే, బాత్రూంకి మాత్రం పోకూడదు' అన్నాను.

'అప్పుడు కళ్ళు తిరగడం ఒక్కటే జరిగి ఆగదేమో?' అన్నాడు.

'ఏం జరిగినా సిద్ధపడేవాడే ఇందులోకి దిగాలి' అన్నాను.

' ఒకే. మరి చూసేవాళ్ళకి ఏమౌతుంది?' అడిగాడు. 

'ఇదేం హోమమో తెలిస్తే వాళ్ళకీ తిరుగుతాయ్ కళ్ళు' అన్నాను.

'త్వరగా చెప్పండి గురూజీ. సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నా' పెద్దగా అరిచాడు.

'దానిపేరు ఉడుంభిళా హోమం' అన్నాను.

'ఆమ్మో. వినడానికే భయమేస్తోంది. ఏదో క్షుద్రహోమంలాగా ఉందే?' భయపడ్డాడు.

'అర్భకుడా ! పేరుకే భయపడేవాడివి, ఇక డొనేషన్స్ ఎలా కలెక్ట్ చేస్తావురా?' గర్జించాను.

'డొనేషన్సా? అదేంటి గురూజీ?' నసిగాడు అయోమయంగా.

'మరి ఏమీ లేకుండా హోమం ఎలా అవుతుందిరా అమాయకుడా? అందులో ఇది ఆషామాషీ హోమం కాదు.  ఉడుంభిళా హోమం. పదికోట్లు అవుతుంది' అన్నాను.

'ఏంటి డబ్బులే?' గుడ్లు తేలేశాడు.

'కాదు గులకరాళ్లు' అన్నా నవ్వుతూ. 

'అలా కాదు గురూజీ. ఇంకో మాట చెప్పండి. ఇప్పుడే టీవీలో ఆ హోమం చూశాను. నేను తట్టుకోలేను. ఎలాగైనా హోమం చేసే తీరాలి' బ్రతిమాలాడు. 

'ఏంటి బిడ్డా బేరం చేస్తున్నావ్? సంతమార్కెట్లో సన్నజాజులు అమ్ముకునేదానిలాగా కనపడుతున్నానా? బేరాల్లేవ్. పదికోట్లు అంతే. కావాలంటే కమీషన్ క్రింద ఒకటి తీస్కో' అన్నాను కోపంగా.

'సరే గురూజీ. ఇది బాగుంది. ఆ డబ్బుతో ఒక కారు కొనుక్కుని కార్లో చేస్తా ప్రదక్షిణాలు' అన్నాడు సంతోషంగా.

'డబ్బుకోసమే కదురా నీ ప్రదక్షిణాలు. అది వచ్చాక కూడా మళ్ళీ అవేనా?  ఎదురుగా ఉంటే, ఒకే కిక్కుతో కిర్గిస్థాన్ పంపి ఉండేవాడిని నిన్ను'  అనేశాను.

' సర్లే ఏదో ఒకటి చేసుకోండి. ఇంతకీ మన హోమం వివరాలు చెప్పండి' అడిగాడు.

'విను బిడ్డా. ఈ హోమాన్ని రామాయణకాలంలో కుంభకర్ణుడు చేశాడు' అన్నాను.

'ఆ తర్వాత తిని గుర్రు పెట్టాడా?' అడిగాడు మహా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుని.

'మూర్ఖుడా ! ఎగతాళి చెయ్యకు. తాళి తెగిపోతుంది' అన్నాను.

'ఎవరిదీ? నాదా, కుంభకర్ణుడిదా?' అడిగాడు రోషంగా.

'ఆవేశంలో జెండర్స్ మర్చిపోతున్నావ్ బిడ్డా. మీది కాదు, మీ ఆడోళ్ళది' అన్నాను. 

'అమ్మో గురూజీ. వద్దు శపించకండి. చెప్పండి' అడిగాడు వినయంగా.

'అలా రా దారికి. ఆ కాలంలో కుంభకర్ణుడు చేశాడు. ఇప్పుడు మనం చేస్తున్నాం. మధ్యలో ఎవరూ లేరు' అన్నాను.

'ఇంద్రజిత్తు నికుంభిలా హోమం చేశాడని రామాయణంలో చదివాము. మరి కుంభకర్ణుడు ఇలాంటి హోమం చేసినట్టు ఎక్కడా లేదే?' అన్నాడు అనుమానంగా.

'ఏంటి అనుమానిస్తున్నావా? చేశాడు. కానీ, వాల్మీకి వ్రాయడం మర్చిపోయాడు. అలా మర్చిపోయానని నిన్న రాత్రి నాకు కలలోకొచ్చి చెప్పాడు. ఎన్నని గుర్తుపెట్టుకోగలడు పెద్ద వయసులో?' అరిచాను కోపంగా.

'వాల్మీకి మర్చిపోయాడా? భలే ఉంది గురూజీ. అయినా, ఇలాంటి హోమాలు ఎందుకు గురూజీ? కాస్త సాత్వికంగా  మంచిగా ఉండేవి చెయ్యవచ్చు కదా ? రాక్షసులు చేసినవి ఎందుకు?' అడిగాడు భయంగా.

'దేవతల రోజులు పోయాయి బిడ్డా.  ఇప్పుడు అందరూ రాక్షసులే. కనుక రాక్షస హోమాలే చెయ్యాలి. నేటి కాలంలో భజనలు, పూజలు, హోమాలు, ప్రార్ధనలు ఏవైనా రాత్రిపూటే బిడ్డా.  మన పురాణాల ప్రకారం రాత్రిళ్ళు పూజలు చేసేది రాక్షసులే. అందుకే నేటి రాక్షసకాలానికి రాక్షసహోమాలే కావాలి గాని, సాత్వికహోమాలు పనికిరావు.  సాత్విక హోమాలకు డొనేషన్లు రావు బిడ్డా. అందుకే ఇలాంటి భయంకరహోమాలు చెయ్యాలి. జనాన్ని భయపెట్టాలి. అప్పుడే డబ్బులు రాల్తాయి. అవి కూడా మాలాంటి సర్వసంగపరిత్యాగులైన స్వామీజీలే చెయ్యాలి, వాటికి డొనేషన్లు ఇచ్చి మీలాంటివారు తరించాలి. మేము అన్నీ వదిలేసి సన్యాసం స్వీకరించింది ఎందుకు? ఇలాంటి హోమాలు చెయ్యడానికే కదా ! అంతే, మారు మాట్లాడకు' అన్నాను వీరావేశంతో ఊగిపోతూ.

'సరే స్వామీ. మీ అంతటివారు చెప్పాక తప్పుతుందా? శాంతించండి. ఇంతకీ ఏ దేవతకు ఈ హోమం?' అడిగాడు.

'ఏ దేవతేమిట్రా మూర్ఖుడా? ఉడుంభిళా దేవత. పేరులోనే ఉందిగా' అన్నాను.

'ఆమె ఎలా ఉంటుంది గురూజీ? ' అన్నాడు.

'పక్కా నాటు క్షుద్రదేవతలాగా ఉంటుంది. నక్క మొహం, కోతి శరీరం, పులిగోళ్ళు, ఏనుగు తొండం, డైనోసార్ తోక, ఒంటినిండా ఎలుగుబంటి బొచ్చు, పదికాళ్ళు, నలభై చేతులు ఉంటాయి బిడ్డా' అన్నాను.

'ఎవడు సార్ ఈ ఆకారాన్ని మొదటిసారి ఊహించిన దరిద్రుడు? వాడి మైండు అంత కుళ్లిపోయిందన్నమాట?' అడిగాడు అన్నామలై.

'అది నేనే' అని చెప్పడానికి ప్రిస్టేజి అడ్డొచ్చింది.

'ఏమో మరి? నాకేం తెలుసు? మన శాస్త్రాలలో అలా చెప్పబడి ఉంది. ఏ శాస్త్రాలు? అని మాత్రం అడక్కు. నాకూ తెలీదు. ఏదేమైనా మనం హోమం చేసే తీరాలి. నువ్వు పదికోట్ల పనిమీదుండు' అన్నాను తెలివిగా.

'అదికాదు గురూజీ. చక్కగా రాముడు, కృష్ణుడు, శివుడు, అమ్మవారు ఇలాంటి శాంతస్వరూపాలు మనకు ఉండగా, ఇటువంటి క్షుద్ర ఆకారాలున్న దేవతల పూజలు, హోమాలు ఎందుకు గురూజీ? నాకు భయమేస్తోంది. నేను చెయ్యను' అన్నాడు.

'భయపడుతున్నావా? బద్దలైపోతావ్ జాగర్త, మన దగ్గరకి రావడమే గాని, పోవడం నీ చేతుల్లో లేదు బిడ్డా. ఇంత చేతకానివాడివి నన్నెందుకు నిద్రలేపావు మరి? నువ్వు చేసి తీరాల్సిందే.' ఉరిమాను.

'నిద్రలేపడమేంటి గురూజీ?' అడిగాడు భయంభయంగా.

'అంతేమరి. నన్ను లేపడం,  ఉడుంభిళను లేపడం రెండూ ఒకటే, ఆమె నాలోనే ఉందిరా. లేచాక మాకు శాంతి జరగాల్సిందే' అన్నాను. 

'సరే గురూజీ. మీ భయంతో ఒప్పుకుంటున్నాను. ఇంకొక్క సందేహం' అడిగాడు.

' త్వరగా ఏడువ్' అన్నాను.

'ఈ హోమం చేస్తే ఏం జరుగుతుంది?' అడిగాడు భయంభయంగా.

'ఏం జరిగేదేంటిరా అమాయక శిఖామణి? లోకకల్యాణం జరుగుతుంది' అన్నాను యమా సీరియస్ గా.

'ఎన్నిసార్లు జరుగుతుంది స్వామీ లోకకల్యాణం?' అడిగాడు తెగించి.

'వెధవ కళ్యాణమేగా ఎన్నిసార్లైనా జరుగుతుంది' అన్నాను.

'అదికాదు. గురూజీ. ఎవరేం  చేసినా, 'లోకకల్యాణం కోసమే' అంటున్నారు. అదేమో జరుగుతున్నట్టు ఎక్కడా కనపడటం లేదు. 'ఏసు త్వరగా వచ్చుచున్నాడు' అని కిరస్తానీలు రెండు వేల ఏళ్ళనుంచీ చెబుతున్నట్లే ఇదికూడా ఉంది. ఆయనేమో అడ్రస్ లేడు. అదేవిధంగా,  అసలు లోకకల్యాణం అనేది ఉందా?' అన్నాడు ఏడుస్తూ. 

'పాపం ఇంతగా ప్రాధేయపడుతున్నాడు, ఎక్కువగా ఏడిపించడం మంచిది కాదు, నిజం చెప్పేద్దాం' అనిపించింది.

గొంతు  తగ్గించి, ' చూడు బిడ్డా. అసలు నిజం ఇప్పుడు చెబుతున్నా విను. లోకకల్యాణం కాదు, లోటస్ పాండూ  కాదు. నీకూ నాకూ అవుతుంది కళ్యాణం' అన్నాను.

షాకయ్యాడు ఆ మాటకి.

'అదేంటి గురూజీ. ఈ మాట చాలా దరిద్రంగా ఉంది' అన్నాడు.

అతని డౌటు నాకర్ధమైంది.

'అది కాదురా దరిద్రుడా ! నీకూ నాకూ విడివిడిగా అవుతుంది. అంటే మన పంట పండుతుందని అర్ధం. ప్రదక్షిణాలు ఎక్కువై నీ మతి మలేషియా అయిపోయింది. హోమానికి మహా అయితే నాలుగు కోట్లు అవుతుంది. మిగతా ఆరు కోట్లు మనకేగా. మన లైఫు సెటిలైపోతుంది. లేకపోతే, మనల్ని నమ్ముకున్నవాళ్ళకి వేరే ఆశ్రమాలు కట్టించి ఇవ్వవచ్చు. అలా జరుగుతుందన్నమాట మన కళ్యాణం' అన్నాను.

'ఆమ్మో ఉడుంభిళా హోమంలో ఇంత ఉడుంపట్టు ఉందన్న మాట" అన్నాడు.

'ఉందో లేదో నువ్వే చూద్దువుగాని, ముందు డొనేషన్ల పని మీదుండు' అన్నాను.

'ఓకే గురూజీ. కానీ నా వాటా ఒక కోటి సరిపోదు. ఇంకోటి కూడా చూడండి' అన్నాడు.

'సర్లే. ఏదోకటి ఏడుద్దువుగాని, ముందిది ఏడువ్' అన్నాను.

అన్నామలై ఫోన్ పెట్టేశాడు.

నేను ఈజీచైర్లో వెనక్కు వాలి, 'జై ఉడుంభిళా' అని అరుస్తూ తృప్తిగా కళ్ళుమూసుకున్నాను.

read more " ఉడుంభిళా హోమం చేస్తున్నాం. చూచి తరించండి. "

29, జనవరి 2024, సోమవారం

రెండవ స్పిరిట్యువల్ రిట్రీట్ విజయవంతం అయింది
ముందుగా ప్లాన్ చేసినట్లు, ఈ నెల 26, 27, 28 తేదీలలో మా ఆశ్రమంలో జరిగిన ఆధ్యాత్మిక సాధనా సమ్మేళనం విజయవంతం అయింది.

పాతవారితో బాటుగా, చాలామంది క్రొత్తవాళ్ళు కూడా ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు. మా సాధనామార్గాన్ని వారికి వివరించడం జరిగింది. మళ్ళీ ఏప్రియల్ లో జరుగబోయే రిట్రీట్ లో వారు డైరెక్ట్ గా పాల్గొనవచ్చు. ఈ లోపల వారు ఈ క్రింది పుస్తకాలు చదివి, అర్ధం చేసుకుని, ఆ తరువాత ఏప్రియల్ రిట్రీట్ కు రావలసి ఉంటుంది.

అదే విధంగా, మమ్మల్ని సంప్రదిస్తున్న క్రొత్తవారందరికీ కూడా ఇదే సూచన చేస్తున్నాము.  ఇప్పటివరకూ నేను వ్రాసినవి 63 పుస్తకాలున్నాయి. వాటినుంచి కనీసం ఈ నాలుగు పుస్తకాలను చదవండి. మా మార్గం స్పష్టంగా అర్ధమౌతుంది. ఆ తరువాత మీరు రిట్రీట్స్ కు రావచ్చు. దీక్షాస్వీకారం చెయ్యవచ్చు. మా సాధనామార్గంలో నడవవచ్చు. ధన్యత్వాన్ని మీకు మీరే రుచి చూడవచ్చు.

1. Musings లేదా వెలుగు దారులు

2. శ్రీవిద్యా రహస్యం

3. లలితా సహస్రనామ రహస్యార్థ ప్రదీపిక

4. తారాస్తోత్రం

మా జ్యోతిష్యవిధానాన్ని క్రొత్తవారికి పరిచయం చేయడం జరిగింది. కానీ, 'డబ్బు సంపాదనకు దీనిని వాడకూడదు' అని స్పష్టంగా వారికి చెప్పడం కూడా జరిగింది.

గమనించండి.

read more " రెండవ స్పిరిట్యువల్ రిట్రీట్ విజయవంతం అయింది "

22, జనవరి 2024, సోమవారం

500 ఏళ్ల బానిసత్వం నుండి విముక్తి


ఈరోజు

- భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించవలసిన రోజు

 - 500 ఏళ్ల బానిసత్వం నుండి విముక్తి  లభించిన రోజు

- దౌర్జన్యపు దందా అంతమైన రోజు

- రాక్షసత్వం అంతరించిన రోజు

- దైవత్వం కళ్ళు తెరిచినరోజు

- అయోధ్యలో రామాలయం ద్వారాలు తెరుచుకున్న రోజు

- శ్రీరాముడు మళ్ళీ అయోధ్యా ప్రవేశం చేసిన రోజు

- ఎందరో దేశభక్తుల, దైవభక్తుల కలలు పండిన రోజు

- తమ ప్రాణాలను బలిచ్చిన ఎందరో కరసేవకుల కలలు నిజమైన రోజు

- దేశానికంతటికీ పండుగరోజు

---------------------------------------

మనం ఎవరినీ  మతాలు మార్చం. కానీ మన మతం జోలికొస్తే ఊరుకోము.

మనం ఎవరినీ విమర్శించము. కానీ మనల్ని విమర్శిస్తే ఊరుకోము.

ఇతర దేశాలలో మనం జోక్యం చేసుకోము.

మన దేశంలో ఇతరులు జోక్యం చేసుకుంటే సహించం.

-------------------------------------

హిందువులు సంఘటితం అయినప్పుడే భారతదేశం శాంతిగా ఉంటుంది.  

భారతదేశం హిందూదేశం అయినప్పుడే ప్రపంచం శాంతిగా ఉంటుంది.

-----------------------------------

ఈ రోజున మొదలైన చైతన్యం ఎప్పటికీ ఇలాగే ఉండాలి.

అయోధ్యలో ఈనాడు వెలిగిన దివ్యజ్యోతి ఎప్పటికీ ప్రకాశిస్తూనే ఉండాలి.

లోకానికి వెలుగును వెదజల్లుతూనే ఉండాలి.

ఆ వెలుగులో మానవజాతి దివ్యత్వంవైపు ప్రయాణించాలి.

భారతదేశం ప్రపంచానికే ఆచార్యత్వం వహించాలి.

-----------------------------------
కోట్లాది హిందువుల కలలు నిజం కావాలి.

సనాతనధర్మ మార్గంలో మానవజాతి తనను తాను దిద్దుకోవాలి

దరిద్రం, రోగం, బాధ, అణచివేత, దౌర్జన్యం, అసహనం, భూమినుంచి మాయం కావాలి.

ఈ భూమి స్వర్గం కావాలి.

వేదఋషుల స్వప్నం సాకారం కావాలి.

-----------------------------------
ఈ సంకల్పాలకు అందరం కట్టుబడి ఉందాం.

వాటిని సాకారం చేసుకునే దిశగా అడుగులేద్దాం.

----------------------------------

ఈ శుభసందర్భంలో, సనాతనధర్మానికి మేము చేస్తున్న చిన్నసేవగా, అధర్వణ వేదాంతర్గతమైన 'రామతాపిని ఉపనిషత్' కు నా తెలుగు వ్యాఖ్యానమును ఉచిత 'ఈ-బుక్'  గా విడుదల చేస్తున్నాము. త్వరలోనే దీని ఇంగ్లిష్ తర్జుమా మరియు ప్రింట్ పుస్తకాలు కూడా ఉచితంగా లభిస్తాయి.

శ్రీరామతత్త్వాన్ని, రామనామ మహిమను, రామభక్తి విశిష్టతను విపులముగా వివరించిన గ్రంధం ఇది.

ఇది నా కలం నుండి వెలువడుతున్న 63 వ పుస్తకం. 

డౌన్లోడ్ చేసుకోండి. చదవండి. శ్రీరాముని తత్త్వాన్ని అర్ధం చేసుకోండి. ఆయనకు భక్తితో మ్రొక్కండి, పూజించండి, ధ్యానించండి. ధన్యత్వాన్ని అందుకోండి.

ఈ లింక్ లో పుస్తకాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.


జై శ్రీరామ్ ! జై భరతమాత ! జై సనాతన ధర్మ !
read more " 500 ఏళ్ల బానిసత్వం నుండి విముక్తి "