తంత్ర/ పురాణయుగంలో హిందూ, బౌద్ధ, జైన తంత్రాలు అటూ ఇటూగా కలిసే ఉద్భవించాయని ఇంతకు ముందు చెప్పాను. కనుక వీటిలో ఏది ముందు ఏది తర్వాత అనే విషయాన్ని నిర్దారించడం అంత సులువు కాకపోగా, ఆ ప్రయత్నం కూడా అంత అర్ధవంతం కాదు. ఎవరు ముందైనా, ఎవరు వెనుకైనా, ఆ తంత్రగ్రంధాలలో చెప్పబడిన సాధనలు చేసి సిద్ధి పొందటం అనేది ముఖ్యంగాని ముందు వెనుకలు నిర్ణయించడం కాదు. కాకుంటే వాటిల్లో వాడబడిన కొన్నికొన్ని పదాల వల్ల అప్పుడప్పుడు ఆయా తంత్రాల మూలాలు మనకు అర్ధమౌతూ ఉంటాయి.
హిందూతంత్రాలలో చిన్నమస్తా దేవతకు సంబంధించిన గాధలు మనకు కొన్నిచోట్ల ముఖ్యంగా దర్శనమిస్తాయి. ఒకటి దేవీభాగవత పురాణం, రెండు ప్రానతోషిణి తంత్రం, మూడు ముండమాలా తంత్రం, నాలుగు గుహ్యాతిగుహ్య తంత్రం,అయిదు తోడల తంత్రం. వీటన్నిటిలోనూ ఈమె అమ్మవారి వివిధ రూపాలైన దశమహావిద్యలలో ఒకరుగా భావించబడింది.
కాళీ, తారా, షోడశీ, భువనేశ్వరి, భైరవి, ఛిన్నమస్త, ధూమవతి, బగళాముఖి, మాతంగి, కమలాత్మిక - అనే పదిమంది, తంత్ర ప్రసిద్ధలైన దశమహావిద్యలని అందరికీ తెలిసినదే కదా !!
దేవీ భాగవతంలో అయితే ఈమెకధ సతీదేవి కధతో ముడిపడి ఉంటుంది. తన తండ్రియైన దక్షుడు చేస్తున్న యజ్ఞానికి, పిలవకపోయినా సరే, తానూ వెళతానని సతీదేవి శివుణ్ణి అనుమతి అడుగుతుంది. కానీ పిలవని పేరంటానికి ఎందుకని పరమేశ్వరుడు వద్దంటాడు. ఆయన్ను ఒప్పించడానికి ఆయన ఎటు పోతే అటు సతీదేవి ఒక్కొక్క రూపంతో ప్రత్యక్షమై దశదిశలలో (ఎనిమిది దిక్కులు, పైన, క్రింద వెరసి పది దిక్కులు) ఆయన్ను ఆటంకపరుస్తుంది. ఈ రూపాలే దశమహావిద్యలయ్యాయని ఒక గాధ ఈ పురాణంలో ఉన్నది.
ఛిన్నమస్తా స్వరూపం భయంకరంగా ఉన్నప్పటికీ దానిలో చాలా నిగూఢమైన అర్ధాలున్నాయని ఇంతకు ముందే చెప్పాను. తన తలను తాను ఖండించుకోవడం త్యాగానికి చిహ్నం. అలాంటి అత్యున్నతమైన త్యాగం లేనిదే ఎవరూ తంత్రమార్గంలో సిద్ధిని పొందలేరు. సరదాగా సాధన చేసినవారికి దురదే మిగులుతుంది గాని అసలైన సిద్ది దక్కదు. దానికి తన సర్వస్వాన్నీ పణంగా పెట్టగలిగిన ధీరత్వం ఉండాలని చెప్పడమే ఈ తల నరుక్కోవడంలోని అర్ధం.
దైవం కోసం తన సమస్త సుఖాలనూ చివరకు తన ప్రాణాన్ని కూడా త్యాగం చెయ్యడమనే రహస్యార్ధం ఇందులో ఇమిడి ఉన్నది. అయితే తన తలను ఖండించుకున్నప్పటికీ ఆమె చనిపోలేదు. ఆమె శవం కాదు. శక్తి స్వరూపమైన దేవత. కనుక, తల లేకున్నప్పటికీ ఆమె సజీవంగానే ఉన్నది. దీనికి తార్కాణంగానే ఖండింపబడిన ఆమె తల ఆమె చేతిలోనే నవ్వుతూ మనకు కనిపిస్తుంది. అంటే యోగసమాధిలో స్వచ్చందంగా శరీరాన్ని వదిలేసే ప్రక్రియకు ఈమె సంకేతంగా నిలుస్తున్నది. కానీ అది ఆత్మహత్యా కాదు, అందరికీ తెలిసిన మామూలు మరణమూ కాదు. మామూలు మనుషులకు మరణం వస్తుంది. కానీ యోగసమాధిలో దేహత్యాగం చేసే యోగులది మరణం కాదు. వాళ్ళు కర్మబద్ధులైన మామూలు మనుషుల లాగా నరకానికి పోరు. వారిదైన ఆత్మస్థితిలో వారు వెలుగులోనే నిలిచి ఉంటారు.
తన రక్తాన్ని తానే త్రాగడంలో కూడా అంతరార్ధం ఉన్నది. మన సనాతనధర్మం ప్రకారం ఈ సృష్టి అంతా దైవంచే సృష్టించబడింది. ఇతర మతాలు కూడా ఇదే చెబుతాయి. కానీ మనకూ వారికీ ప్రధానమైన భేదం ఏమంటే - దేవుడు ఎక్కడో మేఘాల చాటున కూచుని కుమ్మరి కుండలు చేసినట్లు ఈ సృష్టి చేసి ఆ తర్వాత హాయిగా రెస్టు తీసుకుంటున్నాడని అవి అంటాయి. బుర్రలేని ఎడారి మతాలకు అంతకంటే ఏం అర్ధమౌతుంది?
మనం ఏం చెప్తామంటే - సృష్టి చేసిందీ దైవమే. సృష్టి కూడా దైవమే - అంటాం. సృష్టిని తననుంచే దైవం చేసింది. తానే సృష్టిగా రూపాంతరం చెందింది. - అని మనమంటాం.
తైత్తిరీయ ఉపనిషత్తును చూడండి.
ఇదం సర్వమసృజత|| యదిదం కించ || తత్సృష్ట్వా తదేవానుప్రావిశత్ || తదనుప్రవిశ్య || సచ్చత్యచ్చాభవత్ ||
దైవం ఈ సర్వాన్నీ సృష్టించి ఆ సృష్టిలో తానే ప్రవేశించిందని వేదం ఇక్కడ అంటున్నది. సృష్టి వేరు దైవం వేరు అని వేదం చెప్పలేదు. సృష్టే దైవస్వరూపమని వేదం ఉపదేశించింది.నేడు మన ధర్మాన్ని విమర్శించే పరాయి దోపిడీ మతాలన్నీ ఈ భావన దరిదాపుల్లోకి కూడా రాలేవు.
సృష్టి చేసిన దేవుడు ఆ సృష్టిని దోచుకొమ్మని కొందరికి ప్రత్యేక అధికారాలిచ్చాడని అబద్దాలు చెబుతూ క్రైస్తవం, ఇస్లాం వంటి ఎడారి మతాలు బలహీనులను, శాంతిగా ఉండేవారిని దశాబ్దాల పాటు యధేచ్చగా దోచుకున్నాయి. భూమిని రక్తంతో తడిపాయి. కానీ అదే సృష్టిగా దేవుడే ఉన్నాడని నమ్మిన మనం ఎవరినీ మతహింసకు గురిచేయ్యలేదు. మత మార్పిడులూ చెయ్యలేదు. మతం పేరుతో ఎవరినీ దోచుకోలేదు. 'శాంతి శాంతి' అని చెబుతూ ఈ రెండు మతాలూ చేసినట్టు అరాచకాలూ చెయ్యలేదు.
సృష్టిని దేవుడు చేసి విడిగా ఎక్కడో ఉన్నాడు అని గుడ్డిగా నమ్మడానికీ, సృష్టే దేవుడు అన్న సత్యాన్ని గ్రహించడానికీ మధ్యన ఇంత భేదం ఉంది మరి !!
జిల్లెళ్ళమూడి అమ్మగారు కూడా ఇదే మాటను ఎన్నో సార్లు తేలిక మాటల్లో చెప్పారు.
'చీమలో దోమలో కూడా దేవుడున్నాడామ్మా?' అన్న ప్రశ్నకు అమ్మ ఇలా జవాబిచ్చారు.
'చీమలో దోమలో కాదు నాన్నా, చీమగా దోమగా ఉన్నాడు' అని అమ్మ ఎంతో గొప్ప అర్ధాన్ని చిన్న మాటల్లో ఇమిడ్చి చెప్పారు.
ఇకపోతే ఇదే ఉపనిషత్తు, సృష్టి మొత్తం ఆహారమే అంటుంది. ఈ సృష్టిలో ఒకటి ఇంకొకదానికి ఆహారమౌతున్నది. ప్రతి ప్రాణీ ఇంకొక ప్రాణికి ఆహారం అయిపోతున్నది. అలా ఇంకొక జీవికి ఆహారంగా మారని ప్రాణి అంటూ ఏదీ లేదు. ఉండదు కూడా. అలాగని అన్ని ప్రాణులూ మిగతా అన్ని ప్రాణులనూ తినొచ్చని ఉద్దేశ్యం కాదు. బుద్ధిలేని జంతువులు చేసే పనిని బుద్ధి ఉన్న మనిషి చెయ్యకూడదు. అలా చేస్తే ఆ జంతువులకూ మనిషికీ తేడా ఉండదు. జంతువుకు చాయిస్ లేదు కనుక దానికి దొరికిన జంతువును అది తింటుంది. ఏదైనా జంతువుకు చాయిస్ ఉన్నప్పుడు అది వాటిల్లో ఉత్తమమైన ఆహారాన్నే తింటుంది గాని అధమమైన ఆహారాన్ని తినదు. ఈ విషయం జంతు పరిశోధకులకు తెలుసు.
కానీ మనిషికి అలా కాదు. వాడికి బోలెడంత చాయిస్ ఉన్నది. కనుక అతను విచక్షణను ఉపయోగించాలి. మనిషి శరీర తత్వానికి సరిపోయే తిండిని అతను తినాలి. కానీ నేటి మనిషి బలం బలం అంటూ నానా జంతువుల మాంసాలూ తిని చివరికి కేన్సర్ తెచ్చుకుని అఘోరిస్తున్నాడు. లేదా మితిమీరిన కొవ్వుతో రక్తనాళాలు మూసుకుని పోయి గుండెజబ్బులకు గురౌతున్నాడు. ప్రోటీన్ కావాలంటే శాకాహారంలో కూడా అది ఉంది. దానికోసం ఆవుల్నీ, ఎద్దుల్నీ, కుక్కల్నీ, నక్కల్నీ, పందుల్నీ, అడ్డమైన గడ్డినీ తినాల్సిన పని లేదు. ఈ విషయమై ఇంకో ప్రత్యేక పోస్టు వ్రాస్తాను.
ఈ రకంగా విచక్షణను మరచి, పశువులా అన్నింటినీ తినే మనిషి చివరకు తానే పంచభూతాలకు ఆహారమౌతున్నాడు. అయితే మట్టిలో కలుస్తున్నాడు. లేదా అగ్నికి ఆహుతౌతున్నాడు. లేదా జలంలో అర్పణమై జలచరాలకు ఆహారంగా మారుతున్నాడు. లేదా పార్శీల వంటి కొన్ని జాతులలో లాగా 'దఖ్మా' అనే చోట పక్షులకు ఆహారంగా మారుతున్నాడు. కనుక సృష్టి అంతా అన్నమే అంటుంది వేదం. కనుకనే అన్నం పరబ్రహ్మ స్వరూపమయ్యింది. అన్నం అంటే బియ్యంతో వండిన 'అన్నం' అనే అర్ధం గాకుండా, ఆహారం అనే విస్తృతార్ధంలో తీసుకోవాలి.
అన్నం గురించి ఇదే ఉపనిషత్తు ఏమంటున్నదో తెలుసుకుందాం.
అన్నాద్వై ప్రజా ప్రజాయన్తే || యా: కాశ్చ పృధివీం శ్రితా: || అధో అన్నేనైవ జీవంతి || అధైనదపి యంత్యంతత: || అన్నం హి భూతానాం జ్యేష్టం || తస్మాత్ సర్వౌషధముచ్యతే || సర్వం వై తేన్నమాప్నువంతి || యేన్నం బ్రహ్మోపాసతే || అన్నం హి భూతానాం జేష్టం|| తస్మాత్ సర్వౌషధముచ్యతే || అన్నాద్భూతాని జాయన్తే || జాతాన్యన్నేన వర్ధంతే || అధ్యతేత్తి చ భూతాని|| తస్మాదన్నం తదుచ్యత ఇతి ||
"సమస్త జీవులకూ అన్నమే మూలం. జీవులన్నీ అన్నంవల్లనే పుట్టి, అన్నంతోనే పెరిగి చివరకు అన్నంగానే మారుతున్నవి. అందులోనే లయమౌతున్నవి.కనుక అన్నమునే బ్రహ్మముగా ఉపాసించు". అంటుంది వేదం ఇక్కడ.
కనుక సృష్టి అంతా చూస్తే, 'తినడం' అన్న ప్రక్రియ తప్ప ఇంకోటి లేదు. ప్రతి అనుభవమూ ఒక విధమైన 'తినడమే'.ఒక విధంగా ఆహారాన్ని స్వీకరించడమే. ఒక విధమైన తృప్తిని పొందటమే. ప్రాణులన్నీ ప్రాణులను తింటున్నాయి. కాలమేమో అన్ని ప్రాణులనూ అది తింటోంది. విశ్వమంతా ఈ రకమైన 'ఫుడ్ సైకిల్' గా, వేదఋషులకు కనిపించింది. దీనినే దైవం యొక్క ఒక స్వరూపంగా వారు దర్శించారు. ఈ భావననే ఈ మంత్రాలలో వారు చెప్పారు.
అంటే - తినేది తినబడేది అన్నీ దైవమే అనిన అద్వైత భావన ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే దైవం అన్నీ తానే అయింది గనుక, తనను తానే తింటున్నది, తన రక్తాన్ని తానే త్రాగుతున్నది. కానీ సజీవంగానే ఉంటున్నది. అనుక్షణం మరణిస్తున్నప్పటికీ, అనుక్షణం సజీవంగానే నిలుస్తున్నది. అంతేగాక అన్నింటినీ తానే పోషిస్తున్నది కూడా. ప్రకృతిలో జరుగుతున్న నిరంతర ప్రక్రియ ఇదే. ఇదే ప్రకృతిలోని సృష్టి స్థితి లయాత్మకమైన దైవత్వం. ఈ భావం ఉపనిషత్తులలో మనకు దర్శనమిస్తుంది. ఛిన్నమస్తా రూపం కూడా ఇదే భావనను ఒక చిత్రరూపంలో మనకు గోచరింపజేస్తున్నది. తను మరణించి కూడా సజీవంగా ఉండటమూ, తనవారిని పోషించడమూ, జననం నుంచి మరణానికీ మళ్ళీ దానినుంచి జననానికీ అనుక్షణం రీసైకిల్ అవుతూ ఉండటమూ అనే స్థితులు ఈ దేవతా చిత్రంలో మనకు కనిపిస్తాయి.
అంటే సృష్టి, స్థితి, లయమూ - మూడూ తానే అన్నది ఈ చిత్రం యొక్క మార్మికార్ధం. ఈ చిత్రంలో మీరు లయమూ స్థితీ చెప్పారు. మరి సృష్టి ఎక్కడుంది? అని మీకు అనుమానం రావచ్చు. ఈ దేవత కాళ్ళక్రింద సృష్టికార్యంలో ఉన్న రతీమన్మధులు ఏమిటనుకున్నారు? అది సృష్టికి సంకేతం !! తన చెలికత్తెలకు రక్తాన్ని ధారపోయ్యడం స్థితికి సంకేతం. శిరచ్చేదం లయానికి సంకేతం. అయినా బ్రతికి ఉండటం దైవం యొక్క నిత్యత్వానికి సంకేతం. వెరసి దైవం యొక్క పరిపూర్ణ శక్తికి ఈ దేవత ప్రతిరూపం !!
తంత్రాలకు సంబంధించిన ప్రతిదీ ఇలాగే రహస్య భాషలో ఉంటుంది. దీనిని "సంధ్యా భాష" అంటారు. అంటే - సంధ్యా సమయం ఎలాగైతే ఇటు పగలూ కాకుండా అటు రాత్రీ కాకుండా, స్పష్టత లేకుండా, సందిగ్ధంగా ఉంటుందో, అలాగే ఈ తంత్రాల భాష కూడా మార్మికంగా, సంధ్యా సమయంలాగా, అస్పష్టంగా ఉంటుంది. దానిని అర్ధం చేసుకునే అంతర్ద్రుష్టి మనకుంటే గాని అది అర్ధం కాదు.
వేదాలు కూడా ఇంతే. అవి చాలా లోతైన మార్మిక భాషలో ఉంటాయి. అంతర్ద్రుష్టి లేకుంటే అవి అర్ధం కావు.
తంత్రాలకు వేదాలకు సంబంధం లేదని కొందరి భావన. ఈ భావన సరి కాదు. అన్నింటికీ వేదాలలోనే మూలాలున్నాయి. ఇందులో అనుమానం లేదు. అయితే - అన్నీ వేదాలలోనే విస్పష్టంగా చెప్పబడలేదు. మార్మిక భాషలో చెప్పబడ్డాయి. వాటిని సరిగ్గా అర్ధం చేసుకుంటే అవి అర్ధమౌతాయి. వేదాలను అర్ధం చేసుకోవాలంటే తపశ్శక్తి అవసరం. ఊరకే సంస్కృత వ్యాకరణం తెలిస్తే చాలదు. ఈ తపశ్శక్తి లేకుంటే వేదాలకు సరియైన భాష్యం వ్రాయలేరు.ఎందుకంటే వేదాలలో ఉన్నట్టివి ఉత్త శ్లోకాలు కావు. అవి మంత్రాలు. శ్లోకాలకూ మంత్రాలకూ చాలా భేదం ఉంటుంది. శ్లోకార్ధం తెలియాలంటే వ్యాకరణం తెలిస్తే చాలు. మంత్రార్ధం తెలియాలంటే తపస్సు అవసరమౌతుంది. తపస్సు లేకుంటే మంత్రార్ధం ఎప్పటికీ అవగతం కాదు.
ఈ కారణంగానే, వేదాలను తెలుగులోకి తెచ్చిన దాశరధి రంగాచార్యగారు కూడా వాటి మార్మికార్ధాలను వివరించలేక, ఉత్త వ్యాకరణార్దాలను మాత్రమే అచ్చులోకి తేగలిగారు. వేదాలకు ఆయన చేసిన తెలుగు అనువాదం నన్ను చాలా నిరాశ పరచింది. అటువంటి పండితుని నుంచి అలాంటి పేలవమైన వ్యాఖ్యానాన్ని నేను ఊహించలేకపోయాను. కానీ ఏం చేస్తాం? తపస్వులు తపస్వులే, పండితులు పండితులే. తపశ్శక్తి వేరు, పాండిత్యం వేరు.రెంటికీ హస్తిమశకాంతరం ఉంటుంది మరి !!
సరే ఆ సంగతిని ప్రస్తుతానికి అలా ఉంచుదాం !!
శాక్తతంత్రాలేగాక ఈ తంత్ర/పురాణ కాలమైన 3 నుంచి 8 శతాబ్దాల మధ్యకాలంలో శైవ తంత్రాలు, వైష్ణవ తంత్రాలు కూడా పుంఖాను పుంఖాలుగా వచ్చాయి. ఇవి ఒకదానినొకటి ప్రభావితం గావించుకున్నాయి.వైష్ణవపరమైన దశావతారాలకు, శాక్త పరమైన దశమహావిద్యలకు ఉన్న సూక్ష్మమైన సంబంధాలను గురించి కూడా వివరణలు ఆనాడే ఇవ్వబడ్డాయి.
ఉదాహరణకు, ముండమాలా తంత్రం ఏమంటున్నదో చూద్దాం.
శ్లో|| కృష్ణస్తు కాళికా సాక్షాత్ - రామమూర్తిశ్చ తారిణీ
వారాహీ భువనా ప్రోక్తా - నృసింహీ భైరవీశ్వరీ
ధూమవతీ వామన: స్యాచ్చిన్నా భృగుకులోద్భవ:
కమలా మస్త్యరూపస్యాత్ - కూర్మస్తు బగలాముఖీ
మాతంగీ బౌద్ధ: ఇత్యేషా షోడశీ కల్కిరూపిణీ
అనే ముండమాలా తంత్రశ్లోకాన్ని బట్టి....
కృష్ణావతారం - కాళిక,
రామావతారం - తార,
వరాహావతారం-భువనేశ్వరి,
నృసింహావతారం-భైరవి,
వామనావతారం-ధూమవతి,
పరశురామావతారం-ఛిన్నమస్త,
మత్స్యావతారం-కమలాత్మిక,
కూర్మావతారం - బగళ,
బుద్ధావతారం - మాతంగి,
కల్క్యావతారం - షోడశి
అనే సామ్యం మనకు కనిపిస్తున్నది.
ఈ దశావతారాలలో ఇతర అవతారాలను మనం ప్రస్తుతం స్పృశించడం లేదు. ఎందుకంటే మన ప్రస్తుత విషయం అది కాదు గనుక. కానీ ఈ పట్టిక ప్రకారం - చిన్నమస్తాదేవి పరశురామునితో పోల్చబడింది. ఈ వివరాన్ని కొంచం గమనించాలి.
|
ఎల్లమ్మ తల్లి (రేణుకా దేవి) |
పరశురాముని తల్లి రేణుకాదేవి కూడా తన సుతుని చేతిలోనే శిరచ్చేదానికి గురైంది. కానీ మరలా తన భర్తయైన జమదగ్ని మహర్షి తపశ్శక్తి చేత బ్రతికింపబడింది. పరశురాముని ఆయుధమైన గండ్రగొడ్డలి కూడా తలలు నరికినదే. కనుక ఈ 'శిరచ్చేదం' అనే కాన్సెప్ట్ లో ఛిన్నమస్తా దేవికీ, రేణుకాదేవికీ పోలికలున్నాయి. ఈ రేణుకాదేవినే ఎల్లమ్మ తల్లి అని మన తెలుగునాట కొన్ని ప్రాంతాలలో ఆరాధిస్తూ ఉంటారు. 'ఎల్లమ్మ' అనే పేరుకున్న అర్ధమేంటో ఇప్పుడు వివరిస్తాను.
'ఎల్ల' అంటే సరిహద్దు, పొలిమేర అని అర్దాలు. అంటే - జీవితం, మరణం అనే స్థితుల మధ్యన పొలిమేరలో సరిహద్దులో ఉండే దేవత అని అర్ధం. ఈ స్థితినే BARDO అని టిబెటన్ భాషలో పిలుస్తారు. అంటే చావూ బ్రతుకూ కాని ఊగిసలాట అన్నమాట.
దేవతా పరంగా చూస్తే, ఈమె జీవనానికీ మరణానికీ మధ్యలో ఉన్నది కనుక అటు జీవనరంగంలోనూ కాలుపెట్టగలదు, లేదా ఇటు మరణపు ఛాయలోనూ నర్తించగలదు.అంటే ఇహలోకానికీ, పరలోకానికీ ఈమె అధిదేవత అన్నమాట. అదే, మరణించిన జీవుడి స్థితిని తీసుకుంటే అతడు నిస్సహాయ స్థితిలో ఊగిసలాడుతూ ఉంటాడు. సహాయం కోసం ఏడుస్తూ ఉంటాడు. కనుక ఇలాంటి జీవులకు కూడా ఆమె సహాయం చెయ్యగలదు. అంటే, బ్రతికున్న జీవులకూ, చనిపోయిన జీవులకూ కూడా ఈమే రక్షాదాయిని. ఇదే 'ఎల్లమ్మతల్లి' అనే మాటలోని రహస్యార్ధం.
అలాగే రెండు ఊర్ల మధ్యన కూడా పొలిమేర ఉంటుంది. అందుకే ఈ పొలిమేర దగ్గరలో 'గ్రామదేవత', 'పొలిమేర దేవత', 'పోలమ్మతల్లి', 'పోలేరమ్మ' అనే పేర్లతో దేవతా విగ్రహాలుంటాయి. వీరందరూ 'ఎల్లమ్మతల్లి' ప్రతిరూపాలే.
ఇలాగే, ఏవైనా రెండు స్థితుల (two states of being) మధ్యన కూడా 'సంధ్య' (transition) ఉంటుంది. ఇలాంటి no man's land లేదా అయోమయ స్థితిలో ఉన్న మనిషిని రక్షించి వాడికి సరియైన దారిని తన త్యాగం ద్వారా చూపే దేవతకే 'ఎల్లమ్మతల్లి' అని పేరు. ఈమెనే వేదాలలో 'సంధ్యా దేవత' అన్నారు. ఈమె అనుగ్రహం కోసమే సంధ్యావందనం అనే ఉపాసనను ప్రతిరోజూ ద్విజులైనవారు ఆచరించవలసి ఉన్నది.
ఈ దేవత చిత్రాలలో, విగ్రహాలలో గనుక మనం గమనిస్తే ఈమెకు తల ఒక్కటే ఉంటుంది. కొన్నిచోట్ల ఆ తలచుట్టూ అగ్నిజ్వాల ఆవరించి ఉంటుంది. ఇది ఆమెయొక్క త్యాగానికి, దివ్యత్వానికి సూచిక. చాలామందికి ముఖ్యంగా కోయలు, చెంచులు మొదలైన అటవీజాతులకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఈమె ముఖ్యమైన రక్షణదేవతగా ఉంటుంది. అదీ గాక చాలా గ్రామాలలో రకరకాలైన 'అమ్మతల్లుల' పేర్లతో ఆరాధింపబడే దేవత కూడా ఈమెయే.
పరశురామ జనని యైన రేణుకాదేవియే, తంత్రమహాదేవత ఐన ఛిన్నమస్త అని వాసిష్ట గణపతి ముని కూడా అన్నారు. ఆయన శిష్య ప్రశిష్యులు కూడా ఇదే నమ్ముతూ ఉంటారు.
అయితే, ఈమెకు అనేక మంత్రభేదాలున్నప్పటికీ, ఈమె యొక్క ప్రధానమైనట్టి మంత్రంలో ఉన్నట్టి ' వజ్ర వైరోచనీయే' అనే పదం బౌద్ధ తంత్రమైన వజ్రయానంలో ఉన్న 'వజ్ర' అనే పదం యొక్క సామ్యంతో, ఈమె ప్రధానంగా బౌద్ధ తంత్ర దేవతయైన వజ్రవారాహి యని కొందరు పండితులు ముఖ్యంగా ప్రొ. బినయ్ తోష్ భట్టాచార్య వంటివారు అభిప్రాయ పడ్డారు. ఎందుకంటే ఈ 'వజ్ర' అనే పదం, హిందూమతంలో ముఖ్యంగా హిందూ తంత్రాలలో తరచుగా వాడబడిన పదం కాదు. ఇంద్రుని ఆయుధం వజ్రాయుధమని ఉన్నప్పటికీ ఆ పదానికి ప్రతి దేవత ముందూ ఉంచబడిన ప్రాముఖ్యత, బౌద్ధ గ్రంధాలలో ఉన్నంతగా మన గ్రంధాలలో లేదు. కానీ - బౌద్ధ గ్రంధాలను వ్రాసినది కూడా బౌద్దులుగా మారిన వైదికులే గనుక, ఏ పదాలు ఎక్కడున్నా పెద్ద తేడా రాదు.
నేను కావాలనే 'హిందువులు' అనే పదాన్ని వాడటం లేదు. ఎందుకంటే ఇది ఆ తర్వాత కాలంలో విదేశీయులచేత మనమీద రుద్దబడిన మాట. కనుక వైదికులు అనే పదాన్నే నేను వాడుతున్నాను. మనం వేదానుసారులమే గనుక వైదికులమే అవుతాము.
ఈ 'వజ్ర' అనే పేరు ఈమె మంత్రంలో ఉండబట్టే, నాకు ఫోన్ చేసిన వజ్రాల వేటగాడి లాంటి పనికి మాలిన వాళ్ళు, ఈ దేవత అనుగ్రహం ఉంటే వజ్ర వైడూర్యాలతో కూడిన నిధులు బయటకు తీసే శక్తి ఆమె ఉపాసకులకు వస్తుందని మూర్ఖంగా నమ్ముతూ ఉంటారు. చక్రవర్తి దగ్గరకు పోయి కూడా పుచ్చు వంకాయలు కోరే బాపతు కదా ఈ మనుషులు? మనసులో పుచ్చు ఉన్నప్పుడు వాళ్ళు మాత్రం అంతకంటే ఇంకేం చెయ్యగలరు? ఈ ప్రపంచంలో ఎవడి గోల వాడిది !!
నిజానికి ఈ 'వజ్ర' అనే పదం - మూడు కాలాలలో ఎట్టి మార్పూ లేనట్టి అజేయమైన ఆత్మస్థితికి సూచిక. ఎందుకంటే వజ్రానికి తుప్పు పట్టదు, అది అభేద్యం కూడా. ఆత్మస్థితి కూడా అంతేకదా మరి !!
'విశేషేణ రోచతి (ఎక్కువ కాంతితో కూడిన మిరుమిట్లు గొలిపే శక్తి) ఇతి విరోచన:' అనే సూత్రాన్ని బట్టి, విరోచన, వైరోచన అనే పదాలు ఒకటే గాబట్టి - ఈ శక్తి మెరుపులు, ఉరుములు, పిడుగులలో దాగి ఉన్నట్టి ప్రచండమైన విద్యుచ్చక్తిగా తాంత్రికులు భావిస్తారు. అందుకే ఈమెకు "ప్రచండ చండిక" అని మరో పేరున్నది. మూడు వందల సంస్కృత శ్లోకాలలో గణపతి ముని ఈమెను స్తుతిస్తూ "ప్రచండ చండీత్రిశతి" అనే స్తోత్రాన్ని రచించారు. ఆ స్తుతిలో ఈమెను యోగసిద్ధిదాయిని యైన కుండలినీ శక్తిగా భావించి ప్రార్ధించారు. కుండలినీ శక్తి కూడా విద్యుచ్చక్తియే. అయితే ఈమె మానవ శరీరాలలో ఉన్న బయో ఎలక్ట్రికల్ ఎనర్జీ. మళ్ళీ ఈమెయే అంతరిక్షంలో ఉద్భవించే మెరుపులలో ఉన్న కోట్లాది వోల్టుల విద్యుచ్చక్తి కూడా.
వెన్నెముకలో కుండలినీ శక్తి సంచారం జరిగినప్పుడు కరెంట్ షాక్ కొట్టినట్లూ, విద్యుల్లతలు (మెరుపులు) వెన్నులో ప్రాకినట్లూ ఉండటం యోగులకు అనుభవైకవేద్యమే కదా !!
(ఇంకా ఉంది)