“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

1, సెప్టెంబర్ 2017, శుక్రవారం

ఛిన్నమస్తా సాధన - 7 (యజ్ఞస్వరూపం)

ఇప్పటిదాకా బౌద్ధ తంత్రాలలో ఈ దేవత గురించి ఏముందో తెలుసుకున్నాం. హిందూతంత్రాలు ఈ దేవతను గురించి ఏమంటున్నాయో ఇప్పుడు చూద్దాం.

యజ్ఞరూపాం యజ్ఞదాత్రీం యజ్ఞగ్రహణకారిణీం
మోక్షదాం సర్వసత్త్వేభ్యశ్చిన్నమస్తాం నమామ్యహం

(నీవు యజ్ఞరూపిణివి. యజ్ఞాన్ని ఇచ్చేదానివి. యజ్ఞాన్ని స్వీకరించేదానివి. అందరు జీవులకూ మోక్షాన్ని ఇచ్చేది నీవే. అటువంటి ఛిన్నమస్తా మహాదేవికి నమస్కరిస్తున్నాను)

కొన్ని హిందూతంత్రాలు ఈమెను యజ్ఞస్వరూపంగా భావించాయి. తన చెలికత్తెల దాహం తీర్చడానికి తన రక్తాన్ని ధారపోస్తున్న కరుణామూర్తిగా ఈమెను ఇవి కీర్తించాయి. ఈ భావన చాలా లోతైనది. తారాదేవి యొక్క కరుణామయ స్వరూపానికి ఇది సంకేతం.

లోకంలో ప్రతి గురువూ, సిద్ధపురుషుడూ, ప్రవక్తా, అవతారపురుషుడూ చేసిన పని ఇదే. లోకం కోసం తన జీవితాన్ని, శరీరాన్ని, కాలాన్నీ రెండో ఆలోచన లేకుండా త్యాగం చెయ్యడమే వారు చేసిన పని. ఈ 'త్యాగం' అనే కాన్సెప్ట్ ఈ దేవతలో ప్రధానమైన గుణం. దీనికే మరో పేరు 'యజ్ఞం'.

యజ్ఞం అంటే ఏదో అర్ధం కాని గహనమైన విషయం అని చాలామంది అనుకుంటారు. ఇప్పటి భాషలో సింపుల్ గా చెప్పాలంటే  యజ్ఞమంటే - 'రీ సైక్లింగ్'. భగవద్గీతలో కూడా ఇదే భావం ఉంది.

భగవద్గీత మూడో అధ్యాయం 11, 12 శ్లోకాలు చూడండి.

శ్లో|| దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వ:
పరస్పరం భావయన్త: శ్రేయం పరమవాప్స్యధా

అర్ధం:--

ఓ మానవులారా! మీరు యజ్ఞముల ద్వారా దేవతలను తృప్తి పరచండి. అలా తృప్తి చెందిన ఆ దేవతలు మీరు అడిగినవి ఇస్తారు. ఈ విధంగా ఒకరికొకరు పోషకులై ఉండండి. అప్పుడు లోకం సుభిక్షంగా ఉంటుంది.

అంటే ఏమిటి? దేవతలంటే ఎవరు? దేవతలంటే ప్రకృతి శక్తులే. అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, అంతరిక్షం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవే వేదకాలపు దేవతలు. 

"వీటిని మీరు పాడు చెయ్యకండి. వీటిని జాగ్రత్తగా సంరక్షించుకోండి. అప్పుడు అవి కూడా మిమ్మల్ని చల్లగా చూస్తాయి. అప్పుడు ప్రకృతి బాగుంటుంది. లోకం అంతా బాగుంటుంది" - అన్న ప్రకృతి సూత్రాన్ని భగవద్గీత ఇక్కడ చెబుతున్నది.

మనమేం చేస్తున్నాం?? భూమినీ, జలాన్నీ, గాలినీ మనం ఇష్టానుసారం పాడు చేస్తున్నాం. దాని ఫలితాన్ని భూకంపాల రూపంలో, వరదల రూపంలో, వాయు కాలుష్యం రూపంలో మనం తిరిగి అనుభవిస్తున్నాం. అంటే, భగవద్గీతలో చెప్పబడిన యజ్ఞధర్మాన్ని మనం ఏమాత్రం పాటించడం లేదు. అందుకే ఇన్నిన్ని విపత్తుల రూపంలో ప్రకృతి మనమీద కన్నెర్ర చేస్తున్నది.

భగవద్గీతను గౌరవించడమంటే శ్లోకాలు బట్టీ పట్టడంలో చిన్నపిల్లలకు పోటీ పెట్టి ప్రైజులివ్వడం కాదు. ఆ శ్లోకాలు ఏం చెబుతున్నాయో, ఎలా బ్రతకమని మనకు చెబుతున్నాయో ముందు మనం నేర్చుకుని ఆచరిస్తూ అప్పుడు మన పిల్లలకు చెప్పడం. కానీ ఈ పనిని ఎవ్వరూ చెయ్యరు. ఇదే అసలైన విచిత్రం !! 

యజ్ఞమంటే ఒక్క హోమం మాత్రమే కాదు. కాసేపు చేసే హోమమే యజ్ఞమనేది చాలా క్రూడ్ భావన. నిత్యజీవితమే యజ్ఞమనేది ఉదాత్తమైన భావన. గీతలో చెప్పబడింది ఈ ఉదాత్త భావనే గాని ఉత్త చెత్తభావన కాదు.

మన దేశంలో అక్కడక్కడా యజ్ఞాలు చేస్తూ ఉంటాం. కానీ ప్రకృతిని మాత్రం పట్టించుకోం. ఆ యజ్ఞం జరిగిన తర్వాత చూస్తే వాళ్ళు వాడిన వస్తువులూ చెత్తా చెదారం అంతా అడ్డదిడ్డంగా పారేసి ఉంటాయి. వాటిని రోజుల తరబడి ఎవ్వరూ క్లీన్ చెయ్యరు. ఇక వాళ్ళు చేసేది ఏం రకమైన యజ్ఞమో ఎవరికీ అర్ధం కాదు. అదే అమెరికాలో నేను చూచాను. అక్కడ ప్రకృతిని చాలా చక్కగా సంరక్షిస్తారు. పరిశుభ్రత పాటిస్తారు. కనుక మనతో పోలిస్తే వాళ్ళే సరైన యజ్ఞం చేస్తున్నారని నా భావన. అందుకే అక్కడ ప్రతి మూడురోజులకూ ఒక వర్షం పడుతూ ఉంటుంది. మనకేమో వర్షాకాలం ఎప్పుడొచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా తెలీదు. వస్తే వరదలు రావాలి తుఫానులు రావాలి. మామూలు వర్షం మాత్రం మనకు పడదు. ఇదీ మన యజ్ఞాల డాబు !!

ఈ ఒక్క కాన్సెప్ట్ సరిగ్గా అర్ధమైతే మనిషి జీవితం మొత్తం  క్లియర్ గా మనకు అర్ధమైపోతుంది. వేరే వాళ్ళ జీవితం మనకు అర్ధం కానక్కర లేదు. మన జీవితమే మనకు స్పష్టంగా అర్ధమౌతుంది. ఎందుకంటే ఈ సూత్రం ప్రకృతికి ఎంత వర్తిస్తుందో మనిషి జీవితానికి కూడా ఇంకా ఎక్కువగా వర్తిస్తుంది.

నేను వ్రాసేవన్నీ ప్రాక్టికల్ గా నా జీవితంలో చూచి, ఆలోచించి, అన్వయించుకుని తెలుసుకున్న సత్యాలే గాని ఊహలు కావు.

కొన్నేళ్ళ క్రితం ఒక స్నేహితుడు పిలిస్తే ఒక యజ్ఞం చూద్దామని వెళ్లాను. సామాన్యంగా పారాయణాలూ, పూజలూ, యజ్ఞయాగాలు వంటి జీవం లేని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు నేనస్సలు వెళ్ళను. కానీ ఆ స్నేహితుడు బాగా తెలిసినవాడూ, వాళ్ళ స్వామీజీ గురించి చాలా ఇదిగా చెప్పాడూ గనుక వెళ్ళాల్సి వచ్చింది. ఆ స్వామీజీ ఎవరో చెప్పను. చెబితే చాలామంది పాఠకులు బాధపడతారు పాపం !!

సరే యజ్ఞం అంతా అట్టహాసంగా బాగానే జరుగుతోంది. కానీ అక్కడ యజ్ఞ నిర్వాహకుల తీరు చాలా అహంకారపూరితంగా 'మేం కాబట్టి దీనిని చేయిస్తున్నాం ! మాకింత డబ్బూ పలుకుబడీ ఉన్నాయి' అన్నట్టు విర్రవీగుడుగా ఉంది. అక్కడే నాకు అసహ్యం వేసి లేచి వచ్చేద్దామని అనుకున్నాను. సరే వీడు బాధపడతాడని అలా భరిస్తో కూచున్నా. కాసేపాగి చుట్టూ చూద్దామని ఆ ప్రాంతమంతా ఒక రౌండ్ వేశా. అప్పుడొక దృశ్యం కనిపించింది.

వాళ్ళు యజ్ఞంలో వాడిన వస్తువులూ, పారేసిన చెత్తా అంతా కూడా కొంచం వెనుకగా ఒక కుప్ప పోస్తున్నారు. దాని దగ్గర కుక్కలూ పందులూ చేరి నానా రచ్చా చేస్తున్నాయి. టిఫిన్లు తింటున్నవాళ్ళూ కాఫీలు త్రాగేవాళ్ళూ అందరూ అక్కడకే వచ్చి నిర్లక్ష్యంగా కప్పులూ గట్రా విసరి పారేస్తున్నారు. మొత్తం మీద అక్కడ ఎవరికీ శుభ్రత గానీ కనీసం సివిక్ సెన్స్ గానీ ఉన్నట్లు కనిపించలేదు. వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్న చెత్తను ఎలా చక్కగా రీసైక్లింగ్ చెయ్యాలో కనీసం ఎలా డిస్పోస్ చెయ్యాలో కూడా వాళ్లకు తెలిసినట్లు నాకనిపించలేదు.

అవన్నీ చూచిన నేను మావాడి భుజం తట్టి - 'నేను వెళుతున్నా!' అని చెప్పి బయల్దేరా.

'కాసేపుండు. ఈరోజు కార్యక్రమం అయిపోతుంది' అని వాడు బ్రతిమిలాడాడు.

'వద్దు. మీకు యజ్ఞం అంటే ఏమిటో అర్ధం కాలేదని నాకర్ధమైంది. నువ్వు కూచో. నే వెళుతున్నా' అని వాడితో చెప్పి బయటపడ్డా.

సివిక్ సెన్స్ కలిగి ఉండటమే అసలైన యజ్ఞమని నేను భావిస్తాను. అలా నిత్యజీవితంలో ఉన్నవాడు ఏ యజ్ఞాలూ చెయ్యకపోయినా యజ్ఞం చేస్తున్నట్లే. అది లేనివాళ్ళు ఎన్ని చేసినా ఏమీ చేయ్యనట్లే.

ఇంకా క్లారిటీ కోసం తర్వాత శ్లోకం చూద్దాం.

శ్లో|| ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితా:
తైర్దత్తాన్ అప్రదాయైర్భ్యో యో భుంక్తే స్తేన ఏవ సః

అర్ధం::--

మానవ జీవితానికి కావలసిన అన్నీ ఈ దేవతల (ప్రకృతి శక్తుల) అధీనంలో ఉన్నాయి. మీ యజ్ఞంతో తృప్తి చెందినవారై ఈ దేవతలు మీకు కావలసినవాటిని వరాలుగా మీకు ఇస్తారు. కానీ వాటిని మళ్ళీ ఆ దేవతలకే అర్పించకుండా అనుభవించేవాడు ఒక దొంగలాంటి వాడు.

యజ్ఞమంటే ఏమిటో ఈ రెండు శ్లోకాలలో స్పష్టంగా చెప్పబడింది. యజ్ఞమంటే రీ సైక్లింగ్. ప్రకృతి నుంచి మనం ఏదైతే పొందామో దానిని తిరిగి ప్రకృతికి ఇవ్వాలి. సమాజం నుంచి ఏదైతే మనకు దక్కిందో దానిని కొద్దో గొప్పో తిరిగి సమాజానికి ఇవ్వాలి. అలా చెయ్యకుండా మొత్తం మనమే అనుభవిద్దాం అనుకుంటే ఆ సైకిల్ మధ్యలో బ్రేక్ అవుతుంది. అక్కడ 'అధర్మం' తలెత్తుతుంది. అక్కడే మనిషికి గానీ సొసైటీకి గానీ కష్టాలు మొదలౌతాయి. అలాంటి మనిషి ఒక 'దొంగ' అంటుంది భగవద్గీత. సంస్కృతంలో 'స్తేన' అంటే దొంగ అని అర్ధం. స్తేన ఏవ స: అంటే 'వాడొక దొంగ' అని.

మనం జాగ్రత్తగా గమనించుకుంటే ఒక విషయం అర్ధమౌతుంది.

మనకొచ్చే రోగాలు గానీ, కష్టాలు గానీ, నష్టాలు గానీ - మనం ఈ యూనివర్సల్ సైకిల్ ను బ్రేక్ చేసినప్పుడే వస్తాయిగాని లేకుంటే రావు. కనుక మనం ఎక్కడెక్కడ ఈ తప్పులు చేస్తున్నామో గమనించుకుని వాటిని దిద్దుకుని ఆ రీ సైక్లింగ్ ప్రాసెస్ ను తిరిగి సక్రమమైన స్థాయిలో నిలబెట్టడమే (రెస్టోర్ చెయ్యడమే) 'యజ్ఞం' అనే మాటకు అసలైన అర్ధం.

నీరు పారుతుంటే శుభ్రంగా ఉంటుంది. ఆగిపోతే మురిగిపోతుంది. అలాగే జీవితంలో ఏదైనా సరే ఒక వృత్తాకారంలో సాఫీగా జరుగుతూ ఉంటే అంతా బాగుంటుంది. ఆగిపోతే మాత్రం ఆ ఆగినచోట ఒక వెలితి, ఒక లోపం, ఒక స్థంభన మొదలౌతుంది. అక్కడే కష్టమూ తలెత్తుతుంది. దీనిని గమనించి సరిదిద్దుకోవడమే అసలైన ఆధ్యాత్మిక జీవన రహస్యం.

ఛిన్నమస్తా రూపం కూడా ఈ విషయాన్నే మార్మికంగా ( సింబాలిక్ గా) సూచిస్తుంది. తాంత్రిక యంత్రాలుగానీ, దేవతా స్వరూపాలు గానీ సింబాలిక్ రహస్యాలు. వాటిని యధాతధంగా తీసుకోకూడదు. అవి ఏమేం చెబుతున్నాయో ఆయా అంతరార్దాలను గ్రహించాలి గాని ఆయా మూర్తులే నిజాలని అనుకోకూడదు.

ఛిన్నమస్తా దేవత ప్రకృతికి సింబల్ అనుకుంటే, ఆమె తన తలను తాను ఖండించుకుని తన రక్తాన్ని తన చెలికత్తేలకు ఇవ్వడమంటే ఏంటి అర్ధం? ప్రకృతి తనను తాను తగ్గించుకుని లోకాన్ని పోషిస్తోందని దాని అర్ధం. అంతేగాక తన రక్తాన్ని తానే కొంత త్రాగుతోంది కూడా ! అంటే - తన జీవనం (self-sustenance) కోసం కొంత శక్తిని తాను వాడుకుని మిగతా భాగంతో లోకంలోని అందరినీ పోషిస్తోంది. అంటే live and let live అని మనకు చెబుతోంది.

జిల్లెళ్ళమూడి అమ్మగారు కూడా తరచుగా - 'నీకున్నది తృప్తిగా తిని అందరికీ ఆదరంగా పెట్టుకో నాన్నా. ఇంతకంటే ఇంకేమీ లేదు.' అని అనేవారు. ఇదే అసలైన జీవన నియమం.

ఈ ముగ్గురూ నగ్నంగా ఉండడం వెనుక అర్ధం ఏమిటి?

ప్రకృతి శక్తులు శుద్ధశక్తి స్వరూపాలు (pure energies). అవి నగ్నంగానే ఉంటాయి. అవి మనలా బట్టలు కట్టుకుని మేకప్ చేసుకోవు. లోపలి కుళ్ళును కప్పిపెట్టి మనలా బయటకు చాలా మంచిగా పోజులు కొట్టవు. ఉన్నదున్నట్లుగా కనిపిస్తాయి. ప్రకృతిలో అన్నీ నగ్నంగానే ఉంటాయి. ఒక్క మనిషి మాత్రమే బట్టలు కట్టుకుంటాడు. అమెరికాలో అయితే పెంపుడు జంతువులకు కూడా బట్టలు కుట్టిస్తారు. దానికి టైలర్స్ కూడా ప్రత్యేకంగా ఉంటారు. అదొక పెద్ద బిజినెస్ అక్కడ.అంటే మనం ప్రకృతికి దూరమైంది గాక జంతువులను కూడా దానికి దూరం చేస్తున్నామన్న మాట!

ప్రకృతిలో ఉన్న అమాయకత్వమూ, స్వచ్చతా, శుద్ధమైన శక్తి స్వరూపములే ఈ చిత్రంలోని దేవతల నగ్నత్వాలకు సూచనలు. తాంత్రిక చిత్రాల్నీ సింబాలిక్ లాగ్వేజీ అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు.

కనుక కరుణామయి అయిన జగన్మాత (Unviersal Mother) కు ఈ చిత్రం ఒక మార్మిక సంకేతం. అంతేగాని ఇదేదో ఘోరమైన రాక్షసి బొమ్మనీ, తలలు నరుక్కునే ఆటవిక సాంప్రదాయానికి ఇదొక చిహ్నమనీ భావించడం సరి కాదు.

ఈ చిత్రం law of conservation of Energy (శక్తి నిత్యత్వ సూత్రం) కి ఒక సింబల్ అనేది అసలైన నిజం.

(ఇంకా ఉంది)