అన్తః శాక్తః బహిః శైవః లోకే వైష్ణవః అయమేవాచారః

15, ఫిబ్రవరి 2026, ఆదివారం

అంతటా వెలుగు

తెల్లవారుఝాము. 

చీకటి బాగా ఉంది. 

మైలుదూరంలోని పల్లెమసీదు పొద్దున్నే నిద్రలేపింది.

ఇవాళ శివరాత్రి కదా? దాని సౌండు చాలా పెరిగింది.

'అల్లా తప్ప వేరే దేవుడు ఎవడూ లేడు' అని రోషంగా మైకు అరుస్తోంది.

'610 CE  కి ముందు ఎవడున్నాడా?' అని నాకు డౌటొచ్చింది.


తెలతెలవారుతోంది.

ఫోన్లో ఏదో మెసేజి వచ్చింది.

'ఏంటా?' అని చూచాను.

'హ్యాపీ శివరాత్రి' అని ఒక స్నేహితుని నుంచి.

'శివుడికి రాత్రయితే నీకు హ్యాపీ ఎందుకు?' అని రిప్లై ఇచ్చాను.


తెల్లవారింది

ఆదివారం కదా ! ఇంకొక ఊరినుంచి చర్చిమైకు చెవుల్లో మ్రోగుతోంది.

దాని సౌండు కూడా ఇవాళ బాగా ఎక్కువైంది.

స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం - అంటూ అరిగిపోయిన రికార్డులాగా ఎవరో అరుస్తున్నారు.

ఏ స్తోత్రమో, ఎవరికి స్తోత్రమో అదిమాత్రం చెప్పడం లేదు. 

బహుశా వాళ్ళక్కూడా సరిగ్గా తెలిసినట్టు లేదు.


కొంచెం పొద్దెక్కింది.

గుడిమైకులు నిద్రలేచాయి. 

శివుడి సినిమాపాటలు మార్మోగుతున్నాయి.

మళ్ళీ ఏడాదిదాకా వాటికి పనీ ఉండదు. శివుణ్ణి అనుకునేవారూ ఉండరు.

'పోన్లే ఇవాళన్నా మ్రోగనీ' అనుకున్నాను.


బారెడు పొద్దెక్కింది. 

2008 లో నేను వ్రాసిన మొట్టమొదటి పోస్టును ఒక శిష్యుడు నాకే ఫార్వార్డ్ చేశాడు.

అందులో, ఆనాటి శివరాత్రినాడు కాళహస్తిలో నాకు కలిగిన ధ్యానానుభవాన్ని వర్ణించాను.

నా పోస్టును నాకే పంపడంలో అతని ఉద్దేశం నాకర్ధం కాలేదు.

బహుశా, 'అప్పుడలా  ఉన్నారు.ఇప్పుడేంటి?'  అని అతని ఉద్దేశం కావచ్చు.

'ఇవాళ కనీసం స్నానం కూడా చెయ్యను' అని అతనికి రిప్లై ఇచ్చాను.


సూర్యుడు బాగా పైకొచ్చాడు. అంతటా వెలుగు పరచుకుంది.

నాకు బాగా మెలకువొచ్చింది.

read more " అంతటా వెలుగు "

6, ఫిబ్రవరి 2026, శుక్రవారం

పాలల్లో విషం

ప్రస్తుతం తిరుపతిలో మకాం.

పుస్తకప్రదర్శనలో మన స్టాల్ ను సందర్శిస్తున్నాం. ఒకరోజున ఇతరస్టాళ్లను చూచుకుంటూ నడుస్తుండగా ఒకాయన ఆపి, ' నేను కొన్ని సూక్తులను వ్రాసాను. చూడండి ' అంటూ ఒక కాగితాన్ని చూపించాడు. 

సరే ఏంటో చూద్దామని దృష్టి సారించాను.

దానిపైన మొదట్లోనే 'ఓం శ్రీ సాయినాధాయ నమః' అని వ్రాసుంది. దానిక్రింద ఏవేవో నీతులు రాసున్నాయి. ఇలాంటి మెంటల్ కేసులను చాలామందిని చూచి ఉన్నానేమో,  వెంటనే ఆ కాగితాన్ని అతనికిచ్చేసి ' మీ సూక్తులు మొదట్లోనే పెడదారి పట్టాయి. ముందు దీన్ని మార్చండి. ఆ తరువాత ఇతరులకు  నీతులు చెప్పచ్చు ' అంటూ ఆ లైన్ చూపించాను.

సాయిబాబా గురించి నేనంటున్నానని అతనికి అర్థమైంది. 

'మీకు బాబా నచ్చకపోతే వదిలేసి, మిగతాదాంట్లో మంచిని తీసుకోండి' అన్నాడు తెలివిగా.

వాళ్ళు చేస్తున్న తప్పేంటో వాళ్లకు అర్ధంకాదు. కానీ ఈ అతితెలివికి మాత్రం తక్కువేమీ ఉండదు.

'పాలల్లో విషం కలిసింది. విషం వదిలేసి పాలు మాత్రమే త్రాగమంటే ఎలా వీలవుతుంది? మీరు త్రాగగలరా?' అన్నాను.

అతనికి నోటమాట రాలేదు.

' సాయిబాబాకీ నాథసాంప్రదాయానికీ సంబంధం ఏంటసలు? సాయినాథ, ఏసునాధ, ఏంటి ఇదంతా? ఇలాంటి సంకరపదాలు, సంకరమంత్రాలు తయారుచేసినవాడికి అసలు మతుందా పోయిందా?' అడిగాను.

అతనలాగే చూస్తున్నాడు.

'తురకబాబాకి బీజాక్షరాలు జోడించినంత మాత్రాన ఆయన హిందువు కాలేడు. మీరు మాత్రం చివరకు ఎటూకాకుండా అయిపోతారు. నా ఈ సూక్తిని మీ సూక్తులకు చేర్చుకోండి' అని చెప్పి నా దారిన ముందుకొచ్చేశాను. 

మత్స్యేంద్రనాధుడు, గోరఖ్ నాధుడు మొదలైన నవనాథులు మహాసిద్ధులు. వారందరూ ఈశ్వరభక్తులు. ఆ పేరుని కూడా కల్తీ చేస్తున్నారు నేటి కుహనాహిందువులు.

'ఎంత అజ్ఞానంలో ఉన్నార్రా హిందువులారా? మీకు చెప్పేవాడు లేడు. ఉన్నా మీరు వినరు. మీ ఖర్మ ఇంతే' అనిపించింది.

read more " పాలల్లో విషం "

1, ఫిబ్రవరి 2026, ఆదివారం

మా 77 వ గ్రంధంగా 'జ్ఞానసంకలినీ తంత్రము' విడుదల

నా కలం నుండి వెలువడుతున్న 77 వ గ్రంధంగా, 'జ్ఞానసంకలినీ తంత్రము' అనబడే ప్రాచీనగ్రంధమునకు నా వ్యాఖ్యానమును నేడు విడుదల చేస్తున్నాము. 


తంత్రములన్నీ శివశక్తుల సంవాదరూపములై యుంటాయి. ఈ గ్రంధము కూడా అటువంటిదే. దీనియొక్క పేరునుబట్టి, అనేక ఇతరతంత్రముల నుండి సేకరించబడిన జ్ఞానము ఈ గ్రంధములో ఒకచోట కూర్చబడినదని తెలుస్తున్నది.


పెద్దదైన ఏ ఇతర గ్రంధమునకూ ఇది అనుబంధము కాకుండా, స్వతంత్రరచనగా కనిపిస్తున్నది. దీనిలోని భావములు కూడా, వివిధ యోగోపనిషత్తులనుండి, జ్ఞానోపనిషత్తులనుండి సేకరించబడినట్లుగా ఉన్నాయి. దీని ప్రతిధ్వనులు భగవద్గీతలో కూడా మనకు దర్శనమిస్తాయి.


దీనిలో సృష్టిక్రమము, పంచభూతములు, చక్రములు, నాడులు, వాయువులు, వాటియొక్క పనులు, ఓంకారము, దానియొక్క మూడుభాగములు, ఆయాభాగముల తత్త్వములు, కుండలినీసాధన మొదలైన విషయములు వివరింపబడినాయి. ఆచారములు, తంతులకు భిన్నమైన జ్ఞానమార్గము, యోగశాస్త్రముతో మేళవింపబడి దీనిలో దర్శనమిస్తున్నది.


మధ్యయుగములనాటి అనేకగ్రంథములలో వలె, దీనిలో కూడా, వేదాంతమును, యోగశాస్త్రమును, తంత్రశాస్త్రమును సమన్వయపరచాలనిన ప్రయత్నం కనిపిస్తుంది. వేదాంత, యోగ, తంత్రశాస్త్రాభిమానులకు, జిజ్ఞాసువులకు మరియు సాధకులకు ఈ గ్రంధం ఉపయోగకరంగా ఉంటుందని మా విశ్వాసము.


ఈ గ్రంధము కూడా తిరుపతి బుక్ ఫెస్టివల్ లోని 35 వ నంబరు స్టాల్లో లభిస్తుంది. లేదా మా తక్కిన గ్రంధాలలాగే ఆన్లైన్ లో ఇక్కడ లభిస్తుంది. జిజ్ఞాసువులు, పాఠకులు మరియు మా అభిమానులు దీనిని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం.

read more " మా 77 వ గ్రంధంగా 'జ్ఞానసంకలినీ తంత్రము' విడుదల "

నిస్వార్థ కర్మయోగులు


తిరుపతి బుక్ ఫెస్టివల్ లో మన స్టాల్ ను నడుపుతున్న నిస్వార్థకర్మయోగులను ఇక్కడ మీరు చూడవచ్చు. వీరందరూ, సాఫ్ట్ వేర్ రంగంలో సీనియర్ పొజిషన్స్ లో ఉన్న ఇంజనీర్లు. అదేసమయంలో మన పంచవటి సాధనామార్గంలో సీనియర్ సాధకులు కూడా.

అసలైన హిందూమతం గురించి, యోగమార్గం గురించి, పంచవటి భావజాలం గురించి, మీకున్న సందేహాలను, ఈ పదిరోజులలో ప్రత్యక్షంగా వీరిని కలిసి మీరు తీర్చుకోవచ్చు.

తిరుపతివాసులు దీనిని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం.

read more " నిస్వార్థ కర్మయోగులు "