18, మే 2026, సోమవారం

వినాయకుడి గుడి

ఈ మధ్యన కొందరు మా ఆశ్రమానికొచ్చారు.

'మా ఫామ్ హౌస్ లో వినాయకుడి గుడి కడుతున్నాం. భోజనాలకు రండి' అని పిలిచారు.

భోజనాలంటూనే పరిగెత్తుకుంటూ పోవడం ఇక్కడ పల్లెల్లో అలవాటు.

' మేమలా భోజనాలకు రాము. ఎవరు పడితే వారు వండినవి మేము తినము' అని వారితో అన్నాము.

వాళ్లకు కాస్త కోపం వచ్చింది.

'అంతా వెజిటేరియనే, మీకేం ఇబ్బంది ఉండదు' అన్నారు వాళ్ళు.

'వెజిటేరియన్ కూడా మాకు ఇబ్బందే. అందుకే మేము రానంటున్నది' అన్నాను

వాళ్ళకర్ధం కాలేదు.

'అదేంటి? బ్రాహ్మలచేతే వండిస్తున్నాము' అన్నారు వాళ్ళు. 

'అలా అయితే అసలు రాము' అన్నాము.

వాళ్లకు ఫ్యూజులెగిరిపోయాయి.

'అదేంటి? వినాయకుడి గుడికి రారా?' అన్నారు వాళ్ళు  కోపంగా

'వినాయకుడిని చూడటానికి అక్కడకి రావడమెందుకు?' అన్నాను.

'పూజలు భజనలు ఉన్నాయి. రండి' అని బ్లాక్ మెయిల్ చేయబోయారు.

'మీరు పూజలు చేయకపోతే వినాయకుడికేం తక్కువైంది?' అన్నాను.

వాళ్ళదొక రకంగా చూసి వెళ్లిపోయారు.

పిచ్చి జనం, పిచ్చి గోల. ఒక గుడి కట్టడం, పండుగలు పబ్బాలంటూ తంతులు, మైకులతో సౌండ్ పొల్యూషన్, హుండీతో కలెక్షన్. ఇదొక్కటే ఈ పిచ్చిజనానికి తెలిసిన హిందూమతం. ఇలా చెయ్యడమేదో గొప్పని, ఇలా చెయ్యడం ద్వారా హిందూమతాన్ని ఉద్ధరిస్తున్నామని వీళ్లంతా అనుకుంటున్నారు.

అసలైన హిందూమతాన్ని, అసలైన ఆధ్యాత్మికతను అర్ధం చేసుకోవాలంటే వీళ్లంతా ఎన్ని జన్మలెత్తాలో?

read more " వినాయకుడి గుడి "

15, మే 2026, శుక్రవారం

సనాతనాన్ని మళ్ళీ నిర్మూలిద్దాం

'సనాతనాన్ని నిర్మూలించాలి' అని ఉదయనిధి స్టాలిన్ మళ్ళీ అన్నాడు. దానికి వంతపాడుతూ TVK ఎమ్మెల్యే ముస్తఫా 'సనాతనాన్ని నిర్మూలించడానికే మేము పుట్టాము' అన్నట్లుగా మాట్లాడాడు. ముఖ్యమంత్రి  జోసెఫ్ విజయ్ ఏమీ మాట్లాడలేదు. ఊరకే చూస్తూ కూచున్నాడు.

కేరళలో కాంగ్రెస్ వచ్చింది. కర్ణాటకలో ఇప్పటికే ఉంది. తమిళనాడులో హిందూవ్యతిరేక ప్రభుత్వమే ఒక క్రొత్త ముసుగులో మళ్ళీ వచ్చింది.  తెలంగాణాలో కాంగ్రెస్ ఉంది. ఆంధ్రా ఒక్కటే అటూ ఇటూ ఊగులాడుతోంది.

ఇది చాలా మంచి పరిణామం.

పదిహేనేళ్ల తర్వాత, రాష్ట్రం సర్వనాశనం కాబోతున్న అంచులో మాత్రమే బెంగాల్ కు బుద్దొచ్చింది. ఇప్పుడు తవ్వుతుంటే సరిహద్దులలో వందలాది సొరంగాలు బయటపడుతున్నాయి. కోటిమంది పైన బాంగ్లాదేశ్ ముస్లిములు, రోహింగ్యాలు మన దేశంలో ఇప్పటికే ఉన్నారు. బెంగాల్లో బీజేపీ రాకపోయి ఉంటే ఒకటి రెండేళ్లలో దేశం మొత్తం  పాకిస్తాన్ బాంగ్లాదేశ్ ల చేతులలోకి వెళ్ళిపోయి ఉండేది. కనీసం చివరి నిముషంలోనైనా బెంగాలీలు కళ్ళు తెరిచారు. సంతోషం.

కానీ దక్షిణాది అయిదురాష్ట్రాలకు మాత్రం ఇంకా తెలివి రావడంలేదు. బహుశా ఇంకా ఇంకా చేతులు కాలాలేమో? అప్పుడు మాత్రమే కళ్ళు తెరుస్తారేమో? 

ఈ వైరస్ ను ఇప్పుడు సౌత్ రాష్ట్రాలు పెంచి పోషిస్తున్నాయి. వీటికెప్పుడు బుద్ధొస్తుందో తెలీదు. చూడబోతే మన దేశానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పనికిరాదని అనిపిస్తోంది. ఇదంతా ఊహించే, ఇలా జరగాలని చాలా ముందునుంచి కోరుకునే, ఇటువంటి పరిపాలనావ్యవస్థను, ఇటువంటి రాజ్యాంగాన్ని మనకు ప్రసాదించారేమో ఘనత వహించిన నాయకులనిపిస్తోంది.

పూర్తిగా కుళ్లిపోయేదాకా కళ్ళు మూసుకోవడం, చివర్లో లబో దిబో అనడం మనకు అలవాటేగా?

తమిళనాడు హిందువులారా !  లేవకండి. ఇదేవిధంగా నిద్రపోతూ ఉండండి. 'మిమ్మల్ని నాశనం చెయ్యడానికే మేం వచ్చాం' అనేవాళ్లకే ఓట్లేసి గెలిపించుకోండి. ఉదయనిధికి, ముస్తఫాకి,  జోసెఫ్ విజయ్ లాంటి వాళ్ళకి పూర్తిగా మద్దతివ్వండి.  కాళ్లకు మొక్కండి. సన్మానాలు చెయ్యండి. వెనక్కు తగ్గద్దు. ఇదే అజెండాతో ముందుకెళ్ళండి. ఒకనాటికి మీకే తెలుస్తుంది. అప్పటికి మీకు ఉనికే ఉండదు.

వ్యక్తిగతస్వార్ధాలకోసం దేశాన్నే ముంచేసేవాళ్ళని మన దేశంలోనే చూడగలం మరి !

It happens only in India !

read more " సనాతనాన్ని మళ్ళీ నిర్మూలిద్దాం "

14, మే 2026, గురువారం

ఏమి దేశం? ఏమి ప్రజలురా బాబు?

తమిళనాడులో ప్రభుత్వం మారింది. సినిమానటుడు జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రి అయ్యాడు. తమిళప్రజలు తెలుగుప్రజలకు ఏమీ తీసిపోరని మళ్ళీ ఋజువైంది.

చూడబోతే దక్షిణాదిరాష్ట్రాలకు వేటికీ దూరదృష్టి, వాస్తవికదృష్టి లేవని అర్థమౌతోంది. కాకపోతే ఒకటి ! ప్రజలకు ఛాయిస్ లేదు. నెగటివ్ ఓటు పనిచేస్తోంది. ఉన్నవాళ్లలో కాస్త మెరుగనిపించిన వాడిని ఎన్నుకుంటున్నారు. అయిదేళ్ల తర్వాత మళ్ళీ మోసపోయామని గ్రహిస్తున్నారు. మన దేశంలో చాలా రాష్ట్రాలలో ఇదే జరుగుతోంది. 

అయితే, తమిళప్రజలకు అన్నామలై నచ్చలేదు. విజయ్ నచ్చాడు.

అన్నామలై విద్యావంతుడు. ఇంజనీరింగ్ చదువుకున్నాడు. IIM గ్రాడ్యుయేట్. IPS సాధించాడు. ముక్కుసూటి ఆఫీసర్. వాటిని వదిలేసి దేశంకోసం ప్రజలకోసం రాజకీయాలలోకి వచ్చాడు. అతను ప్రజలకు నచ్చలేదు.

జోసెఫ్ విజయ్ సినిమాకుటుంబం నుంచి వచ్చాడు. ఇంటర్ మాత్రమే పాసయ్యాడు. అదికూడా అవలేదని, మధ్యలో మానేశాడని కొంతమంది అంటున్నారు. తల్లిదండ్రుల అండదండలతో హీరో అయ్యాడు. ఉద్రేకాలను రెచ్చగొట్టే పంచ్ డైలాగులతో, వాస్తవదూరమైన కథలతో జనాలకు దగ్గరయ్యాడు. వాట్సాప్ గ్రూపులతో, ఇంస్టాగ్రామ్ రీళ్ళతో పార్టీ పెట్టాడు. ఆచరణలో చెయ్యలేని, పనికిరాని వాగ్దానాలు గుప్పించాడు. జనాలు మెచ్చారు. గెలిచాడు. ముఖ్యమంత్రి అయ్యాడు.

ఇప్పుడు రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలి.  మరి రాష్ట్ర ఆర్ధికపరిస్థితి ఏంటో చూద్దామా?

2011 లో AIADMK ఓడిపోయి DMK అధికారంలోకి వచ్చింది. అప్పుడు రాష్ట్రం 5 లక్షల కోట్ల అప్పుల్లో  ఉంది.

15 ఏళ్ల తర్వాత ఇప్పుడు 10 లక్షల కోట్ల అప్పుతో DMK ప్రభుత్వం విజయ్ కి పగ్గాలు అప్పగించింది. అంటే ఈ 15 ఏళ్ల హయాంలో, 5 లక్షల కోట్ల అప్పు కాస్తా, 10 లక్షల కోట్ల అప్పుగా మారింది.

తమిళనాడు వార్షికబడ్జెట్ 3.44 లక్షల  కోట్లు. అంటే, బడ్జెట్ కు మూడురెట్లు అప్పులున్నాయి. ఒక కుటుంబం దృష్టిలో మాట్లాడుకోవాలంటే, నెలకు పదివేలు సంపాదన అయితే, ముప్పై వేలు అప్పుంది. ఇదంతా ఎలా తీరాలి? ఎవరు తీర్చాలి?

ఈ తెచ్చిన అప్పులన్నీ ఎలా ఖర్చుపెట్టబడ్డాయి?

రకరకాల స్కీముల కింద ప్రజలకు కొంత పందేరం చెయ్యడం, కొంత నొక్కెయ్యడం ఇదే ఎక్కడైనా జరిగేది, జరుగుతున్నది కూడా. ఆ డబ్బులన్నీ ఎక్కడకు పోతున్నాయి? ఏ స్విస్ బ్యాంక్ కో, ఏ సింగపూర్ కో తరలిపోతున్నాయి. అంతేగాని, రాష్ట్రంలో ఒక ఇండస్ట్రీ పెట్టడంగాని, ఒక రెవెన్యూ సృష్టించే ప్లాన్ గాని లేవు. ఉద్యోగాల సృష్టి లేదు. సంపద సృష్టి లేదు. అప్పులు తేవడం, వాడుకోవడం, దేశసంపదంతా విదేశీ బ్యాంకులకు తరలిపోవడం. ఇదీ గత 70 ఏళ్లుగా జరిగింది. ఈ వరస ఒక్క తమిళనాడులోనే కాదు, ప్రతి రాష్ట్రంలోనూ ఇదే తంతు నడుస్తోంది. ప్రజలు ఎక్కడైనా గొర్రెలేగా !

జనాలకు ఇదంతా పట్టదు. మన కులపోడైతే చాలు, నెలకింత అని డబ్బులిస్తుంటే చాలు, మనోళ్లు చేసే దౌర్జన్యాలు, నేరాలు అన్నీ మాఫీ చేస్తుంటే చాలు, వాడు దేవుడు. 

ఈ డబ్బులన్నీ ఎక్కడనుంచి వస్తాయి? అన్న ఆలోచన ఎవడికీ లేదు. రాష్ట్రం ఎటుపోయినా మనకనవసరం ! వాస్తవాలు ఎవరికీ  అక్కర్లేదు. నాలుగు డైలాగులు చెప్పి ఉద్రేకాలను రెచ్చగొట్టి, పది వాగ్దానాలు చేస్తే చాలు, ఓట్లు పడిపోతాయి. తర్వాత, మనం కట్టే టాక్స్ ని సగం నొక్కేసి, సగం మనకే పంచేసి చేతులు దులుపుకుంటారు. అదేమంటే కేంద్రం సాయం చెయ్యడం లేదంటారు. ఈలోపల రాష్ట్రం ఇంకా అప్పుల ఊబిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది.

ఇలాంటి ప్రజలకు ఇలాంటి ప్రభుత్వాలు రాక ఇంకేమొస్తాయి?

ఇంకొక విచిత్రం చెప్పనా !

సమాజంలో ఏ ఉద్యోగానికైనా ఒక అర్హత కావాలి. పాతిక ముప్పై ఏళ్ళు చదువుకొని, ఎన్నో పరీక్షలు వ్రాసి, కష్టపడితే గాని ఒక స్థాయి ఉద్యోగం రాదు. కానీ రాజకీయాలకు మాత్రం ఏ విధమైన అర్హతా అవసరం లేదు. 

ఆటోడ్రైవర్ మంత్రి కావచ్చు. మేకప్ మ్యాన్ ప్రభుత్వ చీఫ్ విప్ కావచ్చు. స్టూడియో బాయ్ స్పీకర్ కావచ్చు. "అనుభవం లేకుండా రాష్ట్రాన్ని ఎలా నడిపిస్తావు నాయనా?" అంటే, "ఐఏఎస్ లున్నారు కదా, వాళ్ళని పెట్టి నడిపిస్తాం" అంటారు. వాళ్లలో నిజాయితీపరులెందరు?

UPSC లో ఏడాదికేడాది క్వాలిటీ తగ్గిపోతున్నది. మజ్జిగ పలచబడిపోతున్నది. రెండు ముక్కలు ఇంగ్లీషు గట్టిగా మాట్లాడలేని వాళ్ళు IAS, IPS అవుతున్నారు. టెన్త్ తప్పినవాళ్లు, ఇంటర్ నాలుగుసార్లు రాసినవాళ్లు UPSC లో సెలక్ట్ అవుతున్నారు. చాలామందిలో కులపిచ్చి, డబ్బుపిచ్చి చాలా ఎక్కువగా ఉంటోంది. ఇవన్నీ నేను ప్రత్యక్షంగా చూసినవే. ఊహలు కావు.

నేను IRTS కేడర్ లో చూశాను. నిజాయితీపరులను, నిక్కచ్చిగా ఉండేవాళ్ళను, అవినీతి చెయ్యనివాళ్లను కనీసం వేళ్ళపైన కూడా లెక్కపెట్టలేము. చాలావేళ్ళు మిగిలిపోతాయి. అలా ఉంటుంది పరిస్థితి.

అది సెంట్రల్ సర్వీసయినా, స్టేట్ సర్వీసయినా, నిజాయితీగా, నిక్కచ్చిగా, ఎటూ మొగ్గకుండా, అవినీతికి పాల్పడకుండా, రూలు ప్రకారం పనిచేసే అధికారులు ఎక్కడా లేరు. అందరూ ఏదో ఒకచోట పడిపోయేవారే, ఏదో ఒక పార్టీకి, ఒక భావజాలానికి కొమ్ముకాసేవారే. ఉంటే గింటే నిజాయితీపరులు ఒకరిద్దరున్నారేమో అక్కడక్కడా ! వాళ్ళనెలాగూ పక్కన పెట్టేస్తారు కాబట్టి బాధ లేదు.

అనుభవం లేని నాయకులతో, నైతికస్థాయిలేని అధికారులతో రాష్ట్రాలుగాని, దేశాలుగాని ఎలా ఎదుగుతాయో, ఎక్కడకు ఎదుగుతాయో దేవుడికే ఎరుక !

ఇకపోతే మరొక కొసమెరుపు ! 

తన వ్యక్తిగతజ్యోతిష్కుడిని ప్రభుత్వసలహాదారుగా నియమించిన జోసెఫ్ విజయ్, అందరినుంచీ ప్రతిఘటన రావడంతో  ఆ ఆర్డర్ ను మర్నాడే హడావుడిగా కేన్సిల్ చేశాడు.

అసలు, క్రైస్తవం భారతీయజ్యోతిష్యాన్ని ఒప్పుకుంటుందా? జోసెఫ్ కి మన జ్యోతిష్యమెందుకు? లేక, అవసరం ఉంటే ఏదైనా పరవాలేదా?

ఆమాత్రం ఒత్తిడిని తట్టుకోలేనివాడు, ముందుముందు రాబోయే రాజకీయసంక్షోభాలను, బలపరీక్షలను, రాష్ట్రసమస్యలను ఎలా తట్టుకుంటాడనేది అసలైన ప్రశ్న !

మళ్ళీ, ఈ విమర్శించిన ప్రతిపక్షాలన్నింటికీ ఎవడో ఒక జ్యోతిష్కుడు, ఒక స్వామీజీ తప్పకుండా ఉంటారు. ఇందిరాగాంధీకి ధీరేంద్ర బ్రహ్మచారి, ఎన్టీ రామారావుకు మోహన్ రెడ్డి, ఇపుడు జోసెఫ్ విజయ్ కి రాధన్ పండిట్ ఇలా ప్రతి ఒక్కరికీ ఉంటారు. నార్త్ లో అయితే ఇంకా చాలామంది ఉంటారు. రాజకీయులకు, జ్యోతిష్కులకు, స్వామీజీలకు ఉండే అక్రమసంబంధాలు లోకానికి కొత్తేమీ కాదు.

కాకపోతే, ఈ మొత్తం ప్రహసనంలో ఒక్క విషయం మాత్రం అర్ధంకావడం లేదు. పదేళ్ల తర్వాత జోసెఫ్ విజయ్ సిఎం అవుతాడన్న విషయాన్ని ముందే చెప్పిన రాధన్ పండిట్ వట్రివేల్ కు, తనకు ఇవ్వబడిన పదవి ఒక్కరోజులో ఊడిపోతుందన్న సంగతి తెలుసా లేదా అనేదే ప్రశ్న ! తన జాతకం తను చూసుకోలేదా?

లోకానికి జోస్యాలు చెప్పే జ్యోతిష్కులకు, తమ జాతకం తమకే తెలీకపోవడం ఏంటో ఈ వింత ! 

ఎవరికీ దూరదృష్టి లేదు, సరియైన ప్లానింగ్ లేదు. నిజాయితీ లేదు, నిస్వార్ధధోరణి లేదు. ఇలాంటి తెలివిలేని దురాశాపరులైన ప్రజలతో, ఇలాంటి అవకాశవాద అవినీతి రాజకీయాలతో, అవినీతి అధికారులతో, ఈ దేశం, ఈ రాష్ట్రాలు బాగుపడటం చాలా కష్టం. ఏదో ఒక అద్భుతం జరిగితే తప్ప !

ఏంటా అద్భుతం?

ప్రతిరాష్ట్రానికీ ఒక యోగి, ఒక హిమంతశర్మ లాంటివాళ్లు ముఖ్యమంత్రులుగా ఉండటమే ఆ అద్భుతం. అలాంటి అద్భుతమేదీ కనుచూపుమేరలో కనిపించడం లేదు.

It happens only in India అనుకోవడం తప్ప ఈలోపల మనం చేసేదేముంది?

read more " ఏమి దేశం? ఏమి ప్రజలురా బాబు? "

1, మే 2026, శుక్రవారం

మా 78 వ పుస్తకం 'త్రిపురా రహస్యము' విడుదల

ఈరోజు వైశాఖ పౌర్ణమి పర్వదినం.

శ్రీహరికి పరమభక్తుడు మరియు మహా  సంకీర్తనాచార్యుడైన  అన్నమయ్య కూడా  ఈరోజే   జన్మించాడు. ఇవాళే బుద్ధునికి కూడా జ్ఞానోదయం కలిగింది. కనుక ఈరోజుకు గొప్ప ప్రాముఖ్యత ఉన్నది.

నా కలం నుండి వెలువడుతున్న 78 వ పుస్తకంగా 'త్రిపురా రహస్యము' 'ఈ-బుక్' ను నేడు విడుదల చేస్తున్నాను. శాక్తాద్వైత సాంప్రదాయానికి చెందిన మహత్తరమైన గ్రంథాలలో ఇది పేరుగన్నది.

ఇది జ్ఞానఖండము. అంటే, పూర్తిగా జ్ఞానభాగము. చిక్కని శాక్తాద్వైతభావజాలంతో కూడిన దీని శ్లోకార్థములను సాధ్యమైనంత తేలికైన తెలుగుభాషలో వివరించే ప్రయత్నాన్ని ఇందులో చేశాను.

దీనికంటే ముందు మాహాత్మ్యఖండమని ఒక భాగమున్నది. అది లభిస్తున్నది. దీని తరువాత చర్యాఖండమని ఇంకొక భాగమున్నది. అది లభించడం లేదు. ఇవన్నీ కలిపి మొత్తము 12 వేల శ్లోకములని చెప్పబడినది. మొత్తము 'త్రిపురారహస్యము' ఈ మూడు ఖండముల ఉద్గ్రంధము.

మాహాత్మ్యఖండములో 6687 శ్లోకములున్నాయి. జ్ఞానఖండములో 2163 శ్లోకములున్నాయి. కనుక చర్యాఖండములో 3150 శ్లోకములుండాలి. దేవీ సాధనావిధానములన్నీ దానిలోనే ఉన్నవి. కానీ అది దొరకడం లేదు. ఏ తురకల రాక్షసకాండలోనో తగలబడిపోయి ఉంటుంది. వీటిలో ప్రస్తుతము లభిస్తున్న జ్ఞానఖండమును మాత్రము ఇక్కడ విడుదల చేస్తున్నాము.

దత్తాత్రేయులవారు మహాజ్ఞాని మరియు మహాసిద్ధుడు. ఈయన పరశురాముని గురువు. ఇద్దరూ ఋషిపుత్రులే. ఒకరు అత్రితనయుడైతే, మరియొకరు జమదగ్ని తనయుడు. ఒకరు త్రిమూర్తిస్వరూపుడైతే, మరియొకడు దశావతారములలో ఒకరు. కనుక, వీరి సంవాదరూపమైన 'త్రిపురారహస్యము' నకు మన అద్వైతవేదాంతవాఙ్మయములో అత్యంతప్రముఖమైన స్థానమున్నది.

దత్తాత్రేయులకు అవతారములు లేవు. ఉన్నవని నేటివారు కల్పించారు. ప్రతివారినీ దత్తాత్రేయుల అవతారమని చెప్పుకోవడం కలిమాయలలో ఒకటి. అది వ్యాపారం మాత్రమే గాని, సత్యం కాదు. అన్నింటికీ అతీతుడై, పరమజ్ఞానరూపియైన దత్తాత్రేయుడు, మానవరూపంలో తిరిగి అవతరించడం, అల్పములైన మహత్యాలను అద్భుతాలను చెయ్యడం జరిగేపనులు కావని దత్తతత్త్వం కొద్దిగా తెలిసిన చిన్నపిల్లలకైనా అర్థమౌతుంది.

ముఖ్యంగా ఈ పిచ్చిభ్రమ మహారాష్ట్రలో ఎక్కువగా ఉన్నది. దానిని చూసి మన తెలుగువాళ్లు వాతలు పెట్టుకుంటున్నారు. కొంతమంది సోకాల్డ్ స్వామీజీలు దీనిని ప్రోత్సహిస్తున్నారు.

స్వాములు సత్యాన్ని చెప్పాలి. ఆశలకు అతీతంగా ఉండాలి. కానీ అలా లేరు. స్వార్ధం కోసం అబద్ధాలను వ్యాప్తి చేస్తున్నారు. అధర్మాన్ని అనుసరిస్తూ, ధర్మక్షీణతకు కారకులౌతున్నారు. రక్షించవలసినవారు చెడగొట్టడం, దిద్దవలసినవారు పెడదారి పట్టించడం కలిమాయలలో ఒకటి.

నేడు ప్రతివారినీ దత్తాత్రేయుని అవతారమని చెబుతున్నారు. అలా చెప్పుకుంటున్నవారు తెలుగురాష్ట్రాలలో కనీసం నలుగురున్నారు.  ధనదాహం, కీర్తికండూతి, అహంభావం - వీటికోసం ఏ విలువలనైనా వదులుకోవడానికి సిద్ధపడటం ఈ నాలుగూ తెలుగువారి దౌర్భాగ్యాలు. హిందువులలో తమ మతాన్ని గురించిన అసలైన జ్ఞానం పెరిగినప్పుడు మాత్రమే ఈ అజ్ఞానానికి మరియు దత్తాత్రేయుని పేరుతోను, ఇతర దేవతల పేర్లతోను జరుగుతున్న మతవ్యాపారానికి అంతం కలుగుతుంది.

త్వరలో దీని ఇంగ్లీష్ అనువాదం కూడా విడుదల అవుతుంది. రమణభక్తులైన శ్రీ మునగాల వెంకట్రామయ్యగారి ఇంగ్లీష్ అనువాదమే ఇప్పటివరకూ మనకు లభిస్తున్నది. ఇప్పుడు నా ఇంగ్లీషు అనువాదం కూడా మీ ముందుకు వస్తుంది.

నవీనకాలపు జ్ఞానులలో ముఖ్యులైన రమణమహర్షి ఈ గ్రంధమును ఎంతగానో అభిమానించేవారు. తన సంభాషణల మధ్యలో దీనినుంచి శ్లోకాలను కోట్ చేసేవారు. దీనిని బట్టి ఈ గ్రంధము యొక్క విలువ ఎంతటిదో అర్ధం చేసుకోవచ్చు.

సృష్టి ఎలా జరిగిందన్నది కాశ్మీరశైవమనబడే త్రికసంప్రదాయంలో చాలా చక్కగా వివరించబడింది. ఇటువంటి వివరణ ఏ మతంలోనూ, ఏ గ్రంథంలోనూ ఇవ్వబడి లేదు. అలా చెప్పగలగాలంటే ఆయా మతాలలో గొప్పవైన మేధాశక్తి, పరిశీలన, సత్యతృష్ణ, ఋజుజీవనములుండాలి. అవి లేవుగా మరి !

త్రికమనేది ఆధ్యాత్మికలోకంలో అత్యున్నతమైన సాంప్రదాయము, దీనికే శివాద్వైతమని పేరున్నది. ప్రస్తుతగ్రంధము శాక్తాద్వైత సాంప్రదాయమునకు చెందినది. శివశక్తులకు వేర్వేరుగా ఇవ్వబడిన ప్రాముఖ్యత తప్ప, మిగిలిన భావజాలమంతా ఈ రెండింటిలో దాదాపు ఒక్కటిగానే కనిపిస్తుంది. ఆ వివరణను, జ్ఞానులలోని భేదములెలా ఉంటాయన్న వివరమును, ఇతరములైన ఎన్నో అంతుబట్టని జ్ఞానరహస్యములను కూడా ఈ గ్రంధంలో మీరు చూడవచ్చు.

ఈనాడు సైన్సు ఊహిస్తున్న మల్టీ డైమెన్షనల్ యూనివర్స్, టైం ట్రావెల్, హోలోగ్రామిక్ మోడల్  ఆఫ్ యూనివర్స్ మొదలైన భావాలు ఈ ప్రాచీనగ్రంధంలో దాదాపు వెయ్యి సంవత్సరాలనాడే చెప్పబడి ఉండటం చూడవచ్చు.

ప్రస్తుతం ఈ బుక్ గా ఇక్కడ లభిస్తుంది.  త్వరలో ఇది ప్రింట్ పుస్తకంగా లభిస్తుంది. ఈ ఏడాది జరుగబోయే హైద్రాబాద్, విజయవాడ బుక్ ఎగ్జిబిషన్లలో మా స్టాల్లో దొరుకుతుంది. 

యధావిధిగా, ఈ గ్రంథరచనలో నాకు సహకరించిన శిష్యులకందరికీ ఆశీస్సులందిస్తున్నాను.

మహత్తరమైన ఈ గ్రంధమునకు నాచేత చేయబడిన వ్యాఖ్యానము జిజ్ఞాసువులకు, జ్ఞానపిపాసులకు అమితానందమును కలిగిస్తుందని, తెలుగుభాషలో ఈ గ్రంధము  ఒక మణిపూసగా మిగిలిపోతుందని ఆశిస్తున్నాను.
read more " మా 78 వ పుస్తకం 'త్రిపురా రహస్యము' విడుదల "