“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

18, నవంబర్ 2010, గురువారం

హస్త సాముద్రికం


జ్యోతిష్యం లో సాముద్రిక శాస్త్రం కూడా ఒక భాగం. దీనిలొ మనిషి యొక్క అవయవాలపొందికను, తీరును బట్టి అతని జీవితాన్ని చదవవచ్చు. దీనిలో హస్త సాముద్రికం ఒక విశిష్ట విద్య. వేళ్ళ అమరిక మనిషి మనస్తత్వాన్నితెలియచేస్తుంది. హస్త రేఖలు ఇంకా అనేక జీవిత వివరాలను తెలియ చేస్తాయి. జ్యోతిష్యం కంటే ఇది నేర్చుకోవటంతేలిక. కారణం ఏమంటే,దీనిలో విశ్లేషణలు ఉండవు. క్లిష్టమైన గ్రహ కారకత్వాలు ఉండవు. ఉన్న విషయం కళ్ళకు కట్టినట్లు చేతిలో కనిపిస్తూ ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే, ప్రతి మనిషీ తన జాతకాన్ని తన చేతిలోనే ఉంచుకుని తిరుగుతూ ఉన్నాడన్నమాట.


ఉదాహరణకు, ఉంగరపు వేలు చూపుడు వేలుకన్నా పొడవుగా ఉంటె క్రియా శీలురు ధనికులు అవుతారు. ఇది హస్తసాముద్రికం లో ఒక సూత్రం. ఒక విదేశీ యూనివర్శిటీ లో స్టాటిస్టికల్ స్టడీ ద్వారా ఈ మధ్యనే పరిశోధన చేసి ఇది నిజమేనని తేల్చారు. ఈ వార్త ఈ మధ్యనే "ఈనాడు" లో వచ్చింది కూడా.

అయితే స్టాటిస్టికల్ పరిశోధకులు గణాంకాలను బట్టి ఇది నిజమే అని తేల్చారు గాని ఎందుకు ఎలా ఇది జరుగుతుంది అనేది వారి బుర్రలకు తట్టలేదు. శాస్త్రం దీనిని వివరించి చెప్పింది. ఉంగరపు వేలు సూర్యునికి సూచిక. చూపుడు వేలు గురువు గారికి సూచిక. ఉంగరపు వేలు పొడవుగా ఉన్నప్పుడు అతనికి ఉత్సాహం, దూసుకుపోయే తత్వం,క్రియేటివిటీ,ధైర్యం ఉంటాయి. తినడం కంటే పనిచెయ్యటం మీద ధ్యాస ఎక్కువగా ఉంటుంది. కనుక అలాటివాళ్ళు జీవితంలో త్వరగా ఎదుగుతారు. ధనాన్ని, ఇన్ప్లూయెన్స్ ను సంపాదిస్తారు. ఆయా వ్యక్తిత్వలక్షణాలు ఈవిధంగా ఆయా శరీరభాగాలలో ప్రతిబింబిస్తుంటాయి. డిడక్టివ్ మరియు ఇండక్టివ్ లాజిక్ ను ఉపయోగించి ఇలాటి పరిశీలన ద్వారా మనిషి మనస్తత్వాన్ని, అతని అలవాట్లను స్వభావాన్ని, దాన్నిబట్టి భవిష్యత్తును ఊహించవచ్చు. అది చాలావరకు నిజం అవుతుంది.

మొన్న ఆరో తేదీన మా స్నేహితునికి హార్ట్ ఎటాక్ వచ్చింది. నేను వెళ్లి పలకరించాను. మాటల సందర్భంలో అతనుచెప్పినది విని నేను ఆశ్చర్య పోయాను.

"పదేళ్ళ క్రితం నా చెయ్యి చూచి నువ్వు చెప్పావురా. నీకు నలభై ఏళ్ల ప్రాంతంలో ప్రాణ గండం ఉంది.అది గుండెకు సంబంధించినదిగా ఉంటుంది.జాగ్రత్తగా ఉండు.అలవాట్లు,ఆహార విహారాదులలో జాగ్రత్త అని చెప్పావు.అలాగే జరిగింది." అన్నాడు

అప్పుడు నాకు గుర్తు వచ్చింది. ఒకసారి అతని చెయ్యి చూచి అలా చెప్పిన మాట నిజమే.

"ఇప్పుడు నీ వయసెంత?" అడిగాను.

"నలభై మూడు" చెప్పాడు.


మళ్లీ ఒకసారి అతని లైఫ్ లైన్ పరిశీలించాను.అది సరిగ్గా నలభై ఏళ్ళ ప్రాంతంలో తెగిపోయి ఉన్నది. కాని ఆ పక్కనుంచే మళ్లీ ఇంకొక రేఖ మొదలై పైకి ప్రయాణించింది. కనుకనే హార్ట్ ఎటాక్ వచ్చినా కూడా నిలదొక్కుకుని బయట పడ్డాడు.


మెడికల్ పామిస్ట్రీ ఒక అద్భుతమైన శాస్త్రం అనడానికి ఇంతకంటే రుజువు ఏమి కావాలి? "నాకు బాధగా ఉందిరాదేవుడా" అని రోగి మొత్తుకుంటున్నా కూడా అన్ని టెస్ట్ లూ చేయించి నీకేమీ రోగం లేదు. నీకు సైకోసిస్ అనబడే మానసిక భ్రమ మాత్రమే పొమ్మని వైద్యులు చేతులు దులుపుకుంటున్న ఈరోజులలో పదేళ్ళ తర్వాత రాబోతున్న గుండెజబ్బును ముందే చెప్పిన శాస్త్రం గొప్పదా కాదా?

ప్రపంచ ప్రఖ్యాత సాముద్రికుడు "కీరో" ఒకరోజున రైల్లో ప్రయాణం చేస్తూ ఉండగా పక్కవారి హస్తరేఖలు పరిశీలించాడు.విచిత్రంగా అందరికీ లైఫ్ లైన్ అనబడే జీవనరేఖ తెగిపోయి ఉండటమూ, అది తెగిపోయిన వయసు దాదాపుగా ప్రస్తుతవయసుతో సరిపోతూ ఉండటమూ,గమనించి పక్క స్టేషనులో దిగిపోయాడు.ఆ తర్వాత కొద్దిదూరానికే ఆరైలు ప్రమాదానికి గురై ఆబోగీలో ప్రయాణిస్తున్న అందరూ చనిపోయారు.కీరో బతికి బయట పడ్డాడు.యూరోపియన్ అయిన కీరో,కాశీలో కొన్నేళ్ళు నివసించి, కాశీ పండితులవద్ద హస్తసాముద్రికశాస్త్రం నేర్చుకున్నాడు.అతను హస్తాంగులీమంత్రాన్ని ఉపాసించేవాడని కొద్ది మందికే తెలుసు.

మన ప్రాచీనవిజ్ఞానంలో ఒకటైన హస్తసాముద్రికం వల్ల ఇలాటి ఆశ్చర్యకరమైన ఫలితాలు తెలుసుకోవచ్చు.మన భవిష్యత్తు బ్లూప్రింట్ మన చేతిలోనే ఉంది.అయితే దానిని డీకోడ్ చేసి, అర్ధం చేసుకొని, తెలివిగా ప్రవర్తించేవారు భవిష్యత్తుని తదనుగుణం గా మార్చుకునేవారు తక్కువ. దానికి ఎవరేం చెయ్యగలరు ? బుద్ది కర్మానుసారిణి కదామరి.