“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

5, నవంబర్ 2010, శుక్రవారం

సర్దార్ పటేల్ జాతకం-- జనన కాల సంస్కరణ

రాజకీయాలను నేను ఏ మాత్రం ఇష్టపడను. దానికి కారణం విలువలు లేని రాజకీయ నాయకులతో ప్రస్తుతం ఆ రంగం నిండిపోవటమే.

నా అభిమాన రాజకీయ నాయకులు ఎవరు అని అడిగితె ఇద్దరు ముగ్గురి పేర్లు మాత్రమెచెప్పగలను. వారూ ఇప్పటివారు కారు. ఇప్పుడు లేరు. వారిలో ఉక్కు మనిషి సర్దార్ పటేల్ ను నేను అమితంగా అభిమానిస్తాను. గౌరవిస్తాను. ఆయనలాటి ధృఢచిత్తం, దూరదృష్టీ ఉన్న నాయకులు ఇప్పుడు మన దేశానికి చాలా అవసరం.నేను గుజరాత్ లోని సోమనాధ ఆలయానికి వెళ్ళినపుడు ఆలయం లోని ఈశ్వరునికి ఎలా నమస్కరించానో అంతే భక్తిగా ఆలయం బయట ఉన్న సర్దార్ పటేల్ విగ్రహానికీ నమస్కరించాను. ఆయన ప్రధాని అయినట్లయితే మన దేశ రూపురేఖలు ఇలా ఉండేవి కావని ఎంతో బాగుండేవని నమ్మేవాళ్ళలో నేనూ ఒకడిని.

ఆయన జాతకాన్ని ఇక్క చూద్దాం. ఆయన యొక్క అసలైన జనన వివరాలు లేవని అందరూ అంటున్నారు. ప్రముఖ జ్యోతిష్కులైన కే ఎన్ రావుగారు కూడా ఇదే అభిప్రాయ పడ్డారు. కాని చాలా మంది అభిప్రాయం ప్రకారం ఆయన 31-10-1875 న గుజరాత్ లోని నాదియాడ్ అనే ఊళ్ళో జన్మించారు. జనన సమయం తెలీదు కనుక ఆయన జన్మ లగ్నాన్ని జ్యోతిష్కులు రకరకాలుగా ఊహించారు. పట్టుదలకు ప్రతిరూపం అయిన మకర లగ్నాన్ని చివరకు ఖాయం చేశారు. ఆది సమంజసంగా ఉంటుంది కూడా. ఆయన జాతకాన్ని ఇక్కడ ఇచ్చాను. దీనిని నేను కొంచెం ఫైన్ ట్యూన్ చేశాను. అదెలా చేశానో ఆ వివరాలు చూధ్ధాం.

ఆ రోజున మకర లగ్నం 12.15 నుంచి 14.03 గంటలవరకూ ఉంది. ఈ రెండు గంటల సమయంలో ఆయన యొక్క జనన నిముషాన్ని మనం కనిపెట్టాలి. దీనికి ప్రశ్న శాస్త్ర సహాయం తీసుకున్నాను. ఈ రోజు మధ్యాహ్నం నేను వేసిన ప్రశ్న చక్రంలో రూలింగ్ ప్లానెట్స్ ఇలా వచ్చాయి.

లగ్నాధిపతి= గురువు
లగ్న నక్షత్రాధిపతి= శని
చంద్రాధిపతి= రవి
చంద్ర నక్షత్రాధిపతి= కేతువు
వారాధిపతి= చంద్రుడు
హోరాధిపతి= గురువు

శని చంద్ర నక్షత్రంలో ఉన్నాడు. వారాధిపతి చంద్రుడు. కనుక చంద్రుడు రెండు సార్లు వచ్చాడు. గురువు కూడా రెండు సార్లు వచ్చాడు. కనుక వీరిద్దరూ రూలింగ్ ప్లానెట్స్ గా ఉన్నారు. రవి, కేతువులు రాహు నక్షత్రంలో ఉన్నారు. కనుక ఆయన జాతకంలో రాహు కేతువుల యోగం ఏదో ఉండి ఉండాలి. దీనికి సరిపోతూ ఆయన జాతకంలో కాలసర్ప యోగం ఉన్నది.

గురువు ప్రస్తుతం సున్నా డిగ్రీలలో బలహీనుడుగా ఉన్నాడు. మకర లగ్నం గురువుకు నీచ కనుక ఆ కారకత్వం ఇలా సరిపోయి మకర లగ్నాన్ని క్రరెక్ట్ గా సూచిస్తున్నది. కనుక అందులో చంద్ర నక్షత్రమైన శ్రవణం ఆయన లగ్న నక్షత్రమై ఉండాలి. ఆ శ్రవణం మకరంలో నాలుగో పాదం నుంచీ ఏడోపాదం వరకూ ఉంటుంది. ఆ సమయం మధ్యాహ్నం 12.55 నుంచి 13.40 వరకూ ఉంది. ఇప్పుడు రెండు గంటల సమయాన్నించి దాదాపు ఒక గంట సమయం మనకు కుదించబడింది. అందులోకూడా 13.09 కి దశాంశ లగ్నం మకరం అయ్యింది. దశాంశలో కూడా మకరంలో ఉచ్ఛస్థితిలోఉన్న కుజుడున్నాడు. ఈయన జాతకంలో ఉఛ్ఛస్థితిలో ఉన్న కుజుడు ప్రముఖపాత్ర వహిస్తున్నాడు. ఈయన జనన సమయం కూడా కుజహోరలోనే జరిగింది.

ఈ సమయానికి ఆయన జాతకం లోని మరికొన్ని వివరాలు సరిపోతాయా లేదా చూద్ధాం. ఈసమయానికి నవాంశ లగ్నం వృషభం అయ్యింది. అందులో శుక్ర కేతువులున్నారు. కనుక ఈయన భార్య ఒక దీర్ఘవ్యాధితో మరణించి ఉండాలి. ఈ సమయానికి వచ్చిన దశల ప్రకారం 1909 లో భార్య కేన్సర్ వ్యాధితో మరణించింది. అప్పుడు ఈయనకు కేతు/శని/శుక్ర దశ జరుగుతున్నది. కనుక ఈ సమయం సరిగానే ఉన్నది.

ఇకపోతే
దశాంశనుబట్టి ఈ సమయానికి ఇతర జీవిత వివరాలు చూద్దాం. 1917 లో ఆయన అహమదాబాద్ శానిటరీ కమిషనర్ గాఎన్నికయ్యాడు. అప్పుడు ఆయనకు శుక్ర/కుజ దశ జరుగుతున్నది. ఉచ్చ స్తితిలోని కుజ అంతర్దశ యోగించింది.

1947 నుంచి ఆయనకు కుజమహాదశ మొదలైంది. సెప్టెంబర్ 1948 లో ఆపరేషన్ పోలోను ధైర్యంగా అమలు జరిపి సంస్థానాలను విలీనం చేశాడు. అప్పుడు ఆయన జాతకంలో కుజ/గురు దశ జరుగుతున్నది. కుజుడు ఉఛ్ఛ స్థితిలోనూ గురువు మేషంలో చతుర్ధంలోనూ ఉండి ఈ సంఘటనను సూచిస్తున్నారు.

ఈయన కుజ/బుధ/శుక్ర దశలో డిసెంబర్ పదిహేనో తేదీన 1950 లో మరణించారు. చంద్రుని నుంచి కుజుడు ఆయుస్థానంలో ఉన్నాడు. బుధ శుక్రులు ద్వాదశంలో ఉన్నారు. చంద్రలగ్నానికి ఇద్దరూ మారకులే. కనుక అంతా సరిపోయింది.

ఈ సమయానికి ఆయన జనన నక్షత్రం అనూరాధ రెండవపాదం వచ్చింది. కుందస్ఫుటం ప్రకారం ఉత్తరాభాద్ర రెండవపాదం గా వచ్చి జనన సమయం సరియైనదే అని చూపిస్తున్నది.

ఈ విధంగా ఆయన జనన సమయాన్ని 13.09.05 గా నిర్ణయించాను.

మిగిలిన ఆయన జీవిత వివరాలు తరువాత పోస్ట్ లో చూధ్ధాం.