“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

29, ఫిబ్రవరి 2016, సోమవారం

ఊహ

సాయంత్రం వచ్చింది
చీకటి పడింది
నీ జ్ఞాపకాలు
నన్నావరించాయి

వెలుగుతో కూడిన

పగటి కంటే
చిమ్మ చీకటి
రాత్రే ఆనందం

కనిపించే నీకంటే
కనరాని నీ ఊహే
ఆమోదం

చెంత చేరినా
అర్ధం చేసుకోని నీకంటే
నిజం కాకున్నా అలరించే
నీ జ్ఞాపకమే మనోజ్ఞం

చేదు వాస్తవం కంటే
తియ్యని స్వప్నమే ఉత్తమం
ఏడిపించే నిజం కంటే
అలరించే అబద్ధమే ఉన్నతం

అందుకే
నాకెప్పుడూ కనిపించకు
అలా కనిపించి
నా ఊహలలోని నిన్ను దిగజార్చకు

మధురమైన నీ ఊహను
మలినమైన నీ స్పర్శతో
మట్టిలో కలపకు

నీ ఊహలతో మత్తెక్కిన
నా అంతరంగంలో
వాస్తవపు అల్పత్వాన్ని ఆవిష్కరించకు

నా మానసాలయంలో
నీ అడుగుల బురదను మోపి
నీ విగ్రహాన్ని నీవే మలినం చేసి
నిరాశకు నన్ను గురిచెయ్యకు

నిన్ను ఊహిస్తూ
నిర్మించుకున్న నా స్వప్నాన్ని
నిద్రలేపి నాశనం చెయ్యకు

నిన్ను స్మరిస్తూ
ఆనందంగా ఉన్న నన్ను
నీ రాక ద్వారా ఏడిపించకు

ఎందుకంటే...

కనిపించే నీకంటే
కనరాని నీ ఊహే
మధురం

ఊపిరి తీసే నీకంటే
ఊపిరితో ఊసులు చెప్పే
నీ ఊహే నా నేస్తం

ఎదురుపడి
ఏడిపించే నీ కంటే
అదృశ్యంగా ప్రేమించే
నీ ఊహే ఉన్నతం

అందుకే...

ఎప్పటికీ ఇలాగే 
నాకు దూరంగానే ఉండిపో
నాలోనే నాతోనే
నా ఊహగానే ఎప్పటికీ నిలిచిపో...
read more " ఊహ "

27, ఫిబ్రవరి 2016, శనివారం

ఆరాటం

ప్రియుని కోసం ఆరాటపడుతున్నావు
అతడు నీ ఎదుట నిలిస్తే
గుర్తించలేకున్నావు

సముద్రాన్ని త్రాగాలని ఆశిస్తున్నావు
నీ దాహమెంతో దాని తాహతెంతో
తెలుసుకోలేకున్నావు

ఆకసాన్ని అరచేతిలో పట్టుకుంటానంటావు
నీ అరచెయ్యి వైశాల్యమెంతో
నీవే గ్రహించలేకున్నావు

బండెడు అన్నం తిందామని ఊగుతున్నావు
నీ ఆకలి తీరడానికి ఒక్కముద్ద చాలని
అర్ధం చేసుకోలేకున్నావు

నిజంగా నీలో అంత ప్రేమే ఉంటే
నిన్ను ఆపగలవారెవ్వరు?
నిజంగా నీకంత ఆకలే ఉంటే
నిన్ను ఒద్దనేవారెవ్వరు?

నిజంగా నీ గొంతెండి పోతుంటే
నీకడ్డుగా వచ్చేవారెవ్వరు?
నిజంగా నీకంత తపనే ఉంటే
నీ హద్దుగా నిలిచేవారెవ్వరు?

అతనిని చూడకుండా
బ్రతకలేనంటే
నీకెదురు చెప్పేవారెవ్వరు? 

అతనిలో కలవకుండా
ఉండలేనంటే
కుదరదనే వారెవ్వరు?

నీ ప్రేమ నిజమైనదే అయితే
నిన్ను బంధించగల వారెవ్వరు?
నీ దీక్ష స్వచ్చమైనదే అయితే
దాన్ని విరమింపజేసే వారెవ్వరు?

అసలు విషయం అది కాదు
నీ ప్రేమలో బలమే లేదు 
నీ ఆశకు నువ్వొక బందీవి
నీ మనసుకు నువ్వొక అంగీవి

నీ తాహతును మించి
ఎక్కువగా ఆశిస్తున్నావు
నీ శక్తిని మించి
ఎక్కువగా కోరుతున్నావు

ప్రియుని నీవు కోరడం కాదు
అతనిలో నీవు కరగిపోవాలి
సముద్రాన్ని నీవు త్రాగడం కాదు
దానిలోనే నువ్వు మునిగిపోవాలి

ఆకసాన్ని అందుకోవడం కాదు
నీ పిడికిలిని నీవే విప్పాలి
అన్నాన్ని నీవు తినడం కాదు
నువ్వే ఆహారంగా మారాలి

ఆశించడం ఆపాలి
నువ్వే ఆహుతి కావాలి
ఆక్రోశం అణగాలి
ఆత్మార్పణ చెయ్యాలి

ఆ ధైర్యం నీకుందా?
ఆ స్థైర్యం నీకుందా?
ఏ ముగింపుకూ వెరవని
తెగింపు నీలో ఉందా?

ఉంటే --

అడుగో నీ ప్రియుడు
నీ ఎదుటే..
నీలోనే...
నువ్వే...
read more " ఆరాటం "

26, ఫిబ్రవరి 2016, శుక్రవారం

అవతార్ మెహర్ బాబా జీవితం - జాతకం - 9 (జీవిత గమనం - దశాప్రకరణం)

జనన సమయం 4.33 అని నిర్ధారణ అయ్యింది గనుక,ఇక దీని అనుగుణంగా మెహర్ బాబా జీవితాన్ని ఒక్కసారి స్థూలంగా పరికిద్దాం.

జనన సమయంలో జరుగుతున్న రాహుదశ 5-6-1900 తో అయిపొయింది. అంటే ఈయన జననసమయానికి రాహుదశ 6 సం -3 నె -10 రోజులు మిగిలి ఉన్నది.

5-6-1900 వరకూ రాహుదశ జరిగింది.
16 ఏళ్ళు గురుదశ 5-6-1916 వరకూ జరిగింది.
19 ఏళ్ళు శనిదశ 5-6-1935 వరకూ జరిగింది.
17 ఏళ్ళు బుధదశ 5-6-1952 వరకూ జరిగింది.
7 ఏళ్ళు కేతు దశ 5-6-1959 వరకూ జరిగింది.
మిగిలిన శుక్ర దశలో 31-1-1969 న శుక్ర - రాహు - సూర్యదశలో ఆయన మరణించాడు.

రాహుదశ (1894-1900)
బాల్యంలో గడచిన ఆరేళ్ళ రాహుదశలో చెప్పుకోదగ్గ విషయాలు లేవు.

గురుదశ (1900-1916)

ఈ గురుదశలోనే ఈయన గురుకటాక్షాన్ని పొందాడు.1900 లో గురుదశ మొదలుకావడం తోనే ఈయన గురువైన బాబాజాన్ పూనాకు వచ్చి చేరుకుంది.ఆ తర్వాత 12 ఏళ్ళ పాటు మేర్వాన్ కు సరియైన స్థాయి రావడం కోసం వేపచెట్టుక్రింద రాత్రీ పగలూ కూచుని ఈమె ఎదురు చూచింది.

1913 మే లో సైకిల్ మీద వెళుతున్న మెహర్ ను బాబాజాన్ దగ్గరకు రమ్మని పిలిచింది.అప్పుడు గురు-కుజ-గురుదశ జరిగింది.గురువు అనుగ్రహం గురువు ద్వారానూ, ఆత్మకారకుడైన కుజుని ద్వారానూ ఆయన్ను ఆ విధంగా తాకింది.

1914 జనవరిలో గురు - రాహు- రాహుదశ జరుగుతున్న సమయంలో బాబాజాన్ ఈయనకు ఆలోచనాలోకానికి అతీతమైన విశ్వానుభవాన్ని కలిగించింది.ఇది ఒక విచిత్రమైన యోగదశ.రాహువు గురువును సూచిస్తూ, షష్ఠ నవమాధిపతి అయిన నీచబుధునితో కలసి ఉన్నాడు.మామూలు మనుషులైతే ఈ సమయంలో చెడుస్నేహాలు చేసి నానా అలవాట్లు నేర్చుకుని భ్రష్టు పట్టి పోయి ఉండేవారు.కానీ మహనీయుల జాతకాలు విభిన్నంగా ఉంటాయి.ఇంతకు ముందు చాలాసార్లు వ్రాశాను.మామూలు మనుషుల జాతకాలలో చెడుఫలితాలు ఇచ్చే యోగాలు వీరి జాతకలలో అత్యున్నతమైన ఫలితాలిస్తాయి అని.

రాహువుచేత మ్రింగబడిన నీచ బుధునివల్ల - సద్గురు అనుగ్రహంతో లభించిన 'మనోలయం' అనే స్థితి ఇక్కడ మనకు దర్శనమిస్తున్నది.అంటే ఆ సమయంలో ఈయన మనస్సుకు బుద్ధికి అతీతమైన భూమికను రుచి చూచాడు.ఇది ఈయన ప్రయత్నంతో కలిగిన స్థితి కాదు.పూర్తిగా గురు అనుగ్రహమే దీనికి కారణం.అయితే ఆ అనుగ్రహాన్ని పొందటానికి కావలసిన కష్టాన్ని ఆయన గత జన్మలలో పడి ఉన్నాడు.కనుక ఈ జన్మలో అది తేలికగా అందింది.

తరువాత ఎన్నో ఏళ్ళకు ఈయన అమెరికాకు వెళ్ళిన సమయంలో ఒక ప్రసిద్ధ మైండ్ రీడర్ ఈయన్ని పరీక్షించాడు.ఆ వ్యక్తి ఎదుటి మనిషి మనస్సును తేలికగా చదివేశక్తి ఉన్నవాడు.ఎదుటి మనిషి ఆలోచన ఏమిటో అతను చెప్పగలడు.కానీ మెహర్ బాబా మైండ్ ను ఆయన చదవాలని ప్రయత్నించినప్పుడు అతనికి ఒక "విశాలమైన శూన్యం" మాత్రమే దర్శనమిచ్చింది.అందులో ఏముందో అతను చదవలేకపోయాడు.

అప్పుడు మెహర్ బాబా ఇలా అన్నాడు.

'మామూలు భాషలో చెప్పాలంటే నాకు మనస్సనేది లేదు.నాలో ఉన్నది విశ్వ మానసం (Universal Mind) మాత్రమే.దానిని ఇంకొక విశ్వమానసం మాత్రమే చదవగలదు.'

1915 డిసెంబర్ లో గురు-రాహు-శుక్రదశ జరిగిన సమయంలో ఈయన సాయిబాబానూ, ఉపాసనీ మహరాజ్ నూ దర్శించాడు.గురురాహువుల గురించి పైన వ్రాశాను.ఇక్కడ ఇంకొంత వివరిస్తాను.

సామాన్యంగా రాహుశుక్రుల స్పర్శవల్ల జాతకునిలో కాముకత అధికమౌతుంది.కానీ ఇక్కడ ఉన్న గురుకటాక్షం వల్ల అది మ్రింగబడి, పరిణామం చెందింది.నిగ్రహింపబడిన కామశక్తే ఆధ్యాత్మిక శక్తిగా మారుతుంది.కామశక్తిని వృధా చేసేవారు ఎన్నటికీ ఆధ్యాత్మికంగా ఎదగలేరు.అది అసంభవం.

కానీ ఈ జాతకంలో శుక్రుడు పంచమాధిపతిగా లగ్నంలోకి వచ్చి ఉన్నాడు. కనుక ఈ ఇద్దరు సద్గురువుల అనుగ్రహం ఆయనకు లభించింది.1916 తో గురుదశ అయిపోయిందన్న విషయం గమనిస్తే,దశల ప్రకారం జీవిత సంఘటనలు ఎంత ఖచ్చితంగా జరుగుతాయో విశదమౌతుంది.

శనిదశ (1916-1935)

నవమ దశమాలతో ఉన్న సంబంధం వల్ల శని ఈ జాతకంలో గొప్ప ఆధ్యాత్మిక యోగాన్నిస్తున్నాడు.నిజమైన ఆధ్యాత్మికతను ఇచ్చేది ఎప్పుడైనా సరే శని భగవానుడే.ఈయన అనుగ్రహం లేకుంటే మనిషి ఆధ్యాత్మికంగా ఎన్నటికీ ఎదగలేడు.ఒక మనిషి జీవితంలో శనిదశ రాకపోతే ఆ జీవితం ఉత్త పనికిమాలిన జీవితం అవుతుంది.నిజమైన పాఠాలనూ శనిదశ మాత్రమే నేర్పుతుంది.నిజమైన ఔన్నత్యాన్ని కూడా శనిదశ మాత్రమే ఇస్తుంది.అలాగే మెహర్ బాబా జాతకంలో జరిగిన 19 ఏళ్ళ శని దశలో ఎన్నో అద్భుతమైన సంఘటనలు జరిగాయి.

1916-17 వరకూ శని-శనిదశ(దాదాపు మూడేళ్ళు)లో సగం జరిగింది.ఆ సమయంలో ఈయన పూర్తిగా మత్తులో మునిగిన స్థితిలో ఒక పిచ్చివాడిలాగా ఉండేవాడు.ఈ స్థితిలో ఉన్నవాళ్ళను సూఫీ పరిభాషలో 'మస్తు' లంటారు. ఇదే సమయంలో ఆయన ఎన్నో ఘజల్స్, సూఫీ ప్రేమగీతాలూ వ్రాశాడు.వాటిని గొంతెత్తి మధురంగా పాడేవాడు కూడా.ఇదే సమయంలో తన తలను గోడలకు గొబ్బెలకు వేసి బాదుకుంటూ ఉండేవాడు. బాబాజాన్ స్పర్శవల్ల కలిగిన శక్తిప్రసారంతో తల లోపల ఉన్న పినియల్, పిట్యూటరీ గ్రంధులు రూపాంతరం చెందుతూ ఉండటమే ఆ తలనొప్పికి గల అసలైన కారణం.

ఇదే సమయంలో తల్లి గొడవను తట్టుకోలేక ఒక టీచర్ గా కొన్నాళ్ళు పనిచేశాడు.ఆ తర్వాత ఒక సంచార నాటక కంపెనీలో పనిచేశాడు.ఆ తర్వాత తన తండ్రి ప్రారంభించిన టీ దుకాణం లోనూ, కల్లు దుకాణం లోనూ పనిచేసేవాడు. కల్లు దుకాణంలో ఉన్నప్పటికీ నిరంతరం తండ్రీ కొడుకులు దైవ ప్రేమను గురించి అదిచ్చే అమితమైన మత్తును గురించీ మాత్రమే మాట్లాడుకుంటూ ఉండేవారు.మేర్వాన్ అందరికీ కల్లు పోసేవాడు కాదు.బాగా అలవాటు పడిన త్రాగుబోతులకు మాత్రం - ఈ అలవాటు మంచిది కాదనీ - దాన్ని మానుకోమ్మనీ హితబోధ గావించేవాడు.

సారాయి కొట్లో కూచుని సారాయి తాగవద్దని కష్టమర్స్ కి చెబుతూ బ్రతిమాలుతూ,వారికి ఆధ్యాత్మిక బోధలు చేస్తూ ఉంటే ఆ వ్యాపారం ఎన్నాళ్ళు సాగుతుంది?

నేనొక సారి డిల్లీలో ఉన్న సాగర్ పబ్లికేషన్స్ వారి ఆఫీస్ కు వెళ్లాను.అదే వాళ్ళ బుక్ షాప్ కూడా.అనేక జ్యోతిష్య పుస్తకాలను వాళ్ళు పబ్లిష్ చేస్తూ ఉంటారు.

నేనక్కడ ఉన్నపుడు జమ్మూ నుంచి ఒక అమ్మాయి అబ్బాయి అక్కడకు వచ్చారు.వారి తాతయ్య ఒక జ్యోతిష్య పండితుడు.ఆయనేవో కొన్ని పుస్తకాలను కొని తెమ్మని వీళ్ళనా షాపుకు పంపాడు.వీళ్ళు నాతో మాటలు కలిపారు.మీరు ఏమేమి పుస్తకాలు కొనబోతున్నారని నేను వారిని అడిగాను.వాళ్ళొక లిస్టును నాకు చూపించారు.అవేవీ జ్యోతిష్యంలో మంచి పుస్తకాలు కావు. కానీ ఖరీదైన పుస్తకాలు.నేను నా ధోరణిలో కుహనా జ్యోతిష్యాన్నీ కుహనా జ్యోతిష్కులనూ విమర్శించాను.ఆ పుస్తకాలు కొనద్దనీ అసలైన మంచి పుస్తకాలు తక్కువధరలో వేరే ఉన్నాయనీ వాళ్లకు చూపసాగాను.ఆ దెబ్బతో వాళ్ళు ఏ పుస్తకాలనైతే కొనాలని వచ్చారో ఆ పుస్తకాలను కొనాలన్న సంకల్పాన్ని మార్చుకున్నారు.ఇదంతా షాపు ఓనరు తన రూము యొక్క గ్లాసు వాల్ లోనుంచి గమనిస్తున్నాడు.

ఆయన నా దగ్గరకు వచ్చి మర్యాదగా ఇలా అన్నాడు.

'సార్. ఒక్కసారి ఇలా వస్తారా?'

ఇలా అంటూ ఆయన నన్ను తన రూములోకి తీసుకెళ్ళి, కూచోబెట్టి, నాకు 'టీ' ఆఫర్ చేశాడు.అంటే మర్యాదగా నన్ను వారినుంచి ఐసోలేట్ చేశాడన్నమాట.

ఆయన చెప్పకుండానే నా తప్పు నాకర్ధమైంది.

వాళ్ళ షాపులో నిలబడి, వచ్చిన వాళ్ళందరికీ నేను అసలైన జ్యోతిష్యం గురించి లెక్చరు చెబుతూ ఉంటే, వారి వ్యాపారం సాగదు. వచ్చినవాళ్ళు కొనకుండానే వెనక్కు వెళ్ళిపోతారు.అది తప్పే కదా??

ఆయనకు సారీ చెప్పి, నాక్కావలసిన పుస్తకాలు తీసుకుని నా దారిన నేను బయటకు వచ్చేశాను.

వాళ్ళ నాన్నగారి కల్లుపాకలో మేర్వాన్ కూడా ఇదేపని చేసేవాడు. కల్లుదుకాణం కౌంటర్లో ఉన్నవాడు - "కల్లు మానండోయ్ బాబూ కళ్ళు తెరవండోయ్" - అని పాటలు పాడుతుంటే ఇంక ఆ వ్యాపారం ఎలా సాగుతుంది?

ఇదే సమయంలో మేర్వాన్ లో కొన్ని అతీత శక్తులు వికసించడం మొదలు పెట్టాయి.ఇతరుల మనస్సులలో ఏమి ఆలోచిస్తున్నారో అతనికి తెలిసిపోతూ ఉండేది.సాధనామార్గంలో ఇలాంటి శక్తులు కలగడం సహజమే.

ఈ సమయంలో జరిగిన ఒక సంఘటన మనకు లభిస్తున్నది.

మేర్వాన్ కు ఒక ముస్లిం పరిచయస్తుడు ఉండేవాడు.అతను ఒకరోజున ఇలా అనుకున్నాడు.

'కొన్నాళ్ళుగా మాంసాన్ని ఎక్కువగా తింటున్నాను.ఇకపైన కొంతకాలం అది ఆపి చేపలను తింటాను.'

అతను ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు.ఊరకే తనలో తాను అనుకున్నాడు.

మర్నాడు ఉదయమే సైకిల్ తొక్కుకుంటూ తన ఇంటికి వస్తున్న మేర్వాన్ ను అతడు చూచాడు.అతని చేతిలో ఒక చేప ఉన్నది.సైకిల్ ఆపి, ఆ చేపను ఇతనికి ఇచ్చి, మాట్లాడకుండా మళ్ళీ సైకిల్ వేసుకుని వెళ్ళిపోయాడు మేర్వాన్. ఇలాంటి సంఘటనలు ఆ సమయంలో చాలా జరిగాయి.

1917-19 మధ్యలో మిగిలిన సగం శని-శని దశ జరిగింది.ఈ సమయంలో ఒక మిత్రునితో కలసి తన స్వంత కల్లు దుకాణం ప్రారంభించాడు మేర్వాన్.ఆ దుకాణం పక్కనే ఒక గదిలో తన మొదటి ఆశ్రమాన్ని మొదలు పెట్టాడు.ఇదే సమయంలో ఆయన ఆధ్యాత్మిక స్థాయికి ప్రభావితులై మిత్రులు, బంధువులు,శిష్యులుగా చుట్టూ చేరడం ప్రారంభించారు.దుకాణంలో పనిలేని సమయంలో ఆ గదిలో చేరి కీర్తనలు భజనలు పాడుతూ ఉండేవారు.లేదా వాళ్లకు ఆధ్యాత్మిక సూచనలిస్తూ ఉండేవాడు.ఇదే సమయంలో నాగపూర్ కు చెందిన తాజుద్దీన్ బాబాను సందర్శించాడు.అలాగే- బోర్గాడ్ పర్వతం మీద ఒక గుహలో ఉపాసనీ మహరాజ్ తో కలసి కొన్నాళ్ళు నివసించి సాధన గావించాడు.

1919-22 శని-బుధ దశ
ఈ దశ మొదలు కావడం తోనే మళ్ళీ ఈయన జీవితంలో మార్పులు కలిగాయి.పూనాకు తిరిగి వచ్చిన ఈయన ఎక్కువకాలం ఏకాంతంగా ఉండటం సాగించాడు.నవమాధిపతిగా రాహువుతో కలసి ఉన్న నీచ బుధుడు తన ప్రభావం చూపడం మొదలు పెట్టాడు.ఎప్పుడూ ఒక చీకటి గదిలో పడి ఉండేవాడు.ఒక సందర్భంలో నైతే, ఎవరిదో మనుషుల పెంటను తన మీదా తన చుట్టూరా పోసుకుని ఒక రాత్రంతా ఆ కంపులో ఒక చీకటి గదిలో పడి ఉన్నాడు.ఆ తర్వాత మళ్ళీ భోర్గాడ్ పర్వత గుహకు వెళ్లి అందులో 40 రాత్రులూ పగళ్ళూ ఉపవాస దీక్షలో ఉన్నాడు.ఇదంతా రాహు బుధుల ప్రభావమే.

1921 లో ఈయన మళ్ళీ ఉపాసనీ మహరాజ్ తో నివసించడం మొదలుపెట్టాడు.ఇదే సమయంలో ఈయనను పూర్తిగా భౌతిక ప్రపంచంలోకి తెచ్చే పనిలో ఉపాసనీ మహరాజ్ కృతకృత్యుడైనాడు.

'మేర్వాన్ ను నేను సిద్ధపురుషునిగా మార్చాను.అతనిని అనుసరించండి. సాయిబాబా నాకిచ్చిన తాళంచెవిని ఇప్పుడు మేర్వాన్ కు ఇచ్చాను.అతని ప్రతి ఆజ్ఞనూ నోరెత్తకుండా పాటించండి.' అని ఉపాసనీ మహరాజ్ తన శిష్యులకు చెప్పేవాడు.ఆ క్రమంలో అప్పటివరకూ ఉపాసనీ మహారాజ్ శిష్యులైన మెహర్ బాబా పినతల్లీ ఇంకొందరు బంధువులూ మెహర్ బాబా భక్తులుగా మారారు.కానీ పూనాకు చెందిన ఉపాసనీ శిష్యులు మాత్రం మెహర్ బాబాను ఒప్పుకోలేదు.

ఇదే సమయంలో ఒక్క మనిషి మాత్రమే పట్టే ఒక చిన్నఇరుకు గుడిసెను నిర్మించుకుని అందులో కొంతకాలం పాటు గడిపాడు మెహర్ బాబా.ఇలాంటి విచిత్రమైన పనులు ఆయన చాలా చేస్తూ ఉండేవాడు.ఆయన గురువైన ఉపాసనీ కూడా ఇలాంటి అంతుబట్టని పనులు చాలా చేస్తూ ఉండేవాడు.అదే లక్షణం గురువు నుంచి శిష్యునికీ వచ్చింది.

1922-23 శని-కేతు దశ

ఈ దశలో తీవ్రమైన సాధనా జీవితం ఎలా గడపాలో తన శిష్యులకు నేర్పించాడు. ఈ దశ మొదలు కావడంతోనే తన 45 మంది శిష్యులతో కలసి పూనా నుంచి బాంబే కు నడుచుకుంటూ వెళ్లి అక్కడ తన మొదటి ఆశ్రమాన్ని స్థాపించాడు.దానిపేరే 'మంజిలే మీమ్'. ఈ మాటకు అర్ధం - 'గురుస్థానం' అని.

తన జీవితంలో శని కేతువుల యోగదశలు ఎప్పుడు వచ్చినా ఆ సమయంలో తీవ్రమైన లోతైన ఆధ్యాత్మిక జీవితాన్ని ఆయన గడిపాడు.తన చుట్టూ ఉన్న వారిచేత కూడా గడిపించాడు.దీనికి కారణం శనికేతువులిద్దరూ నవమంలో ఉండటమే.ఇది తీవ్రమైన వైరాగ్య యోగం అవుతుంది.

ఈ ఆశ్రమ నియమాలు చాలా కఠినంగా ఉండేవి.

ఈ ఆశ్రమ వాసులు ఉదయం 4 కే నిద్ర లేవాలి.చన్నీళ్ళు స్నానం చెయ్యాలి. రాత్రి 9 కి నిద్ర పోవాలి.ఈ మధ్యలో ఇతర సంభాషణలూ,న్యూస్ పేపర్లూ పుస్తకాలూ చదవటమూ,పిచ్చిమాటలూ,పిచ్చి కబుర్లూ ఏవీ పనికిరావు. స్నేహితులతోగాని బంధువులతోగాని ఎలాంటి సంబంధమూ పనికి రాదు. లోకంలో ఏం జరుగుతున్నదో పట్టించుకోకూడదు.లైంగికసుఖానికి పూర్తిగా దూరంగా ఉండాలి.జపం ధ్యానం చెయ్యాలి. ఖవ్వాలీలూ సూఫీ ప్రేమగీతాలూ పాడుకోవచ్చు.శరీర శ్రమకోసం ఆడుకుంటే కొన్ని అమాయకమైన ఆటలు ఆడవచ్చు.ఆశ్రమంలో ఉండే రోజువారీ పనులు చేసుకోవాలి.

ఇలాంటి భయంకరమైన జీవితానికి తోడు - అహంకారం అణచడానికి ప్రతిరోజూ బాబా పెట్టే పరీక్షలను ఎదుర్కోవాలి.ఇదొక చాలా కఠినమైన జీవితం.ఇలా జీవించడానికి ఇష్టపడిన 45 మంది మొదటి బ్యాచ్ శిష్యులు ఆయనతో ఆ సమయంలో ఉన్నారు.ఈ సమయంలో తన దగ్గరకు రమ్మని,తన ఆశ్రమంలో ఉండమనీ ఉపాసనీ బాబా అనేక సార్లు పిలిస్తే మెహర్ బాబా తిరస్కరించాడు.

అలా పది నెలల సాధన తర్వాత ఉన్నట్టుండి ఒకరోజున ఆ ఆశ్రమాన్ని రద్దు చేస్తూ మెహర్ బాబా ఆజ్ఞ ఇచ్చాడు.తనతో వచ్చిన వారినందర్నీ మళ్ళీ వెనక్కు వెళ్ళిపొమ్మని చెప్పేశాడు.ఈ ప్రయోగంతో వచ్చిన 'మోనోటోనీ' ని తొలగించడమూ, కొంతమంది శిష్యులలో పెరుగుతున్న అహంకారాన్నీ, పొసెసివ్ దృక్పధాన్నీ పోగొట్టడమే ఈ చర్య వెనుక ఉన్న కారణాలు.

(ఇంకా ఉంది)
read more " అవతార్ మెహర్ బాబా జీవితం - జాతకం - 9 (జీవిత గమనం - దశాప్రకరణం) "

25, ఫిబ్రవరి 2016, గురువారం

అవతార్ మెహర్ బాబా జీవితం - జాతకం - 8 (జననకాల సంస్కరణ)


ఈ రోజు తేదీల ప్రకారం  మెహర్ బాబా జన్మదినం.మెహర్ బాబా జనన సమయాలు మనకు రెండు లభిస్తున్నాయని చెప్పాను.అవి 4.30 AM మరియు 5.00 AM.ఈ రెంటిలో ఏది సరియైన సమయమో లేదా ఈ రెండూ కూడా కాకుండా మూడోది ఏదైనా ఉన్నదేమో ఈరోజున మనం పరిశీలిద్దాం.

అయనాంశల విషయాని కొస్తే నేను లాహిరీ అయనాంశనే అనుసరిస్తాను.ఇతర అయనాంశలను నేను నమ్మను.ఈ అరగంటలో మూడు నవాంశలు,మకరం నుంచి మీనం       వరకూ మారుతాయి.ఈ మూడింటిలోనూ మకర నవాంశ అయితేనే ఈయన జీవితానికి సరిపోతుంది. కనుక మకర నవాంశను ఖాయం చెయ్యడం జరిగింది.ఈ నవాంశ 4.30 నుంచి 4.35 లోపు ఉదయిస్తుంది.కనుక ఈలోపే జనన సమయం ఉండాలి.

4.30 నుంచి 4.33 వరకూ వృషభ విమ్శాంశ ఉదయిస్తున్నది.అప్పుడు నీచభంగ గురువు నవమంలో ఉంటాడు.ఆ తర్వాత మిథున విమ్శాంశ అవుతుంది.అదైతే ఆయన జీవితానికి సరిపోదు కనుక ఈ మూడు నిముషాలలోనే జననం జరిగి ఉండాలి.రెండు మూడు నిముషాల వ్యవధిలో జననకాల సవరణ చెయ్యాలంటే షష్ట్యంశ స్థాయిని చూడాలి.ఎందుకంటే ఆ స్థాయిలో ప్రతి రెండు నిముషాలకూ లగ్నం మారిపోతుంది.

అందులో చూస్తే - 4.30 & 4.31 వృషభ లగ్నం అయింది.4.32 & 4.33 మిథునలగ్నం అయింది.కనుక రెండవ సెట్ సరియైన జనన సమయం అవుతుంది.ఎందుకంటే అప్పుడే ఆధ్యాత్మిక యోగాన్ని సూచిస్తూ నవమంలో శని శుక్రులు వస్తారు.

ఇకపోతే - చివరిగా - ఈ రెండు నిముషాలలో ఏది సరియైనదో చూడాలి.4.32 అయితే-హోరాలగ్నం నాలుగులోనూ, ఘటీలగ్నం ఆరులోనూ పడుతున్నాయి.ఈయన తల్లిదండ్రులు అంత ధనికులు కారు.ఈయనకు పేరుప్రఖ్యాతులు బాగానే ఉన్నాయి. కనుక ఇది సరికాదు.

4.33 అయితే,హోరాలగ్నం అయిదులోనూ ఘటీలగ్నం తొమ్మిదిలోనూ పడుతున్నాయి.ఈయనకు ధనం అంతా శిష్యులనుంచీ,లోకప్రసిద్ధి అంతా ఆధ్యాత్మికం వైపునుంచీ కలిగింది.కనుక 4.33 ఈయన యొక్క సరియైన జనన సమయం అని నేను నిర్ధారిస్తున్నాను.

ఈ సమయాన్ని ఇంకా శల్యపరీక్ష చెయ్యడానికి ఇంకొంత తతంగం ఉన్నది.ఈ సమయానికి జీవితంలోని ముఖ్య సంఘటనలు సరిపోతున్నాయా లేదా పరిశీలించాలి.ఈ పరిశీలనకు ఆయన జీవితం నుంచి ముఖ్యమైన కొన్ని సంఘటనలనూ తేదీలనూ తీసుకున్నాను.

అవేమిటంటే -

Date Event దశ
25-2-1894
జననం
రా-శు-శు-కు-శు
31-1-1969 మరణం శు-రా-సూ-గు
23-1-1922 మొదటి శిష్య బృందం చేరిక శ-బు-శ-గు
7-5-1924 నెలరోజుల ఉపవాసం శ-శు-కు-చం
10-7-1925 జీవితాంత మౌనం మొదలు శ-శు-శ-సూ
1-4-1928  మెహర్ బాబా కోసం
బాబాజాన్ రావడం
శ-చం-శ-గు
25-2-1943 తల్లి మరణం బు-చం-శ-బు
10-2-1954 అవతార ప్రకటన కే -సూ-గు-గు


జననం

శుక్రుడు పంచమాధిపతి. రాహువు పంచమంలో ఉన్న గురువుకు సూచకుడు. కుజుడు ఆత్మకారకుడు.కనుక ఆధ్యాత్మికయోగాలను సూచిస్తూ జనన సమయ దశ ఖచ్చితంగా సరిపోయింది.

మరణం

వక్రించిన శుక్రుడు లగ్నంలో ఉన్నాడు.రాహువు తృతీయవాసిగా సహజ మరణ కారకుడుగా దోషి. గురువు ఈ లగ్నానికి మంచివాడు కాదు.వ్యయాధిపతి.సూర్యుడు అష్టమాధిపతిగా మారకుడు.కాబట్టి మరణ దశ సరిపోయింది.

మొదటి శిష్య బృందం చేరిక

శని బుధులు తృతీయ నవమాలతో ఉన్న సంబంధం వల్ల ఆధ్యాత్మిక యోగ కారకులు.గురువు పంచమంలో ఉన్నాడు.

నెలరోజుల ఉపవాసం

శనిశుక్రదశ ప్రభావం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.చంద్రుడు సహజ ఆహార కారకుడుగా శనితో కలసి ఉపవాసాన్ని సూచిస్తున్నాడు.కుజుడు ఆత్మ కారకుడుగా తనంతట తాను ఆహారాన్ని మానుకోడాన్ని సూచిస్తున్నాడు.

జీవితాంత మౌనం

శని శుక్రుల దశలో ఇంకేం జరుగుతుంది? పైగా శుక్రుడు వక్రించి వాక్స్థానంలో ఉన్నాడు.సూర్యుడు అష్టమాదిపతిగా నష్టాన్ని సూచిస్తున్నాడు.

మెహర్ బాబా కోసం బాబాజాన్ రావడం

దశమంలో ఉన్న ఉచ్ఛశని-చంద్రులు గొప్పదైన ఆధ్యాత్మిక యోగాన్నిస్తున్నారు.పంచమంలో గురువే ఉన్నాడు.కనుకనే బాబాజాన్ ఈయన ఆశ్రమాన్ని వెదుక్కుంటూ ఆరోజున వచ్చింది.

తల్లి మరణం

తల్లిని సూచిస్తున్న చతుర్దానికి ద్వాదశంలో బుధుడు నీచలో ఉన్నాడు. మాత్రుకారకుడైన చంద్రుడు మారకునిగా శనితో కలసి దశమంలో ఉండి మాతృస్థానాన్ని చూస్తున్నాడు.కనుకనే ఈ దశలో తల్లి మరణం జరిగింది.

అవతార ప్రకటన

కేతువు నవమంలో ఉంటూ ఉచ్ఛబుధునికి సూచకుడుగా గొప్పదైన ఆధ్యాత్మికతను ఇస్తున్నాడు.సూర్యుడు అష్టమాధిపతిగా ద్వితీయంలో ఉంటూ నిగూఢమైన స్టేట్ మెంట్ ను చూపిస్తున్నాడు.గురువు పంచమంలో ఉన్నాడు.ఆయనకు విమ్శాంశలో నీచభంగం అయింది.కనుక ఆ రోజున అలాంటి స్టేట్ మెంట్ ఇచ్చాడు.   

June 1924 -Dec 1924

ఈ సమయంలో తన శిష్యబృందంతో కలసి పశ్చిమ భారతం, దక్షిణ భారతాలలో ఈయన సంచరించాడు.యాత్రికులకు నమస్కరిస్తూ, కుష్టువారికి సేవచేస్తూ కాలం గడిపాడు. అప్పుడు శని-శుక్రదశలో రాహు, గురు అంతర్దశలు జరిగాయి.శని శుక్రదశలో రాజుకూడా బిచ్చగాడిలాగా దేశాలు పట్టుకుని తిరుగుతాడు.ఇక్కడా అదే జరిగింది.ఒక షెల్టర్ అనేది లేకుండా ఊరూరా తిరుగుతూ యాత్రికులకు నమస్కరిస్తూ కుష్టువారి వ్రణాలు కడుగుతూ కాలం గడపడం ఖచ్చితంగా ఈ దశా ప్రభావమే.

20-12-1927 -- 26-2-1928

శని-చంద్ర దశలలో గురు,శని అంతర్దశలు ఈ సమయంలో జరిగాయి.ఈ రెండు నెలలూ ఈయన ఒక నేలమాళిగ లాంటి గదిని తవ్వించుకుని అందులో ఉండిపోయాడు.ఆ సమయంలో అందులో కూచుని ఏదో పుస్తకం వ్రాసేవాడు. అదేమిటో ఇప్పటికీ ఎవరికీ తెలియదు.ఈ సమయంలో తన శిష్యబృందంలో అర్హులైన కొద్దిమందిని మాత్రమే ఎంచుకుని వారికి అంతరిక జీవనంలో ప్రత్యేకంగా మార్గదర్శనం చేశాడు.వారిలో చాలామందికి అతీతమైన సమాధి స్థితులూ, భావ పారవశ్యమూ కలిగాయి.వారిలో ఒక కుర్రవాడైతే ఏకంగా నాలుగురోజుల పాటు  సమాధిస్థితిలో ఉండిపోయాడు.ఆ తర్వాత ఎన్నో ఏళ్లకు ఆ నేలమాళిగే ఆయన సమాధి అయ్యింది.

శనిచంద్రులు మౌనాన్నీ,తన ప్రపంచంలో తాను ఉండటాన్నీ,అంతర్ద్రుష్టినీ, ఇంట్రావర్ట్ స్వభావాన్నీ సూచిస్తున్నారు.ఈ సమయంలో ఖచ్చితంగా అదే జరిగింది.

15-5-1930:--ఈ రోజునుంచి మొదలుపెట్టి పంచగని గుహలో తనను తాను బంధించుకుని రెండువారాలు ఉపవాసదీక్షలో గడిపాడు.అప్పుడు శని-రాహు-రాహు దశ నడిచింది.శని రాహు దశ శపితదశ అని ఎన్నోసార్లు గతంలో వ్రాశాను.ఈయన జీవితంలో కూడా అదే జరిగింది.తనంతట తాను ఒక కొండమీద గుహలో వాలంటరీగా బందీగా ఉండి,తిండీ నీళ్ళూ లేకుండా రెండువారాలు ఉండటం ఈ దశాప్రభావం కాకపోతే మరేమిటి?ఇది జైల్లో పెట్టబడటంతో సమానమే.

26-1-1956 న కేతు-రాహు-శుక్ర-రాహు నడిచినప్పుడు గోదావరీ మాత ఆహ్వానం మేరకు సాకోరీ ఆశ్రమంలో వారం రోజులు నివసించి అందరికీ దర్శనం ఇచ్చాడు.

తృతీయ నవమాలలో ఉన్న రాహు కేతువుల వల్ల దగ్గరలోనే ఉన్న సాకోరీ ఆశ్రమానికి వెళ్లి అక్కడ ఉన్న స్త్రీసాధకురాళ్ళకు ఉత్తేజాన్నిస్తూ ఒక వారం రోజులున్నాడు.రాహు శుక్రుల ప్రభావాన్ని ఇక్కడ గమనించాలి.

7-10-1954 న కేతు-చంద్ర-బుధ-శని దశ జరిగినప్పుడు ఇన్నాళ్ళూ తాను వాడుతున్న అక్షరాల పలకను పారవేసి సైగలద్వారా సూచించడం మొదలు పెట్టాడు.

బుధుడు నవమాధిపతి.కేతు చంద్ర శనులు ఈయన జాతకంలో లోతైన ఆధ్యాత్మికతకు సూచకులు.అందుకే తానిన్నాళ్ళూ వాడుతున్న ఆల్ఫాబెట్ బోర్డును పక్కన పెట్టి, ఆరోజునుంచీ ఊరకే సైగలు మాత్రం చేసేవాడు.

పై సంఘటనలన్నీ ఆయా దశలవారీగా 4.33 అనే సమయానికి ఖచ్చితంగా సరిపోతున్నందున,మెహర్ బాబా జనన సమయం ఉదయం 4 .33 అని నేను నిర్దారిస్తున్నాను.

(ఇంకా ఉన్నది)
read more " అవతార్ మెహర్ బాబా జీవితం - జాతకం - 8 (జననకాల సంస్కరణ) "

20, ఫిబ్రవరి 2016, శనివారం

అవతార్ మెహర్ బాబా జీవితం - జాతకం - 7 (ఉపాసనీ మహరాజ్)

నా మిత్రులలో సాయిబాబా భక్తులు చాలామంది ఉన్నారు.నిన్నగాక మొన్న సాయిబాబా గురించి తెలుసుకున్న వీరందరూ, ఆయన గురించి నాకేమీ తెలియదని అనుకొని, ఆయన జీవితాన్ని గురించి నాకు వివరించి చెప్పబోతూ ఉంటారు.

నా చిన్నప్పుడే సాయిబాబా సాహిత్యం లో ముఖ్యగ్రంధాలన్నీ నేను చదివాను. కానీ అందరిలాగా ఆయనకు వ్యాపారభక్తుడిని మాత్రం కాలేదు.అది నా అదృష్టంగా భావిస్తాను. ఇంతవరకూ నేను షిరిడీ వెళ్ళలేదు. అక్కడకు నన్ను తీసుకెళ్లాలని నా మిత్రులు కొందరు ప్రయత్నించారు, కానీ విఫలులైనారు.

సాయిబాబా గురించి నాకు బోధలు చెయ్యబోయిన కొందరు మిత్రులు - నేనడిగిన ప్రశ్నలతో ఖిన్నులై, నాతో మాట్లాడటం మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు.

వాళ్ళు నాకు చెప్పే కధలలో సారాంశం ఒకటే ఉంటుంది.

'మేము సాయిబాబాను నమ్ముకున్న తర్వాత మాకంతా మంచి జరిగింది. మా అమ్మాయికి పెళ్లి అయింది.మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది.నాకు తగ్గదనుకున్న రోగం తగ్గింది.నా సంపాదన బాగా పెరిగింది.ఇప్పుడు కూడా నా సంపాదన చాలా బాగుంది.కనుక ఆయన దేవుడు. నువ్వు కూడా ఆయన్ను నమ్ము.నీకూ మంచి జరుగుతుంది.'

దీనికి నా సమాధానం ఇలా ఉంటుంది.

'మీరనుకుంటున్న మంచి నాకవసరం లేదు.దానికోసం నా భక్తిని వ్యాపారంగా మార్చలేను.మీ నమ్మకం ఓటిది.దానికి నిజమైన బలం లేదు.ఇలాంటి చచ్చు సంఘటనల వల్ల కలిగిన భక్తి ఆ పేరుకు తగదు.పచ్చిస్వార్ధంతో కూడిన మీ దొంగభక్తిని నాకు ఎక్కించే ప్రయత్నం చెయ్యకండి.

సాయిబాబా దైవత్వం అనేది మీ జీవితాలలో జరిగిన సంఘటనల పైన ఆధారపడినది కాదు.మీ జాతకంలోని ఆయా దశలను బట్టి ఆయా సమయాలలో మీకు మంచో చెడో జరుగుతూ ఉంటుంది. అందులో ఆయన కరుణ ఉందో లేదో మీకు తెలియదు.ఉందనుకోవడం మీ ఊహ మాత్రమే.

మీ సాయిభక్తులందరూ చేస్తున్న పెద్ద తప్పు ఒకటి ఉన్నది. మీరంతా లౌకిక మహిమలకోసం ఆయన్ను ప్రార్థిస్తున్నారు.  అటువంటి చెత్త మహిమలకోసం ఆయన్ను ప్రార్ధించకండి.ఆత్మోన్నతి కోసం ప్రార్ధించండి.

అయినా,ఆయన్ను నేను నమ్ముతున్నానో లేదో మీకెందుకు?ఒకవేళ నేను నమ్మకపోతే ఆయనకేం తక్కువ? నమ్మితే నాకేం ఎక్కువ? రెండూ లేవు. అసలు మధ్యలో మీకెందుకు బాధ? ఇది నమ్మకానికి సంబంధించిన విషయం కాదు.అలా నమ్మడం వల్ల నాకొచ్చే లాభానికి సంబంధించిన విషయం కూడా కాదు. చెప్పినా మీలాంటి మనుషులకు అర్ధం కాదు.ఎక్కువగా మీతో వాదించి నా సమయాన్ని వృధా చేసుకోలేనుగాని, ఒక్క విషయం చెప్పండి.

సాయిబాబాను నేను నమ్ముతానో లేదో ప్రస్తుతానికి పక్కన ఉంచుదాం. సాయిబాబా చేసిన అద్భుతాలలో అతి గొప్ప అద్భుతం ఏమిటో మీరు చెబితే మీరు సాయిబాబాకు మంచి భక్తులని ప్రస్తుతానికి "మిమ్మల్ని" నమ్ముతాను.'

ఈ ప్రశ్నను నేను 30 ఏళ్ళనుంచీ అడుగుతున్నాను.ఇంతవరకూ ఒక్కరంటే ఒక్కరు కూడా నాకు సంతృప్తికరమైన సమాధానం చెప్పలేకపోయారు.నా ప్రశ్నకు సమాధానంగా బాబా జీవితం నుంచి ఎవరికి తోచిన మహిమలను వారు పుంఖాను పుంఖాలుగా ఉటంకించేవారు. ఇలాంటి చచ్చు భక్తులను చూస్తే నాకు నవ్వూ జాలీ రెండూ ఒకేసారి కలిగేవి.వారికి నేనేమీ జవాబు చెప్పేవాడిని కాదు.

ఇది నిజమైన భక్తి కాదు.దీనిని కమర్షియల్ భక్తి అంటారు. 'ఆయన వల్ల మాకు లాభం కలుగుతున్నది గనుక డప్పు వాయిస్తాం' - అనేదే వీరి లాజిక్.నాకు నచ్చని లాజిక్కూ ఇదే. దీనినే నేను 'వ్యాపార భక్తి' అనే ఇంకో పేరుతో పిలుస్తాను.

సాయిబాబా ఎన్నో అద్భుతాలు చేశాడని లోకం నమ్ముతున్నది. అవి నిజాలనడం కంటే భక్తులు కల్పించిన అబద్దాలనడం కరెక్ట్ అవుతుంది. కానీ ఉపాసనీ మహారాజ్ అనే ఒక వజ్రం షిరిడీలో తయారైంది.

మెటీరియలిస్టిక్ గా ఎంతసేపూ 'లాభం' అనే కోణం నుంచి మాత్రమే ఆలోచిస్తూ - 'నిన్ను నమ్మితే నాకేంటి?' అని మాట్లాడే స్వార్ధపరులకు ఇది అర్ధంకాని అద్భుతం.ఈ ఉపాసనీ మహరాజ్ వల్లనే మేర్వాన్ తనను బంధించిన ఆధ్యాత్మిక త్రిశంకుస్వర్గం నుంచి క్రిందకు రాగలిగాడు.పరిపూర్ణత్వాన్ని సంతరించుకోగలిగాడు.కనుక ఉపాసనీ మహరాజ్ ద్వారా ఇన్ డైరెక్ట్ గా మేర్వాన్ కు సహాయపడింది సాయిబాబానే.

వస్తువులను సృష్టించడమూ,రోగాలు నయం చెయ్యడమూ, భూతాలను వదిలించడమూ,శవాలకు ప్రాణం పొయ్యడమూ, కేసుల్లో గెలిపించడమూ - ఇవి అసలైన అద్భుతాలు కావు. ఒక మనిషిని జన్మ పరంపరల నుంచి దాటించి దైవానుభూతిని కలిగించడమే అసలైన అద్భుతం.

దైవమార్గంలో అయోమయంలో  ఉండి కొట్టుకుంటున్న ఒక మంచి సాధకునికి దారి చూపించి ముందుకు నడిపించి దైవసన్నిధికి అతన్ని చేర్చడమే అసలైన అద్భుతం.

సాయిబాబా చేసిన నిజమైన అద్భుతం ఇదే.నేనాశించే జవాబు కూడా ఇదే. అయితే, నేనాశిస్తున్న ఈ జవాబును ఇంతవరకూ ఎవ్వరూ చెప్పలేకపోయారు.ఎవరిని కదిలించినా చవకబారు అద్భుతాల గురించి సోది చెప్పేవారే గాని అసలైన దృష్టి ఉన్నవారు ఎవరూ లేరు.

నిజంగా చెప్పాలంటే అద్భుతాలకు ఆధ్యాత్మికలోకంలో ఎటువంటి విలువా లేదు.వ్యభిచారిణి యొక్క మలమూత్రాలతో మహిమలను మహత్యాలను పోల్చారు శ్రీరామక్రిష్ణులు.

లోకం ఎంతో ఆశ్చర్యపడే మహిమల గురించి ఒకరోజున జగన్మాత కాళితో ఆయన ముచ్చటించారు.ఈ మహిమల నిజతత్త్వం ఏమిటని ఆయన అమ్మనే అడిగారు.అప్పుడు అమ్మ ఆయనకు ఒక దర్శనాన్ని చూపింది.

ఆ దర్శనంలో - ఒక నడివయస్సున్న వ్యభిచారిణి పటపటమనే పెద్ద శబ్దంతో మలవిసర్జన చేస్తున్నది.ఆ కంపు ఎంతో దూరం వ్యాపిస్తున్నది.

ఈ దర్శనాన్ని చూచిన ఆయన విచలితుడై - 'ఇదేంటమ్మా ఇలాంటి దర్శనాన్ని చూపించావు?' అని మాతను అడిగారు.

అప్పుడు కాళీమాత నవ్వుతూ - 'మహిమలంటే ఇంతే నాయనా !' అని ఆయనతో అన్నది.

నిజమైన సిద్ధపురుషులకూ మహాత్ములకూ మహిమలంటే మలమూత్ర విసర్జనతోనే సమానం.అందులోనూ ఒక పద్దతిగా శాకాహారం తింటూ శుద్ధంగా ఉన్న వ్యక్తి మలమూత్రాలు కూడా కాదు,పోనీలే కాస్త సాత్వికంగా ఉంటాయి అనుకోడానికి. వయసు మళ్ళిన వ్యభిచారిణి యొక్క మలమూత్రాలతో ఈ మహిమలూ మహాత్యాలూ సమానం.

మనం తిన్న ఆహారం, లోపల జీర్ణం అయ్యి బయటకు వచ్చేటప్పుడు తన ఆకారాన్ని మార్చుకుని మలంగా వస్తున్నది. నువ్వు తినేటప్పుడు పదిరకాల పదార్ధాలను తింటున్నావు.అది మొత్తం ఒకే పదార్ధంగా మారి బయటకు వస్తున్నది.అంటే - అనేకత్వం ఏకత్వంగా మారుతున్నది.ద్వైతం అద్వైతంగా మారుతున్నది. ఇది అద్భుతమే కదా !! కాదంటారా?

ఒక వస్తువు దాని స్వరూపాన్ని మార్చుకోవడమే కదా ఈ చెత్తలోకం దృష్టిలో అద్భుతం అంటే?శూన్యంలోనుంచి బూడిద వస్తే అదొక అద్భుతం.బూడిద, బంగారు గొలుసుగా మారితే అదొక అద్భుతం.అలాంటప్పుడు ఎంతో సువాసనతో ఎన్నో సుగంధ ద్రవ్యాలతో నువ్వు గంటలు గంటలు శ్రమించి శుచిగా రుచిగా జాగ్రత్తగా తయారుచేసుకుని తిన్న ఆహారం, బయటకు వచ్చేటప్పుడు అంత దుర్గంధంగా రావడం కూడా అద్భుతమే?నువ్వు లోపలికి పంపించేటప్పుడు దాని స్వరూప స్వభావాలేమిటి?నీలోనుంచి బైటికి వచ్చేటప్పుడు దాని పరిస్థితి ఏమిటి? ఇది అద్భుతం కాదా?

నన్నడిగితే ఇదే అసలైన అద్భుతం అంటాను.ఈ పోలిక చాలా మందికి నచ్చకపోవచ్చు.కానీ ఒకరికి నచ్చలేదని సత్యం మరుగున పడిపోదు.

'అన్నం పరబ్రహ్మ స్వరూపం కదమ్మా?' అని ఒకరు జిల్లెళ్ళమూడి అమ్మగారితో అన్నారు.

'అన్నం పరబ్రహ్మమైతే మరి అశుద్ధమో?' అని ఎదురు ప్రశ్న వేసింది అమ్మ.

అన్నమే మలంగా మారుతున్నది.అన్నాన్నేమో దేవుడు అంటున్నావు.మలాన్నేమో అశుద్ధం అంటున్నావు.రెండూ ఒకటేగా? ఏంటిది?

మలాన్ని పంది మాత్రమే వాంఛిస్తుంది.మహిమలనూ మహత్యాలనూ వాంచించేవారు ఎవరితో సమానులో ఇంకా ఎక్కువగా నేను వివరించి చెప్పనవసరం లేదనుకుంటాను.

సత్యమేమంటే - ఆత్మ సాక్షాత్కారం ఒక్కటే నిజమైన మహత్యం. మిగతా మహత్యాలన్నీ ఆ పేరుకు ఏమాత్రమూ తగవు.మహత్యాలన్నీ మాయాపరిధి లోనివే.ఒక్క ఆత్మసాక్షాత్కారం మాత్రమే మాయను దాటినట్టిది.కనుక అదే నిజమైన మహత్యం. 

అందుకనే మనం గనుక గమనిస్తే - నిజమైన మహనీయుల జీవితాలలో మహిమలకూ మహత్యాలకూ ఎటువంటి ప్రాధాన్యతా ఉండదు.వాటికి వారు ఏమాత్రమూ విలువను ఇవ్వరు.కానీ సామాన్యులైన అజ్ఞాన భక్తులకు మాత్రం అవే కావాలి.వారు వ్రాసే పుస్తకాలలో కూడా పేజీకి ఇరవై మహిమలను గూర్చే వారు వ్రాస్తారు."మా గురువు ఈ మహిమలు చేశాడు ఆ మహిమలు చేశాడు" - అని ప్రచారం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ మనస్సులు ఎంతటి నిమ్నస్థాయిలో ఉన్నాయో అనడానికి అలాంటి పుస్తకాలే నిదర్శనాలు.

ఒక భక్తురాలు ఒకసారి నాతో ఇలా అన్నది.

'శ్రీరామకృష్ణులను నమ్మినందుకు ఎంతో బాధపడుతున్నాను.'

'ఎందుకలా?' అని అడిగాను. 

'నేను అనుకున్నవి ఏవీ జరగలేదు.నేను కోరినవి ఏవీ ఆయన నాకివ్వలేదు.అసలు ఈయన్ను కాకుండా ఇంకెవరినైనా పట్టుకుంటే బాగుండేది' అన్నది.

నవ్వాలో ఏడవాలో నాకర్ధం కాలేదు.

'త్వరగా ఆయన్ను వదిలెయ్యి తల్లీ. నువ్వు పట్టుకున్నందువల్ల ఆయనకేమీ కిరీటం రాలేదు. నువ్వు వదిలేస్తే ఆయనకు నష్టమూ లేదు.నీలాంటి చెత్త మనుషులు ఎంతమంది వదిల్తే ఆయనకు అంత హాయిగా ఉంటుంది. నీ కోరికలు తీరుతూ ఉంటె ఆయన గొప్పవాడా?లేకుంటే కాదా? ఇదేనా నువ్వు తెలుసుకున్నది?

జస్ట్ 'నిన్ను నమ్ముతున్నాను.' - అని నీవన్నంత మాత్రాన ఇక నువ్వు కోరే కోరికలన్నీ ఆయన తీర్చాలా?అలా అని ఆయనేమన్నా బాండ్ రాశాడా నీకు?నువ్వు అనుకున్నది ఏదీ జరగకపోవడమే ఆయన చూపుతున్న అతిపెద్ద అనుగ్రహం.ఈ రహస్యం గ్రహించాలంటే నువ్వు ఇంకో ఇరవై జన్మలెత్తాలి. అప్పటికి గాని నీ ట్యూబులైటు వెలగదు.

అయినా నువ్వేదో పట్టుకున్నానని అనుకుంటున్నావు గాని అక్కడ పట్టేమీ లేదు.నువ్వాయన్ని ఏమీ పట్టుకోలేదు.నీ మనసనే చూరుకి ఒక చీకటి గబ్బిలం లాగా ఊగులాడుతున్నావు. అంతే.త్వరగా ఆ కాస్త పట్టును కూడా వదిలేసి ఆయనకు బరువును తగ్గించు.నీ కోరికలు తీర్చే పనికిమాలినవాళ్ళు చాలామంది ఉన్నారు.వారిని గట్టిగా పట్టుకో.' అని చెప్పాను.

మన కోరికల కోసం వాళ్ళ చుట్టూ చేరి భజన చెయ్యడమే గాని,వారు కోరుతున్నట్లు మనం ఉండాలని ఎవరూ అనుకోరు.ఇదే భక్తులలోని అసలైన వైఫల్యం.

సాయిబాబాను మెహర్ బాబా ఎంతో గౌరవించేవాడు.ఆయన గురించి మాట్లాడేటప్పుడు మెహర్ బాబా 'మా తాతయ్య' అని చెప్పేవాడు.ఎందుకంటే గురువు తండ్రితో సమానం.తండ్రి గురువు తనకు తాతయ్యే అవుతాడు.

సాయిబాబా గురించి మాట్లాడుతూ మెహర్ బాబా కొన్ని విచిత్రమైన విషయాలను బహిర్గతం చేశాడు.

ఒకసారి మెహర్ బాబా తన అనుచరులతో కలసి ఎల్లోరా గుహలను సందర్శించాడు.ఆ సమయంలో అక్కడ దగ్గరలోనే ఉన్న ఖుల్దాబాద్ అనే ఊరిలో ఆగినప్పుడు అక్కడ టీ సేవిస్తూ ఆయనిలా అన్నాడు.

'ఈ ఖుల్దాబాద్ లోనే సాయిబాబా గురువైన జర్జరి బక్ష్ సమాధి ఉన్నది.'

దానికి ఆయన శిష్యులు ఇలా ప్రశ్నించారు.

'అదేంటి? జర్జరీ బక్ష్ సాయిబాబాకంటే ఎంతో ముందరివాడు కదా?నిన్నా మొన్నటి సాయిబాబా ఆయనకు శిష్యుడు కావడం ఎలా సంభవం?'

అప్పుడు మెహర్ బాబా ఇలా చెప్పాడు.

'మీకర్ధం కాదు.సాయిబాబా జర్జరీ బక్ష్ ప్రియశిష్యుడుగా ఉన్న జన్మలో ఆయన పైన గురు అనుగ్రహం అమితంగా వర్షించింది. ఆ ఫలితం ఇన్నేళ్ళ తర్వాత బహిర్గతం అయింది.ఆ జర్జరీ బక్ష్ సమాధి ఈ ఊరిలో ఉన్నది.'

జర్జరీ బక్ష్ అనే ఆయన చిస్తీ తెగకు చెందిన సూఫీ మహాత్ముడు. ఈయన అసలుపేరు షా ముంతాజుద్దీన్. చిస్తీ తెగను స్థాపించిన సూఫీ మహాత్ముడైన నిజాముద్దీన్ ఔలియా చేత మతప్రచారం కోసం డిల్లీ నుంచి డెక్కన్ కు 14 శతాబ్దంలో పంపబడ్డాడు. ఔరంగాబాద్ సమీపంలో ఉన్న ఖుల్దాబాద్ అనే ఊరిలో ఈయన స్థిరపడ్డాడు.ఆయన సమాధి ప్రస్తుతం అక్కడే ఉన్నది.14 వ శతాబ్దంలోని తన పూర్వజన్మలో సాయిబాబా - జర్జరీ బక్ష్ శిష్యుడని,తర్వాత జన్మలో సాయిబాబాగా పుట్టాడని మెహర్ బాబా అన్నాడు.

ఇదే ఖుల్దాబాద్ లో దాదాపు 1500 మంది సూఫీల సమాధులున్నాయి.వాళ్ళందరూ నిజమైన మహాత్ములో లేక ఔరంగజేబు సైనికులో లేక ఆయనతో బాటు దక్షిణాదికి వచ్చిన ముస్లిం గురువులూ వారి శిష్యబృందమూనో మనకు తెలియదు. ఔరంగజేబ్ సమాధి కూడా ఖుల్దాబాద్ లోనే ఉన్నది.సాయిబాబా తన పూర్వజన్మలో ఈ గుంపులోని వాడే. వీరందరూ డిల్లీ నుంచి డెక్కన్ ను జయించడానికీ మతమార్పిడికీ దక్షిణాదికి వచ్చిన ముస్లిములే.

అప్పటి సంస్కారాలు తనలో ఉండటం వల్లనే,సాయిబాబా మొదటిసారి షిరిడీలో కన్పించిన తర్వాత అక్కడనుంచి కొన్నాళ్ళు చెప్పాపెట్టకుండా మాయమై పోయి,ఆ సమయంలో ఝాన్సీ లక్ష్మీబాయి సైన్యంలో సైనికునిగా కొంతకాలం పనిచేశాడు.యుద్దంలో ఝాన్సీరాణి మరణించిన తర్వాత మళ్ళీ షిరిడీలో కనిపించాడు.ఆ సమయంలో సాయిబాబా వేషం ఒక సైనికుని వేషంలాగే ఉండేది.ఆ తర్వాత చాలా కాలానికి ఇప్పుడు అందరూ చూస్తున్న ఫోటోలోని వేషానికి ఆయన మారాడు.

కర్మ అనేది మనిషిని అలా పట్టి నడిపిస్తుంది.అది ఎంతవారిని కూడా వదలదు.ఆ కర్మశేషం ఉన్నప్పుడు దానిని తీర్చుకోక తప్పదు. దానికి తగిన ప్రతికర్మ చెయ్యకా తప్పదు.

సాయిబాబాను మెహర్ బాబా 'కుతుబి ఇర్షాద్' అని పిలిచేవాడు.అంటే మహనీయులలో ముఖ్యుడు అని అర్ధం.సాయిబాబా 1839 సంవత్సరంలో శైలూ అనే ఊరిలో పుట్టాడని కొందరు అంటారు.ఇంకొందరేమో ఆయన పర్భని జిల్లాలోని పత్రి అనే ఊరిలో పుట్టాడని అంటారు. ఇవన్నీ ఊహలే. అసలయిన ఆఫ్ఘనిస్తాన్లో పుట్టాడని, అక్కడ దొంగతనాలు చేసేవాడని, మరణశిక్షను తప్పించుకోడానికి పారిపోయి ఇండియా వచ్చాడని కొంతమంది అంటారు. సాయిబాబా తండ్రి యైన ఆఫ్ఘన్ ఒక దొంగ. అతనక్కడ హత్యకు గురయ్యాడు.

ఇంకా చెప్పాలంటే - ఈ సూఫీ గురువులూ వారి శిష్యులూ అందరూ అంతకు పూర్వపు జన్మలలో బౌద్ధ భిక్షువులు.వారు అజంతా ఎల్లోరా గుహలలో ఉంటూ సాధనలు చేసినవారే.ఆ తర్వాత జన్మలలో ముస్లిం సూఫీలుగా పుట్టి మళ్ళీ అదే ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారు.ఎక్కడైతే మనకు ఋణానుబంధం ఉంటుందో అక్కడకు మనం ఎప్పటికైనా చేరక తప్పదు. అలాంటి కర్మబంధమే వారందరినీ ఈ జన్మలో మళ్ళీ అజంతా ఎల్లోరా గుహల దగ్గరలో ఉన్న ఔరంగాబాద్ ఖుల్దాబాద్ లకు ఈడ్చుకొచ్చింది.

జ్యోతిశ్శాస్త్రంలో రాహువు బుద్ధమతానికీ,అదే సమయంలో ఇస్లాముకూ సూచకుడన్న విషయాన్నీ,వేదధర్మానికి ఆయన విరోధి అన్న విషయాన్నీ ఇక్కడ గుర్తుంచుకోవాలి.విదేశీ మతాలకు,నిరీశ్వర వాదానికీ కూడా ఆయనే సూచకుడు.రాహువు యొక్క ఈ కారకత్వాలు గుర్తుంటే, అప్పుడీ లింకులన్నీ ఎంత అద్భుతంగా సరిపోతాయో అర్ధమౌతుంది.

వీరందరూ ఆ జన్మలో బౌద్ధ భిక్షువులుగా వేదధర్మం మీద తిరుగుబాటు చేశారు. తరువాత జన్మలో ముస్లిములుగా పుట్టి మళ్ళీ అదే పని చేశారు. ఆ జన్మలో బౌద్ధ భిక్షువులను హిందువులు తరిమి కొడితే, తరువాత జన్మలో వాళ్ళే సూఫీ ముస్లిములుగా పుట్టి ఇదే ప్రాంతానికి వచ్చి ఇక్కడి హిందువులను తరిమి కొట్టారు. ఎక్కడెక్కడో ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, అరేబియాలలో పుట్టినా గత జన్మల సంస్కారాల ఫలితంగా దక్షిణ భారతదేశానికి కర్మచేత ఈడ్చుకు రాబడ్డారు.సంస్కారాలనేవి ఆ విధంగా మనిషిని జన్మజన్మాంతరాలలో వెంటాడతాయి.

జన్మజన్మకీ వేషం మారవచ్చు,ఆకారం మారవచ్చు,పుట్టే దేశమూ జాతీ తెగా కులమూ మతమూ శరీరమూ రంగూ ఎత్తూ లావూ ఇవన్నీ మారవచ్చు.కానీ సంస్కారం మారదు.కర్మకు ప్రతికర్మా మారదు.

జగజ్జనని ఆడే ఆట చాలా వింతగా ఆశ్చర్యం గొలిపేదిగా ఉంటుంది.ఎంతటి మహనీయులైనా ఆమె ఆడే ఆటలో పావులే.దీనికేమీ మినహాయింపు లేదు.

అయితే,ఈ సూక్ష్మ వివరాలన్నింటినీ సాయిబాబా జీవితాన్ని గురించి వ్రాసిన రచయిత లెవరూ స్పర్శించలేదు. కారణమేమంటే- వారికి ఈ విషయాలు తెలియకపోవడం ఒకటి. రెండోది - వారు భక్తిభావంలో మునిగి ఆయన జీవితాన్ని వ్రాశారు గాని నిష్పాక్షికంగా ఆబ్జెక్టివ్ గా వ్రాయలేదు. ఎప్పుడైతే భక్తి  అనేది మనిషిని ఆవహిస్తుందో అప్పుడు కొన్ని అతిశయోక్తులు ఆ నెరేషన్ లో చోటు చేసుకుంటాయి.పైగా సాయిబాబా చిన్ననాటి సంగతులు చరిత్రలో మరుగున పడిపోయి ఉన్నాయి.వాటిని త్రవ్వి తీయడం అంత తేలిక కాదు.

అందుకని, ఆ జీవిత చరిత్ర వ్రాసిన వారికి - సాయిబాబా జనన వృత్తాంతాన్ని దత్తాత్రేయునితోనో, త్రిమూర్తులతోనో సింపుల్ గా లింక్ పెట్టడం చాలా తేలిక అనిపిస్తుంది.వారి భక్తి మత్తులో అది తప్పు అని కూడా అనిపించదు.కనుక వారాపనిని తేలికగా చేశారు.వ్యాపారస్తులు వాటి ఆధారంగా సినిమాలు తీశారు.వాటిని చూచిన పిచ్చిజనం అదే నిజం అని నమ్ముతున్నారు.కానీ అసలైన సత్యం అది కాదు.

ఇలాంటి కారణాల వల్లనే మన పురాణాలు గాని, మనవాళ్ళు వ్రాసిన మహనీయుల చరిత్రలు గాని అనేక అసత్యాలతో అతిశయోక్తులతో పిట్టకధలతో నిండిపోయి, చివరకు వాటి చారిత్రకతను మనమే సందేహించేటంతగా మారిపోతూ ఉంటాయి.

ఈ జీవిత చరిత్రలు చదివేవారు కూడా భక్తులే గనుక వారుకూడా తమతమ వాస్తవ దృక్పధాన్ని పక్కన పెట్టి, ఈ అతిశయోక్తులను నమ్ముతూ ఆనందించే స్థాయిలోనే ఉంటారు. ఎందుకంటే, వాస్తవం వారిని నిరుత్సాహపరుస్తుంది. కల్పనేమో వారి ఊహలకు బలాన్నిస్తుంది.వారి 'ఈగో'ను బలపరుస్తుంది. వారికి కావలసింది సత్యం కాదు గనుకా, వారి నమ్మకం బలపడటమే వారికి కావాలి గనుకా వారు అతిశయోక్తులనూ కల్పననూ నమ్మినట్లు సత్యాన్ని నమ్మలేరు.ఈ క్రమంలో ఏమౌతుందంటే - సత్యాన్ని అనుసరిస్తున్నాం అనుకునే చాలామంది జీవితాలు అసత్యంలోనే నడిచి అనిత్యంలోనే ముగుస్తూ ఉంటాయి. ఇది లోకసహజమే.

1858 ప్రాంతంలో ఆయన శిరిడీకి వచ్చి నివసించ సాగాడు.అక్కడ ఉన్నప్పుడే ఆయన దగ్గరకు కాశీనాథ్ అనబడే ఉపాసనీ బాబా వచ్చి శిష్యునిగా మారాడు.

ఉపాసనీ మహరాజ్ అసలు పేరు కాశీనాథ్ గోవిందరావ్ ఉపాసనీ. మహారాష్ట్రకు చెందిన ఒక సనాతన బ్రాహ్మణ కుటుంబంలో 15-5-1870 న వైశాఖ బహుళ పాడ్యమి రోజున,ఆదివారం నాడు, అనూరాధా నక్షత్రంలో ఈయన జన్మించాడు.

జనన సమయంలోనే ఉన్న సూర్య శనుల సంబంధంవల్లా చంద్రుని నీచస్థితి వల్లా ఈయన జీవితం అనేక చిత్రమైన మలుపులతో ఎత్తుపల్లాలతో నడిచింది.శనీశ్వరుడు వక్రించి ఉండటమూ,శనిచంద్రుల యోగమూ ఈయన జాతకంలో చూడవచ్చు.ఈ యోగం సహజ అష్టమం అయిన వృశ్చికంలో ఉన్నది.అక్కడనుంచి శనీశ్వరుని దృష్టి మకరంలో ఉన్న కేతువు మీద ఉన్నది. ఈ యోగాలవల్ల ఈయన ఒక మహనీయుడని వెంటనే గ్రహించవచ్చు.

సరియైన జన్మసమయం తెలియనందున లగ్నాన్ని లెక్కించడం లేదు.

మెహర్ బాబా జాతకంలో కూడా శనిచంద్ర సంయోగం ఉన్నది. అయితే, ఉపాసనీ మహారాజ్ జాతకంలో అది వృశ్చికంలో ఉంటే,మెహర్ బాబా జాతకంలో దానిని అనుసరిస్తూ తులలో ఉన్నది.అందుకే ఉపాసనీబాబాకు మెహర్ బాబా శిష్యుడయ్యాడు.అయితే ఉపాసనీ మహారాజ్ జాతకంలో వక్రించి ఉన్న శనీశ్వరుడిని వెనక్కు తెస్తేగాని ఆ యోగం కలగదు. మెహర్ బాబా జాతకంలో అలా చెయ్యకపోయినా సరాసరిగా ఆ యోగం ఉన్నది.అక్కడకూడా శనీశ్వరుడు వక్రించి ఉన్నాడు. ఆయన్ను వెనక్కు తీసుకెళితే అది శనికేతు సంయోగం అవుతుంది.ఇది కొంచం ఇబ్బందికరమైన యోగ పొంతనం.

అందుకే వీరిద్దరి మధ్యనా గురుశిష్యుల సంబంధమైతే ఉన్నది గాని ఈయన ఆశ్రమానికి మెహర్ బాబా ఆధ్యాత్మిక వారసుడు కాలేకపోయాడు.ఆ అదృష్టం 'గోదావరీమా' అనే ఇంకొక అమ్మాయికి పట్టింది.జాతకాలలోని యోగాలు ఈ విధంగా చాలా సూక్ష్మంగా ఫలితాలనిస్తాయి.

ఆ సంగతులు అలా ఉంచి మనం ఉపాసనీ మహారాజ్ జీవితంలోకి వద్దాం.

ఈయనకు పెళ్ళిచేసుకోవాలని ఉండేది కాదు.చిన్నప్పుడు ఆసన ప్రాణాయామాది సాధనలను చాలా ఉధృతంగా చేశాడు. అవి ఎవరి దగ్గరైనా నేర్చుకున్నాడో లేక తానే చేశాడో మనకు తెలియదు.రెండోదే కరెక్ట్ అనిపిస్తుంది.ఎందుకంటే వాటివల్ల ఆయన ఆరోగ్యం బాగుపడక పోగా ఇంకా చెడిపోయింది.తిన్నది అరిగేది కాదు,నిద్ర పట్టేది కాదు,తలలో ఎప్పుడూ ఒక విధమైన ధ్వని వినిపిస్తూ ఉండేది.ఎప్పుడూ పీడిస్తున్న ఈ అనారోగ్యం వల్ల ఈయనకు శరీరం అంటే ఒక విధమైన విరక్తీ అసహ్యమూ వచ్చేశాయి.అవి ఈయన జీవితాంతమూ ఉన్నాయి.

అందుకే ఈయన ఫోటోలు ఏవి చూచినా ఒక గొనెపట్టా కప్పుకునో లేక ఒక గుడ్డముక్క వంటిదానిని ఊరకే మొలమీద కప్పుకునో కనిపిస్తాడు.వక్రించిన శని జాతకులలో ఈ లక్షణాలు ఉంటాయి. వీరు శరీర శుభ్రతకూ అలంకరణకూ ఎక్కువ ప్రాధాన్యత నివ్వరు.ఆత్మశుభ్రత మీదే వీరి దృష్టి అంతా కేంద్రీకృతమై ఉంటుంది.

ఈయన మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు.భార్యలందరూ వరుసగా మరణించారు.చంద్రలగ్నం నుంచి సప్తమంలో మూడు గ్రహాలుండడం చూడవచ్చు.ఇది మూడు పెళ్లిళ్లకు ఒక సంకేతం.వివాహ కారకుడైన శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండటం కూడా ఇన్ని పెళ్ళిళ్ళు జరగడానికి దోహదమే.అయితే శుక్ర, రాహు,చంద్రులు ఒకరికొకరు కోణస్థితిలో ఉండటం వల్లా, అందులోనూ చంద్రుడు నీచస్థితిలో ఉండటం వల్లా ఈయన వివాహజీవితం ముక్కలై పోయింది.రాహువు కూడా చంద్రుని సూచిస్తున్నాడన్న విషయాన్ని గమనించాలి.

చంద్రుని నుంచి పంచమంలో శుక్రుడు ఉచ్ఛ స్థితిలో ఉన్నాడు.కనుక ఈయనకు లోకప్రసిద్ధి ఉన్న ఒక అందమైన శిష్యుడు లభించాడు.మెహర్ బాబా చాలా ఆకర్షణగా ఉండేవాడు. ఆయన ముఖం ఎంతో అందంగా ఉండి అందులో శుక్ర కళ ఉట్టిపడుతూ ఉండేది.


అలాగే - ఉపాసనీ మహారాజ్ యొక్క ముఖ్య శిష్యురాలు గోదావరీ మా అనే స్త్రీ.శుక్రుడు స్త్రీ గ్రహం అన్న విషయం గమనిస్తే,ఈయన తర్వాత సాకోరి ఆశ్రమాన్ని అధిరోహించినది ఒక స్త్రీ ఎందుకైందో, ఆమె శిష్యులలో ఎక్కువమంది స్త్రీలే ఎందుకున్నారో అర్ధమౌతుంది.
  
ఈయన పౌర్ణమి పరిధిలో జన్మించాడు.సూర్యచంద్రులు జాతకంలో సమసప్తకంలో ఉండటం చూడవచ్చు.ఈ యోగంలో జన్మించినవారికి వివాహ జీవితం ఫెయిల్ అవుతుందని గతంలో ఎన్నోసార్లు నేను వ్రాసి ఉన్నాను.ఈయన జీవితంలో కూడా ఇది ఖచ్చితంగా జరగడాన్ని గమనించవచ్చు.

ఈయనను పట్టి పీడిస్తున్న అనారోగ్య నివారణ కోసం ఎందఱో వైద్యుల వద్దకూ గురువుల దగ్గరకు ఆయన తిరిగాడు.వారిలో యోగి కులకర్ణి అనే ఆయన మాత్రం "ఇది రోగం కాదు.నువ్వు చేసిన యోగసాధనల వల్ల నువ్వు ఆధ్యాత్మికంగా ఒక స్థాయికి చేరావు.అందువల్లే ఈ మార్పులు నీలో కలిగాయి. ఇది రోగంకాదు గనుక వైద్యులు నీ పరిస్థితిని బాగు చెయ్యలేరు.షిరిడీ సాయిబాబాను కలువు.ఆయనే నీకు తరుణోపాయం చూపగలడు."-అని చెప్పాడు. కానీ కాశీనాద్ ఈ మాటలను పట్టించుకోలేదు.ఎందుకంటే సాయిబాబా ఒక ముస్లిం అన్న ద్వేషభావం ఈయనలో ఉండేది. హిందూ యోగుల కోసం మహనీయుల కోసం ఈయన వెదుకుతూ ఉండేవాడు.

ఆ క్రమంలో నారాయణ మహారాజ్ అనే సిద్ధపురుషుని ఈయన దర్శించాడు.సాయిబాబా ముస్లిం అన్న శంకతో చాలాకాలం పాటు ఆయన షిరిడీ వెళ్ళలేదు.ఎంతమంది చెప్పినా వెళ్ళేవాడు కాదు.కానీ చివరకు 27-6-1911 న షిరిడీ వెళ్లి సాయిబాబాను దర్శించాడు.ఆ తదుపరి కలిగిన అనేక అనుభవాల వల్ల తానే సాయిబాబా ముఖ్యశిష్యునిగా మారిపోయాడు. చంద్రుని నుంచి నవమంలో రాహువును చూడవచ్చు.ఇది ఇతరమతానికి చెందిన గురువుకు ఒక సంకేతం.

తనను దర్శించడానికి వచ్చినవారిని సాయిబాబా దక్షిణ అడిగేవాడు. కాశీనాద్ తన దర్శనానికి వచ్చినపుడు కూడా సాయిబాబా దక్షిణను అడిగాడు.తన దగ్గరున్న నల్లని చిలుము పట్టిన నాణేన్ని కాశీనాథ్ ఆయనకు ఇచ్చాడు.

అది తీసుకుంటూ సాయిబాబా ఇలా అన్నాడు.

'నాకు నువ్వు నల్లని నాణేన్ని ఇచ్చావు.పరవాలేదు.నేను మాత్రం నీకు అసలైన నాణేన్ని ఇస్తాను.' - అసలైన నాణెం అన్న మాటతో ఆయన 'దైవానుగ్రహం' అనేదానిని సూచించాడు.

సాయిబాబా శిష్యత్వంలో తన 42 వ ఏట అంటే 1912 లో ఈయన దైవసాక్షాత్కారాన్ని పొందాడు.దగ్గరలోనే ఉన్న ఖండోబా ఆలయంలో 'ఊరకే ఉండమనీ' అన్నీ తానే చూచుకుంటాననీ సాయిబాబా ఈయనకు చెప్పాడు. మనిద్దరికీ ఎన్నోజన్మల ఋణానుబంధం ఉన్నదని ఆయన అనేవాడు.'ఊరకే ఉండటం' ద్వారానే ఉపాసనీ మహారాజ్ సిద్ధత్వాన్ని పొందాడు.నిజంగా చెయ్యగలిగితే 'ఊరకే ఉండటాన్ని' మించిన సాధన లేనేలేదు.

ఒకానొక గతజన్మలో సాయిబాబా, ఉపాసనీ బాబా ఇద్దరూ ఒకే గురువుకు శిష్యులుగా ఉన్నారు.ఆ గురువు జర్జరీ బక్శే కావచ్చు.ఆ సమయంలో ఉపాసనీ ఆ గురువును వదలి తన మనస్సు చెప్పిన వేరే మార్గంలోకి వెళ్ళిపోయాడు.ఆ కర్మ ఫలితంగా ఆ తర్వాత అనేక జన్మలెత్తి ఎన్నో బాధలు పడి చివరకు మళ్ళీ ఈ జన్మలో సాయిబాబాను కలిశాడు.ఆ జన్మలో వీరిద్దరి మధ్యన ఉన్న స్నేహం కారణంగా ఈ జన్మలో సాయిబాబా ఈయనకు దారి చూపించాడు.

42 ఏళ్ళు వచ్చేనాటికి ఈయనకు శనీశ్వరుడు తన గోచార ఆవృత్తిలో జననరాహువు పైకి వస్తాడు.శనీశ్వరుడు వక్రించి ఉన్నాడు గనుక ఈ ఆవృత్తిని అప్రదక్షిణంగా తిప్పాలి.

రాహువు పూర్వకర్మకు సూచకుడు.రాహువు లోన్లీ ప్లానెట్ గా ఉన్న జాతకులు గత కర్మానుసారం వారి జీవితమంతా ఏకాంతంగా గడుపుతారు. ఒకవేళ మనుషుల మధ్యన ఉన్నా కూడా,వాళ్ళు ఒంటరిగానే ఉంటారు. శనీశ్వరుడు రాహువును కలసినప్పుడు ఈ పూర్వకర్మ క్షయిస్తుంది. అక్కడనుంచి వీరి దృష్టి నీచచంద్రునిపైన ఉండటం చూడవచ్చు.అంటే ఈయనకు 'మనోనాశం' అనే స్థితి అప్పటికి వచ్చిందని అర్ధం చేసుకోవాలి. మనస్సు నశించినప్పుడే స్థిరమైన దైవానుభూతి కలుగుతుంది.

1913 నుంచే ఉపాసనీ మహరాజ్ కు పూజ చెయ్యమనీ తనను గౌరవిస్తున్నట్లే ఆయననూ గౌరవించమనీ తన భక్తులకు సాయిబాబా చెప్పేవాడు.ఆయన గురించి ఎంతో గొప్పగా నలుగురికీ చెప్పేవాడు.

'ఉపాసనీ విలువ మీకు తెలియదు.ప్రపంచాన్ని అంతటినీ త్రాసు యొక్క ఒక పళ్ళెంలో ఉంచి,ఉపాసనీని ఇంకొక పళ్ళెంలో ఉంచితే,ఉపాసనీయే బరువు తూగుతాడు.'-అనేవాడు సాయిబాబా.

'నా తాళంచెవిని ఉపాసనీకి ఇచ్చాను.అతన్ని మీరు అనుసరించండి' అని బాహాటంగా ఎంతోమందికి చెప్పేవాడు సాయిబాబా.

ఇది గిట్టని కొందరు ఉపాసనీ అంటే ద్వేషం అసూయా పెంచుకున్నారు.వారిలో నానావలీ అనే ఒక రౌడీ సందు దొరికితే చాలు, ఉపాసనీ బాబాను ఎగతాళి చెయ్యడం,నలుగురిలో హేళన చెయ్యడం చేసేవాడు.గిల్లికజ్జాలు పెట్టుకుంటూ ఉండేవాడు.ఒకరోజున ఉపాసనీ బాబాను కట్టేసి బాగా కొట్టాడు కూడా.కానీ ఉపాసనీ బాబా ఏమీ చలించలేదు.

మామూలు మనుషులు ఎక్కడ ఉంటె అక్కడ అసూయా, ద్వేషమూ,అనుమానాలూ,స్వార్ధపూరిత కుట్రలూ అన్నీ ఉంటాయి.షిరిడీలో కూడా ఇవి ఉండేవి.అక్కడున్నది మామూలు మనుషులే.దేవతలు కారు.సాయిబాబా, ఉపాసనీ బాబా మహనీయులు కావచ్చు.కానీ వారి చుట్టూ ఉన్నవారందరూ మహనీయులు కారు.అతి మామూలు మనుషులే.

'ఎప్పటినుంచో మనం సాయితో ఉన్నాం.ఈయనేంటి నిన్నగాక మొన్నవచ్చి సాయిబాబాకు ముఖ్యుడై పోయాడు?'- అన్న సాయిబాబా అనుచరుల అసూయను తట్టుకోలేక ఉపాసనీ మహారాజ్ మధ్యమధ్యలో షిరిడీని వదలి అక్కడక్కడా తిరుగుతూ ఉండేవాడు.సాయిబాబాను వదలి ఉండలేక మళ్ళీ వెనక్కు వస్తుండేవాడు.అలా తిరిగి తిరిగి చివరకు 1917 లో షిరిడీ దగ్గరలోనే ఉన్న సాకోరీలో ఆయన స్థిరపడ్డాడు.ఆయన ఆశ్రమం కూడా ప్రస్తుతం అక్కడే ఉన్నది.1918 లో సాయిబాబా తన దేహాన్ని వదలినప్పుడు ఉపాసనీ బాబానే ఆయన అంత్యక్రియలు చేశాడు.

ఈయన ఎక్కువగా ఉపవాసాలు చేసేవాడు.మౌనంగా ఉండేవాడు.నగ్నంగా ఉండేవాడు.ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం ఒక గోనెపట్టాతో దేహాన్ని నిర్లక్ష్యంగా కప్పుకునేవాడు. శరీరాన్ని ఎప్పుడూ లెక్కించేవాడు కాదు. దైవానుభూతికి అది ఒక పెద్ద అడ్డంకి అని ఆయన భావించేవాడు.

ఈయన ఎంత ఎక్కువగా ఉపవాసాలు చేసేవాడంటే, ఒకసారి ఇలాంటి ఉపవాస దీక్షలో ఉన్నపుడు ఈయనను చూడటానికి ఖండోబా ఆలయానికి వచ్చిన సాయిబాబా, ఆ అఘోరదీక్షను చూచి తట్టుకోలేక,వెనక్కు వెళ్లి తన సేవకులచేత స్వయంగా టిఫెనూ కాఫీ పంపించి ఈయన ఉపవాసాన్ని ముగింపజేశాడు. ఒక్కొక్కసారి నెలల తరబడి ఈయన ఏమీ తినకుండా ఉపవాసం ఉండేవాడు.తత్ఫలితంగా చిక్కి శల్యమై పోయి అస్థిపంజరంగా మారేవాడు.తినడం ప్రారంభించాక మళ్ళీ పుంజుకుంటూ ఉండేవాడు.

బాబాజాన్ తనకు అద్వైతానుభావాన్ని ఇచ్చిన తదుపరి, కొన్ని నెలల తర్వాత(డిసెంబర్ 1915 లో),మేర్వాన్ సాయిబాబాను దర్శించాడు. మొదట్లో మేర్వాన్ ను చూడటానికి సాయిబాబా ఇష్టపడలేదు.ఆయనతో తోడుగా వచ్చిన మిత్రుడు సాయిబాబా దర్శనానికి వెళితే 'నీ దగ్గరున్న డబ్బులు మొత్తం నాకు కావాలి.ఇచ్చెయ్యి.' అని సాయిబాబా అడిగి మరీ అతని జేబులోని మొత్తం డబ్బులూ తీసుకున్నాడు.కానీ మేర్వాన్ ను దగ్గరకు రానివ్వలేదు.

ఒకరోజున సాయిబాబా తన 'లెండీ' ఊరేగింపు సందర్భంగా వెనక్కు వస్తున్నపుడు హటాత్తుగా దారికి అడ్డంగా వెళ్ళిన మేర్వాన్ ఆయనకు సాష్టాంగ ప్రణామం చేశాడు.మేర్వాన్ని చూస్తూనే సాయిబాబా ' ఓ పర్వర్దిగార్' అని పెద్దగా అరిచాడు. అంతేగాని అతనిమీద ఇంకేమీ శ్రద్ధ చూపలేదు.

ఆ తర్వాత, ఖండోబా ఆలయంలో కూచుని ఉన్న ఉపాసనీ మహరాజ్ ను తన మిత్రుడు సదాశివ్ తో కలసి సందర్శించాడు మెహర్ బాబా.తన వద్దకు వస్తున్న మెహర్ బాబాను దూరంనుంచే గమనించిన ఉపాసనీ మహరాజ్ ఒక రాయిముక్కను బలంగా మెహర్ బాబా వైపు విసిరాడు.అది వచ్చి మెహర్ బాబా నొసటి పైన బాబాజాన్ ఎక్కడైతే ముద్దు పెట్టుకున్నదో అక్కడే బలంగా తగిలింది.ఆ దెబ్బకు మెహర్ బాబా నొసలుకు గాయమై రక్తం కారడం ప్రారంభమైంది.అదేమీ పట్టించుకోకుండా ఉపాసనీ మహరాజ్ వచ్చి మేర్వాన్ ను కౌగలించుకుని తన వద్ద కూచోబెట్టుకున్నాడు.

రాయితో అలా కొట్టడం ద్వారా,లోకానికి అతీతంగా వెళ్ళిపోయిన మేర్వాన్ చేతనాస్పృహను భౌతికపరిధిలోకి దించి తెచ్చే ప్రయత్నాన్ని చేశాడు ఉపాసనీ మహరాజ్.మహనీయుల బోధనా విధానాలూ,అనుగ్రహ విధానాలూ ఇలాగే విచిత్రంగా ఉంటాయి.

ముద్దు అనేది సున్నితమైనది.అది అందించే అనుభూతి కూడా సున్నితంగానే ఉంటుంది.దైవం ఉండే లోకం కూడా అతి సున్నితమైనదే. అందుకే ఆ ముద్దుతో ఆ లోకానికి మేర్వాన్ను చేర్చింది బాబాజాన్.కానీ భౌతికమైన ఈ భూమి సున్నితమైనది కాదు.ఇది బండరాయి లాగా కఠినమైనది.ఇక్కడి మనుషులూ కఠినమైన వారే.కనుక ఎక్కడో ఏవో అతిసున్నిత లోకాలలో విహరిస్తున్న మేర్వాన్ మనస్సును క్రిందకు ఈ భౌతికలోకం లోకి దించాలంటే దానికి మళ్ళీ ఒక షాక్ ట్రీట్మెంట్ అవసరం.అది ఒక రాతిదెబ్బ ద్వారానే వీలౌతుంది.అందుకనే మేర్వాన్ ను రాయితో కొట్టాడు ఉపాసనీ మహారాజ్.

అంతేకాదు లోకం కోసం తన రక్తాన్ని ధార పొయ్యవలసి ఉన్నదన్న సూచనను కూడా ఆనాడే మెహర్ బాబాకు అందించాడు ఉపాసనీ మహరాజ్. ఈ సూచన ప్రకారం గానే - అమెరికాలో ఒకసారి ఇండియాలో ఒకసారి - మొత్తం రెండుసార్లు ఘోరమైన రోడ్డు యాక్సిడెంట్లకు గురై తన రక్తాన్ని భూమికి ధారగా అర్పించాడు మెహర్ బాబా.ఆ విషయాలు ముందు ముందు చూద్దాం. 

అక్కడనుంచి దాదాపు 7 ఏళ్ళ పాటు మేర్వాన్ ఉపాసనీ మహరాజ్ శిష్యునిగా ఉంటూ బాబాజాన్ తనకు ఇచ్చిన అనుభవాన్ని స్థిరీకరించుకునే ప్రయత్నం గావించాడు.ఆ సమయంలో తరచుగా పూనా మరియు షిరిడీ/సాకోరీల మధ్యన తిరుగుతూ ఉండేవాడు మేర్వాన్.కొన్నిసార్లు సాకోరీలోనే ఉండిపోయేవాడు.ఆ ఏడేళ్ళూ ఉపాసనీ మహారాజ్ ఈయనకు ఏమి నేర్పించాడో ఈయన ఏమి నేర్చుకున్నాడో ఎవరికీ తెలియదు.

కానీ తరువాత కాలంలో మెహర్ బాబా చెప్పినది ఇలా ఉన్నది.

'బాబాజాన్ కృపతో నా మూడు దేహాలకూ నేను అతీతంగా వెళ్ళిపోయాను. విశ్వమంతా వ్యాపించి ఉన్న చైతన్యమే నేనన్న స్ప్రుహలో ఎల్లప్పుడూ ఉండేవాడిని.ఆ స్థితిలో, నా శరీరం ఉన్నదో లేదో కూడా నాకు తెలిసేది కాదు. అలాంటి స్థితిలో నేను ఉపాసనీ మహారాజ్ వద్దకు వెళ్లాను.ఆయన శిక్షణలో - దేహ,మానసిక,ప్రాణిక లోకాలనూ,ఈ అనంత విశ్వాన్నీ, ఏకకాలంలో చూస్తూ,బాబాజాన్ ఇచ్చిన దైవానుభూతిలో నిరంతరం ఉంటూ, అదే సమయంలో నా వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ ప్రపంచంతో మామూలుగా వ్యవహరించగలిగే స్థితికి నేను దిగి వచ్చాను.'

అంటే అద్వైతానుభవం చెదిరిపోకుండా ఉంటూ అదే సమయంలో ద్వైతంలో కూడా ఉండగలిగే స్థితి అన్నమాట.ఇదే అసలైన సద్గురువు యొక్క స్థితి.

1921 లో ఆయన సాధన పూర్తి అయింది.దైవానుభూతిలోనే నిరంతరమూ ఉంటూ అదే సమయంలో శరీరస్ప్రుహనూ లోకస్ప్రుహనూ కూడా ఏకకాలంలో కలిగి ఉండే స్థాయిని అప్పటికి ఆయన అందుకోగలిగాడు.ఈ విషయాన్ని అందరితో ఉపాసనీ మహరాజ్ బాహాటంగా చెప్పేవాడు."నా తాళం చెవిని మెహర్ కు ఇచ్చాను.అతను దైవానుభూతిని పొందాడు.అతన్ని అనుసరించండి." అని తన శిష్యులకు చెప్పేవాడు.

ఆయనింకా ఇలా అనేవాడు.

'సాయిబాబా నాకిచ్చిన తాళం చెవిని నేను మేర్వాన్ కు ఇచ్చాను.మేర్వాన్ వల్ల ముందుముందు లోకానికి ఎంతో మేలు జరుగుతుంది.'

గురుశిష్యులకు మధ్యన ఎప్పుడూ కొన్ని కొన్ని పోలికలుంటాయి. వీరిద్దరి మధ్యన కూడా అలాంటి పోలికలున్నాయి.

>>ఉపాసనీ మహారాజ్ ఉపవాసాలను ఎక్కువగా చేసేవాడు. నెలల తరబడి ఉపవాసం ఉండేవాడు.మౌనంగా ఉండేవాడు. అతి తక్కువ వస్తువులతో అతి నిరాడంబరంగా జీవితాన్ని గడిపేవాడు.ఒక గోనెపట్ట మాత్రమె ఆయన డ్రస్ అంటే ఇంక ఆయన నిరాడంబరత ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఒకసారి ఈయన్ను దర్శించడానికి గాంధీ వచ్చాడు.ఉపాసనీ మహారాజ్ నిరాడంబరతను చూచి అతి పిసినారి అయిన గాంధీనే ఆశ్చర్యపోయాడు.

మెహర్ బాబా కూడా ఉపవాసాలూ మౌనంతో కూడిన జీవితాన్నే గడిపాడు.

>>ఉపాసనీ మహారాజ్ బాహ్యమైన తంతులకు ఎక్కువగా ప్రాధాన్యత నిచ్చేవాడు కాదు.అంతరికమైన ఔన్నత్యానికే ఆయన పెద్దపీట వేసేవాడు.మెహర్ బాబా కూడా అంతే.

>>ఒక చిన్న వెదురుబోను లాంటి దాన్ని తయారు చేసుకుని ఉపాసనీ మహారాజ్ అందులో కొన్ని నెలలపాటు బందీగా ఉండిపోయాడు.అలా ఎందుకు చేశాడో ఎవరికీ తెలియదు.

అలాగే, ఒక కొండమీద గుహను ఒక జైలులాగా మార్చి అందులో మెహర్ బాబా నెలరోజుల పాటు ఉన్నాడు.ఎందుకలా చేశాడో ఎవరికీ తెలీదు.

పైగా,తను పోవడానికి చాలా ఏళ్ళ ముందే తన సమాధిని కట్టించుకుని, అందులో కూచుని తలుపేసుకుని ఏదో ఒక పుస్తకాన్ని వ్రాస్తూ ఉండేవాడు మెహర్ బాబా.ఇలా కొన్ని నెలలపాటు చేశాడు.ఆ పుస్తకం ఏమిటో, అది ఇప్పుడు ఎక్కడుందో ఎవరికీ తెలీదు. ఆ తరువాత అదే సమాధిలో ఆయన ఖననం చెయ్యబడ్డాడు.

బయటకు చూడటానికి పిచ్చివాడిలా కనిపించేవాడు ఉపాసనీ మహారాజ్. మెహర్ బాబా కూడా అలాగే ఉండేవాడు.అలాగే ప్రవర్తించేవాడు.

ఈ విధంగా గురుశిష్యుల మధ్యన సాధనా విధానాలలోనూ, బయట ప్రపంచంతో వ్యవహారంలోనూ చాలా పోలికలున్నాయి.


1921 లో తన సాధనను పూర్తిగావించుకున్న మెహర్ బాబా ఆ తరువాత 1941 వరకూ ఇరవై ఏళ్ళ పాటు మళ్ళీ ఉపాసనీ మహారాజ్ ను కలువలేదు.ఆయన తన పనిమీద దేశాలు పట్టుకుని తిరుగుతూ ఉండేవాడు.ఉపాసనీ మహారాజ్ మాత్రం అహమద్ నగర్ కు కానీ,పూనాకు కానీ ఎప్పుడు వచ్చినా మెహర్ బాబా ఇంటికి తప్పకుండా వచ్చేవాడు.కానీ ఆ సమయంలో మెహర్ బాబా ఎక్కడెక్కడో ఉండేవాడు.చివరకు 1941 అక్టోబరులో మాత్రం దహీగావ్ అనే ఒక మారుమూల పల్లెలో ఉపాసనీ మహారాజ్ ఒక కొండపైన గుడిసెలో ఒంటరిగా ఉంటున్న సమయంలో మెహర్ బాబా వచ్చి ఆయనతో ఒక అరగంట సేపు ఉన్నాడు.

అంతకు ముందు కొద్ది నెలలుగా ఆది ఇరానీ తల్లిగారైన గుల్మాయి తో ఉపాసనీ మహారాజ్ ఇలా అడుగుతూ ఉండేవాడు.

'నేను త్వరలో దేహాన్ని చాలించబోతున్నాను.ఒక్కసారి నేను మెహర్ ను కలవాలి.ఏర్పాటు చెయ్యండి.'

ఈ విషయాన్ని ఆమె మెహర్ బాబాకు చెప్పగా ఆయన ఇలా అన్నాడు.

'అలాగే కలుస్తాను.కానీ నేను సాకోరీలో అడుగు పెట్టను. మహారాజ్ ను నేను ఒక్కసారి మాత్రమే కలుస్తాను.ఆ ప్రదేశం సాకోరీ కాకుండా ఇంకెక్కడైనా ఉండాలి.మీరే ఆ ఏర్పాటు చెయ్యండి.'

చివరకు సాకోరీ దగ్గరలోని దహీగావ్ అనే ఊరిలోని ఒక ఒంటరి గుడిసెలో ఈ సమావేశం ఏర్పాటు చెయ్యబడింది.ఆ రోజు 17-10-1941.

ముందుగా అక్కడకు చేరుకున్న మెహర్ బాబా, తన కారులో మహారాజ్ ను తీసుకురమ్మని తన శిష్యులను పంపించాడు.మహారాజ్ ఒక్కడినే తీసుకురమ్మనీ ఆయన శిష్యులను ఇంకెవరినీ తేవద్దనీ ఖరాఖండిగా చెప్పాడు మెహర్ బాబా. ఆ విధంగానే  ఉపాసనీ మహారాజ్ ను సాకోరీ నుంచి వారు తీసుకువచ్చారు.ఆ గుడిసె ప్రాంగణం నుంచి అందరినీ బయటకు వెళ్ళమని చెప్పాడు మెహర్ బాబా.తాను చప్పట్లు కొడతాననీ అంతవరకూ ఎవరూ ఆ ఆవరణలోకి రావద్దనీ కనీసం అటువైపు తలతిప్పి చూడవద్దనీ ఆదేశించాడు.

మెహర్ బాబా, ఉపాసనీ మహారాజ్ ఇద్దరూ ఆ గుడిసెలో అరగంట సేపు ఉన్నారు.అక్కడ ఏం జరిగిందో ఆ తర్వాత మెహర్ బాబాయే ఇలా చెప్పాడు.

'నేను అవతారాన్నే కావచ్చు.కానీ ఆయన నా గురువు.అందుకని ఆయన కాళ్ళకు నేను ప్రణామం చేశాను.నా భుజాలు పట్టుకుని పైకి లేపిన ఆయన నన్ను కౌగలించుకుని చిన్న పిల్లాడిలా భోరున ఏడ్చాడు.'

ఆయనిలా అన్నాడు.

'మేర్వాన్.పంచ సత్పురుషుల శక్తి అంతా ఇప్పుడు నీలో కూడుకొని ఉన్నది.నువ్వు చెయ్యవలసిన పనిని చెయ్యి.నేను ఎక్కువకాలం జీవించను.సాకోరీని కనిపెట్టి ఉండు.'

ఇలా అంటూ ఆయన తిరిగి నాకు నమస్కారం చేశాడు.నేను చలించిపోయాను.

వారి సమావేశం ఆ విధంగా ముగిసింది.ఒక అరగంట తర్వాత ఇద్దరూ గుడిసె బయటకు వచ్చారు.మహారాజ్ ను కారులో మళ్ళీ సాకోరి ఆశ్రమంలో దిగబెట్టి వెనక్కు వచ్చారు మెహర్ బాబా శిష్యులు.

ఆ తర్వాత కొద్ది నెలలకే 24-12-1941 న ఉపాసనీ మహారాజ్  తన దేహాన్ని చాలించాడు.

(ఇంకా ఉంది)
read more " అవతార్ మెహర్ బాబా జీవితం - జాతకం - 7 (ఉపాసనీ మహరాజ్) "

19, ఫిబ్రవరి 2016, శుక్రవారం

అవతార్ మెహర్ బాబా జీవితం - జాతకం - 6 (త్రిపురాసుర సంహారం)

బాబాజాన్ తనను ముద్దు పెట్టుకోవడం వల్ల మేర్వాన్ తన శరీర స్పృహను కోల్పోయి మూడురోజులు నిశ్చేష్టుడై పడి ఉన్నాడనీ,ఆ తర్వాత కూడా ఆ స్థితి నుంచి పూర్తిగా బయటకు రావడానికి ఆయనకు తొమ్మిది నెలలు పట్టిందనీ ఇంతకు మునుపటి పోస్ట్ లో వ్రాశాను.

దానిని ఇంకొంచం వివరంగా చూద్దాం.

లోకంలో పుస్తకాల ద్వారా ఉపన్యాసకుల ద్వారా ప్రచారంలో ఉన్నది నిజమైన ఆధ్యాత్మికత అని లోకులు అనుకుంటూ భ్రమిస్తూ ఉంటారు.అది నిజం కాదు. నిజమైన ఆధ్యాత్మికతకు అన్నన్ని పుస్తకాల అవసరం లేదు.అన్నన్ని పూజలూ అన్నన్ని తంతులూ అవసరం లేదు.నిజంగా చెయ్యగలిగితే ఒక్క ముద్దుతోనే అంతా అయిపోతుంది.లేదా ఒక స్పర్శతో అంతా అయిపోతుంది.లేదా ఒక్క చూపుతో అంతా అయిపోతుంది.

ఇచ్చేవాడికి నిజంగా శక్తి ఉండాలి.తీసుకునేవాడికి అర్హత ఉండాలి.అంతే.ఈ రెండూ ఉన్నప్పుడు ఎటువంటి తంతులూ లేకుండా ఈ పని చాలా సింపుల్ గా అయిపోతుంది.ఈ రెండూ లేనప్పుడే పూజలూ హోమాలూ తంతులూ వ్రతాలూ నోములూ దీక్షలూ భజనలూ డాన్సులూ అరుపులూ అనవసరమైన గోలా అన్నీ ఉంటాయి.కానీ ఇన్ని చేసినా అక్కడ ఫలితం ఏమీ ఉండదు.

శ్రీరామకృష్ణుల జీవితంలో గమనిస్తే - ఆయన తన శిష్యులకూ భక్తులకూ ఇచ్చిన దర్శనాలూ సమాధిస్థితులూ అన్నీ కూడా - చూపుచే, స్పర్శచే, వాక్కుచే,తలపుచే -  అనే నాలుగు విధాలుగా ఉండటం మనం చూడవచ్చు.

కొంతమంది మీద ఆయన చూపు పడితే చాలు వెంటనే వారివారి ఇష్టదేవత ఎదురుగా నిలబడి వారికి కన్పించేది.శివానందస్వామికి ఆ విధంగా జరిగింది. ఇంకొంతమందికి ఆయన స్పర్శతో సమాధిస్థితి కలిగేది.వివేకానందస్వామికి ఆ విధంగా స్పర్శతో ఆ అనుభవం కలిగింది.విజ్ఞానానందస్వామికి కూడా స్పర్శతోనే సిద్ధి కలిగింది.కొంతమందిని ఆయన ఆశీర్వదిస్తూ - 'నీలో కుండలినీ జాగృతి కలుగుగాక' అనిన మరుక్షణంలో ఆ వ్యక్తిలో కుండలినీ జాగృతి కలిగేది.అద్భుతానందస్వామికి ఈ విధంగా జరిగింది.లేదా 'నీ ఇష్టదేవతా సాక్షాత్కారం కలుగుగాక'- అనిన ఉత్తరక్షణంలో వారి వారి ఇష్టదేవత ఎదురుగా నిలబడి కనిపించేది.కల్పతరు మహోత్సవం రోజున ఎంతోమందికి ఈ విధమైన దర్శనం కలిగింది.

ఇంకొంతమందికి ఈ మూడూ కూడా కాకుండా ఉత్త సంకల్పంతోనే ఆత్మసాక్షాత్కారాన్నీ దైవసాక్షాత్కారాన్నీ శ్రీరామక్రిష్ణులు కలిగించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.అయితే ఆయన ఈ వరాలను విచ్చలవిడిగా ఎవరికిబడితే వారికి ఇవ్వలేదు.ఆ అర్హతలు ఉన్నవారికే అవన్నీ ఇచ్చాడు. తట్టుకోగల శక్తి ఉన్నవారికే అవన్నీ ఇచ్చాడు.లేకుంటే ముందుగా ఆ తట్టుకునే శక్తిని వారికి కలిగించి ఆ తర్వాత అవి ప్రసాదించాడు.నిజమైన ఏ గురువైనా ఇదే చేస్తాడు.

కనుక, సిద్ధి అనేది ఒక్క క్షణంలోనే కలుగుతుంది.కానీ దానికి ఎన్నో జన్మల సాధన అవసరం అవుతుంది.దీపాన్ని వెలిగించే ప్రయత్నం ఎంతోసేపు చెయ్యవలసి ఉంటుంది.దీపం మాత్రం ఒక్క క్షణంలోనే వెలుగుతుంది.ఇదీ అంతే.

నూనెనూ వత్తినీ దీపాన్నీసమకూర్చుకుని వాటిని సరిగ్గా అమర్చి, దీపాన్ని శుభ్రం చేసుకుని, దీపంలో నూనెపోసి వత్తి అమర్చి,ఆ తర్వాత వత్తిని కొంచం సేపు నాననిచ్చి, అప్పుడు అగ్గిపుల్లతో వెలిగిస్తే ఆ దీపం వెలుగుతుంది.దీపం వెలగడానికి ఎంతసేపు పడుతుంది? ఒక్కక్షణం చాలు. ఒక్కక్షణంలో వత్తి అంటుకుని ఆ గది అంతా వెలుతురు పరచుకుంటుంది.కానీ ఆక్షణం కోసం అంతకు ముందు ఎన్నో గంటలు శ్రమించవలసి ఉంటుంది.

సాధన కూడా ఇంతే.సిద్ధి ఒక్క క్షణంలోనే కలుగుతుంది.కానీ దానికి ఎన్నో ఏళ్ళ నుంచీ మనల్ని మనం తయారు చేసుకోవలసి వస్తుంది.రాకెట్ టేకాఫ్ అయినప్పుడు ఒక్క క్షణంలోనే అంతా జరుగుతుంది.కానీ ఆ క్షణం కోసం ఎన్నో ఏళ్ళ నుంచీ దానికి ప్లానింగ్ చెయ్యవలసి ఉంటుంది.కావలసిన ఏర్పాట్లు అంచెలంచెలుగా చేసుకోవలసి ఉంటుంది.సాధన కూడా ఈ విధంగానే ఉంటుంది.అసలుపని ఒక్క క్షణంలోనే జరుగుతుంది.కానీ దానికి రెడీ కావడానికి మాత్రం చాలామందికి ఎన్నో జన్మలు పడుతుంది.

ప్రతి మనిషిలోనూ మూడు దేహాలుంటాయి.వాటినే స్థూల,సూక్ష్మ,కారణ దేహాలంటారు.శరీరమనేది స్థూలదేహం.మనస్సు ప్రాణం కలిసి సూక్ష్మశరీరం అనబడతాయి.జన్మజన్మలుగా మనలో పోగుపడి ఉన్న సంస్కారాలూ కోరికలూ వాంఛలూ అలవాట్లూ కారణశరీరం అనబడుతుంది.ప్రతిమనిషికీ ఈ మూడూ ఉంటాయి.మామూలు మనుషులు స్థూలదేహాన్ని చూడగలరు. సూక్ష్మ కారణ శరీరాలను చూడలేరు.అంతటి స్థితి వారికి ఉండదు.కానీ దివ్యచక్షువు ఉన్నవారు వాటిని కూడా దర్శించగలరు.వాటిని చూడటం ద్వారానే, ఒక మనిషి యొక్క గత జన్మలూ,ఆ జీవి యొక్క సంస్కారాలూ, సాధనామార్గంలో ఆ జీవికున్న అడ్డంకులూ,పాపపుణ్యాలూ అన్నీకూడా, అద్దంలో చూచినట్లు స్పష్టంగా వారికి అర్ధమౌతాయి.

ఈ మూడు దేహాలున్నట్లే ప్రతి మనిషికీ మూడు స్థితులున్నాయి.అవే జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థలు.వీనినే - మామూలు భాషలో - మెలకువ, కలలుగనే స్థితి,గాఢమైన నిద్ర అని అనుకోవచ్చు.ప్రతిమనిషీ ఈ మూడు స్థితులలోనే బందీగా పడి ఉంటాడు.వీటిని దాటి ఎప్పటికీ పైకి పోలేడు.వీటి పైన ఏముందో అతనికి అనుభవంలో ఉండదు.నిత్యజీవితంలో మనిషి పడే రొష్టంతా ఈ మూడు స్థితులలోనే ఉంటుంది.ఇంకా చెప్పాలంటే, జనసామాన్యంలో చాలామందికి కలతనిద్రే తప్ప గాడనిద్ర కూడా అనుభవంలో ఉండదు.

ఈ మూడు దేహాలనూ మూడు స్థితులనే త్రిపురములు (మూడు నగరములు) అని మనవాళ్ళు అన్నారు.ఈ మూడింటిలో ఉంటూ వీటిని నడిపిస్తున్న శక్తినే 'త్రిపుర సుందరి' అన్నారు.ఈ మూడింటి పైన ఉన్నదానిని చేరాలంటే ఈ మూడు పురాలనూ దాటిపోవాలి.ఈ ప్రక్రియనే 'త్రిపురాసుర సంహారం' అని పిలిచారు.ఈ వివరాలన్నీ 'శ్రీవిద్యా రహస్యం' లో యధోక్తంగా చర్చించాను.

ఈ మూడు స్థితులనూ దాటాలంటే రెండు షరతులు భర్తీ కావాలి.ఒకటి -నీ మూడు దేహాలూ దీనికి తయారుగా ఉండాలి.రెండు - అలా దాటించగల సమర్ధత కలిగిన గురువు నీకు తారసపడాలి.ఈ రెంటిలో దేనిలో లోటున్నా ఈ పని జరగదు.

అప్పటికే ఆ అనుభవం ఉన్న ఒక గురువు కటాక్షం లేకుండా ఈ మూటినీ దాటడం ఎవరికీ ఎన్నటికీ సాధ్యం కాదు.గురువు సహాయం లేకుండా ఈ పనిని సాధించేవారు ప్రపంచం మొత్తంలో ఒకరో ఇద్దరో ఉండవచ్చు.కానీ సామాన్య జనానికి మాత్రం ఈ పనికి ఒక గురువు అవసరం తప్పకుండా ఉంటుంది.గురుకటాక్షం లేకుండా ఈ పనిని సాధించడం అసాధ్యం.

మేర్వాన్ కు ఆ గురువు బాబాజాన్ రూపంలో వచ్చింది.తన ముద్దు ద్వారా ఈ మూడు స్థితులను ఒక్క క్షణంలో దాటించింది.అతని మూడు దేహాల స్పృహనూ ఒక్క క్షణంలో మాయం చేసేసింది.అతని నిజస్థితిలోకి అతన్ని ఒక్కసారిగా ప్రవేశపెట్టింది.కానీ ఆ చర్య వల్ల కలిగిన షాక్ ను ఆయన కూడా తట్టుకోలేక పోయాడు.
మేర్వాన్ దానికి సిద్ధంగానే ఉన్నాడు.అతని అంతరికస్థితి ఆ 'సడెన్ టేకాఫ్' కు రెడీ గానే ఉన్నది.12 సంవత్సరాలుగా అతనికి తెలీకుండా అతన్ని ఆ 'టేకాఫ్' కు సిద్ధం చేస్తూ అతను నివసిస్తున్న వీధిలోని వేపచెట్టు క్రింద బాబాజాన్ కూచుని ఉన్నది.ఈ పనిమీదే అసలామె పూనా నగరానికి వచ్చింది.ఆ క్షణంలో అతని దేహమూ మనస్సూ ప్రాణమూ మూడూ అందుకు సిద్ధంగానే ఉన్నాయి.అవలా సిద్ధంగా లేకుంటే ఆ 'షాక్' కు ఆ క్షణంలోనే అతను చనిపోయి ఉండేవాడు.అయినా కూడా అది జరిగినప్పుడు అతను తట్టుకోలేక తల్లక్రిందులై పోయాడు.

మేర్వాన్ ను బాబాజాన్ ఏదో కాకతాళీయంగా పిలవలేదు.ఆ పనికోసమే ఆమె పూనా వచ్చింది.ఎన్నో గతజన్మలలో మేర్వాన్ మంచి ఉన్నతమైన సాధకుడనీ ఎంతో అంతరిక పరిపక్వత చెందినవాడనీ ఆమెకు తెలుసు. మెహర్ బాబా జాతకం చూస్తే మనకు కూడా ఈ విషయం తేలికగా అర్ధమౌతుంది.పంచమ నవమాలలో గురువు, శని కేతువులున్న జాతకం సామాన్యమైనది ఎలా అవుతుంది?

కనుక ఆ అనుభవం మేర్వాన్ కు ఏదో కాకతాళీయంగా కలిగినది కాదు.ఆ సమయానికి అది రాసిపెట్టి ఉన్నది.అందుకోసమే మేర్వాన్ పుట్టాడు. అందుకోసమే బాబాజాన్ పూనా వచ్చింది.అంతరిక యాత్రలో అతనికి సహాయం చేసింది.

అసలా సమయంలో మేర్వాన్ కు ఏం అనుభూతి కలిగింది?

ఆ క్షణంలో తన మూడు దేహాలూ తాను కానన్న అనుభవం అతనికి హటాత్తుగా కలిగింది. ఈ మూడూ కాకుంటే మరేమిటి తాను? విశ్వమంతా నిండి ఉన్న ఒక స్పృహే తాను.నిజానికి అక్కడ విశ్వం యొక్క స్పృహ కూడా లేదు.ఉన్నది తానొక్కడే తను తప్ప ఇంకేమీ లేదు.ఆ స్పృహ ఒక సముద్రంలా ఒక నీలాకాశంలా అనంతంగా విస్తరించి ఉన్నది.అదే తాను. నేననే ఆ మహాసముద్రంలో ఒక చిన్న నీటి బిందువు తన భౌతిక శరీరం.

అంతేకాదు. మెలకువా, కలా, గాఢనిద్రా స్థితులను కూడా ఆయన ఆ సమయంలో దాటాడు.కన్నుమూసి తెరిచేలోపు మూడు దేహాలనూ మూడు స్థితులనూ దాటాడు.ఇది మాటలకందని ఒక మహాద్భుతమైన స్థితి. మాటలకు అవసరమైన నోరు భౌతికదేహంలో ఒక భాగమేగా? ఆ దేహాన్ని దాటిపోతే ఇంక మాటలెక్కడ ఉంటాయి?మాటలకు మూలం ఆలోచనలేగా? ఆ ఆలోచనల సమాహారం అయిన మనస్సును కూడా దాటిన స్థితిలో ఇంకేముంటుంది? అదొక అనిర్వచనీయమైన అద్భుతమైన పరిస్థితి.ఆ స్థితిలో నీవు లేవు.కానీ ఉన్నావు.నీకు తెలిసిన నువ్వుగా నువ్వక్కడ లేవు.ఇంకేదో అయిపోయిన స్థితిలోని నేనుగా ఉన్నావు.ఉండీ లేనట్టూ, లేకపోయినా ఉన్నట్టూ ఉన్నావు.ఉండటమూ లేకపోవడమూ ఏకకాలంలో అక్కడ ఉన్నాయి.ఈ అద్భుతం గురించే నా 'శ్రీవిద్యా రహస్యం' పుస్తకంలో 'గ్రంధి భేదనం' అనే అధ్యాయంలో వివరించి ఉన్నాను.ఆరోజున మేర్వాన్ కు జరిగింది అదే.

మూడురోజుల పాటు మేర్వాన్ ఆ స్థితిలో మాటాపలుకూ లేకుండా పడి ఉన్నాడు.ఆ తర్వాత ఆ స్థితినుంచి క్రిందకు రావడానికి అతనికి తొమ్మిది నెలలకాలం పట్టింది.ఈ తొమ్మిది నెలలలో అతనికి తిండీ నిద్రా రెండూ లేవు.వీటిని నమ్మడం మామూలు మనుషులకు కష్టం అవుతుంది.వారీ విషయాలను ఏమాత్రం నమ్మలేరు.కానీ ఇవన్నీ నిజాలే.మామూలు ప్రపంచానికి అందని,తెలియని, రహస్యమైన ఒక లోకం ఇది.

తల్లి కడుపులో బిడ్డ కూడా తొమ్మిది నెలలే ఉంటుంది.అప్పటికి గాని దాని పెరుగుదల సక్రమంగా పూర్తికాదు.అలాగే ఈ స్థితిని పొందిన వ్యక్తికి కూడా ఆ పరిస్థితి స్టెబిలైజ్ అవడానికి తొమ్మిది నెలల కాలం పడుతుంది.ఒక్కొక్క దేహానికి మూడు నెలల సమయం చొప్పున, మూడు దేహాలకూ తొమ్మిది నెలల రూటింగ్ పీరియడ్ (నిలదొక్కుకునే ప్రక్రియ) ఈ మొత్తం వ్యవహారంలో అవసరం అవుతుంది.ఎందుకంటే నీకు ఇప్పటివరకూ తెలిసిన అన్ని అనుభవాలనూ ఈ కొత్త అనుభవం కూకటివేళ్ళతో పెకలించి అవతల పారేస్తుంది.నీకింతవరకూ తెలియని ఒక అద్భుతమైన లోకంలోకి అది నిన్ను హటాత్తుగా విసరివేస్తుంది.అదే నిజమైన కొత్తజన్మ.అదే అసలైన పునర్జన్మ. అందుకని, తొమ్మిది నెలలకు గాని మనిషి ఆ షాక్ నుంచి బయటకు రాలేడు. మేర్వాన్ కు కూడా అదే జరిగింది.

అలా క్రిందకు వచ్చిన తర్వాత, అటూ ఇటూ కాని త్రిశంకుస్వర్గం వంటి ఆ స్థితినుంచి మళ్ళీ అతన్ని మామూలు మనిషిని చెయ్యడానికి ఇంకొక గురువు అవసరం అవుతుంది.మేర్వాన్ కు ఆ పనిని చెయ్యడానికి దైవం ఏర్పాటు చేసిన గురువులలో ఒకరు, సాయిబాబా శిష్యుడైన ఉపాసనీ మహరాజ్.

ఉపాసనీ మహరాజ్ జీవితం గురించీ, ఆయన మేర్వాన్ పరిస్థితిని ఎలా చక్కదిద్దాడో అదంతా వచ్చే పోస్ట్ లో చూద్దాం.

(ఇంకా ఉంది)
read more " అవతార్ మెహర్ బాబా జీవితం - జాతకం - 6 (త్రిపురాసుర సంహారం) "