“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

2, ఫిబ్రవరి 2022, బుధవారం

జీవితగమ్యం

ఈ మధ్యన ఒక పాత మిత్రుడిని కలవడం సంభవించింది. ఆయన స్టేట్ గవర్నమెంట్ లో హై పొజిషన్ లో రిటైర్ అయ్యాడు. ఇద్దరికీ ఇద్దరి గురించీ తెలిసినా నా నాణేనికి ఉన్న రెండోవైపు ఆయనకు తెలీదు. అందుకని మామూలు ధోరణిలోనే మాటలు సాగాయి.

నా మిత్రులలో ఎవరిని నేను కలిసినా ఆస్తిపాస్తుల గురించీ, పిల్లల గురించీ, ఎంత సంపాదించావ్?, ఎంత వెనకేశావ్? ఇలాంటి చచ్చుప్రశ్నలు ఎప్పుడూ అడగను. నేనడిగేది ఒకటే ప్రశ్న, 'ఎలా ఉన్నావ్?' అని. మహా అడిగితే 'ఆరోగ్యం బాగుందా?' అని రెండో ప్రశ్న అడుగుతా, అంతే. అంతకుమించి అడగకపోవడంతో, నాకు జనరల్ నాలెడ్జి తక్కువని సహజంగానే వారనుకుంటూ ఉంటారు. వారలా అనుకోవడమే నాకూ కావాలి గనుక, నేనూ మౌనంగా ఊరుకుంటాను.

'నీకింకా ఎన్నాళ్ళుందేంటి సర్వీసు?'అనడిగాడు తను.

'ఇంకెంత? కొద్ది నెలలు. జూలైలో రిటైర్ అవుతున్నా' అన్నా.

'మరి సంపాదించుకున్నావా? పిల్లలెక్కడున్నారు?' అనడిగాడు.

'ఆ ! తింటానికి ఉంటానికి సరిపోతుంది. నా రాతను బట్టి నా సంపాదన. పిల్లల రాతను బట్టి వాళ్ళు సెటిలయ్యారు. చెప్పుకోడానికేముంది?' అన్నా.

'ఏదో ఆశ్రమం పెడుతున్నావుట? నాగేశ్వర్రావు చెప్పాడు. ఓల్డేజి హోమా?' అన్నాడు.

నాగేశ్వర్రావు గుంటూరులో మాకిద్దరికీ కామన్ ఫ్రెండ్. వాడిద్వారా ఈ విషయం తెలుసుకున్నట్లున్నాడు.

'అలాంటిదే' అన్నా, అన్నీ అందరికీ చెప్పడం ఎందుకని.

'బాగుంటుందిలే. దానిమీద కూడా బాగా సంపాదించవచ్చు' అన్నాడు.

చాలా జాలేసింది ఆ మాట విని. సంభాషణ పొడిగించడం ఇష్టం లేక, మౌనంగా ఊరుకున్నా.

ఇక తన గురించి మొదలుపెట్టి, హైద్రాబాద్ లో తను ఎన్ని విల్లాలు కొన్నదీ, పిల్లలు ఎలా ఫారిన్ లో సెటిలైందీ, ఎక్కడెక్కడ ఎన్నెన్ని స్థలాలున్నదీ గర్వంగా చెప్పుకొచ్చాడు. మధ్యలో ఆపి, 'కనీసం ఒక్క విల్లా కూడా కొనలేదా నువ్వు?' అన్నాడు జాలిగా.

'లేదు. అంత అవసరమూ లేదు, అవకాశమూ రాలేదు' అన్నాను.

'రాలేదా? నువ్వు ప్రయత్నం చేయలేదా?' అన్నాడు హాస్యంగా.

'రెండోదే నిజమనుకో' అన్నా ఈ టాపిక్ పొడిగించడం ఇష్టం లేనట్లు.

'క్రిప్టో గురించి చూస్తున్నావా?'అడిగాడు.

తెలిసినా తెలీనట్లు, 'అదేంటి?' అన్నా

'నువ్వింతే' అన్నట్లు జాలిగా ముఖం పెట్టి, 'ఓహో ! అయితే నీకర్ధం కాదులే. నువ్వు చాలా వెనుకబడి ఉన్నావ్, ఫ్యూచరంతా క్రిప్టో దే' అన్నాడు.

'ఐసీ' అన్నా నిరాసక్తంగా. 

'ఇప్పుడు మనకు లీవ్ బాధ లేదుగా. వచ్చే నెలలో అమెరికా వెళ్తున్నా, హ్యాపీ' అన్నాడు.

'అమెరికా వెళ్తే హ్యాపీనా? మరి అక్కడున్న NRI లు వెనక్కొస్తున్నారేంటి? వాళ్ళు హ్యాపీ కాదా?' అడిగా నవ్వుతూ.

'ఇందాకట్నుంచీ చూస్తున్నా నీ ధోరణి? ఎడ్డెమంటే తెడ్డెమంటావ్? అసలేంటి నీ గోల? చేతనైతే సంపాదించాలి. అంతేగాని  ఇలా కుళ్ళుకోకూడదు' అన్నాడు కొంచం కోపంగా.

నాకు నవ్వుతో పొలమారింది. 'కుళ్ళా? ఎందుకు?' అన్నా నవ్వాపుకుని.

'అదే. నేను బాగా సెటిలయ్యాను. నువ్వు కాలేదు. అందుకే నీకు కుళ్ళు' అన్నాడు.

'నేను బాగా సెటిలవ్వలేదని ఎవరన్నారిప్పుడు?' అన్నా.

'మరి సంపాదించి దాచిపెట్టలేదని నువ్వే అంటున్నావ్ గా?' అన్నాడు.

'దానికీ, 'బాగా' సెటిలవ్వడానికీ సంబంధం ఏంటి?' అన్నా అమాయకంగా.

'ఓరి దేవుడో ! నీతో పెట్టుకుంటే నాకు పిచ్చెక్కేలా ఉందిగాని, నీకో దణ్ణం నేనొస్తా' అంటూ అవతలకి పోబోయాడు.

ఈ జీవికి కొంచం జ్ఞానబోధ చేద్దామని జాలి కలిగింది. ఆపి, ఇలా అడిగా.

'సరే. ఇప్పటిదాకా నువ్వు ప్రశ్నలడిగావ్ నేను జవాబులు చెప్పా. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలడుగుతా, నీకు చేతనైతే ఆన్సర్స్ చెప్పు' అన్నా.

ని ఈగో దెబ్బతింది. పోబోతున్నవాడల్లా ఆగి, 'సరే అడుగు' అన్నాడు అనుమానంగా.

'ప్రస్తుతం నీ వయసెంత?' అడిగా.

'అరవై ఒకటి' అన్నాడు.

'ఓకే. నీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది?' అన్నా.

'అన్ని రోగాలూ ఉన్నాయి. మందులున్నాయిగా. నడుస్తోంది బండి. కరోనా కూడా రెండుసార్లు వచ్చి తగ్గింది.  మొదటిసారి పైదాకా వెళ్లి వచ్చా. రెండోసారి లైట్ గా బ్రష్ కోటింగ్ పడింది' అన్నాడు.

'ఇంకా ఎన్నాళ్ళు బ్రతుకుతావని నీ అంచనా?' అన్నా.

షాకయ్యాడు ఆ మాటకి.

'ఏమో? కనీసం ఇంకా పదీ ఇరవై ఏళ్ళు బ్రతుకుతానేమో?' అన్నాడు.

'అబ్బో అంత గ్యారంటీ ఉందా? నియో కవ్ అని ఇంకో కరోనా వెరైటీ వస్తోందిట. సోకిన ముగ్గురిలో ఒకడు గ్యారంటీగా పోతాట్ట' అన్నా.

'అవి పుకార్లు, నమ్మకు. పేపర్లలో ఏవో రాస్తుంటారు' అన్నాడు.

'సరే ఇంకో పదీ ఇరవై ఏళ్ళు బ్రతుకుతావని అనుకుందాం. అది కూడా, క్రిప్టో కరెన్సీ, షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్ అంటూ బ్రతికి చివరకేం చేస్తావ్?' అన్నా.

'ఏముంది? అందరూ ఏం చేస్తారు? పోవడమే' అన్నాడు.

'మరి చివరకు, ఇంత సంపాదించిన నువ్వూ పోయి, ఏమీ సంపాదించని నేనూ పోయి, అందరూ పోయేదే కదా? నాకంటే డిఫరెంట్ గా ఏంటి నువ్వు సాధించింది?' అన్నా.

'ఎవరైనా సాధించేది డబ్బే కదా ! లగ్జరీగా బ్రతకడమేగా ఎవరైనా చేసేది? ఇంకేముంది?' అన్నాడు.

'లగ్జరీ ఒక్కటే జీవిత పరమావధి కాదు. అలా కాకపోయినా బాగా బ్రతకవచ్చు. డబ్బు, కంఫర్ట్స్, ఇవొక్కటే జీవితానికి అంతిమగమ్యాలు కావు. నువ్వు పోయాక ఎక్కడికి పోతావో, ఏమౌతావో, అప్పుడు నువ్వు సంపాదించిన ఈ భూములు, విల్లాలు, అపార్ట్ మెంట్లు, ఆస్తులు ఏమౌతాయో ఆలోచించావా ఎప్పుడైనా?' అడిగా.

'ఏముంది? నా పిల్లలు ఎంజాయి చేస్తారు?' అన్నాడు.

'ఎంతని ఎంజాయి చేస్తారు? వాళ్లేమో అమెరికాలో సెటిలయ్యారు. నీ డబ్బు వాళ్ళకెందుకు? ఇక్కడ నీ ఆస్తులు వాళ్లెలా ఎంజాయి చేస్తారు? అమ్ముకుంటారు' అన్నా.

'పోన్లే. ఆ డబ్బు వాళ్లకు మిగులుతుంది కదా !' అన్నాడు మొండిగా.

'ఏం చేసుకుంటారు ఆ డబ్బుని? అప్పుడు కూడా, నీ బ్లాక్ మనీని వాళ్లెలా అక్కడికి ట్రాన్స్ ఫర్ చేసుకోగలరు? పోనీ ఏదో చేస్తార్లే అనుకున్నా, ఒక లిమిట్ దాటాక డబ్బు ఎందుకు? మినిమమ్ లివింగ్ ఉంటే చాలదా ? ఆ తర్వాత ఏం చేసుకుంటావ్ డబ్బుని? ఇప్పుడు నీకు కోట్లున్నాయి. మరి నీ రోగాలు తగ్గడం లేదు కదా? ఏంటి ఉపయోగం?' అన్నా.

'ఓహో ఫిలాసఫీనా ! అయితే నీ ఆశ్రమంలో చేరమంటావా నన్ను? డొనేషన్ కావాలా?' అన్నాడు నవ్వుతూ.

ఇలా కాదని సూటిగా విషయం లోకొచ్చా.

'చూడు గుర్నాధం ! ఎవడు బడితే వాడు ఇచ్చే డొనేషన్ మేము తీసుకోము. ఇవ్వాలన్నా ఒక అర్హత ఉండాలి. అవినీతి డొనేషన్లు మాకక్కర్లేదు. నీతిగా సంపాదించిన మా సంపాదన మాకు చాలు. ఇకపోతే, నువ్వు చేరతానని వచ్చినా, మా ఆశ్రమంలో ఎవరిని బడితే వారిని చేర్చుకోవడం జరగదు. నిన్నసలు గేట్ లోపలకే రానివ్వం. మాతో చేరాలన్నా, మాతో ఉండాలన్నా కొన్ని అర్హతలుండాలి' అన్నా.

'అబ్బో ! ఏంటో అవి?' అన్నాడు ఎగతాళిగా.

'మొదటగా, జీవితమంటే లోతైన ఆలోచనా, అవగాహనా నీకుండాలి. జీవితంలో నీ ప్రయారిటీలు 'సంపాదన, డబ్బు, సుఖాలు' ఇవే కాకూడదు.  ఉన్నతమైన తాత్త్వికచింతన నీలో ఉండాలి. నేను ఇందాక అడిగానే, ఆ ప్రశ్నలకు జవాబులు నీకు స్పష్టంగా తెలిసి ఉండాలి. ఆధ్యాత్మికమార్గంలో నడవాలన్న తీవ్రమైన తపన నీలో ఉండాలి.  అప్పుడు మాత్రమే నీకు మా ఆశ్రమం తలుపులు తెరుచుకుంటాయి. లేకపోతే తెరుచుకోవు. నువ్వు ఇప్పటిదాకా బ్రతికింది చాలా డొల్ల జీవితం. అసలైన జీవితం నీకేమీ తెలీదు. నీకు తెలీని జీవితం చాలా ఉంది. అలా బ్రతికితేనే దానికి సార్ధకత' అన్నా.

'ఓహో ! లేకపోతే ఏమౌతుంది?' అన్నాడు.

'ఏమీ కాదు. రోడ్డు ప్రక్కన బెగ్గరూ చస్తాడు. ఒక మధ్యతరగతి మనిషీ చస్తాడు. నువ్వూ చస్తావు.  కాకపోతే నువ్వు అపోలో లో పోతావు. మామూలు మనిషి మామూలు ఆస్పత్రిలో పోతాడు.  అంతే తేడా ! ఒక ఇరవై ఏళ్ల తర్వాత నువ్వనేవాడివి ఒకప్పుడు ఉన్నావని కూడా ఎవడికీ గుర్తుండదు. నిన్ననుకునేవారే ఉండరు. మీలాంటి వాళ్ళెవరూ జీవితపు మౌలికసమస్యలకు సొల్యూషన్స్ కనుక్కోలేరు.  ఎందుకంటే మీరా దిశగా ప్రయత్నం చేయడం లేదు గాబట్టి' అన్నా.

'నువ్వొక్కడివే పెద్ద ఫిలాసఫర్ ననుకోకు. నేనూ ఫలానా స్వామీజీ భక్తుడినే. ఆయన మా ఇంటికి కూడా వొచ్చాడు' అన్నాడు.

'దానివల్ల ఉపయోగం జీరో. ఆయనకూ అసలు విషయం తెలీదు, నీకూ తెలీదు. ఆయనా నువ్వూ ఒకే పడవలో ఉన్నారు. ఆయనకూ పరమావధి డబ్బే. నీకూ అదే' అన్నా.

వాడికి పిచ్చి కోపం రేగింది. తమాయించుకుని, 'నీకసలు క్రిప్టో కరెన్సీ గురించే తెలీదు, షేర్ మార్కెట్ ఎలా ఉందో తెలీదు. నువ్వు నాకు ఫిలాసఫీ చెబుతున్నావ్ ! నువ్వు మారవురా ! నీ ఖర్మ. పడు' అంటూ విసురుగా వెళ్ళిపోయాడు.

నాకు నవ్వూ జాలీ ఒకేసారి కలిగాయి. వాడు వెళ్ళినవైపు చూస్తూ ఉండిపోయా కాసేపు.

మనుషులు ఎంత మాయలో కూరుకుపోయి ఉన్నారు? 61 వచ్చినా ఇంకా 'డబ్బు డబ్బు' అంటూ అంగలారుస్తున్నాడు మిత్రుడు.  ఏంటీ ఖర్మ? మాయంటే ఇదేనా? మనుషుల పైన దీని పట్టు ఇంత ఘోరంగా ఉంటుందా? కళ్ళముందు ప్రతిరోజూ ఎంతో మంది చనిపోవడం చూస్తూ కూడా, ఇంకా డబ్బని ఆస్తులని పరిగెత్తడం ఎంత వింత? సరే జీవితమంతా దానికోసమే బ్రతికాడు. కనీసం ఇప్పుడైనా జీవితపు మౌలికసమస్యల గురించి కాస్త ఆలోచించాలి కదా? తర్వాత ఏంటి? అన్న ఆలోచన రావాలి కదా.

ప్రపంచ జనాభా 790 కోట్లు. వీళ్ళలో నిజమైన ఆధ్యాత్మిక చింతన ఉన్నవాళ్లు కనీసం ఒక లక్షమందైనా ఉంటారా? ఒకవేళ ఉంటే, వాళ్లలో ఎంతమంది సిన్సియర్ గా సరియైన దారిలో నడుస్తారు? అలా నడిచేవారిలో ఎంతమంది గమ్యానికి చేరతారు? కనీసం ఒక పదిమంది ఉంటారా? లేక వారూ ఉండరా? ఈ లోకం ఇంతేనా? ఒకవేళ దీని నియమం ఇంతేనేమో? ఇదెప్పటికీ ఇలా ఉండటమే కరెక్టేమో? కర్మనియమమూ, లోకరీతీ ఇంతేనేమో? ఈ రొచ్చులోంచి బయటపడటం వీళ్ళవల్ల కాదేమో? మరి వీళ్లకు చెప్పాలని ప్రయత్నించడం కరెక్టేనా? అసలీ ప్రయత్నమే తప్పేమో?

పై ప్రశ్నలన్నీ నాలో తలెత్తాయి. హఠాత్తుగా, శ్రీ రామకృష్ణుల వారు చెప్పిన 'వలా - చేపలూ' కధ గుర్తొచ్చింది. నాకు నాకే సమాధానం కూడా దొరికింది.

'చీకట్లో చిరుదీపాన్ని వెలిగించడమే నీ పని. అది ఎవరికి  ఉపయోగపడాలో వారికి పడుతుంది. మిగతాది నీపని కాదు. ఎక్కువ దీనిగురించి ఆలోచించకు. లోకం సంగతి నీకనవసరం. దానిని చూచుకునేవాడు ఒకడున్నాడు. అది వాడి పని. మనుషులు అంత తేలికగా వెలుగుదారిలోకి రాలేరు. ఈ ప్రపంచం ఒక ప్లాన్ ప్రకారం పోతున్నది. దానిపని అది చూచుకుంటుంది. నీ పని నీవు చెయ్యి. ఇంతకు ముందు కూడా చాలాసార్లు నీకిదే చెప్పాను. మళ్ళీ చెబుతున్నాను' అన్నది ఒక స్వరం.

'సరే అలాగే చేద్దాం' అనుకుంటూ నా దారిన నేనొచ్చేశా.

అంతకంటే చేసేది మాత్రం ఏముంది గనుక?

read more " జీవితగమ్యం "