“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

29, జూన్ 2012, శుక్రవారం

శని వక్రత్యాగం - ఆశ్చర్యకరఫలితాలు

మీలో ఎవరైనా మొన్న సోమవారం 25-6-2012 తర్వాత ఊహించని మార్పులను మీ జీవితంలో గమనించారా? అవి పెద్దపెద్ద మార్పులు కావచ్చు. లేదా అంత ముఖ్యమైనవి కాకపోవచ్చు. కానీ ఊహించనివీ అనుకోనివీ కొన్ని నెలలనుంచీ పెండింగ్ లో ఉన్నవీ ఖచ్చితంగా అయి ఉంటాయి. దానికి కారణం ఏమిటో ఊహించారా? ఏదో కాకతాళీయంగా ఇవి జరుగుతున్నాయి అనుకుంటున్నారా? కాదు. దీనికి కారణాలున్నాయి.

నాలుగు నెలలుగా వక్రస్తితిలో (retrograde motion) ఉన్న శని మొన్న సోమవారం (25-6-2012) నాడు తన వక్రగతిని వీడి రుజుగతి(direct movement) లోకి ప్రవేశించాడు. దాని కారణంగా మనుష్యుల జీవితాలలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. చేసుకుంటున్నాయి కూడా. మీమీ జీవితాలు గమనించుకుంటే నేను వ్రాస్తున్న ప్రతి అక్షరమూ సత్యమే అని మీకే తెలుస్తుంది.

ఏఏ మార్పులు మీమీ జీవితాలలో జరుగుతున్నాయో కొంచం వివరిస్తాను. వినండి. ఫిబ్రవరి ఏడో తేదీ ముందు మీ జీవితం ఎలా ఉందొ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అప్పుడు మొదలై ఇన్నాళ్ళూ మీ జీవితంలో సాగిన స్తితి ఇప్పుడు రివర్స్ అవుతుంది. అంతకు ముందటి స్తితి మళ్లీ ఇప్పుడు వస్తుంది. 

>>ఫిబ్రవరి తర్వాత మీ జీవితంలో ప్రవేశించిన వ్యక్తులు ఇప్పుడు హటాత్తుగా నిష్క్రమిస్తారు. లేదా వారితో సంబంధాలు దెబ్బతింటాయి.

>>అనుకోకుండా కొత్త వస్తువులు సమకూర్చుకుంటారు. లేదా ఇళ్ళు మారతారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు సడన్ గా కదులుతాయి.  

>> మానసికంగా అనుకొని హటాత్తు మార్పులు కొందరిలో కలుగుతాయి. ఇప్పటివరకూ ఉన్న మూడ్స్ మారిపోయి దానికి పూర్తిగా వ్యతిరేకమైన మూడ్ లోకి వెళతారు. సన్నిహితులతో, అధికారులతో, సహోద్యోగులతో, స్నేహితులతో మాటామాటా పెరిగి గొడవలు అవుతాయి. ఈ వాదనల వెనుక పెద్ద పెద్ద రీజన్స్ ఏమీ ఉండవు. చాలా చిన్న విషయాలమీద ఈ గొడవలు అవుతాయి.

>>ఇప్పటి వరకూ ఒకరికి ఒకరుగా ఉన్నవారిలో కూడా గొడవలు జరిగి ఎడమొహం పెడమొహంగా అవుతారు. ఇప్పటి వరకూ చిన్నచిన్న కారణాలుగా కనిపించినవి ఒక్కసారి పెద్దవిగా కనిపించి మూడ్ ఆఫ్ అవుతుంది.

>>స్తబ్దుగా ఉన్న కొందరి ఉద్యోగ జీవితం ఉన్నట్లుంది చాలా చురుకుగా మారుతుంది. అనుకొని అధికారులతో పరిచయాలు కలుగుతాయి. స్తంభించిన వ్యాపారాలు మళ్లీ చురుకుగా కదులుతాయి.

>> నిత్యజీవితంలో జరుగుతున్న ఒక చిన్న విషయం చెప్తాను. నేను వ్రాసే అనేక విషయాలలాగే ఇదీ వినడానికి వింతగా ఉంటుంది. ఇసుక దొరకక భవన నిర్మాణాలు కొన్ని నేలలుగా మందకొండిగా సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు ఆ ప్రతిష్టంభన తొలగిపోతుంది. మళ్లీ భవన నిర్మాణాలు ఊపందుకుంటాయి. ఇది శనీశ్వరుల ప్రభావమే.

>>కొందరికి శని వక్రించినప్పుడు మంచి జరుగుతుంది. అటువంటి వారికి ప్రస్తుతం మళ్లీ చెడుకాలం మొదలౌతుంది. జీవితంలో కోపాలు, చికాకులు, విసుగులు, డిప్రెషన్లు  మొదలౌతాయి. ఇవి వినడానికి విచిత్రంగా ఉంటాయి. కాని మనకు తెలియని శక్తులు మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయో ఇది గమనిస్తే బాగా అర్ధం అవుతుంది.

>> కొంతమందికి ఎప్పుడో మరచిపోయిన వారితో మళ్లీ సంబంధాలు నేరపాలని బలంగా అనిపిస్తుంది. దూరపు బంధువులు మళ్లీ తారసపడతారు. ఇన్నాళ్ళూ ఫోన్ చెయ్యని వారూ పలకరించని వారూ మళ్లీ పలకరిస్తారు.

>>కొందరు వాతరోగులుంటారు(rheumatic patients). వారికి కొన్ని నెలలుగా వాతనొప్పులు కాస్త ఉపశమనంగా ఉంటాయి. మొన్న సోమవారం నుంచీ అవి మళ్లీ తిరగబెట్టి ఊపందుకుంటాయి. తగ్గిన రోగాలు చాలామందిలో మళ్లీ తిరగబెడతాయి.

>>కొందరు తమతమ వాహనాలకు,వస్తువులకు రిపేర్లు చేయిద్దామని కొన్ని నెలలుగా అనుకుంటూ వాయిదా వేస్తూ ఉంటారు. అవి మొన్న సోమవారం తర్వాత సడన్ గా జరుగుతాయి.


ఇలాంటి విచిత్రాలు మానవ జీవితంలో చాలా జరుగుతాయి. గమనించండి. నేను వ్రాసింది ఎంత నిజమో మీకే తెలుస్తుంది. ఇప్పుడైనా మానవజీవితం మీద గ్రహప్రభావం నిజమేనని నమ్ముతారా? ఇంకా నమ్మకపోతే మీ ఇష్టం. మీరు నమ్మినా నమ్మకున్నా విశ్వశక్తుల చేతిలో మనిషి కీలుబొమ్మ అన్నది అక్షరసత్యం.


చిన్న సూచన:--రాబోయే కొద్దిరోజులలో శనికుజుల కన్జక్షన్ వల్ల  కొంతమంది జీవితంలో వాహనప్రమాదాలు జరుగుతాయి. రక్తదర్శనం , కుట్లు పడటం జరుగుతుంది. గమనించి జాగ్రత్తగా ఉండండి.
read more " శని వక్రత్యాగం - ఆశ్చర్యకరఫలితాలు "

25, జూన్ 2012, సోమవారం

అతీతలోకాలు - అదృశ్యశక్తులు

చాలామంది అతీతలోకాలు లేవని అనుకుంటారు. అదృశ్యశక్తులు కూడా లేవని అనుకుంటారు. అది నిజం కాదు. అవి ఉన్నాయి. మనకు కనిపించనంత మాత్రాన "లేదు" అనుకోవడం వెర్రితనం. రాత్రిళ్ళు మనకు సూర్యుడు కనిపించడు.అంతమాత్రాన సూర్యుడే లేడు అనుకోవడం ఎంత తెలివితక్కువతనమో ఇదీ అంతే. రాత్రి మాత్రమె తెలిసినవాడు సూర్యుడు లేడు అనుకోవచ్చు. కాని పగటిని చూచినవాన్ని అడిగితే సూర్యుడున్నాడు  అని అతను చెప్తాడు. అలాగే, మనకు కనిపిస్తున్నదే సత్యమనీ తక్కినది అబద్దమనీ అనుకోవడం పిచ్చితనం. గోడ అవతల ఏముందో మనం చూడలేం. అంతమాత్రాన గోడ అవతల ఏమీ లేదు అనుకోవడం తప్పే కదా.

మనిషి ఇంద్రియాలకున్న పరిధి అతి స్వల్పమైనది. మన మెదడులోనూ ఊపిరితిత్తులలోనూ ఉన్న శక్తిలో మనం నిత్యజీవితంలో వాడుకునేది చాలా స్వల్పం. సాధారణ మానవులలో పినియల్ గ్లాండూ, పిట్యూటరీ గ్లాండూ చాలావరకూ నిద్రాణంగా పడి ఉంటాయి.అలాగే మన పొటెన్షియల్ శక్తిలో ఎంతో భాగం నిరుపయోగంగా పడిఉంది. లేదా వృధాగా పోతూ ఉంటుంది. యోగులు ఆ మొత్తాన్నీ నిగ్రహించి దానిని సరియైన వాడుకలోనికి తెస్తారు. అందువల్ల వారి ఇంద్రియాల పరిధి చాలా విస్తృతంగా ఉంటుంది. వారి దర్శనశక్తి కూడా అమితంగా వృద్ధి చెంది ఉంటుంది. అందుకే మామూలు మనుషులు చూడలేనివి వారు చూస్తారు. ఇతరులు వినలేనివి వారు వినగలరు. ఆ క్రమంలోనే అతీతలోకాలను వారు చూడగలుగుతారు. అదృశ్య శక్తులతో సంభాషించగలుగుతారు.

మనిషి చూడలేని వేవ్ లెంగ్త్ లను కొన్ని జంతువులు చూడగలవు. కుక్కలకు ఆ శక్తి ఉంది. అవి ఒక్కొక్కసారి దయ్యాలను చూచి ఏడుస్తూ ఉంటాయి. అయితే కుక్క ఏడ్చిన ప్రతిసారీ అక్కడేదో దయ్యం ఉన్నట్లు అనుకోవడం కూడా తప్పే. దానికి ఆకలేసినా, సీజన్ వచ్చినా కూడా అలాగే ఏడుస్తుంది.  ప్రేతాత్మలను చూచినప్పుడు కుక్క ఏడవటం ఒక తీరులో ఉంటుంది. అనుభవంలో దానిని కనిపెట్టవచ్చు. గబ్బిలాలు సూక్ష్మ తరంగాల ఆధారంగానే దేనికీ తగలకుండా ఎగరగలుగుతాయి. పక్షులు తమలోని అయస్కాంత దిక్సూచి ఆధారంగానే వేలమైళ్ళు ప్రయానంచేసినా మళ్లీ తమ గూటికి చేరుకోగలుగుతాయి. పిల్లులు కూడా మనం చూడలేని వేవ్ లెంగ్త్ లో ఉన్న జీవులను చూడగలవు. పాములు ఈ విషయంలో మరీ శక్తివంతమైన జీవులు. మైళ్ళ దూరంలో ఉన్న మనిషి కదలికలను అవి గుర్తుపట్టగలవు. కొన్ని దేవతా సర్పాలకైతే అతీత శక్తులు ఉంటాయి. అవి మానవరూపం ధరించగలవు. మానవ భాషలో మాట్లాడగలవు కూడా.

నిద్రాణంగా ఉన్న మన  ఇంద్రియశక్తులను  యోగం ద్వారా నిద్రలేపినపుడు అద్భుతాలు చూడవచ్చు. ఇంతవరకూ మనం చూస్తున్న లోకం వెనుక ఎన్ని లోకాలున్నాయో గమనించవచ్చు. వాటిలో ఎన్నెన్ని జీవులున్నాయో చూడవచ్చు.  వారితో ఇంటరాక్ట్ కావచ్చు. కొందరు పాశ్చాత్య శాస్త్రజ్ఞులు చెప్పినదాని ప్రకారం మనం చూస్తున్న డైమెన్షన్ వెనుక కనీసం ఆరు ఇతర డైమెన్షన్ లు ఉన్నాయి. అంటే మొత్తం ఏడు లోకాలున్నాయి అని అర్ధం. మన ప్రాచీనులు చెప్పిన భువర్లోక సువర్లోకాది సప్త ఊర్ధ్వలోకాలు అవే. వీటికి నెగటివ్ పోల్స్ నే అతల వితలాది సప్త అధోలోకాలు అన్నారు.

ఒక్కొక్క డైమెన్షన్ లో ఒక్కొక్క రకమైన జీవులు ఉంటాయి. మళ్లీ వీటిలో విభిన్న తరగతుల వాళ్ళు ఉంటారు. మానవలోకంలో అందరూ మానవులే అయినప్పటికీ వాళ్ళలో మళ్లీ తేడాలున్నట్లుగా అక్కడ కూడా ఉంటుంది.వీరిలో కొందరు ఉన్నత స్థాయికి చెందిన జీవులు వారి ఇష్టానుసారం మనకు కనిపించి సూచనలు ఇవ్వగలవు. మన కర్మలో పాలుపంచుకోగలవు. సద్గురువులకు ఈ శక్తి ప్రస్ఫుటంగా ఉంటుంది. తమ శిష్యులను జన్మజన్మాన్తరాలవరకూ వారు గైడ్ చెయ్యగలరు. 

మనం ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడు, యోగసాధనా బలం తగినంత ఉన్నపుడు, సద్గురువులతో మనం కోరినప్పుడు సంభాషించవచ్చు. ఊర్ధ్వలోకాలలో ఉండే ఉత్తమ జీవులను దేవతలు అంటాము. వారు కాంతి శరీరాలను కలిగి ఉంటారు. అవి రకరకాల రంగులలో ఉంటాయి. ఆయా రంగులు వారి తత్వాన్నీ శక్తులనూ ప్రతిబింబిస్తూ ఉంటాయి. దేవతలనబడే ఈ ఉత్తమ జీవులను చూచి వారితో సంభాశించగలిగే శక్తి కొందరికి ఉంటుంది. శ్రీరామకృష్ణుల శిష్యుడైన బ్రహ్మానందస్వామికి ఈ శక్తి ఉండేది. ఆయన దేవతలను చూచి వారితో మాట్లాడగలిగేవారు. రాత్రిళ్ళు మూసి ఉన్న ఆయన గదితలుపుల వెనుక నుంచి రకరకాల కాంతులు బయటికి ప్రసరిస్తూ ఉండేవి. ఖాళీగా నిరాడంబరంగా ఉండే ఆయన గదినుంచి రకరకాల వాయిద్యాల ధ్వనులు ఒక్కొక్కసారి బయటికి వినవచ్చేవి. రకరకాల సువాసనలు అకస్మాత్తుగా ఆ గదినుంచి గుప్పుమనేవి.

ఇవన్నీ కూడా వినడానికి "ఫెయిరీ టేల్స్" లా ఉండవచ్చు. కానీ ఆ కధలవేనుక ఉన్న ప్రేరణకూడా కొన్ని వాస్తవాలమీద ఆధారపడినట్టిదే అని మరువరాదు. అతీతలోకాల దర్శనాన్ని పొందినవారు అన్నికాలాలలోనూ అన్నిదేశాలలోనూ ఉన్నారు. వారు చెప్పిన వివరాలనుంచి ఈ కధలు (fairy tales) పుట్టుకొచ్చాయి. అయితే ఈ అతీతశక్తులను పొందటం ఎలా అనేది ఒక సైన్స్ గా క్రోదీకరించబడినది మాత్రం మన దేశంలోనే.మన యోగులు మహర్షులు ఈ సైన్స్ కు సృష్టికర్తలు. ఇది ఇప్పటికీ సజీవంగా ఉన్న రహస్యవిద్య. అర్హత ఉన్నవారిని ఈ రంగంలో ఇప్పటికీ సద్గురువులు గైడ్ చేస్తూనే ఉంటారు. వారి కమ్యూనికేషన్ విధానాలు కూడా విచిత్రంగా ఉంటాయి. అదొక రహస్య ప్రపంచం అని చెప్పవచ్చు. బయటి వారికి దీనివివరాలు అస్సలు తెలియవు.

నిత్యజీవితంలో కూడా మనకు కొన్నికొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కొంచం సెన్సిటివ్ గా ఉన్నవారికి ఇవి అనుభవం లోనే ఉంటాయి. ఉదాహరణకు, ఈరోజు ఒక స్నేహితున్ని చూస్తామేమో అనిపిస్తుంది. అదేరోజు అతను అనుకోకుండా ఊడిపడతాడు. అనుకోకుండా పని పడి వచ్చాను, సరే ఊళ్లోకి వచ్చాను కదాని నిన్ను కలిసిపోదామని వచ్చాను అంటాడు. ఒక ఫోన్ కాల్ వస్తుందని అనిపించిన కొద్ది నిముషాల లోనే ఆ కాల్ రావడం ఎన్నో సార్లు జరుగుతుంది. అలాగే ఈరోజు ఏదో చెడువార్త వింటాం అనిపిస్తుంది. మధ్యాన్నానికి ఎవరో పోయారనో,లేదా ఇంకేదో అయిందనో వార్త వింటాము. లేదా కలలో ఒక వ్యక్తీ కనపడి మూగగా చూస్తూ మాయం అవుతాడు. తర్వాత కొన్నాళ్ళకు అతను చనిపోయాడని వార్త వింటాము. ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. మనుషుల మధ్య కంటికి కనిపించని బందాలుంటాయి. సరియైన రాపోర్ట్ ఉన్నప్పుడు అమెరికాలో ఉన్న వ్యక్తికి జ్వరం వస్తే మనకు ఇక్కడ తెలిసిపోతుంది. ఈ స్పందనకు కాలంతో దూరంతో పని ఉండదు. ఇది ఒక మాగ్నెటిక్ రేసోనేన్స్ లాగా పనిచేస్తుంది.

నిత్యజీవితంలో జరిగే ఇంకా కొన్ని ఉదాహరణలు చెప్తాను. చిన్నపిల్లల తల్లికి ఇవి బాగా అనుభవంలో ఉంటాయి. బిడ్డకు నలతగా ఉంటే తల్లికి వెంటనే తెలిసిపోతుంది. అలాగే తల్లి తమ మీదనుంచి దృష్టి తిప్పి వేరే విషయం మీద దృష్టి పెడితే బిడ్డ నిద్రపోతున్నా కూడా వెంటనే మేలుకొని ఏడవడం మొదలుపెడుతుంది. అబ్బబ్బ ఒక్క పని కూడా చేసుకోనివ్వడు. ఎటూ కదలనివ్వడు వీడికేలా తెలుస్తుందో అని విసుక్కునే తల్లులు లక్షల సంఖ్యలో ఉంటారు. ఇవన్నీ కూడా ఈ రేసోనేన్స్ వల్లనే జరుగుతాయి. ప్రేమికుల మధ్యన కూడా ఇలాంటి రేసోనేన్స్ ఉంటుంది. ఒకరికి ఏదైనా బాధ కలిగితే వెంటనే రెండో వారికి ఎందుకో తెలీని బాధ కలుగుతుంది. కానీ కారణం మాత్రం వారికి తెలియదు. ఇలాంటి రేసోనేన్స్ అనేది తల్లీ పిల్లలు కావచ్చు, ప్రాణ స్నేహితులు కావచ్చు, ప్రేయసీ ప్రియులు కావచ్చు, గురుశిష్యులు కావచ్చు వీరిలో ఎవరి మధ్యనైనా ఉండవచ్చు. దీనిలో ముఖ్యంగా ఉండవలసింది ఏకమనస్కత. అంటే ఒకే వేవ్ లెంగ్త్ లో వారిద్దరూ ఉండాలి. అలాంటప్పుడు కాలంతో దూరంతో సంబంధం లేకుండా ఇది ఏర్పడుతుంది. ఇది చాలామంది మామూలు మనుషులకు కూడా అనుభవంలో ఉండే విషయం. అయితే ఈ శక్తి వారి అదుపులో ఉండదు. కావలసినప్పుడల్లా దీనిని వారు ఫీల్ అవలేరు.

ఈ శక్తినే యోగం ద్వారా విపరీతంగా వృద్ధి చేసుకోవచ్చు. అప్పుడు అది వారి స్వాధీనం అవుతుంది. సంకల్ప శక్తితో మనస్సును ఫ్లడ్ లైట్ లా కేంద్రీకరించగలిగితే  ఆ లైట్ పడిన చోట ఏముందో స్పష్టంగా కనిపిస్తుంది. పతంజలి మహర్షి ఈ శక్తుల గురించి తన యోగసూత్రాలలోని "విభూతిపాదం"(Chapter on Powers) అనే అధ్యాయంలో చెప్పారు. ఏ ఏ విషయాల పైన సంయమం చేస్తే యోగిలో ఏఏ శక్తులు ఎలా వృద్ధి చెందుతాయో అందులో వివరించారు.


ఉదాహరణకు మహర్షి ఒకచోట ఈ సూత్రాన్ని ఇచ్చారు "సమాన జయాత్ ప్రజ్వలనం". శరీరంలో ఉన్న సమానవాయువు అనేదాన్ని అదుపులోనికి తెచ్చుకుంటే యోగి తన శరీరం నుంచి జ్వలించే కాంతిని వెదజల్లగలడు. దీనిని సాధించిన యోగులు చాలామంది నేటికీ ఉన్నారు. ఈ విషయాన్ని గురించి నేనొకసారి మాట్లాడుతున్నపుడు నా స్నేహితుడొకడు ఒప్పుకోలేదు. "ప్రకృతిలో సాధ్యం కాని విషయాలను ఏదో పుస్తకంలో రాసినంత మాత్రాన ఎలా నమ్మాలి?" అని వాదించాడు. అతనితో ఇలా చెప్పాను. "ప్రకృతిలో లేవని నీవు ఎలా అనుకుంటున్నావు? ఉన్నాయి. చూచే దృష్టి నీకు లేదు. నీకు తెలియనంత మాత్రాన ప్రకృతిలోనే ఇవి లేవు అని ఎలా నిర్ధారణకు వస్తున్నావు? మిణుగురు పురుగును చూచావుకదా. రాత్రిపూట అది తనలోనుంచి కాంతిని ఎలా వెదజల్లుతుంది? అలాంటి శక్తి ఈ టెక్నిక్ వల్ల మనిషికి కూడా వస్తుంది." అని చెప్పాను. అతను మళ్లీ మాట్లాడలేదు. 


అలాగే "కంటకూపే క్షుత్పిపాసా నివృత్తి:" అనేది ఇంకొక సూత్రం. తన గొంతులో ఉన్న విశుద్ధ చక్రంమీద సంయమం చెయ్యగలిగిన యోగి ఆకలి దప్పులచేత పీడింపబడడు అనేది దీని అర్ధం. ఇది కూడా చాలామంది యోగులకు అనుభవైక వేద్యమే. ఆహారం దొరకని హిమాలయ సానువుల్లో రోజుల తరబడి ధ్యానసమాధిలో ఉండే యోగులు ఈ టెక్నిక్ ద్వారానే ఆకలిదప్పులకు అతీతులుగా ఉండగలుగుతారు.
  
మనం చూస్తున్న లోకం వెనుకే, మనం చూడలేని లోకం ఒకటుంది. ఆ లోకం, మనం చూస్తున్న లోకంకంటే అనేక వేలరెట్లు పెద్దదీ, విభిన్నమైనదీ, అనేక రంగులతో కూడినదీ. మనిషి ఒక చిన్న బురదగుంతలో బతుకుతున్న ఛిరుకప్ప లాంటివాడు. ఈ గుంతనే అతను గొప్ప ప్రపంచం అనుకొని, అందులో సాధ్యమైనంత దోచుకొని దాచుకోవడానికి రకరకాల మోసాలు చేస్తూ నీచమైన బతుకు బతుకుతున్నాడు. అతీతలోకాలను ఒక్కసారి దర్శిస్తే  మన బ్రతుకు ఎంత అల్పమైనదో ఎంత నీచమైనదో అర్ధమౌతుంది. అప్పుడు మన జీవితం మీద మనకే అసహ్యం కలుగుతుంది. ఉన్నతజీవితం మీద అభిలాష తీవ్రమౌతుంది.

ఒక ఉపన్యాసంలో వివేకానందస్వామి ఇలా అంటారు. "ఏమీ చూడని వానికంటే ఒక దెయ్యాన్ని చూచినవాడైనా ఉత్తముడే. ఎందుకంటే మనం చూడని ఇంకొక లోకం ఉందన్న సత్యం అతనికి అలాగైనా అర్ధమౌతుంది." తద్వారా అంతరిక జీవితం మీద అతనికి ఆసక్తి మొదలౌతుంది.క్రమేనా అదే అతన్ని ఉన్నత స్థాయిలకు చేర్చే అవకాశం ఉంది.

మనం చూస్తున్న ఈలోకం వెనుక, ఎన్నో లోకాలున్న మాట వాస్తవం. వాటిలో మన స్థాయికి మించిన అనేకరకాల జీవులున్న మాట కూడా వాస్తవమే. సరైన ట్రెయినింగ్ తో ఆలోకాలను చూడవచ్చు . ఆ జీవులతో సంభాషించవచ్చు. మనం నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం.
read more " అతీతలోకాలు - అదృశ్యశక్తులు "

22, జూన్ 2012, శుక్రవారం

వృషభరాశిలో గురుకేతువుల సంయోగం -- ఫలితాలు

ప్రస్తుతం బృహస్పతి వృషభరాశిలో సంచరిస్తూ నీచకేతువుతో కలిసి ఉన్నాడు. ఈయన దాదాపు ఒక సంవత్సరం పాటు ఈ రాశిలో ఉండబోతున్నాడు. ఈ గ్రహయుతి ఫలితాలు ఎలా ఉంటున్నాయో కొంచం గమనిద్దాం. వృషభరాశి నవీన భారతదేశాన్ని సూచిస్తుంది. కనుక ఈ గ్రహ ఫలితాలు మన దేశంమీద ఎక్కువగా ఉంటున్నాయి. 

గురువు న్యాయవాదులకూ, న్యాయమూర్తులకూ సూచకుడు. ఈయన కేతుగ్రస్తుడవడం వల్ల న్యాయరంగానికి మలినం పట్టింది. ఈ మధ్యన న్యాయమూర్తులు కూడా అవినీతికేసుల్లో ఇరుక్కుని అరెష్టవడం దీని ప్రభావమే. న్యాయం కూడా ఒంటి కాలిమీద నడుస్తూ ఉండటం చూడవచ్చు.   

గురువు ఆధ్యాత్మిక గురువులకు సూచకుడు కూడా. కనుక నకిలీ గురువులు కొందరు వివాదాస్పద అంశాలలో ఇరుక్కుని జైలు పాలవడం, రాజకీయాలలో తలదూర్చి నాయకులతో విరోధాలు పెంచుకోవడం, విమర్శలు చెయ్యడం, వార్తలకేక్కడం జరుగుతోంది.

గురువు నాయకులకూ, ఉన్నత అధికారులకూ సూచకుడు. ఈ మధ్యన నాయకులందరూ అరెష్టు కాబడటం, ఇన్నాళ్ళూ ఇతరులకు ఆదేశాలు ఇచ్చిన అయ్యేఎస్ అధికారులు కటకటాల వెనక్కు వెళ్లడం కూడా ఈ గ్రహయుతి ప్రభావమే.

ఇంకా చూస్తె, గురువు వృద్ధనాయకులకు సూచకుడు. కనుక త్వరలో కొందరు వృద్ధ నాయకులు అకస్మాత్తుగా పరలోక ప్రయాణం కట్టే సూచనలున్నాయి.

గురువు ధర్మానికీ సూచకుడే. అందుకే ఈ మధ్యలో ధర్మం దారి తప్పినంతగా ఎన్నడూ జరుగలేదు. ప్రజలలో ధర్మం అనేది పూర్తిగా లోపించి స్వార్ధం కరాలనృత్యం చేస్తున్న మాట నిజం. ప్రస్తుతం ఎవరిలోనూ ధార్మిక చింతన లేదు అని చెప్పవచ్చు. ధర్మం పేరుతో మతం పేరుతో జరుగుతున్నది అంతా కూడా చాలావరకూ మోసమే.

అయితే దీనిలో ఇంకొక కోణం కూడా ఉన్నది. గురు కేతువుల యుతి వల్ల నిజమైన ఆధ్యాత్మిక పరులకు సహాయపడే స్పందనలు ఇప్పుడు అధికం అవుతాయి. వీటిని సక్రమంగా ఉపయోగించుకుంటే అటువంటి వారికి మంచి పురోగతి ఉంటుంది. ఈ పరిస్తితి ఒక ఏడాది పాటు ఉంటుంది కనుక ఆ మార్గంలో ప్రయత్నాలు చేస్తున్నవారు ఈ గ్రహ ప్రభావాన్ని సరిగ్గా వాడుకుంటే బాగుంటుంది.

వృషభ రాశి భూతత్వ రాశి కనుక ఈ గ్రహయుతి వల్ల భారతదేశంలో భూకంపాలు వస్తున్నాయి. శనీశ్వరుడు కూడా భూతత్వ రాశి అయిన కన్య లో ఉండటం గమనిస్తే ఇదెంత ఖచ్చితంగా జరుగుతున్నదో అర్ధం అవుతుంది. మొన్న అమావాశ్య ప్రభావంతో సత్తెనపల్లి కేంద్రంగా భూకంపం వచ్చిన విషయం గుర్తుంచుకోవాలి. దీని ఫలితంగా గుంటూరులో కూడా ఇళ్ళు ఇంట్లోని వస్తువులు రెండు మూడు సెకన్లు ఊగినట్లు అనిపించింది.


ప్రస్తుతం గురుకేతువులు ఒకరికొకరు ఒక డిగ్రీ దగ్గరలో ఉన్నారు. నిన్న గురువారం నాడు ముంబాయిలోని మహారాష్ట్ర సెక్రెటేరియట్ కు నిప్పంటుకుని ఘోరప్రమాదం జరిగింది.ఇద్దరు ముగ్గురు చనిపోయారని అంటున్నారు. మంత్రులు కొద్దిలో బయటపడ్డారు. కేతువు కారకత్వాలలో ఒకటైన షార్ట్ సర్క్యూట్ కారణం అని అంటున్నారు. అధికారకేంద్రం అయిన విధానసౌధంలో ఇది జరగటం గురువు కేతువుల సంయోగ ఫలితమే. ఆర్ధిక రాజధానిలో ఇది జరగడం శుక్రుని రాశి అయిన వృషభంలో  కేతువు ఉన్న ఫలితమే. ఇది అగ్ని ప్రమాదాలకు కారకుడైన కుజ హోరలో జరిగింది. కుజుడు ప్రస్తుతం సున్నా డిగ్రీలలో ఉండి తన శత్రువైన శనిని సమీపిస్తూ చాలా అసౌకర్యంగా ఉన్నాడు.

డిసెంబర్ 23 వరకూ కేతువు వృషభరాశిలోనే ఉంటాడు. అప్పటివరకూ  ఇలాంటి ఫలితాలు మనదేశంలో కనిపిస్తూనే ఉంటాయి. తమతమ జాతకాలకు సరిపోయే రేమేడీలు పాటించడం వల్ల ఈ దుష్ప్రభావాల నుండి బయట పడవచ్చు.
read more " వృషభరాశిలో గురుకేతువుల సంయోగం -- ఫలితాలు "

13, జూన్ 2012, బుధవారం

పంచవటి సాధనా సమ్మేళనం - 4

జూన్ 11,12 తేదీలలో పంచవటి నాలుగో సాధనాసమ్మేళనం హైదరాబాద్ లో ఒక సభ్యురాలి ఇంటిలో జరిగింది. ఈ రెండురోజులూ పంచవటి సభ్యులు దాదాపు 25 మంది హాజరై ఉదయం నుంచి సాయంత్రంవరకూ ఎన్నో ఆధ్యాత్మికవిషయాల మీద చర్చించి వారివారి సందేహాలు తీర్చుకుని జ్ఞానలబ్దిని పొందారు. ప్రాణాయామ ధ్యానాది సాధనలు కొన్ని ప్రాక్టికల్ గా చేసి ప్రత్యక్షంగా సాధనామార్గం ఎలా ఉంటుందో తెలుసుకున్నారు. 

వేదోపనిషత్తుల సారాన్ని, మహనీయుల జీవిత ఘట్టాలనూ, వివిధ సాధనా మార్గాలనూ, వాటిలోని లోతుపాతులనూ, నిత్యజీవితంలో వాటిని ఏ విధంగా అన్వయించుకోవాలి,ఎలా ఆచరించాలి అన్న విషయాలనూ, సాధనా మార్గంలో ఎలా ఎదగాలి, నిజమైన ఆధ్యాత్మికత ఎలా ఉంటుంది అన్న విషయాలనూ కూలంకషంగా చర్చించి అర్ధం చేసుకోవడానికి ఈ సమ్మేళనం ఒక వేదికగా ఉపయోగపడింది. సమావేశంలో పాల్గొన్న వారికి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకునే వీలు కల్పించబడి ఆనందాన్ని కలిగించింది.

ఈ సమావేశానికి హాజరైనవారందరూ నిష్కల్మషమైన విశాలమైన భావాలు కలిగినవారే.ఆధ్యాత్మికంగా కొంత సాధన చేసినవారే. ఇంకా చేస్తూ ఉన్నవారే కావడంతో వారికి కలిగిన కలుగుతున్న సందేహాలు చర్చించి సమాధానాలు పొందటానికి అనువైన వాతావరణం ఈ సమ్మేళనంలో కల్పించబడింది. స్వచ్చమైన,నిజమైన ఆధ్యాత్మికతను కొంతైనా అర్ధం చేసుకున్నామన్న ఆనందాన్ని ఈ సమ్మేళనం వారిలో నింపింది. జీవితసాఫల్యతా సాధనలో ముందడుగు వేస్తామన్న నమ్మకాన్ని పెంచింది. జీవన పోరాటాన్ని దైవబలంతో ధైర్యంగా నిజాయితీగా ఎదుర్కోగలమన్న విశ్వాసాన్ని కలిగించింది.

నా ఆహ్వానాన్ని మన్నించి ఈ సమ్మేళనంలో పాల్గొన్న పంచవటి సభ్యులకు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను.
read more " పంచవటి సాధనా సమ్మేళనం - 4 "

9, జూన్ 2012, శనివారం

మనిషి జీవితంలో మౌలిక ప్రశ్నలు

ప్రతి మనిషీ జీవితంలో తనను తాను ఏదో ఒకరోజు ప్రశ్నించుకోవలసిన మౌలికమైన ప్రశ్నలు కొన్నున్నాయి. కాని ప్రతి వాడూ వీటిని వాయిదా వేస్తూ పోతుంటాడు.ఈ వాయిదా వెయ్యడానికి కారణాలు ఎన్నున్నా అన్నింటి వెనకా ఒకటే మూలకారణం కనిపిస్తుంది. దానిని తృష్ణ అనవచ్చు, లేదా ఇంద్రియాకర్షణ అనవచ్చు లేదా మాయ అనవచ్చు. దీనికి లోబడే లోకంలో ప్రతి మనిషీ జీవిస్తున్నాడు.

ప్రతి మనిషీ తన జీవితంలో, తానెంత సంపాదిస్తున్నాడు, ఎంత ఆస్తి ఇప్పటి దాకా  కూడబెట్టాడు, ముందు ఇంకా ఎంత కూడబెట్టాలి, దానితో ఎన్ని సుఖాలు అనుభవించాలి అన్న ఆలోచనలే చేస్తుంటాడు. కాని అతను ఆలోచించని విషయం ఒకటుంది. ఈ తాపత్రయంలో పడి విలువైన జీవితాన్ని అతను కోల్పోతున్నాడు. ఆయుస్సు అనుక్షణం తగ్గుతూ వస్తున్నది. మరణం అనుక్షణం దగ్గర అవుతున్నది. ఈ జీవన పోరాటంలో శాంతి అనేది కనుచూపు మేరలో ఎక్కడా కనిపించదు. మనిషి తాపత్రయానికి అంతం కూడా ఎప్పటికీ ఉండదు. కానీ, ఎంతకాలం ఈ అర్ధం లేని పరుగు? అన్న విషయం మాత్రం ఎవరూ ఆలోచించరు. అదే మాయ.

తాను సంపాదించిన దానికంటే తాను ఖచ్చితంగా  ముఖ్యమైనవాడు. సంపాదన తనకోసమే గాని తాను సంపాదన కోసం పుట్టలేదు. సంపాదన కోసం ఎవడూ సంపాదించడం లేదు. సంపాదించిన దానితో తను తన కుటుంబమూ సుఖంగా ఉండాలనే ప్రతివారూ ఆశిస్తారు. అంతేగాని అవసరం ఉన్నా లేకున్నా లక్షల కోట్లూ, కోట్ల కోట్లూ పోగేయ్యాలని ఎవరైనా ఆశించి ఆ కోణంలో ప్రయత్నం చేస్తుంటే వారి వ్యక్తిత్వంలో మౌలికంగా ఏదో దారుణమైన లోపం ఉన్నదని భావించాలి. సుఖం కోరుకోవడం తప్పు కాదు. కాని దానికి అంతెక్కడ అన్న విషయం గ్రహించలేకపోవడమే తప్పు. ఇక చాలు అని ఒక గిరి గీసుకోలేక పోవడమే తప్పు. దీని తరువాత ఏమిటి? అన్న విషయం ఆలోచించలేకపోవడమే తప్పు.

ప్రతివాడూ సుఖాభిలాషతోనే జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నాడు.మనిషి మాత్రమె కాదు. లోకంలో ప్రతిప్రాణీ సుఖాన్ని కోరుతూ దు:ఖాన్ని వద్దనుకుంటుంది. కాని ఇక్కడే ఒక మెలికను ప్రకృతి ఉంచింది. ఏ సుఖమూ శాశ్వతంగా ఎల్లకాలమూ నిలిచి ఉండదు. తిన్న కాసేపు ఆకలి తీరినట్లు అనిపిస్తుంది. కాసేపటికి మళ్ళీ తలెత్తుతుంది. అలాగే, ఏ ఆనందమూ స్తిరంగా  ఉండదు. నిజానికి ఆనందాన్ని అనుభవిస్తున్న క్షణంలోనే అది ఆవిరైపోతూ ఉంటుంది. ఇది ప్రకృతిలోని అత్యంత కీలకమైన అమరిక. జారిపోతున్న సుఖాన్ని నిలిపి ఉంచడం కోసం మనిషి నిరంతరం పరుగులు తీస్తూ ఉంటాడు. ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే బాహ్యప్రపంచంలో మనకు దొరికే ఏ సుఖమూ శాశ్వతం కాదు. అది క్షణికం మాత్రమె.అందుకే క్షణికాన్ని శాశ్వతం చేసుకుందామన్న భ్రమలోనే మనిషి జీవితం వెళ్ళిపోతున్నది. మళ్ళీ మళ్ళీ అదే ఆనందాన్ని పొందుదాం అన్న భ్రమలోనే మనిషి జీవితం ఆవిరై పోతున్నది. అతని ఆయుస్సు తరిగి పోతున్నది. కాని అదేన్నటికీ జరిగే పని కాదు. బాహ్య విషయాలు ఇచ్చే ఆనందం ఎన్నటికీ శాశ్వతంగా ఉండదు. ఈ విషయం మనిషికి జీవిత చరమాంకంలోనే అర్ధమౌతుంది. చాలామందికి అప్పుడు కూడా విషయం అర్ధంకాదు. అప్పటికే మరణం వచ్చి తలుపు తడుతూ ఉంటుంది. ఇక అప్పుడు చెయ్యగలిగింది ఏమీ ఉండదు. కానీ, చాలా కొద్ది మందికి మాత్రం ఈ మెలిక చిన్నతనంలోనే అర్ధమౌతుంది.

ప్రపంచంలో ఏ వస్తువైనా తనకంటే ఎక్కువ కాదు. వస్తువులు తనకోసం ఉన్నాయి గాని, తాను వాటికోసం లేడు. ఈ సత్యాన్ని మరచి మనిషి వస్తువులకోసం, వాటిని కొనగలిగే ధనంకోసం, విలువైన తన జీవితాన్ని వృధాగా వెచ్చిస్తున్నాడు. కాని అన్నింటికంటే విలువైన తనకోసం మనిషి ఏమీ చెయ్యడం లేదు. తనను తాను తెలుసుకుందామని ప్రయత్నం చెయ్యడం లేదు. 

మనలో ప్రతివారికీ భౌతికమైన తన అడ్రస్ తెలుసు. కాని తానెవరో తెలియదు. ప్రతివారికీ డ్రస్ ఎలా వేసుకోవాలో తెలుసు. కాని ఇప్పటికే మనల్ని ఆవరించి ఎన్ని డ్రస్సులు ఉన్నాయో వాటిని ఎలా వదిలించుకోవాలో ఎవరికీ తెలియదు.  ప్రస్తుతం తాను ఎక్కడ ఉన్నాడో ప్రతివానికీ తెలుసు. కాని ఎక్కడినుంచి ఈ లోకంలోకి వచ్చాడో తెలియదు. ఎలా వచ్చాడో తెలియదు. ఎందుకు వచ్చాడో తెలియదు. ఎన్నాళ్ళు ఉండాలో తెలియదు.ఎప్పుడు పోతాడో తెలియదు. ఎక్కడికి పోతాడో తెలియదు. ఆ తర్వాత ఏమౌతుందో తెలియదు. మళ్ళీ పుట్టుక ఉందొ లేదో తెలియదు. ఈ చక్రభ్రమణం ఎన్నాళ్ళో అసలే తెలియదు. ఇవీ అసలైన మౌలికప్రశ్నలు. మనిషి తనను తాను ప్రశ్నించుకోవలసిన ప్రశ్నలూ, జవాబులు వెదకవలసిన ప్రశ్నలూ ఇవే. కానీ జీవితంలో ఇవి ముఖ్యం కాదులే అనుకుంటూ  ప్రతిసారీ వాయిదా వేస్తూ పోయే ప్రశ్నలు  కూడా ఇవే. 

ఈ ప్రశ్నలు మనిషి వేసుకున్నప్పుడు, అతనిలో ఒక జిజ్ఞాస మొదలౌతుంది. నిరంతరమైన ఆ జిజ్ఞాస క్రమేణా ఒక తపనగా మారుతుంది. ఆ తపన అతనికి ఒక దారిని చూపిస్తుంది. అదే అతన్ని ఒక వివేకానందునిగా మారుస్తుంది. ఒక రమణమహర్షిగా మారుస్తుంది. అప్పుడే అతనికి జీవితంలో ఏది ముఖ్యమో ఏది కాదో తెలుస్తుంది. ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో తెలుస్తుంది. జీవితంలో దేనివిలువ ఏమిటో అప్పుడే తెలుస్తుంది. ఇప్పటి వరకూ నిరర్ధకంగా గడుపుతున్న జీవితాన్ని ఎలా సార్ధకం చేసుకోవాలో తెలుస్తుంది. ఆ రోజునుంచే అతను నిజంగా జీవించడం మొదలు పెడతాడు. ఎప్పటికీ జారిపోని, శాశ్వతమైన సుఖం కోసం,ఆనందం కోసం ప్రయత్నం చేస్తాడు. చివరికి దానిని అందుకుంటాడు. ఆ క్రమంలో వ్యామోహాన్నీ తృష్ణనూ మాయనూ అధిగమిస్తాడు.

ప్రతి మనిషీ తన జీవితంలో ఏదోనాడు వేసుకోవలసిన మౌలికమైన ప్రశ్నలు ఇవే. వీటికి సమాధానాలను పుస్తకాలనుంచి కాకుండా, అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడే మనిషి పరుగు ఆగుతుంది.అప్పుడే అతని జన్మజన్మల దాహం తీరుతుంది. అప్పుడే అతని అన్వేషణ అంతమౌతుంది. అప్పుడు మాత్రమె అతనికి అత్యన్తికమైన శాంతి దొరుకుతుంది. కాని ఆ పనిని ఎందరు చెయ్యగలరు? కోటికి ఒక్కరైనా ఉంటారా? మనిషిని నిరంతరం వెంటాడే కర్మఫలం ఆ పనిని సజావుగా చేయ్యనిస్తుందా? ఆ అనుభవాన్ని పొందటం  అంత సులభం అయితే సందుకొక రమణమహర్షీ, గొందికొక వివేకానందుడూ, ఊరికొక అరవిందుడూ ఉండకపోయారా?

కానీ ఒక్క విషయం చెప్తాను. ఎంత కష్టమైనా సరే ఏదోనాడు ప్రతివారూ ఈ ప్రశ్నలకు జవాబులు వెదుకక తప్పదు. కొందరు ముందూ కొందరు వెనుకా అంతే తేడా. ఎందుకంటే పరిణామక్రమం ప్రకృతిలోని అంతస్సూత్రం. ప్రతివారూ ఏదోనాటికి ఎదిగి పరమ గమ్యాన్ని చెరక తప్పదు. కనుక ఈ ప్రశ్నలు ఎవరికీ వారు వేసుకుని, వాటికి జవాబులు తమ స్వానుభవంనుంచి గ్రహించే ప్రయత్నం ఎంత త్వరగాచేస్తే అంతమంచిది. ఎక్కువ సమయం వృధా అవకుండా ప్రకృతి నిర్దేశించిన గమ్యాన్ని చేరుకోవడం అప్పుడు సులభం అవుతుంది. అప్పుడే మనిషి జీవితం ధన్యం అవుతుంది. లేకుంటే జన్మ తరువాత ఇంకొక జన్మ ఇలా ప్రతిజన్మా వృధా అవుతూనే ఉంటుంది. మనిషి జీవితం నిరర్ధకంగా ఈషణాత్రయంలో గడుస్తూనే ఉంటుంది.


మౌలికమైన ఈ ప్రశ్నలకు ఏదో ఒకనాడు ప్రతి మనిషీ సమాధానాలు వెదకక తప్పదు.
read more " మనిషి జీవితంలో మౌలిక ప్రశ్నలు "