“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

31, జనవరి 2013, గురువారం

ఏకాంతవాసం

కొత్త సంవత్సరంలో నేను తీసుకున్న నిర్ణయాల అమలులో భాగంగా జనవరిలో సమాజానికి దూరంగా 'ఏకాంతవాసం' జయప్రదంగా జరిగింది.

ఆ రెండురోజులూ ఎవరితోనూ సంబంధం లేకుండా నాలోకంలో నేనున్నాను. అతితక్కువ ఆహారం,పూర్తి మౌనం,రహస్యయోగసాధన,మార్షల్ ఆర్ట్స్ అభ్యాసం,ప్రకృతిలో మమేకమై విహరించడం,బాహ్యాంతరిక ప్రకృతి రహస్యాలను అర్ధం చేసుకుంటూ ఏకాంతవాసం గడిచింది.

ముఖ్యంగా చీకటి రాత్రులలో సమాజానికి దూరంగా నిర్మానుష్య ప్రదేశాలలో ఒంటరిగా ఉండటం చాలా వింత అనుభూతినిస్తుంది.అలా ఉండటంవల్ల ఎన్నో భయాలు వదిలిపెట్టి వెళ్లిపోతాయి. మానసికంగా మనం ఆధారపడే కృత్రిమ ఆలంబనలు కూలిపోతాయి.అనవసరంగా కల్పించుకున్న ఎన్నో బంధాలూ అనుబంధాలూ తెగిపోయి మనసు ఎంతో తేలికపడుతుంది.ఆత్మాశ్రయత్వం అలవాటౌతుంది.

వ్రాయడానికి వీలులేని అంతరిక అనుభవాలను ఏకాంతవాసం ఇచ్చింది.ఇకపై ప్రతినెలా కనీసం మూడురోజులు ఈ సాధన కొనసాగుతుంది.
read more " ఏకాంతవాసం "

29, జనవరి 2013, మంగళవారం

'విశ్వరూపం' - హ్యాట్స్ ఆఫ్ కమలహాసన్

నిన్న 'విశ్వరూపం' సినిమా చూచాను.అంతా చూచిన తర్వాత ఇందులో నాకర్ధం కాని ఒక్కటే ప్రశ్న మిగిలింది? ఈ సినిమాలో, ముస్లిములను కమలహాసన్ ఎక్కడ కించపరిచాడో నాకేమీ అర్ధం కాలేదు. ఈ సినిమా మీద ఇంత గొడవ ఎందుకో కూడా నాకస్సలు అర్ధం కాలేదు.

ఒక భారతీయ నటుడు దర్శకత్వం వహించి చక్కని వాస్తవికమైన కథతో హాలీవుడ్ స్థాయిలో ఒక సినిమా తీస్తే దానిని మెచ్చుకోవలసింది పోయి, గొడవచెయ్యడం,కోర్టులకెక్కడం ఒక వింత అయితే,మలేషియా వంటి దేశాలలో కూడా ఈ సినిమా నిషేధించబడింది అంటే అది ఇంకా వింత. 'యదార్ధవాది లోకవిరోధి' అన్న సామెత మళ్ళీమళ్ళీ నిజం అని రుజువౌతూనే ఉంటుంది గామోసు.

ఆల్ ఖైదా,లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలు ఎలా పని చేస్తాయో చూపిస్తూ విధ్వంసం సృష్టిస్తున్న వారి కుట్రలు భగ్నం చెయ్యడానికి ఒక దేశభక్తుడైన భారతీయ ముస్లిం ఏజంట్ ఎలా ప్రాణాలకు తెగించి పనిచేసాడో ఇందులో కమల్ చూపించాడు.ఇందులో అబద్దం గానీ,ముస్లిములను కించపరచడం గానీ ఎక్కడుంది? వాస్తవానికి విరుద్ధంగా ఈ సినిమాలో ఎక్కడా ఏమీ లేదు. 

కధ బాగుంది.కధనం బాగుంది.యాక్షన్ సీన్స్ బాగున్నాయి.ఎడిటింగ్ బాగుంది.నటీనటుల నటన బాగుంది.ఫైట్స్ బాగున్నాయి.సామాన్యంగా నాకు మన భారతీయ సినిమాల ఫైట్ సీన్స్ అస్సలు నచ్చవు.ఎందుకంటే సోకాల్డ్ ఫైట్ మాస్టర్లు ఏదో ఒక ఇంగ్లీష్ సినిమాలో ఫైట్స్ ను కాపీకొట్టి తెలుగులో అతికిస్తారు.జెట్లీ,టోనీజా వంటి నిజమైన మార్షల్ ఆర్ట్స్ మాస్టర్లు చేసిన ఫైట్స్ ను ఆ విద్యల్లో ఏబీసీడీలు రాని మన హీరోలు చెయ్యబోవటం చూసి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటాను.మన తెలుగు సినిమాల ఫైట్ సీన్స్ కామెడీ సీన్స్ గా బాగా పండుతాయి. 

కాని ఈసినిమాలో ఉన్న ఒక్క ఫైట్ సీన్ చాలాబాగా పండించాడు కమల్.పనికిరాని 'షో ఫైటింగ్' కాకుండా కమెండోలు వాడే నిజమైన డెడ్లీ టెక్నిక్స్ అందులో చూపించి చక్కని ఫైట్ సీన్ ను రక్తి కట్టించాడు.ప్రాక్టికల్ ఫైట్ అలాగే ఉంటుంది.అందులో కరాటే,థాయ్ బాక్సింగ్ & ఐకిడో టెక్నిక్స్ కలిసి ఉన్నాయి.చాలా బాగుంది.

ఇకపోతే కొన్ని డైలాగ్స్ లో పండించిన సునిశిత హాస్యం వెనుక ఎంతో ఆలోచనను రేకెత్తించే 'పంచ్' ఉంది. ఆఫ్గన్ గుహలలో తీసిన ఒక సన్నివేశంలో కమల్ ను విలన్ అడుగుతాడు.'తండ్రి చిన్నతనంలోనే పోతే పెరిగిన పిల్లలు ఎలా ఉంటారో నాకు తెలుసు' అంటూ 'జస్ట్ జోకింగ్' అంటాడు.దానికి కమల్ ప్రతిగా 'తమ తండ్రెవరో తెలియని పిల్లలు ఎలా ఉంటారో నాకూ తెలుసు' అంటూ 'జస్ట్ జోకింగ్' అని జవాబిస్తాడు.దానికి విలన్ తన అసిస్టెంట్ వైపు తిరిగి 'నువ్వు చెప్పావా?' అంటాడు.

అలాగే హీరోయిన్ ను బ్లాక్ అమెరికన్ లేడీ ఆఫీసర్ విచారణ చేస్తూ 'మీ దేవుడికి నాలుగు చేతులుంటాయా? విచిత్రం. అలా అయితే అతన్ని ఎలా శిలువ వేస్తారు? కష్టం కదా?' అంటుంది.దానికి హీరోయిన్ జవాబిస్తూ 'అందుకే ఆయన్ని మేము శిలువ వెయ్యము.సముద్రంలో ముంచేస్తాము' అంటుంది.ఇలాంటి సున్నిత హాస్యాన్ని పండించే డైలాగ్స్ ఇలాంటి వివాదాస్పద అంశాల మీద వ్రాయాలంటే చాలా సెన్సాఫ్ హ్యూమరే కాదు చాలా ధైర్యం కూడా కావాలి.

అనవసరంగా జరుగుతున్న 'జిహాద్' లో పడి ముస్లిం కుటుంబాల ఆడవాళ్ళూ పిల్లల జీవితాలు ఎలా బుగ్గిపాలు అవుతున్నాయో చాలా చక్కగా దయనీయంగా సున్నితంగా చూపించాడు.ఆస్మా తో బాధపడుతున్న తన భార్యకు వైద్యం అందించడానికి వచ్చిన అమెరికన్ లేడీ డాక్టర్ బురఖా ధరించలేదు కనుక ఆమెను వైద్యం చెయ్యకుండా వెళ్ళిపొమ్మని విలన్ ఆదేశించడమూ,లండన్ వెళ్లి ఇంజనీరింగూ మెడిసినూ చదవాలనుకున్న విలన్ పిల్లలు అర్ధాంతరంగా బాంబింగ్ లో చనిపోవడమూ,అక్కడ పిల్లల్లో చాలామందికి ఫైరింగ్ లో కాళ్ళు పోయి కొయ్యకాళ్ళు ఉండటమూ చూపించి ఈ యుద్ధాలు అనవసరం కదా? దీనివల్ల అసలు మనం ఏం సాధిస్తున్నాం? ఎంతమంది జీవితాలను అనవసరంగా నాశనం చేస్తున్నాం? అన్న ఆలోచన ప్రేక్షకులలో రేకెత్తిస్తాడు.

ఒక పిల్లవాణ్ణి తీవ్రవాదులు ఆత్మాహుతిపరుడిగా తయారు చేస్తుంటారు.ఆ అబ్బాయి ఉయ్యాల ఎక్కి కూచుని కమల్ ను ఊపమని అడిగి ఊగుతూ ఉండే సీన్లో బాల్యం వదలని చిన్నపిల్లలను కూడా తీవ్రవాదం నూరిపోసి ఆత్మాహుతికి ఎలా సిద్ధం చేస్తున్నారో సున్నితంగా చూపి కంటతడి పెట్టిస్తాడు.ఇలాంటి సీన్లలో కమల్ దర్శకత్వ ప్రతిభ కొట్టొచ్చినట్లు కనపడింది.  

సినిమాను 'సీన్ బై సీన్' హాలీవుడ్ తరహాలో ఫ్లాష్ బ్యాక్ గా చూపడం సామాన్య సగటు ప్రేక్షకుడికి కొంచం గందరగోళాన్ని సృష్టిస్తుంది.ఈ తరహా స్క్రీన్ ప్లే వల్ల ఈ సినిమా సామాన్యుడికి దూరమై 'క్లాస్' ఇమేజిని సంతరించుకుంది.ఎందుకంటే సినిమా చూచాక మరొక్కసారి 'సీన్ బై సీన్' వెనక్కు వెళ్లి ఆలోచిస్తే గాని ప్రేక్షకుడికి కధలో మిస్సింగ్ లింక్స్ అర్ధమై చావవు.కధ అప్పుడు గాని పూర్తిగా అర్ధమైనట్లు అనిపించదు.అయితే ఒక మంచి హాలీవుడ్ స్థాయి యాక్షన్ సినిమా తియ్యాలంటే ఈ టెక్నిక్ తప్పనిసరి అనిపిస్తుంది.

కమల్ లో వయసు మీరుతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దానికి తోడూ అతని గొంతు బొంగురుగా ముద్దగా పలికింది.సొంత వాయిస్ బదులుగా ఏ 'మనో' గొంతో తీసుకుంటే ఇంకా బాగుండి ఉండేది. హీరోయినుక్కూడా డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్ట్ గొంతులో ఇంకొంచం లేతదనం ఉంటె బాగుండేది.

అనవసరపు పాటలూ పిచ్చి డాన్సులూ ఎక్కడా లేవు.ఇదొక పెద్ద రిలీఫ్.కథక్ నృత్యాభినయాన్ని కమల్ చక్కగా పండించాడు.అయితే ఆ పాటకు జనరంజకమైన ఇంకొంచం మంచి రాగం కట్టి ఉంటె ఇంకా బాగుండేది.

సినిమా బాగుందని ముక్తకంఠంతో చెప్పొచ్చు.ఇంతమంచి సినిమాను తీసిన కమల్ ను అభినందించాలి.త్వరలో మళ్ళీ ఇంకోసారి ఈ సినిమాను చూడ బోతున్నాను.ఈ సినిమా మీద జరుగుతున్న రగడకు విచారిస్తూ మన సంఘంలో ఉన్న కుహనా ప్రజాస్వామ్య పరిస్తితికి బాధపడుతున్నాను. ప్రతిదాన్నీ మసిపూసి మారేడుకాయ చెయ్యకుండా ఉన్న విషయాన్ని ఉన్నట్లు చూడటం మనం ఎప్పుడు నేర్చుకుంటామో కదా?
read more " 'విశ్వరూపం' - హ్యాట్స్ ఆఫ్ కమలహాసన్ "

వీదిబజారులో వింత మోళీలు

ఎవరో తెలియని లోకుల కోసం
ఏదీ పట్టని లోకం కోసం 
నీవేడుస్తావెందుకు నేస్తం
నీ ఏడుపు వినేవాడెవ్వడు
నిన్నోదార్చే వాడెవ్వడు
భ్రమలు వీడి సత్యం వైపు తేరిచూడు
పొరలు కరిగిపోయేలా పట్టిపట్టి చూడు

ఈ నాటకరంగంలో 
రాజు రాజూ కాడు 
పేద పేదా కాడు
వాళ్ళ మాటలు వాస్తవాలూ కావు
వాళ్ళ వేషాలు సత్యమైనవీ కావు
పాత్రలు నిజమని భ్రమించకు నేస్తం
నాటకం అబద్ధం నాటకరంగం వాస్తవం
ఎప్పటికీ ఇదే సత్యం 
తెలుసుకో ఈ నిజం

నేటి వ్యధార్త హృదయాలు 
రేపు చేస్తాయి నాట్యాలు
నేటి విలాసపు లోగిలిలో 
రేపు వింటావు రోదనలు
పరుగెత్తేవాడు ఆగక తప్పదు
అడుగెయ్యనివాడు కదలకా తప్పదు
నిత్యచలనం ఈ లోకపు గమ్యం

అర్దించే అనాధ హస్తం వెనుక 
కనలేవా నిన్నటి గర్వాన్ని
విర్రవీగే విలాసపు మంటల వెనుక
చూచావా మొన్నటి బాధల చీకటిని   
 నిన్న పొమ్మని విదిలించిన చెయ్యి
నేడు ఆశగా అర్ధిస్తుంది 
మొన్న నిర్దయగా కసిరిన నోరు 
నేడు దీనంగా ప్రార్ధిస్తుంది
నాడు ఏనుగుపై ఊరేగిన దేహం
నేడు దుమ్ములో పడి దొర్లుతుంది 

నేటి వేటగాడు రేపు పక్షౌతాడు
నేడు నవ్వేవాడు రేపేడుస్తాడు
నీకెందుకు బాధ పిచ్చి నేస్తం
లోకం తీరుకు కర్తవు నీవా?
అందరి బాధల పరిహర్తవు నీవా?
చక్రభ్రమణమేగా ఈ జీవితసత్యం 

వీదిబజారులో వింత మోళీలు చూస్తూ
రంగుటద్దాలలో సొంత బింబాలు చూస్తూ
ఆపావెందుకు నీ పయనం
మరచావెందుకు నీ గమ్యం?
నిశికన్య నిను కమ్ముకున్నప్పుడు
ఎడారిరాత్రిలో నీవొంటరిగా మిగిలినప్పుడు
ఈ వింతలన్నీ కావా మాయం?

చిమ్మ చీకటిలో 
మెరిసే చుక్కల జల్లెడ కింద 
అంతులేని ఎడారిలో 
ఒంటరి యాత్రికుడివి నీవు
నీకెందుకీ వృధా ప్రయాస
ఎవరికోసం నీకీ ఎగశ్వాస
నీవారెవరూ లేరిక్కడ 
నీదంటూ ఏదీ కాదిక్కడ

నీదేశాన్ని వీడి 
ఎన్ని యుగాలైందో చూడు
నీవారిని మరచి 
ఎన్ని తరాలైందో చూడు
పరదేశంలో తెలివిలేక తిరిగే 
పాంధుడివి నీవు
మానవత్వం లేని మాయలోకంలో 
దారితప్పిన బేలవు నీవు
చిక్కుకోకు ఈ లోకపు మాయలలో
భ్రమించకు ఈ చీకటి లోయలలో

తలెత్తి చూడు పిలుస్తోంది నీలోకం
వెలుగు హస్తాలు చాచింది నీకోసం
ఎన్నాళ్ళున్నా నీ ఇల్లిది కాదుగా
యజమాని కుటుంబం ఏనాడూ నీదవదుగా 
తెంచుకో నీవే కట్టుకున్న శృంఖలాలు
త్రుంచుకో నువ్విష్టపడే బంధనాలు
విప్పుకో మరచిన నీ వెలుగు రెక్కలు
ఆపలేవిక నిన్నీ లోకపు దిక్కులు 

సాగిపో...
నిన్నెపుడూ పిలిచే నీలాకాశం వైపు
మృతి లేని వెలుగు సముద్రం వైపు 
తిమిరమే లేని ఉజ్వల లోకం వైపు
బాధలే లేని ఆనంద శూన్యం వైపు
read more " వీదిబజారులో వింత మోళీలు "

25, జనవరి 2013, శుక్రవారం

శని రాహు యోగం-4 (కమలహాసన్ విశ్వరూపం)

నటుడు కమలహాసన్ జాతకాన్ని ఇంకోసారి ఎప్పుడైనా తీరికగా చర్చిస్తాను. ప్రస్తుతం మాత్రం ఇతనిమీద శపితయోగ ప్రభావం మాత్రమె మాట్లాడు కుందాం.

ఇతని జాతకంలో చాలా మంచి యోగాలు కొన్ని ఉన్నాయి.కుజుడూ గురువూ శనీ ఇతని జాతకంలో ఉచ్ఛ స్తితిలో ఉన్న గ్రహాలు.అందుకే అన్ని అవార్డులు సొంతం చేసుకోగలిగాడు. విలక్షణమైన ప్రయోగాలు చేసే నటుడు అనిపించుకున్నాడు.ప్రస్తుతం ఆ సంగతి అలా ఉంచుదాం.

ఇతని జాతకంలో శని సూర్యుడు వక్రబుదుడూ తులారాశిలో ఉన్నారు. ఇతని లగ్నం కూడా తులే కావచ్చని నా ఊహ.కాకపోయినా పరవాలేదు. సినిమా వాళ్ళకు ఈ లగ్నమే ముఖ్యమైనది.అలా కాకపోయినా ఇతని ఆత్మకారకుడైన సూర్యుడు ఇక్కడే ఉన్నాడు.పైగా నీచలో ఉన్నాడు.కనుక ఇతని జాతకంలో తులారాశి ప్రాముఖ్యత చాలా ఉన్నది.

ఇప్పుడు ఇదే రాశిలో గోచార రాహుశనులు సంచరిస్తున్నారు.కనుక శపిత యోగం ఇతని మీద ఎలా పనిచేస్తున్నదో చూద్దాం. 100 కోట్లు ఖర్చు పెట్టి తీసిన 'విశ్వరూపం' సినిమా ఇదే శనిరాహు యోగ సమయంలో రిలీజ్ అవడం ఒక వింత అయితే, సినిమా టైటిల్స్ ఉర్దూ/అరబిక్ పోకడలో ఉండేటట్లు గీయడం,అందులో ముస్లిం ఉగ్రవాదం టాపిక్ ఉండటం,అది రిలీజ్ కాకుండా ముస్లిం వర్గాలు అడ్డుకోవడం ఇదంతా రాహువు ప్రభావం అనే చెప్పాలి.

ఇకపోతే ఇతని జాతకంలో నీచలో ఉన్న సూర్యుని పైకి గోచార శనిరాహువుల సంచారం వల్ల ప్రభుత్వంతో గోడవలోచ్చాయి.C.B.F.C ఒప్పుకుని రిలీజ్ చెయ్యడానికి అనుమతి ఇచ్చిన తర్వాతకూడా విడుదల కాకుండా ప్రభుత్వం అడ్డుపడటం అనేది ఒక వింతల్లో వింత.బహుశా ఇలాంటి వింతలు మన వింతదేశంలో మాత్రమె సాధ్యం అనుకుంటా. సూర్యుడు ప్రభుత్వానికి కారకుడన్న సంగతి గుర్తుంటే, ఇతని పైకి శనిరాహువులు వచ్చినపుడు ప్రభుత్వంతో గొడవలు రావడమూ,దాని వెనుక ముస్లిముల ఆందోళన ఉండటమూ చాలా సరిగ్గా సరిపోతున్నాయి.

కుజుని కారకత్వం వల్ల ఆంధ్రా తమిలనాడులలోనే ఈ సినిమా వాయిదా పడింది.మళ్ళీ కేరళకు కుజుని కారకత్వం వర్తించలేదు.కారణం?కేరళ దక్షిణాన ఉన్నప్పటికీ ఒక ముక్కగా కోసుకుపోవడం వల్ల అక్కడ పశ్చిమ దిక్కుకూడా కలుస్తుంది.కనుక ఈ సినిమా అక్కడ విడుదల అవడానికి అడ్డు ఏమీ ఏర్పడలేదు.ఒక్క ఆంధ్రా తమిళనాడులలోనే సమస్య వచ్చింది.

సెన్సార్ బోర్డు క్లియర్ చేసిన సినిమాను విడుదల కాకుండా కొన్ని వర్గాలు అడ్డుకోవడం చూస్తుంటే సినిమా తీసిన నిర్మాతలు ఇకమీద ఆల్ ఖైదా మొదలైన ఉగ్రవాద వర్గాలకు సినిమా ప్రివ్యూ చూపించి వారు ఒప్పుకుంటే అప్పుడు మనదేశంలో రిలీజ్ చేసుకోవడం లేకుంటే రీలు మొత్తం అరేబియా సముద్రంలో పడెయ్యడం మంచిదిగా తోస్తున్నది.

సెన్సార్ బోర్డ్ ఒప్పుకుని సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత కూడా సినిమా రిలీజ్ కోసం కొన్ని వర్గాల దయాదాక్షిణ్యాల కోసం నిర్మాతలూ ఇతర సినిమా వారూ ప్రాధేయపడవలసిన దుస్థితి రావడం ఏమిటో ఆలోచిస్తే రాహుశనుల కలయిక ఎలాంటి పరిస్తితులు సృష్టిస్తుందో అర్ధమౌతుంది.  

ఇదేగాక D.T.H ప్రసారానికి కూడా హాలు ఒనర్లతో కమలహాసన్ కు వచ్చిన గొడవ చూస్తుంటే తులారాశిలో ఉచ్ఛశని నీచరవులతో రాహువు కలయిక అచ్చు గుద్దినట్లు సరిపోతున్నది.ఏతావాతా శపిత యోగం ఇతన్ని ముప్పు తిప్పలు పెడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నది.

కానీ కొంచం ఆలస్యమైనప్పటికీ రిలీజైన తర్వాత సినిమా హిట్ కావడం ఖాయం అని ఇతని జాతకబలం చెబుతున్నది.మధ్యలో ఈ గొడవలు కావడం మాత్రం శపితయోగ ప్రభావమే.ఈ యోగప్రభావం వల్ల రకరకాల వర్గాల మధ్య ఇలాంటి గొడవలు తప్పనిసరిగా జరుగుతాయి అనీ భావోద్వేగాలను ఈ యోగం తీవ్రంగా రెచ్చగొడుతుంది అనీ నేను చెప్పినట్లే జరుగుతూ ఉండటం గమనించవచ్చు.
read more " శని రాహు యోగం-4 (కమలహాసన్ విశ్వరూపం) "

24, జనవరి 2013, గురువారం

శని రాహు యోగం -3 (వ్యక్తిగత జీవితాలలో ప్రభావాలు)

ఈ యోగ ప్రభావం దేశంమీదే కాదు మనుషుల జీవితాలలో కూడా దారుణంగా ఉంటుంది.అయితే ఈ దారుణ ఫలితాలకు గ్రహాలు బాధ్యులు కావు.దానికి కారణాలు మనుషులు చేసుకునే కర్మలోనూ ఈ గ్రహాల కారకత్వాలలోనూ ఉన్నాయి.

మన బ్యాంక్ ఎకౌంట్లో డబ్బులు లేకపోతే అది బ్యాంక్ మేనేజర్ తప్పు కానట్లే, మన జీవితం సరిగా లేకుంటే దానికి దేవుడో గ్రహాలో బాధ్యులు కావు.మనం చేసుకున్న కర్మే దానికి కారణం.దానికి ఎవరినీ నిందించవలసిన పని లేదు.అయితే దానిని బాగుచేసుకునే అవకాశం మన చేతిలోనే ఉంటుంది.అది ఎలా చెయ్యాలో చెప్పేదే జ్యోతిష్య శాస్త్రం.

శని చాలా నిదానంగా సూటిగా నడిచే గ్రహం.రాహువు చాలా వేగంగా వక్రంగా పోవాలనుకునే గ్రహం.శని న్యాయానికీ ధర్మానికీ కట్టుబడి నడిచే గ్రహం.రాహువు న్యాయాన్నీ ధర్మాన్నీ ధిక్కరించి నడిచే గ్రహం.గమ్యం చేరడం ముఖ్యం కాదు.నీతిగా నడిచే పధ్ధతి ముఖ్యం అని శని అనుకుంటాడు. ఎంత అడ్డదారిలో నడిచినా పరవాలేదు గమ్యం చేరడం ముఖ్యం అని రాహువు అనుకుంటాడు.శని బాధ్యతలను తప్పించుకోవాలని అనుకోడు.ఇంకా బాగా తన బాధ్యతను నిర్వర్తించలేక పోయానని అనుకుంటూ బాధపడతాడు. రాహువు అసలు బాధ్యతలు పెట్టుకోడు.ఏదో రకంగా ఆనందాన్ని అనుభవించడమే అతని లక్ష్యం.దానికోసం ఇతరులను బలిపశువులను చెయ్యడానికి కూడా అతడు వెనుకాడడు.శని నీతికీ నియమానికీ కట్టుబడతాడు.రాహువు నీతినీ నియమాన్నీ ధిక్కరిస్తాడు.శని తాను నష్టపోతాడు కాని ఇతరులను నష్టపెట్టడు.ఇతరులు ఏమైపోయినా తన లాభంవరకు తాను చూచుకుంటాడు రాహువు.

ఇన్ని వైరుధ్యాలున్న రెండు గ్రహాలు కలిస్తే ఏమౌతుంది. మనుషుల్లో కూడా ఇన్ని వైరుధ్యాలూ ప్రేరేపించబడతాయి.ఊగిసలాట వారిలో అధికమౌతుంది. వారి వ్యక్తిత్వాలలో ఉన్న పరస్పర విరుద్ధ భావాలు వారిని ఊపి పారేస్తాయి. ఏమి చెయ్యాలో తెల్చుకోలేరు. ఈ లోపల ఏదో చేసేస్తారు. దాని ఫలితాలు ఖచ్చితంగా చేదుగానే పరిణమిస్తాయి. చెడు ఫలితాలనే ఇస్తాయి.అంతే కాదు.శని ఎముకలకు అధిపతి.రాహువు కేన్సర్, ఎయిడ్స్ వంటి అసాధ్య రోగాలకు అధిపతి.కనుక ప్రజల్లో కూడా కీళ్ళనొప్పులూ,కింద పడటమూ, యాక్సిడెంట్లు కావడమూ,దెబ్బలు తగలడమూ,ఎముకలు విరగడాలూ, అసాధ్య రోగాలతో వారు చనిపోవడాలూ ఇప్పుడు జరుగుతాయి.దానికి వారి పూర్వకర్మలే కారణం అవుతాయి.మనుషులు భూలోకన్యాయాన్ని న్యాయస్థానాలనూ తప్పించుకోవచ్చు.కాని ప్రకృతి అనే కోర్టులో వారికి పడే శిక్షను తప్పించుకోలేరు.దైవన్యాయం అనుల్లంఘనీయం.


నాకు తెలిసిన కొంతమంది జీవితాలలో ఈ మధ్యన జరుగుతున్న సంఘటనల నుంచి ఉదాహరణలు ఇస్తాను.నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ లో ఒక స్టేజిమీద జరుగుతున్న డాన్స్ ప్రోగ్రాంలో ఒక మిత్రుడు ఒక స్టెప్ చేస్తూ జారి పడ్డాడు.సరిగ్గా మోకాలు పడిన చోట స్టేజిమీద ఒక చిన్న గులకరాయి ఉన్నది.అది అక్కడికి ఎలా వచ్చిందో తెలీదు. దానిని చిమ్మవలసిన పనివారు చిమ్మకుండా వదిలేశారు.సరిగ్గా ఆ రాయిమీద సరిగ్గా ఇతని మోకాలు పడి మోకాలిచిప్ప(patella)పగిలిపోయింది.నొప్పితో గిలగిలలాడుతుంటే హడావుడిగా హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో ఆపరేషన్ చేసి మూడు నెలలు బెడ్ రెస్ట్ అవసరం అని చెప్పారు.అతను చాలామంచి డాన్సర్ అని వేరే చెప్పనవసరం లేదు.కాని అనుకోకుండా జరిగిన చిన్న సంఘటనతో నెలల పాటు మంచానికి పరిమితం అయ్యాడు.

చిమ్మడం మొదలైన చిన్నచిన్న పనులు చేసేవారు శని అధీనంలో ఉంటారనీ, జారి కిందపడటం వంటి అనుకోని సంఘటనలు రాహువు అధీనంలో ఉంటాయనీ అర్ధమైతే శపితయోగం ఇక్కడ ఎలా పనిచేసిందో తెలుస్తుంది.చాలా మామూలుగా మనం తీసుకునే సంఘటనల వెనుక గ్రహప్రభావం ఉంటుందని దానిని సూక్ష్మదృష్టితో గమనిస్తే తెలుస్తుంది. 

ఇంకొక ఉదాహరణ చూద్దాం. చిలకలూరిపేట బస్సు దహనం కేసు అందరికీ కాకున్నా కొందరికి గుర్తుండి ఉంటుంది. ఇది 1993 లో జరిగింది.ఇద్దరు నిందితులు ఒక బస్సులో పెట్రోల్ పోసి అందులో ఉన్న 21 మంది అమాయక ప్రయాణీకులను సజీవంగా తగలబెట్టారు.ఆ నిందితులకు సెషన్స్ కోర్టూ, హైకోర్టూ,సుప్రీంకోర్టూ మరణశిక్ష విధిస్తే దానిమీద రాష్ట్రపతి క్షమాభిక్ష వరకూ 'న్యాయయుద్ధం' చేసి ఆ కర్కోటక నిందితులకు మరణశిక్షను తప్పించి యావజ్జీవశిక్ష పడేలా చేసాడు ఒక లాయరు. రాష్ట్రపతి శంకర దయాళ్ శర్మ ఆ పిటిషన్ ను తిరస్కరించాడు.కాని తర్వాత వచ్చిన కే.ఆర్.నారాయణన్ దానిని ఆమోదించాడు.కనుక చివరిక్షణంలో నిందితులకు ఉరిశిక్ష ఆగిపోయింది.నిందితుల తరపున ఆ కేసు వాదించి గెలిచిన లాయరు చిన్నవయసులో వెన్నెముక కేన్సర్ తో నిన్నగాక మొన్న మరణించాడు. బస్సులో నుంచి బయటపడలేక సజీవ దహనం అయిన 21 మంది ఉసురు ఇలా తగిలిందని ప్రజలు అనుకుంటున్నారు.

1998 లో ఈ నిందితులకు 14 ఏళ్ళ శిక్ష పడింది.అంటే 2012 తో వారికి శిక్షాకాలం పూర్తవుతుంది.2012 పోయి 2013 వచ్చిన వెంటనే ఈ కేసు వాదించిన లాయరు,పాపం చిన్నవయసులో భయంకరవ్యాధితో చనిపోయాడు.దీనిని ఏమనాలి? ఎలా అర్ధం చేసుకోవాలి? కర్మగతి ఎలా ఉంటుందో ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ ఇచ్చాను.

ఎముకలకు శని అధిపతి అనీ,కేన్సర్ వంటి అసాధ్య వ్యాధులకు రాహువు అధిపతి అనీ గ్రహిస్తే ఈయనకు వెన్నెముక కేన్సర్ ఎందుకొచ్చిందో, అదికూడా రాహుశనులు కలసి ఉన్న ఈ సమయంలోనే ముదిరి మరణం వరకూ ఎందుకు తెచ్చిందో అర్ధమౌతుంది.శనీశ్వరుడు ధర్మానికి అధిపతి అని,ఆయనకు తనామనా విచక్షణ ఉండదు అనీ పురాణాలు చెబుతున్నాయి.

ఒక వ్యక్తి రోడ్డు మీద నడుస్తూ వెళుతూ,అక్కడ ఉన్న ఒక రాయిని సరదాగా తన్నాడు.ఆ రాయి భూమి లోపలవరకూ లోతుగా ఉండి పైకి మాత్రం ఒక మొనలాగా కనిపిస్తున్నది. అది భూమ్మీద పడి ఉన్న ఒక మామూలు రాయి అనుకుని ఆతను దానిని తన్నాడు. అది కదలక పోగా,ఆ తన్నుకు ఇతని కాలులో అది లోతుగా గుచ్చుకుని,క్రమేనా ఆ గాయం సెప్టిక్ అయి చివరకు ఒక నెల తర్వాత ఆపరేషన్ చేసి అతని కాలు తొలగించారు. ఆ విధంగా సరదాగా అతను ఎంతమందిని తన్ని ఉంటాడో మనం ఊహించవచ్చు. అలా తన్నిన వారిలో ఎందరు అజ్ఞాత మహానీయులున్నారో అతను ఊహించి ఉండడు. కాని దాని ఫలితం మాత్రం వచ్చి తీరుతుంది. కనుక అతని కాలే పోయి కుంటివాడయ్యాడు.ఇది కూడా రాహుశనుల ప్రభావమే.

ఇద్దరు భార్యాభర్తలు ఒక పెళ్ళికి పొరుగూరికి వెళ్లారు.భర్త ఉదయాన్నే స్నానం చేసి తడి తువ్వాలును పెరట్లో ఉన్న ఒక తీగమీద ఆరవేశాడు. అది కరెంట్ తీగ అని అతనికి తెలియదు.ఆ ఇంటివారికి తెలుసు.దానిమీద వారు బట్టలు ఆరవెయ్యరు.కాని వారు ఇతన్ని హేచ్చరించలేదు.తత్ఫలితంగా ఇతనికి కరెంట్ షాక్ కొట్టి గిలగిలా కొట్టుకుంటుంటే రక్షించాలని వచ్చిన భార్య కంగారులో అతన్ని పట్టుకుంది. తత్ఫలితంగా ఆమెకూ కరెంట్ షాక్ కొట్టి ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు.పెళ్లి చూద్దామని వెళ్ళిన దంపతులు పరాయివారి ఇంట్లో బొగ్గుల్లా మాడిపోయారు.ఇదీ రాహుశనుల దోష ప్రభావమే.


అందుకే మనం చేసేపనులలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని,న్యాయానికీ ధర్మానికీ ఎప్పుడూ కట్టుబడి ఉండాలి అనీ,ప్రలోభాలకు లొంగరాదనీ, మనం నష్టపోయినా సరే ఒకరి ఉసురు పోసుకోరాదనీ పెద్దలు అంటారు.ఏది చేసినా నాకేమీ కాదు,నేను తప్పించుకోగలను అని ఎప్పుడూ అనుకోరాదు.మనం చేసే కర్మలు ప్రకృతి అనే డేటాబేస్ లో రికార్డ్ అవుతున్నాయని మర్చిపోరాదు.అవి ఎన్నటికీ డిలీట్ కాబడవు.ఏదో ఒకనాడు ప్రకృతి యొక్క న్యాయస్థానంలో మనం బోనులో నిలబడవలసి వస్తుంది.మన కర్మలకు సమాధానం చెప్పవలసి వస్తుంది.అక్కడ డబ్బుకు కక్కుర్తి పడే ప్లీడర్లూ జడ్జీలూ ఉండరు.ఎవరినైనా సరే ఆ న్యాయస్థానంలో న్యాయదేవత కఠినమైన అగ్నిపరీక్షకు గురిచేస్తుంది.అక్కడ ఎవరి రికమండేషన్లు పని చెయ్యవు. క్లేమేన్సీ పిటిషన్లూ పనిచెయ్యవు.ధర్మానికి ప్రతిరూపం అయిన శనీశ్వరుడు అక్కడ ఉగ్రమూర్తిగా కొలువుదీరి ఉంటాడు.ఆయన చేతిలో మనకు శిక్ష తప్పదు.ఈ విషయాన్ని మనం మర్చిపోరాదు.ఈ సూత్రం మీదనే మన సనాతనధర్మం అనండి, హిందూధర్మం అనండి,ఈ దేశపు జీవనవిధానం అనండి, అది నిర్మితమై ఉన్నది.ఇది తిరుగులేని సజీవసత్యం.

మన ప్రాచీనులు కర్మ సిద్ధాంతాన్ని పిచ్చివాళ్లై నమ్మలేదు.అది తిరుగులేని సూత్రం అనీ ప్రపంచాన్ని నడిపిస్తున్న ఏకైకసూత్రం అనీ వారికి తెలుసు. అందుకే ఎవరినైనా బాధపెడితే "వద్దురా.వాళ్ళ ఉసురు పోసుకోకురా.అది నీకూ నీ పిల్లలకూ మంచిది కాదు.కళ్ళు పోతాయిరా"అని పెద్దలు హెచ్చరించేవారు.వారి హెచ్చరికల వెనుక ఎంతో అనుభవమూ దూరదృష్టీ ఉన్నాయి.మన నవీన నాగరిక మనుషులలో అవే కొరవడ్డాయి.కాని మనం లెక్కచేయ్యనంత మాత్రాన ప్రకృతిసూత్రాలు పనిచెయ్యడం ఆగవు.అవి మన ఇష్టాయిష్టాల  మీద ఆధారపడి నడవవు.

శపిత యోగం అమలులో ఉన్న ఈ ఏడాదిన్నర కాలంలో, చేసిన తప్పులకు శిక్షలు అనుభవించక ఎవరికైనా తప్పదు అనేది చేదు నిజం.ఆ శిక్షలు చాలా చిత్ర విచిత్రాలుగా పడతాయి అనడమూ అక్షర సత్యమే.గమనిస్తుంటే నిత్యజీవితంలో అనేక సత్యాలు ప్రతిరోజూ కళ్ళెదుట సాక్షాత్కరిస్తాయి. దైవన్యాయాన్ని నిరూపిస్తాయి.కర్మగతిని తేటతెల్లం చేస్తాయి.
read more " శని రాహు యోగం -3 (వ్యక్తిగత జీవితాలలో ప్రభావాలు) "

22, జనవరి 2013, మంగళవారం

శని రాహు యోగం -2 (ఆంధ్రా తెలంగాణా గొడవలు)

ఆంద్రదేశం గురించి మనకు తెలిసినంత వెనుకనుంచి నేటి తెలంగాణారాష్ట్ర ఉద్యమం వరకూ సంఘటనలను ప్రభావితం చేస్తున్న గ్రహస్తితులను పరికిస్తే కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలు కనిపిస్తాయి.వాటిని పరిశీలిద్దాం.

కుజుడు దక్షిణ భారతదేశానికీ ముఖ్యంగా ఆంద్రరాష్ట్రానికీ సూచకుడు.దక్షిణ దిక్కుకు ఆయనే అధిపతి అని మనకు తెలుసు.ఇకపోతే రాహుశనుల కలయిక శపితయోగం అవుతుందనీ మనకు తెలుసు.ఆంద్రదేశం మీద విశ్వామిత్రుని శాపం ఉన్నదని పురాణాలు మనకు చెబుతున్నాయి. ఎందుకంటే ఆయన ఒకానొక సమయంలో ఆంద్రదేశం గుండా వెళుతున్నపుడు ఇక్కడి ప్రజలు ఆయన మునివేషాన్ని చూచి ఎగతాళి చేశారని,ఆయనకు తిండీ నీరూ ఇవ్వకుండా వేధించారనీ దానికి ఆయన కోపించి ఈనేలను శపించాడని ఒక గాధ ఉన్నది.కనుక ఆంద్ర ప్రాంతాన్నిశపితభూమి గానే పరిగణించాలి.

రామాయణ కాలంలో ఆంద్ర ప్రాంతాన్ని దండకారణ్యం అనేవారు.శ్రీరాముని ఎదిరించిన ఖరుడు దూషణుడు మారీచుడు ఇక్కడివారే.అప్పుడీ ప్రాంతం అంతా రావణుని ఏలుబడిలో ఉండేది.రావణుడు ఈ ప్రాంతాన్ని తన చెల్లెలు శూర్పణఖకు ఆమె వివాహసమయంలో స్త్రీధనంగా ధారాదత్తం చేసాడు. అప్పుడీ ప్రాంతం అంతా భిల్లులూ,ఆచారరహితులైన అడవి జాతులూ, రాక్షసులూ నివసిస్తూ తపస్సు చేసుకునే శాంత స్వభావులైన ఋషులను నానాబాధలూ పెడుతూ ఉండేవారు. సీతాపహరణం కూడా ఇక్కడే జరిగిందని మర్చిపోరాదు.కనుక ఇది శాపభూమే.పవిత్రమైన నదుల లిస్టులో మన కృష్ణానది ఎక్కడా లేదన్న సంగతి గమనించాలి.కృష్ణానదీ తీరాన్ని ప్రాచీనులు నిందితభూమిగా పరిగణించేవారు.బహుశా అక్కడివారు బౌద్ధాన్ని ఆదరించడం కూడా దీనికి ఒక కారణం కావచ్చు.  

దానికి నిదర్శనంగానే మిగతా రాష్ట్రాలకున్నట్లు మనకంటూ ఒక సంస్కృతి లేదు.ఒక ప్రధాన దైవం లేదు.ఒక ప్రధానమైన సంగీతమూ,నాట్యమూ,కళా, సంస్కృతీ ఏవీ తెలుగువారికి లేవు(ఒక్క పంచెకట్టు తప్ప). పంచె కట్టు కూడా బెంగాలీలను కాపీకొట్టి మనం నేర్చుకున్నదే కావచ్చు.మన వ్యవహారమంతా ఇతర రాష్ట్రాలనూ ఇతర ప్రాంతాలనూ అనుకరణే.నా మాటను రుజువు చెయ్యడానికి నేటి అయ్యప్పదీక్షలనూ,షిరిడీయాత్రలనూ మించిన ఉదాహరణ ఇంకొకటి అవసరం లేదు.చివరికి మన సినిమాలు కూడా మొదటినుంచీ చాలావరకూ హిందీ సినిమాలకు,ఇంగ్లీష్ సినిమాలకూ అనుకరణలే. ఆంధ్రావాడికి సొంత వ్యక్తిత్వం విశ్వామిత్ర ఋషిశాపం తోనే పోయింది అని నా భావన.

త్యాగరాజు మావాడు అని చెప్పుకోవడమూ,కూచిపూడి మా నాట్యం అని చెప్పుకోవడమూ,రామప్ప దేవాలయం మాది అని చెప్పుకోవడమూ,ఆంద్ర నాట్యం మాది అని చెప్పుకోవడమూ తప్ప అవేమిటో ఎలా ఉంటాయో చాలామంది తెలుగువారికి ఏమీ తెలియవు. త్యాగరాజును ఆదరించింది తమిళదేశం.ఆయనే గనుక మన ఆంధ్రాలో పుట్టి ఉన్నట్లయితే నిశ్శబ్దంగా కాలగర్భంలో కలిసిపోయి ఉండేవాడు. కూచిపూడి నాట్యానికి ఒక గుర్తింపు తేవడానికి ఆయా గురువులందరూ కృష్ణాజిల్లా నుంచి మద్రాస్ పోయి స్కూళ్ళు పెట్టుకోవలసి వచ్చింది.రామప్ప దేవాలయం కూలిపోవడానికి సిద్ధంగా ఉంటె పట్టించుకునేవారు లేరు.ఇక ఆంద్రనాట్యం గురించి నటరాజ రామకృష్ణ శిష్యులకు తప్ప మనకు ఎవరికీ ఏమీ తెలియదు.సిద్ధేంద్ర యోగి పేరు చెప్పినా జాయప సేనాని పేరు చెప్పినా 'వాడెవడు' అని అడిగే స్తితిలో ఉన్నాం మనం.

మన తెనుగుభాష అంటే కూడా మనకు పెద్దగా అభిమానం ఏమీ ఉండదు.వాడుక లేక చాలా అచ్చతెనుగు పదాలు చచ్చిపోయాయన్నది చేదునిజం.మన పోరుగువారైన తమిళులకూ,కన్నడిగులకూ, మలయాళీలకూ వారివారి ప్రత్యేకమైన భాషాభిమానమూ,సంస్కృతీ ఉన్నాయి.ఏ ప్రత్యేకతా ఏ అభిమానమూ లేనిది మనకే.రాష్ట్రాన్ని చేతనైనంత దోచుకోవడమూ, చేతకాకుంటే రెండుముక్కలుగా చీల్చుకోవడమూ,లేకుంటే అమెరికా పోయి అక్కడ కులసంఘాలు పెట్టటం ఒక్కటే మనకు చాతనైన విద్య.చివరకు తెలుగు భాషా ఉత్సవాలు రాష్ట్ర రాజధానిలో జరుపుకోవడానికి ధైర్యం చాలక తిరుపతిలో పెట్టుకున్న ఘనత మనది.కనుక మనది శాపగ్రస్త రాష్ట్రమే అని చెప్పక తప్పదు.

కనుక ఈ శాపగ్రస్తరాష్ట్రానికి శపితయోగానికీ సంబంధం ఉండటం అనేది తార్కికంగా తోస్తుంది.కనుకనే మన ఆంధ్రాప్రాంతంలో అతి ముఖ్యమైన సంఘటనలు జరిగిన ప్రతిసారీ శని,రాహువు,కుజుల పాత్ర చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను.తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అనేది మన రాష్ట్రంలో ఒక ముఖ్య సంఘటన.1982 లో తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పుడు కూడా శని రాహువుల మధ్యన ఖచ్చితమైన కేంద్రదృష్టి ఉన్నది.ఆ సమయంలో శని కన్యా రాశిలోనూ రాహువు మిధున రాశిలోనూ  28 డిగ్రీల మీద సంచరించారు. రాహువు గురు నక్షత్రంలోనూ శని కుజ నక్షత్రంలోనూ ఉండటం చూడవచ్చు.రాహువు ఉచ్చస్తితిలో ఉండటమూ గురు నక్షత్రంలో ఉండటమూ చూస్తె ఆ పార్టీ యొక్క జాతకం అర్ధమౌతుంది. 

ఇలాంటి సత్యాలను మరిన్ని గ్రహించడానికి చరిత్రలోకి ఒకసారి తొంగి చూద్దాం.   

1707 లో ఔరంగజేబు చనిపోయిన తర్వాత మొగలాయీ సామ్రాజ్యం వేగంగా క్షీణించింది.దేశంలోని దూరప్రాంతాల పైన డిల్లీ సింహాసనం తన పట్టును కోల్పోయింది.ఆ సమయంలో శని రాహువులు వృషభ రాశిలో 7 వ డిగ్రీ పైన కృత్తికా నక్షత్రంలో సంచరించారు.ఆ విధంగా శపితయోగం ఒక్కసారి కళ్ళు తెరిచి ఆంద్ర ప్రాంతానికి తనదైన ప్రభావాన్ని చూపించింది.కృత్తిక శకనక్షత్రం.కనుక ఔరంగజేబ్ మరణంతో దేశంలో ఒక శకం ముగిసింది.  

1724 లో మరాఠా వీరులతో యుద్ధాలలో మునిగి ఉన్న మొగలాయి చక్రవర్తి దక్కన్ ప్రాంతం పైన పట్టును పూర్తిగా కోల్పోయాడు. దానిని అదనుగా తీసుకుని అప్పటివరకూ మొగలాయీల పరిపాలనలో ఉన్న దక్కన్ ప్రాంతాన్ని 'అసఫ్ జా' అనేవాడు ఆక్రమించి తనను 'నిజాం ఉల్ ముల్క్' గా ప్రకటించుకున్నాడు. ఇది చరిత్ర చదివిన ఎవరికైనా తెలుసు.కాని ఈ సంఘటనల వెనుక రాహుశనుల పాత్ర ఉన్నదని,శపితయోగ ప్రభావం ఉన్నదనీ ఎవరికీ తెలియదు.ఎంతటి చక్రవర్తులైనా గ్రహాలకు లోబడి నడువవలసిందే.దీనికి మినహాయింపు ఎవరికీ ఉండదు.

1724 చివరా 1725 మొదట్లో శని ధనూరాశిలో 22 డిగ్రీల మీద సంచరించాడు. రాహువు మేషరాశిలో 22 డిగ్రీల మీద  ఉన్నాడు.కనుక వీరిద్దరి మధ్యనా కోణదృష్టి ఏర్పడింది. కుజుడు మూలా నక్షత్రంలో సంచరిస్తూ శనితో కలిసి ధనూరాశిలోనే ఉన్నాడు. కనుక ఆ సమయంలో శపితయోగం ఏర్పడింది.అందుకే ఆంద్రప్రాంతం మొగలాయీల పాలనలో నుంచి విడిపోయి ఇంకొక చీలికకు గురయి, నిజాం పాలనలోకి వచ్చి పడింది.

అక్టోబర్ 1948 లో రాహువు మేషం లోనూ,శని సింహం లోనూ 9 డిగ్రీల మీద సంచరించారు. వీరిద్దరి మధ్యనా మళ్ళీ కోణదృష్టి ఏర్పడి శపితయోగం మళ్ళీ కళ్ళు తెరిచింది.కనుక ఆ సమయంలో సర్దార్ పటేల్ చొరవ వల్ల 'పోలీస్ యాక్షన్' జరిగి హైదరాబాద్ సంస్థానం బారతదేశంలో లీనమైంది.ఆ సమయంలో కుజుడు వ్రుశ్సికంలో శని నక్షత్రంలో ఉన్నట్లు గమనించవచ్చు. కనుకనే దేశం నడిబొడ్డున ఉన్న ఆంద్రప్రాంతాన్ని పాకిస్తాన్లో కలపాలని నిజాం నిర్ణయించుకోవడమూ,దానికి బ్రిటన్ సహాయం కోరడమూ,మన ప్రభుత్వం దీనిని వ్యతిరేకించడమూ మొదలైన ప్రకంపనలతో యుద్ధ వాతావరణం ఏర్పడింది.

1956 లో భాషాప్రయుక్తరాష్ట్రాల ఏర్పాటు సమయంలో తెలంగాణా ఆంధ్రా ప్రాంతాలు కలిసి ఆంద్రప్రదేశ్ గా అవతరించింది. ఆ సమయంలో శని రాహువులు మళ్ళీ ఖచ్చితమైన డిగ్రీ కంజంక్షన్ లో వృశ్చికరాశి 7 డిగ్రీల మీద కలిసి ఉన్నారు. ఇది అనూరాధా నక్షత్రం అవుతుంది. కనుక శపితయోగం మళ్ళీ కళ్ళు తెరిచింది. ఇది మనోకారకుడైన చంద్రునికి నీచరాశి గనుక తీవ్రమైన గొడవల మధ్యన ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది.

సెప్టెంబర్ 2009 లో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రకటింపబడినప్పుడు మళ్ళీ శని రాహువులు ఖచ్చితమైన డిగ్రీ దృష్టిలో ఉన్నారు. శని కన్యారాశిలోనూ రాహువు మకరరాశిలోనూ 2 డిగ్రీల మీద ఆ సమయంలో సంచరించారు. కనుక వీరిద్దరి మధ్యనా మళ్ళీ కోణదృష్టి ఏర్పడింది. రాజ్య కారకుడైన సూర్యుని నక్షత్రాలలో ఉత్తరా,ఉత్తరాషాడలలో వీరిద్దరూ సంచరించడం గమనార్హం.

ఇప్పుడు మళ్ళీ శని రాహువులు తులారాశిలో అతి దగ్గరగా ఉన్నారు.కనుక తెలంగాణా ఏర్పాటు ప్రక్రియ వేగవంతం అవుతున్నది. సెప్టెంబర్ 2013 లో వీరిద్దరూ 15 డిగ్రీల మీద స్వాతి నక్షత్రంలో సంచరిస్తారు. అదే సమయంలో దక్షిణ దిక్కుకూ ఆంద్రరాష్ట్రానికి సూచకుడైన కుజుడు కటకరాశిలో నీచ స్తితిలో ఉంటూ శని రాహువులతో కేంద్రదృష్టి లోకి వస్తున్నాడు. కనుక ఆ సమయానికి ఆంధ్రా తెలంగాణా విడిపోయే ప్రక్రియ పూర్తి కావచ్చు. కాని గొడవలు తప్పవని,ఇదంతా తేలికగా జరిగే ప్రక్రియ కాదని శని రాహు కుజుల కారకత్వాలు సూచిస్తున్నాయి.

రాబోయే పౌర్ణమి 26-1-2013 న రిపబ్లిక్ డే సందర్భంగా వస్తున్నది. అదే సమయంలో కుజుడు మకరరాశిని వీడి కుంభరాశిలోకి అడుగు పెడుతున్నాడు. కనుక ఆ సమయానికి కొంచం అటూ ఇటూగా తెలంగాణా ప్రకటన వెలువడవచ్చు.కానీ ప్రక్రియ మొత్తం పూర్తి గావడానికి కొన్ని నెలలు పట్టి సెప్టెంబర్ ప్రాంతానికి మళ్ళీ శనిరాహువులు ఖచ్చితమైన డిగ్రీ కంజంక్షన్ లోకి వచ్చినపుడు అది నెరవేరవచ్చు.

ఆంధ్రా ప్రాంతానికి చెందిన ముఖ్యమైన మార్పులు జరిగిన ప్రతిసారీ వాటిపైన శనిరాహువుల పాత్రా కుజునిపాత్రా ఖచ్చితంగా ఉన్నది.ఇది ఖగోళంలో  కనిపించే సత్యం.ఆయా సమయాలలో శపితయోగం కళ్ళు తెరవడం జరిగింది.ఇది కాకతాళీయం ఎలా అవుతుంది? ప్రతిసారీ ఒకే గ్రహస్తితి ఎందుకుంటుంది? కనుక శపితయోగ ప్రభావం ఆంధ్రా మీద ఉన్నది అనడం  సత్యం.ప్రస్తుతం మళ్ళీ ఆ యోగం నడుస్తున్నది.దీని ఫలితంగా ఏమి జరుగబోతున్నదో త్వరలో తెలుస్తుందిగా. వేచి చూద్దాం.
read more " శని రాహు యోగం -2 (ఆంధ్రా తెలంగాణా గొడవలు) "

21, జనవరి 2013, సోమవారం

అసౌకర్యానికి చింతిస్తున్నాను

సౌత్ సెంట్రల్ రైల్వే స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ సందర్భంగా గత మూడురోజులుగా హైదరాబాద్ లో ఉన్నాను.పాటలు పాడటం,ముఖ్యంగా మెలోడీ సాంగ్స్ పాడటం, చిన్నప్పటి నుంచి నాకు అలవాటు. సోలో సాంగ్స్ సెక్షన్ లో, "తెరే ఘర్ కే సామ్నే" చిత్రంలో నుంచి మహమ్మద్ రఫీ పాడిన 'దిల్ క భవర్ కరే పుకార్' అనే పాటను ఈ సందర్భంగా స్టేజి పైనుంచి ఆలపించాను.

మా డివిజన్ నుంచి 'మాయాబజార్' అని ఒక స్టేజి డ్రామా వేశాము. అందులో పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటించాను. 'డబ్బు ప్రధానం కాదు మానవత్వం ప్రధానం'- అనే సందేశం ఈ డ్రామా ద్వారా ఇచ్చాం. కధ క్లుప్తంగా ఇలా ఉంటుంది.

ఓపెనింగ్ సీన్ లో ఒక శవం నడిరోడ్డుమీద పడి ఉంటుంది. ఒక లాయరూ,పోలీసు కానిస్టేబులూ,రాజకీయ నాయకుడూ అక్కడ చేరి దానిమీద వచ్చే ఇన్సూరెన్స్ డబ్బు కోసం కుట్ర చేస్తుంటారు.ఈలోపల టీ అమ్ముకునే ఒక సామాన్యుడిని లాయర్ ఒప్పించి ఆ శవం తన అన్నదిగా క్లెయిం చెయ్యమని నటనకు ఒప్పిస్తాడు.కాని పోలీస్ ఈ ప్లాన్ కనిపెడతాడు.ఇంతలో ఒక విలేఖరి వచ్చి ఆ శవాన్ని తన స్నేహితుడైన సూర్యం గా గుర్తిస్తాడు.సూర్యం ఒక నిజాయితీ పరుడైన ఎకనామిక్స్ గోల్డ్ మెడలిస్ట్. ఈ సమాజంలో బ్రతకలేక ఆత్మహత్య చేసుకుంటాడు. అది ఆత్మహత్య అయినా కూడా దానిని ఒక ఏక్సిడెంట్ గా చిత్రించి దుష్ట త్రయం ముగ్గురూ డబ్బుకోసం నాటకం ఆడుతుంటారు. అలా వాదనలు జరుగుతున్న నేపధ్యంలో సామాన్యుడైన టీ అమ్ముకునే వ్యక్తి మనసు మారి వారు ముగ్గురుకీ ఎదురు తిరుగుతాడు. టీ కొట్టు వాడూ,విలేఖరీ చెప్పిన డైలాగ్స్ తో ఈ ముగ్గురికీ కనువిప్పు కలిగి కొనఊపిరితో ఉన్న సూర్యాన్ని ఆస్పత్రికి తీసికెళ్ళడానికి ఉద్యమిస్తారు. ఇదీ కధ.

ఈ ప్రోగ్రాములలో ఉన్న కారణం చేత గత మూడురోజులుగా మిత్రుల మెయిల్స్ కు జవాబులివ్వలేక పోయాను.రైల్వే అనౌన్స్ మెంట్ లాగా "అసౌకర్యానికి చింతిస్తున్నాను" అని చెప్పాలి.హైదరాబాద్లో ఉన్న మిత్రులు వచ్చి కలుస్తామంటే కూడా కలవలేకపోయాను.అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాను.
read more " అసౌకర్యానికి చింతిస్తున్నాను "

17, జనవరి 2013, గురువారం

శనిరాహు(శపిత)యోగం - ఫలితాలు

జాతకంలో శనిరాహువులు ఒక రాశిలో కలసి ఉంటె అది గొప్పదోషంగా పరిగణింపబడుతుంది. దీనిని శపితయోగం అని అంటారు.కొన్ని జ్యోతిష సాంప్రదాయాలలో దీనిని మహాదోషంగా పరిగణిస్తారు.కొంతమంది నిష్టాపరులైన జోస్యులు అయితే, ఈ దోషం ఉన్న జాతకాన్ని చూడటానికి,ఆ జాతకునితో మాట్లాడటానికీ కూడా ఇష్టపడరు.

గోచారరీత్యా శనిరాహువులిద్దరూ ఒకే రాశిలో కలసినప్పుడు కూడా లోకానికి ఇదే దోషం ఏర్పడుతుంది.వీరిద్దరి పరస్పర వేగాలలో తేడాలవల్ల అలా కలవడం ఎప్పుడో కాని జరగదు.సామాన్యంగా అలా శనిరాహువులు ఒకే రాశిలో కలవడానికి దాదాపు 11 లేదా 12 ఏళ్ళు పడుతుంది.కాని అలా కలిసినప్పుడు మాత్రం లోకంలో చాలా ఘోరాలు జరుగుతాయి.అలా కలిసిన రాశులను బట్టి కొన్ని దేశాలు,కొందరు మనుషులు,కొన్ని కొన్ని రంగాలు తీవ్రంగా ప్రభావితము లౌతాయి.

శనిరాహువులు కలిసి ఉన్నసమయంలో పుట్టిన జాతకాలలో ఈ యోగం ఆయా లగ్నాలను బట్టి, ఇతర గ్రహస్తితులను బట్టి రకరకాలుగా ప్రతిఫలిస్తుంది.ఆయా జాతకులను ముప్పుతిప్పలు పెడుతుంది. కాలసర్ప యోగం ఎంత బాధపెడుతుందో ఈ యోగమూ అంతకంటే ఎక్కువ బాధ పెడుతుంది.అయితే అది బాధించే తీరూ ఇది బాధించే తీరూ వేర్వేరుగా ఉంటాయి.కాలసర్పయోగ జాతకులకు కాలం కలిసిరాక బాధలు పడతారు. శపితయోగ జాతకులు వారి యొక్క అదుపులేని విచక్షణా రహిత ప్రవర్తన వల్ల బాధలు కొనితెచ్చుకుంటారు.

ప్రస్తుతం వీరిద్దరూ 2012 డిసెంబర్ 24 నుంచి 2014 జూలై 13 వరకూ తులా రాశిలో కలిసి ఉంటారు.ఈ సమయమంతా దోషప్రదమే.ఈ ఏడాదిన్నర పాటు లోకం రకరకాల ఉపద్రవాలతో తల్లడిల్లక తప్పదు. ఈ సమయంలో పుట్టే పిల్లల జాతకాలలో ఈ దోషం తప్పకుండా ఉంటుంది. కనుక పెరిగి పెద్దయ్యాక వారి జీవితాలలో వారు చాలా చెడుఖర్మను అనుభవించక తప్పదు.ఈ సమయంలో పిల్లలు జన్మించబోతున్న కుటుంబాలలో గనుక మనం గమనిస్తే,పెద్దవారిలో మొండి ప్రవర్తనలు,చెడు అలవాట్లు,తీవ్రంగా ఉద్రేకాలకు లోనయ్యే స్వభావాలు ఖచ్చితంగా ఉంటాయి.గతజన్మలో చాలా పాపఖర్మల బరువు ఉన్న జీవులు,శాపగ్రస్తులైన జీవులు ఈ సమయంలో భూమిమీద జన్మలు తీసుకొనబోతున్నారు.

దీనిని శపితదోషం అని ఎందుకంటారు? ఈ జాతకులకు చాలా శాపాలు ఉంటాయి. గత జన్మలలో వీరు అనేక చెడుకర్మలు చేసుకుని అనేక మంది ఉసురుపోసుకుని వారి శాపాలకు గురై ఉంటారు.పూర్వజన్మలలో చేసుకున్న చెడుఖర్మల ఫలితంగా ఈ జన్మలో అనేక కష్టాలు బాధలు పడవలసి వస్తుంది.అహంకారంతో చేసుకున్న చెడుఖర్మ ఈ రకమైన దోషంగా జాతకంలో ప్రతిఫలిస్తుంది.

శపితదోషం ఉన్న జాతకాలు చూచి వారికి రెమేడీలు చెప్పిన జ్యోతిష్కుడు కూడా ఆకర్మలో భాగం పంచుకోవలసి వస్తుంది. పరిహారాలు చేసిన జోస్యునిపైన రాహు,శనుల కోపదృష్టి పడుతుంది. జాతకుని తీవ్రకర్మలో జోస్యుడు జోక్యం చేసుకుంటున్నాడు కనుక అతనూ ఆ కర్మను కొంత పంచుకోవలసి వస్తుంది.ఉపాసనా బలం చాలనప్పుడు ఆ జోస్యుడు దారుణమైన బాధలు పడతాడు.ఒక్కోసారి రెమేడీలు చేసిన పాపానికి జోస్యుని ప్రాణం కూడా పోతుంది.నాకు తెలిసిన ఒక జోస్యుడు ఇలాగే అందరికీ రెమేడీలు చెబుతూ ప్రతిరోజూ సాయంత్రానికి మద్యం తాగేవాడు. ఒకరోజున రోడ్ ఏక్సిడెంట్ జరిగి ప్రాణాలు కోల్పోయాడు.

ఒకసారి ఒక ముసలి జ్యోతిష్కుని నేను చూచాను. ఒక జాతకాన్ని తన చేతిలోకి తీసుకుని చూచీ చూడకముందే ఆ కాగితాన్ని విసిరి పారేసాడు.ఆ జాతకం తాను చూడననీ,ఆ జాతకున్ని వెళ్ళిపోమ్మనీ అరిచాడు.ఉత్త పుణ్యానికి అలా ఎందుకు అరుస్తున్నాడో నాకు అర్ధం కాలేదు.తర్వాత చెప్పాడు అది శపితదోషం ఉన్న జాతకం మనం దానిని చూడరాదు. విశ్లేషించరాదు అని.  

పన్నెండు రాశులలో దేనిలో ఈ దోషం ఏర్పడింది? దీనిపైన మిగతా గ్రహాల ప్రభావం ఎలా ఉన్నది? అన్న దానిని బట్టి ఈ దోష తీవ్రతను జాతకుని పూర్వకర్మను అంచనా వెయ్యాలి.

ఈ యోగం ఉన్నప్పుడు ఆ జాతకుడు తీవ్రమైన కోపానికి,నిలకడలేని ప్రవర్తనకు లోనవుతాడు.తట్టుకోలేని కోపంలో హత్యలు రేపులు చేసేవారు, ఉన్నట్టుండి తీవ్ర నిర్ణయాలు తీసుకునే వారిలో ఈ దోషం ఉంటుంది,లేదా వారిపైన ఈ గ్రహయుతి ప్రభావం ఉంటుంది.వీరిలో విచక్షణ లోపిస్తుంది. మొండిగా కొన్ని నిర్ణయాలు తీసుకుని వాటి ఫలితాలు తర్వాత ఏడుస్తూ అనుభవిస్తారు.శనిరాహువుల సంయోగం అలాంటి ప్రవర్తనను ప్రేరేపిస్తుంది. తట్టుకోలేని భావోద్రేకాలను,మొండితనాన్ని, మూర్ఖపు వాదనలను,ఒంటరిగా ఉండి క్రూరమైన ప్లానులు వెయ్యడాన్ని ఈ గ్రహసంయోగం కలిగిస్తుంది. స్నేహితుల మధ్యన,ప్రేమికుల మధ్యన, అప్పటివరకూ కలిసిమెలిసి తిరిగిన వారిమధ్యన,హటాత్తుగా గొడవలు రావడం ఈ దోషం యొక్క ప్రభావమే.

డిల్లీ రేప్ కేస్ గాని,తర్వాత జరుగుతున్న ఇతర రేపులు హత్యలు ఘోరాలు గాని,యాక్సిడెంట్లు గాని,అన్నీప్రస్తుతం గోచారరీత్యా అమలులో ఉన్న ఈ యోగం యొక్క  ఫలితాలే. అంతేకాదు,అక్బరుద్దీన్ ఉదంతం గాని,పాకిస్తాన్ దుందుడుకు చర్యలు గాని,సరిహద్దులో మనల్ని రెచ్చగొట్టడం గాని,పాకిస్తాన్లో సంక్షోభంగాని,మన రాష్ట్రంలో తెలంగాణాసంక్షోభం గాని ఇవన్నీ ఈ గ్రహయుతి యొక్క ఫలితాలే.భావోద్వేగాలను ఈ గ్రహసంయోగం తీవ్రంగా రెచ్చగొడు తుంది.

చాలామంది జీవితాలలో జూలై 2014 లోపు ఈ గ్రహదోషం చుక్కలు చూపించి ముప్పు తిప్పలుపెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగిస్తుంది అనడం నగ్నసత్యం.నామాటలు ఇప్పుడే నమ్మవద్దు.వేచి చూడండి ఫలితాలు ఎవరి జీవితాలలో వారికే కనిపిస్తాయి.
read more " శనిరాహు(శపిత)యోగం - ఫలితాలు "

14, జనవరి 2013, సోమవారం

పండుగలలో అంతరార్ధాలు

గత రెండు రోజుల నుండి నాకు పండుగ శుభాకాంక్షలు చెప్పిన వారిలో కొందరిని ఒక ప్రశ్న అడుగుతున్నాను.కాని ఒక్కరు కూడా జవాబు చెప్పలేక బిక్కముఖం వేస్తున్నారు.

సంక్రాంతి పర్వదినం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? మీరెందుకు ఈ పండుగ జరుపుకుంటున్నారు? అనేది ఆ ప్రశ్న.అందరూ ఈ పండుగను ధూమ్ ధాం గా చేసుకుంటున్నారు.కాని దీని అంతరార్ధం ఎవరికైనా తెలుసా? నేనడిగిన వారిలో ఎవరూ సరియైన జవాబు చెప్పలేకపోయారు.

ఈపండుగకు సామాజికంగానూ, ఋతువులపరంగానూ, వ్యవసాయపరం గానూ,జ్యోతిష్యపరంగానూ,ఆధ్యాత్మికపరంగానూ అర్ధమూ ప్రాముఖ్యతా ఉన్నాయి.వాటిని మరచి క్లబ్బులో ఎగరడానికి ఈ పండుగను మనం ఆచరిస్తే అంతకంటే ఘోరం ఇంకోటి ఉండదు.

భోగి రోజునైతే పరిస్తితి ఇంకా ఘోరంగా ఉంది.ఈ రోజున ఏదో ఒకటి తగలబెట్టాలి గామోసు,లేకపోతే ఏదో చెడు జరుగుతుందేమో అన్నస్తితికి దిగజారిన జనం,ఏదీ దొరక్కపోతే ఇంట్లో ఉన్న చెత్తకాగితాలు తెచ్చి వాటిని మంటబెట్టి ఆమంట చుట్టూ ఎగురుతున్నారు.ఎందుకు మంట పెడుతున్నారో దానిచుట్టూ ఎందుకు ఎగురుతున్నారో ఒక్కరికీ తెలీదు. పక్కవాడు ఎదో మంట పెట్టాడు, మనమూ ఎదో ఒకటి తగలబెట్టకపోతే వాడింటికి పొయ్యే లక్ష్మి మనింటికి రాదేమో అన్న భయంతో కొందరు గుడ్డిగా ఈ తంతును అనుకరిస్తున్నారు. ఈ పిచ్చి జనాన్ని చూస్తుంటే 'పులిని చూచి నక్క మంట పెట్టుకున్నట్లు' అని పాత సామెత కొంచం మారి గుర్తుకొస్తున్నది.

ప్రతిదానికీ అర్ధాలు తెలుసుకోవడం ఎందుకు? హాయిగా పండగలు ఎంజాయ్ చేస్తే పోలా?అని కొందరు అనుకుంటారు.అది అజ్ఞానజనితమైన భావన.అసలు పండగలన్నీ ఎంజాయ్ చెయ్యడం కోసం మాత్రమె ఉద్దేశించబడినవి కావు.'ఎంజాయ్ చెయ్యడం' అనేది మన దేశపు భావన కాదు.ఇది పాశ్చాత్య భావన.ఎందుకంటే వాళ్ళ జీవిత పరమావధి అదే.కాని మన భారతీయ జీవిత పరమావధి అదొక్కటే కాదు.దానితో బాటు ఇంకా ఉన్నతమైన గమ్యం మనకుంది.నిజమైన ఎంజాయ్మెంట్ అనేది మనకే తెలుసు.ఎందుకంటే మన ఎంజాయ్మెంట్ తాటాకుమంటలా భగ్గుమని ఆరిపోయే ఎంజాయ్మేంట్ కాదు.ఇది చాలా లోతైనది,ఎల్లకాలం నిలిచి ఉండేది,అద్భుతమైన తృప్తిని ఇచ్చేదీనూ.అలాంటి ఎంజాయ్మెంట్ ఎలా పొందాలో మనకు తెలుసు.'తినుము త్రాగుము సుఖించుము'-ఇదే జీవితం అనుకునే పాశ్చాత్యులకు నిజమైన ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుందో అస్సలు తెలీదు.పాశ్చాత్య భావజాలదాసులైన భారతీయులకూ అది తెలీదు.అందుకే వారి జీవితాలు కూడా ఎంత సంపాదించినా ఏదో అసంతృప్తితోనే కునారిల్లు తుంటాయి.భారతీయమూలాల వైపు వారు మళ్ళీ దృష్టి సారిస్తేనే వారికి ఆ తృప్తి ఏమిటో అర్ధమౌతుంది.

మనం చేసే ప్రతిపనికీ అర్ధాలు తెలుసుకోవాలి. అలా తెలుసుకోకపోతే మనమేం చేస్తున్నామో ఎటు పోతున్నామో మనకు తెలీదు.అలాంటిది మన పండుగలకే మనకు అర్ధాలు తెలీకపోతే ఎలా?

అంతరార్ధాన్ని మరచి ఒక పండుగను మనం ఊరకే తిని తాగి ఎగరడానికీ,సాయంత్రానికి సినిమాకో పబ్బుకో బారుకో పోవడానికీ  ఉపయోగించుకుంటే అది శవానికి అలంకారం చెయ్యడం వంటిది.దురదృష్ట వశాత్తూ మన పండుగలు అన్నీ అలాగే తయారయ్యాయి.గుడ్డిలో మెల్ల ఏమంటే,కనీసం కొన్ని పండుగలన్నా ఇంకా బ్రతికి ఉన్నాయి. అంతరార్ధాలు మరచిపోయినా,వాటిని ఇంకా మనం విడిచి పెట్టకుండా చేసుకుంటున్నాం. అదే కొంతలో కొంత సంతోషం.

అర్ధం తెలిసి ఆ పండుగలను చేసుకునే ఎంత బాగుంటుందో మనం ఆలోచించాలి.కనీసం ఇతర మతాల వాళ్ళు అడిగితే చెప్పడానికైనా మనకు మన మతం గురించి తెలియాలి కదా? ఆలోచించండి.
read more " పండుగలలో అంతరార్ధాలు "

12, జనవరి 2013, శనివారం

ఒక దివ్యజ్యోతి వెలిగి నేటికి 150 ఏళ్ళు

ఇంగ్లీషుతేదీల ప్రకారం వివేకానందస్వామి జన్మించి నేటికి 150 ఏళ్ళు పూర్తయ్యాయి.ఈ నూటఏభై ఏళ్ళుగా ఆయన చెప్పినదాన్ని మనం ఎంతవరకూ అర్ధం చేసుకున్నాం, ఎంతవరకూ ఆచరిస్తున్నాం అని ఇంకోసారి ప్రశ్నించుకోవలసిన రోజు ఈరోజు.

అసలెందుకు ప్రశ్నించుకోవాలి?ఎందుకు ఆయన చెప్పినది వినాలి?ఎందుకు ఆచరించాలి?ఏం ఆమాత్రం మనకు తెలీదా?అని ప్రశ్నించుకుంటే కొన్నిజవాబులోస్తాయి.

తరతరాలుగా మన జాతి మహర్షుల ప్రభోధాలను ఆచరిస్తూ ధర్మమార్గంలో నడుస్తున్నజాతి.మనం ధర్మమార్గాన్ని తప్పనంతవరకూ మన దేశం అజేయంగానే ఉన్నది.మన జీవితాలు నీతివంతములుగానే ఉన్నాయి.మన పూర్వీకుల జన్మలు ధన్యత్వాన్ని సంతరించుకుంటూనే ఉన్నాయి. మహర్షుల బోధను ఎగతాళి చెయ్యడం, ఆచరించకపోవడం మొదలైనప్పటి నుండే మనకు అధోగతి మొదలైంది.

చదరంగం ఆడేవాడికంటే బయటనుంచి చూచేవాడికి సరైన ఎత్తులు తోస్తాయి.నిత్యం రొచ్చు జీవితంలో పడి కొట్టుకుంటున్న వానికంటే, దాని బయటనుంచి చూచేవానికే సరియైన దారి కనిపిస్తుంది.మహర్షులు మహనీయులు అలాంటివారే.అందుకే వారి బోధలను మనం శిరస్సున దాల్చాలి.జీవితంలో ఆచరించాలి.ఇంద్రియభోగాలే పరమావదులైన మనది హ్రస్వ దృష్టి.కాని వివేకానందాది మహానీయులది అత్యంత దూరదృష్టి.కనుక వారి బోధనలు మనకు ఆచరణీయాలు.

మహర్షులు ఆయా కాల పరిస్తితులను బట్టి అప్పటికి తగినటువంటి బోధలు చేస్తారు.కాని అవి ధర్మానుసారమే ఉంటాయి.ధర్మం తప్పకుండా కాలాన్ని బట్టి మార్గదర్శనం చెయ్యడమే ఋషిలక్షణం.అందుకే మనకు అనేకరకాల స్మృతులు ధర్మశాస్త్రాలు వచ్చాయి.అవన్నీ ఆయా కాలాలకు తగినవి. వాటిలో కొన్ని ఈ కాలానికి కూడా పనికొస్తాయి.కానీ అన్నీ పనికిరావు. మన భారతీయమూలాలు చెడకుండా,సనాతన ధర్మపు పునాదులపైన నవీన కాలానికి తగిన దారిచూపే మహర్షులు నేడు కావాలి.వివేకానందస్వామి అటువంటి మహర్షి.అందుకే ఆయన చూపిన బాటలో నడవడం మన ధర్మమే కాదు మన విధి కూడా.

ఆయన పుట్టి నూటయాభై ఏళ్ళు గడిచినాయని పోస్టల్ స్తాంపులు ముద్రించి చేతులు దులుపుకోవడం, వేదికలెక్కి ఉపన్యాసాలివ్వడం వంటి నాటకపు చేష్టలవల్ల ఏమీ ఒరగదు.ఆయన చెప్పిన బోధలను నిత్యజీవితంలో ఆచరిస్తేనే ఆయనకు మనం నిజమైన గౌరవం ఇచ్చినట్లు.లేకుంటే ఈ ఉత్సవాలన్నీ ఆత్మవంచనలే తప్ప ఇంకేమీ కావు.అందుకే అలాంటి సభలకు దేనికీ నేను వెళ్ళను.రాజకీయ నాయకులు ఎవరైనా (ఎక్కడో నరేంద్రమోడీ వంటి ఒకరిద్దరు తప్ప) వివేకానంద స్వామిని ఉటంకిస్తూ మాట్లాడితే నాకు నవ్వే కాదు చిర్రెత్తుకొస్తుంది. దయ్యాలు వేదాలు వల్లించినట్లు, వివేకానందుని వంటి పవిత్రాత్ముని కనీసం స్మరించే అర్హత కూడా నేటి రాజకీయులకు లేదు.

అసలాయన్ని మనం ఎందుకు గౌరవించాలి?ఏమిటాయన ప్రత్యేకత?అని కొందరికి అనుమానాలోస్తాయి.ఆయన్ను గౌరవించడం అంటే భారతదేశ ఆత్మను గౌరవించడమే. తరతరాల ఋషి సంస్కృతిని గౌరవించడమే.మన దేశపు మూలాలను మన సనాతన ధర్మాన్నీ గౌరవించడమే.మనమలా గౌరవించడం వల్ల ఆయనకు ఒరిగేదేమీ లేదు.మానవ లోకపు కుళ్ళుకు అందనంత ఎంతో ఎత్తులో తనదైన తేజోమయలోకంలో ఆయన జ్ఞానమూర్తిగా నిలిచి ఉన్నాడు.మనం ఆయన్ను గౌరవించినా విమర్శించినా ఆయనకు ఒరిగేదీలేదు తరిగేదీ లేదు. కాని ఆయనను అనుసరించడం వల్ల మన జీవితాలే ధన్యత్వాన్ని సంతరించుకుంటాయి.దిక్కూ మొక్కూ లేకుండా నడుస్తున్న మన జీవితాలకు ఒక మహోన్నతమైన గమ్యం అప్పుడే ఏర్పడుతుంది. వివేకానందుని చదవడం అనుసరించడం వల్ల మనకే లాభం కలుగుతుంది. ఆయనకు కాదు.దీనిని సరిగ్గా అర్ధం చేసుకోవాలి.

వివేకానందుని బోధలలో సంకుచిత స్వభావం లేదు.ఆయన చెప్పినదంతా విశ్వజనీనమైన సనాతన ధర్మపు పునాదిపైనే నిర్మితమై ఉన్నది.అంతేగాక నేటి సమాజానికి కావలసిన పరిష్కారాలు ఆయన అప్పుడే అందించాడు. ఆచరించడమే తరువాయి.కాని ఆ పని చేసేవారేరీ?

నేడు కొంతమంది స్వామీజీలు 'వినాయకుణ్ణి పూజించవద్దు. శివున్ని పూజించవద్దు.విష్ణు స్మరణే చెయ్యాలి. విష్ణువే దేవుడు శివుడు కాదు.' మొదలైన బూజుపట్టిన మధ్య యుగపు భావజాలాన్ని సమాజం నెత్తిన మళ్ళీ రుద్దుతున్నారు. ఇంకొందరేమో 'కృష్ణుడే నిజమైన దేవుడు. విష్ణువు కూడా కృష్ణుని అవతారమే. ఇక శివుడూ మొదలైన దేవతలు కృష్ణునితో పోల్చుకుంటే అసలు దేవతలే కారు'.అంటూ ఇంకోరకమైన విషాన్ని ఎక్కిస్తున్నారు.వీరందరూ వేదాలకూ గీతకూ వక్రభాష్యాలు బాగా చెప్పగలరు.వినేవారికి బ్రెయిన్వాష్ చేసి బాగా నమ్మించగలరు. చాలామంది బాగా చదువుకున్న ప్రజలుకూడా ఇలాంటి మరుగుజ్జు స్వామీజీల మాటలు నమ్మి మధ్యయుగాల నాటి చీకటిలోకి మళ్ళీ ప్రయాణం చేస్తున్నారు.వీరి చెత్తబోధలతో పోల్చుకుంటే వివేకానందస్వామి వంటి నిజమైన మహనీయులు చెప్పిన బోధలు ఎంత ఉన్నతమైనవో ఎంత సార్వజనీనమైనవో మనం తెలుసుకోవచ్చు.

ఆయన ఉన్న సమయంలో భారతీయ సమాజం ఘోరమైన తమస్సులో మునిగి ఉన్నది.దానినుంచి రజస్సులోకి ముందుగా ఎదగాలని ఆయన ఆశించాడు. అది ఇప్పుడు నేరవేరుతున్నది.ఇప్పుడు మన సమాజం తీవ్రమైన రజోగుణంలో మునిగి ఉన్నది. బహుశా ఇంకో రెండు వందల ఏళ్ళ తర్వాత మన సమాజంలో మళ్ళీ సాత్వికత వస్తుందేమో? దాని తర్వాత ఇంకో రెండు వందల ఏళ్ళకు వివేకానందుని వంటి మహర్షులు ఆశించిన దైవత్వం అనేది మానవునిలో కనిపించవచ్చు. అప్పటివరకూ దారి తప్పకుండా తరతరాలుగా ఆయన చూపిన సరైన దారిలో నడవటమే మనం చెయ్యగలిగింది. అంటే మనం దారిలో నడవటమే గాక,మన పిల్లలకు కూడా సరైన పునాదులు వేసి,అలాఅలా ముందుముందు తరాలవారు కూడా ఇదే దారిలో నడిచేలా చెయ్యాలి. 

అప్పుడే పరిణామ క్రమంలో తరానికీ తరానికీ ధార్మికమైన ఎదుగుదల కనిపిస్తుంది.ఋషికుటుంబ వ్యవస్థ ఇలాగే నడుస్తుంది.దీనికి వ్యతిరేకంగా తరతరానికీ ఇంకా ఇంద్రియభోగాలలో కూరుకుపోవడం రాక్షస విధానం. అది దైవత్వం వైపు దారి తియ్యదు.ఇంకాఇంకా ఘోరతమస్సు వైపు తీసుకెళుతుంది.ప్రస్తుతం మనం తరతరానికీ ఆర్ధికంగా ఎదుగుతున్నామా లేదా అని మాత్రమె ఆలోచిస్తున్నాం.ప్లాన్ చేస్తున్నాం. అదొక్కటే చాలదు.ధార్మికంగా ఒక తరంనుంచి ఇంకోతరానికి పైమేట్టుకు ఎక్కామా లేక దిగజారామా అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఎందుకంటే, ఈ మాటలు ఇప్పుడు నవ్వులాటగా తోచవచ్చు.కానీ ఈ మాటల అర్ధం లాంగ్ రన్ లో మాత్రమె అర్ధమౌతుంది.

నేను ఆధ్యాత్మికంగా ఒక స్థాయికి ఎదిగినప్పుడు నా పిల్లలు అంతకంటే ఇంకొక మెట్టు పై స్థాయిని అందుకున్నప్పుడే ఒక మనిషిగా నా జన్మకు సాఫల్యత.అంతేగాని నేను ఉద్యోగంలో చేరిన తర్వాత తాగడం నేర్చుకుంటే నా పిల్లలు కాలేజీ స్థాయిలోనే తాగడం నేర్చుకుంటుంటే చూచి ఆనందించడమూ ప్రోత్సహించడమూ కాదు.పరిణామక్రమంలో ఒక తరం దాని ముందుతరం కంటే పైమెట్టుకి ఎదగాలి కాని దిగజారకూడదు అన్నదే ఋషిసంస్కృతి.పైకి ఎదగడం అంటే ఆర్ధికపరంగా మాత్రమె కాదు.ధార్మికంగా ఆధ్యాత్మికంగా ఎదగాలి.అలాంటి ట్రైనింగ్ మీ పిల్లలకు ఇవ్వడం మీ వల్ల కాకపోతే ఎన్ని కోట్లు సంపాదించినా మీజన్మ వృధా అన్న విషయం గ్రహించండి. 

మతం అనేది ఎప్పుడూ వ్యక్తి నిర్మాణానికే ప్రాధాన్యత నిస్తుంది. ధర్మాన్ని వ్యక్తి స్థాయిలో ఆచరింప చెయ్యడమే దాని లక్ష్యం. అయితే మిగతా సమాజం అంతా అధర్మం వైపు వెళుతుంటే తానొక్కడే ధర్మాన్ని అంటి పెట్టుకుని ఉండాలంటే దానికి ఎంతో ధైర్యమూ త్యాగమూ కావాలి.తనంతట తానుగా సుఖాలను వదులుకునే త్యాగం ఉండాలి.అలాంటి లక్షణాలు ఉన్న మనుషులవల్లె ఏదైనా మహత్తర కార్యాలు సాధింప బడతాయి. అంతేగాని కాకమ్మ కబుర్లు చెప్పి ఏదోరకంగా పబ్బం గడుపుకునేవారు మతపరంగా ఏమీ సాధించలేరు.వారు లౌకికంగా ఎదగవచ్చు.కోట్లు సంపాదించవచ్చు. కాని ధార్మికంగా మరుగుజ్జులుగానే ఉండవలసి వస్తుంది.రాక్షసులు కూడా ఎంతో సంపదనూ విలాసాలనూ అనుభవించినవారే.రాజ్యాలు నడిపిన వారే. కాని వారు దైవత్వంవైపు వెళ్ళేదారిలో నడిచినవారు కారు. ప్రస్తుత సమాజంలో కూడా రాక్షస ప్రవృత్తి అధికంగా ఉన్నవారే ఎక్కువగా ఉన్నారు.

ఒక ఉదాహరణ ఇస్తాను.ఒక రైల్వే స్టేషన్ లోనో,ఒక సినిమా హాల్ లోనో, ఒక షాపింగ్ మాల్ లోనో, లేక ఏదో ఇంకో చోటో ఎక్కడో ఒక క్యూలో మనం నిలబడి ఉన్నాం అనుకుందాం.మన కంటే ముందు కొందరు ఎగబడి క్యూని ధిక్కరించి ముందుకు పోయి టికెట్లో ఇంకోటో సాధించుకొని హాయిగా ముందుకెళ్ళి పోతుంటారు.వారిని చూచి మనమూ ఎగబడి వారిలాగే క్యూని ధిక్కరించి వెళ్ళడం ఒక రకం.ప్రస్తుతం అందరూ అదే రకపు మనస్తత్వం లో ఉన్నారు. ఇది జంతు మనస్తత్వం. ఒక జంతువును చూచి ఇంకో జంతువూ ఇలాగె ఎగబడుతుంది.కానీ,మనకు టికెట్ దొరక్కపోయినా,రైలో బస్సో లేకపోతే ఇంకోటో మనకు తప్పిపోయినా సరే,నిక్కచ్చిగా క్యూలోనే వెళ్లి ప్రయత్నించడం ఒక రకం. కాని దీనికి చాలా ధైర్యమూ,త్యాగబుద్ధీ కావాలి. ఇదే అసలైన మతం,అసలైన ధర్మం అని నేనంటాను.ఇది నేననే మాట కాదు.మహర్షులందరూ చెప్పినది కూడా ఇదే.నిత్యజీవితంలో చిన్నచిన్న విషయాలలో కూడా మన ధర్మాచరణ ప్రతిఫలించాలి.అప్పుడే మనం సత్యమార్గంలో నడుస్తున్నట్లు లెక్క.మాటల్లో నీతులు చెబుతూ చేతల్లో రాక్షసుల మాదిరి ఉంటె అది ధర్మం అవ్వదు. కాని మన ప్రస్తుత సమాజంలో అదే నడుస్తున్నది. 

నిత్యజీవితంలో మనకు ఎదురయ్యే ఒక చిన్న ఉదాహరణ నేను ఇచ్చాను.ఇలాంటివి తెల్లారి లేస్తే కొన్ని వందలు మనం ప్రతిచోటా చూడవచ్చు.అక్కడి దాకా ఎందుకు? తిరుపతి పుణ్య క్షేతానికి వెళ్లి, ఒక గంట సేపు ఆగలేక,ఎవరికో ఒకరికి ఒక వెయ్యి ఇచ్చి ఎదో లాగ దర్శనం చేసుకుందాం అని ప్రయత్నించే వారు లక్షలాది మంది ఉన్నారు.మరి వారు ఎలాంటి ధర్మాన్ని ఆచరిస్తున్నట్లో వారే ఆత్మవిమర్శ చేసుకోవాలి.నేను 'వెయ్యి' అని వ్రాశాను. వచ్చిన వెంటనే ఒక్క గంటలో దర్శనం చేయిస్తే 'లక్ష' ఇచ్చిన వారూ తీసుకున్న వారూ నాకు పర్సనల్ గా తెలుసు. ధర్మ స్వరూపుడైన భగవంతుని దగ్గరకు వెళ్లి కూడా అధర్మాచరణలో ఉంటె ఇక అదేంటి? దీన్ని ఏమనాలి? మీరే చెప్పండి.

ఈ రకంగా న్యాయమూ ధర్మమూ అని ఆలోచిస్తే ఇక అయినట్లే.మనం చూస్తూ కూచుంటే మనకంటే ముందు ఎంతోమంది వెళ్లి పోతారు.వారికంటే ముందే మనం పరిగెత్తాలి. లాభాన్ని చేజిక్కించుకోవాలి. అన్న భావజాలమే నేటి సమాజపు దుస్తితికి కారణం.ఇది జంతువుయొక్క స్థాయి. ఒక బిస్కెట్ ఎదురుగా కనిపిస్తుంటే దాన్ని అందుకోవడానికి ఒకదానికంటే ముందు ఇంకొకటి పరిగేట్ట్టే కుక్కల్లా ఉంది మన పరిస్తితి.ఈ స్థాయిలో ఉన్నంతకాలం దైవత్వాన్ని మనం ఎలా అందుకోగలం?మనం ఎన్ని బొట్లు పెట్టుకున్నా,ఎన్ని కూచిపూడి డాన్సులు నేర్చుకున్నా,ఎన్ని కీర్తనలు పాడినా,ఎన్ని గుళ్ళూగోపురాలూ దర్శించినా,ఎన్ని ఉగాది పచ్చళ్ళు తిన్నా,ఎన్ని పండగలు ఆర్భాటంగా చేసుకున్నా నిత్యజీవితంలో ధర్మాన్ని ఆచరించనంతవరకూ మనం హిందువులం కాము.సనాతనధర్మాన్ని అనుసరిస్తున్న వారమూ కాము. మరి మనం ఎవరం? అంటే, ఉత్త పగటి వేషగాళ్ళం మాత్రమె.

ఇంకొక చిన్న ఉదాహరణ ఇస్తాను. 'బ్రాహ్మణో  సురా పీత్వా బ్రాహ్మణత్వాత్ విముచ్యతే' బ్రాహ్మణుడు సురాపానం చేస్తే ఆతన్ని బ్రాహ్మణత్వం వదిలి పోతుంది'.అని మనువు చెప్పాడు.మరి ఈరోజుల్లో బ్రాహ్మణ కులంలో పుట్టిన ఎందరు పైశ్లోకాన్ని బట్టి బ్రాహ్మణులు అవుతారో మీరే ఆలోచించండి. ఎందుకు చెబుతున్నానంటే,మనకు తోచిన తీరులో మనం ఉంటూ,మనం సరైన దారిలోనే ఉన్నాం అనుకోడం పెద్ద భ్రమా ఆత్మవంచనా మాత్రమె. మరి సరియైన దారి ఏది? అంటే, వివేకానందాది నవీన మహర్షులు చూపిన మార్గమే మనకు శిరోధార్యం.మనకు తెలీనప్పుడు తెలిసినవారు చెప్పినది వినాలి.లేకుంటే మన గతి అధోగతే.పైన బ్రాహ్మణులను మాత్రమె సూచిస్తూ ఒక శ్లోకం ఉదహరించాను.ఇదే మిగతా కులాలవారికీ వర్తిస్తుంది.ఎవరి పరిధులలో వారుండక పోవడమే సమాజంలోని సమస్త అరిష్టాలకూ కారణం. న్యాయాన్నీ ధర్మాన్నీ నడిపించవలసిన వారే అధర్మవర్తనులు కావడమే దీనికి మూలం.ఎవరి ధర్మాన్ని వారు మరచి ఏదో రకంగా దోచుకుందాం, విలాసాలు అనుభవిద్దాం అనుకోవడమే సర్వారిష్టాలకూ మూలం. 

ఈ రకంగా ఎన్ని చెప్పుకున్నా ఎన్ని చర్చించినా చివరికి ఎవరి కుటుంబంలో వారు  ప్రతి క్షణమూ ధర్మాన్ని ఆచరిస్తున్నారా లేదా, తమ పిల్లల చేత ఆచరింపచేస్తున్నారా లేదా అన్నదే ప్రధానం.అదెలా చెయ్యాలి అన్న విషయం తెలియాలంటే ముందుగా వివేకానందస్వామి వంటి నిస్వార్ధపూరితులైన నిజమైన మహనీయులు చెప్పిన విషయాలు గ్రహించాలి. మన నిత్యజీవితాలలో వాటిని ఆచరించాలి.అలా చెయ్యాలంటే కొన్ని త్యాగాలకు వాలంటరీగా మనం సిద్ధపడాలి.

'5000 సంవత్సరాలకు సరిపడా సందేశాన్ని లోకానికి ఇచ్చి వెళుతున్నాను.'అని వివేకానందుడే అన్నాడు.కాని అర్ధం చేసుకునే వారూ ఆచరించేవారూ ఏరీ? కనీసం మీరన్నా ఆ ప్రయత్నం చేస్తారా?
read more " ఒక దివ్యజ్యోతి వెలిగి నేటికి 150 ఏళ్ళు "

9, జనవరి 2013, బుధవారం

మాయా ప్రపంచం తమ్ముడూ..

ఒక మిత్రుడు మొన్నీమధ్యన జరిగిన ఒక సంగతి చెప్పాడు. అతను ఒక ప్రసిద్ధ యోగాగురువుకి శిష్యుడు. నరసరావుపేటలో ఈ మధ్యనే వాళ్ళొక కేంప్ జరిపారు.అందులో 'నాడీపరీక్ష' జరిపి రోగులకు ఆయుర్వేద మందులిస్తారు.రోగి స్తితిని బట్టి ఆహార విహారాదులలో జాగ్రత్తలు చెబుతారు. అంతవరకూ బాగానే ఉంది.

కానీ ఆ కేంప్ కు దాదాపు పదిమంది ఇంగ్లీషువైద్యులు వచ్చి వారంతా నాడీపరీక్ష చేయించుకోవడమే గాక, వారి బాధలు తగ్గడానికి ఆయుర్వేద మందులు కూడా తీసుకువెళ్ళారు. అదీ విచిత్రం.

'నాడీ పరీక్ష ఎలా చేస్తారు?దానితో రోగి తత్వాన్ని ఎలా కనుక్కుంటారు? ఏ స్కానింగులూ చెయ్యకుండానే రోగి యొక్క వ్యాధిని ఎలా నిర్ధారిస్తారు? అనే విషయం మీద మీకు ఉత్సుకత ఉంటె నాడీపరీక్ష ఎలా ఉంటుందో చూడడంకోసం వచ్చి ఉండవచ్చు.కాని మా మందులు మీరెందుకు తీసుకుంటున్నారు? మీ మందులు మీకున్నాయి కదా' అని వాళ్ళను క్యాంప్ నిర్వాహకులు అడిగారు. దానికి వారు చెప్పిన జవాబు వింతగా ఉంది.

'we dont want to fill our bodies with synthetic drugs that have poisonous side effects' అని వారు జవాబిచ్చారు. ఇది ఒకరకంగా మంచి పరిణామమే.ఇష్టం వచ్చినట్లు పచారీకొట్లో పప్పుల మాదిరి నేడు డాక్టర్లు వాడిస్తున్న మందులవల్ల ప్రజల శరీరాలలో తీవ్రమైన విషపరిణామాలు కలుగుతున్నమాట వాస్తవం.కానీ ఒక రోగికి ఇరవైరకాల మందులు వ్రాసి వాడమని చెప్పే డాక్టరు, తనకు రోగమొస్తే తానుమాత్రం వాటిలో ఒక్కటి కూడా వాడడు.ఎందుకంటే వాటివల్ల కలిగే చెడు పరిణామాలు అతనికి బాగా తెలుసు. ఎంతైనా తన ప్రాణం తనకు తీపి కదా.

అందుకే డాక్టర్లు మాత్రం తెలివిగా హెర్బల్ మందులూ, యోగా, రోజూ వ్యాయామం చెయ్యడమూ,ఆహార నియమాలూ మొదలైనవి పాటిస్తున్నారు. సాధ్యమైనంత వరకూ జాగ్రత్తగా ఉంటున్నారు.రోగులకు మాత్రం పప్పు బెల్లాల మాదిరి యాంటీ బయోటిక్స్, కార్టిజాన్స్ వాడిస్తున్నారు. పోతే పొయ్యేది రోగే కదా.అడిగేవాడూ లేదు చెప్పేవాడూ లేడు.మన దేశంలో డాక్టర్లను కట్టుదిట్టం చేసే చట్టాలు ఏమీ లేవు.ఒకవేళ పేపర్ మీద ఉన్నా ఆచరణలో ఎక్కడా కనిపించవు.కనుక ట్రీట్మెంట్ లో ఏ రకమైన పొరపాట్లు చేసినా డాక్టర్లు మనదేశంలో చక్కగా తప్పించుకోగలుగుతారు.మన చట్టాలు నేరస్తులకూ, డాక్టర్లకూ చుట్టాలు. భారతీయడాక్టరు ఎవరికీ,కనీసం తాను ట్రీట్మెంట్ ఇస్తున్న రోగికి కూడా,ఎట్టి పరిస్తితిలోనూ జవాబుదారీ కాడు.

మా స్నేహితుడు ఇదే మాట ఆ డాక్టర్లను అడిగాడు. దానికి వారు చెప్పిన జవాబు ఇంకా కళ్ళు బైర్లు కమ్మించేలా ఉంది.

'అవునండి.మేం డిగ్రీ తీసుకుని బయటకు రావడానికి కోటి రూపాయలు అవుతున్నది.ఈలోపు పదేళ్ళు పడుతున్నది. మాకేమో అప్పటికే మధ్యవయసు వచ్చేస్తున్నది. ఆ కోటి రూపాయలు వడ్డీతో సహా చూసుకుంటే రెండు కోట్లు అవుతుంది. ఆ రెండు కోట్లు మేమెప్పుడు రాబట్టుకోవాలి? ముందా రెండు కోట్లు రాబట్టుకుంటే ఆ తర్వాత దానిపైన వచ్చేదేకదా మా అసలైన సంపాదన? కనుక ఒక పేషంటు మా వద్దకు వస్తే టెస్ట్ లని మందులని అవనీ ఇవనీ చెప్పి ఒక లక్షకు అతన్ని టార్గెట్ చేస్తాం.ఒకవేళ కొంచం తెలివైన పేషంట్ అయితే ఏభై వేలతో సరిపెడతాం.ఇంకా తెలివైన పేషంట్ అయ్యి,రికమెండేషన్ తో వస్తే ఒక పాతికవేలకు సర్డుకుంటాం. అలా చెయ్యకపోతే మేం ఖర్చు పెట్టిన డబ్బు ఎలాతిరిగి రాబట్టుకోవడం?

'మరి ఈ క్రమంలో మీరు వాడే మందులతో రోగుల ఒళ్ళు గుల్ల అయినా మీకేం పట్టదా?'

'ఇక అవన్నీ ఆలోచిస్తూ కూచుంటే మేం దుకాణం మూసుకోవలసిందే.ఎవరి ఖర్మ వారిది.పొయ్యేవాడు ఎలాగూ పోతాడు.దానికి మేమేం చెయ్యగలం చెప్పండి. ప్రతిరోజూ యాక్సిడెంట్లలో కొన్ని వేలమంది పోతున్నారు.దానికీ మేమే బాధ్యులమా?'

'మరి మీకు రోగమొస్తే అవే మందులు మీరు వాడటం లేదుగా? అది కరెక్ట్ కాదు కదా?'

'భలేవారు సార్.ఇది మా ఒళ్ళు. మా జాగ్రత్తలు మేం తీసుకోవాలిగా.అది వృత్తి. ఇది పర్సనల్ జాగ్రత్త. అవసరం అయితే తప్ప మందులు వాడకూడదనీ చీటికీ మాటికీ మందులు వాడితే ఒళ్ళు గుల్లౌతుందనీ మాకు తెలుసు.అందుకే సాధ్యమైనంత వరకూ ఆహారనియమాలూ,వ్యాయామమూ వీటితో నెట్టుకు రావడమే అత్యుత్తమం." అని ఆ డాక్టర్లు అందరూ ముక్త కంఠంతో వాక్రుచ్చారు.

ఈ స్నేహితుని బంధువులలో ఒకరికి ఇలాగే ఏదో సీరియస్ అయితే హైదరాబాద్లో పేరుగాంచిన ఒక ఆస్పత్రిలో చేర్చారట.ఆ ఆస్పత్రి పేరు వద్దులెండి.అందరికీ తెలిసినదే.వారు 20 రోజులపాటు రోగిని అక్కడ ICU లో ఉంచుకుని 16 లక్షలు బిల్లేసి చివరికి ఒక రోజున "ఇంకో నాలుగు లక్షలు రెడీ చేసుకోండి అర్జంటుగా ఒక ఆపరేషన్ చెయ్యాలి" అని చెప్పారట.'ఈలోపల వీళ్ళ అదృష్టం బాగుండి ఆ రోగి హరీమనడంతో ఆ నాలుగు లక్షలూ మిగిలాయి. లేకుంటే 20 లక్షలు కట్టి బాడీని తెచ్చుకోవలసి వచ్చేది'అని నావద్ద చెప్పి వాపోయాడు.

ఇదీ నేటి డాక్టర్ల బాగోతం."వైద్యో నారాయణో హరి:" అన్నదాన్ని 'అయ్యా వైద్యనారాయణా(నీచేతిలో పడితే మాపని)హరీ'అని మార్చి చదువు కోవలసిన పరిస్తితి నవీనకాలపు వైద్యులవల్ల వచ్చింది.అన్ని రంగాలలో లాగే వైద్యరంగంలో కూడా కనిపించని అవినీతి విలయతాండవం చేస్తున్నది.

కాని ఒక్క వైద్యులను మాత్రమె తప్పు పట్టలేము.ప్రజల అక్రమ సంపాదనను వదిలించి వారి ఖర్మను దారి మళ్ళించే పని డాక్టర్లు చేస్తున్నారు.ఈ కర్మచక్రంలో వారి పాత్ర వారూ చక్కగా పోషిస్తున్నారు.జీవచక్రంలో స్కావెంజింగ్ స్పిషీస్ కొన్నుంటాయి.కర్మచక్రంలో ప్రస్తుతం ఆ పాత్రను డాక్టర్లుకూడా పోషిస్తున్నారు.జాతకదోషాలు పోగొట్టే పనిలో భాగంగా నువ్వులదానం తీసుకుని అది కడుక్కోడానికి నానాతిప్పలూ పడే బ్రాహ్మణులలాగా,నేటి ప్రజల అక్రమసంపాదనను ప్రక్షాళన చేసే బృహత్తర కార్యక్రమంలో డాక్టర్లను ఈ రకమైన పాత్రదారులుగా చేసి ఈ వింతాటను నడిపిస్తున్నాడు పరమేశ్వరుడు.

ఒక నది అనేక మలుపులు తిరుగుతూ పైనించి కింద పడుతూ, మళ్ళీ లేస్తూ , ఈ లోపల అడవుల్లోంచి కొండల్లోంచి గుట్టల్లోంచి రకరకాల మార్పులతో ఎలా ప్రయాణం చేస్తుందో అలాగే రకరకాలైన మార్పులతో నడుస్తున్న ఈలోకంలోని ప్రజల కర్మగతిని చూస్తూ అర్ధం చేసుకుంటూ వినోదించడమే మన పని.అంతకంటే ఇక మనం ఏమీ చెయ్యలేము.చెప్పినా వినే స్తితిలో కూడా ఎవరూ లేరు.ఇదంతా ఏదో వినాశనంతోనే ముగిసేలా కనిపిస్తున్నది.

ఇదంతా చూస్తుంటే 'మాయా సంసారం తమ్ముడూ...ఇది మాయా సంసారం తమ్ముడూ...నీ మదిలో సదా శివుని మరువకు తమ్ముడూ' అనే పాత పాట ఒకటి గుర్తొస్తున్నది.
read more " మాయా ప్రపంచం తమ్ముడూ.. "

7, జనవరి 2013, సోమవారం

డిల్లీ లో క్రైం రేట్ ఎందుకు ఎక్కువ? - కొన్ని సామాజిక కోణాలు

డిల్లీ వంటి నగరాలలో క్రైం రేట్ ఎక్కువగా ఉంటుంది.దీనికి కొన్ని కారణాలున్నాయి.అన్నింటి కంటే ముఖ్య కారణం మాత్రం ఒకటుంది.అనేక రాష్ట్రాలనుంచి వలస వచ్చిన రకరకాల సంస్కృతులూ మనస్తత్వాలూ కలిగిన మనుషుల వల్లనే ఇక్కడ క్రైం ఎక్కువగా జరుగుతుంది.

డిల్లీలో ఒక నేరం జేరిగితే దానికి కారకులు పెద్ద పెద్ద రాజకీయ నాయకులా,బిజినెస్ వ్యక్తులా పిల్లలే అయి ఉంటారు. లేదా బీహార్,రాజస్తాన్,పంజాబ్ రాష్ట్రాల నుంచి వచ్చి నగరంలో అనేక చిన్న చిన్న పనులు చేసుకుంటున్న వ్యక్తులు అయిఉంటారు. బాధితులు మాత్రం ఎక్కువగా మధ్య తరగతికి చెందిన డిల్లీ వాసులే అవుతారు.

డిల్లీ వంటి నగరాలలో ఫ్లోటింగ్ జనాభా ఎక్కువ.అది కూడా నిరక్షరాస్యతా,నేరాలూ ఎక్కువగా ఉండే బీహార్ రాజస్తాన్ వంటి దగ్గర రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా ఉంటారు.వారివల్లే ఈ నేరాలు జరుగుతూ ఉంటాయి.  తమిళనాడు ఆంధ్రా కేరళ వంటి రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ఉన్నాకూడా వారి వల్ల సమస్యలు రావు.ఈ సంగతి పోలీసులకు కూడా తెలుసు.

పాశ్చాత్య నాగరికతలో భాగాలైన కురచ వస్త్రదారణా, వేళాపాళా లేకుండా ఆడామగా రోడ్లమ్మట చెట్ట పట్టాలు వేసుకుని తిరగడమూ కూడా దీనికి దోహదం చేస్తాయి. ఈ నేరాలకు ఇవే మూలకారణాలు కావు గాని,దోహదకాలు మాత్రం అవుతాయి. 

ఈ సంగతులన్నీ తెలిసిన అధికారులు మరి పోలీసుశాఖను బలోపేతం చెయ్యల్సింది పోయి, డౌన్ సైజింగ్,రైట్ సైజింగ్ అన్న వరల్డ్ బ్యాంక్ రాగాలకు అనుగుణంగా డాన్స్ చెయ్యడం ఒక పెద్ద వింత. వారు మాత్రం ఏమి చెయ్యగలరు? ప్రభుత్వ విధానాల ప్రకారం వారు నడచుకోవాలి. ప్రభుత్వాలేమో వారికి అప్పులిచ్చి వారిని నడిపిస్తున్న అంతర్జాతీయ సంస్థల ఆదేశాలు పాటించాలి. ఆ సంస్థలకు లోకల్ సమస్యలు పట్టవు. వారి లాభాలకు అనుగుణంగా వారు ఆదేశాలు జారీ చేస్తారు.పాటించడం మన విధి.

ఈ దేశంలో రాజకీయ నాయకుల పుణ్యమా అని ప్రజలకు చట్టం అంటే భయం పోయింది.మన సినిమాలు కూడా ఈ దౌర్జన్యసంస్కృతిని పెంచి పోషిస్తున్నాయి. ఈ రోజుల్లో ఏ సినిమా పోస్టర్ చూచినా రక్తం కారుతున్న కత్తి,గద, గండ్రగొడ్డలి,ఇంకా రకరకాలైన మారణాయుధాలు పట్టుకున్న హీరోనే దర్శనం ఇస్తున్నాడు.లేదా సాధ్యమైనంత తక్కువబట్టలు ధరించిన హీరోయిన్ అన్నీ చూపిస్తూ కనిపిస్తుంది.అయితే సెక్స్,లేదంటే హింస.ఈ రెండే మన సినిమాలు ప్రచారం చేస్తున్న అతిగొప్ప సందేశాలు.

మన దేశంలో అందరికీ,ముఖ్యంగా లోయర్ మిడిల్ క్లాస్ కూ,లేబర్ కూ ఆదర్శగురువులు సినిమాలూ ఆ హీరోలే అన్నది నిజం. పొద్దున్న లేచిన దగ్గరనుంచీ ఏ పత్రిక తీసినా,ఏ టీవీ చానల్ పెట్టినా, ఏ సినిమా పోస్టర్ చూచినా సెక్సూ, దౌర్జన్యమూ ఈ రెండు తప్ప ఇంకేమీ కనిపించవు. ఇలాంటి విషాన్ని నాలుగు వైపుల నుంచీ నిరంతరం ప్రజలకు ఎక్కిస్తూ,సమాజం ఆదర్శవంతంగా ఉండాలి, ఏ నేరమూ జరుగకూడదు అనడం హాస్యాస్పదం.

మనకు ఆదర్శాలు సినిమాలు. సినిమా వారికి కావలసింది డబ్బు. సమాజం భ్రష్టు పట్టినా వారికి ఏమీ చింత లేదు.

మనకు లా అండ్ ఆర్డర్ అంటే భయం లేదు.ఏం చేసినా ఎవడో నాయకుణ్ణి ఒకణ్ణి అడ్డం పెట్టుకుని బయట పడవచ్చు అన్న ధైర్యం మనకుంది.

నేరాలకు అన్ని కారణాలూ మనకు తెలిసినా, వాటిని పరిష్కరించే ప్రయత్నాలు మాత్రం చెయ్యం. చర్చలు మాత్రం జోరుగా చేసి, సలహా నా వంతు, చెయ్యడం నీ వంతు అని పక్కకు తప్పుకుంటాం.

నేరాలు లేకపోతే మనకు మాత్రం పనేముంది? రాబడి ఎలా వస్తుంది? కనుక క్రైం ఇంకా జరగాలి.మన పంట పండాలి అనుకునే నాయకులూ అధికారులూ కూడా ఉన్నారనేది వాస్తవం.

కులాలకు వర్గాలకు అతీతంగా సమస్య లోతుల్లోకి వెళ్లి ఆలోచించడం మనకు రాదు.బాధితుడు/రాలు మన కులం అయితే ఒకరకంగా మాట్లాడతాం,లేకుంటే ఇంకో రకంగా మాట్లాడతాం.ఇదీ మన స్థాయి.

డిల్లీ రేప్ పాతబడిన న్యూస్ కదా.ఇంకా ఎందుకు మీరు దానిమీదే వ్రాస్తున్నారు. సాగదీస్తున్నారు అని కొందరు నాకు మెయిల్ చేశారు.అదీ మన సగటు భారతీయుని మానసిక స్తితి. ఈ రోజు న్యూస్ ను రేపు మర్చిపోవాలి. ఇంకో సెన్సేషనల్ న్యూస్ కోసం ఎదురుచూడాలి. అనుకుంటున్నాం గాని సమస్యల మూలాలలోకి మనం వెళ్ళం. అలా వెళితే అవెక్కడ పరిష్కారం అయిపొతాయో అని మనకు భయం కావచ్చు.

పాశ్చాత్యుల వేషధారణను మనం కాపీ కొడుతున్నాం గాని,వారికున్న క్రమశిక్షణా,సివిక్ సెన్సూ, రాజకీయ పరిణతీ, హక్కులూ బాధ్యతల పట్ల వారికున్న అవగాహనా మనకు లేవు.వాటిని నేర్చుకోవాలని కూడా మనం ప్రయత్నం చెయ్యం.

ఇలాంటి పరిస్తితుల్లో దారుణాలు జరగడమే సహజం కాని, జరగకపోవడం ఎలా అవుతుంది? సమస్య యొక్క మూలకారణాలను తొలగించే పని చిత్తశుద్ధితో చెయ్యకుండా ఏదో జరిగినప్పుడు ఏదో చేసేసి చేతులు దులుపుకుంటే సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి?

మనకొక సామెతుంది.'రోగీ పాలే కోరాడు.వైద్యుడూ పాలే చెప్పాడు'.అని. అలాగే నాయకులూ అలాగే ఉన్నారు.ప్రజలూ అలాగే ఉన్నారు.ఇక మంచి సమాజం ఎక్కణ్ణించి ఊడిపడుతుంది?
read more " డిల్లీ లో క్రైం రేట్ ఎందుకు ఎక్కువ? - కొన్ని సామాజిక కోణాలు "

6, జనవరి 2013, ఆదివారం

అమ్మాయిలకు మార్షల్ ఆర్ట్స్ ఉపయోగపడతాయా?

ఈ మధ్య జరుగుతున్న రేపులు అమ్మాయిల మీద దాడుల దృష్ట్యా కొన్ని రాష్ట్రాలలో అమ్మాయిలకు మార్షల్ ఆర్స్ నేర్పాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. మంచిదే. ఈ సందర్భంగా మార్షల్ ఆర్ట్స్ లో గత 30 ఏళ్ళుగా నాకున్న అనుభవాన్ని బట్టి కొన్ని విషయాలు చెప్తాను.

ప్రస్తుతం మన దేశంలో ఉన్న మార్షల్ ఆర్ట్స్ శిక్షకులలో బోగస్ శిక్షకులే ఎక్కువ.వీళ్ళలో చాలామందికి అసలైన మార్షల్ ఆర్ట్స్ రావు.వీరికి సరైన సంస్థలతో అఫిలియేషన్  ఉండదు.ఏవో కొన్ని మాయ టెక్నిక్స్ నేర్చుకుని ఇక కుంగ్ ఫూ సినిమాలూ,నెట్టూ పట్టుకుని వాటితో నేట్టుకోస్తుంటారు.ఇలాంటి వారు చాలామంది స్కూళ్ళూ కాలేజీల వెంట తిరిగి మేము ఆధరైజేడ్ మాస్టర్లము అని చెప్పి ఆయా ప్రిన్సిపాళ్ళను, కాలేజీ యాజమాన్యాలను మోసగించి అక్కడ క్లాసులు చెప్పడానికి కుదురుతారు. పిల్లలకు ఏవేవో పిచ్చి పిచ్చి టెక్నిక్స్ నేర్పుతూ పబ్బం గడుపుకుంటూ ఉంటారు.

యూనిఫాం అని, బెల్ట్ టెస్ట్ లని, స్పెషల్ క్లాసులని మాయమాటలు చెప్పి వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తారు కాని వారు నేర్పేది ఏమీ ఉండదు.ఇదొక మాయలోకం.పిల్లలేమో తమకు ఎదో వచ్చేసిందన్న భ్రమలో ఉంటారు.వారికి ఏమీ రాదు.ఆ వచ్చిన స్టెప్స్, పంచేస్,కిక్స్ తో వారు ఆత్మరక్షణ చేసుకోలేరు. ఆ టెక్నిక్స్ వారికి ఏ విధంగానూ ఉపయోగపడవు.

నాలుగు ఐదేళ్ళ పాటు కరాటే నేర్చుకున్న వారు కూడా స్ట్రీట్ ఫైట్ లో మామూలు మనుషుల చేత తన్నులు తిన్న కేసులు నాకు తెలుసు.బ్లాక్ బెల్త్స్ అని చెప్పుకున్న వారిని మామూలు పల్లెటూరి మనుషులు తుక్కు కింద కొట్టిన సందర్భాలున్నాయి. కనుక ఏదో ఫేన్సీ గా నేర్చుకున్న కరాటే కుంగ్ ఫూ ల వల్ల ఆత్మరక్షణ చేసుకోగలం అని భ్రమపడకండి. ఆ విద్యలలో మాస్టరీ రావాలంటే అనేక ఏళ్ళు కఠోరంగా శ్రమిస్తేనే సాధ్యం అవుతుంది. స్కూళ్ళలో కాలేజీలలో ఒక గంటో అరగంటో ప్రాక్టీస్ చేస్తే ఆ స్కిల్ రానేరాదు.

క్రిమినల్స్ కరుడుగట్టి ఉంటారు. వారికి దయా దాక్షిణ్యాలు ఉండవు. కనుక అలాంటి వారి ముందు ఫేన్సీ గా నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ఉపయోగపడవు. మీ అమ్మాయి స్కూల్లో ఒకటి రెండు మూమెంట్స్ నేర్చుకున్నంత మాత్రాన "మా అమ్మాయికి ఇక ఏమీ కాదు,తను ఎటువంటి పరిస్తితినైనా ఎదుర్కోగలదు" అన్న భ్రమలో మీరుంటే ముందు దానినుంచి  బయటకు రండి. సరదాగా నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ నిత్యజీవితంలో ఉపయోగపడవు. సినిమాలో హీరోయిన్ పదిమంది వస్తాదులను మట్టికరిపించవచ్చు.కాని నిజజీవితంలో అది అసంభవం. అసాధ్యం.

స్కూళ్ళలో నేర్పే కరాటే, స్ట్రీట్ ఫైట్ లో ఉపయోగపడదు.దానికి వేరే టెక్నిక్స్ వాడాలి.స్కూళ్ళలో స్పోర్ట్ కరాటే నేర్పుతారు. అది టోర్నమెంట్ వరకు ఉపయోగ పడుతుంది. కాని స్ట్రీట్ ఫైట్ లో అది ఉపయోగ పడదు.ఎందుకంటే స్ట్రీట్ ఫైట్ లో పరిస్తితులు రింగ్ లో పరిస్తితి లాగా ఉండవు. స్ట్రీట్ ఫైట్ లో పాయింట్ సిస్టం ఉండదు. ఇక్కడ చంపడమో చావడమో రెండే మార్గాలుంటాయి. టోర్నమెంట్ కు వాడే వీరవిద్యలు వేరు. ప్రాక్టికల్ గా ఉపయోగపడే వీరవిద్యలు వేరు.కనుక స్కూళ్ళలో కాలేజీలలో నేర్పించే వీర(రణ)విద్యలు నిత్యజీవితంలో ఉపయోగపడవు అని గ్రహించండి.

నాకు తెలిసిన కొన్ని కేసులలో దారుణ రేప్ కు గురైన వారు మార్షల్ ఆర్ట్స్ వచ్చినవారే. వారు ప్రతిఘటించడం వల్ల నిందితులు ఇంకా రెచ్చిపోయి, ఆ కోపంలో ఇంకా తీవ్రంగా వారిని హింసించారు. కనుక ఏదో రెండు మూడు మూమెంట్స్, నాలుగు పంచేస్ కిక్స్ వచ్చినంత మాత్రాన వీర విద్యలలో ప్రావీణ్యం వచ్చిందని భ్రమించకండి.అది అంత త్వరగా పట్టుబడదు. నిత్యజీవితంలో ఉపయోగపడదు కూడా. తాగిన మత్తు లోనో,డ్రగ్స్ మత్తు లోనో, లేక ఒకరి కంటే ఎక్కువగానో ఉన్న నేరస్తులను ప్రతిఘటించడానికి లేతగా ఉండే అమ్మాయిల శారీరిక బలం ఎంతమాత్రం సరిపోదు.తూతూ మంత్రం గా నేర్చుకునే వీరవిద్యల వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ.  

పోలీస్ వ్యవస్థ నిద్రలేవాలి.పౌరులను భయపెట్టడానికి కాదు,వారిని రక్షించడానికి తామున్నాం అన్న సంగతి తెలుసుకోవాలి. చట్టాలు నిక్కచ్చిగా అమలు జరగాలి.నేరం చెయ్యాలంటే పౌరులలో భయం పెరగాలి. ఈ నేరాలకు అదే అసలైన సొల్యూషన్.అంతేగాని,పదేళ్ళ ఆడపిల్లలు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడమూ,లేకుంటే బురఖాలు ధరించడమూ పరిష్కారాలు కానే కావు.అన్ని సమస్యలూ వ్యక్తి స్థాయిలోనే పౌరులు పరిష్కరించుకుంటే ఇక ప్రభుత్వమూ చట్టాలూ ఎందుకు?

ఇంతకంటే మంచిగా ఉపయోగపడే కిటుకులున్నాయి.సెల్ ఫోన్స్ లో అందుబాటులో ఉన్న అనేక అప్లికేషన్స్ వాడుకొని ఆపదలో ఉన్నపుడు 'హెల్ప్ మి' అన్న సిగ్నల్ కొన్ని నంబర్లకు పంపడమూ,తద్వారా ఆ అమ్మాయి ఎక్కడ ఉందొ తెలుసుకుని వెంటనే అక్కడకు చేరుకునే లాంటి విధానాలు అమలులోకి తేవాలి. లేదా,'SOS' మెసేజి పోలీస్ కంట్రోల్ రూమ్ కు చేరేలా సెల్ ఫోన్స్ లో అప్లికేషన్లు డెవెలప్ చెయ్యాలి. లేదా 'పెప్పర్ స్ప్రే' వంటివి దగ్గర ఉంచుకోవాలి.

క్రైం రేట్ అధికంగా ఉన్న డిల్లీ వంటి నగరాలలో స్పెషల్ పార్టీ పోలీసులు మఫ్టీలో తిరుగుతూ ఆ నేరాలు అధికంగా జరిగే స్థలాల వద్ద కాపు కాసి ఈవ్ టీజర్స్ ని పట్టుకొని చితక్కొట్టి లాకప్ లో వేస్తూ ఉండాలి. వీరిలో లేడీ పోలీసులు కూడా ఉండాలి. వీరికి మాత్రం నిజమైన మార్షల్ ఆర్ట్స్ యొక్క డెడ్లీ టెక్నిక్స్ లో ట్రైనింగ్ ఇవ్వాలి.

అటువంటి పనిచేసే విధానాలు అమలులోకి తెవాలిగాని, ఉపయోగపడని మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని ఆ డొల్లధైర్యంతో వేళగాని వేళలలో తిరిగితే ప్రమాదంలో పడే అవకాశాలే ఎక్కువ.మార్షల్ ఆర్ట్స్ లో చాలా ఎడ్వాన్సుడు స్కిల్ ఉంటెగాని వాటిని స్ట్రీట్ ఫైట్ లో వాడలేము.ఈ విషయం ఒక మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ గా నేను అనుభవ పూర్వకం గా చెప్పగలను.
read more " అమ్మాయిలకు మార్షల్ ఆర్ట్స్ ఉపయోగపడతాయా? "

4, జనవరి 2013, శుక్రవారం

2013 లో మీ రాశిఫలాలు

రాహు,శని,గురువుల గోచారరీత్యా పన్నెండురాశులకు 2013 లో ఏమి జరుగబోతున్నదో చూద్దాం.

మేషరాశి 
ఉన్నట్టుండి ఉత్సాహం పెరుగుతుంది.పనులన్నీ చకచకా కదులుతాయి.విదేశీ ప్రయాణాలు నెరవేరుతాయి.ఇతర మతాలగురించి సంస్కృతుల గురించి తెలుసుకుంటారు.సంఘంతో సంబంధాలు ఎక్కువౌతాయి.వృత్తి ఉద్యోగాలలో ఉన్నతి వస్తుంది.లాభాలు వస్తాయి.మీ ఉన్నతిని చూచి కుళ్ళుకునేవారు ఎక్కువౌతారు.బలమైన శత్రువులు పెరుగుతారు.చెడుస్నేహాలు, అక్రమ సంబంధాలు,దురలవాట్లు రమ్మని ఆహ్వానిస్తాయి.కాని వాటికి దూరంగా ఉంటె మంచిది.లేకపోతే జీవితంలో చెడు జరుగుతుంది.

వృషభరాశి
జూన్ వరకూ ఉన్న ఉత్సాహమూ, ధర్మచింతనా తరువాత తగ్గుతాయి.లైంగిక రోగాలు పట్టుకుంటాయి.పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన పాత బాధలు తిరగబెడతాయి.హటాత్ ఖర్చులు పెరుగుతాయి.ఎంత సంపాదించినా ఎలా ఖర్చు అవుతుందో అర్ధంకాదు.అయితే అదే సమయంలో,ఉద్యోగంలో ఉన్నతి, వ్యాపారంలో పలుకుబడి కొత్త అవకాశాలూ కలుగుతాయి.కానీ అక్కడ కూడా చికాకులుంటాయి.తరచుగా ప్రయాణాలు తప్పవు.

మిథునరాశి 
ఉత్సాహం ఉరకలేస్తుంది.ఆఊపులో అనేక కొత్తసమస్యలలో చిక్కుకుంటారు. బీపీ ఎక్కువౌతుంది.మాటదురుసు వల్ల గొడవలు పెట్టుకుంటారు.ప్రేమవ్యవ హారాలూ,చెడుస్నేహాలు,వివాహేతర అక్రమసంబంధాల వైపు మనసు లాగు తుంది.ఒకేసారి అనేకమందితో ప్రేమవ్యవహారాలు నడిపిస్తారు.తద్వారా చిక్కుల్లో పడక తప్పదు.జిజ్ఞాస అధికమౌతుంది.అనేక కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆధ్యాత్మికపరంగా ఉన్నవారికి మాత్రం దైవసహాయం ఎక్కువగా అందుతుంది.సాధనలో ఉన్నత శిఖరాలు అందుకుంటారు.ఒకేసారి అనేక పనులు పెట్టుకుని సతమతమౌతారు.సంతానం ప్రమాదంలో చిక్కుకుంటుంది.లేదా సంతానానికి ప్రేమవివాహం జరుగుతుంది.

కటకరాశి 
జూన్ తర్వాత ఖర్చులు ఉన్నట్టుండి అధికం అవుతాయి.గృహనిర్మాణం గావిస్తారు. అయితే గృహశాంతి లోపిస్తుంది.మనస్సులో నిగ్రహించుకోలేని ఆలోచనలు పెరుగుతాయి.తద్వారా ఇంటా బయటా చిక్కులు ఎక్కువౌతాయి. వృత్తిలో ఉన్నట్టుండి ఒక పెద్ద సమస్య ఎదురౌతుంది. విలాసజీవితం వైపు మనసు లాగుతుంది.నేరప్రవృత్తి కలుగుతుంది.జీవితం అనేక ఆటుపోట్లకు గురౌతుంది.ఒక క్షణంలో అంతా బాగున్నట్లు,మరుక్షణంలో అంతా అయిపోయినట్లు అనుకుంటారు. 

సింహరాశి
ఊహాశక్తి అధికం అవుతుంది.మొండిధైర్యం పెరుగుతుంది.సంఘంతో కమ్యూనికేషన్ చాలా పెరుగుతుంది.దగ్గర ప్రయాణాలు అధికంగా చేస్తారు.సోదరులకు లాభం కలుగుతుంది,అదే సమయంలో వారికి ప్రమాదమూ కలుగుతుంది.ధైర్యం పెరుగుతుంది. ఆత్మ విశ్వాసంతో పనులు సాధిస్తారు. లాభాలు కలుగుతాయి.ఆధ్యాత్మిక చింతన అధికం అవుతుంది.ఈ రాశివారు కొందరు ఏక్సిడెంట్ వల్ల గాని,దీర్ఘవ్యాధి వల్లగాని మరణిస్తారు.

కన్యారాశి
వాగుడు అధికం అవుతుంది.దానివల్ల సమస్యలలో చిక్కుకుంటారు. కళ్ళవ్యాధులూ,దీర్ఘవ్యాధులూ పీడిస్తాయి.జూన్ తర్వాత వృత్తిలో పురోగతి ఉంటుంది.పలుకుబడి పెరుగుతుంది.నూతనోత్సాహం వస్తుంది.వివాహేతర సంబంధాలు పెరుగుతాయి.లేదా కుటుంబంలో ఉన్న అలాంటి ఒక సమస్య చాలా చికాకు కలిగిస్తుంది.తద్వారా కుటుంబంలో గొడవలు వస్తాయి. కుటుంబపరమైన జల్సాలకు ఖర్చు చేస్తారు.

తులారాశి
ప్రపంచమంతా వెలుగుతో నిండి మహోత్సాహంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ప్లేబాయ్ లక్షణాలు ఎక్కువౌతాయి.వృద్ధులు కూడా కుర్రదుస్తులు ధరించి చలాకీగా తిరుగుతారు.ప్రేమ వ్యవహారాలు ఊపందుకుంటాయి. నాయకులుగా,యూనియన్ లీడర్లుగా,కళాకారులుగా రాణిస్తారు.ఆధ్యాత్మిక సాధకులకు ఊహాతీతమైన అనుభవాలు కలుగుతాయి.జీవితభాగస్వామి సాధింపు ఎక్కువౌతుంది.అగ్నిప్రమాదానికి గాని,జ్వరాలకు గాని లోనౌతారు.యాక్సిడెంట్ జరుగవచ్చు.

వృశ్చికరాశి 
చెప్పలేని భావోద్వేగాలకు గురవుతారు.ఆస్తులు కొనడానికి, పిచ్చిఖర్చులకు, విలాసాలకు విపరీతంగా డబ్బు ఖర్చు అవుతుంది.కొందరిలో నేరప్రవృత్తి, హింసాప్రవృత్తి,మొండితనం తలెత్తుతాయి.జల్సాలకోసం ఖర్చులు పెడతారు. రహస్యనేరాలు చేస్తారు.అవకాశాలు జారవిడుచుకుంటారు.కుటుంబ పరిస్తితులు,సంతాన సమస్యలతో మానసిక వేదన అధికమౌతుంది.రహస్య సంబంధాలు కలుగుతాయి.ప్రమాదంలో చిక్కుకుని,ఆస్పత్రి పాలౌతారు. ఆధ్యాత్మిక సాధనలు(చెయ్యగలిగితే)ఫలిస్తాయి.

ధనూరాశి 
విదేశీ గమనం సఫలమౌతుంది.సమాజ సంబంధాలు మెరుగౌతాయి.వాయిదా పడుతున్న వివాహాలు జరుగుతాయి.ఎప్పటినుంచో ఆగిపోయిన డబ్బు హటాత్తుగా చేతికందుతుంది.పీటముడులు విడిపోతాయి.ఆస్తిపాస్తులు కలిసొస్తాయి.అయితే దీనివల్ల చెడుస్నేహాలు కూడా ఎక్కువై తద్వారా జీవితానికి తీవ్రనష్టం కలుగుతుంది.భార్యాదాసు లౌతారు.స్నేహితులు  ప్రమాదంలో చిక్కుకుంటారు.లేదా మరణిస్తారు. సోదరునికి కష్టకాలం మొదలౌతుంది. 

మకరరాశి
పట్టుదలలు పెరుగుతాయి.తద్వారా గృహశాంతి,సమాజశాంతి కరువౌతుంది. జీర్ణకోశ వ్యాధులు బాధపెడతాయి.శత్రువులను ఓడిస్తారు.ఉద్యోగ పదోన్నతి కలుగుతుంది.వృత్తిపరంగా ఊహించని మార్పులొస్తాయి.విపరీత లాభాలు కలుగుతాయి.సమాజంలో గౌరవం ఇనుమడిస్తుంది. సరదాలు, విలాసాలు, ప్రయాణాలు ఎక్కువౌతాయి.

కుంభరాశి
ధైర్యం బాగా పెరుగుతుంది.సోదరులకు స్థిరత్వం కలుగుతుంది. ఆద్యాత్మికచింతన పెరుగుతుంది.సంతానం విదేశాలకు వెళతారు. దూర ప్రయాణాలు,తీర్దాటనలు చేస్తారు.మహనీయుల దర్శనం అనుగ్రహం కలుగుతుంది.శక్తిపూజలు ఉపాసనలు చేస్తారు.కుటుంబంలో పెద్దలు ఊహించని పరిస్తితుల్లో గతిస్తారు.

మీనరాశి
పరుషవాక్కు కలుగుతుంది.ముఖానికి దెబ్బలు తగులుతాయి.మనస్సు ద్వైదీభావంతో సతమతమౌతుంది.కానీ చివరకు ధర్మం వైపే మొగ్గుతారు.కుటుంబసౌఖ్యం బాగుంటుంది. ఎక్కువ మొత్తంలో డబ్బు చేతికందుతుంది.మంత్రతంత్ర రహస్యసాధనలు ఫలిస్తాయి.అతీతశక్తులు కలుగుతాయి.కోర్టు కేసులలో జయం లభిస్తుంది. మానసిక వైద్యులకు, పిచ్చి వైద్యులకు కలిసొస్తుంది.
read more " 2013 లో మీ రాశిఫలాలు "

3, జనవరి 2013, గురువారం

రాహుకేతువుల రాశిమార్పు - 2013 ఫలితాలు

డిసెంబర్ 24 ప్రాంతంలో రాహుకేతువులు రాశులు మారినారు.రాహువు వృశ్చికంలో నుంచి తులలో ప్రవేశించాడు.కేతువు వృషభం నుంచి మేషంలోకి ప్రవేశించాడు.గత ఏడాదిన్నరగా వారు నీచస్తితిలో ఉండి ప్రపంచవ్యాప్తంగా ఎంతో విధ్వంసాన్ని కలిగించారు.

విధ్వంసాన్ని రాహుకేతువులు కలిగించారు అనడం కంటే,భయంకరమైన చెడుకర్మను పోగుచేసుకున్న ప్రజలకు వారివారి కర్మానుసారం తగిన ఫలితాలిచ్చారు అనడం సరిగ్గా ఉంటుంది.గ్రహాలు మనకు మిత్రులూ కావు, శత్రులూ కావు.అవి దైవస్వరూపాలు.ఎవరెవరి కర్మానుసారం వారికీ ఆయా ఫలితాలనిస్తుంటాయి.

గత ఏడాదిన్నరలో ఎంతోమంది ప్రముఖులు పరలోకానికి ప్రయాణం కడతారని ముందే వ్రాశాను.అలా పోయిన వారి లిస్టు చూస్తె ఒక పెద్ద పేజీకి వచ్చేలా ఉంది.ఎన్నో నీచమైన ఘోరమైన సంఘటనలు జరుగుతాయని కూడా ముందే వ్రాశాను.అవీ జరిగాయి.కావలసిన వారు 2011 లో రాహుకేతువులు రాశులు మారిన సమయంలో వ్రాసిన పోస్ట్ లు చదవవచ్చు.

ఇప్పుడు మళ్ళీ వారు రాశులు మారినారు.డిసెంబర్ 2012 నుండి జూలై 2014 వరకూ మారిన స్తితిలో కొత్త రాశులలో ఉంటారు.కనుక ప్రపంచవ్యాప్తంగా అనేక కొత్త సంఘటనలు మళ్ళీ జరుగుతాయి.అవి ఎలా ఉండబోతున్నాయో చూద్దాం.

Coming events cast their shadows అంటారు.రాహువు 1-12-2012 నుంచీ సున్నా డిగ్రీలలో ప్రవేశించాడు.అంటే సంధికాల ప్రవేశం జరిగింది.ఇక అక్కణ్ణించి అనేక చెడు సంఘటనలు మొదలయ్యాయి.మీరెవరైనా సూక్ష్మంగా గమనిస్తే ఆ రోజునించీ అనేక చెడువార్తలను ప్రపంచవ్యాప్తంగానూ మన దేశంలోనూ కూడా జరిగినట్లుగా చూడవచ్చు.

తులారాశి శుక్రస్థానం,అక్కడ ఇప్పటికే చాలా బలంగా ఉన్న శనీశ్వరుడు కొలువై ఉన్నాడు.అక్కడికి ఇప్పుడు రాహువు కూడా వచ్చి చేరుకున్నాడు. కేతువు కుజునిదైన మేషంలో ప్రవేశించాడు. దీనిఫలితాలు ఊహించడం కష్టమేమీ కాదు.శుక్రుని ఇంటిలో రాహువూ,బలమైన శనీ తిష్ట వెయ్యడం పరికిస్తే భవిష్యత్తు చాలా స్పష్టంగా కనిపిస్తుంది.

కొంతమంది నన్ను అడిగారు.మన దేశంలో రేప్ కేసులు కొన్ని దశాబ్దాలనుంచీ జరుగుతూనే ఉన్నాయి.ఇంతకంటే ఇంకా ఘోరమైన కేసులు కూడా జరిగాయి.మరి ఇప్పుడు మాత్రమె, డిల్లీ రేప్ కేసుకు ఇంత ప్రాచుర్యం ఎందుకు వచ్చింది అని? అంతేకాదు,దాని తర్వాత కూడా వరుసగా ప్రతి రాష్ట్రం లోనూ రేప్ కేసులు నమోదు అవుతున్నాయి.ఉన్నట్టుండి ఫోకస్ దీనిమీదకు ఎందుకు వచ్చింది? ఏమిటిది?

దీనికి ఒకటే కారణం ఉన్నది.రాహువు,శుక్రుడు,శని కలిస్తే ఇలా జరగక ఇంకెలా జరుగుతుంది? రాహువు వృశ్చిక తులారాశుల సంధిలో ప్రవేశించగానే ఇలాంటి ఫలితాలు చూపడం మొదలైంది. దీనిని సంధ్యాప్రభావం అంటారు.స్త్రీల మీద దాడులు,లైంగిక నేరాలు,వ్యభిచారం ఊపందుకోవడం,అక్రమ సంబంధాలు మితిమీరడం ఇలా ఎన్నో ఉన్నట్టుండి వెలుగులోకి వస్తున్నాయి.డిసెంబర్ 24 ప్రాంతంలో రాహువు పూర్తిగా తులారాశిలో ప్రవేశించాడు.కనుక ఇక ఇలాంటి సంఘటనలు స్థిరంగా ఇంకా ఇంకా జరుగుతాయి.

ఈ గ్రహమార్పు వల్ల ఇంకా ఏ రకమైన ఫలితాలు జరుగవచ్చో చూద్దామా?

>>వాయుయాన ప్రమాదాలు,జలయాన ప్రమాదాలు అధికం అవుతాయి.మొన్న డిసెంబర్ 24,25,26 తేదీలలో రాహువు రాశి మారినప్పుడు అనేకమంది జారిపడటం,వాహనాల యాక్సిడెంట్లు కావడం,దెబ్బలు తగలడం,అనారోగ్యం పాలుగావడం జరిగాయి.ఈ సంఘటనలే నిదర్శనాలు.

>>శనీశ్వరుని ఉచ్చస్తితి వల్ల ప్రజాఉద్యమాలు ఊపందుకుంటాయి. ఇంతకు ముందు ఎన్నో కేసులు జరిగినప్పటికీ డిల్లీ రేప్ కేసుకు మాత్రమె ఇంతటి ప్రజాస్పందన రావడం,ఇంత ఉద్యమం జరగడం వెనుక శనీశ్వరుని ఉచ్చస్తితి యొక్క బలీయమైన ప్రభావం ఉన్నది.

>>లైంగిక నేరాలు,మహిళలపైన దాడులు ఇంకా అధికం అవుతాయి. 

>>సినిమారంగంలో కళారంగంలో పెద్దలు గతిస్తారు. ఆ రంగంలో అనుకోకుండా కొన్ని యాక్సిడెంట్లు జరిగి కళాకారులు ఇతరులు గాయపడతారు.ఆడనటులు మోసానికి,ద్రోహానికి గురౌతారు.

>>మేషరాశి యూరోప్ దేశాలకు, ముఖ్యంగా బ్రిటన్ కు సూచిక.కనుక ఆ దేశాలలో ఘోరాలు,ప్రకృతి వైపరీత్యాలు,దుస్సంఘటనలు,హటాత్ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి.గ్రహద్రుష్టి ఆ దేశాలమీద పడుతుంది.ముస్లిం ఉగ్రవాదులు ఈ దేశాలను తమ కార్యకలాపాలకు స్థావరాలుగా మార్చుకుంటారు.

>>తులారాశి ముస్లిం దేశాలకు సూచిక.కనుక ముస్లిం తీవ్రవాదం మళ్ళీ నిద్రలేస్తుంది.దీనివల్ల యూరోప్ లోనూ మన దేశంలోనూ కూడా దాడులు,అసాంఘిక సంఘటనలు పెరుగుతాయి.ప్రభుత్వమూ ప్రజలూ అప్రమత్తంగా ఉండాలి. 

>>పాకిస్తాన్ బలం పుంజుకోవడం వల్ల, మన దేశంలో వారి కుట్రలు మళ్ళీ ఊపందుకుంటాయి.పాకిస్తాన్ అభిమానులూ క్రియాశీలకులౌతారు.

>>ప్రస్తుతం రాహువు గురునక్షత్రంలో సంచరిస్తున్నందువల్ల, గురువుల ప్రతిష్ట మసకబారుతుంది.సుభాష్ పత్రీ ఉదంతం దీనికి నిదర్శనం.అందులోనూ అమ్మాయిల పాత్ర ఉందని ఆరోపణలు రావడం వెనుక రాహువు శని శుక్రుల పాత్ర పోషణ అమోఘం.

>>ఆర్ధిక నేరాలు,మోసాలు,బ్లాక్ మెయిలింగ్,కిడ్నాపులు  వెలుగుచూస్తాయి.రవాణా రంగంలో ప్రమాదాలు జరుగుతాయి.

>>రాహువు నడుస్తున్న వాహనాలకు సూచకుడు.కనుక వాహన ప్రమాదాలు ఎక్కువ అవుతాయి. అతడు పెట్రో కెమికల్ ఉత్పత్తులకూ సూచకుడే.కనుక పేలుళ్లు,అగ్నిప్రమాదాలూ అధికం అవుతాయి.

>>దేశం ఉలిక్కిపడేలా ఊహించని ఘోరాలు కొన్ని పశ్చిమదిక్కున ఉన్న విలాసనగరంలో జరుగుతాయి.

ఇతరులను హింసపెట్టినవారూ,చెడు పనులు చేసినవారూ,అడివిలో దాక్కున్నా ప్రమాదం తప్పించుకోలేరు.అలాగే మంచివారు,ఇతరులకు ఉపకారం చేసేవారు సముద్రం అడుగున దాక్కున్నా మంచిఫలితాలను తప్పించుకోలేరు.వారి కర్మల ఫలితాలు అక్కడికే డెలివరీ చెయ్యబడతాయి అనేది వాస్తవం.

ఈ ఒకటిన్నర ఏడాది కాలంలో ఆయా సంఘటనలు జరుగబోయే ముందుగా వాటి గురించి సూచనాప్రాయంగా వ్రాస్తాను.
read more " రాహుకేతువుల రాశిమార్పు - 2013 ఫలితాలు "