“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

12, జనవరి 2013, శనివారం

ఒక దివ్యజ్యోతి వెలిగి నేటికి 150 ఏళ్ళు

ఇంగ్లీషుతేదీల ప్రకారం వివేకానందస్వామి జన్మించి నేటికి 150 ఏళ్ళు పూర్తయ్యాయి.ఈ నూటఏభై ఏళ్ళుగా ఆయన చెప్పినదాన్ని మనం ఎంతవరకూ అర్ధం చేసుకున్నాం, ఎంతవరకూ ఆచరిస్తున్నాం అని ఇంకోసారి ప్రశ్నించుకోవలసిన రోజు ఈరోజు.

అసలెందుకు ప్రశ్నించుకోవాలి?ఎందుకు ఆయన చెప్పినది వినాలి?ఎందుకు ఆచరించాలి?ఏం ఆమాత్రం మనకు తెలీదా?అని ప్రశ్నించుకుంటే కొన్నిజవాబులోస్తాయి.

తరతరాలుగా మన జాతి మహర్షుల ప్రభోధాలను ఆచరిస్తూ ధర్మమార్గంలో నడుస్తున్నజాతి.మనం ధర్మమార్గాన్ని తప్పనంతవరకూ మన దేశం అజేయంగానే ఉన్నది.మన జీవితాలు నీతివంతములుగానే ఉన్నాయి.మన పూర్వీకుల జన్మలు ధన్యత్వాన్ని సంతరించుకుంటూనే ఉన్నాయి. మహర్షుల బోధను ఎగతాళి చెయ్యడం, ఆచరించకపోవడం మొదలైనప్పటి నుండే మనకు అధోగతి మొదలైంది.

చదరంగం ఆడేవాడికంటే బయటనుంచి చూచేవాడికి సరైన ఎత్తులు తోస్తాయి.నిత్యం రొచ్చు జీవితంలో పడి కొట్టుకుంటున్న వానికంటే, దాని బయటనుంచి చూచేవానికే సరియైన దారి కనిపిస్తుంది.మహర్షులు మహనీయులు అలాంటివారే.అందుకే వారి బోధలను మనం శిరస్సున దాల్చాలి.జీవితంలో ఆచరించాలి.ఇంద్రియభోగాలే పరమావదులైన మనది హ్రస్వ దృష్టి.కాని వివేకానందాది మహానీయులది అత్యంత దూరదృష్టి.కనుక వారి బోధనలు మనకు ఆచరణీయాలు.

మహర్షులు ఆయా కాల పరిస్తితులను బట్టి అప్పటికి తగినటువంటి బోధలు చేస్తారు.కాని అవి ధర్మానుసారమే ఉంటాయి.ధర్మం తప్పకుండా కాలాన్ని బట్టి మార్గదర్శనం చెయ్యడమే ఋషిలక్షణం.అందుకే మనకు అనేకరకాల స్మృతులు ధర్మశాస్త్రాలు వచ్చాయి.అవన్నీ ఆయా కాలాలకు తగినవి. వాటిలో కొన్ని ఈ కాలానికి కూడా పనికొస్తాయి.కానీ అన్నీ పనికిరావు. మన భారతీయమూలాలు చెడకుండా,సనాతన ధర్మపు పునాదులపైన నవీన కాలానికి తగిన దారిచూపే మహర్షులు నేడు కావాలి.వివేకానందస్వామి అటువంటి మహర్షి.అందుకే ఆయన చూపిన బాటలో నడవడం మన ధర్మమే కాదు మన విధి కూడా.

ఆయన పుట్టి నూటయాభై ఏళ్ళు గడిచినాయని పోస్టల్ స్తాంపులు ముద్రించి చేతులు దులుపుకోవడం, వేదికలెక్కి ఉపన్యాసాలివ్వడం వంటి నాటకపు చేష్టలవల్ల ఏమీ ఒరగదు.ఆయన చెప్పిన బోధలను నిత్యజీవితంలో ఆచరిస్తేనే ఆయనకు మనం నిజమైన గౌరవం ఇచ్చినట్లు.లేకుంటే ఈ ఉత్సవాలన్నీ ఆత్మవంచనలే తప్ప ఇంకేమీ కావు.అందుకే అలాంటి సభలకు దేనికీ నేను వెళ్ళను.రాజకీయ నాయకులు ఎవరైనా (ఎక్కడో నరేంద్రమోడీ వంటి ఒకరిద్దరు తప్ప) వివేకానంద స్వామిని ఉటంకిస్తూ మాట్లాడితే నాకు నవ్వే కాదు చిర్రెత్తుకొస్తుంది. దయ్యాలు వేదాలు వల్లించినట్లు, వివేకానందుని వంటి పవిత్రాత్ముని కనీసం స్మరించే అర్హత కూడా నేటి రాజకీయులకు లేదు.

అసలాయన్ని మనం ఎందుకు గౌరవించాలి?ఏమిటాయన ప్రత్యేకత?అని కొందరికి అనుమానాలోస్తాయి.ఆయన్ను గౌరవించడం అంటే భారతదేశ ఆత్మను గౌరవించడమే. తరతరాల ఋషి సంస్కృతిని గౌరవించడమే.మన దేశపు మూలాలను మన సనాతన ధర్మాన్నీ గౌరవించడమే.మనమలా గౌరవించడం వల్ల ఆయనకు ఒరిగేదేమీ లేదు.మానవ లోకపు కుళ్ళుకు అందనంత ఎంతో ఎత్తులో తనదైన తేజోమయలోకంలో ఆయన జ్ఞానమూర్తిగా నిలిచి ఉన్నాడు.మనం ఆయన్ను గౌరవించినా విమర్శించినా ఆయనకు ఒరిగేదీలేదు తరిగేదీ లేదు. కాని ఆయనను అనుసరించడం వల్ల మన జీవితాలే ధన్యత్వాన్ని సంతరించుకుంటాయి.దిక్కూ మొక్కూ లేకుండా నడుస్తున్న మన జీవితాలకు ఒక మహోన్నతమైన గమ్యం అప్పుడే ఏర్పడుతుంది. వివేకానందుని చదవడం అనుసరించడం వల్ల మనకే లాభం కలుగుతుంది. ఆయనకు కాదు.దీనిని సరిగ్గా అర్ధం చేసుకోవాలి.

వివేకానందుని బోధలలో సంకుచిత స్వభావం లేదు.ఆయన చెప్పినదంతా విశ్వజనీనమైన సనాతన ధర్మపు పునాదిపైనే నిర్మితమై ఉన్నది.అంతేగాక నేటి సమాజానికి కావలసిన పరిష్కారాలు ఆయన అప్పుడే అందించాడు. ఆచరించడమే తరువాయి.కాని ఆ పని చేసేవారేరీ?

నేడు కొంతమంది స్వామీజీలు 'వినాయకుణ్ణి పూజించవద్దు. శివున్ని పూజించవద్దు.విష్ణు స్మరణే చెయ్యాలి. విష్ణువే దేవుడు శివుడు కాదు.' మొదలైన బూజుపట్టిన మధ్య యుగపు భావజాలాన్ని సమాజం నెత్తిన మళ్ళీ రుద్దుతున్నారు. ఇంకొందరేమో 'కృష్ణుడే నిజమైన దేవుడు. విష్ణువు కూడా కృష్ణుని అవతారమే. ఇక శివుడూ మొదలైన దేవతలు కృష్ణునితో పోల్చుకుంటే అసలు దేవతలే కారు'.అంటూ ఇంకోరకమైన విషాన్ని ఎక్కిస్తున్నారు.వీరందరూ వేదాలకూ గీతకూ వక్రభాష్యాలు బాగా చెప్పగలరు.వినేవారికి బ్రెయిన్వాష్ చేసి బాగా నమ్మించగలరు. చాలామంది బాగా చదువుకున్న ప్రజలుకూడా ఇలాంటి మరుగుజ్జు స్వామీజీల మాటలు నమ్మి మధ్యయుగాల నాటి చీకటిలోకి మళ్ళీ ప్రయాణం చేస్తున్నారు.వీరి చెత్తబోధలతో పోల్చుకుంటే వివేకానందస్వామి వంటి నిజమైన మహనీయులు చెప్పిన బోధలు ఎంత ఉన్నతమైనవో ఎంత సార్వజనీనమైనవో మనం తెలుసుకోవచ్చు.

ఆయన ఉన్న సమయంలో భారతీయ సమాజం ఘోరమైన తమస్సులో మునిగి ఉన్నది.దానినుంచి రజస్సులోకి ముందుగా ఎదగాలని ఆయన ఆశించాడు. అది ఇప్పుడు నేరవేరుతున్నది.ఇప్పుడు మన సమాజం తీవ్రమైన రజోగుణంలో మునిగి ఉన్నది. బహుశా ఇంకో రెండు వందల ఏళ్ళ తర్వాత మన సమాజంలో మళ్ళీ సాత్వికత వస్తుందేమో? దాని తర్వాత ఇంకో రెండు వందల ఏళ్ళకు వివేకానందుని వంటి మహర్షులు ఆశించిన దైవత్వం అనేది మానవునిలో కనిపించవచ్చు. అప్పటివరకూ దారి తప్పకుండా తరతరాలుగా ఆయన చూపిన సరైన దారిలో నడవటమే మనం చెయ్యగలిగింది. అంటే మనం దారిలో నడవటమే గాక,మన పిల్లలకు కూడా సరైన పునాదులు వేసి,అలాఅలా ముందుముందు తరాలవారు కూడా ఇదే దారిలో నడిచేలా చెయ్యాలి. 

అప్పుడే పరిణామ క్రమంలో తరానికీ తరానికీ ధార్మికమైన ఎదుగుదల కనిపిస్తుంది.ఋషికుటుంబ వ్యవస్థ ఇలాగే నడుస్తుంది.దీనికి వ్యతిరేకంగా తరతరానికీ ఇంకా ఇంద్రియభోగాలలో కూరుకుపోవడం రాక్షస విధానం. అది దైవత్వం వైపు దారి తియ్యదు.ఇంకాఇంకా ఘోరతమస్సు వైపు తీసుకెళుతుంది.ప్రస్తుతం మనం తరతరానికీ ఆర్ధికంగా ఎదుగుతున్నామా లేదా అని మాత్రమె ఆలోచిస్తున్నాం.ప్లాన్ చేస్తున్నాం. అదొక్కటే చాలదు.ధార్మికంగా ఒక తరంనుంచి ఇంకోతరానికి పైమేట్టుకు ఎక్కామా లేక దిగజారామా అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఎందుకంటే, ఈ మాటలు ఇప్పుడు నవ్వులాటగా తోచవచ్చు.కానీ ఈ మాటల అర్ధం లాంగ్ రన్ లో మాత్రమె అర్ధమౌతుంది.

నేను ఆధ్యాత్మికంగా ఒక స్థాయికి ఎదిగినప్పుడు నా పిల్లలు అంతకంటే ఇంకొక మెట్టు పై స్థాయిని అందుకున్నప్పుడే ఒక మనిషిగా నా జన్మకు సాఫల్యత.అంతేగాని నేను ఉద్యోగంలో చేరిన తర్వాత తాగడం నేర్చుకుంటే నా పిల్లలు కాలేజీ స్థాయిలోనే తాగడం నేర్చుకుంటుంటే చూచి ఆనందించడమూ ప్రోత్సహించడమూ కాదు.పరిణామక్రమంలో ఒక తరం దాని ముందుతరం కంటే పైమెట్టుకి ఎదగాలి కాని దిగజారకూడదు అన్నదే ఋషిసంస్కృతి.పైకి ఎదగడం అంటే ఆర్ధికపరంగా మాత్రమె కాదు.ధార్మికంగా ఆధ్యాత్మికంగా ఎదగాలి.అలాంటి ట్రైనింగ్ మీ పిల్లలకు ఇవ్వడం మీ వల్ల కాకపోతే ఎన్ని కోట్లు సంపాదించినా మీజన్మ వృధా అన్న విషయం గ్రహించండి. 

మతం అనేది ఎప్పుడూ వ్యక్తి నిర్మాణానికే ప్రాధాన్యత నిస్తుంది. ధర్మాన్ని వ్యక్తి స్థాయిలో ఆచరింప చెయ్యడమే దాని లక్ష్యం. అయితే మిగతా సమాజం అంతా అధర్మం వైపు వెళుతుంటే తానొక్కడే ధర్మాన్ని అంటి పెట్టుకుని ఉండాలంటే దానికి ఎంతో ధైర్యమూ త్యాగమూ కావాలి.తనంతట తానుగా సుఖాలను వదులుకునే త్యాగం ఉండాలి.అలాంటి లక్షణాలు ఉన్న మనుషులవల్లె ఏదైనా మహత్తర కార్యాలు సాధింప బడతాయి. అంతేగాని కాకమ్మ కబుర్లు చెప్పి ఏదోరకంగా పబ్బం గడుపుకునేవారు మతపరంగా ఏమీ సాధించలేరు.వారు లౌకికంగా ఎదగవచ్చు.కోట్లు సంపాదించవచ్చు. కాని ధార్మికంగా మరుగుజ్జులుగానే ఉండవలసి వస్తుంది.రాక్షసులు కూడా ఎంతో సంపదనూ విలాసాలనూ అనుభవించినవారే.రాజ్యాలు నడిపిన వారే. కాని వారు దైవత్వంవైపు వెళ్ళేదారిలో నడిచినవారు కారు. ప్రస్తుత సమాజంలో కూడా రాక్షస ప్రవృత్తి అధికంగా ఉన్నవారే ఎక్కువగా ఉన్నారు.

ఒక ఉదాహరణ ఇస్తాను.ఒక రైల్వే స్టేషన్ లోనో,ఒక సినిమా హాల్ లోనో, ఒక షాపింగ్ మాల్ లోనో, లేక ఏదో ఇంకో చోటో ఎక్కడో ఒక క్యూలో మనం నిలబడి ఉన్నాం అనుకుందాం.మన కంటే ముందు కొందరు ఎగబడి క్యూని ధిక్కరించి ముందుకు పోయి టికెట్లో ఇంకోటో సాధించుకొని హాయిగా ముందుకెళ్ళి పోతుంటారు.వారిని చూచి మనమూ ఎగబడి వారిలాగే క్యూని ధిక్కరించి వెళ్ళడం ఒక రకం.ప్రస్తుతం అందరూ అదే రకపు మనస్తత్వం లో ఉన్నారు. ఇది జంతు మనస్తత్వం. ఒక జంతువును చూచి ఇంకో జంతువూ ఇలాగె ఎగబడుతుంది.కానీ,మనకు టికెట్ దొరక్కపోయినా,రైలో బస్సో లేకపోతే ఇంకోటో మనకు తప్పిపోయినా సరే,నిక్కచ్చిగా క్యూలోనే వెళ్లి ప్రయత్నించడం ఒక రకం. కాని దీనికి చాలా ధైర్యమూ,త్యాగబుద్ధీ కావాలి. ఇదే అసలైన మతం,అసలైన ధర్మం అని నేనంటాను.ఇది నేననే మాట కాదు.మహర్షులందరూ చెప్పినది కూడా ఇదే.నిత్యజీవితంలో చిన్నచిన్న విషయాలలో కూడా మన ధర్మాచరణ ప్రతిఫలించాలి.అప్పుడే మనం సత్యమార్గంలో నడుస్తున్నట్లు లెక్క.మాటల్లో నీతులు చెబుతూ చేతల్లో రాక్షసుల మాదిరి ఉంటె అది ధర్మం అవ్వదు. కాని మన ప్రస్తుత సమాజంలో అదే నడుస్తున్నది. 

నిత్యజీవితంలో మనకు ఎదురయ్యే ఒక చిన్న ఉదాహరణ నేను ఇచ్చాను.ఇలాంటివి తెల్లారి లేస్తే కొన్ని వందలు మనం ప్రతిచోటా చూడవచ్చు.అక్కడి దాకా ఎందుకు? తిరుపతి పుణ్య క్షేతానికి వెళ్లి, ఒక గంట సేపు ఆగలేక,ఎవరికో ఒకరికి ఒక వెయ్యి ఇచ్చి ఎదో లాగ దర్శనం చేసుకుందాం అని ప్రయత్నించే వారు లక్షలాది మంది ఉన్నారు.మరి వారు ఎలాంటి ధర్మాన్ని ఆచరిస్తున్నట్లో వారే ఆత్మవిమర్శ చేసుకోవాలి.నేను 'వెయ్యి' అని వ్రాశాను. వచ్చిన వెంటనే ఒక్క గంటలో దర్శనం చేయిస్తే 'లక్ష' ఇచ్చిన వారూ తీసుకున్న వారూ నాకు పర్సనల్ గా తెలుసు. ధర్మ స్వరూపుడైన భగవంతుని దగ్గరకు వెళ్లి కూడా అధర్మాచరణలో ఉంటె ఇక అదేంటి? దీన్ని ఏమనాలి? మీరే చెప్పండి.

ఈ రకంగా న్యాయమూ ధర్మమూ అని ఆలోచిస్తే ఇక అయినట్లే.మనం చూస్తూ కూచుంటే మనకంటే ముందు ఎంతోమంది వెళ్లి పోతారు.వారికంటే ముందే మనం పరిగెత్తాలి. లాభాన్ని చేజిక్కించుకోవాలి. అన్న భావజాలమే నేటి సమాజపు దుస్తితికి కారణం.ఇది జంతువుయొక్క స్థాయి. ఒక బిస్కెట్ ఎదురుగా కనిపిస్తుంటే దాన్ని అందుకోవడానికి ఒకదానికంటే ముందు ఇంకొకటి పరిగేట్ట్టే కుక్కల్లా ఉంది మన పరిస్తితి.ఈ స్థాయిలో ఉన్నంతకాలం దైవత్వాన్ని మనం ఎలా అందుకోగలం?మనం ఎన్ని బొట్లు పెట్టుకున్నా,ఎన్ని కూచిపూడి డాన్సులు నేర్చుకున్నా,ఎన్ని కీర్తనలు పాడినా,ఎన్ని గుళ్ళూగోపురాలూ దర్శించినా,ఎన్ని ఉగాది పచ్చళ్ళు తిన్నా,ఎన్ని పండగలు ఆర్భాటంగా చేసుకున్నా నిత్యజీవితంలో ధర్మాన్ని ఆచరించనంతవరకూ మనం హిందువులం కాము.సనాతనధర్మాన్ని అనుసరిస్తున్న వారమూ కాము. మరి మనం ఎవరం? అంటే, ఉత్త పగటి వేషగాళ్ళం మాత్రమె.

ఇంకొక చిన్న ఉదాహరణ ఇస్తాను. 'బ్రాహ్మణో  సురా పీత్వా బ్రాహ్మణత్వాత్ విముచ్యతే' బ్రాహ్మణుడు సురాపానం చేస్తే ఆతన్ని బ్రాహ్మణత్వం వదిలి పోతుంది'.అని మనువు చెప్పాడు.మరి ఈరోజుల్లో బ్రాహ్మణ కులంలో పుట్టిన ఎందరు పైశ్లోకాన్ని బట్టి బ్రాహ్మణులు అవుతారో మీరే ఆలోచించండి. ఎందుకు చెబుతున్నానంటే,మనకు తోచిన తీరులో మనం ఉంటూ,మనం సరైన దారిలోనే ఉన్నాం అనుకోడం పెద్ద భ్రమా ఆత్మవంచనా మాత్రమె. మరి సరియైన దారి ఏది? అంటే, వివేకానందాది నవీన మహర్షులు చూపిన మార్గమే మనకు శిరోధార్యం.మనకు తెలీనప్పుడు తెలిసినవారు చెప్పినది వినాలి.లేకుంటే మన గతి అధోగతే.పైన బ్రాహ్మణులను మాత్రమె సూచిస్తూ ఒక శ్లోకం ఉదహరించాను.ఇదే మిగతా కులాలవారికీ వర్తిస్తుంది.ఎవరి పరిధులలో వారుండక పోవడమే సమాజంలోని సమస్త అరిష్టాలకూ కారణం. న్యాయాన్నీ ధర్మాన్నీ నడిపించవలసిన వారే అధర్మవర్తనులు కావడమే దీనికి మూలం.ఎవరి ధర్మాన్ని వారు మరచి ఏదో రకంగా దోచుకుందాం, విలాసాలు అనుభవిద్దాం అనుకోవడమే సర్వారిష్టాలకూ మూలం. 

ఈ రకంగా ఎన్ని చెప్పుకున్నా ఎన్ని చర్చించినా చివరికి ఎవరి కుటుంబంలో వారు  ప్రతి క్షణమూ ధర్మాన్ని ఆచరిస్తున్నారా లేదా, తమ పిల్లల చేత ఆచరింపచేస్తున్నారా లేదా అన్నదే ప్రధానం.అదెలా చెయ్యాలి అన్న విషయం తెలియాలంటే ముందుగా వివేకానందస్వామి వంటి నిస్వార్ధపూరితులైన నిజమైన మహనీయులు చెప్పిన విషయాలు గ్రహించాలి. మన నిత్యజీవితాలలో వాటిని ఆచరించాలి.అలా చెయ్యాలంటే కొన్ని త్యాగాలకు వాలంటరీగా మనం సిద్ధపడాలి.

'5000 సంవత్సరాలకు సరిపడా సందేశాన్ని లోకానికి ఇచ్చి వెళుతున్నాను.'అని వివేకానందుడే అన్నాడు.కాని అర్ధం చేసుకునే వారూ ఆచరించేవారూ ఏరీ? కనీసం మీరన్నా ఆ ప్రయత్నం చేస్తారా?