“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

4, జనవరి 2013, శుక్రవారం

2013 లో మీ రాశిఫలాలు

రాహు,శని,గురువుల గోచారరీత్యా పన్నెండురాశులకు 2013 లో ఏమి జరుగబోతున్నదో చూద్దాం.

మేషరాశి 
ఉన్నట్టుండి ఉత్సాహం పెరుగుతుంది.పనులన్నీ చకచకా కదులుతాయి.విదేశీ ప్రయాణాలు నెరవేరుతాయి.ఇతర మతాలగురించి సంస్కృతుల గురించి తెలుసుకుంటారు.సంఘంతో సంబంధాలు ఎక్కువౌతాయి.వృత్తి ఉద్యోగాలలో ఉన్నతి వస్తుంది.లాభాలు వస్తాయి.మీ ఉన్నతిని చూచి కుళ్ళుకునేవారు ఎక్కువౌతారు.బలమైన శత్రువులు పెరుగుతారు.చెడుస్నేహాలు, అక్రమ సంబంధాలు,దురలవాట్లు రమ్మని ఆహ్వానిస్తాయి.కాని వాటికి దూరంగా ఉంటె మంచిది.లేకపోతే జీవితంలో చెడు జరుగుతుంది.

వృషభరాశి
జూన్ వరకూ ఉన్న ఉత్సాహమూ, ధర్మచింతనా తరువాత తగ్గుతాయి.లైంగిక రోగాలు పట్టుకుంటాయి.పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన పాత బాధలు తిరగబెడతాయి.హటాత్ ఖర్చులు పెరుగుతాయి.ఎంత సంపాదించినా ఎలా ఖర్చు అవుతుందో అర్ధంకాదు.అయితే అదే సమయంలో,ఉద్యోగంలో ఉన్నతి, వ్యాపారంలో పలుకుబడి కొత్త అవకాశాలూ కలుగుతాయి.కానీ అక్కడ కూడా చికాకులుంటాయి.తరచుగా ప్రయాణాలు తప్పవు.

మిథునరాశి 
ఉత్సాహం ఉరకలేస్తుంది.ఆఊపులో అనేక కొత్తసమస్యలలో చిక్కుకుంటారు. బీపీ ఎక్కువౌతుంది.మాటదురుసు వల్ల గొడవలు పెట్టుకుంటారు.ప్రేమవ్యవ హారాలూ,చెడుస్నేహాలు,వివాహేతర అక్రమసంబంధాల వైపు మనసు లాగు తుంది.ఒకేసారి అనేకమందితో ప్రేమవ్యవహారాలు నడిపిస్తారు.తద్వారా చిక్కుల్లో పడక తప్పదు.జిజ్ఞాస అధికమౌతుంది.అనేక కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆధ్యాత్మికపరంగా ఉన్నవారికి మాత్రం దైవసహాయం ఎక్కువగా అందుతుంది.సాధనలో ఉన్నత శిఖరాలు అందుకుంటారు.ఒకేసారి అనేక పనులు పెట్టుకుని సతమతమౌతారు.సంతానం ప్రమాదంలో చిక్కుకుంటుంది.లేదా సంతానానికి ప్రేమవివాహం జరుగుతుంది.

కటకరాశి 
జూన్ తర్వాత ఖర్చులు ఉన్నట్టుండి అధికం అవుతాయి.గృహనిర్మాణం గావిస్తారు. అయితే గృహశాంతి లోపిస్తుంది.మనస్సులో నిగ్రహించుకోలేని ఆలోచనలు పెరుగుతాయి.తద్వారా ఇంటా బయటా చిక్కులు ఎక్కువౌతాయి. వృత్తిలో ఉన్నట్టుండి ఒక పెద్ద సమస్య ఎదురౌతుంది. విలాసజీవితం వైపు మనసు లాగుతుంది.నేరప్రవృత్తి కలుగుతుంది.జీవితం అనేక ఆటుపోట్లకు గురౌతుంది.ఒక క్షణంలో అంతా బాగున్నట్లు,మరుక్షణంలో అంతా అయిపోయినట్లు అనుకుంటారు. 

సింహరాశి
ఊహాశక్తి అధికం అవుతుంది.మొండిధైర్యం పెరుగుతుంది.సంఘంతో కమ్యూనికేషన్ చాలా పెరుగుతుంది.దగ్గర ప్రయాణాలు అధికంగా చేస్తారు.సోదరులకు లాభం కలుగుతుంది,అదే సమయంలో వారికి ప్రమాదమూ కలుగుతుంది.ధైర్యం పెరుగుతుంది. ఆత్మ విశ్వాసంతో పనులు సాధిస్తారు. లాభాలు కలుగుతాయి.ఆధ్యాత్మిక చింతన అధికం అవుతుంది.ఈ రాశివారు కొందరు ఏక్సిడెంట్ వల్ల గాని,దీర్ఘవ్యాధి వల్లగాని మరణిస్తారు.

కన్యారాశి
వాగుడు అధికం అవుతుంది.దానివల్ల సమస్యలలో చిక్కుకుంటారు. కళ్ళవ్యాధులూ,దీర్ఘవ్యాధులూ పీడిస్తాయి.జూన్ తర్వాత వృత్తిలో పురోగతి ఉంటుంది.పలుకుబడి పెరుగుతుంది.నూతనోత్సాహం వస్తుంది.వివాహేతర సంబంధాలు పెరుగుతాయి.లేదా కుటుంబంలో ఉన్న అలాంటి ఒక సమస్య చాలా చికాకు కలిగిస్తుంది.తద్వారా కుటుంబంలో గొడవలు వస్తాయి. కుటుంబపరమైన జల్సాలకు ఖర్చు చేస్తారు.

తులారాశి
ప్రపంచమంతా వెలుగుతో నిండి మహోత్సాహంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ప్లేబాయ్ లక్షణాలు ఎక్కువౌతాయి.వృద్ధులు కూడా కుర్రదుస్తులు ధరించి చలాకీగా తిరుగుతారు.ప్రేమ వ్యవహారాలు ఊపందుకుంటాయి. నాయకులుగా,యూనియన్ లీడర్లుగా,కళాకారులుగా రాణిస్తారు.ఆధ్యాత్మిక సాధకులకు ఊహాతీతమైన అనుభవాలు కలుగుతాయి.జీవితభాగస్వామి సాధింపు ఎక్కువౌతుంది.అగ్నిప్రమాదానికి గాని,జ్వరాలకు గాని లోనౌతారు.యాక్సిడెంట్ జరుగవచ్చు.

వృశ్చికరాశి 
చెప్పలేని భావోద్వేగాలకు గురవుతారు.ఆస్తులు కొనడానికి, పిచ్చిఖర్చులకు, విలాసాలకు విపరీతంగా డబ్బు ఖర్చు అవుతుంది.కొందరిలో నేరప్రవృత్తి, హింసాప్రవృత్తి,మొండితనం తలెత్తుతాయి.జల్సాలకోసం ఖర్చులు పెడతారు. రహస్యనేరాలు చేస్తారు.అవకాశాలు జారవిడుచుకుంటారు.కుటుంబ పరిస్తితులు,సంతాన సమస్యలతో మానసిక వేదన అధికమౌతుంది.రహస్య సంబంధాలు కలుగుతాయి.ప్రమాదంలో చిక్కుకుని,ఆస్పత్రి పాలౌతారు. ఆధ్యాత్మిక సాధనలు(చెయ్యగలిగితే)ఫలిస్తాయి.

ధనూరాశి 
విదేశీ గమనం సఫలమౌతుంది.సమాజ సంబంధాలు మెరుగౌతాయి.వాయిదా పడుతున్న వివాహాలు జరుగుతాయి.ఎప్పటినుంచో ఆగిపోయిన డబ్బు హటాత్తుగా చేతికందుతుంది.పీటముడులు విడిపోతాయి.ఆస్తిపాస్తులు కలిసొస్తాయి.అయితే దీనివల్ల చెడుస్నేహాలు కూడా ఎక్కువై తద్వారా జీవితానికి తీవ్రనష్టం కలుగుతుంది.భార్యాదాసు లౌతారు.స్నేహితులు  ప్రమాదంలో చిక్కుకుంటారు.లేదా మరణిస్తారు. సోదరునికి కష్టకాలం మొదలౌతుంది. 

మకరరాశి
పట్టుదలలు పెరుగుతాయి.తద్వారా గృహశాంతి,సమాజశాంతి కరువౌతుంది. జీర్ణకోశ వ్యాధులు బాధపెడతాయి.శత్రువులను ఓడిస్తారు.ఉద్యోగ పదోన్నతి కలుగుతుంది.వృత్తిపరంగా ఊహించని మార్పులొస్తాయి.విపరీత లాభాలు కలుగుతాయి.సమాజంలో గౌరవం ఇనుమడిస్తుంది. సరదాలు, విలాసాలు, ప్రయాణాలు ఎక్కువౌతాయి.

కుంభరాశి
ధైర్యం బాగా పెరుగుతుంది.సోదరులకు స్థిరత్వం కలుగుతుంది. ఆద్యాత్మికచింతన పెరుగుతుంది.సంతానం విదేశాలకు వెళతారు. దూర ప్రయాణాలు,తీర్దాటనలు చేస్తారు.మహనీయుల దర్శనం అనుగ్రహం కలుగుతుంది.శక్తిపూజలు ఉపాసనలు చేస్తారు.కుటుంబంలో పెద్దలు ఊహించని పరిస్తితుల్లో గతిస్తారు.

మీనరాశి
పరుషవాక్కు కలుగుతుంది.ముఖానికి దెబ్బలు తగులుతాయి.మనస్సు ద్వైదీభావంతో సతమతమౌతుంది.కానీ చివరకు ధర్మం వైపే మొగ్గుతారు.కుటుంబసౌఖ్యం బాగుంటుంది. ఎక్కువ మొత్తంలో డబ్బు చేతికందుతుంది.మంత్రతంత్ర రహస్యసాధనలు ఫలిస్తాయి.అతీతశక్తులు కలుగుతాయి.కోర్టు కేసులలో జయం లభిస్తుంది. మానసిక వైద్యులకు, పిచ్చి వైద్యులకు కలిసొస్తుంది.