“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

2, జనవరి 2013, బుధవారం

డిల్లీ గ్యాంగ్ రేప్ కేసు-కొన్ని ఆలోచనలు-5

న్యాయశాస్త్రంలో క్రిమినాలజీ,క్రిమినల్ జ్యూరిస్ ప్రుడెన్స్ వంటి సబ్జేక్టులున్నాయి.వాటిలో- అసలు నేరస్తులు ఎలా తయారౌతారు? వారు అలా రూపు దిద్దుకోవడానికి గల వ్యక్తిగత,సామాజిక,కుటుంబ కారణాలేమిటి?మొదలైన అంశాలూ,నేరాలూ-శిక్షలూ-వాటి తీవ్రతలూ ఎలా ఉండాలి?మరణదండన విధించడం సబబేనా?వంటి మౌలికమైన విషయాల పైన ప్రాచ్య,పాశ్చాత్య భావాల పరిశీలన ఉంటుంది.

మనస్తత్వ శాస్త్రం కూడా ఈ విషయం మీద అనేక కారణాలను కనుక్కున్నది. బాల్యంలో ఒక వ్యక్తి పొందిన అనుభవాలే అతని జీవితపంధాను చాలావరకూ నిర్దేశిస్తాయి అని అది చెబుతుంది.బాల్యంలో ఎక్కువగా అవమానాలకూ, child abuse కూ గురైన వ్యక్తి భవిష్యత్తులో రెండు రకాలుగా మారవచ్చు. పూర్తిగా భయంతో లోనికి ముడుచుకుపోయి,ఒక మానసిక జడునిగానూ, చేతగానివాడిగానూ మారవచ్చు.లేదా ఆ కసితో అవకాశం దొరికినప్పుడు ఇతరుల మీద దాడిచేసి ఆనందాన్ని పొందే శాడిస్ట్ గానూ మారవచ్చు.ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని అతను చిన్నతనంలో పెరిగిన కుటుంబ వాతావరణమూ,అందులో అతను పొందిన అనుభవాలే చాలావరకూ నిర్ణయిస్తాయి.బాలుడు బహిర్ముఖుడు(extrovert) అయితే భవిష్యత్తులో అతనొక శాడిస్ట్ గా మారతాడు.అంతర్ముఖుడు(introvert)అయితే జడుడిగా మారతాడు.అయితే ఇక్కడ నేను చెబుతున్న అంతర్ముఖత్వం అనేది ఆధ్యాత్మిక పరమైనది కాదు. ఆధ్యాత్మికంగా అంతర్ముఖుడైన వ్యక్తి ఒక ఋషి గా మారుతాడు.అది వేరే విషయం. 

ప్రాచీన భారతీయులకు,ఋషులకూ,ఇంకా లోతైన విషయాలు తెలుసు. మనస్తత్వ శాస్త్రానికి తెలియని విషయాలు వారికి తెలుసు. మరణం కంటే ముందుకువెళ్లి ఒకజీవి జన్మజన్మాన్తరాలలో ఏఏ కర్మను ఎలా పోగుచేసుకుంటూ వచ్చిందో వారు చూడగలరు. వంశాలలో పరంపరగా కొన్ని లక్షణాలు వస్తాయనీ,ఆయా కర్మసంస్కారాలు గల జీవులు ఆయా వంశాలలోనే జన్మిస్తారనీ,వారివారి పూర్వ కర్మానుసారం అనుభవాలు పొందుతారనీ వారికి తెలుసు.కులమూ, గోత్రమూ ఈ భావనల మీద ఆధారపడి రూపొందినవే.ఇతర కులాలతో గోత్రాలతో కలిస్తే రక్తం కలుషితం అవుతుందనీ,తద్వారా సంకర సంస్కారాలు  గల జీవులు జన్మిస్తారనే భావనలో చాలా నిజం ఉన్నది.

దీనిని ఇంకా వెనక్కు తీసుకుపోయినవి జ్యోతిష్యశాస్త్రమూ, తంత్రమూ. సరియైన స్త్రీ పురుషుల జాతకాలను మేళవించడం ద్వారా,శ్రేష్టులైన జీవులను వారి గర్భాన పిల్లలుగా ఈ భూమిలో అవతరింప చెయ్యడం వీటి గొప్పదనం.శ్రేష్టమైన కర్మ కలిగిన వ్యక్తులను కలపడం ద్వారా మరింత శ్రేష్టమైన లక్షణాలు కలిగిన సంతతిని ఒక తరం నుంచి ఇంకొక తరానికి వృద్ధి చెయ్యడం ఒక సైన్స్. ఇది ప్రాచీనులకు తెలుసు.కాని దురదృష్టవశాత్తూ ఈ విద్యను ఇప్పుడు మనం మరచిపోయాం.పరిణామక్రమంలో ఉన్నతస్థాయికి చెందిన జీవులను తరతరానికీ వృద్ధిచేసుకుంటూ పోవడం ప్రస్తుతపు కలిజీవులకు అసలు అర్ధం కాదు.అది వారి గమ్యంకూడా కాదు.ఇప్పుడు జరిగే పెళ్ళిచూపులలోనూ,పెళ్లిమాటలలోనూ,ఆస్తిపాస్తులు,అందచందాలు, డబ్బు,శరీరాకర్షణా మొదలైన విషయాలే ప్రాధాన్యం వహిస్తున్నాయి. వివాహం వెనుక ఉన్న అసలైన ఉన్నతవిషయాలు మరుగున పడ్డాయి.అందుకే నేడు ఎవరికీ ఋషి  సంతానం కలగడం లేదు.

నేడు ఎవరిని అడిగినా నేను ఇంజనీరు అవుతాను,డాక్టరు అవుతాను, కాంట్రాక్టర్ అవుతాను,అమెరికా పోతాను,రోజుకు లక్ష రూపాయలు సంపాదించడమే నా లక్ష్యం.దేశాన్ని దోచుకోవడమే నా గమ్యం అని చేబుతారుగాని ఒక ఋషిగా మారడమే నాలక్ష్యం అని ఎవరూ చెప్పరు. కారణం ఏమంటే ఋషి అంటే ఒక బెగ్గర్ అని నేటిమనుషుల ఉద్దేశ్యం.కాని నిజం అదికాదు. విధిని మార్చగలవాడే ఋషి. సృష్టిని మార్చగలవాడే ఋషి.శాపానుగ్రహ సమర్ధత కలవాడే ఋషి.సంకల్ప మాత్రాన సృష్టి నియమాలను మార్చగలవాడే ఋషి.ఋషి అంటే దేవునికి ప్రతిరూపం. అటువంటి స్తితిని పొందటం మానవునికి సాధ్యమా అని నేటిమానవులకు సందేహం.ఖచ్చితంగా అది సాధ్యమే.కాని ఆదిశగా ఎవరూ ప్రయత్నం చెయ్యడం లేదు.అంతే.

పొట్ట నింపుకోవడమూ, ఇంద్రియాల ద్వారా వచ్చే సుఖాలు మరింత ఎక్కువగా పొందటమే పరమావధులైన నేటి రేచీకటి సమాజంలో 'ఋషిత్వం'అంటే ఏమిటో సరియైన అవగాహనా,అది పొందటానికి చెయ్యాల్సిన ప్రయత్నమూ ఎలా జరుగుతాయి? అసంభవం.

అయితే ప్రస్తుత సబ్జెక్ట్ అదికాదు గనుక ఇంత లోతైన విషయాలలోకి ఇప్పుడు పోనవసరం లేదు.కుటుంబ పరిస్తితులూ, చిన్నప్పటి అనుభవాలూ నేరమనస్తత్వానికి కారణాలు అవుతాయన్నది నిర్వివాదాంశం.దీనిని మనస్తత్వశాస్త్రం కూడా ఒప్పుకుంటుంది.ప్రస్తుత పోస్ట్ లో మనం ఇంతవరకే మాట్లాడుకుందాం.ప్రతివారికీ మంచికుటుంబమూ,మంచిపరిస్తితులూ చిన్నప్పుడు దొరకవు గనుక అందరూ ఉత్తమపౌరులు ఉద్భవించరు. ఒక సమాజంలో అందరూ ఉత్తమపౌరులే ఉంటె దానినే ఆదర్శసమాజం (ideal society) అంటాం.అది ఆచరణలో అసాధ్యం కనుక చట్టాలు అనేవి సమాజంలో చాలా అవసరం.అలాగే,పోలీస్ వ్యవస్థా అవసరమే. అయితే చట్టాలున్నాయి కదా అని మనం అజాగ్రత్తగా ఉండలేము.ఉండకూడదు కూడా.చట్టాలు నిక్కచ్చిగా ఉండే అమెరికావంటి దేశాలలోకూడా అమ్మాయిల హేండ్ బేగ్ లో 'పెప్పర్ స్ప్రే' ఉండటం సర్వసాధారణం. ఎందుకంటే ఎవరి జాగ్రత్తలో వారుండటం మంచిదే కదా.

ఈ సమస్యలో మౌలికంగా రెండు కోణాలున్నాయి. ఒకటి వ్యక్తిగతం.ఇంకొకటి సామాజికం.రెండూ ఒకదానినొకటి ప్రభావితం చేస్తాయి.ఇంటిలో మంచి సంస్కారయుతమైన వాతావరణం ఉంటె,మంచి పౌరులు తయారౌతారు. అలాకాకుంటే వారిలో నేర ప్రవృత్తులుంటాయి.ఇది వ్యక్తిగతం. సమాజంలో గట్టి చట్టాలున్నపుడు,న్యాయవ్యవస్థ నిజంగా న్యాయంగా ఉన్నపుడు, సమాజం నేరరహితంగా ఉంటుంది.అంటే నేరపూరిత మనస్తత్వాలు పౌరులలో ఉన్నప్పటికీ,చట్టాల భయంతో వారు నిగ్రహంతో ఉంటారు.ఇది సామాజికం.వ్యక్తిగతమైనా,సామాజికమైనా,మొదటిదాన్ని భక్తి అనీ రెండవదాన్ని భయం అనీ పిలుస్తాం.అందుకే మనకొక సామెత ఉన్నది.భయమైనా ఉండాలి,భక్తైనా ఉండాలి అని.

భక్తి అంటే మతపరమైన భక్తికాదు.ఎవరికి వారు, మనం సరిగ్గా ఉండాలి, ఒకరితో చెప్పించుకోరాదు అన్న బాధ్యతాయుతమైన భావన కలిగి ఉండటమే భక్తి అంటాము.అలాంటి భావన రక్తంలో జీర్ణించుకుపోయిన కుటుంబాన్ని మనం తయారు చెయ్యాలి.అది లేనివారికి చట్ట'భయం' అవసరం.అదన్నా ఉండాలి.ఇదన్నా ఉండాలి.రెండూ ఉంటే ఇక చెప్పాల్సిన పనేలేదు.దురదృష్టవశాత్తూ మన కుటుంబవ్యవస్థ అనేది టీవీలు, సినిమాలు,నెట్,మొబైల్,చెత్త పత్రికలూ,చెత్త సాహిత్యాలవల్ల ఘోరంగా పాడైపోయింది.అంటే పద్దతులు గాడి తప్పాయి.భక్తి అనేది నశించింది. ఇకపోతే రాజేకీయులూ,అధికారులూ,లాయర్లూ,పోలీసులూ కలిసి 'భయం' అనేది లేకుండా చేశారు. భయమూ భక్తీ రెండూ నశిస్తే ఇంకేం జరుగుతుంది? ప్రస్తుతం జరుగుతున్నవే జరుగుతాయి.డిల్లీలో రేప్ కేసులు కాదు,మీ ఊళ్ళో మీ కళ్ళముందే రోజుకొకటి జరుగుతున్నాయి.కళ్ళుతెరిచి చూడండి కనిపిస్తాయి.భయమూ భక్తీ రెండూ నిర్వీర్యం కావడమే దీనికి కారణం.

మరెలా దీనికి పరిష్కారం? ఎవరికి వారు పద్దతిగా,సంస్కారవంతంగా ఉండటానికి ప్రయత్నం చెయ్యాలి.ఆలా ఉండటానికి ప్రతిరోదాలైన టీవీలూ,సినిమాలూ,ఇతరములు అన్నింటినీ నిర్ద్వంద్వంగా బహిష్కరించాలి. ముందుగా మన  ఇల్లు మనం బాగుచేసుకోవాలి. మన పిల్లలను పద్దతిగా పెంచాలి. అలా పెంచాలంటే ముందు మనం పద్దతిగా ఉండటం నేర్చుకోవాలి. ఆ విధంగా మన సంస్కృతిని మనం మళ్ళీ పెంచుకోవాలి.అప్పుడే భక్తి అనేది పెరుగుతుంది.నాయకులూ,అధికారులూ,లాయర్లూ,పోలీసులూ నీతిగా ఉండాలి.అప్పుడే ప్రజలు నీతిగా ఉంటారు.అప్పుడే 'భయం'అనేది మళ్ళీ బతుకుతుంది.ఈ రెండూ జరిగినప్పుడే సమాజం మళ్ళీ ఆదర్శ సమాజం అవుతుంది.

ఇందులో మొదటిది మన చేతుల్లోనే ఉంది.లోకాన్ని మనం బాగుచేయ్యలేక పోవచ్చు. కాని మన ఇల్లు మనం బాగుచేసుకోవచ్చు. కనుక ఆదర్శ సమాజానికి బీజాలు మొదటగా మన ఇంటితో మొదలుకావాలి.ఇకపోతే వ్యవస్థాపరంగా రావాల్సిన మార్పు కోసం,ప్రజలనుంచి ప్రభుత్వం మీద గట్టి ఒత్తిడి రావాలి.ప్రజలలో జాగరూకత పెరగాలి.ప్రజాసమస్యలకు ప్రభుత్వాన్ని జవాబుదారీ చెయ్యాలి.మనం కోరుతున్న మార్పును, నెమ్మదిగానైనా సరే, పట్టుబట్టి సాధించుకోవాలి.

అంతవరకూ ఈ నకిలీ సమాజంలో బ్రతకడం మనకు తప్పదు అనేది చేదువాస్తవం.ఇది తప్ప ఈ సమస్యకు వేరే మార్గం అంటూ ఇతరత్రా ఏమీ లేదు.