“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

24, జనవరి 2013, గురువారం

శని రాహు యోగం -3 (వ్యక్తిగత జీవితాలలో ప్రభావాలు)

ఈ యోగ ప్రభావం దేశంమీదే కాదు మనుషుల జీవితాలలో కూడా దారుణంగా ఉంటుంది.అయితే ఈ దారుణ ఫలితాలకు గ్రహాలు బాధ్యులు కావు.దానికి కారణాలు మనుషులు చేసుకునే కర్మలోనూ ఈ గ్రహాల కారకత్వాలలోనూ ఉన్నాయి.

మన బ్యాంక్ ఎకౌంట్లో డబ్బులు లేకపోతే అది బ్యాంక్ మేనేజర్ తప్పు కానట్లే, మన జీవితం సరిగా లేకుంటే దానికి దేవుడో గ్రహాలో బాధ్యులు కావు.మనం చేసుకున్న కర్మే దానికి కారణం.దానికి ఎవరినీ నిందించవలసిన పని లేదు.అయితే దానిని బాగుచేసుకునే అవకాశం మన చేతిలోనే ఉంటుంది.అది ఎలా చెయ్యాలో చెప్పేదే జ్యోతిష్య శాస్త్రం.

శని చాలా నిదానంగా సూటిగా నడిచే గ్రహం.రాహువు చాలా వేగంగా వక్రంగా పోవాలనుకునే గ్రహం.శని న్యాయానికీ ధర్మానికీ కట్టుబడి నడిచే గ్రహం.రాహువు న్యాయాన్నీ ధర్మాన్నీ ధిక్కరించి నడిచే గ్రహం.గమ్యం చేరడం ముఖ్యం కాదు.నీతిగా నడిచే పధ్ధతి ముఖ్యం అని శని అనుకుంటాడు. ఎంత అడ్డదారిలో నడిచినా పరవాలేదు గమ్యం చేరడం ముఖ్యం అని రాహువు అనుకుంటాడు.శని బాధ్యతలను తప్పించుకోవాలని అనుకోడు.ఇంకా బాగా తన బాధ్యతను నిర్వర్తించలేక పోయానని అనుకుంటూ బాధపడతాడు. రాహువు అసలు బాధ్యతలు పెట్టుకోడు.ఏదో రకంగా ఆనందాన్ని అనుభవించడమే అతని లక్ష్యం.దానికోసం ఇతరులను బలిపశువులను చెయ్యడానికి కూడా అతడు వెనుకాడడు.శని నీతికీ నియమానికీ కట్టుబడతాడు.రాహువు నీతినీ నియమాన్నీ ధిక్కరిస్తాడు.శని తాను నష్టపోతాడు కాని ఇతరులను నష్టపెట్టడు.ఇతరులు ఏమైపోయినా తన లాభంవరకు తాను చూచుకుంటాడు రాహువు.

ఇన్ని వైరుధ్యాలున్న రెండు గ్రహాలు కలిస్తే ఏమౌతుంది. మనుషుల్లో కూడా ఇన్ని వైరుధ్యాలూ ప్రేరేపించబడతాయి.ఊగిసలాట వారిలో అధికమౌతుంది. వారి వ్యక్తిత్వాలలో ఉన్న పరస్పర విరుద్ధ భావాలు వారిని ఊపి పారేస్తాయి. ఏమి చెయ్యాలో తెల్చుకోలేరు. ఈ లోపల ఏదో చేసేస్తారు. దాని ఫలితాలు ఖచ్చితంగా చేదుగానే పరిణమిస్తాయి. చెడు ఫలితాలనే ఇస్తాయి.అంతే కాదు.శని ఎముకలకు అధిపతి.రాహువు కేన్సర్, ఎయిడ్స్ వంటి అసాధ్య రోగాలకు అధిపతి.కనుక ప్రజల్లో కూడా కీళ్ళనొప్పులూ,కింద పడటమూ, యాక్సిడెంట్లు కావడమూ,దెబ్బలు తగలడమూ,ఎముకలు విరగడాలూ, అసాధ్య రోగాలతో వారు చనిపోవడాలూ ఇప్పుడు జరుగుతాయి.దానికి వారి పూర్వకర్మలే కారణం అవుతాయి.మనుషులు భూలోకన్యాయాన్ని న్యాయస్థానాలనూ తప్పించుకోవచ్చు.కాని ప్రకృతి అనే కోర్టులో వారికి పడే శిక్షను తప్పించుకోలేరు.దైవన్యాయం అనుల్లంఘనీయం.


నాకు తెలిసిన కొంతమంది జీవితాలలో ఈ మధ్యన జరుగుతున్న సంఘటనల నుంచి ఉదాహరణలు ఇస్తాను.నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ లో ఒక స్టేజిమీద జరుగుతున్న డాన్స్ ప్రోగ్రాంలో ఒక మిత్రుడు ఒక స్టెప్ చేస్తూ జారి పడ్డాడు.సరిగ్గా మోకాలు పడిన చోట స్టేజిమీద ఒక చిన్న గులకరాయి ఉన్నది.అది అక్కడికి ఎలా వచ్చిందో తెలీదు. దానిని చిమ్మవలసిన పనివారు చిమ్మకుండా వదిలేశారు.సరిగ్గా ఆ రాయిమీద సరిగ్గా ఇతని మోకాలు పడి మోకాలిచిప్ప(patella)పగిలిపోయింది.నొప్పితో గిలగిలలాడుతుంటే హడావుడిగా హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో ఆపరేషన్ చేసి మూడు నెలలు బెడ్ రెస్ట్ అవసరం అని చెప్పారు.అతను చాలామంచి డాన్సర్ అని వేరే చెప్పనవసరం లేదు.కాని అనుకోకుండా జరిగిన చిన్న సంఘటనతో నెలల పాటు మంచానికి పరిమితం అయ్యాడు.

చిమ్మడం మొదలైన చిన్నచిన్న పనులు చేసేవారు శని అధీనంలో ఉంటారనీ, జారి కిందపడటం వంటి అనుకోని సంఘటనలు రాహువు అధీనంలో ఉంటాయనీ అర్ధమైతే శపితయోగం ఇక్కడ ఎలా పనిచేసిందో తెలుస్తుంది.చాలా మామూలుగా మనం తీసుకునే సంఘటనల వెనుక గ్రహప్రభావం ఉంటుందని దానిని సూక్ష్మదృష్టితో గమనిస్తే తెలుస్తుంది. 

ఇంకొక ఉదాహరణ చూద్దాం. చిలకలూరిపేట బస్సు దహనం కేసు అందరికీ కాకున్నా కొందరికి గుర్తుండి ఉంటుంది. ఇది 1993 లో జరిగింది.ఇద్దరు నిందితులు ఒక బస్సులో పెట్రోల్ పోసి అందులో ఉన్న 21 మంది అమాయక ప్రయాణీకులను సజీవంగా తగలబెట్టారు.ఆ నిందితులకు సెషన్స్ కోర్టూ, హైకోర్టూ,సుప్రీంకోర్టూ మరణశిక్ష విధిస్తే దానిమీద రాష్ట్రపతి క్షమాభిక్ష వరకూ 'న్యాయయుద్ధం' చేసి ఆ కర్కోటక నిందితులకు మరణశిక్షను తప్పించి యావజ్జీవశిక్ష పడేలా చేసాడు ఒక లాయరు. రాష్ట్రపతి శంకర దయాళ్ శర్మ ఆ పిటిషన్ ను తిరస్కరించాడు.కాని తర్వాత వచ్చిన కే.ఆర్.నారాయణన్ దానిని ఆమోదించాడు.కనుక చివరిక్షణంలో నిందితులకు ఉరిశిక్ష ఆగిపోయింది.నిందితుల తరపున ఆ కేసు వాదించి గెలిచిన లాయరు చిన్నవయసులో వెన్నెముక కేన్సర్ తో నిన్నగాక మొన్న మరణించాడు. బస్సులో నుంచి బయటపడలేక సజీవ దహనం అయిన 21 మంది ఉసురు ఇలా తగిలిందని ప్రజలు అనుకుంటున్నారు.

1998 లో ఈ నిందితులకు 14 ఏళ్ళ శిక్ష పడింది.అంటే 2012 తో వారికి శిక్షాకాలం పూర్తవుతుంది.2012 పోయి 2013 వచ్చిన వెంటనే ఈ కేసు వాదించిన లాయరు,పాపం చిన్నవయసులో భయంకరవ్యాధితో చనిపోయాడు.దీనిని ఏమనాలి? ఎలా అర్ధం చేసుకోవాలి? కర్మగతి ఎలా ఉంటుందో ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ ఇచ్చాను.

ఎముకలకు శని అధిపతి అనీ,కేన్సర్ వంటి అసాధ్య వ్యాధులకు రాహువు అధిపతి అనీ గ్రహిస్తే ఈయనకు వెన్నెముక కేన్సర్ ఎందుకొచ్చిందో, అదికూడా రాహుశనులు కలసి ఉన్న ఈ సమయంలోనే ముదిరి మరణం వరకూ ఎందుకు తెచ్చిందో అర్ధమౌతుంది.శనీశ్వరుడు ధర్మానికి అధిపతి అని,ఆయనకు తనామనా విచక్షణ ఉండదు అనీ పురాణాలు చెబుతున్నాయి.

ఒక వ్యక్తి రోడ్డు మీద నడుస్తూ వెళుతూ,అక్కడ ఉన్న ఒక రాయిని సరదాగా తన్నాడు.ఆ రాయి భూమి లోపలవరకూ లోతుగా ఉండి పైకి మాత్రం ఒక మొనలాగా కనిపిస్తున్నది. అది భూమ్మీద పడి ఉన్న ఒక మామూలు రాయి అనుకుని ఆతను దానిని తన్నాడు. అది కదలక పోగా,ఆ తన్నుకు ఇతని కాలులో అది లోతుగా గుచ్చుకుని,క్రమేనా ఆ గాయం సెప్టిక్ అయి చివరకు ఒక నెల తర్వాత ఆపరేషన్ చేసి అతని కాలు తొలగించారు. ఆ విధంగా సరదాగా అతను ఎంతమందిని తన్ని ఉంటాడో మనం ఊహించవచ్చు. అలా తన్నిన వారిలో ఎందరు అజ్ఞాత మహానీయులున్నారో అతను ఊహించి ఉండడు. కాని దాని ఫలితం మాత్రం వచ్చి తీరుతుంది. కనుక అతని కాలే పోయి కుంటివాడయ్యాడు.ఇది కూడా రాహుశనుల ప్రభావమే.

ఇద్దరు భార్యాభర్తలు ఒక పెళ్ళికి పొరుగూరికి వెళ్లారు.భర్త ఉదయాన్నే స్నానం చేసి తడి తువ్వాలును పెరట్లో ఉన్న ఒక తీగమీద ఆరవేశాడు. అది కరెంట్ తీగ అని అతనికి తెలియదు.ఆ ఇంటివారికి తెలుసు.దానిమీద వారు బట్టలు ఆరవెయ్యరు.కాని వారు ఇతన్ని హేచ్చరించలేదు.తత్ఫలితంగా ఇతనికి కరెంట్ షాక్ కొట్టి గిలగిలా కొట్టుకుంటుంటే రక్షించాలని వచ్చిన భార్య కంగారులో అతన్ని పట్టుకుంది. తత్ఫలితంగా ఆమెకూ కరెంట్ షాక్ కొట్టి ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు.పెళ్లి చూద్దామని వెళ్ళిన దంపతులు పరాయివారి ఇంట్లో బొగ్గుల్లా మాడిపోయారు.ఇదీ రాహుశనుల దోష ప్రభావమే.


అందుకే మనం చేసేపనులలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని,న్యాయానికీ ధర్మానికీ ఎప్పుడూ కట్టుబడి ఉండాలి అనీ,ప్రలోభాలకు లొంగరాదనీ, మనం నష్టపోయినా సరే ఒకరి ఉసురు పోసుకోరాదనీ పెద్దలు అంటారు.ఏది చేసినా నాకేమీ కాదు,నేను తప్పించుకోగలను అని ఎప్పుడూ అనుకోరాదు.మనం చేసే కర్మలు ప్రకృతి అనే డేటాబేస్ లో రికార్డ్ అవుతున్నాయని మర్చిపోరాదు.అవి ఎన్నటికీ డిలీట్ కాబడవు.ఏదో ఒకనాడు ప్రకృతి యొక్క న్యాయస్థానంలో మనం బోనులో నిలబడవలసి వస్తుంది.మన కర్మలకు సమాధానం చెప్పవలసి వస్తుంది.అక్కడ డబ్బుకు కక్కుర్తి పడే ప్లీడర్లూ జడ్జీలూ ఉండరు.ఎవరినైనా సరే ఆ న్యాయస్థానంలో న్యాయదేవత కఠినమైన అగ్నిపరీక్షకు గురిచేస్తుంది.అక్కడ ఎవరి రికమండేషన్లు పని చెయ్యవు. క్లేమేన్సీ పిటిషన్లూ పనిచెయ్యవు.ధర్మానికి ప్రతిరూపం అయిన శనీశ్వరుడు అక్కడ ఉగ్రమూర్తిగా కొలువుదీరి ఉంటాడు.ఆయన చేతిలో మనకు శిక్ష తప్పదు.ఈ విషయాన్ని మనం మర్చిపోరాదు.ఈ సూత్రం మీదనే మన సనాతనధర్మం అనండి, హిందూధర్మం అనండి,ఈ దేశపు జీవనవిధానం అనండి, అది నిర్మితమై ఉన్నది.ఇది తిరుగులేని సజీవసత్యం.

మన ప్రాచీనులు కర్మ సిద్ధాంతాన్ని పిచ్చివాళ్లై నమ్మలేదు.అది తిరుగులేని సూత్రం అనీ ప్రపంచాన్ని నడిపిస్తున్న ఏకైకసూత్రం అనీ వారికి తెలుసు. అందుకే ఎవరినైనా బాధపెడితే "వద్దురా.వాళ్ళ ఉసురు పోసుకోకురా.అది నీకూ నీ పిల్లలకూ మంచిది కాదు.కళ్ళు పోతాయిరా"అని పెద్దలు హెచ్చరించేవారు.వారి హెచ్చరికల వెనుక ఎంతో అనుభవమూ దూరదృష్టీ ఉన్నాయి.మన నవీన నాగరిక మనుషులలో అవే కొరవడ్డాయి.కాని మనం లెక్కచేయ్యనంత మాత్రాన ప్రకృతిసూత్రాలు పనిచెయ్యడం ఆగవు.అవి మన ఇష్టాయిష్టాల  మీద ఆధారపడి నడవవు.

శపిత యోగం అమలులో ఉన్న ఈ ఏడాదిన్నర కాలంలో, చేసిన తప్పులకు శిక్షలు అనుభవించక ఎవరికైనా తప్పదు అనేది చేదు నిజం.ఆ శిక్షలు చాలా చిత్ర విచిత్రాలుగా పడతాయి అనడమూ అక్షర సత్యమే.గమనిస్తుంటే నిత్యజీవితంలో అనేక సత్యాలు ప్రతిరోజూ కళ్ళెదుట సాక్షాత్కరిస్తాయి. దైవన్యాయాన్ని నిరూపిస్తాయి.కర్మగతిని తేటతెల్లం చేస్తాయి.