“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

27, నవంబర్ 2010, శనివారం

మనం మానవులమేనా?

నదులు, చెట్లు, కొండలు మన భూమికి సంపదలు. నదులు జీవజలంతో మనల్ని పోషిస్తున్నాయి. పంటలు పండిస్తున్నాయి. మనల్ని బ్రతికిస్తున్నాయి. చెట్లు మనకు ఆక్సిజన్ ఇచ్చి కాపాడుతున్నాయి. కళ్లకు ఇంపుగా చక్కటి వాతావరణాన్నిస్తున్నాయి. నీడనిస్తున్నాయి. పూలను కాయలను ఇస్తున్నాయి. వర్షాన్ని ఆకర్షిస్తున్నాయి. కొండలు పర్యావరణాన్ని రక్షిస్తున్నాయి. మేఘాల్ని అడ్డుకుని వర్షాన్ని కురిపిస్తున్నాయి. ఇవన్నీ కలిసి మానవుని జీవనానికి సహాయపడుతున్నాయి.

మరి మనమేం చేస్తున్నాం? చెట్లను కొట్టేస్తున్నాం. జీవనదుల్ని పబ్లిక్ టాయిలెట్లుగా మారుస్తున్నాం. కొండలు లీజుకిచ్చి తవ్విస్తున్నాం. చివరికి ఇసుకను కూడా అమ్ముకుంటూ దానికోసం కొట్టుకుంటున్నాం. ధనదాహంతో, దురాశతో, కృతజ్ఞతాలేమితో మనల్ని తల్లిలాగా పోషిస్తున్న ప్రకృతిమాత పట్ల రాక్షసులలాగా ప్రవర్తిస్తున్నాం. ఇదీ మన నిర్వాకం.

జీవనదుల్ని సిగ్గులేకుండా పాడు చెయ్యటంలో ప్రపంచం మొత్తంమీద తెలుగువారికి ప్రధమ బహుమతి వస్తుంది. విజయవాడ దగ్గర కృష్ణానదిని ఉదయాన్నే గనక చూస్తే దానికంటే పబ్లిక్ టాయిలెట్ కాస్త మెరుగు అనిపిస్తుంది. దీనికంటే గోదావరి కాస్త నయం. గోదావరి తీర వాసులు కృష్ణా తీరవాసుల కంటే ఈ విషయంలో కాస్త మెరుగు.

అయ్యప్ప సీజన్ లో శబరిమల వద్ద పంపానదిని చూస్తే వాంతికొస్తుంది. అంత చండాలం చేస్తారు ఈ సోకాల్డ్ అయ్యప్ప భక్తులు. పూరీలు, పులిహోర, చపాతీలు, బజ్జీలు, దద్ధోజనం ఇంకా నానా అడ్డమైన తిండీ తెగతిన్న ఈ భక్తులు, ప్రపంచం నలుమూలల్నించీ అక్కడికిచేరి, ఎక్కడో కొండల్లో పవిత్రంగా పారుతున్న ఆ నది ఒడ్డునే మలమూత్ర విసర్జన చేసి. అడ్డమైన బట్టలూ అందులోనే ఉతికి, పంపానదిని పరమ దరిద్రంగా మారుస్తుంటారు. వీళ్ళు చేసివచ్చిన దరిద్రాన్ని వదిలించుకోటానికి ప్రకృతికి మళ్ళీ ఏడాది పడుతుంది.

పుణ్యక్షేత్రాలలో కూడా ఈ చండాలపు అలవాట్లు మనల్ని వదలవు. తిరుపతిలోని కపిల తీర్ధం పవిత్ర క్షేత్రం కదా. అందులో విడిచిన డ్రాయర్లను, పంచెలను, ఇతర గుడ్డల్ని సబ్బేసి ఉతుక్కుంటున్న ప్రబుద్దుల్ని చూసి నాకు ఏమనాలో తోచక నోరు మూసుకున్నాను. కనీసం పక్కనే అదే నీళ్ళలో ఇతరులు స్నానం చేస్తున్నారన్న జ్ఞానం కూడా వారికి ఉండదు. అదేం భక్తో నాకర్ధం కాదు.

మహానందిలోని స్నానగుండం స్పటికం లాంటి స్వచ్చమైన నీళ్ళతో ఎప్పుడూ పారుతుంటుంది. అక్కడా ఇదే తంతు. విడిచిన బట్టలు ఉతకటం, సబ్బులతో స్నానాలు చెయ్యటం, అందులోనే ఉమ్మెయ్యటం ఇలాటి దరిద్రపు పనులు భక్తులే చేస్తుంటారు.

నేను అలహాబాద్ లోని త్రివేణీ సంగమానికి వెళ్ళినపుడు నాతో పాటు పడవలో వచ్చిన కొందరు తెలుగువాళ్ళు సంగమస్థానంలో కిళ్లీ నములుతూ వెకిలి భాష మాట్లాడుకుంటూ అదే నీళ్లలో ఉమ్మెయ్యటం చూచి నాకు వాళ్ళను పడవలోంచి నదిలోకి తోసి చంపేద్దామన్నంత కసి పుట్టింది. చివరికి ఆ పడవ నడిపేవాడుకూడా వీళ్లని చూచి చీదరించుకున్నాడు.


ఇతర రాష్ట్రాల భారతీయులు మనకంటే ఇందులో ఎంతో మెరుగు. కేరళ రాష్ట్రంలో ప్రవహిస్తున్న "భారత్ పుళ" నది పొడుగూతా ఎక్కడ చూచినా మలమూత్ర విసర్జన కనిపించనే కనిపించదు. మనలాగా విడిచిన గుడ్డలు అందులో ఉతకటం కూడా కనిపించదు. ఇక ఉత్తరభారతంలో గంగా నదిని ఎంత పవిత్రంగా చూస్తారో మనకు తెలిసిందే. హరిద్వార్ ఋషీకేశ్ లలో ప్రతిరోజూ గంగానదికి వేలాదిమంది హారతి ఇస్తారు. పొరపాటున మనం "గంగా" అని సంబోధిస్తే అక్కడివారు వెంటనే, "గంగా నహీ, గంగామా బోలో" అని సరిదిద్దుతారు. ఆ నది అంటే అంతటి గౌరవం ఉంది వాళ్లకు.

నీటిలో ఉమ్మివేయటాన్ని మహా పాపంగా మనువు తన " మనుస్మృతి" లో పరిగణించాడు. ఇక జీవనదులలో మలమూత్ర విసర్జన చెయ్యటం ఎంతటి మహాపాపమో ఊహించలేము. రోజూ స్నాన సమయంలో "గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే్ సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు" అని సప్త నదులను స్మరించటం భారతీయులుగా మన కర్తవ్యం.

మనల్ని పోషిస్తున్న జీవనదులను భగవంతుని రూపాలుగా, మన తల్లులుగా, భావించి వాటిని జాగ్రత్తగా కాపాడుకోమని వేదం చెప్పింది. జలాధిదేవత అయిన వరుణుని "ఇమం మే వరుణ శృధీ......" అంటూ బ్రహ్మంగా భావించింది వేదం. ఆ వేదాలను అనుసరిస్తున్నాం అని చెప్పుకునే మనం జీవనదులకు నానా భ్రష్టత్వమూ పట్టిస్తున్నాం. మానవ వ్యర్ధాలనూ, ఫేక్టరీ వ్యర్ధాలనూ, సమస్త దుర్గంధాన్నీ వాటిలోకి వదిలి నిస్సిగ్గుగా ప్రవర్తిస్తున్నాం. ఇంకో పక్కన దేవుళ్లకు దొంగ పూజలు చేస్తూనే ఉంటాం. కనీసం పుణ్య క్షేత్రాలలోనైనా శుచీ శుభ్రతా పాటించం. మనం అచ్చమైన హిందువులమని ఎలా చెప్పుకోగలం?

ప్రకృతి శక్తులను భగవంతుని రూపాలుగా చూచి వాటిని గౌరవంగా కృతజ్ఞతగా వాడుకోమని వేదం ఎన్నోచోట్ల చెప్పింది. అలా చేసినప్పుడే ప్రకృతిలో భాగమైన మనిషి కలకాలం చక్కగా మనుగడ సాగించగలడు. అలాకాక ఇష్టానుసారం వాటిని పాడు ఛేస్తుంటే చివరికి మన ఉనికికే ప్రమాదం ముంచుకొస్తుంది.

చాలామంది దారిన పోతూ చెట్ల ఆకుల్ని తెంపటం, కొమ్మలు విరవటం చేస్తుంటారు. పక్కనే ఉన్న తల్లిదండ్రులు, స్నేహితులు కనీసం మందలించడం కూడా చెయ్యరు. అదేం రాక్షసానందమో అర్ధం కాదు. ఇంకొందరు చెట్ల పైన పేర్లు చెక్కడం, పిచ్చి రాతలు రాయటం, వాటికి మేకులు కొట్టటం చేస్తుంటారు. తాను కూచున్న కొమ్మను తానే నరుక్కున్న కాళిదాసు కధలా ఉంది మన కధ. ఆయనకు జగన్మాత అనుగ్రహం కలిగింది. మనకు మాత్రం జగన్మాత ఆగ్రహం మిగులుతుంది.

విచక్షణా రహితంగా చెట్లను కొట్టేయటం, వాహనాల పొగ వదలటం వల్ల ఇప్పటికే సిటీలలో ఆస్మా మొదలైన ఊపిరితిత్తుల వ్యాధులు భయానకంగా విజృంభిస్తున్నాయి. సిటీలలోని రోగాలకు సగం కారణం అక్కడున్న మనుషులకు సరిపడా చెట్లు లేకపోవటమే. ఇక కొండల్ని కూడా వదలకుండా తవ్వేసి కంకరగా మార్చి అమ్ముకుంటూ ఆనందిస్తున్నాం గాని, దానివల్ల పర్యావరణానికి ఎంతటి చేటు వాటిల్లుతోందో మనం ఊహించడం లేదు.

నదుల్ని, చెట్లను, కొండల్ని మనం ఇలాగే నిర్లజ్జగా పాడుచేసుకుంటూ నాశనం చేసుకుంటూ పోతుంటే కొంతకాలానికి భయానకమైన పరిస్తితుల్ని ప్రకృతినుంచి ఎదుర్కొనక తప్పదు. ఇప్పటికే నీళ్ళుకొనుక్కుని తాగుతున్నాం. ముందుముందు ఇంకా ఎన్నున్నాయో? మనం ఎప్పటికి తెలివి తెచ్చుకుంటామో ?
read more " మనం మానవులమేనా? "

22, నవంబర్ 2010, సోమవారం

కార్తీక సోమవారం శ్రీశైల యాత్ర










మనం
అనుకోని ఏదైనా చేస్తే అది మన సంకల్ప ఫలితం. అనుకోకుండా ఒక పని చెయ్యవలసి వస్తే అది భగవత్సంకల్పం. అనుకోని వ్యక్తులు తటస్థ పడటం అద్భుతం. గమనించే ప్రజ్ఞ ఉంటే అద్భుతాలు ప్రతిరోజూ కనిపిస్తాయి.

అలాటి సంఘటన ఈ మధ్యన జరిగింది.

మొన్న పదిహేనో తేదీన ఒక వీవీఐపీ గారితో కలిసి శ్రీశైలం సందర్శించే అవకాశం పరమేశ్వరుడే కల్పించాడు. ఆదివారమే అడ్వాన్స్ పార్టీగా అక్కడకు చేరి అన్ని ఏర్పాట్లూ సరిగ్గా ఉన్నాయా లేదా పరిశీలించాము. మధ్యాహ్న సమయంలోపరమేశ్వరీ పరమేశ్వరుల దర్శనం చేసుకొని రాత్రివరకూ అక్కడి ఆహ్లాదకర అటవీ వాతావరణాన్ని ఆధ్యాత్మికస్పందనలనూ ఆస్వాదిస్తూ గడిపాను. పాతాలేశ్వర సదన్ లో బస చేశాను. ఆది పాతాళ గంగకు వెళ్ళే దారిలో రోప్ వె దగ్గరగా ఉన్నది. ఆ రెండు రోజులూ మబ్బులు పట్టి సన్నటి చినుకులు పడుతూ వాతావరణం మంచి ఆహ్లాదకరంగా ఉంది.

సాయంత్రానికి మందీ మార్బలంతో వారందరూ రావడం, హడావుడి, దర్శనాలు చేసుకోవటం అన్నీ జరిగిపోయాయి. మర్నాడు సోమవారం తెల్లవారు జామునే లేచి మళ్ళీ దర్శనాలు, అభిషేకాలు, చండీ హోమం ఇత్యాదులు చకచకా జరిగిపోయాయి. నేను మాత్రం హాయిగా కాటేజీలో మౌనంగా ధ్యానంలో గడిపాను. రెండో సారి వారితో దర్శనానికి వెళ్ళలేదు. ఆరోజున దాదాపు డెబ్బై వేలమంది దర్శనార్ధమై వచ్చి ఉన్నారు. ఒకటే తోక్కిడిగా ఉంది. క్రితం రోజే స్వామి దర్శనం చేసుకున్నాను గనుక సోమవారం నాడు నేను మళ్ళీ వెళ్ళలేదు. కార్తీక సోమవారం నాడు శ్రీశైలం లో ఉండీ శివదర్శనానికి వెళ్ళని నన్ను వింతగా చూస్తూ మా గ్రూప్ లో వాళ్ళు దేవాలయానికి వెళ్ళారు. నేను మౌనంగా కళ్ళు మూసుకొని నా లోకంలో ప్రవేశించాను. ఆలయంలో దర్శనం కంటే గొప్పదైన అనుభవాన్ని నాకు నా గదిలోనే పరమేశ్వరుడు అనుగ్రహించాడు.

భ్రమరాంబికా ఆలయంలోని వరండాలో లోపాముద్రా దేవి విగ్రహం ఉంటుంది. నేను ఎప్పుడు శ్రీశైలం వెళ్ళినా అక్కడ కొంతసేపు మౌనంగా కూచుంటాను. ఆమె అగస్త్య మహాముని పత్ని. లలితా సహస్ర నామాలను ప్రచారం లోకి తీసుకొచ్చిన మహా యోగిని. శ్రీవిద్యోపాసనలో ఆమె ఉపాసించిన విధానాన్ని చాలామంది నేటికీ అనుసరిస్తున్నారు. తంత్ర సాధకులకు ఆమె పరమ గురువు అని చెప్పవచ్చు. "లోపాముద్రార్చిత లీలాక్లుప్త బ్రహ్మాండ మండలా"--అని లలితా సాహస్రం ఆమహాతల్లికి సముచిత స్థానాన్ని ఇచ్చింది.

శ్రీశైల మహాక్షేత్రం సిద్ధులకు ముఖ్యంగా రససిద్ధులకు నిలయం. ఇనుమును రాగిని ఆకుపసరులతో బంగారంగా మార్చగల సిద్ధులు అక్కడ ఎందఱో ఉండేవారు. ఇప్పటికీ ఉన్నారు. కాని సామాన్యుల దృష్టికి అడుక్కునే వాళ్ళలాగా కనిపిస్తారు. మన వద్దఒక రూపాయికోసం చేయి చాచే వాని వద్ద ఇలాటి అద్భుత శక్తి ఉన్నదని అందరూ గ్రహించలేరు. నేను అక్కడ తిరుగుతూఉన్న సమయంలో అలాటి ఒక సిద్ధుడు నాకెదురు పడ్డాడు.

ఏదో ఆలోచనలో ఉండి నడుస్తున్న నేను " బాబూ ధర్మం" అన్న మాటతో ఈ లోకం లోకి వచ్చి ఎదురుగా చాచిన చేతివైపు యదాలాపంగా చూచాను. ఒక్కసారి ఉలిక్కిపడ్డాను. కారణం !!! బిచ్చగాళ్ళ చేతులు ఒక విధంగా ఉంటాయి. వాటి రేఖలూ ప్రత్యేకంగా ఉంటాయి. చూడగానే వాటిని గుర్తించవచ్చు. అందుకు భిన్నంగా నా ఎదురుగా చాచిన చేయిలో
పరుసవేది రేఖ (line of alchemy) కనిపించింది. అలాటి రేఖ కోట్లాది మందిలో ఒకరికి కూడా ఉండదు. తలెత్తి అతని ముఖం లోకి పరిశీలనగా చూచాను. సామాన్య దృష్టికి మామూలు బిచ్చగానివలేనే ఉన్నప్పటికీ అతని ముఖంలోని నిర్లిప్తతా, ముఖ్యంగా అతని కళ్ళలో ఉన్న ఈలోకానికి అతీతమైన మెరుపు లాంటిది అతనెవరో నాకుతెలియ చెప్పింది. అతని కళ్ళలోకి లోతుగా చూచేసరికి అతనూ నన్ను గుర్తించాడు. నిగూఢమైన చిరునవ్వుతో నన్ను పలకరించాడు. నేనూ చిరునవ్వు నవ్వి మనస్సులోనే ఆయనకు నమస్కరించి నా దారినసాగిపోయాను. క్షుద్ర లోహాన్ని బంగారంగా మార్చగల మనిషి బిచ్చగాడిలా అడుక్కుంటున్నాడు. జగన్మాత లీలకు మనస్సులోనే ఆశ్చర్య పడ్డాను.

యోగం కూడా పరుసవేదివిద్యయే. పరుసవేది ఇనుమును బంగారంగా మారుస్తుంది. పశు స్థాయిలోఉన్న మనిషిని దేవతగా యోగం మార్చగలదు. రెండూ అక్కచెల్లెళ్ళవంటివే. ఈ కోణంలో దీనిని అంతర్గత పరుసవేది విద్య (Inner Alchemy) అని చెప్పవచ్చు. పరుసవేది విద్య కోటిమందిలో ఒకరికి కూడా లభించదు. నిజమైన యోగం కూడా అంతే.

శ్రీరామకృష్ణుల అద్వైతవేదాంత గురువైన తోతాపురికి ఈ విద్య తెలుసు. వారి మఠంలో కొన్ని వందల సాధువులుండేవారు. వారు నగ్న సాధువులు కనుక బయట ప్రపంచంలోకి రారు. ఎవరినీ ఏమీ అడగరు. ఎవరితోనూ సంబందాలు ఉండవు. కాని వారికి కావలసిన సరుకులు, వస్తువుల విషయంలో వారికి ఎలాటి కొరతా ఉండేది కాదు. వారికి కావలసినంతవరకూ ఇనుమును, రాగిని, ఇంకా చెప్పాలంటే మట్టిని కూడా బంగారంగా మార్చుకొని దానితో వారి నిరాడంబర జీవితానికి కావలసిన రొట్టెలో ఇంకేవో వారు సమకూర్చుకునేవారు.

శ్రీ శైలానికి పదహారు మైళ్ళ దూరంలో అక్కమహాదేవి గుహలున్నాయి. ఆమె పదకొండో శతాబ్దానికి చెందిన గొప్ప శివభక్తురాలు. మహా యోగిని. దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం కన్నడ దేశాన్నుంచి శ్రీశైలానికి వచ్చి ఇక్కడికీకారణ్యంలో కొండగుహలలో ఒక్కతే ఉంటూ ఆరేళ్ళు తపస్సు చేసింది. శివ సాయుజ్యాన్ని పొందిన ధన్యాత్మురాలనిచెబుతారు. పండితారాధ్యులు కూడా ఇక్కడ నివసించారు. ఆయన ఆశ్రమం అమ్మవారి ఆలయానికి పోయే దారిలోనేఉంటుంది. ఎందరో మహాయోగులు ఇప్పటికీ ఉన్న మహా క్షేత్రమిది.

సోమవారం సాయంత్రానికి బయలుదేరి తిరుగు ప్రయాణం అయ్యాము. దారిలో వస్తుంటే శ్రీశైల శిఖరంకనిపించింది. ఆ శిఖరాన్ని దర్శిస్తే మళ్ళీ జన్మ ఉండదని అంటారు నిజమేనా? అని నాతొ ఉన్న ఒకరు అడిగారు. కావచ్చుఅని క్లుప్తంగా అన్నాను. "శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే" అన్న శ్లోకం గుర్తుకొచ్చింది.
శ్రీశైల శిఖరం అంటే యోగిక అర్ధం ఉంది. శ్రీ శైలం అంటే సంపదలతో నిండి ఉన్న కొండ. మన శరీరం సమస్త దేవతా నివాసమైన ఒక అద్భుతం. శరీరమే శ్రీశైలం. ఇందులో దేవతా శక్తుల రూపంలో సమస్త సంపదలూ ఉన్నాయి. దీని శిఖరం అత్యద్భుతమైన రంగులలో వెలుగుతూ ఉండే సహస్ర దళ పద్మం. శ్రీశైల శిఖరం దర్శించటం అంటే సహస్రార చక్రాన్ని చేరుకోవటం. దానిని ధ్యానంలో అందుకున్నసాధకునికి పునర్జన్మ ఉండదు. ఇదే అర్ధం ఈ శ్లోకంలో రహస్యంగా ఇమిడ్చి చెప్పారు. సమస్త దేవతలూ యోగికి తన దేహంలోనే దర్శనం ఇస్తారు.
నిజమే. గమనించగలిగితే అద్బుతాలు అడుగడుగునా కనిపిస్తాయి.
read more " కార్తీక సోమవారం శ్రీశైల యాత్ర "

18, నవంబర్ 2010, గురువారం

హస్త సాముద్రికం


జ్యోతిష్యం లో సాముద్రిక శాస్త్రం కూడా ఒక భాగం. దీనిలొ మనిషి యొక్క అవయవాలపొందికను, తీరును బట్టి అతని జీవితాన్ని చదవవచ్చు. దీనిలో హస్త సాముద్రికం ఒక విశిష్ట విద్య. వేళ్ళ అమరిక మనిషి మనస్తత్వాన్నితెలియచేస్తుంది. హస్త రేఖలు ఇంకా అనేక జీవిత వివరాలను తెలియ చేస్తాయి. జ్యోతిష్యం కంటే ఇది నేర్చుకోవటంతేలిక. కారణం ఏమంటే,దీనిలో విశ్లేషణలు ఉండవు. క్లిష్టమైన గ్రహ కారకత్వాలు ఉండవు. ఉన్న విషయం కళ్ళకు కట్టినట్లు చేతిలో కనిపిస్తూ ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే, ప్రతి మనిషీ తన జాతకాన్ని తన చేతిలోనే ఉంచుకుని తిరుగుతూ ఉన్నాడన్నమాట.


ఉదాహరణకు, ఉంగరపు వేలు చూపుడు వేలుకన్నా పొడవుగా ఉంటె క్రియా శీలురు ధనికులు అవుతారు. ఇది హస్తసాముద్రికం లో ఒక సూత్రం. ఒక విదేశీ యూనివర్శిటీ లో స్టాటిస్టికల్ స్టడీ ద్వారా ఈ మధ్యనే పరిశోధన చేసి ఇది నిజమేనని తేల్చారు. ఈ వార్త ఈ మధ్యనే "ఈనాడు" లో వచ్చింది కూడా.

అయితే స్టాటిస్టికల్ పరిశోధకులు గణాంకాలను బట్టి ఇది నిజమే అని తేల్చారు గాని ఎందుకు ఎలా ఇది జరుగుతుంది అనేది వారి బుర్రలకు తట్టలేదు. శాస్త్రం దీనిని వివరించి చెప్పింది. ఉంగరపు వేలు సూర్యునికి సూచిక. చూపుడు వేలు గురువు గారికి సూచిక. ఉంగరపు వేలు పొడవుగా ఉన్నప్పుడు అతనికి ఉత్సాహం, దూసుకుపోయే తత్వం,క్రియేటివిటీ,ధైర్యం ఉంటాయి. తినడం కంటే పనిచెయ్యటం మీద ధ్యాస ఎక్కువగా ఉంటుంది. కనుక అలాటివాళ్ళు జీవితంలో త్వరగా ఎదుగుతారు. ధనాన్ని, ఇన్ప్లూయెన్స్ ను సంపాదిస్తారు. ఆయా వ్యక్తిత్వలక్షణాలు ఈవిధంగా ఆయా శరీరభాగాలలో ప్రతిబింబిస్తుంటాయి. డిడక్టివ్ మరియు ఇండక్టివ్ లాజిక్ ను ఉపయోగించి ఇలాటి పరిశీలన ద్వారా మనిషి మనస్తత్వాన్ని, అతని అలవాట్లను స్వభావాన్ని, దాన్నిబట్టి భవిష్యత్తును ఊహించవచ్చు. అది చాలావరకు నిజం అవుతుంది.

మొన్న ఆరో తేదీన మా స్నేహితునికి హార్ట్ ఎటాక్ వచ్చింది. నేను వెళ్లి పలకరించాను. మాటల సందర్భంలో అతనుచెప్పినది విని నేను ఆశ్చర్య పోయాను.

"పదేళ్ళ క్రితం నా చెయ్యి చూచి నువ్వు చెప్పావురా. నీకు నలభై ఏళ్ల ప్రాంతంలో ప్రాణ గండం ఉంది.అది గుండెకు సంబంధించినదిగా ఉంటుంది.జాగ్రత్తగా ఉండు.అలవాట్లు,ఆహార విహారాదులలో జాగ్రత్త అని చెప్పావు.అలాగే జరిగింది." అన్నాడు

అప్పుడు నాకు గుర్తు వచ్చింది. ఒకసారి అతని చెయ్యి చూచి అలా చెప్పిన మాట నిజమే.

"ఇప్పుడు నీ వయసెంత?" అడిగాను.

"నలభై మూడు" చెప్పాడు.


మళ్లీ ఒకసారి అతని లైఫ్ లైన్ పరిశీలించాను.అది సరిగ్గా నలభై ఏళ్ళ ప్రాంతంలో తెగిపోయి ఉన్నది. కాని ఆ పక్కనుంచే మళ్లీ ఇంకొక రేఖ మొదలై పైకి ప్రయాణించింది. కనుకనే హార్ట్ ఎటాక్ వచ్చినా కూడా నిలదొక్కుకుని బయట పడ్డాడు.


మెడికల్ పామిస్ట్రీ ఒక అద్భుతమైన శాస్త్రం అనడానికి ఇంతకంటే రుజువు ఏమి కావాలి? "నాకు బాధగా ఉందిరాదేవుడా" అని రోగి మొత్తుకుంటున్నా కూడా అన్ని టెస్ట్ లూ చేయించి నీకేమీ రోగం లేదు. నీకు సైకోసిస్ అనబడే మానసిక భ్రమ మాత్రమే పొమ్మని వైద్యులు చేతులు దులుపుకుంటున్న ఈరోజులలో పదేళ్ళ తర్వాత రాబోతున్న గుండెజబ్బును ముందే చెప్పిన శాస్త్రం గొప్పదా కాదా?

ప్రపంచ ప్రఖ్యాత సాముద్రికుడు "కీరో" ఒకరోజున రైల్లో ప్రయాణం చేస్తూ ఉండగా పక్కవారి హస్తరేఖలు పరిశీలించాడు.విచిత్రంగా అందరికీ లైఫ్ లైన్ అనబడే జీవనరేఖ తెగిపోయి ఉండటమూ, అది తెగిపోయిన వయసు దాదాపుగా ప్రస్తుతవయసుతో సరిపోతూ ఉండటమూ,గమనించి పక్క స్టేషనులో దిగిపోయాడు.ఆ తర్వాత కొద్దిదూరానికే ఆరైలు ప్రమాదానికి గురై ఆబోగీలో ప్రయాణిస్తున్న అందరూ చనిపోయారు.కీరో బతికి బయట పడ్డాడు.యూరోపియన్ అయిన కీరో,కాశీలో కొన్నేళ్ళు నివసించి, కాశీ పండితులవద్ద హస్తసాముద్రికశాస్త్రం నేర్చుకున్నాడు.అతను హస్తాంగులీమంత్రాన్ని ఉపాసించేవాడని కొద్ది మందికే తెలుసు.

మన ప్రాచీనవిజ్ఞానంలో ఒకటైన హస్తసాముద్రికం వల్ల ఇలాటి ఆశ్చర్యకరమైన ఫలితాలు తెలుసుకోవచ్చు.మన భవిష్యత్తు బ్లూప్రింట్ మన చేతిలోనే ఉంది.అయితే దానిని డీకోడ్ చేసి, అర్ధం చేసుకొని, తెలివిగా ప్రవర్తించేవారు భవిష్యత్తుని తదనుగుణం గా మార్చుకునేవారు తక్కువ. దానికి ఎవరేం చెయ్యగలరు ? బుద్ది కర్మానుసారిణి కదామరి.
read more " హస్త సాముద్రికం "

11, నవంబర్ 2010, గురువారం

నేనెదురు చూస్తున్న సినిమా

సామాన్యంగా నేను సినిమాలు చూడటం చాలా తక్కువ. కొత్త తెలుగు సినిమాలంటే నాకు చచ్చే భయం. వాటి జోలికైతే అస్సలు పోను. హీరో హీరోయిన్ల వెకిలి నటనలు, వెకిలి డైలాగులు, డోకొచ్చే హాస్యాలు, ఎందుకు చేస్తున్నారో తెలియని చెత్త డాన్సులు, అనవసర హింసా, చెత్త ఫైట్లూ ఇవన్నీ చూచే ధైర్యం నేను చెయ్యలేను. నేను లేటెస్ట్ గా చూసిన తెలుగు సినిమాలు --"అరుంధతి"-- దాని తర్వాత "రోబో".

కాని ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని నేను ఎదురు చూస్తున్న సినిమా ఒకటుంది. ఆఫ్ కోర్స్ ఆది తెలుగు సినిమా కాదు. తెలుగు సినిమాలకింకా అంత దృశ్యం రాలేదు.

దాని పేరు Yip Man-The Legend

వింగ్ చున్ కుంగ్ ఫూ స్టైల్ లో గత తరం గ్రాండ్ మాస్టర్ అయిన "యిప్ మన్" జీవిత గాధను కొద్ది మార్పులు చేసి ఆపేరుతొ తెరకెక్కించారు. ఈయన బ్రూస్ లీ గురువు. ఈయన దగ్గర బ్రూస్ లీ కొంత కాలం కుంగ్ ఫూ నేర్చుకుని మధ్యలోనేవిడిచి పెట్టాడు. మన దేశం లో ఈ సినిమా ఈ నెల పద్దేనిమిదిన " కుంగ్ ఫూ ఫైటర్ " అనే పేరుతో రిలీజ్ కాబోతున్నది.

నా అభిమాన కుంగ్ ఫూ నటుడు "డానీ యెన్" దీంట్లో యిప్మన్ గా నటించాడు. సామో హుంగ్ దర్శకత్వం వహించాడని అనుకుంటున్నాను.

ఒక మహిళా గ్రాండ్ మాస్టర్ చేత కనిపెట్ట బడిన "వింగ్ చున్ స్టైల్" యొక్క టెక్నిక్స్ ఎలా ఉంటాయి? షావోలిన్ కుంగ్ ఫూ తోఈ స్టైల్ ఎలా విభేదిస్తుంది? మాస్టర్ యిప్ మన్ జీవిత వివరాలు ఏమిటి? ఆయన నిజ జీవితం లో చేసిన ఫైట్స్ ఎలాఉంటాయి. మొదలైన వివరాలు చక్కగా ఇందులో చూడవచ్చు.

ఇది 2008 లో విడుదలైంది. ఇప్పుడు భారత దేశం లో విడుదలౌతున్నది. యూ ట్యూబ్ లో దీనిని ఇప్పటికేచూచినప్పటికీ, వెండి తెరపైన చూడాలని వేచి చూస్తున్నాను. ఇందులోని ఫైట్స్ దేనికదే సాటిగా అద్భుతం గా ఉన్నాయి. కానీ పదిమంది బ్లాక్ బెల్ట్స్ ను ఎదుర్కొని "యిప్మన్" చేసిన ఫైట్ మరియు చివరి ఫైట్ చాలా బాగున్నాయి. సినిమా విడుదలయ్యాక, వెండి తెరపై చూచాక వివరంగా రివ్యూ వ్రాస్తాను. ప్రస్తుతానికి ఈ ట్రైలర్ చూద్దామా.


read more " నేనెదురు చూస్తున్న సినిమా "

7, నవంబర్ 2010, ఆదివారం

అమావాస్య ప్రభావం మళ్ళీ మళ్ళీ ?

మొన్న ఐదో తేదీ శుక్రవారం నాడు పాకిస్తాన్ లో సీదులో బాంబులు పేలి నూరు మంది పైగా హతం అయ్యారు. రోజున దీపావళి అమావాస్య. అమావాస్య ఘడియలు అప్పుడే మొదలయ్యాయ్. కొద్ది సేపటిలోనే ముస్లిం తీవ్రవాది అయిన సూయిసైడ్ బాంబర్ మీద అమావాస్య చంద్రుని ప్రభావం, బలహీన బుధుని ప్రభావం, రాహువు ప్రభావం కలసి పనిచేసి అతన్ని ప్రేరేపించి బాంబు పేలుడుకు పురికొల్పాయి. మొత్తం నూరు మందికి పైగా చనిపోయారు. పాకిస్తాన్ ముస్లిములు విధం గా దీపావళి పండుగను జరుపుకున్నారు.

ఇది జరిగి రెండురోజులు కాలేదు. ఇప్పుడు జల్ తుపాను దక్షిణ భారతాన్ని ఒణికిస్తోంది. మళ్ళీ ఇవన్నీ అమావాస్య కు ఖచ్చితంగా అటూ ఇటూగా జరుగుతున్నాయి. కనుక చంద్రుని స్థితులకు భూమి మీది విలయాలకు ఖచ్చితమైన సంబంధం ఉందని మాటి మాటికీ రుజువౌతున్నది.

రోజు గ్రహస్థితి ఇక్కడ ఇచ్చాను. బుద్ధి కారకుడైన బుధుడు సున్నా డిగ్రీలలో ఉంది అతి బలహీనుడుగా ఉన్నాడు. కనుక ఎవరు ఏమి చేస్తున్నారో తెలియని పరిస్తితి అప్పుడు ఉన్నది. గురువు కూడా బలహీనుడుగా ఉన్నాడు. నవాంశ లోబుధ రాహువులు కలిసి కుట్రలను సూచిస్తున్నారు. అందువల్లనే విలయం జరిగింది.

పాకిస్తాన్, భారత దేశాలకు జనన చక్రం దాదాపు గా ఒక్కటే. బహుశా అందువల్లనే రెండు దేశాలలో ఇప్పుడు విలయాలు జరుగుతున్నాయి. అయితే వర్గ చక్రాలలో చాలా భేదాలు ఉన్నాయి. అందుకని అక్కడ బాంబు పేలుళ్లుఇక్కడ తుఫానులు కనిపిస్తున్నాయి. నవగ్రహాలలో ఏడు గ్రహాలు ఒక ప్రక్కన చేరి ఉండటం చూడవచ్చు. ఇలాటిసమయాలలో పంచ భూతాలలో అసమతుల్యత ఏర్పడుతుంది.

సూర్య చంద్ర గ్రహాల ప్రభావం భూ వాతావరణం మీద మాత్రమె కాదు మానవ మస్తిష్కాల మీద కూడా ఉంది అని ఎన్నోసార్లు రుజువౌతున్నది. ప్రభావాలు స్థూలం గానే కనిపిస్తుంటాయి. మిగిలిన గ్రహాల ప్రభావాలు సూక్ష్మ స్థాయిలోపనిచేస్తుంటాయి. మనిషి జీవితం లో ప్రభావాలు ఎలా పనిచేస్తాయి అన్నది జాతకం ద్వారా చాలావరకూ కరక్ట్ గాఊహించవచ్చు. కాని మేదినీ జ్యోతిష్యం లో కూడా దీనిని సాధించగలిగితే ప్రక్రుతి విలయాలను ముందుగానేకనిపెట్టవచ్చు.

అయితే గ్రహ ప్రభావం ఒక సమయానికి ఒక స్థలం లోనే ఎందుకు పనిచేస్తున్నది? ఘటనల వెనుక దాగి ఉన్నసూత్రాలు నియమాలు ఏమిటి? అన్న ప్రశ్నలకు జవాబులు రీసెర్చి ద్వారా కనుక్కోగలిగితే మొత్తం చిక్కు ముడివిడిపోయినట్లే. దిశగా ఔత్సాహికుల ప్రయత్నాలు సాగవలసి ఉంది.
read more " అమావాస్య ప్రభావం మళ్ళీ మళ్ళీ ? "

5, నవంబర్ 2010, శుక్రవారం

సర్దార్ పటేల్ జాతకం-- జనన కాల సంస్కరణ

రాజకీయాలను నేను ఏ మాత్రం ఇష్టపడను. దానికి కారణం విలువలు లేని రాజకీయ నాయకులతో ప్రస్తుతం ఆ రంగం నిండిపోవటమే.

నా అభిమాన రాజకీయ నాయకులు ఎవరు అని అడిగితె ఇద్దరు ముగ్గురి పేర్లు మాత్రమెచెప్పగలను. వారూ ఇప్పటివారు కారు. ఇప్పుడు లేరు. వారిలో ఉక్కు మనిషి సర్దార్ పటేల్ ను నేను అమితంగా అభిమానిస్తాను. గౌరవిస్తాను. ఆయనలాటి ధృఢచిత్తం, దూరదృష్టీ ఉన్న నాయకులు ఇప్పుడు మన దేశానికి చాలా అవసరం.నేను గుజరాత్ లోని సోమనాధ ఆలయానికి వెళ్ళినపుడు ఆలయం లోని ఈశ్వరునికి ఎలా నమస్కరించానో అంతే భక్తిగా ఆలయం బయట ఉన్న సర్దార్ పటేల్ విగ్రహానికీ నమస్కరించాను. ఆయన ప్రధాని అయినట్లయితే మన దేశ రూపురేఖలు ఇలా ఉండేవి కావని ఎంతో బాగుండేవని నమ్మేవాళ్ళలో నేనూ ఒకడిని.

ఆయన జాతకాన్ని ఇక్క చూద్దాం. ఆయన యొక్క అసలైన జనన వివరాలు లేవని అందరూ అంటున్నారు. ప్రముఖ జ్యోతిష్కులైన కే ఎన్ రావుగారు కూడా ఇదే అభిప్రాయ పడ్డారు. కాని చాలా మంది అభిప్రాయం ప్రకారం ఆయన 31-10-1875 న గుజరాత్ లోని నాదియాడ్ అనే ఊళ్ళో జన్మించారు. జనన సమయం తెలీదు కనుక ఆయన జన్మ లగ్నాన్ని జ్యోతిష్కులు రకరకాలుగా ఊహించారు. పట్టుదలకు ప్రతిరూపం అయిన మకర లగ్నాన్ని చివరకు ఖాయం చేశారు. ఆది సమంజసంగా ఉంటుంది కూడా. ఆయన జాతకాన్ని ఇక్కడ ఇచ్చాను. దీనిని నేను కొంచెం ఫైన్ ట్యూన్ చేశాను. అదెలా చేశానో ఆ వివరాలు చూధ్ధాం.

ఆ రోజున మకర లగ్నం 12.15 నుంచి 14.03 గంటలవరకూ ఉంది. ఈ రెండు గంటల సమయంలో ఆయన యొక్క జనన నిముషాన్ని మనం కనిపెట్టాలి. దీనికి ప్రశ్న శాస్త్ర సహాయం తీసుకున్నాను. ఈ రోజు మధ్యాహ్నం నేను వేసిన ప్రశ్న చక్రంలో రూలింగ్ ప్లానెట్స్ ఇలా వచ్చాయి.

లగ్నాధిపతి= గురువు
లగ్న నక్షత్రాధిపతి= శని
చంద్రాధిపతి= రవి
చంద్ర నక్షత్రాధిపతి= కేతువు
వారాధిపతి= చంద్రుడు
హోరాధిపతి= గురువు

శని చంద్ర నక్షత్రంలో ఉన్నాడు. వారాధిపతి చంద్రుడు. కనుక చంద్రుడు రెండు సార్లు వచ్చాడు. గురువు కూడా రెండు సార్లు వచ్చాడు. కనుక వీరిద్దరూ రూలింగ్ ప్లానెట్స్ గా ఉన్నారు. రవి, కేతువులు రాహు నక్షత్రంలో ఉన్నారు. కనుక ఆయన జాతకంలో రాహు కేతువుల యోగం ఏదో ఉండి ఉండాలి. దీనికి సరిపోతూ ఆయన జాతకంలో కాలసర్ప యోగం ఉన్నది.

గురువు ప్రస్తుతం సున్నా డిగ్రీలలో బలహీనుడుగా ఉన్నాడు. మకర లగ్నం గురువుకు నీచ కనుక ఆ కారకత్వం ఇలా సరిపోయి మకర లగ్నాన్ని క్రరెక్ట్ గా సూచిస్తున్నది. కనుక అందులో చంద్ర నక్షత్రమైన శ్రవణం ఆయన లగ్న నక్షత్రమై ఉండాలి. ఆ శ్రవణం మకరంలో నాలుగో పాదం నుంచీ ఏడోపాదం వరకూ ఉంటుంది. ఆ సమయం మధ్యాహ్నం 12.55 నుంచి 13.40 వరకూ ఉంది. ఇప్పుడు రెండు గంటల సమయాన్నించి దాదాపు ఒక గంట సమయం మనకు కుదించబడింది. అందులోకూడా 13.09 కి దశాంశ లగ్నం మకరం అయ్యింది. దశాంశలో కూడా మకరంలో ఉచ్ఛస్థితిలోఉన్న కుజుడున్నాడు. ఈయన జాతకంలో ఉఛ్ఛస్థితిలో ఉన్న కుజుడు ప్రముఖపాత్ర వహిస్తున్నాడు. ఈయన జనన సమయం కూడా కుజహోరలోనే జరిగింది.

ఈ సమయానికి ఆయన జాతకం లోని మరికొన్ని వివరాలు సరిపోతాయా లేదా చూద్ధాం. ఈసమయానికి నవాంశ లగ్నం వృషభం అయ్యింది. అందులో శుక్ర కేతువులున్నారు. కనుక ఈయన భార్య ఒక దీర్ఘవ్యాధితో మరణించి ఉండాలి. ఈ సమయానికి వచ్చిన దశల ప్రకారం 1909 లో భార్య కేన్సర్ వ్యాధితో మరణించింది. అప్పుడు ఈయనకు కేతు/శని/శుక్ర దశ జరుగుతున్నది. కనుక ఈ సమయం సరిగానే ఉన్నది.

ఇకపోతే
దశాంశనుబట్టి ఈ సమయానికి ఇతర జీవిత వివరాలు చూద్దాం. 1917 లో ఆయన అహమదాబాద్ శానిటరీ కమిషనర్ గాఎన్నికయ్యాడు. అప్పుడు ఆయనకు శుక్ర/కుజ దశ జరుగుతున్నది. ఉచ్చ స్తితిలోని కుజ అంతర్దశ యోగించింది.

1947 నుంచి ఆయనకు కుజమహాదశ మొదలైంది. సెప్టెంబర్ 1948 లో ఆపరేషన్ పోలోను ధైర్యంగా అమలు జరిపి సంస్థానాలను విలీనం చేశాడు. అప్పుడు ఆయన జాతకంలో కుజ/గురు దశ జరుగుతున్నది. కుజుడు ఉఛ్ఛ స్థితిలోనూ గురువు మేషంలో చతుర్ధంలోనూ ఉండి ఈ సంఘటనను సూచిస్తున్నారు.

ఈయన కుజ/బుధ/శుక్ర దశలో డిసెంబర్ పదిహేనో తేదీన 1950 లో మరణించారు. చంద్రుని నుంచి కుజుడు ఆయుస్థానంలో ఉన్నాడు. బుధ శుక్రులు ద్వాదశంలో ఉన్నారు. చంద్రలగ్నానికి ఇద్దరూ మారకులే. కనుక అంతా సరిపోయింది.

ఈ సమయానికి ఆయన జనన నక్షత్రం అనూరాధ రెండవపాదం వచ్చింది. కుందస్ఫుటం ప్రకారం ఉత్తరాభాద్ర రెండవపాదం గా వచ్చి జనన సమయం సరియైనదే అని చూపిస్తున్నది.

ఈ విధంగా ఆయన జనన సమయాన్ని 13.09.05 గా నిర్ణయించాను.

మిగిలిన ఆయన జీవిత వివరాలు తరువాత పోస్ట్ లో చూధ్ధాం.
read more " సర్దార్ పటేల్ జాతకం-- జనన కాల సంస్కరణ "

4, నవంబర్ 2010, గురువారం

దీపావళి శుభాకాంక్షలు

దీపావళి పండుగ పర్వదినాన "ఆలోచనా తరంగాలు" బ్లాగు సభ్యులకు, చదువరులకు, తోటి తెలుగుబ్లాగర్లకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అందరి హృదయాలలో దివ్య దీపాలు వెలగాలి. అజ్ఞాన తిమిరాలు పోవాలి. ఆనందపు జ్యోతులు విరజిమ్మాలి అని ఆకాంక్షిస్తున్నాను.
read more " దీపావళి శుభాకాంక్షలు "