జ్యోతిషం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
జ్యోతిషం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, అక్టోబర్ 2026, శుక్రవారం

2032 లో కల్కి రాబోతున్నాడా?

2032 లో కల్కి రాబోతున్నాడని ఒక ప్రసిద్ధ గురువుగారు చెప్పారని సోషల్ మీడియాలో ముమ్మరంగా ప్రచారం జరుగుతున్నది. దీనిమీద మీ అభిప్రాయం ఏమిటని నా శిష్యులలో ఒకరు ప్రశ్నించారు.

హిమాలయాలలోని శంభలా గ్రామంలో కల్కి ఇప్పటికే పుట్టి ఉన్నాడని, ప్రస్తుతం ఆయనకు పది పదిహేను ఏళ్ళని, ఇంకో ఐదేళ్లలో మంచి వయసులో ఉన్న యువకునిగా ఆయన సమాజంలోకి వస్తాడని ఆయన చెబుతున్నాడట.

 అడ్రసు తెలిస్తే చెప్పచ్చు కదా ! 

"అది మాత్రం అడక్కండి" అని ఆయనంటున్నాడట !  ఏమంటే, "అది దేవరహస్యం" అన్నాడట. 

"అది రహస్యమైనపుడు, ఇది మాత్రం చెప్పడమెందుకు? నాటకాలా?" అని నేనన్నాను.   

చాలామంది ఇలాంటివాళ్ళు "శంభలా ఎక్కడుందో మాకు తెలుసు. మేము అక్కడికి పోయొచ్చాము" అని చెబుతున్నారు. వీడియోలు చేస్తున్నారు.

"అన్నీ అబద్దాలే" అని నేనంటున్నాను. వినేవాడు వెర్రివెంగళప్ప అయితే, చెప్పేవాడు ఏదైనా చెబుతాడు. ఇవన్నీ ఉత్త కాలక్షేపం కబుర్లు మాత్రమే. ఇంకేమీ కాదు.

మరికొంతమంది ఔత్సాహికులు ఇంకొక అడుగు ముందుకేసి, 'శంభలా' అంటే హిమాలయాలలో లేదని, అది ఒరిస్సాలోని 'సంబల్ పూర్' అనే ఊరని చెబుతున్నారు. మరింకేం? ఆ ఊర్లో "విష్ణుయశ్, సుమతి" అనే దంపతులు ఎక్కడున్నారో ఓటర్లలిస్టులో చూసి కనుక్కోండి. కల్కి తల్లిదండ్రుల పేర్లు అవే అని 'కల్కిపురాణం' చెబుతోంది. వాళ్ళ ఇంట్లోనే కల్కి పుట్టి పెరుగుతున్నాడు. సింపుల్ కదా అని నేనన్నాను.

అయినా, అర్ధంపర్థం లేని పిచ్చిపిచ్చి పేర్లు పిల్లలకు పెట్టుకుంటున్న నేటిసమాజంలో అంత మంచిపేర్లు ఎవరు పెట్టుకుంటున్నారో ఆ కల్కికే తెలియాలి !

-----------------------  

ఈ విధంగా కల్కి వస్తున్నాడని ఇప్పటివరకూ చాలామంది చెప్పారు. అలా చెప్పినవాళ్ళందరూ పోయారుగాని కల్కిమాత్రం రాలేదు. 2000 సంవత్సరంలో కలియుగాంతం వస్తున్నదని వేదవ్యాస్ గారు పుస్తకమే వ్రాశారు. కానీ అదేమీ జరగలేదు. ఆయనే పోయారు. ప్రస్తుతం 2026 నడుస్తున్నది. అటువంటిదేమీ మనకు కనిపించడం లేదు. ఒకవేళ కల్కి వచ్చిఉంటే, ఈ సమాజంలోకి రావడానికి భయపడి ఎక్కడైనా దాక్కుని ఉన్నాడేమో నాకైతే తెలీదు.

మొన్నీమధ్యనే కల్కిభగవాన్ కన్నుమూశాడు. ఎవరో మాతో ఈ మాట చెబితే మేము భలే నవ్వుకున్నాం. కలియుగం ఇంకా అయిపోలేదు. అప్పుడే కల్కి రావడం పోవడం కూడా అయిపోయిందా? ఎంత పిచ్చి జనంరా దేవుడా ! అనిపించింది.

కొన్నేళ్ల క్రితం రైల్వేలో 'కల్కి అవతార్' అని ఒక ఆఫీసర్ ఉండేవాడు. ఆ అవతారం చేసిన లీలలన్నీ మాకు బాగా తెలుసు. ఎంత కామెడీనో !

కృష్ణభగవాన్ అని పేరు పెట్టుకున్నంత మాత్రాన సదరువ్యక్తి శ్రీకృష్ణుడెలా అవడో, కల్కిభగవాన్ అని పెట్టుకున్నంతమాత్రాన ఆయనా అవ్వడు. ఆజాద్, భగత్ అని పేర్లు పెట్టుకున్నంతమాత్రాన ఎవరూ ఫ్రీడమ్ ఫైటర్సూ అవరు.

ఉత్తపేర్లతో ఎవరూ ఏదీ అయిపోరు. మహాత్మా అని బిరుదులు తగిలించుకున్నవారంతా మహాత్ములౌతారా? ఇదీ అంతే.

అయితే, ఇటువంటి నమ్మకాలు ప్రతితరంలోనూ ఉంటాయి. కాలం మాత్రం ఆగకుండా ముందుకు నడుస్తూనే ఉంటుంది. జనాల నమ్మకాలు ఒకవిధంగా ఉంటే, నిజాలు మాత్రం వేరేగా ఉంటాయి.  ఈ గోల ఎప్పుడూ ఉండేదే.

జీసస్ వస్తున్నాడని రెండువేల ఏళ్ళనుంచీ చెబుతున్నారు. ఇంతవరకూ జాడా జవాబూ లేదు. తాము జీవించి ఉండగానే ఆయన వస్తాడని, ఆయనను చూడకుండా తాము చనిపోమని జీసస్ శిష్యులు నమ్మేవారు. అదేమీ జరగలేదు. ఆయన వస్తున్నాడని ఎదురుచూస్తూనే వారందరూ పోయారుగాని, ఆయనమాత్రం రాలేదు. బహుశా ఎప్పటికీ రాకపోవచ్చు కూడా !

-------------------------

అయితే, 2032 ప్రత్యేకత ఏమిటి? ఏదో ఒకటి ఉండాలి కదా ! అదే సంవత్సరాన్ని ఎందుకు చెబుతున్నారు? అని అనుమానం రావచ్చు.

2032 గ్రహస్థితిని ఒక్కసారి చూద్దాం. అది యురేనస్ రిటర్న్ చార్ట్ అవుతున్నది. అంతేకాదు ప్లూటో అర్ధ రిటర్న్ చార్ట్ కూడా అవుతున్నది.

మనకు 1947 లో స్వాతంత్య్రం వచ్చింది. అప్పుడు యురేనస్ మిధునం 2 వ డిగ్రీపైన ఉన్నాడు. 85 ఏళ్ల తర్వాత 2032 లో మళ్ళీ అదే స్థానానికి రాబోతున్నాడు. దీనిని యురేనస్ రిటర్న్ చార్ట్ అంటారు. ప్రపంచచరిత్రను పరిశీలిస్తే, ఇటువంటి పరిస్థితి వచ్చినపుడు ఆ దేశంలో సమూలమైన మార్పులొస్తాయి. ఉద్యమాలు, విప్లవాలు, తిరుగుబాట్లు వచ్చి దేశవ్యవస్థ అంతా క్రొత్తదారిలో పోవడం మొదలౌతుంది. ఒక మాటలో చెప్పాలంటే దేశపరిస్థితి రీ-సెట్ అవుతుంది. 

గతంలో అమెరికా విషయంలో ప్లూటో పరంగా ఇది ఋజువైంది.

అమెరికా స్వాతంత్య్రం జూలై 4, 1776 న వచ్చింది. ఆనాడు ప్లూటో మకరం 6 వ డిగ్రీపైన ఉన్నాడు. ప్లూటో సైకిల్ 248 ఏళ్ళు. తిరిగి అదే స్థానానికి 2024 న వచ్చాడు. గత రెండేళ్లలో అమెరికా ఎన్ని మార్పులకు లోనౌతోందో గమనించవచ్చు.

2019 ఎలక్షన్ల సమయంలో తన బిజినెస్ రికార్డులను తారుమారుగా చూపించి ప్రభుత్వాన్ని మోసగించాడన్న నేరంపైన అమెరికా అధ్యక్షుడే నేరస్తుడని 2024 లో అమెరికా కోర్టు తీర్పునిచ్చింది. దానిపైన ప్రస్తుతం అపీల్ నడుస్తోంది. గతంలో ఏ అధ్యక్షునికీ ఇలా జరుగలేదు.

అప్పటినుంచీ ప్రపంచవేదికలపైన అమెరికా ఒంటరిదై పోతోంది. మునుపటి దర్పం తగ్గిపోతోంది. ఇతరదేశాల కూటములు అనేకం ఏర్పడుతున్నాయి. అమెరికా నిరంకుశత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. మనదేశమూ, చైనాదేశమూ ప్రపంచరాజకీయాలను శాసించే దిశగా ముందుకు దూసుకొస్తున్నాయి. ఇరాన్ తో పెట్టుకున్న యుద్ధంతో అమెరికా అల్లాడుతోంది. 2024 నుంచీ ఈ మార్పులు చకచకా వస్తున్నాయి. గమనించండి.

మనకు స్వాతంత్య్రం వచ్చినది 1947 లో గనుక మనకు ప్లూటో రిటర్న్ చార్ట్ 2195 లో వస్తుంది. అయితే, అర్ధ రిటర్న్ చార్ట్ మాత్రం 2032 లో వస్తుంది. అంటే, స్వతంత్రం వచ్చినపుడు ప్లూటో కర్కాటకం 20 వ డిగ్రీలో గ్రహయుద్ధంలో ఉన్నాడు. 2032 లో దానికి  సరిగ్గా సప్తమంలోకి అంటే మకరం 20 వ డిగ్రీపైకి వస్తాడు.

మన దేశానికి యురేనస్ రిటర్న్ చార్ట్ 31 మే, 2032 న వస్తున్నది. అంటే, ఆ రోజున యురేనస్ మళ్ళీ మిథునం 2 వ డిగ్రీపైన, అంటే మనకు స్వాతంత్య్రం వచ్చినప్పటి డిగ్రీపైన సంచరిస్తాడు. అదే సమయానికి ప్లూటో మకరం 20 వ డిగ్రీపైన సంచరిస్తున్నాడు. మకరం కూడా మన దేశాన్ని సూచించే రాశియే.

కనుక, యురేనస్, ప్లుటోలు రెండూ 2032 వ సంవత్సరాన్ని స్పష్టంగా సూచిస్తున్నాయి. అయితే, ఇది మంచి సూచనైతే మాత్రం కాదు. ఏమంటే, పాతవ్యవస్థ గతించి క్రొత్త వ్యవస్థ మొదలు కావడానికి ప్లూటో సూచకుడైతే, ఉద్యమాలకు, విప్లవాలకు యురేనస్ సూచకుడు. కనుక సంక్షోభం స్పష్టంగా కన్పిస్తున్నది.

----------------

ఆ రోజున గ్రహస్థితిని చూద్దాం.  

మే 31, 2032 న గ్రహస్థితులు ఇలా ఉన్నాయి. 

గురువు వక్రించి నీచస్థితిలో ఉన్నాడు. శని మిధునంలో ఉన్నాడు. యురేనస్, ప్లుటోల పరిస్థితి పైన వివరించాను.

మన దేశలగ్నమైన వృషభంలో నాలుగు గ్రహాల గ్రహయుద్ధం ఉన్నది. 

వీరిలో సూర్యుడు, శుక్రుడు ఒకే డిగ్రీ (16 వ డిగ్రీ) పైన రోహిణీ నక్షత్రంలో ఉన్నారు. రోహిణి ప్రజానక్షత్రం.

వృషభానికి పాపార్గళం ఉన్నది. కేతువు కుజునికి సూచకుడు. కుజశనుల అర్గళం మనదేశానికి పట్టింది. అంటే యుద్ధం గాని, దానికి సమానమైన సంక్షోభం గాని కనిపిస్తున్నది.

కనుక, ఆ సమయంలో మన దేశవ్యవస్థలో సమూలమైన మార్పులు కనిపిస్తున్నాయి. బహుశా ఆ సమయానికి మన అతుకులబొంత రాజ్యాంగం సమూలంగా మార్చబడవచ్చు. ప్రపంచవ్యాప్తంగా వచ్చే మార్పుల వల్ల పాతరాజ్యాంగం పనికిరాకుండా పోయి, క్రొత్త రాజ్యాంగాన్ని వ్రాసుకునే పరిస్థితి ఏర్పడవచ్చు. ఇలా జరగాలంటే మూడో ప్రపంచయుద్ధం లాంటి మరొక యుద్ధం  జరగాలి. అది జరిగే సూచనలు కూడా బలంగా కనిపిస్తున్నాయి.

ఇటువంటి సంక్షోభపరిస్థితులు ఏర్పడే అవకాశం తప్పకుండా ఉందిగానీ, కల్కి అవతారం వచ్చే సూచన మాత్రం ఎక్కడా లేదు.

-----------------------

ప్రతి పదేళ్లకూ "కల్కిఅవతారం వస్తున్నది" అని కొంతమంది చెప్పడం ఒక ఫ్యాషన్ అయిపోయింది.  "కల్కి ఇప్పటికే పుట్టాడు. అడ్రసు కూడా మాకు తెలుసు" అని కొంతమంది కుహనాగురువులు చెప్పుకుంటూ ఉండటం కూడా ఇలాంటిదే.

కల్కి గుర్రం ఎక్కి వస్తాడు. మహమ్మద్ కూడా గుర్రం మీదే తిరిగేవాడు గనుక, మహమ్మదే కల్కి అని 40 ఏళ్ల క్రితమే సాయిబులలో ఒక వర్గం ప్రచారం చేసేది. అయితే దానినెవరూ నమ్మలేదు. ఇలా చాలామంది చాలా కధలు చెబుతూ ఉంటారు.

ఇదంతా పెద్దబూటకం ! కలియుగాంతం జరగడానికీ, కల్కి రావడానికీ ఇంకా చాలా సమయముంది. మనమెవ్వరమూ ఈ జన్మలో దానిని చూడము. చూడలేము.

2032 ప్రాంతంలో మన దేశ రాజకీయ, సామాజిక, ఆర్ధికవ్యవస్థలలో సమూలమైన మార్పులు వస్తాయి. అంతేగాని, కల్కి అవతారం మాత్రం రాదని నేను చెబుతున్నాను.

నమ్మితే నమ్మండి. నమ్మకపోతే మీ ఇష్టం.

అయినా ఇంకెంత దూరం? 5 ఏళ్ళేగా ! చూద్దాం ఏమి జరుగుతుందో.

read more " 2032 లో కల్కి రాబోతున్నాడా? "

6, అక్టోబర్ 2026, మంగళవారం

8 ఏళ్ల అమ్మాయి పాప్ స్టారా? పని ఒత్తిడితో చనిపోయిందా? ఏమిటీ ఘోరం?

హిరాటా రునా అనే జపాన్ అమ్మాయి 8 ఏళ్ల పాప్ స్టార్. తనలాగే స్టార్లు కావాలనుకునే తన వయసు పిల్లలకు ట్రెయినర్ కూడా. ఈ అమ్మాయి సెప్టెంబర్ 25 న గుండెజబ్బుతో చనిపోయింది. ఆ సమయానికి ఈ అమ్మాయికి కేవలం 8 ఏళ్ళు మాత్రమే. వినడానికి వింతగా లేదూ?

వెర్రితలలేస్తున్న మోడరన్ నాగరికతకూ, పిల్లలపైన పెరుగుతున్న విపరీతమైన పని ఒత్తిడికీ ఇదొక నిదర్శనం. ఈ అమ్మాయి జాతకాన్ని చూద్దాం.

16-4-2018 న జపాన్ లోని నగోయాలో ఈ అమ్మాయి పుట్టింది. జననసమయం తెలియదు గనుక చంద్రలగ్నాన్ని తీసుకుందాం. ఆరోజున చంద్రుడు మీన, మేష రాశులలో సంచరించాడు. జాతకసంస్కరణ చేయడం ద్వారా, చంద్రుడు అశ్వినీ నక్షత్రంలో ఉన్నాడని నేను ఊహిస్తున్నాను. అదంతా ఎలా చేశానో ఇక్కడ వివరించను.

12 ఏళ్ల లోపు ఇటువంటి సంఘటన జరిగితే, దానిని బాలారిష్ట దోషమంటారు. దీనిలో మళ్ళీ మూడు విభాగాలున్నాయి.

పుట్టిననాటి నుండి 4 ఏళ్ల లోపు తల్లియొక్క కర్మవల్ల జరుగుతుంది. 5 నుండి 8 ఏళ్ల లోపైతే తండ్రి యొక్క కర్మ కారణమౌతుంది. 9 నుండి 12 ఏళ్ల లోపైతే, జాతకుని కర్మయే కారణమౌతుంది.

బాలారిష్టాలు తప్పాలంటే జాతకంలో కొన్ని యోగాలుండాలి. చంద్ర బలమూ, గురు బలమూ, లగ్నబలమూ ఉంటే ఇవి తప్పుతాయి.

జననతిధి అమావాస్య గనుక చంద్రబలం లేదు. లగ్నాధిపతి కుజుడు భాగ్యభావంలో బద్ధశత్రువైన శనితో కలసి  ఉన్నాడు.కనుక బలహీనుడైనాడు. గురువు మారకస్థానంలో వక్రించి బలహీనుడుగా ఉన్నాడు. మూడు బలాలూ లేవు. కనుక, బాలారిష్టం తప్పలేదు.

చతుర్ధాధిపతి చంద్రుడే గుండెకు సూచకుడు. చతుర్దంలో రాహువున్నాడు. అది గ్రహణయోగం. కనుక పుట్టుకతో ఈ అమ్మాయికి గుండె బలహీనంగా ఉందని చెప్పవచ్చు. పంచమాధిపతి సూర్యుడు ఉచ్ఛస్థితిలో ఉన్నందున, జీవితంలో ఎదగాలని, ఏదో సాధించాలని తపన మాత్రం అధికంగా ఉంటుంది. కళలకు కారకుడూ, మారకుడూ అయిన శుక్రుడు కూడా అక్కడే ఉన్నందున, స్టేజి షోలు, సినిమాలు మొదలైన రంగాలు ఆకర్షిస్తాయి. కానీ అది కుదరదు. ఇంకాపైగా, అదే ప్రాణాంతకమౌతుంది.

తృతీయం ఆయుస్థానం. అధిపతి బుధుడు 12 వ భావంలో నీచస్థితిలో ఉన్నాడు. కనుక ఆయుష్షు దెబ్బతిన్నది. అష్టమాధిపతి కుజుడు శనితో కలసి బలహీనుడయ్యాడు. అష్టమభావం పాపార్గళానికి గురయ్యింది. వక్రించి, శత్రుస్థానంలో ఉన్న గురువు బలహీనుడే. కనుక పాపార్గళం అవుతుంది. శనికుజులతో కలసి ప్లూటో ఉన్నాడు. ఈ ముగ్గురూ ఆయుస్థానమైన మిధునాన్ని చూస్తున్నారు. ప్లూటో యముడని మనకు తెలుసు.

25-10-2026 న ఈ అమ్మాయికి  శుక్ర శుక్ర శని శుక్ర శుక్ర దశ నడిచింది. ఈ చంద్రలగ్నానికి శుక్రుడు మారకుడు. శని బాధకుడు, పైగా ప్లుటోతో కలసి లగ్నాధిపతి కుజుడిని నిస్సహాయుడిని చేశాడు.

గోచారాన్ని గమనిద్దాం. 

25-10-2026 న గ్రహస్థితులు ఇలా ఉన్నాయి. ఏలినాటి శని నడుస్తున్నది. చతుర్దంలో నీచకుజుడు, ఉచ్ఛగురువు ఉన్నారు. గుండెసమస్య స్పష్టంగా కనిపిస్తున్నది. సప్తమ మారకస్థానంలో రవి, బుధ, శుక్రులున్నారు. వీరిలో బుధ శుక్రులు వక్రించి ఉన్నారు. శుక్రుడు తీవ్రంగా అస్తంగతుడైనాడు. నవాంశలో గమనిస్తే అష్టమభావంలో నీచరాహువున్నాడు. 

పెద్దగా వివరణ అవసరం లేదు. ఇవన్నీ కలసి, ఈ పాపకు బాలారిష్టాన్ని కలిగించాయి.

జపాన్ స్కూళ్లలో మోడలింగ్ ని కూడా ఒక క్రీడలాగా పిల్లలకు నేర్పిస్తారు. దానికోసం లోషన్లు, క్రీములు, సౌందర్య సాధనాల వాడకాన్ని చిన్నప్పటినుండే  నేర్పిస్తారని వేరే చెప్పనవసరం లేదు. వాటిల్లో ఏయే కెమికల్స్ ఉంటాయో ఎవరికీ తెలీదు.

25 తేదీన ఉదయం 4 గంటలకు హార్ట్  ఎటాక్ తో నిద్రలోనే ఈ అమ్మాయి చనిపోయింది. తెల్లవారుజామనేది హార్ట్ ఎటాక్స్ కు ఎంతో ఇష్టమైన సమయం. చెప్పడం మాత్రం, న్యుమోనియా వల్ల, మయోకార్డయిటిస్ వచ్చి చనిపోయిందని చెబుతున్నారు. మయోకార్డయిటిస్  అంటే, గుండె కండరాల వాపు. ఇది తీవ్రమైన శరీరశ్రమవల్లా, అనవసరమైన మందుల వాడకం వల్లా వస్తుంది. జెనెటిక్ కారణాలు కూడా ఉంటాయి. ఈ జాతకంలో ఈ వ్యాధి తల్లివైపునుండి వచ్చిందని అర్థమౌతోంది.

ఈ పాపను 5 ఏళ్లనుంచే మోడలింగ్ లో పెట్టారట. ఇక చెప్పుకోడానికేముంది? పెద్దల ఇష్టాలను పిల్లలపైన రుద్ది, వాళ్ళ ఆరోగ్యపరిస్థితిని గమనించకుండా విపరీతమైన ఒత్తిడికి వాళ్ళను గురిచేస్తుంటే ఇలా జరగక ఇంకెలా జరుగుతుంది?

'బుద్ధి కర్మానుసారిణి' అని ఊరకే అనలేదు మరి ! 

బుద్దీ, కర్మా రెండూ వెర్రితలలేస్తున్న నేటికాలంలో ఎవరికైనా సరే, ఏం చెప్పగలం?

read more " 8 ఏళ్ల అమ్మాయి పాప్ స్టారా? పని ఒత్తిడితో చనిపోయిందా? ఏమిటీ ఘోరం? "

ట్రైలర్ మొదలైంది - సినిమా ముందుంది

12-7-2026 న యురేనస్ రోహిణీ నక్షత్రంలోకి అడుగుపెట్టాడు.  వచ్చే మూడేళ్ళలో ప్రపంచవ్యాప్తంగానూ, ముఖ్యంగా ఇండియాలోనూ జరుగబోయే అల్లకల్లోలానికి ఆ రోజే నాంది జరిగింది.

విప్లవాలకు, ఉద్యమాలకు, అల్లర్లకు యురేనస్ కారకుడని జ్యోతిషవిద్యార్థులకు తెలిసినవిషయమే కదా !

దీనికి ఒక్కనెల ముందుగా, అంటే, మే లో కాక్రోచ్ జనతా పార్టీ మొదలైంది. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ విద్యార్థిసంఘాలు దానివెనుకా, ముందూ లోపలా ఉన్నాయి. కనపడకుండా జార్జి సోరోస్ వర్గం ఫండింగ్ చేస్తోంది. ఢిల్లీలో, ముంబాయిలో వీళ్ళు చేసిన గోల అందరికీ తెలుసు. వీళ్ళగోలకు విద్యాశాఖామంత్రి ధర్మేంద్ర రాజీనామా చేయవలసి వచ్చింది. ఇప్పుడు CEC జ్ఞానేశ్ కుమార్ ను టార్గెట్ చేస్తున్నారు. ఆ తరువాత మోదీగారంటున్నారు. 

వీళ్ళను చూసి ఆలిండియా బ్యాంక్ స్ట్రైక్ అని మొదలుపెట్టారు. ఉచ్ఛస్థితిలో ఉన్న గురువువల్ల అది ఆగిపోయింది.

సెప్టెంబర్ 19 న కుజుడు కర్కాటకంలోకి అడుగుపెట్టి నీచస్థితిలోకి వచ్చాడు. ఈ స్థితిలో ఆయన నవంబర్ 12 వరకూ ఉంటాడు. ఇది విధ్వంసాలకు సూచిక. దీనికి తోడుగా జూలై 1 నుండి అక్టోబర్ 26 వరకూ రాహుకేతువులు నవాంశచక్రంలో నీచస్థితులలో ఉంటాయి. ఇది చాలా గడ్డుకాలం. కానీ కుజుని ప్రక్కనే కర్కాటకంలో ఉన్న గురువువల్ల అవి కంట్రోల్ అవుతున్నాయి. కానీ, గురువుగారు నవంబర్ 1 న సింహంలోకి వెళ్ళిపోతారు. అక్టోబర్ 15 ప్రాంతం నుంచీ గురువుగారి రక్షణ క్రమంగా తగ్గిపోతుంది. కనుక, అల్లర్లు ఎక్కువౌతాయి.

ఇది ఒక్క భారతదేశంలోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఉదాహరణకు చూడండి. ప్రాన్స్ లో విద్యార్థుల ఉద్యమం జరుగుతోంది. గత రెండువారాలుగా జరుగుతున్న ఈ ఉద్యమంతో అక్కడ దాదాపు 500 స్కూళ్ళు మూతపడ్డాయి. 5000 పైగా మైనర్ విద్యార్థులు అరెస్టయ్యారు.

పెట్రోల్ రేట్లు పెరిగాయని సిరియా, గుటెమాలా, ఫ్రాన్స్  లలో నిరసనలు జరుగుతున్నాయి. హౌసింగ్ సమస్యలపై స్పెయిన్లో ఉద్యమం మొదలైంది. ఉద్యమకారులపైన ప్లాస్టిక్ బులెట్లు పేల్చబడ్డాయి. ఇక ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధం గురించి చెప్పనే అక్కర్లేదు. అమెరికాలో కూడా ట్రంప్ కు వ్యతిరేకంగా డెమోక్రాట్ల ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. వీళ్ళు ఓటింగ్ రిఫార్మ్స్ అడుగుతున్నారు.

మొన్న జరిగిన ఇజ్రాయెల్ విమానఉదంతం కూడా దీనిలో భాగమే. అయితే, ఉచ్చ గురువు యొక్క కరుణ వల్ల, జరగవలసిన పెద్ద ప్రమాదం తప్పిపోయింది. లేదంటే ఆ విమానం పేలిపోయి ఉండేది.

అయితే, ఇలాంటి ఎటాక్స్ ముందుముందు మరిన్ని చేస్తామని ఆల్ ఖైదా ప్రకటించింది. ఎన్నని తప్పుతాయి? కొన్నైనా జరుగుతాయిగా? అవి చాలవా సంక్షోభానికి?

ఇదంతా యురేనస్ ప్రభావమే.

అయితే, ఇవి ట్రెయిలర్స్ మాత్రమే. అసలు సినిమా ముందుంది. గురువు కర్కాటకాన్ని వదలిన మరుక్షణం మానవాళికి రక్షణ ఉండదు. దానికితోడు వచ్చే ఏడాదిలో శనీశ్వరుడు మేషంలో  ప్రవేశించడంతో అసలైన అల్లర్లు, విధ్వంసాలు, యుద్ధాలు మొదలౌతాయి. మూడో ప్రపంచయుద్ధాన్ని తలపించే పెద్దయుద్ధం వచ్చే సూచనలు 2027-30 మధ్యలో బలంగా ఉన్నాయి.

మారుతున్న రాజకీయ సమీకరణాలు, దేశాలమధ్యన సంబంధాలు కూడా ఈ దిశగానే చూపిస్తున్నాయి.

ప్రస్తుతానికి, ఇండియా వరకూ చూస్తే, ఈ నెల 10 న జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ పార్టీ మళ్ళీ ఆందోళనను ప్రకటించింది. ఆరోజు అమావాస్య అయింది. గ్రహస్థితులేమో ఇలా ఉన్నాయి. మంచి సూచనలు లేవు. అల్లర్లు జరుగకుండా ప్రభుత్వం అన్నివైపులనుంచీ కట్టుదిట్టం చేస్తే తప్ప గొడవలు ఆగేలా లేవు.

దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ గడ్డుకాలం మొదలైంది. 

రాబోయే మూడేళ్ళలో, అన్నిరంగాలలోనూ జరుగబోతున్న పెనుమార్పులతో, కోట్లాదిమంది జీవితాలు అల్లకల్లోలం కాబోతున్నాయి.

వెయిట్ అండ్ సీ !

read more " ట్రైలర్ మొదలైంది - సినిమా ముందుంది "

4, అక్టోబర్ 2026, ఆదివారం

లాల్ బహదూర్ శాస్త్రి గారి అసలైన జననతేదీ మరియు మరణ రహస్యం

శాస్త్రిగారు 2-10-1904 న ముఘల్ సరాయ్ (వారణాసి దగ్గర) లో పుట్టారని నేడు అందరూ నమ్ముతున్నారు. ప్రభుత్వం కూడా అదే  చెబుతోంది. జనన సమయాలు ఉదయం 11.15 అని, 11.40 అని రెండు కనిపిస్తున్నాయి.

ఈ రెండు సమయాలనూ సమర్ధిస్తూ అనేకమంది జ్యోతిష్కులు ఎవరికివారు విశ్లేషణలు వ్రాసుకున్నారు. నా దృష్టిలో అయితే, రెండూ తప్పులే. అసలా తేదీయే తప్పు. ఏమంటే, ఆ లగ్నాలతో, ఆ తేదీతో ఈయన జీవితంలోని ఏ ముఖ్యసంఘటనా సరిపోవడం లేదు. మనం సరిపెట్టడం  వేరు,  అది సరిపోవడం వేరు. అందరూ శాస్త్రిగారి జాతకాన్ని సరిపెట్టారు. అది సరిపోలేదు. 

--------------------

ప్రముఖ జ్యోతిషవేత్త K.N.Rao గారు చాలాకాలం క్రితమే ఈ  విషయం గురించి వ్రాస్తూ శాస్త్రిగారి అసలైన జననతేదీ అక్టోబర్ 9 అని  చెప్పారు. దీనికి ఆయన రెండు ఆధారాలను సూచించారు.

1. ప్రముఖజ్యోతిష్కులైన బీవీ. రామన్, హరదేవ్ శర్మ త్రివేది, సూర్యనారాయణ్ వ్యాస్ గార్లు అక్టోబర్ 9 వ తేదీని శాస్త్రిగారి అసలైన జననతేదీగా నమ్మారు. అలా నమ్మడానికి వారికి ఆధారాలున్నాయి. వారు వేసిన జాతకంలో చంద్రుడు కన్యారాశిలో ఉన్నాడు. లగ్నం ధనుస్సయింది. ఆ జాతకం ప్రకారంగా వారందరూ, 1964 ప్రాంతాలలోనే, అంటే శాస్త్రిగారు ప్రధాని అయిన సమయంలోనే, 'ఈయన ఎక్కువకాలం పాటు పదవిలో ఉండరు' అని జోస్యం చెప్పారు. అది జరిగింది.

2.   K.N.Rao గారి బంధువులలో ఒకరు లాల్ బహదూర్ శాస్త్రిగారి బంధువులలో ఒకరిని పెళ్లిచేసుకున్నారు. కనుక ఆయనకు శాస్త్రిగారి కుటుంబంతో సన్నిహిత సంబంధం ఉన్నది. వారివద్ద ఉన్న కుటుంబ రికార్డుల ప్రకారం శాస్త్రిగారు పుట్టినది అక్టోబర్ 9 వ  తేదీన ఉదయం 11. 03 నిముషాలకు మాత్రమే. కానీ ప్రచారం మాత్రం 2 వ తేదీ అని జరిగింది. దానిలోకూడా కొంతమంది వృశ్చికలగ్నమని అంటున్నారు. మరికొంతమంది ధనుర్లగ్నమని అంటున్నారు.

నేనీ జాతకాలన్నింటినీ పరిశీలించాను. అక్టోబర్ రెండవ తేదీన ఏ టైము తీసుకున్నప్పటికీ, శాస్త్రిగారి జీవితవివరాలతో అది సరిపోవడం లేదు. సరిపెట్టబడుతోంది అంతే !

----------------------- 

అక్టోబర్ 9, 1904 కి జాతకం వేస్తే, అప్పుడు శాస్త్రిగారి జీవిత సంఘటనలన్నీ సరిగ్గా సరిపోతున్నాయి. అదెలాగో వివరిస్తాను.

ముందుగా జాతకాన్ని చూద్దాం. ఆనాటి గ్రహస్థితులు ఈ విధంగా ఉన్నాయి.

శాస్త్రిగారి కుటుంబ రికార్డులలో ఉన్నట్లుగా, కన్యారాశి, ధనుర్లగ్నమూ సరిపోతున్నాయి. దశమంలో బుధుని ఉచ్ఛస్థితి గొప్పయోగం. అయితే, 8 వ అధిపతి క్షీణచంద్రుని యుతివల్ల ఇది భంగమౌతుంది. కనుక శాస్త్రిగారి చిన్నవయసులోనే, అంటే, ఒకటిన్నరేళ్ల వయసులోనే, తండ్రి మరణించాడు. అదేవిధంగా, పెద్దయ్యాక, ఒకటిన్నరేళ్ళకే ప్రధాని పదవీ పోయింది. ప్రాణమూ పోయింది.

ఈ యోగం యొక్క దృష్టి 4 వ భావం పైన ఉండటంతో, చదువు దెబ్బతిన్నది. కానీ, 4 వ అధిపతి అయిన గురువువల్ల కష్టపడి చదువుకొని కాశీవిద్యాపీఠం నుండి 'శాస్త్రి' పట్టాను పొందాడు.

9 వ భావమైన సింహంలో రాహు-కుజులవల్ల వంశంలో ఉన్న దుర్మరణయోగం కనిపిస్తోంది.

చంద్రలగ్నం నుంచి, నవమభావమైన వృషభానికి దశమంలో, శనిని సూచిస్తున్న కేతువువల్లా, మరియు నవమాధిపతి శుక్రుని పైన ఉన్న శనియొక్క దశమదృష్టి వల్లా ఇదే మళ్ళీ కనిపిస్తోంది. కనుక వీరి వంశంలో ఈ శాపం ఉన్నట్లు సూచన ఉన్నది. దీనికి రుజువుగా, శాస్త్రిగారి చిన్నవయసులోనే తండ్రిగారు అర్ధాంతరంగా చనిపోయారు. అది ఏప్రియల్ 1905.

ఆ సమయంలో శాస్త్రిగారి జాతకంలో సరిగ్గా కుజ - రాహుదశ నడిచింది. చూచారా దశాపరంగా ఈ శాపం ఎలా సరిపోయిందో? సరిగ్గా అదే సమయంలో శని కుంభంలోకి అడుగుపెట్టి కేతువుతో కలిశాడు. ఏప్రిల్ 3-17 మధ్యలో, నవాంశలో రాహుగురువులు సింహంలో ఉన్నారు. కనుక వంశశాపం జాగృతమైంది. తండ్రిని మ్రింగేసింది. 

కుటుంబస్థానంలో ఉన్న వక్రశని లగ్నంలోకి వస్తున్నందువల్ల, వంశపారంపర్యంగా కుటుంబంలో ఉన్న శాపం ఈయనకు తగులుతుందని సూచన ఉన్నది. అదే జరిగింది కూడా.

లగ్నానికి 11 వ భావంలో ఉన్న శుక్రునివల్లా, 3 వ భావంలో ఉన్న కేతువువల్లా, ఈయనకొక అక్కా ఒక చెల్లెలూ సూచింపబడుతున్నారు. సరిగ్గా సరిపోయింది.

1917 లో కుటుంబం వారణాశికి మారింది. అప్పుడే, గాంధీభావాలకు ప్రభావితుడై, తన పేరునుండి 'శ్రీవాస్తవ' అనే కులనామాన్ని వదిలిపెట్టాడు. ఆ సమయంలో రాహు-శని దశ నడిచింది. ఇది శపిత దశగా చదువరులకు తెలుసు. కనుక, అటువంటి పనిని చేశాడు. అప్పటిలో చాలామంది నాయకులు ఇలాంటి కుహనా ఆదర్శాలకు పోయేవారు.

ఇది జరిగి నేటికీ 110 ఏళ్ళు గడిచాయి. సమాజం నుండి కులం మాత్రం మాయం కాలేదు. ఇంకా పెరిగింది. నిజానికి, ఎవరి కులమూ పోదు. బ్లడ్ గ్రూపు మారనట్లుగానే అదీ మారదు. కులం తప్పుకాదు. మానవత్వం లేకపోవడం తప్పు. ఆచరణయోగ్యం కాని గాంధీసిద్ధాంతాలవల్ల, కమ్యూనిష్టు సిద్ధాంతాలవల్ల సమాజానికి జరిగిన నష్టాలలో ఇదీ ఒకటి.

ఎవరి కులాన్ని వారు పాటిస్తూనే, మానవత్వాన్ని పెంచుకోవాలి. అదీ చెయ్యవలసింది. దానినే మహనీయులందరూ చెప్పారు. కానీ ఎవరు వింటారు?

1921 లో గాంధీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై, చదువు వదిలేసి, తనకు ఆశ్రయమిచ్చిన మేనమామల మాటకు కూడా వ్యతిరేకంగా, స్వాతంత్ర పోరాటంలోకి అడుగుపెట్టాడు. ఆ సమయంలో రాహు- బుధ, రాహు-కేతు దశలు నడిచాయి. మొదటిది విప్లవాత్మక భావాలను రెచ్చగొడుతుంది. రెండవది, జీవితంలోనే అతిముఖ్యమైన దశ అవుతుంది. ఇవి రెండూ కరెక్ట్ గా జరిగాయి గమనించండి. అప్పుడాయనకు 16 ఏళ్ళు.

1925/26 లో కాశీవిద్యాపీఠం నుండి 'శాస్త్రి' పరీక్ష పాసయ్యాడు. అది తత్త్వశాస్త్రంలో డిగ్రీ.  అప్పుడు, రాహు - శుక్రదశ నడిచింది. శుక్రుడు నవాంశలో ఉచ్ఛస్థితిలో ఉండటం చూడవచ్చు.

1937 లో, గురు-శుక్రదశలో అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. అక్కడనుండి రాజకీయ ప్రస్థానం మొదలైంది. మళ్ళీ శుక్రుని అంతర్దశ రావడాన్ని గమనించవచ్చు.

శనిదశ 1944 లో మొదలైంది. 1947 లో దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఆ సమయంలో ఈయన జాతకంలో శని - బుధదశ నడిచింది. బుధుని ఉచ్ఛత్వం వల్ల UP ప్రభుత్వంలో పోలీస్ మరియు రవాణాశాఖలకు మంత్రయ్యాడు. అప్పట్లోనే, బస్సులలో మహిళా కండక్టర్లను మొదలుపెట్టింది ఈయనే.

1952 లో కేంద్రప్రభుత్వంలోకి అడుగుపెట్టి రైల్వే మంత్రయ్యాడు. ఆ సమయంలో శని-శుక్ర దశ నడిచింది. శుక్రుని పాత్రను మళ్ళీ గమనించండి. నవాంశలో ఉచ్ఛగ్రహాలు ఈ విధంగా పనిచేస్తాయి.

1956 లో జరిగిన రైలు ప్రమాదాలకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేశాడు. ఎక్కడో ఆంధ్రా, తమిళనాడులలో జరిగిన రైలు ప్రమాదాలకు ఢిల్లీలో ఉన్న తను డైరెక్ట్ గా బాధ్యుడు కాకపోయినప్పటికీ, విలువలకు కట్టుబడిన వ్యక్తిత్వం వల్ల నైతికబాధ్యత వహించాడు. ఆ సమయంలో శని - కుజ, శని - రాహుదశలు నడిచాయి. నా పోస్టులు, పుస్తకాలూ చదివేవారికి ఈ దశల గురించి మళ్ళీ మళ్ళీ చెప్పేపని లేదుకదా ! ఎంత కరెక్ట్ గా దశలతో జీవితసంఘటనలు సరిపోతున్నాయో చూడండి. ఇదే జ్యోతిషశాస్త్రం యొక్క మహత్యం ! 

అయితే, అసలు విషయం అది కాదు !

చాలామంది జీవితాలలో దీనిని గమనించవచ్చు. అన్నీ సజావుగా జరుగుతున్నపుడు అనుకోకుండా ఒక  సంఘటన జరిగి మొత్తం తారుమారైపోతుంది. వాళ్ళ వంశంలో ఉన్న శాపం వల్ల ఇలా జరుగుతుంది. ఆ శాపాలు కూడా, ఆయా గ్రహదశలలోనే కరెక్ట్ గా జరుగుతాయి. మామూలు దశలలో జరగవు. అదీ విచిత్రం !

ఈ సంఘటనకు సమాంతరంగానే, 10 ఏళ్ల తర్వాత, తాను ప్రధానమంత్రి అయ్యి, అంతా సరిగ్గా జరుగుతున్నది అనుకుంటున్న సమయంలోనే, హఠాత్తుగా విషప్రయోగంతో చంపబడటం కూడా జరిగింది. ఈ ట్రెండ్ ను గమనించండి !

కనుక, అక్టోబరు 9 వ తేదీన 11.03 గంటలకు వేసిన జాతకం ఎంత సరిగ్గా సరిపోతున్నదో చూడండి.

ఇప్పుడు దుర్మరణాన్ని గురించి ప్రామాణిక గ్రంధాలేమంటున్నాయో చూద్దాం.

----------------------

జైమినీమహర్షి తన ఉపదేశసూత్రాలు రెండింటిలో బలవంతపు మరణాలను గురించి వివరించారు.

అవి,

సూ|| మందమాన్దిభ్యాం విష-సర్ప-జల-ఉద్బంధనాదిభిః || 2. 19 ||

తృతీయంలో శని మరియు మాందీ గ్రహాలున్నపుడు, విషము, పాముకాటు, నీరు, ఉరుల ద్వారా మరణం సంభవిస్తుంది.

సూ || కేతునా విషూచి-జలరోగాద్యై || 2. 20 ||

కేతువున్నపుడు, విషూచి (కలరా, స్ఫోటకం మొదలైన రోగాలు), ఒంటికి నీరుపట్టడం మొదలైన రోగాలవల్ల చావు మూడుతుంది.

ఈ సూత్రాన్ని గతంలో అనేకమంది సెలబ్రిటీల బలవంతపు చావులలో నిరూపించాను.

జైమినిసూత్రాలను లగ్నం, ఆరూఢలగ్నం, కారకాంశలగ్నాలనుండి ప్రధానంగా చూడాలి. అవసరాన్ని బట్టి ఇతర ప్రత్యేకలగ్నాలు, దశలు కూడా దానిలో వాడబడతాయి.  శాస్త్రిగారి జాతకంలో లగ్నం ధనుస్సయింది. ఆరూఢలగ్నం సింహమైంది. ఆత్మకారకుడు చంద్రుడు గనుక కారకాంశలగ్నం కూడా సింహమే అయింది. కనుక ఈ రెండింటినుంచి పరిశీలించాలి.

ధనుస్సునుండి తృతీయంలో సరిగ్గా మాందీకేతువులున్నారు. కనుక పై రెండుసూత్రాలూ సరిగ్గా సరిపోతున్నాయి. విషప్రయోగమూ, ఊపిరితిత్తులలో నీరు చేరడమూ, గుండెపోటూ స్పష్టంగా కన్పిస్తున్నాయి. 

అంతేకాదు, కేతువు, శనినే సూచిస్తున్నాడు. కనుక, మంద-మాందిభ్యాం అనే సూత్రం ఖచ్చితంగా సరిపోయింది.  పైగా, కేతువు ఛాయాగ్రహం గనుక, శాస్త్రిగారి మరణం ఎప్పటికీ బయటకురాని రహస్యంగా చీకటిలోనే ఉండిపోతుందన్న సూచన స్పష్టంగా ఉన్నది. అందుకేనేమో, నేటికీ ఈ రహస్యం రహస్యంగానే ఉండిపోయింది.

సింహంలో కుజరాహువులున్నారు. ఈ గ్రహయోగం ప్రమాదాలకూ, బలవన్మరణానికీ, దౌర్జన్యపూరితమైన కుట్రకూ, విషప్రయోగాలకూ సూచిక. రాజరికరాశి అయిన సింహంలో ఈ యోగం ఉన్నది. లగ్నం నుండి సింహం 9 వ భావమైంది. ఇది దూరదేశానికి సూచిక. స్థిరరాశిగనుక ఇంటిలోనే ఈయన చనిపోయాడు.  ఈ గ్రహస్థితుల వల్ల పాశ్చాత్యదేశాధినేతల కుట్రవల్ల ఈయన దూరదేశమైన సోవియట్ యూనియన్లో చనిపోయాడని స్పష్టంగా అర్ధమౌతున్నది.

-----------------------

ఆయన భార్య లలితాశాస్త్రిగారు చెప్పినదాని ప్రకారం, ఆయన బసచేసిన విల్లాలో మంచం ప్రక్కనే ఉంచిన మంచినీళ్ల ప్లాస్క్ లో ఏదో కలిపి ఉంటారని ఆమె అన్నది. ఆ నీళ్లను త్రాగి పడుకున్న శాస్త్రిగారు కొద్దిసేపట్లోనే విపరీతంగా దగ్గుతూ ఛాతీని పట్టుకుని లేచారని, ఆయనకు వాంతులయ్యాయని తరువాత నేలపైన పడిపోయి చనిపోయారని తెలుస్తోంది. వేరే చోట ఉన్న ఆయన యొక్క పర్సనల్ డాక్టర్ R.N. ఛుగ్ వచ్చి చూసేసరికే శాస్త్రిగారు చనిపోయి ఉన్నారు.

విచిత్రంగా, ఆ విల్లాలో ఆయనకివ్వబడిన గదిలో ఒక కాలింగ్ బెల్లు లేదు. ఫోన్ లేదు. అటెండెంట్ లేడు. ఫస్ట్ ఎయిడ్ బాక్సు లేదు. ఒక దేశప్రధానమంత్రికి, అందులోనూ యుద్ధంలో గెలిచిన దేశపు ప్రధానమంత్రికి అలాంటి ఏర్పాట్లా? అలా చేస్తారా ఎక్కడైనా? కావాలని ఆయనను చంపేసినట్లు క్లియర్ గా తెలియడం లేదూ? 

ఆయన దేహానికి పోస్ట్ మార్టం జరగలేదు. తాష్కెంట్ అప్పట్లో సోవియెట్ ఉజ్బెకిస్తాన్ లో ఉండేది. భారతప్రభుత్వం అడిగినట్లైతే పోస్ట్ మార్టం చేసి ఉండేవారు. వీరు అడగలేదా? అడిగినా ఉపయోగం ఉండదని ఊరుకున్నారా?  మనకు తెలియదు. మొత్తమ్మీద ఇదొక అధికారమార్పు కుట్ర  (regime change operation) అని అర్ధమౌతున్నది. 

శత్రుదేశాలకూ, అగ్రరాజ్యాలకూ, ఇలాంటి కుట్రలు మామూలే. మొన్నటికి మొన్న బాంగ్లాదేశ్ లో జరిగిందేమిటి? కనుక ఇది క్రొత్తేమీ కాదు. అవసరమైతే దేశాధినేతలను కూడా లేపేస్తారని దీనినిబట్టి తెలుస్తోంది. అందుకేనేమో, రష్యా, చైనా మొదలైన దేశాధినేతలు ఇలాంటి మీటింగులకు విదేశాలకు వచ్చినపుడు అక్కడి డిన్నర్లు తినరు. వాళ్ళు తెచ్చుకుని, ఒండుకుని తింటారు. పుతిన్ అయితే, సూట్కేస్ టాయిలెట్ కూడా తనవెంట తెచ్చుకుంటాడు.

మన ప్రధాని మోదీగారి మీద కూడా ఇటువంటి ప్రయత్నం ఒకటి ఈ మధ్యనే జరిగిందనీ, అయితే, ఆయనకు ముందస్తుగా ఇంటలిజెన్స్ సమాచారం ఉండటం వల్ల ఆ ప్రమాదం నుండి తప్పించుకున్నారనీ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో నిజం ఉండవచ్చని నేనుకూడా నమ్ముతున్నాను.

--------------------------

పోతే, శాస్త్రిగారి మృతదేహాన్ని మనదేశానికి తెచ్చి పాలం విమానాశ్రయంలో విమానం  దింపినపుడు, దేహం మొత్తం నీలంరంగులోకి మారిపోయి ఉందని, కణతలదగ్గర మాత్రం తెల్లని మచ్చలున్నాయని, దగ్గరనుండి చూచిన బంధువులు, కొడుకులు, చెబుతున్నారు. కనుక ఆయన విషప్రయోగంతోనే చనిపోయి ఉండాలి.

అంతేకాదు, ఆయన యొక్క వ్యక్తిగత వైద్యుడైన Dr. R.N. Chugh, ఈ సంఘటన జరిగిన కొద్దికాలం తర్వాత ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. లేదా చంపబడ్డాడు. శాస్త్రిగారి మరణం పైన వేసిన ఎంక్వైరీ కమిషన్ ముందు తన వాంగ్మూలం ఇవ్వడానికి వెళుతున్న సమయంలో ఆయనకు రోడ్డు యాక్సిడెంట్ అయింది. చనిపోయాడు. ఆయనతోబాటు, ఆయన కుటుంబసభ్యులందరూ ఆ ప్రమాదంలో చంపబడ్డారు.

ఇంకా, శాస్త్రిగారి వ్యక్తిగత సేవకుడైన రాంనాధ్ కూడా అదేసమయంలో ఒక రోడ్డు యాక్సిడెంటులో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రాణాలతో బయటపడినప్పటికీ, తలకు తగిలిన బలమైన గాయాలవల్ల, మతిస్థిమితాన్ని, జ్ఞాపకశక్తినీ కోల్పోయాడు. తరువాత బ్రతికినన్నాళ్ళు జీవచ్ఛవంలా బ్రతికాడు.

శాస్త్రిగారి దగ్గర ఒక రెడ్ డైరీ ఉండేది. ముఖ్యమైన విషయాలను దానిలో వ్రాసుకునేవాడాయన. విచిత్రంగా, ఆ డైరీ కూడా మాయమై పోయింది. అదేమై పోయిందో ఎవరికీ తెలియదు.

వీటన్నిటినీ బట్టి ఇదొక కుట్రని, దీనివెనుక ఇండియాలోని నేతలు కూడా ఉన్నారని, విదేశీహస్తం కూడా ఉందని, ఇద్దరూ కలిసే ఈ పనిని చేశారని. చిన్నపిల్లలైనా చెబుతారు. శాస్త్రిగారి జాతకం కూడా దీనినే స్పష్టంగా చెబుతోంది.

------------------------

శాస్త్రిగారి జాతకంలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలను జాతకపరంగా చూద్దాం.

ప్రధాని కావడం

27-5-1964 న నెహ్రూగారు చనిపోయాడు. 13 రోజులపాటు గుల్జారీలాల్ నందా గారు తాత్కాలిక ప్రధానిగా ఉన్నారు. 9-6-1964 న లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధాని అయ్యారు. ఆ సమయంలో ఆయనకు బుధ బుధ రాహుదశ నడిచింది.

లగ్నం నుండి దశమంలో బుధుడు ఉచ్ఛస్థితిలో ఉండటాన్ని గమనించవచ్చు. కనుక బుధ దశ మొదలుకావడంతోనే ఆయన ప్రధాని అయ్యాడు. ఇది ఇందిరాగాంధీకి ఇష్టంలేదని చాలామంది అంటారు. తన తండ్రి తర్వాత తానే ప్రధాని కావాలని ఆమె అనుకుంది. కానీ అప్పట్లో ఆమెకంత అనుభవమూ లేదు, పేరూ లేదు. కనుక కాలేకపోయింది.

చంద్రలగ్నం నుండి కూడా, బుధుడు దశమాధిపతిగా లగ్నకేంద్రంలో ఉచ్ఛస్థితిలో ఉన్నాడు. ఇది ఖచ్చితంగా మహారాజయోగమే. ఈ యోగం అక్టోబర్ 2 వ  జాతకంలో రాదు. కనుక ఆ తేదీ  కరెక్ట్ కాదని తెలుస్తోంది.

9-6-1964 న గోచారాన్ని గమనిద్దాం.

శాస్త్రిగారి చంద్రరాశి అయిన కన్యనుండి 9 వ భావంలో అయిదు గ్రహాలున్నాయి. కనుక భాగ్యభావం బలంగా ఉంది. చంద్రునికి ఉచ్ఛరాహుకేతువులతో శుభార్గళం ఉన్నది. ఈ కారణాలు దశాప్రభావాన్ని సపోర్ట్ చేశాయి. కనుక ప్రధాని అయ్యాడు.

అయితే, ఆరోజు అమావాస్యకు ఒకరోజు ముందు కావడం, అమావాస్య కూడా భాగ్యభావంలోనే పడటం, నవాంశలో రాహుకేతువులు రివర్స్ అయ్యి, నీచస్థితులలోకి రావడం, మొదలైన కారణాలవల్ల ఒకటిన్నర ఏడాది మాత్రమే ఆయన ప్రధానిగా ఉండగలిగాడు. ఇలా జరుగుతుందని అప్పటి ప్రముఖ జ్యోతిష్కులు చెప్పారు.  వారు కూడా అక్టోబరు 9 వ తేదీ జాతకాన్ని బట్టే ఈ విషయాన్ని చెప్పగలిగారు.

మరణం 

11-1-1966 న ఆయనకు బుధ కేతు శని దశ నడిచింది. బుధుని రాజయోగం ఉన్నప్పటికీ, శనికేతువుల ప్రభావం విషప్రయోగానికి దారితీసింది. జైమిని మహర్షి సూత్రం ప్రకారం ఇది ఖచ్చితంగా కేతువు-శనుల దశలోనే జరగడాన్ని గమనించండి.

పైన చెప్పినట్లుగా, కేతువు శనిని సూచిస్తున్నాడు. మాందితో కలసి ఆయుస్థానంలో ఉండటంవల్ల విషప్రయోగం ద్వారా మరణం సంభవించింది. గోచారాన్ని గమనిద్దాం.

ఆనాడు గ్రహస్థితి ఈ విధంగా ఉన్నది.

కన్యనుండి 9 వ భావంలో గురుఛండాలయోగం ఉండటాన్ని చూడవచ్చు. ఇది దూరదేశంలో జరిగిన విద్రోహపూరిత కుట్రకు సూచిక. రాహుకేతువులు 3-9 ఇరుసులో ఉచ్ఛస్థితిలో ఉండటం మంచిదేకాని, గురుఛండాలయోగం మంచిది కాదు. కనుక, అధికారిక పర్యటనలో విషప్రయోగం జరిగింది. నవమాధిపతి శుక్రుడు 4 వ భావంలో రవిబుధులతో కలసి ఉన్నాడు. ఇది విదేశాలలోని ఇంటికి (ఈయన బసచేసిన విల్లాకు) సూచిక. రవిబుధశుక్రులకు బలమైన పాపార్గళం ఉన్నది. ఇది,  ఆ విల్లా మొత్తం సీక్రెట్ ఏజంట్ల పర్యవేక్షణలో ఉన్న విషయాన్ని చూపిస్తున్నది.

అంతేకాదు, మరొక ముఖ్యమైన సూచిక ! విద్రోహచర్యలకు సూచకుడైన యురేనస్, మరణానికి కారకుడైన ఫ్లూటోతో కలసి సింహంలో, మనఃకారకుడైన చంద్రునితో కలసి ఉంటూ, ధనుస్సులోని సూర్యుని చాలా దగ్గరగా వీక్షిస్తున్నారు. సింహానికి అధిపతీ, దేశాధినేతలకు అధిపతీ సూర్యుడే. ఇదంతాకూడా దేశాధినేతల ప్రోద్బలంతో జరిగిన కుట్రను స్పష్టంగా సూచిస్తున్నది.

భారతరత్న ప్రదానం

1966 లోనే ఆయనకు భారతరత్న ఇవ్వబడింది. ఇది బుధ శుక్రదశలో జరిగింది. శుక్రుడు నవమాధిపతిగా స్వస్థానంలో ఉండటాన్ని, నవాంశలో ఉచ్ఛస్థితిలో ఉండటాన్ని గమనించవచ్చు. అయితే చంద్రునినుండి లగ్న దశమాధిపతి అయిన బుధుడు అదే నవాంశలో నీచస్థితిలో ఉండటాన్ని బట్టి, ప్లాన్ ప్రకారం ఆయనను చంపేసి భారతరత్న ఇచ్చారని అర్థమౌతోంది.

పై మూడు సంఘటనలూ, ఇంకా చెప్పాలంటే, అన్ని సంఘటనలూ అక్టోబరు 9 జాతకానికి మాత్రమే కరెక్ట్ గా సరిపోతున్నాయి. అక్టోబరు 2 జాతకానికి సరిపెట్టబడుతున్నాయి గాని సరిపోవడం లేదు.

ఈ విశ్లేషణను బట్టి రెండు విషయాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. 

ఒకటి - శాస్త్రిగారి జననతేదీ అక్టోబర్ 2 కాదు. అక్టోబర్ 9. 

రెండు - ఆయన విషప్రయోగంతో చంపబడ్డాడు.

ఈ రెండూ చరిత్రలో సమాధి చేయబడ్డాయి.

అయితే, మనుషులు తమ తప్పులను కప్పిపెట్టుకోవచ్చు. మంచివాళ్ళుగా నటించవచ్చు. కర్మ మాత్రం ఎవరినీ వదలదు. ఎవరి లాజిక్స్ వారికుండవచ్చు. కానీ, తమ కర్మకు మూల్యం చెల్లించక మాత్రం ఎవరికీ తప్పదు. దీనికి మాత్రం ఎంతటివారికీ మినహాయింపు లేదు. 

ఆ సమయంలో ఉన్న నాయకులూ, దేశాధినేతలూ, ఆ తరువాత ఏమయ్యారో గమనిద్దాం.

----------------------

దేశాధినేతల దుర్మరణాలు

ఆ సమయంలో పాకిస్తాన్ అధ్యక్షునిగా మహమ్మద్ అయూబ్ ఖాన్ ఉన్నాడు. శాస్త్రిగారి పాడెను కూడా ఆయన మోశాడు. 1966 లో శాస్త్రిగారు చంపబడ్డారు. 1966 లోనే అయూబ్ ఖాన్ కు తీవ్రమైన గుండెజబ్బు మొదలైంది. దానితో 8 ఏళ్ళు బాధపడి చివరకు 1974 లో 66 ఏళ్ల వయసులో  గుండెపోటుతోనే ఆయన కూడా చనిపోయాడు. 1969 లో ఆయన పదవి పోయింది. అప్పటినుండి అయిదేళ్లపాటు పాకిస్తాన్లో తన విల్లాలోనే ఉంటూ చివరకు హార్ట్ ఎటాక్ తో పోయాడు.

రష్యా ప్రధానిగా అలెక్సీ కొసిగిన్ ఉన్నాడు. ఈయనకు కూడా త్వరలోనే గుండెజబ్బు మొదలైంది. దానితో చాలా ఏళ్ళు బాధపడి 1980 లో 76 ఏళ్ల వయసులో హార్ట్ ఎటాక్ తోనే ఈయనకూడా చనిపోయాడు.

రష్యా కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీగా లియోనిడ్ బ్రెజ్నెవ్ ఉన్నాడు. ఈయన కూడా హార్ట్ ఎటాక్ తోనే 1982 లో చనిపోయాడు. అంతకు ముందు ఆరేళ్లనుంచి, అంటే 1976 నుంచే ఆయనకు గుండెజబ్బు మొదలైంది. ఆరేళ్లలో ఆయన ఆరోగ్యం వేగంగా క్షీణిస్తూ  వచ్చింది. ఒక సమయంలో ఆయన జీవచ్ఛవం (క్లినికల్లీ డెడ్) అయిపోయాడు. తన చుట్టూ పరిసరాలను, మనుషులను గుర్తించలేకపోయేవాడు. అటువంటి దీనస్థితిలో ఈయన కూడా చనిపోయాడు.

అమెరికా అధ్యక్షునిగా లిండన్ జాన్సన్ ఉన్నాడు. 1973 లో 64 ఏళ్ల వయసులో ఈయనకూడా హార్ట్ ఎటాక్ తోనే చనిపోయాడు. అంతకుముందు ఇరవై ఏళ్లుగా ఈయన గుండెజబ్బుతో బాధపడ్డాడు. ఈయనకు చెయిన్ స్మోకింగ్ అలవాటుండేది. దానితో మొట్టమొదటి హార్ట్ ఎటాక్ 1955 లో 46 ఏళ్ల వయసులోనే వచ్చింది. డాక్టర్లు హెచ్చరించినా తన స్మోకింగ్ అలవాటును మానుకోలేదు. 1969 లో ఈయన టర్మ్ అయిపోయి వైట్ హౌస్ ను వదిలిపెట్టాడు. ఆ తరువాత టెక్సాస్ లో ఉంటూ ఉండేవాడు. 1973 లో హార్ట్ ఎటాక్ వచ్చినపుడు, దగ్గర ఎవరూ లేకపోతే, హార్ట్ ఎటాక్ వచ్చి గిలగిలా కొట్టుకుంటూ కూడా, తన సీక్రెట్ సర్వీస్ వారికి తనే ఫోన్ చేశాడు. అయితే, వాళ్ళు వచ్చేలోపే చనిపోయాడు. 

అప్పట్లో CIA అధినేతగా విలియం రాబోర్న్ జూనియర్ ఉన్నాడు. జూన్ 1966 లో ఈయన పదవిని అర్ధాంతరంగా కోల్పోయాడు. 1990 లో 84 ఏళ్ల వయసులో ఈయన కూడా హార్ట్ ఎటాక్ తోనే చనిపోయాడు.

చైనా అధినేతగా మావో జెడాంగ్ ఉన్నాడు. 1970 లలో ఈయనకు తీవ్రమైన గుండెజబ్బు మొదలైంది. అప్పటినుంచీ ఈయన ఆరోగ్యం వేగంగా క్షీణిస్తూ వచ్చింది. ఊపిరితిత్తులు కూడా పాడయ్యాయి. పార్కిన్ సన్ వ్యాధి వచ్చింది. 1976 లో రెండు తీవ్రమైన హార్ట్ ఎటాక్స్ వచ్చాయి. రెండవదానితో ఈయన చనిపోయాడు.

నెహ్రూగారి మరణం తర్వాత, శాస్త్రిగారి స్థానంలో ప్రధాని పదవిని ఆశించిన వారిలో ఇందిరాగాంధీ కూడా ఉన్నది. ఆ తరువాత, తను అనుకున్నట్లుగా ప్రధాని అయి, దేశాన్ని చాలా ఏళ్ళు పరిపాలించినప్పటికీ, చివరకు తన బాడీగార్డ్స్ చేతులలోనే ఈమె కాల్చి చంపబడింది. ఈమె కొడుకులిద్దరూ కూడా దుర్మరణాల పాలయ్యారు.

జనవరి 1966 లో శాస్త్రిగారు చనిపోయిన సమయంలో ఉన్న లీడర్స్ వీళ్ళే. వీరందరూ ఎలా చనిపోయారో అన్న విషయాన్నీ, అప్పటి రాజకీయ సమీకరణాలనూ గమనిస్తే శాస్త్రిగారి దుర్మరణానికి ఎవరు లేదా ఎంతమంది కారకులో తేలికగా అర్ధమౌతుంది.

-------------------------

కారకులెవరు?

మరికొంత లోతైన జ్యోతిషవిశ్లేషణతో వారెవరో నేను చెప్పగలను. పైన చెప్పబడినవారిలోనే కుట్రదారులున్నారు. మార్మికశాస్త్రాల జ్ఞానంతో వారెవరో నేను ఊహించగలను. పంచవటిలో జరిగే క్లోజ్ మీటింగులలో ఇంతకంటే లోతులను మనం మాట్లాడుకోవచ్చు, కానీ బ్లాగులో మాత్రం ఇంతకంటే ఎక్కువగా చెప్పను. ఉబుసుపోని జనాల ఉత్సాహం కోసం నేనా పనిని చేయనవసరం లేదు. ప్రభుత్వానికి  అన్నీ తెలుసు. తెలిసీ దాచిపెట్టాలని ప్రభుత్వమే అనుకుంటున్నపుడు నేనెందుకు బయటపెట్టాలి?

శాస్త్రిగారు అక్టోబరు 2 న పుట్టారనీ, తాష్కెంట్ లో సహజంగానే చనిపోయారనీ లోకం నమ్ముతున్నది. సరే, అలాగే నమ్మనిద్దాం. 

కానీ, ఈ రెండూ అబద్దాలే, నిజాలు కావు. ఇంకా చెప్పాలంటే, నేటి ప్రపంచంలో ఏదీ నిజం కాదు. ప్రేమలూ, పెళ్ళిళ్ళూ, కుటుంబాలూ, సంసారాలూ, రాజకీయాలూ, గురువులూ, ఆశ్రమాలూ, విద్యా, వైద్యమూ, వ్యాపారాలూ, వ్యవహారాలూ, చావూ, పుట్టుకా, ఏవీ నిజాలు కావు. ఎక్కడైనా సరే, జరిగేది వేరు. ప్రచారాలు వేరు. లోకం ప్రచారాన్నే నమ్ముతుంది. నిజాలను మాత్రం నమ్మదు. 

నేడు మనిషిజీవితమే ఒక నాటకమైపోయింది. అబద్దపు ప్రచారాల ముసుగులలోనే ప్రపంచమంతా నడుస్తోంది. నిజాల పైన ఆధారపడి మాత్రం నడవడం లేదు.

నేటి సమాజంలో నిజాలెవరిక్కావాలి?

read more " లాల్ బహదూర్ శాస్త్రి గారి అసలైన జననతేదీ మరియు మరణ రహస్యం "

3, అక్టోబర్ 2026, శనివారం

లాల్ బహదూర్ శాస్త్రి గారి 122 వ జన్మదినం

నిన్న లాల్ బహదూర్ శాస్త్రి గారి 122 వ జన్మదినం. అక్టోబర్ 2 న గాంధీగారు,  శాస్త్రిగారు, ఇద్దరూ పుట్టారు. కానీ, పిచ్చిజనం గాంధీగారిని గుర్తుచేసుకున్నంతగా ఈయనను చేసుకోరు. మన వ్యక్తిత్వస్థాయినిబట్టే మనకు నచ్చే మనుషులుగాని, నాయకులుగాని ఉంటారు మరి !

ఈ సందర్భంగా ఆయన జాతకంలోని ముఖ్యమైన విషయం ఒకదానిని, అదే, మరణరహస్యాన్ని జ్యోతిషపరంగా పరిశీలిద్దాం. దానికంటే ముందుగా ఆయనయొక్క నీతీనిజాయితీలకు నిదర్శనాలుగా చెప్పుకునే రెండు సంఘటనలను గుర్తుచేసుకోవాలి.

ఒకటి - నెహ్రూగారి మంత్రిమండలిలో శాస్త్రిగారు రైల్వేమంత్రిగా పనిచేశారు. ఒక రైలు ప్రమాదం జరిగిందని, దానికి బాధ్యత వహిస్తూ, రైల్వేమంత్రి పదవికి శాస్త్రిగారు రాజీనామా చేశారు. ఇది 1956 లో జరిగింది. నెహ్రూగారు ఒప్పుకోకపోయినా తన రాజీనామాను వెనక్కు తీసుకోలేదు. చివరకు నెహ్రూయే తగ్గక తప్పలేదు.

నిజానికి 1956 లో రెండు పెద్ద రైలు ప్రమాదాలు జరిగాయి. మొదటిది మన రైల్వేలోనే మహబూబ్ నగర్ జడ్చర్లల మధ్యలో ఒక రైల్వేబ్రిడ్జి కూలిపోయి రైలు నదిలో పడిపోయింది. అందులో 125  మంది పైనే చనిపోయారు. ఇది సెప్టెంబర్లో జరిగితే, రెండవ ప్రమాదం నవంబర్లో తమిళనాడులోని అరియలూర్ లో జరిగింది. ఇందులో కూడా భారీవర్షాలకు రైల్వే బ్రిడ్జి కూలిపోయి రైలు నదిలో పడిపోయింది. దీనిలో 250 మంది పైనే చనిపోయారు. మహబూబ్ నగర్ ప్రమాదం జరిగినపుడు కూడా శాస్త్రిగారు రాజీనామా ఇచ్చారు. కానీ నెహ్రూగారు ఒప్పుకోలేదు. రెండవది జరిగినపుడు ఇచ్చిన రాజీనామాను శాస్త్రిగారు వెనక్కు తీసుకోలేదు. నైతిక బాధ్యత వహించారు.

అప్పటికి సౌత్ సెంట్రల్ రైల్వే రాలేదు. ఆంధ్రా తెలంగాణాలోని ప్రాంతాలన్నీ సదరన్ రైల్వే, సెంట్రల్ రైల్వే పరిధులలో ఉండేవి.

రెండు - శాస్త్రిగారు అర్ధాంతరంగా చనిపోయిన తర్వాత ఆయనకు మిగిలిన ఆస్తి ఒక ఫియట్ కారుకోసం తీసుకున్న లోను మాత్రమే. అప్పట్లో దాని ఖరీదు 12 వేల రూపాయలు. దానిని కొనడానికి ఆయన సేవింగ్స్ లో 7 వేలుమాత్రమే ఉన్నాయి. అందుకని మిగతా డబ్బుకు పంజాబ్ నేషనల్ బ్యాంకు నుండి లోను తీసుకున్నారాయన. శాస్త్రిగారి మరణం తర్వాత ఆ అప్పును మాఫీ చేస్తామని ప్రభుత్వం ముందుకొచ్చినప్పటికీ, ఆ ప్రతిపాదనను శాస్త్రిగారి సతీమణి లలితాశాస్త్రిగారు తిరస్కరించారు. తనకొచ్చే పెన్షన్ నుండి ఆ అప్పును విడతలవారీగా తీర్చారామె. 

ఆ మనుషులు వేరు, ఆ విలువలు వేరు ! ఇదే తరహాకు చెందిన మరొక నాయకుడు P.V. నరసింహారావుగారు. ఆయనకూడా ప్రధానమంత్రిగా చేసినప్పటికీ, తనకోసమంటూ సంపాదించుకున్న అవినీతిసొమ్ము ఏమీ లేదు.

నేటికాలంలో వార్డుకౌన్సిలర్లు తేలికగా కోట్లు సంపాదిస్తున్నారు. ఎమ్మెల్యే, ఎంపీలుగా పోటీ చెయ్యాలంటే 100 కోట్ల పైనే ఖర్చుపెట్టాలని బాహాటంగా చెబుతున్నారు. అదీ శాస్త్రిగారికీ, నేటి రాజకీయులకూ తేడా !

అటువంటి వ్యక్తిని స్మరించకుండా, దేశాన్ని సమస్యల వలయంలోకి నెట్టిపోయిన గాంధీగారిని స్మరిస్తూ, సంస్మరణ సభలు నిర్వహిస్తున్నారు జనం ! అవున్నిజమే ! శాస్త్రిగారిని గుర్తుంచుకుంటే దేశం బాగుపడిపోదూ మరి !

'శాస్త్రి' అనే పేరుందని ఆయన బ్రాహ్మణుడని అందుకనే నేనాయనను సపోర్ట్ చేస్తున్నానని అనుకోకండి. ఆయన అసలు పేరు లాల్ బహదూర్ శ్రీవాస్తవ. వాళ్ళు కాయస్థులు. అంటే, క్షత్రియులలో ఒక తెగకు చెందినవారు. వివేకానందస్వామి, అరవింద్రఘోష్ లు కూడా కాయస్థులే. కాశీవిద్యాపీఠం నుండి 'శాస్త్రి' పరీక్ష పాసై, పట్టా పొందినందుకు ఆయన 'శాస్త్రి' అయ్యారు. నేటితరంలో  చాలామందికి ఇదికూడా తెలియదు.

చాలా నిజాయితీపరుడూ, నిరాడంబరుడూ అయిన ఆయన, ధైర్యానికి మాత్రం పెట్టింది పేరు. 1965 లో జరిగిన ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో, అంతర్జాతీయ సరిహద్దులను దాటి పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి ఎటాక్ చెయ్యడానికి మన సైన్యానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆయనే. ఈ చర్యతో ప్రపంచం బిత్తరపోయింది. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం సరిహద్దులను దాటకూడదు. కానీ పాకిస్తాన్ కాశ్మీర్లోకి చొరబడి నానా దురాగతాలను చేస్తుంటే మనమెందుకు చేతులు కట్టుకొని కూచోవాలి? 2016 లో మనం పాకిస్తాన్ పైన చేసిన సర్జికల్ స్ట్రైక్ కు ఇది మాతృకగా చెప్పుకోవచ్చు. ఆ ఆదేశంతో ఇండియన్ ఆర్మీ లాహోర్ వరకూ దూసుకుపోయింది.

తాష్కెంట్ ఒప్పందం జరిగినది 10-1-1966 న. శాస్త్రిగారు చనిపోయినది మర్నాడు 11-1-1966 న. ఒప్పందం సంతకం పెట్టిన కొన్ని గంటలలోనే ఆయన హార్ట్ ఎటాక్ తో తాష్కెంట్ లోనే చనిపోయారు. సుభాష్ చంద్రబోసు మరణంలాగే ఇదికూడా వీడని మిస్టరీగా మిగిలిపోయింది. ఈ కోణాన్ని జ్యోతిష పరంగా ఇప్పుడు పరిశీలిద్దాం.

(ఇంకా ఉంది)

read more " లాల్ బహదూర్ శాస్త్రి గారి 122 వ జన్మదినం "

18, జులై 2026, శనివారం

O.P.Nayyar జాతకవిశ్లేషణ - 2

"తెలియనంతవరకూ బ్రహ్మవిద్య, తెలిస్తే కూసువిద్య" అన్నట్లు, లోతుపాతులు తెలియనంతవరకూ జ్యోతిషశాస్త్రం గందరగోళంగా ఉంటుంది. ఒకసారి దానిలో పట్టుచిక్కితే మాత్రం, ఆపైన నల్లేరుమీద నడకే అవుతుంది. అప్పుడు ఒక జాతకాన్ని గానీ, జీవితాన్ని గానీ చదవడం మంచినీళ్లు త్రాగినంత సులభమౌతుంది. 

నయ్యర్ జాతకంలో - సుఖస్థానమైన మకరంలో సన్యాసయోగముంది. అందులోనే నీచగురువున్నాడు. కనుక తీవ్రమైన గురుదోషం కూడా ఉంది. దానికి తోడుగా, వృశ్చికంలో విధ్వంసయోగముంది. కళలను, ప్రేమలను, భావుకతను, సృజనాత్మకతను సూచించే శుక్రుడు బుద్ధిస్థానంలో శనిక్షేత్రంలో ఉన్నాడు. శనిదృష్టి సన్యాసయోగంపైన ఉంది. కుజదృష్టి శుక్రునిపైన ఉన్నది. ధనుస్సుకు, మకరానికి అర్గళం పట్టింది. రాహువు ఏకాకిగ్రహమయ్యాడు. 

అయిపోయింది. మొత్తం జాతకాన్ని అర్ధం చేసుకోవడానికి ఇవి చాలు. ఒక మనిషిని అర్ధం చేసుకోవడానికి, అయిదునిముషాలు సరిపోయినట్లే, ఒక జాతకాన్ని అర్ధం చేసుకోవడానికి కూడా అయిదే నిముషాలు చాలు. 

ఈయన జీవితాన్ని మొత్తాన్నీ శాసించినవి ఈ గ్రహస్థితులే.

అయితే, రాశిచక్రాన్ని ఒక్కదాన్ని చూచి, మనకంతా అర్థమైందని అనుకోకూడదు. నవాంశను, ఇతర వర్గచక్రాలను సరిదిద్దాలి. షష్ట్యంశ వరకూ సరిచేయాలి. అప్పుడు మాత్రమే ఆ జాతకం సరియైనదౌతుంది. లేదంటే తప్పుదారి పట్టిస్తుంది. ఇదంతా చేయాలంటే, జననకాలసంస్కరణ ఎలా చేయాలో  తెలియాలి. దానికి స్ఫురణశక్తి (ఇంట్యూషన్) ఉండాలి. ఇన్ని ఉన్నప్పుడే ఒక జాతకాన్ని స్పష్టంగా చదవగలుగుతాము. అప్పుడే కర్మరహస్యాలు అర్ధమౌతాయి. జన్మజన్మాంతరాలలో ఆ జీవి యొక్క నడకా అర్ధమౌతుంది.

థియరీని పక్కనపెట్టి, జాతకంలోకొద్దాం.

నయ్యర్ జననసమయం ఎక్కడా దొరకడంలేదు. కొందరు వృషభలగ్నమని, కొందరు తులాలగ్నమని అంటున్నారు. ఇంకొందరేమో ఏకంగా, జననసంవత్సరం 1926 కాదు, 1927 అంటున్నారు. ఉదయం 2 గంటలని కొన్నిచోట్ల ఉన్నది. కానీ ఏదీ ఖచ్చితంగా లేదు.

ఈ గందరగోళాన్నంతా సరిదిద్ది, ఈయన జననసమయాన్ని నేను సంస్కరించాను. అంటే, రెక్టిఫై చేశాను. అది 16-1-1926 ఉదయం గం. 1.23 అయింది. ఎలాచేశానో అడక్కండి. చెప్పను. ఆ సమయానికి షష్ట్యంశచక్రం ఇలా ఉంది.

రాశిలో నీచస్థితిలో ఉన్న గురువు, ఇక్కడ ఉచ్ఛస్థితిలోకి పోయాడు. కానీ, నీచకేతుశుక్రుల అర్గళంలో చిక్కుకున్నాడు. ఇదే అర్గళం శనిచంద్రులకు కూడా వర్తిస్తుంది. నీచకేతువును రవిగురుల అర్గళం బంధించింది. రాహుకేతువులు నీచస్థితులలో ఉన్నారు. శనిచంద్రయోగం ఉన్నది. నీచబుధ, కుజయోగం ఉన్నది. సూర్యుడు బలంగా ఉన్నాడు. శుక్రుడు లగ్నంలోకి వచ్చాడు. ఇప్పుడు, రాశిచక్రంతో షష్ట్యంశను అన్వయించుకుంటే, ఈయన జాతకం అద్దంలో చూచినంత స్పష్టంగా ఉన్నది.

సింహావలోకనం

శనికుజులవల్ల నోటిదురుసూ, కోపం, స్నేహితుల నుంచి మోసపోవడం, పైల్స్ మొదలైన రోగాలు కనిపిస్తాయి. శుక్రునివల్ల ప్రేమవ్యవహారాలు, కళాతృష్ణ, గొప్పదైన టాలెంట్,  సినిమారంగంలో పేరు, సృజనాత్మకత వస్తాయి. సన్యాసయోగంవల్ల వృత్తికి, కుటుంబానికి దూరంకావడం, ఒంటరిగా జీవించడం, అలాగే మరణించడం మొదలైనవి కలుగుతాయి. బుధునివల్ల వాయిద్యాలతో నేర్పరితనం, రాగాలను పాటలను సృష్టించడం వస్తుంది. అయితే, ఈయన దుర్మార్గుడు కాదని, సంసారం దెబ్బతింటుందని, తప్పులను చేశానని గ్రహించి, వాటిని దిద్దుకునే క్రమంలో ఒంటరిజీవితాన్ని గడిపి, అనామకంగా కన్నుమూస్తాడని షష్ట్యంశచక్రం చూపిస్తోంది.

జననకాలదశ
 
నా విధానంలో జననకాలదశకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఏమంటే, అది జీవితం మొత్తాన్నీ ఒక ముద్దలో పెట్టి చూపిస్తుంది. జననకాలదశ అయిన కుజ రాహు రాహు గురు శుక్రదశ - దూకుడు ప్రవర్తన, స్నేహితులతో మోసపోవడం, అక్రమసంబంధాలు, సినిమాజీవితం, గురుదోషం వల్ల చిన్నాభిన్నమై జీవితం, కళారంగంలో పేరుప్రఖ్యాతులను స్పష్టంగా చూపిస్తోంది.

కుజదశ

ధనిష్టానక్షత్రం ఒకటోపాదం కాబట్టి, జననసమయానికి 6 ఏళ్ల 6 నెలల 26 రోజుల కుజమహర్దశ మిగిలి ఉన్నది. ఆరేళ్లతర్వాత 18 ఏళ్ల రాహుమహాదశ నడిచింది. దానికి తగినట్లుగానే, ఈయనకు చదువుపైన పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. దానిబదులు సంగీతమూ, సౌందర్యపోషణా ఈయన మనసును ఆక్రమించాయి. ఈ విషయాన్ని ఆయనే బాహాటంగా చెప్పాడు.

"Woman, I am of woman, by woman, for woman. Women are my inspiration.' అని  తన తర్వాతి జీవితంలో ఆయన చాలాసార్లు అంటూ ఉండేవాడు.

వీరిది సంగీతకుటుంబం కాదు. తండ్రి, మెడికల్ స్టోర్స్ లో సూపర్నెంటుగా పనిచేసేవాడు. నయ్యర్ మాత్రం చిన్నప్పటినుంచే సంగీతమంటే చెవికోసుకునేవాడు. దానికి కారణం, గర్భవతిగా ఉన్న సమయంలో ఈయన తల్లిగారు, హార్మనీ ముందేసుకుని స్వరాలను అభ్యాసం చేస్తూ ఉండటం కావచ్చు. అంతకంటే వేరే కారణమేదీ కనిపించదు.

ఈయనపైన ముగ్గురు అన్నయ్యలు, ఒక అక్కయ్య ఉన్నారు.  అక్కయ్య తప్ప మిగిలిన అన్నలందరూ, డాక్టర్లే. వారిలో ఒకన్నయ్య హైద్రాబాద్ లోనే మిలిటరీ డాక్టర్ గా ఉండేవాడు. సంగీతరంగంలో అడుగుపెట్టినప్పటికీ, చివరకు ఈయనకూడా హోమియోపతి డాక్టరే అయ్యాడు. ఇది, కుటుంబంలో ఎప్పటినుండో ఉన్న మెడికల్ జీన్స్ ను చూపిస్తోంది. ఇదెలా వచ్చిందో చూడటం మన సబ్జెక్టు కాదు కాబట్టి దానిని వివరించడం లేదు.

రాహుదశ

ఏడేళ్లవయసులో రాహుదశ మొదలైంది. నయ్యర్ సంగీతాన్ని నేర్చుకోవడం తండ్రికి ఇష్టముండేది కాదు. ఆ రంగం అంత మంచిది కాదని, అప్పట్లో అనుకునే చాలామంది సాంప్రదాయకుటుంబాలలాగే ఆయనకూడా అనుకుని, 'సంగీతం నేర్చుకుని ఏం చేస్తావ్? రోడ్లమీద పాటలు పాడుతూ అడుక్కుతింటావా?' అంటూ నయ్యర్ ను తిట్టేవాడు, కొట్టేవాడు కూడా. కానీ నయ్యర్ మనసంతా సంగీతం పైనే  ఉండేది. తండ్రిమాటను వినలేదు. కానీ చివరకు తండ్రిమాటే చాలావరకూ నిజమైంది. జీవితం ఆఖరిలో ఇతరులపైననే ఆధారపడి అనామకంగా జీవించి, చనిపోయాడు.

అయితే సంగీతాన్ని ఎవరిదగ్గరా నేర్చుకోలేదు. సొంతంగా రహస్యంగా అభ్యాసం చేసి పియానో, ధోలక్, డ్రమ్స్ వాయించడం నేర్చుకున్నాడు. ఇలా దేనినైనా సొంతంగా నేర్చుకునే ప్రజ్ఞ ఆయనలో ఉండేది. దీని సాయంతోనే, పెద్దయ్యాక, హోమియోపతిని, జ్యోతిషాన్ని కూడా స్వయం-అధ్యయనంతో నేర్చుకున్నాడు. దీనికి కారణం దశమంలోని రాహువు. ఇలాంటి జాతకులు సంప్రదాయానికి భిన్నంగా నడుస్తారు. ఒకవిధమైన మొండిగా, విప్లవాత్మకంగా ఉంటారు. నయ్యర్ కూడా అలాగే తయారయ్యాడు.

చిన్నవయసులోనే లాహోర్ ఆల్ ఇండియా రేడియోలో సింగర్ గా పనిచేస్తున్న సమయంలో, సరోజ్ అరోరా అనే డాన్సర్ తో పరిచయం ఏర్పడింది. ఆమె రచయిత్రి కూడా. ఈమె వ్రాసిన 'ప్రీతమ్ ఆన్ మిలో' అనే పాటను 19 ఏళ్ల నయ్యర్ స్వరపరచగా, Ch. Atma పాడాడు. ప్రయివేట్ ఆల్బమ్ అయినప్పటికీ, ఈ పాట పాన్ ఇండియా హిట్ అయింది. ఈ సంఘటన 1945 లో జరిగింది. అప్పుడు నయ్యర్ కు  రాహు-శుక్రదశ నడుస్తున్నది. వయసు 19 ఏళ్ళు. ఈ దశ ఏం చేస్తుందో జ్యోతిషవిద్యార్థులకు తెలిసినదే కదా !  ఈయనకు సరోజ్ అరోరాకు ప్రేమ మొదలైంది.

ఈలోపల 1947 లో దేశం మూడుముక్కలైంది. అప్పుడీయనకు రాహు-చంద్ర-రాహు గ్రహణదశ నడిచింది. వీరి కుటుంబం ఇండియాలోని అమృత్ సర్ కు మారింది. పాటియాలాలో ఉంటూ, ఒక స్కూల్లో మ్యూజిక్  టీచర్ గా పనిచేస్తూ ఉండేవాడు. 

19-5-1951 తేదీన, నయ్యర్, సరోజ్ అరోరాల పెళ్లిజరిగింది. అప్పటికి నయ్యర్ కు 25 ఏళ్ళు. సరోజ్ కు కూడా అటూఇటుగా అంతే ఉండవచ్చు. అయితే, నయ్యర్ చాలా ముక్కుసూటి మనిషి. 'నేను పక్కా స్త్రీలోలుడిని. నా జీవితంలో, అనేకమంది స్త్రీలతో నేను సంబంధాలను పెట్టుకోవచ్చు. ముందే చెబుతున్నాను. తర్వాత నీ ఇష్టం' అని పెళ్ళికి ముందే సరోజ్ తో  ఖండితంగా చెప్పేశాడు. 

దానికి ఒప్పుకున్న సరోజ్ 'సరే నీ ఇష్టం. కానీ ఇంకో పెళ్ళిమాత్రం చేసుకోకు' అని షరతు పెట్టింది. దానికి నయ్యర్ ఒప్పుకున్నాడు. ఆ ఒప్పందాలతో వీరి పెళ్లి జరిగింది. అప్పట్లోనే ఇంత విశాలదృక్పథాలతో కూడిన పెళ్లిళ్లు జరిగేవన్నమాట !

ఆనాడు నయ్యర్ జాతకంలో గురు గురు చంద్ర రాహు శుక్రదశ నడుస్తోంది. ఇందులో వ్యామోహమే ఎక్కువగా కనిపిస్తోంది. గజకేసరీయోగాన్ని కాస్తా గురువుయొక్క నీచత్వం మ్రింగేసింది. దానికింకొక కారణం గోచారశని. ఈయన కన్యలో ఉంటూ వక్రించి సింహంలోకి వస్తున్నాడు.  అంటే,అష్టమశని దశ జరుగుతోంది. అందుకే ఈ పెళ్లి చివరకు పెటాకులై పోయింది.

గురుమహర్దశ

గురుదశ నవంబర్ 1949 లో మొదలైంది. ఇది ఈయన జీవితాన్ని అనేక మలుపులు త్రిప్పింది. గురుదశలోనే గురుదత్ తో పరిచయం ఏర్పడింది. తను తీసిన సినిమాలన్నింటిలో నయ్యర్ కు ఛాన్సిచ్చాడు గురుదత్. అంతేగాక, నయ్యర్ కూడా గీతాదత్ చేత  తన పాటలన్నింటినీ పాడించేవాడు. 

1949 లోనే  బాంబేకు మకాం మార్చి 'కనీజ్' అనే సినిమాకు నేపధ్యసంగీతాన్ని అందించాడు. 1952 లో 'ఆస్మాన్' అనే సినిమాకు మొదటిసారి సంగీతదర్శకత్వాన్ని వహించాడు.

కెరీర్ ప్రారంభ దశ

ఈయన కెరీర్ లో 1949-52 మధ్య సమయాన్ని ప్రారంభదశగా చెప్పుకోవచ్చు. ఆ సమయంలో గురు-గురు, గురు-శని దశలు నడిచాయి. గోచారగురువు మకరం నీచస్థితినుండి వృషభం వరకూ సంచరించాడు. గోచారశని సింహ, కన్యలలో సంచరించాడు. అది అర్ధాష్టమశని దశ. కనుక మొదటి మూడుసినిమాలు సంగీతపరంగా అంత బాగా ఆడలేదు.

గీతాదత్ దశ

1953-56 మధ్యదశను గీతాదత్ దశగా చెప్పుకోవచ్చు.

1954 లో తన 'ఆర్ పార్' సినిమాకు గురుదత్ ఈయనను సంగీతదర్శకుడిగా ఎన్నుకున్నాడు. ఆ సమయంలో గోచారశని దశమంలో ఉచ్ఛస్థితికి వచ్చాడు. ఆ సినిమా సూపర్ హిట్  అయింది. 

దానితర్వాత 1955, 56 లలో వరుసగా గురుదత్ తీసిన మిస్టర్ అండ్ మిసెస్ - 55, సిఐడీ సినిమాలు ఘనవిజయాలను సాధించాయి. గోచారశని దశమంలో ఉచ్ఛస్థితిలో ఉన్నాడు.  అందుకే అలా జరిగింది.

అయితే, గోచారశని వృశ్చికంలోకి మారి, జననకాల శనికుజులపైకి రాగానే,  ఈయన జీవితాన్ని ధ్వంసం చేసిన ఆశాభోంస్లే పరిచయం అయింది. ఆ సమయంలో ఈయనకు గురు-బుధదశ మొదలైంది. బుధుడు నవమాధిపతి, చంద్రలగ్నాత్ కూడా 6-9 ఆధిపత్యం ఉన్నది. కనుక బలమైన గతకర్మానుసారంగా, ఈ పరిచయం ప్రేమగా మారింది.

ఆమెను తన టీమ్ లోకి తీసుకున్నాడు. అప్పటివరకూ అక్క లతా నీడలో దాగి, క్లబ్బు పాటలను పాడుకుంటున్న ఆమెను ఒక ముఖ్యగాయనిగా తీర్చిదిద్దాడు. అప్పటివరకూ తన పాటలను పాడుతున్న షంషాద్ బేగం, గీతాదత్ లను పక్కనపెట్టి ఈమెకు ఛాన్సులివ్వడం మొదలుపెట్టాడు. ఇది తన జీవితంలో చేసిన పొరపాట్లలో ఒకటని తర్వాతి కాలంలో ఒప్పుకున్నాడు.

ఆశాభోంస్లే దశ

1957-68 ను ఆశాభోంస్లే దశగా చెప్పుకోవచ్చు.  ఈ సమయంలో 20 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. వాటిల్లో అన్నీ హిట్ పాటలే. 

1957 లో బీ.ఆర్.చోప్రా తీసిన  'నయా దౌర్' తో ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిల్మ్ ఫెర్ అవార్డును అందుకున్నాడు. ఆ సమయంలోనే ఒక సినిమాకు లక్షరూపాయలు పారితోషికాన్ని తీసుకునేవాడు. ఆ సమయంలో గురు-శుక్రదశ నడిచింది. వృశ్చికశని వక్రించి తులాశని ఫలితాన్నిచ్చాడు.

1958 లో వీరిద్దరూ సహజీవనం మొదలుపెట్టారు. ఆ సమయంలో గురు-శుక్రదశ నడిచింది. పంచమశుక్రుడు మళ్ళీ ప్రేమలో పడవేశాడు. అప్పుడు మొదలైన వీరి ప్రేమాయణం 14 ఏళ్లపాటు సాగి, 1972 లో ముగిసింది. 

Ek Musafir Ek Hasina (1962), Phir Wohi Dil Laya Hoon (1963), Kashmir Ki Kali (1964) ల  వరుసవిజయాలతో ప్రసిద్ధ రొమాంటిక్ మ్యూజిక్ డైరెక్టర్ గా స్థిరపడ్డాడు. ఆ సమయంలో రాహుకేతువులు మిధున-ధనుస్సులలో ఉచ్ఛస్థితులలో ఉన్నారు.

అక్టోబర్ 1964 లో గురుదత్ అర్ధాంతరంగా చనిపోవడం నయ్యర్ ను దెబ్బకొట్టింది. అది గురు-రాహు దశ. దీనిని ఛిద్రదశ అంటారు. ఇది  జీవితాలను చిదిమేస్తుంది. గురుదత్ మరణంతో నయ్యర్ కు కష్టకాలం మొదలైంది. ఆ సమయంలో నయ్యర్ కు ఏలినాటిశని రెండవపాదం నడుస్తోంది. శని కుంభంలో వక్రించి  ఉన్నాడు. గురువు వృషభంలో వక్రించాడు. కనుక, అదృష్టం వక్రించింది.

శనిమహర్దశ

1965 లో మొదలైన శనిదశతో ఈయనకు అవకాశాలు సన్నగిల్లడం మొదలైంది. దానికి కారణాలు అనేకం.  జ్యోతిషకారణం మాత్రం, శని బాధకస్థానంలో, శత్రువైన కుజునితో కలసి ఉండటం. అది దుర్ఘటనాయోగం కావడం.

ఈయనకు PR చేతకాదు. తనదగ్గరకు వచ్చిన నిర్మాతలకు మాత్రం మ్యూజిక్ చేసిపెట్టేవాడు. కానీ, పరిచయాలు పెంచుకొని, స్నేహాలు కలుపుకొని, పార్టీలిచ్చి, ఛాన్సులను సంపాదించడం ఈయనకు రాదు. పైగా, ముక్కుసూటిగా మాట్లాడేవాడు. దానికితోడు అతి డిసిప్లిన్ ఈయనతో ఉండేది. 

ఒక రికార్డింగ్ కు రెండుసార్లు పిలిచినా లతామంగేష్కర్ రాలేదని, ఆమెతో ఎప్పటికీ పనిచెయ్యనని ప్రతిజ్ఞ చేశాడు. ఆమేమో, హీరోయిన్లకు తప్ప వేరే పాత్రలకు తను పాడనంటుంది. క్రమేణా ఆమెకూడా ఈయనపైన పగబట్టి, తన చేతిలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడైన అనిల్ బిశ్వాస్ ద్వారా పావులు కదిపి ఈయనకు అవకాశాలు రాకుండా చేసింది. 

సమయపాలన లేకపోతే ఎంతటివాడినైనా అందరిముందూ తిట్టేసేవాడు. రఫీ, ఆశాల డ్యూయెట్స్ ను ప్రోత్సహించి, రఫీని బాగా సపోర్ట్ చేసింది ఈయనే. అలాంటిది, ఒకరోజున శంకర్ జైకిషన్ రికార్డింగ్ లో లేటై, తన రికార్డింగ్ కు ఆలస్యంగా వచ్ఛాడని మహమ్మద్ రఫీని తిట్టి పంపేసి, రెండేళ్లపాటు పాటలివ్వకుండా బహిష్కరించాడు. 

ప్రముఖ వేణువిద్వాంసుడు హరిప్రసాద్ చౌరాసియాను కూడా ఇదే కారణంతో వెనక్కు పంపించేశాడు.

తలత్ మహమూద్ మంచి గాయకుడు. కానీ, మన పీబీ శ్రీనివాస్ లాగా, ఆయనది సాఫ్ట్ మేల్ వాయిస్. గొంతును కొంచెం బొంగురుగా చేసుకోవడానికి అప్పట్లో కొంతమంది గాయకులు సిగరెట్ త్రాగేవారు. రికార్డింగ్ గ్యాప్ లో తలత్ మెహమూద్ సిగిరెట్ త్రాగుతుండటం నయ్యర్ చూచాడు. కోపంతో అతన్ని తిట్టి పంపించేశాడు. ఆ తర్వాత అతనికి  ఛాన్సులివ్వలేదు.

ఈ విధంగా, ఆర్టిస్టుల దగ్గర క్రమశిక్షణ లేకపోతే ఊరుకునేవాడు కాదు. ఆత్మాభిమానం, కోపాలు ఎక్కువ. పట్టూవిడుపూ లేకపోతే సినిమారంగంలో నెగ్గడం కష్టం. ముఖంమీద ఉమ్మేసినా తుడుచుకొని పోయేవారికే అక్కడ రాణింపు  ఉంటుంది. అది ఈయనకు చేతకాదు.

ఇలాఉండగా, ఈయన మార్కు సంగీతం క్రమేణా పాతబడిపోయింది. వెస్ట్రన్ బీట్స్ కలిసిన మ్యూజిక్ పాపులర్ అయింది. ఆర్దీ బర్మన్ వంటి క్రొత్తతరం ముందుకొచ్చింది.

ఈయన ఆశాభోంస్లే ను అమితంగా ప్రేమించాడు. కానీ ఆశా, తన అవకాశాలను, కెరీర్ ను మాత్రమే ప్రేమించింది. నయ్యర్ కు క్రమేణా ఛాన్సులు తగ్గాయి. పైగా ఈయన బాగా పొసెసివ్ గా ఉండేవాడు. ఆశా ఏ పాటను పాడాలో ఏదివద్దో ఈయనే నిర్ణయించేవాడు. ఏ సినిమా ఒప్పుకోవాలో ఏది వద్దో తనే చెప్పేవాడు. ఇదంతా అనవసరమైన నసగా ఆశాకు అనిపించింది. నయ్యర్  తన కెరీర్ కు అడ్డుగా మారాడని ఆశా భావించింది. ప్రతిదానికీ గొడవలు మొదలయ్యాయి. క్రమేణా ఈయనకు దూరమై, ఆర్దీబర్మన్ కు దగ్గరైంది. 

ఒకరోజున ఏదో చిన్నతప్పు చేసిందని, ఆశా కూతురు వర్షాభోంస్లేను అరిచి, చెయ్యెత్తి కొట్టబోయాడు. దానికి ఆశా అడ్డొచ్చింది. ఇద్దరికీ గొడవైంది. కోపంతో ఆమెను వదలి బయటకు వచ్చేశాడు.

ఆ విధంగా 5-8-1972 న ఆశాభోంస్లే తో విడిపోయాడు. అప్పటికి ఆమెతో 324 పాటలను పాడించాడు. కానీ ఆశా ఈయనను వదిలేసి ముందుకెళ్ళిపోయింది. ఈయన ఒక పిచ్చివాడిలాగా మిగిలిపోయాడు.

ఆ సమయంలో, ఈయన జాతకంలో శని-శుక్ర-రవి దశ నడిచింది. రవికేతువులు గ్రహయుద్ధంలో ఒకే డిగ్రీమీదున్నారు. పదకొండో అధిపతిగా రవి, పేరు ప్రఖ్యాతులున్న ఆశాను సూచిస్తున్నాడు. కనుక ఆ సమయంలో వీరిద్దరికీ గొడవై, విడిపోయారు. తిరిగి జీవితంలో కలుసుకోలేదు.

1972-79 కష్టాలు మొదలు

ఆశాతో విడిపోయాక, నయ్యర్ కెరీర్ బాగా తగ్గడం మొదలైంది. లతాతో పాటలు చెయ్యడానికి ఒప్పుకోడు. రఫీని దూరం పెట్టాడు. అందరితో సత్సంబంధాలు లేవు. PR లేదు. ఇక ఛాన్సులెలా వస్తాయి?

చివరకొకనాడు, తగ్గి, తనే రఫీ ఇంటికి వెళ్లి మాట్లాడాడు. రఫీ మెత్తబడ్డాడు. మళ్ళీ ఇద్దరూ కలిసిపోయారు. కానీ ఆశా దూరమైంది. ఆమె స్థానంలో వాణీజయరాం, దిల్రాజ్ కౌర్, కృష్ణా కల్లే, పుష్పా పగ్దరే, కవితాకృష్ణమూర్తి మొదలైన అప్పుడప్పుడే పైకొస్తున్న సింగర్స్ కు ఛాన్సులిచ్చి, వారిచేత పాడించాడు. కానీ వారెవరూ, ఆశా భోంస్లే మ్యాజిక్ ముందు తూగలేకపోయారు.

రఫీ మాత్రం నయ్యర్ ను బాగా సపోర్ట్ చేశాడు. కానీ మారిన సంగీతపు ట్రెండ్ లో, నయ్యర్ సంగీతం జనానికి నచ్చడం తగ్గింది. 1979 కల్లా ఛాన్సులు బాగా తగ్గిపోయాయి.

మాధురీ జోగ్లేకర్ దశ

అది శని - చంద్రదశ. 1976-77 ప్రాంతాలలో మాధురీ జోగ్లేకర్ అనే మరొక సింగర్ ఈయనకు పరిచయమైంది. ఈ దశను బట్టి వీరిది అందరూ అనుకునేటట్లుగా శృంగారసంబంధం కాదని అనిపిస్తుంది. శృంగారం కంటే ఎక్కువగా, అభిరుచులు, భావుకత, ఫిలాసఫీ మొదలైన హృదయసంబంధమైన విషయాలలో వీరికి శృతి కలిసి ఉండాలి.  ఇదే నిజమని తన తర్వాతి ఇంటర్వ్యూలలో మాధురీ చెప్పింది.

మొదట్లో, ఈయన మ్యూజిక్ ట్రూపులో కోరస్ సింగర్ గా ఈమె చేరింది.  అప్పటికే ఆమె మ్యూజిక్ లో MA చేసి ఉన్నది. ఈమెలో టాలెంట్ ను చూచిన నయ్యర్ ఈమెను దగ్గరకు తీశాడు. చర్చ్ గేట్ ఏరియాలో ఉన్న నయ్యర్ ఇంటికి ఈమె రోజూ వస్తూ ఉండేది. అప్పటికే నయ్యర్ హోమియోపతి, జ్యోతిష్యాలను బాగా అధ్యయనం చేయడం మొదలుపెట్టాడు. వాటిలో కూడా ఈమె సాయం చేస్తూ ఉండేది. చాలావరకు ఈయనకు సెక్రటరీగా పనిచేసేది. ఈయనకూడా 1976 నుంచే, బాంబే శివార్లలో వీరార్లో ఉన్న ఈమె ఇంటిలోనే ఎక్కువగా ఉంటూ ఉండేవాడు.

1974 లో (అంటే 22 ఏళ్ల వయసులోనే) ఈమె UPSC పరీక్షను క్లియర్ చేసి FCI లో ఆఫీసర్ గా చేరింది. అయినా సరే, సంగీతంపైన ఉన్న మక్కువతో, ఒకవైపు ఉద్యోగం చేస్తూ కూడా, నయ్యర్ కు సాయపడుతూ ఉండేది. క్రమేణా వీరిమధ్య రొమాంటిక్ సంబంధం ఏర్పడింది. ఈమె నయ్యర్ కంటే 26 ఏళ్ళు చిన్నది. అప్పటికి నయ్యర్ కు 50 ఏళ్ళు, ఈమెకు 24 ఏళ్ళు.

అప్పటివరకూ నయ్యర్ ప్రేమాయణాలను ఓపికగా భరిస్తూ వచ్చిన భార్యాపిల్లలు దీనికి అభ్యంతరం చెప్పడం మొదలుపెట్టారు. నయ్యర్ పిల్లలుకూడా పాతికేళ్ళవయసులోకి వచ్చారు. ఎన్నాళ్ళని ఈయన వేషాలను భరిస్తారు? వాళ్ళనుండి తీవ్రమైన ప్రతిఘటన ఎదురయ్యేసరికి నయ్యర్ కోపం తెచ్చుకున్నాడు. ఒకవైపు ఛాన్సులు తగ్గిపోయాయి. ఇంకోవైపు తను అమితంగా ప్రేమించిన సంగీతరంగం వెక్కిరిస్తోంది. ఆశా ఇచ్చిన షాకు చాలా గట్టిగా తగిలింది. ఇప్పుడు కుటుంబసభ్యులు ఎదిరించేసరికి తట్టుకోలేక, వారిని ఇంట్లోనుంచి వెళ్లిపొమ్మని గద్దించాడు. గట్టిగా నిలబడిన వాళ్ళు, ఆస్తిలో వాటాకోసం కోర్టులో కేసువేశారు. తెగేవరకూ లాగవద్దని, కోర్టుబయట ఒప్పందమే మంచిదని లీగల్ నిపుణులు ఈయనకు సలహా ఇచ్చారు. ఇంటిని, ఆస్తిని వారికి రాసేసి, నయ్యర్ కట్టుబట్టలతో ఇంటినుండి బయటకు వచ్చేశాడు. ఇదంతా 1979 లో జరిగింది.

తనవైపునుండి తాను కరెక్ట్ కావచ్చు. కానీ ఎదుటివారినుండి, అందులోనూ కుటుంబసభ్యులనుండి కూడా ఆలోచించాలి. భౌతికసంబంధాలు లేకుండా, గాలికి ఎగిరిపోతూ, భావప్రపంచాల్లో ఎప్పుడూ విహరిస్తూ ఉండే ఇటువంటి కళాత్మకమనస్తత్వాలు, జీవితవిధానాలు ఉన్నవాళ్లు పెళ్లిళ్లు చేసుకోకూడదు.

'నేనింతే' అని పెళ్ళికి ముందే చెప్పాడు కాబట్టి నయ్యర్ కరెక్టే అనడమే అసలు కరెక్ట్ కాదు. 'నేనింతే, నేను పెళ్ళికి పనికిరాను. మన పెళ్లి ఒద్దు. నాతో నువ్వు సుఖపడలేవు. నువ్వేకాదు, నాతో ఎవ్వరూ సుఖపడలేరు. నా దారి వేరు.' అని చెప్పాలి. అలా చెప్పకపోవడం నయ్యర్ చేసిన తప్పు. నయ్యర్ చెప్పినప్పటికీ సరోజ్ ఒప్పుకోవడం ఆమె తప్పు. వెరసి ఇద్దరిఖర్మా అలా ఉంది. పాపం, వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? 

ఆ విధంగా, 1979 లో కుటుంబంతో విడిపోయి  విలాసవంతమైన తన చర్చ్ గేట్ ఇల్లును వదిలిపెట్టాడు. ఆ సమయంలో శని-రాహుదశ నడిచింది. ఇది శపితదశ అని గతంలో ఎన్నో జాతకాలలో నిరూపించాను. ఈ దశ ఏం చేస్తుందో కూడా వందలాది జాతకాలలో వివరించాను. ఈయన్ని కూడా ఈ దశ చావుదెబ్బ కొట్టింది.

ఇంటినుండి బయటకు వచ్చి, కుటుంబంతో తెగతెంపులు చేసుకుని, బాంబే శివార్లలో ఉన్న వీరార్ లో మాధురీతో కలసి ఆమె ఇంటిలో ఉండటం మొదలుపెట్టాడు. వీరి సహజీవనం 1976 నుండి 1996 వరకూ 20  ఏళ్లపాటు సాగింది. అయినా సరే, మధ్యమధ్యలో అప్పుడపుడు కొన్ని సినిమాలకు సంగీతాన్నిస్తూ ఉండేవాడు.

(ఇంకా ఉంది)

read more " O.P.Nayyar జాతకవిశ్లేషణ - 2 "

15, జులై 2026, బుధవారం

O. P. Nayyar జాతకవిశ్లేషణ - 1

పాతతరం హిందీ మధురగీతాలను ఇష్టపడేవారిలో ఓపీ నయ్యర్ పేరును తెలియనివారు ఉండరు. ఈయన అభిమానులందరూ తమను తాము OPiums అని పిలుచుకుంటారు.

ఈయన పూర్తిపేరు ఓంకార్ ప్రసాద్ నయ్యర్.  ఈయనపుట్టి ఇప్పటికి నూరేళ్లు దాటింది. అయినా సరే, నేటికీ ఈయన స్వరపరచిన పాటలను ఇష్టపడేవారు కోట్లలో ఉన్నారు.  

ఈయన తెలుగులో కూడా 'నీరాజనం' అని ఒక సినిమాను చేశారు. అది 1989 లో విడుదలైంది. అందులోని పాటలు కూడా ఆపాతమధురాలే. ఈయన ట్యూన్స్ ను తెలుగులోకి కూడా కాపీ కొట్టారు. ఉదాహరణకు "ఒ లేకే పెహలా పెహలా ప్యార్"  అనే పాటరాగాన్ని తెలుగులో "ఓహో బస్తీ దొరసానీ" అనే పాటకు తీసుకున్నారు.

అయితే, పాతతరం హిందీసినిమా దర్శకులలో అత్యధిక మొత్తాన్ని ఫీజుగా తీసుకున్న ఈయన, తన జీవితం రెండవభాగంలో సంగీతంవైపూ, సినీఫీల్డ్ వైపూ తిరిగి చూడకుండా, వాటిని పూర్తిగా వదిలేసి, ఒక హోమియోపతి వైద్యునిగా, ఒక జ్యోతిష్కునిగా మంచిప్రజ్ఞను సంపాదించి, పదేళ్లపైగా బాంబే స్లం ఏరియాలలోని పేదవారికి నిస్వార్థమైన సేవలందించి, చివరకు తన కుటుంబానికి దూరంగా, ఒంటరిగా కన్నుమూశాడు.

తన కుటుంబసభ్యులు కానీ, సినిమాజీవులుకానీ, విలేఖరులుగానీ, టీవీ జనాలు గానీ,  ఎవరూ తన అంత్యక్రియలకు రాకూడదని, కనీసం తన శవాన్ని తాకడానికి కూడా వీల్లేదని విల్లు వ్రాసిపెట్టి మరీ కన్నుమూశాడు. తన అంత్యక్రియలు కూడా అతినిరాడంబరంగా జరగాలని, ఆ తరువాత సంస్మరణసభలు పెట్టకూడదని గట్టిగా హెచ్చరించి వెళ్ళిపోయాడు.

ఈయన సంగీతాన్ని నేర్చుకోలేదు. కానీ సంగీతదర్శకుడయ్యాడు. నూరేళ్ళతర్వాత కూడా ప్రపంచం మరచిపోలేని స్వరాలందించాడు. కేవలం 19 ఏళ్ల వయసులో "ప్రీతమ్ ఆన్ మిలో" అనే  సూపర్ హిట్ పాటను స్వరపరచాడు. దీనిని ఈయన స్నేహితుడైన Ch. ఆత్మా పాడాడు. 80 ఏళ్ల తర్వాత ఈనాటికి కూడా ఈ పాట ఆపాతమధురమే.

ఈయన వైద్యశాస్త్రాన్ని చదవలేదు. కానీ, ముంబాయికి చెందిన ప్రముఖ హోమియోవైద్యుడు డా. ఎస్సార్ పాఠక్ దగ్గర హోమియోపతిని నేర్చుకుని, వైద్యుడయ్యాడు. వేలాదిమంది పేదరోగులకు ఉచితంగా మందులిచ్చి సేవచేశాడు. ముంబాయ్, కలకత్తా, హైదరాబాద్ లలో ఉచితహోమియో క్లినిక్స్ నడిపాడు. అలా పేదవారికి సేవను చేయడంలో ఆనందాన్ని పొందాడు. 

జ్యోతిషాన్ని ఎవరిదగ్గరా నేర్చుకోలేదు. కానీ, సొంతంగా దానిని నేర్చుకుని దానిలో మంచిప్రజ్ఞను సంపాదించాడు. ఎంతోమంది సినీ ప్రముఖులకు, ఇతరులకు జోస్యాన్ని కరెక్ట్ గా చెప్పాడు. తను పుట్టిననెలలోనే మధుబాల చనిపోతుందని చెప్పాడు. ఆమె అలాగే చనిపోయింది. చివరకు తన మరణాన్ని కూడా తనే కరెక్టుగా జోస్యం చెప్పుకున్నాడు. అదేవిధంగా చనిపోయాడు. 

ఎన్ని చేసినా తన 81 ఏళ్ల సుదీర్ఘజీవితంలో ఆత్మాభిమానాన్ని మాత్రం వదులుకోలేదు. జీవితపు ప్రతిమలుపులోనూ తలెత్తుకునే బ్రతికాడు. అత్యంతవిలాసాలనూ, సాధారణజీవితాన్నీ రెండింటినీ చూశాడు. చివరలో ఒక ఋషిలా బ్రతికి, ఒక అనామకుడుగా చనిపోయాడు.

ఈయనలో ఒక కళాతపస్వి, ఒక ప్రేమపిపాసి, ఒక భావుకుడు, ఒక తాత్వికుడు, ఒక క్రమశిక్షణను కలిగిన రూల్ మాస్టర్, ఒక మొండివాడు, ఒక నోటిదురుసు మనిషి, ఒక నిస్వార్ధహృదయుడు, ఒక నిరాడంబరజీవి  అందరూ కలిసి ఉన్నారు.

ఈయన 16-1-1926 న లాహోర్ లో ఒక బ్రాహ్మణకుటుంబంలో పుట్టాడు. 2007 లో 81 ఏళ్లవయసులో గుండెపోటుతో థానేలో  చనిపోయాడు. 1957 లోనే ఒక సినిమాకు లక్షరూపాయలు పారితోషికాన్ని తీసుకునేవాడు. అప్పట్లోనే బాంబే మొత్తమ్మీద 'కాడిలాక్' కార్లున్న ఇద్దరిలో ఈయనొకడు. కానీ విలాసవంతమైన అటువంటి జీవితాన్ని వదిలిపెట్టి బాంబే స్లంలో ఒక చిన్నగదిలో ఒక లోయర్ మిడిల్ క్లాస్ కుటుంబంతో పేయింగ్ గెస్ట్ గా ఉండేవాడు.చివరకు అక్కడే కన్నుమూశాడు.

తన కెరీర్ మొత్తంలో 500 పైన పాటలను సృష్టించినా, లతామంగేష్కర్ తో ఒక్కపాటను కూడా పాడించలేదు. వాళ్లిద్దరి మధ్యా గొడవలుండేవి. కానీ 1950-60 మధ్యలో హిందీసినిమా సంగీతాన్ని ఏలాడు. 'రిథమ్ కింగ్' అనే బిరుదును సంపాదించాడు. 

1990 లో తనకు డబ్బు ఇబ్బందులున్న రోజులలో కూడా, లతామంగేష్కర్ అవార్డు క్రింద లక్షరూపాయలను తనకు ఇస్తామంటే, ' ఆమెపేరుతో పెట్టిన అవార్డు నాకేంటి? నాన్సెన్స్ !' అని దానిని తిరస్కరించాడు. అలాంటి మొండివాడు. ఆత్మాభిమాని.

అందుకే ఈయనది చాలా విచిత్రమైన జీవితమని అంటాను.  ఈయన జాతకాన్ని చూద్దాం ! 

అంతకుముందుగా,  ఈయన స్వరపరచిన 500+ పాటలనుంచి కొన్ని ప్రముఖపాటలు :

1. ప్రీతమ్ ఆన్ మిలో - ప్రయివేట్ ఆల్బమ్ - 1945

2. మాంగ్ కె సాత్ తుమారా -  నయా దౌర్ -1957

3. బాబూజీ ధీరే చల్నా - ఆర్ పార్ -1954

4. ఆవో హుజూర్ తుమ్కో - కిస్మత్ -1968

5. పుకార్తా చలా హు మై - మేరే సనమ్ -1965

6. యే దిల్ హై ముషికిల్  జీనా యహా - CID 1956

7. దీవానా హువా బాదల్ - కశ్మీర్ కీ కలీ -1964

8. లేకే పెహలా పెహలా ప్యార్ - CID 1956

9. కజరా మొహబ్బత్ వాలా - కిస్మత్ 1968

10. ఇషారో ఇషారో మె - కశ్మీర్ కీ కలీ -1964

11. జాయియే ఆప్ కహా జాయేంగే - మేరె సనమ్ -1965

12. తారీఫ్ కరూ క్యా ఉస్కీ - కశ్మీర్ కీ కలీ -1964

13. జానే కహా మేరా జిగర్ గయా జీ - Mr Mrs 55 - 1955

14. ఆయియే మెహర్ బాన్ - హౌరా బ్రిడ్జ్ - 1958

15. జరా హౌలే హౌలే చలో మేరే సాజ్నా - సావన్ కీ ఘటా -1966

16. ఆఖో హి ఆఖో మే ఇషారా హోగయా - CID -1956

17. యూ తో హంనే లాఖ్ హసీ దేఖే హై - తుంసా నహీ దేఖా - 1957

18. తుం జో హుయే మేరే హంసఫర్ - (12 O'Clock) - 1958

19. యే హై రేష్మీ జ్యూల్పోన్ క అంధేరా - మేరె సనమ్ - 1965

20. ఆప్ యూహీ అగర్ హం సే మిల్తే రహే - ఏక్ ముసాఫిర్ ఏక్ హసీనా -1962 

21. చైన్ సే హంకో కభీ - ప్రాణ్ జాయే పర్ వచన్ న జాయే - 1974

22. ఉడే జబ్ జబ్ జుల్పే తేరీ - నయా దౌర్ -1957

23  మేరా నామ్ చిన్ చిన్ చిన్ - హౌరా బ్రిడ్జ్ -1958

24. ఏక్ పరదేశి మేరా దిల్ లేగయా - ఫాగున్ - 1958

25. కభీ ఆర్ కభీ పార్ - ఆర్ పార్ - 1953

26. సున్ సున్ సున్ జాలిమా - ఆర్ పార్ -1953

27. పియా పియా పియా మేరా జియా పుకారే - బాప్ రే బాప్ -1955

28. సర్ పర్ టోపీ లాల్ దుపట్టా - తుంసా నహి దేఖా -1957

29. తూ ప్యార్ కా సాగర్ హై - సీమా -1955

30. దిల్ కి ఆవాజ్ భి సున్ - హం సాయా -1968

31. రేష్మి సల్వార్ కుర్తా జాలీ కా - నయా దౌర్ - 1957

32. మై ప్యార్ కా రాహీ హూ - ఏక్ ముసాఫిర్ ఏక్ హసీనా -1962

33. లాఖో హై నిగాహ్ మే - ఫిర్  ఓహీ దిల్ లాయా హు. - 1963  

(ఇంకా ఉంది )
read more " O. P. Nayyar జాతకవిశ్లేషణ - 1 "

30, జూన్ 2026, మంగళవారం

రామమందిర చందాచోరీ వివాదం

అయోధ్య రామమందిరం మొదలవడమే గొడవలతో మొదలైంది. 

మొదలుపెట్టి రెండేళ్లు కూడా కాకముందే పెద్ద వివాదంలో చిక్కుకుంది. భక్తులిచ్చిన చందాలు దొంగిలించబడటం చాలా బాధాకరం. దేశం మొత్తంమీద హిందువుల నమ్మకం తీవ్రంగా దెబ్బతిన్నది.

తిరుమలలో ఇదే జరిగింది. పట్టుకున్న S.I హత్యకు గురయ్యాడు. ఇప్పుడు అయోధ్యలోనూ అదే నేరం జరిగింది. పద్మనాభస్వామి ఆలయంలో వేరేరకంగా ఇదే జరిగింది. మొత్తానికి, దేవుడంటే భక్తులకు భక్తి ఉన్నప్పటికీ, ఆలయంలో పనిచేసేవాళ్లకు  మాత్రం ఏదీ ఉండదని తేలిపోయింది.

ఆలయాలలో అవినీతి, దొంగతనాలు,  జరగడం. అదికూడా భక్తులు చేయడం చాలా బాధాకరం. 'మిశ్రా, శుక్లా, పాండే' అనేపేర్లు బ్రాహ్మణులు. 'బన్సాల్' అంటే వైశ్యులు. యాదవ్ అంటే తెలిసినదే. వీళ్ళే ఇలాంటిపనులు చేస్తే ఇక ఎవర్ని ఏమనుకోవాలి? మేనేజ్మెంట్ లో వేరే కులాలు మతాలవాళ్ళు ఉన్నపుడు వారిని అనుకున్నాం గతంలో. ఇప్పుడు చేసిందెవరు? ఎవర్ని అనాలి? ఏమనాలి?

మేనేజ్ మెంట్ అంటే ఇదేనా? అందులోనూ అయోధ్యరామాలయం వంటి సంస్థను ఇలాగేనా నడిపేది? పైగా, ఉన్నవాళ్ళందరూ పెద్దపెద్దవాళ్లు?

చిన్నదొంగలను పట్టిచ్చి. లేదా పట్టుకున్నవారిని లేపేసి, సినిమాటిగ్గా పెద్దదొంగలు తప్పించుకుంటారని గతంలో చాలావాటిలో రుజువైంది. ఇప్పుడేమౌతుందో చూడాలి.

---------------------

ఎప్పుడూ ఎదురుగా కనిపిస్తుంటే దేవుడు కూడా చీపై పోతాడు. అందుకే, దూరాన్నించి దర్శనంకోసం వచ్చిన భక్తులకున్న భక్తి, అక్కడున్న పూజారికి ఉండదు. హుండీ డబ్బులు లెక్కించేవారికి అసలే ఉండకపోవచ్చు.

ఎదురుగా ఊరిస్తున్న డబ్బూ బంగారాలు ముఖ్యంగాని, గుళ్లో ఉన్న రాతిబొమ్మ మనకెందుకు? మనం పెడితేనేగా దానికి తిండి? అయినా తినేది దేవుడు కాదుగా, మనమే. కనుక మనకు మనమే ముఖ్యం, దేవుడు కాదు.

దేవుడికి కూడా డబ్బుతోనే విలువ. ఇంకా చెప్పాలంటే, అసలు విలువ డబ్బుకే గాని, దేవుడికి  కాదు.

నిజానికి, డబ్బు సంపాదించడానికి దేవుడొక ఆధారం. ఇది వాస్తవం.

ఇదే వాస్తవం !

అదంతా అలా ఉంచితే, జ్యోతిషం ఏమంటున్నదో చూద్దాం.

------------------------

ప్రాణప్రతిష్ఠ 22 జనవరి 2024 న మధ్యాన్నం 12. 30 కు జరిగింది.

అప్పట్లోనే పుష్యమాసం ముహూర్తం మంచిది కాదని చాలామంది అన్నారు. ఎవరూ వినలేదు. అది శూన్యమాసం. ఫలితం స్పష్టంగా కనిపిస్తోంది.

దేవాలయ శిఖరం, కలశం పూర్తి కాకుండానే ప్రాణప్రతిష్ట చేయడం మంచిది కాదని కూడా చాలామంది అన్నారు. కానీ చేసేవారు చేశారు. ఇప్పుడిలా అయింది.

ఆనాటి గ్రహస్థితులు ఇలా ఉన్నాయి.

ఉచ్ఛచంద్రుడు ఎదురులేని ప్రజాభిప్రాయాన్ని సూచిస్తున్నాడు. కనుక దేశంలోని హిందువులందరి మద్దతుతో ఆలయం నిర్మాణమైంది.

అష్టమంలో కుజ బుధ శుక్రులున్నారు. శుక్రుడు ఇంటిదొంగలకు సూచకుడు. బుధుడు కుటుంబసభ్యులకు, అనుచరులకు సూచకుడు. కుజుడు రహస్యశత్రువులకు సూచకుడు. ఈ ముగ్గురూ కలసి నష్టానికి సూచికైన అష్టమంలో ఉన్నారు. ప్రస్తుతం జరిగింది అదే !

ప్రస్తుతం నడుస్తున్న దశ -- కుజ శుక్ర చంద్ర దశ. కుజశుక్రులిద్దరూ పెద్దనష్టాన్ని సూచిస్తున్న అష్టమంలో ఉండటాన్ని చూడవచ్చు. ఈ దశ మార్చి 2026 నుండి ఏప్రియల్ 2027 వరకూ ఉంది. మార్చిలోనే ఈ గొడవంతా బయటపడటం మొదలుపెట్టింది.

అధికారయంత్రాగాన్ని సూచించే సూర్యుడు మతసంబంధమైన నవమంలో పాపార్గళంలో చిక్కుకుపోయాడు. కనుక అధికారులూ యంత్రాంగమూ ఇరుకున పడ్డారు. సూర్యవిదశ సరిగ్గా మే - జూన్ నెలలలోనే నడిచింది.

దశమాధిపతి శని దశమంలో ఉన్నప్పటికీ, పాపార్గళంలో చిక్కుకున్నాడు. లాభస్థానంలోని గురుఛండాలయోగం నీతిలేని అనుచరులను (ఆలయ సిబ్బందిని) సూచిస్తున్నది. వీరివల్ల ఆలయమర్యాదకు ఘోరమైన కళంకం చుట్టుకుంది.

కుజదశ మార్చి 2028 వరకు ఉన్నది. అంతవరకూ పరిస్థితి బాగుపడదు.

ఆ పైన వచ్చే రాహుదశ 2046 వరకూ ఉంటుంది. అప్పుడూ, గురుఛండాలయోగం వల్ల ఏదో ఒక వివాదం ఉంటూనే ఉంటుంది.

ఇంతకంటే ముందుకు ప్రస్తుతం చూడనవసరం లేదు.

-------------------------

బయటనుండి వచ్చి దేవాలయాలను కొల్లగొట్టారని, కూలగొట్టారని రాక్షసులమాదిరిగా ప్రవర్తించారని తురకలను అనుకోవడం దేనికి? ఇంటిదొంగల సాయం లేకుండా వాళ్ళు ఆపనులు చేయగలిగేవారా? ఇప్పుడు మనవాళ్ళు చేస్తున్నదేమిటి?

ఇప్పుడు దోషులు కూడా ఇంటిదొంగలే. హిందూమతం ముఖ్యంగా దృష్టి పెట్టాల్సింది ఇంటిదొంగలమీదనే.

మన దేవుళ్ళపైన దేవాలయాలపైన మనకే గౌరవం లేదు. ఇక బయటవాళ్ళకెలా ఉంటుంది?

దేవుడికే ద్రోహం చేసేవాళ్ళు, మనుషులను ఒదులుతారనుకోవడం వెర్రితనం ! కాకపోతే, నీతికి మారుపేరుగా నిలవాల్సిన వాళ్ళే ఇలా చేస్తే, ఇక ఎవర్ని నమ్మగలం? అందులోనూ VHP, RSS కార్యకర్తలా? కోట్లాది హిందువుల హృదయాలు గాయపడ్డాయి.

వచ్చిన చెడ్డపేరు పోవడం చాలా కష్టం.

ముహూర్తసమయంలో నవాంశలో గురువు ఉచ్ఛస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు రాశిలోనే ఉన్నాడు. గురువు అనుగ్రహిస్తే కష్టాలనుండి తేలికగా బయటపడవచ్చు.  కానీ, ఆ అనుగ్రహానికి తగిన అర్హత మనలో ఉండాలి. అప్పుడే అది మనకు లభిస్తుంది. ఊరకే మాత్రం రాదు. 

ఈ మొత్తం వ్యవహారంలో యోగి ఆదిత్యనాథ్ ఒక్కడే నిజాయితీగా, ధైర్యంగా నిలబడ్డాడు.

చూద్దాం దీనినెలా పరిష్కరిస్తారో? పోయిన పరువునెలా తిరిగి రాబట్టుకుంటారో?

read more " రామమందిర చందాచోరీ వివాదం "