6, అక్టోబర్ 2026, మంగళవారం

ట్రైలర్ మొదలైంది - సినిమా ముందుంది

12-7-2026 న యురేనస్ రోహిణీ నక్షత్రంలోకి అడుగుపెట్టాడు.  వచ్చే మూడేళ్ళలో ప్రపంచవ్యాప్తంగానూ, ముఖ్యంగా ఇండియాలోనూ జరుగబోయే అల్లకల్లోలానికి ఆ రోజే నాంది జరిగింది.

విప్లవాలకు, ఉద్యమాలకు, అల్లర్లకు యురేనస్ కారకుడని జ్యోతిషవిద్యార్థులకు తెలిసినవిషయమే కదా !

దీనికి ఒక్కనెల ముందుగా, అంటే, మే లో కాక్రోచ్ జనతా పార్టీ మొదలైంది. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ విద్యార్థిసంఘాలు దానివెనుకా, ముందూ ఉన్నాయి. జార్జి సోరోస్ వర్గం ఫండింగ్ చేస్తోంది. ఢిల్లీలో, ముంబాయిలో వీళ్ళు చేసిన గోల అందరికీ తెలుసు. వీళ్ళగోలకు విద్యాశాఖామంత్రి ధర్మేంద్ర రాజీనామా చేయవలసి వచ్చింది. ఇప్పుడు CEC జ్ఞానేశ్ కుమార్ ను టార్గెట్ చేస్తున్నారు. ఆ తరువాత మోదీగారంటున్నారు. 

వీళ్ళను చూసి ఆలిండియా బ్యాంక్ స్ట్రైక్ అని మొదలుపెట్టారు. ఉచ్ఛస్థితిలో ఉన్న గురువువల్ల అది ఆగిపోయింది.

సెప్టెంబర్ 19 న కుజుడు కర్కాటకంలోకి అడుగుపెట్టి నీచస్థితిలోకి వచ్చాడు. ఈ స్థితిలో ఆయన నవంబర్ 12 వరకూ ఉంటాడు. ఇది విధ్వంసాలకు సూచిక. దీనికి తోడుగా జూలై 1 నుండి అక్టోబర్ 26 వరకూ రాహుకేతువులు నవాంశచక్రంలో నీచస్థితులలో ఉంటాయి. ఇది చాలా గడ్డుకాలం. కానీ కుజుని ప్రక్కనే కర్కాటకంలో ఉన్న గురువువల్ల అవి కంట్రోల్ అవుతున్నాయి. కానీ, గురువుగారు నవంబర్ 1 న సింహంలోకి వెళ్ళిపోతారు. అక్టోబర్ 15 ప్రాంతం నుంచీ గురువుగారి రక్షణ క్రమంగా తగ్గిపోతుంది. కనుక, అల్లర్లు ఎక్కువౌతాయి.

ఇది ఒక్క భారతదేశంలోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఉదాహరణకు చూడండి. ప్రాన్స్ లో విద్యార్థుల ఉద్యమం జరుగుతోంది. గత రెండువారాలుగా జరుగుతున్న ఈ ఉద్యమంతో అక్కడ దాదాపు 500 స్కూళ్ళు మూతపడ్డాయి. 5000 పైగా మైనర్ విద్యార్థులు అరెస్టయ్యారు.

పెట్రోల్ రేట్లు పెరిగాయని సిరియా, గుటెమాలా, ఫ్రాన్స్  లలో నిరసనలు జరుగుతున్నాయి. హౌసింగ్ సమస్యలపై స్పెయిన్లో ఉద్యమం మొదలైంది. ఉద్యమకారులపైన ప్లాస్టిక్ బులెట్లు పేల్చబడ్డాయి. ఇక ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధం గురించి చెప్పనే అక్కర్లేదు. అమెరికాలో కూడా ట్రంప్ కు వ్యతిరేకంగా డెమోక్రాట్ల ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. వీళ్ళు ఓటింగ్ రిఫార్మ్స్ అడుగుతున్నారు.

మొన్న జరిగిన ఇజ్రాయెల్ విమానఉదంతం కూడా దీనిలో భాగమే. అయితే, ఉచ్చ గురువు యొక్క కరుణ వల్ల, జరగవలసిన పెద్ద ప్రమాదం తప్పిపోయింది. లేదంటే ఆ విమానం పేలిపోయి ఉండేది.

అయితే, ఇలాంటి ఎటాక్స్ ముందుముందు మరిన్ని చేస్తామని ఆల్ ఖైదా ప్రకటించింది. ఎన్నని తప్పుతాయి? కొన్నైనా జరుగుతాయిగా? అవి చాలవా సంక్షోభానికి?

ఇదంతా యురేనస్ ప్రభావమే.

అయితే, ఇవి ట్రెయిలర్స్ మాత్రమే. అసలు సినిమా ముందుంది. గురువు కర్కాటకాన్ని వదలిన మరుక్షణం మానవాళికి రక్షణ ఉండదు. దానికితోడు వచ్చే ఏడాదిలో శనీశ్వరుడు మేషంలో  ప్రవేశించడంతో అసలైన అల్లర్లు, విధ్వంసాలు, యుద్ధాలు మొదలౌతాయి. మూడో ప్రపంచయుద్ధాన్ని తలపించే పెద్దయుద్ధం వచ్చే సూచనలు 2027-30 మధ్యలో బలంగా ఉన్నాయి.

మారుతున్న రాజకీయ సమీకరణాలు, దేశాలమధ్యన సంబంధాలు కూడా ఈ దిశగానే చూపిస్తున్నాయి.

ప్రస్తుతానికి, ఇండియా వరకూ చూస్తే, ఈ నెల 10 న జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ పార్టీ మళ్ళీ ఆందోళనను ప్రకటించింది. ఆరోజు అమావాస్య అయింది. గ్రహస్థితులేమో ఇలా ఉన్నాయి. మంచి సూచనలు లేవు. అల్లర్లు జరుగకుండా ప్రభుత్వం అన్నివైపులనుంచీ కట్టుదిట్టం చేస్తే తప్ప గొడవలు ఆగేలా లేవు.

దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ గడ్డుకాలం మొదలైంది. 

రాబోయే మూడేళ్ళలో, అన్నిరంగాలలోనూ జరుగబోతున్న పెనుమార్పులతో, కోట్లాదిమంది జీవితాలు అల్లకల్లోలం కాబోతున్నాయి.

వెయిట్ అండ్ సీ !