31, అక్టోబర్ 2026, శనివారం

గురుగోచారం - నవంబర్ 2026 నుండి జనవరి 2027 వరకు

ఈరోజు మధ్యాహ్నం గురువు సింహరాశిలో ప్రవేశిస్తున్నాడు.

కర్కాటకంలోని ఉచ్ఛస్థితి ఇంకా కొన్ని నెలలున్నప్పటికీ, అతిచారం వల్ల రెండున్నర నెలలపాటు సింహరాశిలోకి పోయి, మళ్ళీ వెనుకకు కర్కాటకంలోకి వస్తాడు. ఆ నడకలు క్రింది విధంగా ఉంటాయి.

నేటినుంచి 12 నవంబర్ వరకు అతిచారం; ఆపైన 19 నవంబర్ వరకు సహజగమనం; 19 నవంబర్ నుండి 26 వరకు మందగమనం; 26 నుండి 31 వరకు అతిమందగమనం; డిసెంబర్ 11 నుండి 13 వరకూ స్థంభన; డిసెంబర్ 13 నుండి వక్రత్వం; జనవరి 12 నుండి వక్రంలో అతిచారం; జనవరి 25 న మళ్ళీ కర్కాటకరాశిలోకి ప్రవేశం.

ఈ విధంగా గురుగోచారం ఉంటుంది.

పైన చెప్పిన ప్రతి పొద్దెడంలోనూ మానవుల జీవితాలలోనూ, దేశరాజకీయాలలోనూ, ప్రకృతిలోనూ చాలా మార్పులుంటాయి. అవన్నీ నేనేకరువు పెట్టను. మానవజీవితానికీ గ్రహచలనానికీ సూటి సంబంధం ఉన్నదని చెప్పడం మాత్రమే నా ఉద్దేశం.

మనదేశంలో గత రెండు మూడు నెలలుగా జరుగుతున్న గందరగోళాలు, యూరోపు మరియు మిడిల్ ఈస్ట్ పరిస్థితులు, అమెరికా, ఆగ్నేయాసియా పరిస్థితులలో ఈ మూడునెలలలో రాబోతున్న విచిత్రమైన మార్పులను గమనించండి. మీకే అర్ధమౌతుంది.

ఒక్క గురువు యొక్క గమనాన్ని మాత్రమే నేనిక్కడ వివరించాను. ఇదేవిధంగా, మిగిలిన పదకొండు గ్రహాల నడకలలోని తేడాలను కూడా అర్ధం చేసుకుంటే, ఒక సాలెగూడులాంటి గ్రిడ్ ఏర్పడుతుంది. అది ప్రతిరోజూ, ఇంకా చెప్పాలంటే ప్రతిక్షణమూ మారిపోతూ ఉంటుంది. దాని తీరుతెన్నులు బాగా అర్ధమైతే, మానవజీవితాలలోని లోతుపాతులు తెలుస్తాయి. కర్మరహస్యాలు అర్ధమౌతాయి. ఎవరి జీవితం ఎందుకిలా నడుస్తున్నదో,  భూమ్మీద ఎందుకేది ఎలా నడుస్తున్నదో తెలుస్తుంది. అప్పుడు మాత్రమే జ్యోతిషానికీ, ఆధ్యాత్మికానికీ ఉన్న అవినాభావ సంబంధం అర్ధమౌతుంది.

ఆ విధంగా అర్ధం చేసుకున్నప్పటికీ, చలించకుండా అన్నింటినీ పరిశీలిస్తూ మౌనంగా ఉండేవాడిని మాత్రమే "దైవజ్ఞుడు" అనాలి. అంతేగాని, డబ్బుకు ఆశపడుతూ, అడిగినవారిని మోసం చేస్తూ, ఉన్నవీ లేనివీ అబద్దపు రెమెడీలను చెప్పేవారిని ఆ పేరుతో పిలవకూడదు. కానీ పిలుస్తున్నారు. నేడు ప్రతి గొందిలోనూ అటువంటి దైవజ్ఞులు పదిమంది  మీకు కనిపిస్తారు. అదే కలియుగలక్షణం !

పై కోణాలలో నేటినుంచి గురుగోచారాన్ని గమనించండి. అద్భుతమైన అనేకవిషయాలు మీకర్ధమౌతాయి.