31, ఆగస్టు 2026, సోమవారం

నేపాల్ దుర్ఘటన - నేర్చుకోని నిజాలు

నేపాల్ దుర్ఘటన జరిగింది.

850+ మంది చనిపోయారు. 2500+ మంది ఆచూకీ లేరు. 

నిత్య, నైమిత్తిక ప్రళయాలకు ఇదొక ఉదాహరణ. 

కాకపోతే, ఇంటర్నెట్ గురువులెవ్వరికీ ఈ విషయం చూచాయగా కూడా ముందస్తుగా తెలియలేదు.

----------------------

వీరిలో ప్రతిరాత్రీ శంభలాకు చెంబుతీసుకొని పోయి వచ్చేవాళ్ళున్నారు. 

సిద్ధాశ్రమంలోనే పుట్టిపెరిగామని చెప్పే హిమాలయయోగులున్నారు. 

కైలాసపర్వతంలో వారంవారం జరిగే సీక్రెట్ మీటింగులకు హాజరయ్యేవాళ్లున్నారు.

సాక్షాత్తూ శివుడితోనే సరాసరి మాట్లాడేవాళ్లున్నారు. 

శివుడి భుజాలపైనే ఎప్పుడూ కూర్చుని ఉండే సద్గురువులున్నారు. 

మాటమాటకీ 'షివా షివా' అని 'షో' చేసేవాళ్లున్నారు. 

అతీతలోకాలన్నీ అలా అలా సరదాగా ధ్యానంలో తిరిగొచ్చే యో/రోగులున్నారు. 

గడ్డాలు పెంచినవాళ్ళూ, పెంచనివాళ్ళూ, గుండు చేయించుకున్నవాళ్లూ, జుట్టు పెంచినవాళ్ళూ, ఇలా రకరకాల వేషాలతో వినోదాన్ని పంచుతున్నవారున్నారు.

అతితెలివితేటల ఉపన్యాసాలతో, చర్చలతో, గొఱ్ఱెప్రజలకు "గ్నానాన్ని" పంచుతూ  అదరగొట్టేవాళ్లున్నారు.

సినీనటుల అక్రమసంబంధాల దగ్గరనుంచీ, వాళ్ళ కాపురాలు నిలుస్తాయా లేదా అన్నదానివరకూ ప్రతిదానినీ చెప్పే కమెడియన్ జ్యోతిష్కులున్నారు.

ఇంకా ఎంతోమంది ఆన్లైన్ విదూషకులున్నారు.

ఎవరికీ ఈ ప్రమాదం గురించిన ముందస్తు సూచన కొంచెం కూడా లేదు.

ఎన్నో లోకాలలో ఏమి జరుగుతోందో చూడగలిగే జ్ఞానులకు, ఈ లోకంలో ఇంకాసేపట్లో ఏం జరుగుతుందో తెలీదు !

ఈషా భక్తబృందమైతే అదేదో ఎపాయింట్ మెంట్ తీసుకున్నట్టు సరిగ్గా పదినిముషాల  ముందు ఠంచన్ గా అక్కడకు చేరుకొని 'రామ్మా. వరదా ! మమ్మల్ని ముంచెయ్యి' అన్నట్టు సామాన్లు సర్దుకొని మరీ రెడీగా ఉంది.

కాబట్టి వాళ్ళకొక్కరికే, కైలాసం నుండి కరెక్ట్ గా ముందస్తు సమాచారం ఉందని నేననుమానిస్తున్నాను. లేకపోతే సరిగ్గా పదినిమిషాల ముందుగా అక్కడికెలా చేరుకుంటారు వాళ్ళు?

ఇప్పుడంతా అయిపోయాక,  మళ్ళీ వేరే రకం 'షో' లు, "షివా షివా" అంటూ షంతాప షభలు, విశ్లేషణలు, సమర్ధింపులు, నాటకాలు.

-------------------

వైకుంఠద్వారం టికెట్ల త్రొక్కిసలాటలో పడి సరాసరి వైకుంఠానికే పోయారు గతంలో కొందరు.

ఇప్పుడు కైలాసయాత్ర చేసొస్తూ, కైలాసానికే డైరెక్ట్ గా చేరుకున్నారు మరికొందరు.

బ్రహ్మలోకానికి మాత్రం ఎవరూ పోవడం లేదు ! పాపం ఆయనని పూజించేవారు లేరుకదా !

పిచ్చిభక్తులు నిజంగా వైకుంఠానికీ, కైలాసానికీ పోతున్నారో లేదో తెలియదు గానీ, వీళ్ళ డబ్బులు మాత్రం చేరవలసినవారికి చేరుతున్నాయి.

రెలిజియస్ వ్యాపారాలూ, రెలిజియస్ టూరిజం వ్యాపారాలూ బ్రహ్మాండంగా నడుస్తున్నాయి.

---------------------

అసలూ, హిమాలయాలతో మనకెందుకు?

ఎవరుండవలసిన చోట వాళ్ళుండాలి.

మనకు దూరంగా ఎక్కడో ఉన్న మంచుకొండలలోకి మనం పోయి, అక్కడ మన చెత్తా చెదారమూ, సారాసీసాలూ, ప్లాస్టిక్కులతో నింపడం అవసరమా?

అక్కడెవరో పాపం ముక్కులు మూసుకుని కూర్చుని ఉంటే, మనం పోయి, వాళ్ళనింకా లోతట్టు కొండల్లోకి తరిమికొట్టడం అవసరమా?

స్వచ్ఛమైన హిమాలయాలను టూరిస్టు సెంటర్లుగా మార్చేసి, హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు, క్లబ్బులు, పబ్బులు కట్టి, మబ్బుచాటు వ్యాపారాలు చెయ్యడం అవసరమా?

అక్కడకూడా డ్యాములు, బ్రిడ్జీలు కట్టి, కొండలను తొలిచి సొరంగాలు త్రవ్వడం అవసరమా?

ప్రకృతిని ఈ విధంగా పాడు చెయ్యడం అసలంటూ అవసరమా?

చేస్తే, అది చూస్తూ ఊరుకుంటుందా?

---------------------

గత మూణ్నెళ్లుగా వర్షాలెందుకు లేవు?

ఎక్కడచూచినా ఈ వేడీ, ఉడకా, కొనసాగుతున్న ఈ వేసవీ ఏమిటి?

యూరప్ లో ఎండవేడికి వేలాదిమంది చావడమేమిటి?

ఉత్తర అమెరికాలో కూడా పెరుగుతున్న ఉష్టోగ్రతలేమిటి?

ఇవన్నీ ఎందుకో, గ్లేషియర్లు కరగడమూ అందుకే.

కానీ, మనుషులేమీ నేర్చుకోరు. నేర్చుకోకండి. ఇలాగే ఉండండి.

---------------------------- 

సర్లే, ఈ న్యూసు ఇప్పటికే పాతబడిపోయింది.

ఛీ, బోరుకొడుతోంది. ఇంకో క్రొత్త న్యూసు రాదేంటి?

ఎవరైనా ఒక రేపో, ఒక మర్డరో, ఇంకొకటో, ఇంకొకటో కాస్త వెరైటీగా చెయ్యండ్రా బాబూ !

ఇంకెన్ని రోజులీ నేపాల్ గోల?

-------------------------------

ఇవన్నీ చూస్తుంటే గతంలో వ్రాసుకున్న ఒక కవిత గుర్తుకొస్తోంది.


కొందరు బాధాపీడితులు. కొందరాశ్చర్యచకితులు.

కొందరు మాయగాళ్లు. కొందరు మాయలో పడేవాళ్లు.

కొందరు నోరుముయ్యకుండా వాగేవాళ్ళు

కొందరు నోరు తెరుచుకొని వినేవాళ్ళు

కొందరు  నాటకాలేసేవాళ్ళు. కొందరు చూసేవాళ్ళు

కొందరు తీర్పులు తీర్చేవాళ్ళు. కొందరు తిరిగిరానిచోట్లకు పోయేవాళ్లు.

చివరికందరూ, ఎవరు తీసుకున్న గోతిలో వారు పడేవాళ్లే !


ఓ జీవితమా ! వింతైన నీ ఆట సాగుతూనే ఉంటుంది !

ఓ విశ్వమా ! అంతులేని నీ పయనం కొనసాగుతూనే ఉంటుంది !!