9, ఆగస్టు 2026, ఆదివారం

గడపలో దీపం

మొన్నామధ్యన కాలేజీరోజుల నాటి ఒక స్నేహితుడు ఆశ్రమానికి వచ్చాడు.

కుశలప్రశ్నలయ్యాక, "ఆశ్రమం నిర్మించావని తెలిసింది. చూద్దామని వచ్చాను" అన్నాడు.

"మంచిది. చూడు" అన్నాను.

"నీ ఇంటర్వ్యూ తీసుకుని మా ఛానల్లో వేస్తాము. అందుకని కెమెరాలతో సహా వచ్చాను. కార్లో ఉన్నాయి. నువ్వు సరేనంటే మొదలుపడదాం." అన్నాడు.

"అవసరం లేదు" అన్నాను.

ఆశ్చర్యంగా చూచాడు.

"పబ్లిసిటీ అవుతుంది. ఇంకా చాలామంది వస్తారప్పుడు" అన్నాడు.

"ఏం చేస్తారు చాలామంది వచ్చి?" అడిగాను.

"ఏవో బాధలుంటాయిగా వాళ్లకు" అన్నాడు.

"వాళ్ళ బాధలను తీరుస్తూ, నాకు బాధలను సృష్టించుకోమంటావా?" అడిగాను. 

"మరి బ్లాగు, బుక్సు, ఆన్లైన్ మీటింగ్స్ ఇవన్నీ చేస్తున్నావుగా" అడిగాడు.

"జనం పెరిగితే గోలతప్ప ఇంకేదీ ఉండదు. లోకపు కర్మబరువును మొయ్యడం అవతారపురుషులకే సాధ్యం కాలేదు. మనమెంత? ఛానల్స్ చూసేవాళ్ళు కాలక్షేపానికి మాత్రమే ఆ పని చేస్తారని నీకూ తెలుసు. నాకూ తెలుసు. ఎందుకలాంటి వాళ్లంతా ఇక్కడికొచ్చేది? " అన్నాను.

"మరి ఇదంతా ఎందుకు?" అడిగాడు చుట్టూ చూస్తూ. 

"దీపాన్ని వెలిగించి గడపలో ఉంచాను. అదిచాలు. నాలుగురోడ్ల కూడలిలో ఉంచవలసిన పని లేదు" అన్నాను.

సాయంత్రం వరకూ ఉండి, అదీఇదీ మాట్లాడి, సెలవు తీసుకున్నాడు.

కారులోని కెమెరాలు  కారుతోబాటే వెళ్లిపోయాయి.

గడపలో దీపం వెలుగుతూనే ఉంది.