4, సెప్టెంబర్ 2026, శుక్రవారం

కృష్ణ కృష్ణా !

ఇవాళ కృష్ణాష్టమి.

మరి తెలుగురాష్ట్రాలలో చడీచప్పుడూ లేదేంటి?

హిందువుల ఇళ్లూ, గుళ్ళూ అన్నీ మౌనంగా ఉన్నాయేంటి?

ఓ సారీ ! మర్చేపోయాను.

మనకు పొరుగింటి పుల్లకూరే రుచి కదా !


అయినా  నా పిచ్చిగానీ,

సాయిబాబాలకూ, బోయబాబాలకూ, పీర్లకూ, ఫకీర్లకూ అభిషేకాలూ, పూజలూ చేసేవాళ్లకు పరిపూర్ణావతారమైన శ్రీకృష్ణుడెలా నచ్చుతాడు? అసంభవం ! 

మహా అయితే ఆయననొక ద్వారపాలకుడిగా పెట్టేద్దాం !

పొరుగురాష్ట్రపు అప్పయ్యస్వామి ఆధార్ కార్డునే తెలుగునాడుకు మార్చేసి, ఆ నీడన చక్కని వ్యాపారాలు చేసుకుంటున్నవాళ్లకు శ్రీకృష్ణుడెలా నచ్చుతాడు? నిజమే సుమీ ! 

కేరళం కంటే గుజరాత్ ఇంకా దూరం కదా !

ఛిన్నమస్త చిన్నబోయినచోట, ప్రత్యంగిర పట్టించుకోని వేళ, రాధాదేవి మాత్రమే రక్షిస్తుంది. ఆ క్షణానికి ఆమె కావలసి వస్తుంది. మరుక్షణమే ఆమె పనికిరాకుండా పోతుంది. మళ్ళీ భయంకర హోమదేవతలే మనకు కావాలి. అవున్లే రాధాదేవి మన వ్యాపారానికి పనికిరాదు కదా !

మన బ్రతుకులింతే !

వ్రేలాడే శవమంటే వేలంవెర్రిగా పరిగెత్తేవాళ్లకు, జగన్మోహనుడైన శ్రీకృష్ణుడెలా నచ్చుతాడు? నిజమే. 

ఆయనేమీ బిర్యానీ పెట్టి, ఖర్చులకు డబ్బులివ్వడు కదా ! రాత్రిపూట కూడికలూ, తీసివేతలూ నేర్పించడు కదా !  

గుండు సాధువులనూ, బండస్వాములనూ, 'ళ' కీ, 'ల' కీ తేడా తెలియని మహాయోగులనూ పూజించేవాళ్లకు శ్రీకృష్ణుడెలా నచ్చుతాడు? సహజమే కదా ! 

ఆయనేమీ వీళ్ళలాగా నైటీ వేసుకోడుగా !

అర్ధరాత్రిళ్ళు క్షుద్రదేవతలకు బొగ్గులూ ఎండుమిర్చిలతో హోమాలు చేసే క్షుద్రులకు చిన్నికృష్ణుని చిరునవ్వులెలా నచ్చుతాయి? అర్ధం చేసుకోగలం ! 

90 వచ్చినా, మాకింకా వయసుడిగి పోలేదుగా? కోరికలు చావలేదుగా? చిన్నికృష్ణుడిని పూజించడానికి?

మళ్ళీ నోరుతెరిస్తే అందరూ చెప్పేది భగవద్గీతా శ్లోకాలే ! కానీ శ్రీకృష్ణుడెవరికీ అక్కర్లేదు.

ఆయన ఎనిమిదేళ్ల వయసులోనే రాసలీలలు చేశాడంట ! గోపికలు స్నానాలు చేస్తుంటే బట్టలు కాజేసి చెట్టుపైన కూర్చున్నాడంట ! ఇదొక్కటే మనకు కనిపిస్తుంది. మనకు కావలసింది కూడా అదే కదా !

మనం చెయ్యాలనుకుంటూ, చేయలేకపోతున్న పనులన్నీ ఆయనెప్పుడో అయిదువేల ఏళ్ళక్రితమే చేసేశాడు. లక్కీ ఫెలో ! దీనిని 'అసూయ' అంటారేమో? సర్లే ఏదో ఒకటి !

కానీ, అంతకు ముందే, గోవర్ధన పర్వతాన్ని చిటికెనవ్రేలితో ఎత్తి తనవారిని కాపాడాడు. నెలలపిల్లవాడుగా ఉన్నపుడే ఎంతోమంది రాక్షసులను సంహరించి, లోకపీడను వదిలించాడు. బోసినోటిలో విశ్వాన్ని చూపించాడు. అవెలా చేశాడు? మనకనవసరం ! అవన్నీ యశోదాదేవి భ్రమలు !

ఆ తర్వాత ఎన్నో మానవాతీతపు పనులను చేశాడు. రాజ్యాలేలాడు. రాజకీయాలు చేశాడు. మహాభారతయుద్ధాన్ని కూడా నడిపించాడు. ఆగండాగండి ! ఈ పాయింట్ మాకు బాగా నచ్చింది.

మేము కూడా మా ఆశ్రమం పై ఫ్లోరులో, అమ్మాయిలతో అర్ధరాత్రి, శివరాత్రి, డాన్సులెయ్యచ్చు. మేమూ కృష్ణుని అంశలమే. వాళ్లేమో గోపికల అంశలతో పుట్టారు.

మేముకూడా రాజకీయులతో పొత్తులు పెట్టుకుని వాళ్ళ బ్లాక్ మనీని మా భూగృహాలలో దాచిపెట్టి, రాజకీయం చెయ్యవచ్చు. మేమూ కృష్ణుని అంశలమే. కాకపోతే మా తర్వాత లారీలలో ఆ బంగారమంతా ఎక్కడికో తరలిపోతుంది. పోతేపోనీ. బ్రతికున్నన్నాళ్లు మా పబ్బం గడిచిందిగా !

మేముకూడా విద్యార్థులను స్థంభాలకు కట్టేసి కాల్చిపారెయ్యొచ్చు. మేమూ  కృష్ణుని అంశలమే. కేసులేమీ ఉండవు. ఏం, భారతయుద్ధాన్ని దగ్గరుండి నడిపించిన కృష్ణుడిపైన ఉన్నాయా?

కృష్ణుడు శివుడిని ఆరాధించాడట. మేముకూడా చేస్తాం. మాటమాటకూ 'షివా షివా' అంటాం. లేదా 'చెంబో చెంబో' అంటాం. కానీ ఆ చెంబెక్కడుందో మాకైతే తెలీదు. కైలాసయాత్రకని పోయి, దారితప్పి సరాసరి కైలాసానికే పోతాం. లేదా 'కైలాస' అని ఒక ద్వీపాన్నే కొనేస్తాం. దానికి మా ప్రధానగోపికని, సారీ శిష్యురాలిని, ప్రధానమంత్రిగా చేసేస్తాం. కృష్ణుడెప్పుడైనా ఇలాంటి పనులు చేశాడా? చేయగలిగాడా? కనుక ఆయనకంటే మేమే గొప్పవాళ్ళం.

'కృష్ణుడు సాక్షాత్తూ భగవంతుడే' అని మా శాస్త్రాలంటున్నాయి. కానీ మేమాయనను పూజించము. మాకు భగవంతుడెందుకు? ఈరోజు మందుకు ఎవడు డబ్బులిస్తే వాడే మా దేవుడు.

ఆయన మాకర్ధం కాడు. 

గౌడీయమఠానికీ, ఇస్కానుకే ఆయన అర్ధం కాలేదు. ఇక మాకెలా అవుతాడు?

అయినా మా పూజామందిరాలూ, పందిళ్ళూ ఖాళీగా లేవు. వాటిల్లో ఎక్కడ చూసినా పీర్లూ, ఫకీర్లూ, వ్రేలాడుతున్న శవాలూ, క్షుద్రదేవతలూ, గుండుస్వాములూ, బండయోగులూ, గడ్డంస్వాములూ, అజ్ఞాతసిద్ధులూ, ప్రతిరాత్రీ యముడితో డిన్నర్ చేసి, మార్కింగ్ బ్రేక్ ఫాస్ట్ హిమాలయాలలో బాబాజీతో చేసి, సాయంత్రానికి సిద్ధాశ్రమం దొడ్లో రెస్టు తీసుకునే పిరమిడ్లూ,  క్రియాయోగ గృహిణులూ, కళ్ళు మూసుకుంటే లోకలోకాలు తిరిగే NRI మహిళలూ, వీళ్ళ ఫొటోలే. 

వీరి మధ్య కృష్ణుడికి చోటేది?

ఆయన పరిపూర్ణ అవతారమైతే మాకేంటి? కాకపోతే మాకేంటి? వితంతువులకూ, అనాదులకూ డబ్బులిస్తాడా లేదా? మా వ్యాపారానికి పనికొస్తాడా లేదా? అది చెప్పండి !

మనల్ని ఆ శ్రీకృష్ణుడే రక్షించాలి. మనల్నే  కాదు. భూమి మొత్తాన్నీ ఆయనే రక్షించాలి.

రక్షిస్తాడా? మనలాంటి వాళ్ళని? ఒకవేళ ఏదైనా బలహీనక్షణంలో ఆయన ముందుకొస్తే మాత్రం, మనం రక్షించనిస్తామా?

ఏమో నాకైతే సందేహమే !

read more " కృష్ణ కృష్ణా ! "