రంగనాధ్ విషయంలో జరిగింది ఆత్మహత్య అని అందరూ అంటున్నారు. పోలీస్ పరిశోధన ఇంకా జరుగుతూనే ఉన్నప్పటికీ,ఆయన టీవీ ఇంటర్వ్యూలలో బాహాటంగా చెప్పిన విషయాలను బట్టీ,మొదట్నించీ ఆయన మనస్తత్వాన్ని బట్టీ,ప్రస్తుత గ్రహప్రభావాన్ని బట్టీ అది ఆత్మహత్యే అని ప్రస్తుతానికి మనం కూడా అనుకుందాం.అధికారిక విచారణలో ఏం తేలుతుందో గమనిద్దాం.
ఈ సందర్భంలో ఒక మౌలికమైన ప్రశ్న తలెత్తుతున్నది.
'ఆత్మహత్య అనేది తప్పా?' అనేదే ఆ ప్రశ్న.
ఈ విషయం మీద అనేక దృక్కోణాలున్నాయి.
>>జీవితం మనం సృష్టించుకున్నది కాదు.అది భగవంతుని వరం.కనుక జీవితాన్ని అంతం చేసుకునే హక్కు మనకు లేదని చాలామంది అంటారు.
ఈ వాదనని కొంచం పరిశీలిద్దాం.అసలు భగవంతుడు అనేవాడు ఉన్నాడో లేదో మనకు తెలియదు.దేవుడు అనేది ఒక నమ్మకం మాత్రమే.ఆడా మగా కలయికతో సృష్టి జరుగుతుందనేది అందరికీ తెలుసు.ఇందులో భగవంతుడు అనే కాన్సెప్ట్ తీసుకురావలసిన పని లేదని కొందరి వాదన.అలాంటప్పుడు జీవితం దేవుడిచ్చిన వరం అనే మాటలో అర్ధం లేదని వీళ్ళంటారు.మన జీవితం మనిష్టం గనుకా, బ్రతకడం బ్రతకకపోవడం మన ఇష్టం గనుకా, ఇక బ్రతకలేని పరిస్థితులలో ఆత్మహత్య తప్పు కాదనే వాదనలున్నాయి.
ఒక ఆఫీసులో మనం ఉద్యోగం చేస్తుంటాం.కొన్నాళ్ళకు అక్కడ మనం ఉండలేని పరిస్థితులు తలెత్తవచ్చు.అప్పుడు ఆ ఉద్యోగానికి రిజైన్ చేసేస్తాం.ఇంకొక ఉద్యోగ ప్రయత్నం చేస్తాం.ఇదీ అలాంటిదే.ఈ జీవితం దుర్భరం అయినప్పుడు ఇంకొక జీవితాన్ని వెదుక్కుంటూ వెళ్ళిపోవడం తప్పు కాదు.
>>ఆత్మహత్య అనేది చట్టరీత్యా నేరం అనే వాదన ఉన్నది.చట్టాలు మనం వ్రాసుకున్నవి.అవి శిలాశాసనాలేమీ కాదు.మన రాజ్యాంగాన్నే ఇప్పటికి 96 సార్లు మార్చిపడేశాం.అలాంటప్పుడు చట్టాలను కూడా మార్చుకోవచ్చు. ఈరోజు నేరం అనేది రేపు చట్టం మార్చబడితే నేరం కాకపోవచ్చు. ఒక దేశంలో వ్యభిచారం అనేది నేరం కావచ్చు.ఇంకొక దేశంలో అదే లీగల్ కావచ్చు.ఏదైనా మనం వ్రాసుకునే చట్టాలను బట్టి ఉంటుంది. కనుక ఈ కోణం కూడా ఒక స్థిరమైన రూలేమీ కాదు.
న్యాయశాస్త్రంలో కూడా ఉరిశిక్ష అనే దానిని పూర్తిగా తీసెయ్యాలన్న వాదనలున్నాయి.దానిని ఉంచాలన్న వాదనలూ తీసేయ్యాలన్న వాదనలూ సమానంగా ఉన్నాయి. లీగల్ జ్యూరిస్ ప్రుడెన్స్ అనే సబ్జెక్ట్ ఇలాంటి వివాదాస్పద విషయాలలో చర్చను ప్రోత్సహిస్తుంది.నేను లా చదివే రోజుల్లో ఇది నా ఫేవరేట్ సబ్జెక్ట్స్ లో ఒకటి.
ఉరిశిక్ష అనేది ప్రభుత్వం వేస్తే తప్పు కానప్పుడు మనకు మనం వేసుకుంటే తప్పెలా అవుతుంది? నా జీవితంలో నేను ఘోరంగా అశాంతికి గురయ్యాను. ఫెయిలయ్యాను.నాకంతా చీకటిగా కనిపిస్తున్నది.నాకీ లోకంలో ఉండాలని లేదు.కనుక అలాంటి పరిస్థితిలో నేను ఆత్మహత్య చేసుకోవడం తప్పెలా అవుతుంది? ఇప్పుడు తప్పు తప్పు అంటున్న వారందరూ ఆ మనిషి బ్రతికి ఉన్నపుడు ఏం సాయం చేశారు? అతను బ్రతకడానికి ఏం దోహదపడ్డారు? ఏమీ లేదు.కనుక ఆ మనిషి మానసిక స్థితిని తెలుసుకోకుండా అది తప్పు అనడమే అసలైన తప్పు.
నేడు ప్రముఖ నటులుగా చెలామణీ అవుతున్న వారిలో చాలామంది కనీసం రంగనాద్ మృతదేహాన్ని చూడటానికి కూడా రాలేదు.ఒక సీనియర్ ఆర్టిస్ట్ అన్న జ్ఞానం కూడా వాళ్లకు లేదు.ఇక ఇలాంటివాళ్ళకు ఆయన్ను విమర్శించే హక్కు ఎక్కడుంది?
>>>ఆత్మహత్య అనేది పిరికితనం.ఇది పిరికివాళ్ళు చేసే పని అని చాలామంది అంటుంటారు.ఈ మాట విన్నప్పుడు నాకు నవ్వొస్తూ ఉంటుంది.వాళ్లకు వాస్తవజ్ఞానం లేదు.ఆత్మహత్య పిరికితనం కాదు.ఆ పని చెయ్యాలంటే చాలా ధైర్యం ఉండాలి.జీవితాన్ని లెక్కచెయ్యని తెగింపు ఉండాలి. అది పిరికితనం ఎలా అవుతుంది?
ప్రతిమనిషికీ అత్యంత ప్రియమైనది తన దేహమే.దానికి కొంచం నొప్పి కలిగినా భరించలేడు.అలాంటిది ఏకంగా ఆ దేహాన్నే వదిలేయ్యాలన్న నిర్ణయం వెనుక ఎంత ధైర్యం ఉండాలో ఆలోచించవచ్చు.ఆ ధైర్యాన్ని ప్రోది చేసేవి పరిస్థితులు కావచ్చు,నిరాశానిస్పృహలు కావచ్చు,విరక్తి కావచ్చు ఇంకేదైనా కావచ్చు. కానీ అది పిరికితనం మాత్రం కాదనేది వాస్తవం. ఎంతో ధైర్యం ఉన్నవాడే ఆ పని చెయ్యగలడు అని నేనంటాను.
>> దీనిలో ఆధ్యాత్మికకోణం ఒకటి ఉన్నది.ఒక వ్యక్తి పూర్తి పరిపక్వతను పొంది జ్ఞాని అయినప్పుడు అతను ఆత్మహత్య చేసుకున్నా అది పాపమూ నేరమూ కాదు.నిజానికి దానిని ఆత్మహత్య అనరు.శరీరత్యాగం అంటారు.జ్ఞాని అన్నింటినీ త్యాగం చేస్తూ వస్తాడు.చివరకు తన దేహాన్ని కూడా త్యాగం చేస్తాడు. అది తప్పు కాదు.
శ్రీరామకృష్ణుల జీవితంలో ఒక సంఘటన ఉన్నది.ఆయన దగ్గరకు ఒక పదిహేనేళ్ళ కుర్రవాడు వస్తుండేవాడు.అతడు చాలా ఉన్నతమైన ఆత్మ. పూర్తిగా పారమార్ధికభావాలతో నిండి,అంత చిన్న వయసులోనే గంటలపాటు ధ్యానంలో ఉండేవాడు.ఎక్కడో కొండలలోకి అడవులలోకి పోయి రోజులతరబడి ధ్యానంలో గడిపేవాడు.ఆ సమయంలో అతనికి అనేక దేవీ దేవతల దర్శనాలు కలుగుతూ ఉండేవి.ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభూతులను ఆతను పొందుతూ ఉండేవాడు.మధ్యమధ్యలో రామకృష్ణుల దర్శనం చేసుకుని తన అనుభవాలను ఆయనకు వివరించి ఆయన ఆశీస్సులు తీసుకుంటూ ఉండేవాడు.
ఒకసారి అలా ఆయన దగ్గరకు వచ్చినపుడు ఆ పిల్లవాడు ఇలా అంటాడు.
'ఇదే మీ దగ్గరకు నేను ఈ దేహంతో వచ్చే చివరిసారి.'
రామకృష్ణులు చిరునవ్వు నవ్వి ఊరుకుంటారు.
ఆ తర్వాత ఆ పిల్లవాడు ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తుంది.దీనిమీద రామకృష్ణుల భక్తబృందంలోని వారు కొందరు సంశయాన్ని లేవనెత్తుతారు. దానికి ఆయనిలా జవాబిచ్చారు.
'మీలాంటి మామూలు మనుషుల నియమాలు జ్ఞానులకు వర్తించవు.జ్ఞాని అయినవాడు ఆత్మహత్య చేసుకున్నా కూడా అతనికి పాపం ఏమాత్రం అంటదు.అతడు లోకాచారాలకు అతీతుడు.ఈ నియమాలన్నీ మీకోసం మీరు పెట్టుకున్నవి.అతడు వాటికి అతీతంగా వెళ్ళాడు. తాను ఈ దేహాన్ని కానన్న అనుభవ జ్ఞానం అతనికి ఉన్నది.అలాంటప్పుడు ఈ దేహం ఉన్నా పోయినా అతనికి భేదం ఏమీ లేదు.జ్ఞానాన్ని పొందిన తర్వాత కొందరు ఇంకా దేహంలోనే ఉండటానికి ఇష్టపడవచ్చు. మరికొందరు వారి దేహాన్ని వదిలెయ్యవచ్చు.అదంతా వారి ఇష్టం.మీ లోకపు చట్టాలతో వారిని మీరు కొలవలేరు. ఈ అబ్బాయికి పాపం ఏమీ అంటదు.అతడు ఉత్తమగతిని పొందాడు. ఇక మీరు మౌనం వహించండి.'
అంతటితో ఇంకెవరూ ఆ విషయమై మాట్లాడలేదు.
శ్రీరామకృష్ణుల సమకాలికుడు పవహారిబాబా అని ఒక హఠయోగి ఉండేవాడు. ఆయన గాలిని మాత్రమే భోజనం చేసేవాడు.మనలా తిండి తినేవాడు కాదు. అందుకే ఆయనకు పవ(నా)హారి బాబా అని పేరొచ్చింది.ఆయన ఒక గుహలో ఉంటూ కొన్నికొన్ని హోమాలు చేస్తూ ఉండేవాడు.ఒకరోజున ఆయన ఉండే గుహలోనుంచి బాగా పొగ వస్తుంటే ఏమిటో చూద్దామని భక్తులు లోనికి వెళ్ళారు. ఏముంది? హోమగుండంలో ఆయనే కూచుని తగలబడి పోతూ కనిపించాడు.అంటే - అన్నింటినీ హోమం చేస్తూ వచ్చి వచ్చి చివరకు తన శరీరాన్నే హోమగుండంలో సమిధగా సమర్పించాడు ఆయన.
దీనిని ఏమనాలి? ఆత్మహత్య అని దీనిని అనగలమా? అనలేము.
అసలు విషయం ఏమంటే - దైవన్యాయం అనేది మానవన్యాయం కంటే చాలా విభిన్నంగా ఉంటుంది. దీనిని అర్ధం చేసుకోవడం కష్టం.ఇది అందరికీ అర్ధం కాదు.
చాలామంది యోగులు తమ ఇష్టానుసారం తమ దేహాలను వదిలేస్తుంటారు. వాళ్ళకది నేరం కాదు.అసలు యోగం యొక్క పరమావధి - బ్రతికుండగానే మరణించడమే.జీవితకాలం ఇంకా ముగియకముందే మరణాన్ని తనంతట తాను టేస్ట్ చెయ్యడమే ధ్యానం యొక్క అసలైన గమ్యం. మరణపు హద్దులలోకి తనంతట తాను అడుగుపెట్టి మళ్ళీ వెనక్కు తిరిగిరావడమే యోగి యొక్క పరమగమ్యం.
పాతకాలంలో రాజులూ మునులూ చాలామంది ప్రాయోపవేశం చేసేవారు. అంటే తిండి మానేసి ఆరుబైట ఒక దర్భచాప పైన పడుకుని చావు వచ్చేంతవరకూ దానికోసం అలా ఎదురు చూచేవారు.అలాగే చనిపోయేవారు. జైనమునులు చాలామంది ఇలాగే దేహాన్ని వదిలేసేవారు.అంతెందుకు? మనం వాడవాడలా దైవంగా కొలిచే శ్రీరామచంద్రుడు కూడా సరయూ నదినీళ్ళలోకి అలా నడిచి వెళ్ళిపోయి నీటిలో మునిగి దేహాన్ని వదిలేశాడు. స్వామి రామతీర్ధ మళ్ళీ అదేపని చేశాడు.స్వామి వివేకానంద ధ్యానసమాధిలో స్వచ్చందంగా శరీరాన్ని వదిలేశాడు.వీటన్నిటినీ 'ఆత్మహత్య' అనే పదంతో మనం సూచించలేము.మన చట్టాల ప్రకారం దానిని నేరమనీ అనలేము.
వీరందరి సంగతి అలా ఉంచితే,నిజమైన యోగులు స్వచ్చందంగా జీవనపరిధిలోనుంచి మరణపు పరిధిలోకి వెళ్లి మళ్ళీ వెనక్కు తిరిగి వస్తుంటారు.బ్రతికున్నప్పుడే వీరు అనేకసార్లు ఈ పనిని చేస్తుంటారు. అందుకనే ఇంద్రియాతీతమైన అనేక విషయాలు వారికి సునాయాసంగా తెలుస్తుంటాయి.మామూలు మనుషులు కూడా వారివారి ఆలోచనలలో కొంత పరిపక్వతను తెచ్చుకుని వారి జీవనశైలిలో మార్పును తెచ్చుకుంటే వారుకూడా యోగుల స్థాయికి దగ్గరగా వస్తారు.కానీ యోగులకూ వీరికీ ఒక ప్రధానమైన భేదం ఉంటుంది.
అదేమంటే - ఇష్టానుసారం మరణ ప్రపంచంలోకి వెళ్లివచ్చే ప్రాక్టికల్ నాలెడ్జి యోగులకు ఉంటుంది.సాధనాపధంలో ఏళ్ళతరబడి నడకవల్ల వారా స్కిల్ ను సంపాదించి ఉంటారు.కానీ మామూలు మనుషులకు ఆ సాధనా రహస్యాలు తెలియవు గనుక వారికా విధానాలు అందుబాటులో ఉండవు.మానసికంగా మాత్రం యోగులతో సమానమైన వైరాగ్యస్థాయిలోకి మామూలు మనుషులు కూడా కొండొకచో కొన్నికొన్ని సమయాలలో రావడానికి ఆస్కారం ఉన్నది. ఆయా సమయాలలో వారికి కూడా దేహం అంటే చిరాకు వచ్చేస్తుంది. సంసారం అంటే చిరాకు వచ్చేస్తుంది.అదొక జైలులా వారికి అనిపిస్తుంది.వారు చేరాలనుకుంటున్న లోకానికి చేరడానికి ఈ శరీరం ఒక పెద్ద అడ్డంకి అనిపిస్తుంది.అలాంటప్పుడు దేహం నుంచి బయటకు రావాలంటే వారికి తెలిసిన ఒకేఒక మార్గం ఆత్మహత్య. అందుకని ఆ పనిని ఎంచుకుంటారు. అంతరిక యోగసాదనలో సరియైన ట్రెయినింగ్ లేకపోవడమే ఈ అవస్థకు కారణం.
ఆత్మహత్య చేసుకునే అందరూ జ్ఞానులని నా భావన కానేకాదు.అనేకమైన కారణాల వల్ల మామూలు మనుషులు కూడా ఆ పనికి పాల్పడవచ్చు.వారికి చీకటి లోకాలతో నిండిన అధోగతి ప్రాప్తిస్తుంది.' అసూర్యా నామతే లోకా అంధేన తమసావృతా...' అనే వేదవాక్యమే దీనికి ప్రమాణం.కానీ జ్ఞాని అయినవాడికి అలాంటి దుర్గతి పట్టదు.అతడు వెలుగులోకే ప్రవేశిస్తాడుగాని చీకటిలోకి ఎన్నటికీ వెళ్ళడు.
సామాన్య ప్రజానీకం అందరూ జ్ఞానులు కావడం దుస్సాధ్యం అయినప్పటికీ కొందరు భావుకులు కళారాధకులు ప్రేమికులు మాత్రం ఒక జ్ఞాని లేదా యోగసిద్ధుని స్థితికి దగ్గరగా రాగలుగుతారు.దానికి వారికున్న ఏకైన బలం ఏమంటే వారివారి ఆరాధన.సాధారణంగా అది ఒక వ్యక్తి మీద కేంద్రీకృతమై ఉంటుంది.ఆ వ్యక్తి భగవంతుడు కావచ్చు కాకపోవచ్చు.కానీ వారి ఆరాధన మాత్రం ఒక ఆధ్యాత్మిక ఆరాధనకూ ఉపాసనకూ ఏమాత్రం తగ్గదు, తీసిపోదు. లైలా మజ్నూ వంటి అమరప్రేమికులు ఈ ప్రేమబలంతోనే అమరత్వాన్ని అందుకోగలుగుతారు.ఒక యోగి లేదా ఒక భక్తుని ప్రేమబలమూ,ఈ ప్రేమికుల ప్రేమబలమూ దాదాపు సమానంగానే ఉంటాయి.కనుక ఈ ప్రేమికులు ఒకరికోసం మరొకరు శరీరత్యాగం చెయ్యడమూ,ఒక యోగి జీవసమాధిలో స్వచ్చందంగా తనువును చాలించడమూ దాదాపు సమానమే అవుతాయి.
లోకందృష్టిలో ఇలాంటివారి ఆత్మహత్య నేరం కావచ్చుగాని దైవం దృష్టిలో మాత్రం కాదు.దైవదృష్టిలో అది ఒక ఉదాత్తమైన త్యాగం అవుతుంది.
కనుక ఆత్మహత్య అనేదానికి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండే అర్ధం,మామూలు మనుషులు అనుకునే లౌకికార్దానికి చాలా విభిన్నంగా ఉంటుంది.
రంగనాద్ స్వతహాగా కళాకారుడు,సున్నితమనస్కుడు,విశాలభావాలు కలిగిన భావుకుడు గనుక ఈ ప్రపంచంలో ఇమడలేక పోయాడు.అందులో విచిత్రం ఏమీలేదు.సున్నితమైన మనస్సు ఉన్నవాళ్ళు నిజంగానే ఈ ప్రపంచంలో ఉండలేరు.ఎందుకంటే ఇక్కడ ఎటుచూచినా స్వార్ధమూ మోసమూ తప్ప ఇంకేమీ లేవు.ఇది పచ్చి వాస్తవం.
ప్రతి ఆలోచనాపరుడికీ,సున్నిత హృదయుడికీ ఏదో ఒక సమయంలో జీవితం మీద విరక్తి అనేది తప్పకుండా వస్తుంది.నేను కూడా నా జీవితంలో రెండు సందర్భాలలో అటువంటి ఆలోచన చేశాను.కానీ బాధ్యతలనేవి మనల్ని ఆపుతూ ఉంటాయి.రంగనాద్ గారికి బాధ్యతలు లేవు.తన బాధ్యతలన్నింటినీ ఆయన సక్రమంగా నెరవేర్చాడు.తన జీవితాన్ని పణంగా పెట్టి మరీ ఆ పనులను ఆయన నెరవేర్చాడు.ఇక తను ఉండవలసిన అవసరం లేదని బలంగా నమ్మాడు.
కానీ ఒక యోగిలాగా అనుకున్నప్పుడల్లా దేహం నుంచి బయటకు వచ్చే విద్య ఆయనకు తెలియదు.తన భార్య ఉన్న లోకాలను చూడగలిగే సాధనా బలం కూడా ఆయనకు లేదు.ఆయనకున్నది భావుకతతో కూడిన మంచి ఆలోచన మాత్రమే.ఆధ్యాత్మికలోకంలో అది చాలదు.అక్కడ అడుగుపెట్టాలంటే చాలా సాధనాబలం ఉండాలి.స్వచ్చందంగా శరీరంలోనుంచి బయటకు రాగలిగే విధానాలు తెలియాలి.వాటిమీద మంచి పట్టు ఉండాలి.అప్పుడే అది వీలవుతుంది.లేకుంటే వీలుకాదు.
అది వీలుకానప్పుడు ఇంక మిగిలిన ఏకైకమార్గం ఆత్మహత్య ఒక్కటే.అందుకే ఆ పనికి పాల్పడ్డాడు.దీనివల్ల ఆయనకు పాపం ఏమీ అంటదు.
వ్యక్తిగతంగా ఆయన ఎంతో ఉత్తముడు.ఎంతమందికి తన జీవితంలో సాయం చేశాడో లెక్కలేదు.నీతికి నియమాలకు కట్టుబడిన వ్యక్తి.ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగినవాడు.జీవితంలో ఆయన పడిన కష్టాలకు కూడా లెక్కలేదు. కానీ ఎంతో ఆత్మాభిమానంతో వాటిని నిబ్బరంగా ఎదుర్కొన్నాడు. అధిగమించాడు.అంతటి పుణ్యబలం ఉన్నవ్యక్తికి ఈ పని ఏమీ పాపాన్ని అంటించలేదు.
ఆయన ఆత్మకు ఉత్తమగతులు ప్రాప్తించాయని నాకు తెలిసింది.తను చేరుకోవాలనుకున్న చోటకు ఆయన చేరుకున్నాడని నాకు రుజువులు లభించాయి.ప్రస్తుతం ఆయన ఆత్మ చాలా ఆనందంగా ఉన్నది.తన ఆప్తులను, తను కలుసుకోవాలని అనుకుంటున్నవారిని, కలుసుకుంది. కనుక నా దుఖం మాయమైంది. ఇక ఆయన గురించి చింతించవలసిన పని లేదు.
భగవద్గీతలోని 'ఆత్మసంయమ యోగం' ఏమంటున్నదో వినండి.
పార్ధ ! నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే
నహి కళ్యాణ కృత్ కశ్చిత్ దుర్గతిం తాత ! గచ్చతి
(భగవద్ గీత -6:40)
"నాయనా పార్ధా !విను. ఈలోకంలో గాని పరలోకంలో గాని అతనికి వినాశనం ఉండదు.ఎందుకనగా - మంచి చేసినవానికి ఎన్నటికీ దుర్గతి కలుగదు."
లోకం దృష్టిలో ఏమైతేనేమి? దైవం దృష్టిలో ఉత్తములమైతే చాలు.