“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

31, మే 2011, మంగళవారం

జిడ్డు కృష్ణమూర్తి జీవితం-తత్త్వం-2

కృష్ణమూర్తి సాధన 1909 లో తియసఫి గురువుల పరిచయంతో మొదలైంది. అది తనలో తనకే కలిగిన  సహజమైన తపన వల్ల మొదలైందా లేక వాళ్ళ ప్రోద్బలం వల్ల మొదలైందా అంటే రెండవదే కరెక్ట్ అని నా భావన. మొదటి ప్రేరణ వల్ల ఆయన సాధన మొదలైతే, తనలో పరిష్కారం కాని చిన్న తనపు సైకలాజికల్ కాంప్లేక్సేస్, పెద్ద అయిన తర్వాత కూడా మిగిలి ఉండటానికి ఆస్కారం లేదు. అటువంటప్పుడు రోసలిన్ తో రహస్య వ్యవహారం నడిపే ఆలోచనే తలెత్తదు. 

కనుక నాకేమనిపిస్తుందంటే, సాధన చేద్దామన్న తపన తనంతట తనకు సహజంగా ఆయనకు కలగలేదు. అది ఇతరుల ప్రోద్బలం మీద జరిగింది. ఆయన జీవితంతో తియాసఫీ గురువులు ఆడుకున్నారు. అందుకే ఆయన ఒక స్థాయిలో వారితో విభేదించాడు. వారిని తిరస్కరించాడు. అందుకే ఆయన సాధన కూడా చివరికి ఎటూ తేలని ఒక చిక్కుముడిలా అలా మిగిలిపోయింది. దీనివెనుక ఇంకా కొన్ని మార్మిక రహస్య విషయాలున్నాయి. అవి ముందు ముందు చర్చిస్తాను. 

జ్యోతిష్య పరంగా చూస్తె, 1909 లో ఆయన జాతకంలో గురు మహాదశ మొదలైంది. గురువు షష్ఠ స్థానంలో ఉంటూ రాహు నక్షత్రంలో స్థితుడై ఉన్నాడు. మకర లగ్నానికి గురువు మంచివాడూ, యోగకారకుడూ కాదు. ఈ లగ్నమే ఆయనకు నీచ స్థానం. అయితే గురువు యొక్క తృతీయాదిపత్యం  వల్ల ఈ లగ్నం వాళ్లకు లోకంతో కమ్యూనికేషన్ ఆధ్యాత్మికపరంగానే ఉంటుంది. అలాగే వీళ్ళకు ఆధ్యాత్మికస్థానం కూడా బలంగానే ఉంటుంది గాని దానివల్ల వీళ్ళకు ఉపయోగం ఏమీ ఉండదు. జిడ్డు జాతకంలో గురువుకు నక్షత్ర స్థాయిలో రాహుస్పర్శ ఏర్పడింది.  రాహుస్పర్శ వల్ల గురుచండాలయోగం ప్రత్యక్షమైంది. అందుకనే భారతీయ గురువులు కాకుండా యూరోపియన్ గురువులు ఈయనకు దగ్గరైనారు. వారు అభ్యాసం చేసినది కూడా ఉడికీ ఉడకని రకరకాల ముక్కలసాంబార్ లాంటి తియోసఫీ సిద్ధాంతాలు.  వారు సిద్ధి పొందిన గురువులు కారు, అకాడెమిక్ గురువులు మాత్రమే. అకాడెమిక్ గురువులు ఆధ్యాత్మికతను బోధించలేరు. ఎందుకంటే ఆధ్యాత్మికత అనేది క్లాసురూముల్లో పాఠాలు చెప్పినట్లు చెప్పే ఉపన్యాసవిద్య కాదు. అది పుస్తకాలు చదివి వేరొకరికి అప్పజెప్పే జ్ఞానం కాదు. దురదృష్టవశాత్తూ  ఇటువంటి  అనుభవంలేని ఆధ్యాత్మిక రచయితలతో, గురువులతో లోకం నిండిఉంది. కాని అనుభూతి  పొందిన గురువే దానిని ఇంకొకనికి బోధించగలడు.  దారి చూపించగలడు. ఆధ్యాత్మిక లోకంలో గీటురాయి అనుభూతి మాత్రమే. 

రకరకాల దేశాలరాజ్యాంగాలను మనకు అవసరం ఉన్నా లేకపోయినా కాపీకొట్టి అతుకులబొంతలా తయారుచేసిన మన రాజ్యాంగం ఎంత అద్భుతంగా (అద్వాన్నంగా ) పనిచేస్తున్నదో, రకరకాల మతాలూ మార్మిక విషయాల కాపీ అయిన తియాసఫీకూడా అంతే అద్వాన్నంగా పనిచేస్తుంది. కారణం ఏమంటే తియాసఫీ లో నకిలీ తప్ప  ఒరిజినాలిటి  ఏమీ లేదు.

ఒరిజినాలిటీ మీద నేను చేసిన ఈ కామెంట్ కొందరికి కోపాన్ని తెప్పించవచ్చు. కాని నిదానంగా ఆలోచిస్తే , ఒక్క చిన్నవిషయంతో నేను చెప్పింది నిజం అని అర్ధం చేసుకోవచ్చు. 1910 లో జిడ్డు కృష్ణమూర్తి ఆల్సియోన్ అనే కలం పేరుతో ఒక పుస్తకం వ్రాశాడు. దాన్ని లెడ్ బీటరే వ్రాశాడో లేక ఈయనే వ్రాశాడో మనకు తెలియదు. వరల్డ్ టీచర్ గా ఆయన్ను ప్రోమోట్ చెయ్యాలన్న తపనలో జిడ్డు చేత వాళ్ళే ఈ పుస్తకాన్ని వ్రాయించి ఉంటారు అని నా భావన.   దాని పేరు At the feet of the Master. దానికి అనీబెసంట్ పీఠిక వ్రాశింది. మనం ఈ పుస్తకాన్ని చదివితే మొదటిపేజీలు  కొన్నిచదివిన వెంటనే ఒక్క విషయం అర్ధం అవుతుంది. ఇది ఆదిశంకరుల "వివేకచూడామణి" కి మక్కీకి మక్కీ కాపీ అని. కొన్ని ఉదాహరణల ద్వారా నేను చెబుతున్నది నిజం అన్న విషయం రుజువు చేస్తాను. 

ఈ పుస్తకం లో మొదట్లోనే ఇలా ఉంటుంది.       

Four qualifications there are for this pathway.

Discrimination
Desirelessness
Good conduct
Love

దీనినే వివేక చూడామణిలో  ఆదిశంకరులు -- నిత్యానిత్య వస్తువివేకము, ఇహాముత్ర ఫలభోగవిరాగము, శమాది షట్క సంపత్తి, ముముక్షుత్వం -- అని సాధకునికి ఉండవలసిన నాలుగు ముఖ్యలక్షణాలుగా, సాధనా చతుష్టయముగా చెప్పారు.

శ్లో|| ఆదౌ నిత్యానిత్య వస్తు వివేక పరిగణ్యతే
ఇహాముత్ర ఫలభోగ విరాగ స్తదనంతరం 
శమాది షట్కసంపత్తి ర్ముముక్షుత్వ మితి స్ఫుటం ||  
 
దాని తర్వాత జిడ్డు ఇంకా ఇలా వ్రాస్తారు.

The six points of conduct which are specially required are given by the Master as,

1.Self control as to the mind.
2.Self control in action.
3.Tolerance
4.Cheerfulness.
5.One pointedness.
 6.Confidence.

మనం వివేక చూడామణిని పరిశీలిస్తే, ఆది శంకరులు తన బోధలో భాగంగా, శమాది షట్క సంపత్తిని వివరిస్తూ ఇలా అంటారు. 
"శమము (మనో నిగ్రహము), దమము (బాహ్యేంద్రియ నిగ్రహము), తితిక్ష (ఓర్పు), సంతోషము, శ్రద్ధ, సమాధానము -- అనబడే ఈ ఆరూ కలిపి శమాదిషట్కసంపత్తి ( శమము మొదలైన ఆరుసంపదలు) అనబడుతవి. సాధకుడైనవాడు వీటిని కలిగి ఉండాలి.  మరియూ నిత్యమూ అభ్యాసం చేస్తూ ఉండాలి." 

శంకరులు చెప్పిన ఈ ఆరు లక్షణాలనే జిడ్డు ఇంగ్లీషులోకి తర్జుమా చేసి వ్రాశాడు. కనుక జిడ్డు చెబుతున్నది -- శంకరులు వివేకచూడామణి లో చెప్పినదానికి కాపీ అని క్లియర్ గా అర్ధమౌతుంది.


పై విషయాన్ని పరిశీలిస్తే, వేదాంత గ్రంధాలలోని భావజాలాన్ని తీసుకుని వాటికి తియసఫీ ముద్ర వేసి ఆ భావాలను హిమాలయన్ మాస్టర్స్ తనకు చెప్పారని జిడ్డుతో వ్రాయించినట్లు చక్కగా కనిపిస్తుంది. వివేక చూడామణి నుంచి కాపీ కొట్టినపుడు, దానిని వ్రాశిన  ఆదిశంకరుల పేరును ఎక్కడా  ప్రస్తావించకపోవడం శోచనీయం. ఆధ్యాత్మికరంగంలో ప్లేగియారిజం నాటికీ నేటికీ చాలా ఎక్కువ. నేడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా  తామరపంపరగా పుట్టుకొస్తున్న యోగాగురువులందరూ ఓషోరజనీష్  భావజాలాన్ని యధేచ్చగా  కాపీకోడుతున్నవారే. కాకుంటే ఆయనలోని నిజాయితీ వీళ్ళ వద్ద లేదు. ఉన్నదున్నట్లు చెప్పే ధైర్యం వీళ్ళకు లేదు. ఆయన్ని కాపీ కొడుతున్నామని ఎవరూ చెప్పరు. అలాగే నిన్న మొన్నటి వరకూ ఉన్న గురువులందరూ రామకృష్ణ వివేకానందుల భావాలను కాపీ కొట్టిన వారే. వీరి ముగ్గురి భావాలను దాటి కొత్త  విషయం చెప్పినవారు, ప్రయత్నించినవారూ ఒక్క అరవిందులు తప్ప ఎవరూ లేరు. భావాలకు కాపీ రైట్ లేదు కదా. 

లెడ్ బీటర్, అనీబెసంట్  మొదలైనవారు భారతీయ జ్ఞానమార్గాన్నీ, ధ్యానమార్గాన్నీ, ఇంకా వాళ్లకు తోచిన అనేక మార్గాలను కలగలిపి సాంబార్ వండి, ఆ ఉడికీ ఉడకని సాంబారును ఇంగ్లీషుగ్లాసులో పోసి  జిడ్డు చేత బలవంతంగా తాగించారు అని తెలుసుకోడానికి ఈ రెండు విషయాలు చాలు.  వారు ఆయనకు బోధించిన సూత్రాలలో వారియొక్క ఒరిజినాలిటీ ఏమీ లేదు. అవన్నీ ప్రాచీన వేదాంత గ్రంధాల నుండి కాపీ కొట్టిన విషయాలు.  అంతే గాక ఆయా సూత్రాలనూ, మార్గాలనూ వారు ముందుగా అనుసరించి వానిలో సిద్ధిని పొందినవారు కారు. పైగా ఇంకొక్క విచిత్రమేమిటంటే ఆయనకు అసలు ఆకలి ఉందాలేదా అన్నవిషయం కూడా వాళ్ళు పట్టించుకోకపోవడం ఒక ఎత్తైతే, ఈ విషయాలు క్లాస్ రూం లో బోధించేటటువంటి అకాడెమిక్ సబ్జెక్టులు కావనీ బోధించేవానికి వీనిలో గట్టి అనుభవం ఉండాలనీ, దానికి తగిన సాధనలను గురువుగా అతను ఇంతకుముందే ఆచరించి ఆ తరువాత మాత్రమె శిష్యునికి చెప్పాలన్న విషయాన్నీ వాళ్ళు విస్మరించారు. కనుకనే జిడ్డుకు వాళ్ళు ఆశించిన ఆధ్యాత్మిక  ప్రగతి రాకపోగా, జ్ఞానోదయం అయిన తరువాత విసుగుపుట్టి  వాళ్ళమీదే తిరగబడ్డాడు. 

వారి ముఖ్య ఉద్దేశ్యం చూడబోతే, ఒక వరల్డ్ టీచర్ ను తయారు చెయ్యాలి అన్న తొందర  తప్ప, దానికి దైవాదేశం ఉండాలనీ, శిష్యుని కంటే ముందు గురువులుగా తమకు అర్హత ఉండాలన్న ఎరుక ఉన్నట్లు కనిపించదు. ఒక సూపర్ స్పిరిట్యువల్ ప్రాడక్ట్ తయారు చేసి లోకం మీదకు వదలాలని వాళ్ళు భావించారు. కాని దానికోసం తమకు గల అర్హతలను వాళ్ళు పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించదు. కనుకనే చివరకు ఆయనే వారిని  తిరస్కరించాడు. ఈ విషయంలో మాత్రం జిడ్డుయొక్క సత్యాన్వేషణాతత్పరతను ఒప్పుకోవచ్చు. అనుభవం లేని గురువులు ఆధ్యాత్మిక ట్రయినింగ్ ఇవ్వబోతే ఇలాగే అవుతుంది.  ఇటువంటి వారిని చూచే, గుడ్డివాడు నడిపితే నడిచే గుడ్డివాడు-- ఇద్దరూ కలిసి గుంటలో పడతారు అని ఉపనిషత్తులు చెప్పాయి.
read more " జిడ్డు కృష్ణమూర్తి జీవితం-తత్త్వం-2 "

24, మే 2011, మంగళవారం

జిడ్డు కృష్ణమూర్తి జీవితం-తత్త్వం

మహనీయుల జీవితాలు గ్రహప్రభావానికి అతీతాలు అని చాలా మంది అనుకుంటారు. అది నిజం కాదు. వాళ్ళ గురువులను గొప్ప చెయ్యడానికి ఆయా శిష్యులు అలా చెప్పుకోవచ్చు. మా గురువు కర్మాతీతుడు, సాక్షాత్ భగవంతుని అంశ అని చెప్పుకోడానికి శిష్యులకూ, వినడానికి మనకూ బాగుంటుంది, కాని చేదువాస్తవం వేరుగా ఉంటుంది. 

భౌతికశరీరంలో ఉన్నంతవరకూ అందరూ కర్మబద్ధులే , గ్రహప్రభావానికి బద్ధులే . ఇందులో ఏమీ మినహాయింపు లేదు. మహనీయుల మనస్సు కర్మకు అతీతంగా ఉండవచ్చు. పడుతున్న బాధలను వాళ్ళు పట్టించుకోకపోవచ్చు. కాని పాంచభౌతికమైన శరీరం మాత్రం పంచభూతాత్మకమైన గ్రహప్రభావానికి లోనుకాక తప్పదు. పంచభూతాలకు అతీతమైన భూమికలో ఉన్నవారే గ్రహప్రభావానికి అతీతులు.  ఆ భూమికలో శరీరం ఉండలేదు కనుక గ్రహప్రభావం శరీరం మీద తప్పకుండా ఉండి తీరుతుంది.  పూర్తిగా కాంతిశరీరం కలిగిన బాబాజీవంటివారు మాత్రమే భౌతికకర్మకు అతీతులుగా ఉండగలరు. ఈలోపల ఉన్నవారు ఎంతటివారైనా గ్రహప్రభావానికి బద్దులే. అందుకే మహనీయులు అందరూ మనలాగా నానాబాధలూ పడినవారే.  బాధలుపడినంత మాత్రాన వారి మహాత్వానికి భంగం లేదు. ఆ బాధలను వారు చూచినతీరులోనూ, వాటిని స్వీకరించిన విధానాలలోనే వారి గొప్పతనం దాగుంటుంది. 

జిడ్డు కృష్ణమూర్తి జీవితం కూడా గ్రహప్రభావానికి అతీతం ఏమీ కాదు. ఆయన జీవితాన్ని, తత్వాన్ని అధ్యయనం చేస్తే ఈ విషయం తేటతెల్లం అవుతుంది.  పరాశర మహర్షి ఉపదేశం ప్రకారం జిడ్డుగారి జాతకంలో అష్టోత్తరీ (108 ) దశ వర్తిస్తుంది.
 
శ్లో|| విహాయ లగ్నం లగ్నేశాత్ కేంద్ర కోణగతే త్వగౌ 
ఆర్ద్రా ప్రభ్రుతిభా దష్టోత్తరీ  నామ్నీ దశోదితా  ||
(పరాశర హోర 47- 15)


(లగ్నేశుని నుండి లగ్నమును విడచిపెట్టగా ఇతరములైన కేంద్ర కోణాదులలో రాహువు గనుక ఉన్నట్లయితే ఆ జాతకమున ఆర్ద్రా నక్షత్రంతో మొదలయ్యే  అష్టోత్తరీ  దశను పరిగణింపవలెను). 

జిడ్డు కృష్ణమూర్తి చిన్నతనంలో బలహీనంగా ఉండేవాడు. ఆయనది అంత గట్టి ఒళ్ళు కాదు.లగ్నాధిపతి అయిన శని వక్రించి ఉండటమూ, చంద్రుడు కేతునక్షత్రంలో ఉండటమూ దీనికి కారణాలు.  పైగా ఈయనకు చిన్నతనంనుంచే ఆత్మలను చూడటం వంటి కొన్ని శక్తులు ఉండేవి అని తెలుస్తుంది. దానికి కారణం చంద్రుడు మూలా నక్షత్రంలో గాలాక్టిక్ సెంటర్ కు దగ్గరగా ఉండడం కావచ్చు. ఈయన మనస్సు కొద్దిపాటి  సూక్ష్మభూమికలను అనుభూతి చెందగల లక్షణాన్ని  స్వతహాగా కలిగిఉండేది అని అనుకోవచ్చు.  


1903 లో వీరి కుటుంబం కడపకు మారింది. అప్పుడు ఆయనకు మలేరియా సోకింది. అప్పుడు జాతకంలో శని/శుక్ర దశ నడిచినట్లు మనం చూడవచ్చు. శని లగ్నాదిపతిగా వక్రించి బలహీనుడుగా ఉండటమూ, శుక్రుడు బాధకాధిపతి యగు కుజుని నక్షత్రంలో ఉండటమూ, కుజ శుక్రులు ఇద్దరూ కలిసి రోగ స్థానంలో ఉండటమూ చూస్తే గ్రహప్రభావం ఎంత నిర్దుష్టంగా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఆ సమయంలో గోచార శని మకర రాశిలో జిడ్డుగారి లగ్నం మీద సంచరించింది.

1904 లో ఇరవైయేళ్ళ వయసున్న తన అక్క మరణించింది.   కాని ఆ తర్వాత కూడా కృష్ణమూర్తి తల్లిగారైన సంజీవమ్మగారు చనిపోయిన తన కూతురి ఆత్మను చూచి ఆమెతో సంభాషించగలిగేది. తోటలోని ఒక మూలకు ఆమె ఆత్మ వస్తుండేది. ఆ సమయంలో తల్లి ఆ ప్రాంతానికివెళ్లి కూతురిఆత్మతో మాట్లాడేది. ఆ సమయంలో కృష్ణమూర్తి వయసు 9 ఏళ్ళు ఉంటుంది. ఆయనకూడా తనఅక్కగారి ఆత్మను  చూచినట్లు తరువాత తన అనుయాయులతో చెప్పారు. కాని ఆమె శవాన్ని చూసి ఉన్నందువల్లా, ఆమెను దహనం చెయ్యటం చూసినందువల్లా, ఆత్మగా ఆమె కనిపించినపుడు కృష్ణమూర్తి భయంతో తల్లి చాటున దాక్కునేవాడు. ఈ సంఘటనలు అన్నీ 1904 -  1905 మధ్యన కడపలో జరిగాయి. వక్రించిన శనిని  నాడీవిధానం ప్రకారం తొమ్మిదో ఇంట్లో ఉన్నట్లు చూడాలి. పంచమాత్ పంచమ భావం కావడం వల్లనూ, పంచమాధిపతి యగు శుక్రుని అంతర్దశ, అష్టమాధిపతి యగు ఉచ్చ రవి అంతర్దశ   నడుస్తున్నందువల్లనూ  ఈయనకు ఆత్మలను చూడటం వంటి అలౌకిక సంఘటనలు  ఆ సమయంలో జరిగాయి. 


డిసెంబర్ 1905 లో ఈయన తల్లిగారు మరణించారు. ఆ తరువాత తన తల్లిఆత్మను కూడా తాను చూచానని జిడ్డు కృష్ణమూర్తి చెప్పారు. ఆ సమయంలో శని/చంద్ర దశ లో గురు/రాహు విదశలు జరిగాయి. మాత్రు  కారకుడగు చంద్రుడు అష్టమంలో ఉన్న కేతు నక్షత్రమైన మూలలో ఉంటూ ద్వాదశ త్రికస్థానంలో పడటం చూడవచ్చు.  గోచార శని ఈ సమయంలో కుటుంబస్థానమైన కుంభం లో సంచరిస్తూ తృతీయదృష్టితో మాత్రుస్థానాన్ని చూస్తున్నాడు. తల్లికి సంబంధించిన దుర్ఘటన కుటుంబంలో జరుగబోతున్నది అని సూచిస్తున్నాడు. కనుక తల్లి మరణానికి తగిన గ్రహస్తితులు అప్పుడు జరిగాయి.  బహుశా ఈ సంఘటనలే కృష్ణమూర్తి పసిమనసుపైన గాఢమైన ముద్రలు వేసి ఉండవచ్చు. ఆ ముద్ర ఏ విధంగా ఉండి ఉండవచ్చు అని ఊహిస్తే, ఒక బలీయమైన ఆసరాను కోల్పోయి  మానసికంగా దిక్కుతోచని స్తితిలో పడిన స్థితిని ఆయన చిన్నతనంలోనే ఎదుర్కున్నాడు అని తెలుస్తుంది. ఇదే ఆయన జీవితంలో తగిలిన మొదటి దెబ్బ.అందుకే తన జీవితమంతా మానసికమైన ఆసరాకోసం తపించాడు అని అనిపిస్తుంది. గొప్పతత్వవేత్త అన్నఖ్యాతి వచ్చిన తరువాత కూడా రోసలిన్ తో జరిపిన రాసలీలలు ( ఇది వివాదాస్పదమైన విషయం) ఈ చిన్న తనపు మానసికషాక్ నుంచి ఉపశమనం పొందటానికి తన అంతఃచేతననుంచి ఉద్భవించిన చేష్టలే అని అనుకోవచ్చు.

జనవరి 1909 లో కృష్ణమూర్తి తండ్రి నారాయణయ్య   అడయార్ లోని దియోసాఫికల్ సొసైటీ లో వచ్చిన ఉద్యోగ రీత్యా తన కుటుంబాన్ని మద్రాసుకు మార్చారు. ఆ సమయంలో ఆయనకు శని/శని/గురు దశ జరిగింది. నవమ శని/ రాహు నక్షత్రంలోని గురువూ కలిసి ఆయన్ను సాంప్రదాయభిన్నమైన దియోసఫీ గురువులకు పరిచయం చేసారు.మద్రాసుకు మారిన కొన్నాళ్ళకే  ఈయన లెడ్బీటర్  దృష్టిలో పడటమూ  ఈయన చుట్టూ ఉన్న తేజోవలయాన్ని ( ఆరా ) గమనించిన తియోసఫీ గురువులు,   రాబోయే "మెస్సయ్య"(అవతారపురుషుని)గా ఈయన్ను అంగీకరించడమూ జరిగిపోయాయి. 1909  లో గోచార శని మీన రాశిలో సంచారం చేస్తూ, జిడ్డు యొక్క నవమ రాశి అయిన కన్యను వీక్షించాడు. గోచార గురువు సింహరాశిలో జననకాల అష్టమ కేతువుపైన సంచరించాడు. అందుకనే, ఈ సమయంలో ఆయనకు తియోసఫీ గురువులతోనూ  వారి రహస్యసాధనలతోనూ పరిచయం కలిగింది.


సరిగ్గా అప్పుడే ఆయన జీవితంలో శనిమహాదశ అంతమై, గురు మహాదశ మొదలైంది. అప్పటినుంచి, అంటే 1909 నుంచి 1925 లో ఈయన తమ్ముడు నిత్యానంద చనిపోయేవరకు ఈయన తియోసఫీ  గురువుల పర్యవేక్షణలో మునిగి తేలాడు. మాస్టర్స్ అనే సిద్దగురువులు టిబెట్ లోనూ హిమాలయాలలోనూ ఉంటారని వాళ్ళు రాత్రిళ్ళు సూక్ష్మ శరీరాలతో వచ్చి కనిపించి ధియోసఫీ సభ్యులను గైడ్ చేస్తూ ఉంటారని, తనద్వారా "లార్డ్ మైత్రేయ" ( మళ్ళీ వచ్చి లోకాన్ని ఉద్దరిస్తాడని  అన్ని మతాలూ నమ్ముతున్న అవతార పురుషుడు ) ఈ లోకానికి వెల్లడి కాబోతున్నాడని, దానికి తగిన ఉపకరణంగా తాను మారాలని,  దానికి కొన్ని ప్రత్యెక సాధనలు చెయ్యవలసి ఉన్నదని-- ఇత్యాది భావనలు ఈయనకు బాగా నూరిపోయ్యబడ్డాయి. ఆయన కూడా వాటిని బాగా వంట పట్టించుకున్నట్లే కనిపిస్తుంది. దాదాపు పదహారేళ్ళపాటు ఈ దిశగా తనను తాను అంతరికంగా సిద్ధం చేసుకుంటూ లెడ్ బీటర్, అనీబెసంట్ ల పర్యవేక్షణలో సాధనలు చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఆయనలో ఉన్న సహజ శక్తులు బాగా  వికసించి అతీత శక్తులు కొన్ని ఆయనకు ప్రాప్తించాయని అంటారు.

ఇకపోతే  తాను పొందిన మానసిక షాక్ నుంచి తెరుకోవడంలో భాగంగా, తనను చేరదీసిన అనిబెసంట్ లో పోయిన  తన తల్లిని చూసుకుని ఆమెకు బాగా దగ్గరైనట్లు కూడా తోస్తుంది. ఈయన జీవితంలో తగిలిన రెండవ దెబ్బ-- ఈయన ఎంతగానో ప్రేమించిన తమ్ముడు నిత్యానంద మరణం. ఇది 1925 లో జరిగింది.  తల్లి మరణంతో తగిలిన మానసికమైన దేబ్బనుంచి ఆయన తియోసఫీ గురువుల లాలనలో కోలుకున్నాడు. కాని నిత్యానంద మరణం ఆయన విశ్వాసాలను కదిలించింది. తియాసఫీ సిద్ధాంతాలనూ, మాస్టర్స్ అనబడే పరమ గురువుల ఉనికినీ ప్రశ్నించేట్లూ , వాటిని తిరస్కరించేట్లూ చేసింది. 
read more " జిడ్డు కృష్ణమూర్తి జీవితం-తత్త్వం "

21, మే 2011, శనివారం

లోమశ సంహిత -- అరిష్ట ప్రకరణం

మానవులకు మరణాన్ని గురించి చాలా సందేహాలుంటాయి. కొందరు బలవన్మరణాలు పొందుతూ ఉంటారు. ఇంకొందరు చాలా హాయిగా పోతుంటారు. కొందరు దాదాపు నూరేళ్ళు జీవిస్తారు. ఇంకొందరు అల్పాయుష్కులై మరణిస్తారు. కొందరు చివరి వరకూ ఆరోగ్యంగా జీవిస్తారు. మరికొందరు ఎప్పుడూ ఏదో ఒక రోగంతో బాధపడుతూనే ఉంటారు. కొందరు అయిదు నిమిషాల్లో హటాత్తుగా వెళ్ళిపోతారు. ఇంకొందరు నెలలతరబడి మంచానపడి నరకయాతన అనుభవించి పోతుంటారు. కొందరు తమ తప్పుల వల్ల మరణిస్తే, ఇంకొందరు ఇతరులు చేసిన తప్పుల వల్ల మరణిస్తారు.  ఈ తేడాలు ఎందుకు కలుగుతాయి అన్న సందేహం కలుగుతుంది.

సనాతన వైదికధర్మం దీనికి కారణాలు చెప్పింది. మన పూర్వకర్మ ననుసరించి ఈ తేడాలన్నీ వస్తుంటాయి. అయితే కర్మను అనుభవించవలసినదేనా? వేరే మార్గాంతరం ఏమీ లేదా? అన్న ప్రశ్నకు జవాబు ఉన్నది. కర్మను మార్చుకోవడానికి మార్గం ఈశ్వరుడే ఏర్పరిచాడు. కర్మను కర్మతో జయించవచ్చు. ఆ ఉపాయాలు జ్యోతిష్య శాస్త్రం సూచిస్తుంది. వాటిని అనుసరించ గలిగితే కర్మను మార్చుకోవచ్చు. 

లోమశమహర్షి ప్రణీతమైన లోమశసంహిత ఆయుర్దాయాన్ని గురించీ, వివిధ రకాలైన మరణాలలోని తేడాలను గురించీ, తనదైన పంధాలో వివరించింది.

శ్లో || అరిష్టం ద్వివిధం పుంసాం దైవం స్వకృత సంజ్నితం 
స్వకృతం సర్వకాలీనం విష శస్త్రానలాదిభిహి  || 

అరిష్టం అనేది మానవునికి రెండు విధాలుగా కలుగుతుంది. ఒకటి దైవికం. రెండవది స్వయంకృతం. దైవికం అంటే దైవం చేత చెయ్యబడినది అని కాదు.  దైవం తనంతట తాను ఎవరినీ శిక్షించదు.  ఎప్పుడో చెయ్యబడిన కర్మ పరిపక్వానికి వచ్చినపుడు తానంతట అదే కలిగే ఫలితం అనే "దైవికం" అన్న పదానికి అర్ధం. అంటే మానవుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అనుకోకుండా ఒచ్చిపడే ఆపదలే దైవికాలు. ఇక స్వయంకృతం అన్నది మనకు తెలిసిందే. తనంతట తానుగా చేసుకునే హానీ, చెడూ,  ఆత్మహత్యలు ఇత్యాదులు ఈ కోవలోకి వస్తాయి. 

ఈ స్వయంకృతంకూడా విషము, శస్త్రము, అగ్ని మొదలైన రూపాలుగా ఉంటుంది. విషము అంటే సరాసరి విషసేవనం కావచ్చు లేదా ఫుడ్ పాయిజనింగ్ కావచ్చు.  ఆహారపరంగా ఏర్పడే వైకల్యం అని విశాలార్ధం  లో గ్రహించాలి. శస్త్రము అంటే ఏదో ఒక ఏక్సిడెంట్ కావడం, లేదా దెబ్బలు తగలడం, లేదా ఆపరేషన్ జరగడం ఇలా రకరకాలుగా ఉండవచ్చు. అంటే బయటనుంచి వచ్చి శరీరానికి తగిలి గాయం చేసేది  ఏదైనా శస్త్రమే.  అగ్ని అంటే అగ్ని ప్రమాదం గాని,ఒంట్లో అతి వేడి పుట్టటం కాని, జ్వరం గాని ఇలా వివిధ రూపాలలో ఉండవచ్చు. ఇలాటి ఉపద్రవాలు సర్వకాలీనములుగా ఎప్పుడైనా జరుగవచ్చు. వీటిని విశాలమైన అర్ధంలో గ్రహించాలి.

శ్లో || స్వకరేనాహతో దీపో యదా నశ్యం తత్ క్షణాత్
నిర్వాతే  తైల పూర్ణోపి  స్వ కృతేన తదానర :
ఆయుర్దీపం తధైవోక్తం ద్వివిధం ద్రుహినోదితం 
గ్రహయోగాదిభిర్యైవ మన్యయోగాది సాధితం 

దీపంలో తైలం నిండుగా ఉన్నప్పటికీ తన చేతులతో దీపాన్ని ఆర్పుకుంటే, ఆ క్షణం లోనే దీపం ఆరిపోయినట్లుగా ఆయుస్సు అనబడే దీపం కూడా అలాగే ఆర్పబడటానికి అవకాశం ఉన్నది. అంటే, ఆయుస్సు ఇంకా ఉన్నప్పటికీ, మానవుడు చావాలి అని బలంగా  అనుకుంటే ఆత్మహత్య చేసుకుని  చనిపోగలడు. కాని ముందుగా నిర్ణయించబడిన తన ఆయుస్సు తీరేవరకూ ప్రేత శరీరంతో తిరుగాడుతూ ఉండవలసి వస్తుంది. దేవుడిచ్చిన శరీరాన్ని బుద్ధిహీనతతో ముందుగానే తెంచుకున్న వారు ప్రేతాత్మలై అల్లాడుతూ వారి ఆయుస్సు తీరేవరకూ ఇక్కడే  తిరుగుతూ ఉంటారు.  అది వేరే సబ్జెక్టు. దాన్ని గురించి ఇంకోసారి చర్చిద్దాం. ప్రస్తుతానికి అరిష్టాల గురించి మాట్లాడుకుందాం. ఈ విధాలైన అరిష్టాలు  రెండు విధాలుగా జరుగవచ్చు. ఒకటి-- గ్రహయోగాలవల్ల (జననకాల యోగాలవల్ల)  రెండవది--  ఇతర యోగాలవల్ల (గోచార యోగాలవల్ల ) ఇది జరుగవచ్చు. 

శ్లో || ఏవం చతుర్విధం పుంసాం మరణం జాయతెత్రహి 
యస్య మాన్దీయుత చంద్రాస్త్రికోణే    యది సంస్థితా:
యోగాభ్యాసాదిభి  స్తస్య హ్యాయుర్వర్ధతి  నిశ్చితం 
వ్యయ షష్టాష్టగో  మాన్దిర్యది క్రూర ఖగాన్విత:

ఈ విధంగా మనిషికి నాలుగు రకాలైన మరణాలు సంభవించవచ్చు. అంటే దైవకృతం, స్వయంకృతం, జననకాలయోగఫలితం, గోచారయోగఫలితం అని ఇవి నాలుగురకాలు. మాంది తో కలసి చంద్రుడు త్రికోణములలో ఉన్నప్పుడు ఇవి సంభవిస్తాయి. మాన్దీ గ్రహం ఇతరములైన క్రూర గ్రహములతో కలసి 6 -8 -12 రాశులలో ఉన్నపుడు కూడా ఇలా జరుగుతుంది. కాని అలాంటప్పుడు కూడా యోగాభ్యాసాది ప్రక్రియలవల్ల ఆయుస్సును పెంచుకొనవచ్చును.

శ్లో || స్వక్రుతేనైవ దోషేణ మరణం తస్య జాయతే 
లగ్నే చంద్రే క్షితే యుతే లగ్నాధిపతినాధవా      ||

లగ్నముతో గాని లగ్నాదిపతితో గాని చంద్రుడు కలసి ఉన్నా, లేక దృష్టి కలిగి ఉన్నా అటువంటప్పుడు తాను చేసుకున్న తప్పుల వల్ల (స్వకీయ కారణాల వల్లనే ) మరణం సంభవిస్తుంది.

చంద్రుడు మాన్దీ  సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు ఈ విధమైన అరిష్టాలు కలుగుతాయి. అదే చంద్రునికి గనుక లగ్నంతో గాని లగ్నాధిపతి తో గాని సంబంధం ఉన్నప్పుడు చేతులారా చేసుకున్న కారణాలచేత ఈ అరిష్టాలు కలుగుతాయి. 


ఉదాహరణకు, రాజీవ్ గాంధి జాతకంలో సింహ లగ్నంలో లగ్నాధిపతి అయిన సూర్యునితోబాటు  చంద్రుడు స్థితుడై ఉన్నాడు. సింహరాశికి పంచమ కోణంలో ధనుస్సులో మాన్దీ గ్రహం ఉన్నది. నవాంశలో సింహ రాశిలో రాహువూ, గులికుడూ  ఉండటం వల్ల , స్వకీయ కారణాల వల్లనే ఆయనకు దుష్టమరణం సంభవించింది అని మనం తెలుసుకోవచ్చు.   
 

ఏదిఏమైనప్పటికీ, యోగాభ్యాసాది సాధనలవల్ల ఆయుస్సును పెంచుకొని అరిష్టాలనుంచి తప్పుకొనే అవకాశం ఉన్నది అని లోమశ మహర్షి చెప్పాడు. ఇక్కడ యోగాభ్యాసం అన్న పదం వాడుతూ దానివెనుక -- పరిహార క్రియలవల్ల పూర్వ కర్మ తొలగుతుంది -- అన్న విషయం నిగూడంగా   చెప్పాడు. అయితే ఆ పరిహారాలు పాటించాలి అన్న బుద్ధి  ఆ జాతకునికి కలగాలి. లేకపోతె కర్మను తప్పుకోవటం సాధ్యం కాదు. రాజీవ్ గాంధి చనిపోయిన రోజున ఆయన్ను బయటకు వెళ్ళవద్దని, జాగ్రత్తగా ఉండమని కంచి పరమాచార్యులు ఆయన్ని ముందుగానే హేచ్చరించారనీ కాని రాజీవ్ గాంధీ ఆయన మాటలని లెక్క చెయ్యలేదనీ అంటారు. కర్మానుభవం ముంచుకొస్తున్నపుడు మహనీయుల మాటలు చెవికి ఎక్కవు అనడానికి ఇదొక ఉదాహరణ.  

మన ప్రాచీన గ్రంధాలలో ఈ విధంగా, మానవులకు రాబోయే అరిష్టాలను ఎలా గుర్తించాలి, వాటినుంచి ఎలా రక్షించుకోవాలి అన్న విషయాలు ఎన్నో చోట్ల మహర్షులచేత చర్చించబడ్డాయి. వాటిని స్వీకరించి ఆచరించి మేలు పొందటం విజ్ఞుల లక్షణం. 
read more " లోమశ సంహిత -- అరిష్ట ప్రకరణం "

18, మే 2011, బుధవారం

జిడ్డు కృష్ణమూర్తి జీవితం-ఒక పరిశీలన

గత వందసంవత్సరాలలో ప్రాచ్య పాశ్చాత్య తాత్విక చింతనను ప్రభావితం చేసిన దార్శనిక యోగులలో జిడ్డుకృష్ణమూర్తి  పేరు ప్రధమస్థానంలో నిలుస్తుంది.  అలాగే, చూస్తున్న కాసేపు అద్భుతంగా ప్రభావితం చేసి తరువాత ఏమీ గుర్తుండని  ఇంద్రజాల ప్రదర్శనలాగా ముగిసిన తాత్వికుని పేరు చెప్పమన్నా ఈయన పేరే గుర్తొస్తుంది. సత్యాన్ని విడవకుండా ఉండటంలోనూ, అవసరమైతే దానికోసం దేనినైనా పరిత్యజించడంలోనూ ఆయన చూపిన తెగువ అనన్య సామాన్యం. ఆయన త్యాగం బుద్ధుని త్యాగమంత గొప్పది అని, నా అభిప్రాయం.

జిడ్డు కృష్ణముర్తి, రమణ మహర్షి, రజనీష్ ఈ ముగ్గురిదీ ఒకటే తత్త్వం. ప్రాధమికంగా వీళ్ళు ముగ్గురూ జ్ఞానులు. వీళ్ళలో మళ్ళీ సున్నితమైన తేడాలున్నాయి. మహర్షి సాంప్రదాయజ్ఞాని. ఆయన విధానం ప్రాచీనం. సాంప్రదాయ బద్ధం. రజనీష్ అత్యంత స్వేచ్చావాది. నవీనకాలానికి కావలసిన ధ్యానవిధానాల రూపకర్త. ప్రాచీనులకు ప్రాచీనుడు నవీనులకు నవీనుడు. ఇకపొతే జిడ్డు, ప్రాచ్య జ్ఞానమార్గానికీ, టిబెటన్ మార్మికతంత్రానికీ, పాశ్చాత్య తత్వశాస్త్రానికీ కలగలుపు అయిన తియోసాఫీలో నలిగి విసిగి వేసారి, శుద్ధ జ్ఞానం వైపు మళ్ళిన సత్యప్రేమికుడు అని చెప్పవచ్చు.

జిడ్డు కృష్ణమూర్తి 12 -5 -1895 న 00 -22 గంటలకు మదనపల్లె లో జన్మించాడు. ఆయన జాతకాన్ని ఇక్కడ ఇస్తున్నాను. ముందుగా ఆయన జాతకం లోని కొన్ని యోగాలను పరిశీలించి తరువాత ఆయన జీవితంలోని సంఘటనలనూ ఆయన తత్వాన్నీ జ్యోతిష్య శాస్త్ర రీత్యా పరిశీలిద్దాం.

సహజ రాశి చక్రంలోని దశమ స్థానం మకరం. సహజ కర్మ స్థానం గనుక ఈ రాశిలో కర్మ క్షాళన తత్పరులైన  ఉత్తమ జీవులు జన్మించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కర్మక్షయం చేసుకొని జీవిత పరమగమ్యం వైపు పట్టుదలగా ప్రయాణం సాగించే సాధకులకు ఈరాశిలో జన్మ కలుగుతూ ఉంటుంది. కర్మభూమి అయిన మన భారత దేశం కూడా మకర రాశితోనే సూచింపబడుతూ  ఉండటం గమనార్హం. మొరాయిస్తున్న వెనుక భాగాన్ని ప్రయాసతో ఈడ్చుకుంటూ, గమ్యం మీద దృష్టితో బాధను లెక్క చెయ్యకుండా మొండిగా ముందుకే సాగిపోయే సగం మృగం  సగం  జలచరం అయిన మకర స్వరూపాన్ని చక్కగా గమనిస్తే ఈ రాశి జాతకుల స్వభావం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది.  

లగ్నాధిపతి అయిన శని దశమంలో చరరాశిలో  ఉచ్ఛస్తితిలో బలవంతుడై ఉండటం ఆయన నిరంతర కర్మ శీలతను సూచిస్తుంది. అందుకే ఆయన ఎప్పుడూ ఒక చట్రంలో బంధింపబడటాన్ని  వ్యతిరేకించేవాడు. నిరంతర అన్వేషణకూ, అంతఃప్రపంచంలో విసుగులేని పరిశీలనా పూర్వక చలనశీలతకూ ఆయన ప్రాధాన్యతనిచ్చాడు.  కాని ఆ శని వక్రించి ఉండటం వల్ల -- ఈయనకు లోకంతో కర్మశేషం చాలా మిగిలి ఉందన్న విషయం కనిపిస్తున్నది. అందుకే తన దర్శనాన్ని లోకానికి చెబితే -- ఎవరైనా దాన్ని అర్ధంచేసుకుని ఆ అనుభూతిని వారుకూడా పొందుతారేమో -- అనే ఆశతో జీవితమంతా ప్రసంగాలు ఇస్తూనే గడిపాడు. కాని ఆయన ఆశ నెరవేరినట్లు కనిపించదు. ఏ మహాపురుషుని ఆకాంక్ష అయినా సరే ఈ ప్రపంచంలో నెరవేరడం అనేది ఎన్నటికీ జరుగదు. ఈ ప్రపంచపు  చిక్కని చీకటిని కరిగించడానికి ఒక్క కొవ్వొత్తి సరిపోదు. ఆ ప్రయత్నంలో కొవ్వొత్తి కరిగిపోతుంది కాని చీకటి తరిగిపోదు. అలాగని కొవ్వొత్తి తన ప్రయత్నం ఆపడమూ చెయ్యదు. అదే ఈ ప్రపంచపు మాయాపూరిత మైన లీల.

లగ్నారూడమైన మేషంలో అష్టమాధిపతి (లగ్నారూడాత్ మంత్ర స్థానాధిపతి) యగు ఉచ్ఛరవి స్తితివల్ల కూడా ఈయన నిగూఢజ్ఞాని అన్న విషయం తెలుస్తున్నది. 

మహనీయుల జాతకాలలో శనిచంద్రుల పరస్పరసంబంధం నేను గమనించిన నిర్దుష్టమైన సూత్రాలలో ఒకటి. వివేకానందాది మహాపురుషుల జాతకాలలో ఈ సంబంధం స్పుటం గా కనిపిస్తుంది. దీనివల్ల జాతకునికి లౌకిక విషయాలలో నిర్లిప్తతా, అంతర్ముఖత్వమూ, వైరాగ్యమూ స్థిరంగా కలుగుతాయి. జిడ్డు గారి జాతకంలో కూడా ఈ విలక్షణతను  మనం గమనించవచ్చు. వక్రించిన శని దృష్టి ద్వాదశ చంద్రునిపైన ఉండటం వల్ల, చంద్రునికి సప్తమాదిపత్యం కలగటం వల్లా, ఈయనలోని కామవాసనలు నిగ్రహింపబడ్డాయని తెలుస్తుంది. 

లోకం యొక్క బాధలను తనమీద ఆరోపించుకొని ఆ బాధల నుండి లోకంలోని జీవులను విముక్తం చెయ్యాలన్న తాపం ఇటువంటి శని చంద్రుల సంబంధం ఇస్తుంది. ఈ యోగం అనేక మంది బోధిసత్వుల జాతకాలలో మనం చూడవచ్చు. వారు తమ మోక్షం తాము చూచుకొని,  లోకాన్ని పట్టించుకోని ఏకాంతయోగుల కోవకు చెందినవారు కారు. లోకంలోని దుఖం తో మమేకమైన హృదయంతో లోక పరితాపాన్ని తీర్చాలని తపన పడేవారు అయి ఉంటారు.

మోక్ష త్రికోణం అయిన 4 -8 -12 ఇరుసు ఈయన జాతకంలో విలక్షణం గా కనిపిస్తుంది. నాలుగింట ఉచ్ఛ స్థానంలో ఉన్న అష్టమాదిపతీ, ఆత్మజ్ఞాన కారకుడూ అయిన గ్రహరాజు సూర్యుడు, ఎనిమిదింట ఆధ్యాత్మికతకూ మార్మిక జ్ఞానానికీ కారకుడైన కేతువూ, పన్నెండింట మనః కారకుడూ కామ భావాదిపతీ అయిన క్షీణ చంద్రుడూ స్తితులై ఉండటం చూస్తే, ఈయన ఒక జ్ఞాని అన్న విషయం కనిపిస్తుంది.   
   
కామాదిపతి అయిన చంద్రుని క్షీణ స్థితి వల్లా, ద్వాదశ స్థితివల్లా, కామవాసనలు క్షీణ స్థితిలో ఉంటాయి. ఈ చంద్రునిపైన గురువు, శని , కేతువుల దృష్టి ఉన్నది. గురువువల్ల-- సాంప్రదాయ ఆధ్యాత్మిక జ్ఞానమూ,  గురుత్వమూ, శనివల్ల-- వైరాగ్యమూ, ఏకాంతాభిలాషా, కేతువువల్ల--మార్మిక జ్ఞానమూ, అతీన్ద్రియానుభూతీ  ఈయనలో కలగలిసి ఉంటాయి అని తెలిసిపోతున్నది.

ఇక విమ్శాంశ చక్రాన్ని పరిశీలిద్దాం.

బుద్ధికారకుడైన బుధుని మిధున లగ్నం కావడమూ, భావ వ్యక్తీకరణకు సూచిక అయిన సహజ తృతీయస్థానం కావడమూ, ఈయన బోధనలు బౌద్ధిక స్థాయిలో ఉంటాయి అన్న విషయం సూచిస్తున్నాయి. పంచమ స్థానంలో ఉచ్ఛ శని, నీచ రవుల వల్ల ఒక విచిత్ర పరిస్తితి తలెత్తుతున్నది. ఇందులో మళ్ళీ శని వక్రీకరణ ఒక చిక్కు ముడి. శనికి పట్టిన అష్టమ నవమాదిపత్యం వల్ల, ఉచ్ఛ స్థితి వల్లా ఉన్నత ఆధ్యాత్మిక స్థాయి సూచితం అవుతున్నది. వక్రత వల్ల అంతర్ముఖత్వం సూచితం అవుతున్నది.లాభ స్థానం నుంచి వీరిపైన గురు బుధుల దృష్టి వల్ల, ఈయన సాధనా బోధనా అంతా శుద్ధ జ్ఞానమయం అన్న సత్యం వెంటనే స్పురిస్తున్నది. తృతీయ అధిపతి అయిన రవి నీచత్వ బలహీనత వల్ల, ఈయన చెప్పేది లోకులకు అస్సలు అర్ధం కాదు అన్న విషయం తెలుస్తున్నది. అలాగే జరిగింది కూడా. అందుకే ఈయన పడక్కుర్చీ వేదాన్తులకూ, ఆచరణలేని ఊకదంపుడు ఉపన్యాసకులకూ ఆరాధ్యుడిగా మిగిలిపోయాడు.  

ఇక్కడ ఇంకొక్క విషయం ప్రస్తావించాలి. నవాంశలో ఒక విచిత్ర యోగం ఈయన జాతకంలో ఉన్నది. అదే గురువు యొక్క నీచత్వం. దీనినుంచి రెండు విషయాలు రాబట్టవచ్చు.

ఒకటి- ఈయన  విజయవంతమైన గురువు కాదు. అంటే, ఈయన తత్త్వం ఎంత అద్భుతంగా ఉన్నప్పటికీ, లోకాన్ని ఉర్రూతలూగించి ఈయనకు మంచి తత్వవేత్త అన్న బిరుదునూ ఖ్యాతినీ ఆర్జించి పెట్టినప్పటికీ, ఈయన మార్గాన్ని అనుసరించి జీవితపరమగమ్యాన్ని చేరినవారు లేరు. ఈ విషయాన్ని ఆయనే తన జీవిత చరమాంకం లో ఒప్పుకున్నాడనీ, లోకులకు తాను చెప్పినది ఎక్కలేదన్న నిరాశతోనే ఆయన తనువు చాలించాడనీ ఆయన జీవితాన్ని పరిశీలించిన వాళ్ళు చెప్తారు. అంటే ఈయన మంచి గురువు కాదన్నమాట. 

రెండు- ఈయన గురువులు పరిపూర్ణ సిద్ధ గురువులు కారు. లెడ్ బీటరూ, అనీబెసంటూ జీవితాలు చదివితే ఆ సంగతి స్పష్టంగా తెలుస్తుంది. అందుకే తియాసఫీ అనేది  ప్రపంచానికి గొప్ప ఆధ్యాత్మికమైన మేలును చెయ్యలేకపోయింది. ఒక నిష్ఫలపదకోశ భాండాగారం గా మిగిలిపోయింది.

వచ్చే పోస్ట్ లో ఆయన జీవితాన్నీ, తత్వ చిన్తననూ వరుసగా పరిశీలిద్దాం.
read more " జిడ్డు కృష్ణమూర్తి జీవితం-ఒక పరిశీలన "

14, మే 2011, శనివారం

Jesus Never Fails - Sai Baba Never Fails.

ఈ మధ్య ఒక మిత్రుడు మొబైల్ లో ఒక మెసేజి పంపించాడు. Sai Baba Never Fails అని. పైగా ఈ మెసేజిని ఇరవై ఒక్క మందికి పంపిస్తే వారం రోజుల్లో మంచి జరుగుతుందనీ లేకుంటే ఏదో చెడు జరుగుతుందనీ సారాంశం. ఆ మిత్రుడు బాగా చదువుకున్నవాడూ, ప్రభుత్వంలో ఉన్నత అధికారీనూ. దానికి నేను Only fools believe in such things అని జవాబిచ్చాను. మాకున్న స్నేహం వల్ల నా జవాబులోని కరుకుతనానికి ఆయనేమీ అనుకోలేదనుకోండి.

ఇరవై ఏళ్ల క్రితం నాకు హోమియోపతి తెలీనప్పుడు కడపలో ఒక హోమియో డాక్టర్ దగ్గర నేను ట్రీట్మెంట్ తీసుకునే వాణ్ని. ప్రిస్క్రిప్షన్ పేపర్ల మీద ఆయన చేతి రాత నాకు బాగా గుర్తు. ఒకరోజున నాకు ఒక పోస్ట్ కార్డ్ వచ్చింది. దానిమీద కూడా దాదాపు ఇలాటి సందేశమే ఉంది. ఏదో గుళ్ళో పాము కనిపించిందనీ చూస్తూ ఉండగానే అది దేవుడిగా మారి మాయమైందనీ, ఈ విషయం ఇంకొక పది మందికి కార్డులు రాస్తే మంచి జరుగుతుందనీ లేకుంటే చెడు జరుగుతుందనీ ఏదేదో రాసుంది. దాని మీద వ్రాత చూస్తె నాకు ఆశ్చర్యం కలిగింది. అది మా హోమియో డాక్టర్ గారిది. ఆయన కడప హోమియో కాలేజీలో ప్రొఫెసర్ కూడా. అలాటి వాళ్లకి కూడా అలాటి నమ్మకాలు ఉంటాయా అనిపించింది. ఆ కార్డును చించి పారేశాను. 

అప్పుడే నా మిత్రుడొకడికి ఇలాటి కార్డే ఇంకొకరి నుంచి వస్తే అతను కట్టలు కట్టలు ఉత్తరాలు అందరికీ రాయడం నాకు తెలుసు. అతన్ని వారించినా వినకుండా ఏమో ఏ పుట్టలో ఏ పాముందో అంటూ ఓపిగ్గా కూచుని అందరికీ జాబులు వ్రాశాడు. తరువాత ఎన్నాళ్ళు ఎదురు చూసినా  ఏమీ మంచి జరగలేదు. అది వేరే సంగతి. 

"ఓ స్త్రీ రేపురా"-- అని ఇళ్ళ తలుపుల మీద వ్రాసి అందర్నీ భయపెట్టిన సంఘటన ఒకటి పదేళ్ళ క్రితం జరిగింది. మనం వ్రాయకపోతే ఆ స్త్రీ మన ఇంట్లోకి వస్తుందేమో అని భయపడి ప్రతిఒక్కరూ వాళ్ళ తలుపులమీదా  గోడలమీదా "ఓ స్త్రీ రేపురా"-- అని వ్రాసుకునే వాళ్ళు.  

మనిషి బలహీనతల మీద ఆడుకునే ఆటల్లో ఇవొక రకమైన ఆటలు. ఇలాటి ఆట క్రిస్టియన్లకు బాగా అలవాటు. మనం రోడ్డుమీద పోతుంటే కార్ల మీదా ఆటోల మీదా Jesus Never Fails అని వ్రాసి ఉండటం చూస్తాము. ఎవరైనా ఏదైనా బాధలో ఉంటె వారొచ్చి "యేసును నమ్ముకోండి, ఈ బాధలు ఎగిరిపోతాయి" అని చెప్తూ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేస్తూ ఉంటారు. యేసుని నమ్ముకోకపోయినా బాధలు ఎల్లకాలం ఎవరి దగ్గరా నివాసం ఉండవు. కాని ఆ సంగతి తెలియని అమాయకులూ, డబ్బుకు ఆశపడే వాళ్ళూ ఆ మాటలు నమ్మి కొన్నాళ్ళు వాళ్ళు చెప్పినట్లు చర్చికి పోయి ప్రార్ధనలు చేస్తారు. ఈ లోపల ఆ భాధలు ఎలాగూ పోతాయి. "చూశావా నువ్వు యేసుని నమ్మినందువల్ల బాధలు పోయాయి"-- అని ఇంకా మెస్మరైజ్ చేసి వీళ్ళని మతం మార్చేస్తారు. ఈ మారిన వాళ్ళకూ పూర్తిగా నమ్మకం ఉండదు. ఏ మూలో, "నువ్వు చేసింది తప్పు" అని మనసు చెబుతూనే ఉంటుంది. దాని కప్పి పుచ్చుకోడానికి వీడు ఇంకొందరికి ఇవే మాయమాటలు చెప్పి వాళ్ళ మతం మార్చి, తానూ చేసినపని కరెక్టే అని తనను తాను మభ్యపెట్టుకుంటాడు.  ఇదొక చైన్ రియాక్షన్ లా కొనసాగుతుంది. పైగా ఎర వెయ్యడానికి విదేశాలనుంచి తేరగా  వచ్చిపడే డబ్బు ఎలాగూ ఉండనే ఉంది.

తాము దిగిన ఊబిలోకి ఇతరులను కూడా దించి తద్వారా వాళ్ళ అభద్రతా భావాన్నించి కృతకమైన రిలీఫ్ పొందటమే వీళ్ళందరూ చేస్తున్న పని. అంతేకాని జీససూ సాయిబాబా  వీళ్ళ జీతగాళ్ళేమీ  కాదు. మనం చేస్తున్న బోడిపూజలకు, దొంగప్రార్ధనలకు ఆశపడి, ప్రతి వెధవపనినుంచీ మనల్ని  రక్షిస్తూ కూచోటానికి వాళ్ళేమీ మనలాగా పనీపాటా లేని వాళ్ళు కారు. అసలు వాళ్ళెక్కడున్నారో, ఈ ప్రార్ధనలు వాళ్ళని చేరుతున్నాయో లేదో,  ఎవరికీ తెలియదు. ఈలోపల వాళ్ళ పేరుచెప్పి  మన బిజినెస్స్ మాత్రం నిరాఘాటంగా సాగుతూ ఉంటుంది.

ఈ క్రిశ్టియన్ల పద్ధతినే ఇప్పుడు షిర్డీ సాయిబాబా భక్తులు కూడా కాపీ కొడుతున్నారు. కాని ఇది సరియైన మార్గం కాదు అన్నసంగతి వాళ్ళు తెలుసుకోలేక పోతున్నారు. ప్రచారం ద్వారా దేవుడి మీద నమ్మకం కలిగించడం కాదు అసలు కావలసింది. వాళ్ళు జీవిస్తున్న విధానం ద్వారా ఇతరులలో నమ్మకం కలిగించాలి. నీతులు చెప్పటం ద్వారా కాకుండా, వాటిని ఆచరించి చూపడం ద్వారా లోకాన్ని ప్రభావితం చెయ్యవలసి ఉంది. జీసస్ గురించి ప్రచారం అక్కర్లేదు. ఆయన చెప్పింది ఆచరిస్తే చాలు. సాయిబాబాకు గుళ్ళూ గోపురాలూ బంగారు కిరీటాలూ అక్కర్లేదు. ఆయన చెప్పింది ఆచరిస్తే చాలు. ఆ పని మాత్రం ఎవ్వరూ చెయ్యరు. ఈ పై పై పటాటోపాలు, ప్రచారాలు మాత్రం బాగా చేస్తుంటారు. ఒకవేళ ఆ జీససూ సాయిబాబా ఎప్పుడైనా ఈలోకానికి వస్తే, వాళ్ళ సోకాల్డ్ భక్తుల్ని చూసి వాళ్ళే చీదరించుకుంటారు. ఈ విషయం అర్ధమైతే ఆధ్యాత్మిక మార్కెటింగ్ చేస్తున్నవాళ్ళ నోళ్ళు మూతపడతాయి.

అప్పటి వరకూ saibaba never fails లాటి మెసేజీలు మొబైల్స్ లో వస్తూనే ఉంటాయి. ఇదొక రకమైన పిచ్చివ్యవహారం . వీళ్ళందరికీ నేనొక్కటే చెబుతుంటాను. మీరు చెప్పేది నిజమే Jesus never fails, Sai baba never fails... Because they never went to any school and never sat for any exam. So the question of failing does not arise. ఇప్పటి కాలపు పరీక్షలు వ్రాసి చూడమనండి, వాళ్ళు పాసవుతారో ఫెయిలవుతారో తెలుస్తుంది.
read more " Jesus Never Fails - Sai Baba Never Fails. "

8, మే 2011, ఆదివారం

విచిత్ర దినాలు

ఈ రోజు "మదర్స్ డే" అని తెలిసింది. ఈ మధ్యన మన దేశంలోకూడా ఈ దినాల విషసంస్కృతి బాగా పాతుకుపోతున్నది. మీడియా పుణ్యమా అని ఈ విషం త్వరత్వరగా సమాజంలో వ్యాపిస్తున్నది. దీనివెనుక పాశ్చాత్య క్రైస్తవ కుట్ర ఉందేమో అన్న అనుమానంలో నిజం లేకపోలేదు.

అనేక దేశాల సంస్కృతులనూ పండుగలనూ ఆచారాలనూ చాపకింద నీరులా నిర్మూలించడంలో క్రైస్తవానికి అతిగొప్ప పేరుంది. దానిలో భాగమే ఈ దినాల గోల అని నాకు గట్టి సందేహం. మన దేశంలో ముఖ్యమైన అనేక పండుగలు పర్వ దినాలూ మూలపడ్డాయి. కాని పాశ్చాత్య రోగాలైన ఫాదర్స్ డే, మదర్స్ డే, మొ|| మాత్రం మన జీవితాల్లో వేగంగా ప్రవేశిస్తున్నాయి. దాని ఫలితమే ఈరోజున పిల్లలు తల్లులతో ఫోటోలు దిగటం, వాళ్లకు బహుమతులివ్వటం, విషెస్ చెప్పటం. రేపు మళ్ళీ ఇంకో దినానికి రెడీ అవ్వటం. ఏంటో ఈ కాకిగోల?

పాశ్చాత్య దేశాల్లో మాతృత్వానికి విలువ లేదు. వారి దృష్టిలో స్త్రీ ఒక భోగ్య వస్తువు. అంతే. కాని మన ప్రాచీన సంస్కృతి స్త్రీని జగన్మాత ప్రతిరూపంగా తలచింది. మన ఆచారాలలో తల్లికి అత్యున్నతమైన స్థానం ఉన్నది. " తల్లి సంతోషిస్తే సమస్త దేవతలూ సంతోషిస్తారు " లాంటి మహత్తరమైన వాక్యాలు మన వాజ్మయంలో చాలాచోట్ల దర్శనమిస్తాయి.

పాశ్చాత్యులు తల్లిని మదర్స్ డే ఒక్క రోజునే తలచుకుంటారు. అదీ ఒక మొక్కుబడి లాగా మాత్రమే. తరువాత చక్కగా మరచిపోతారు. కాని వేదాలను అనుసరించే మనం ప్రతిరోజూ నాలుగు సంధ్యల్లోనూ క్రమం తప్పక చేసే దైవప్రార్దనలో భాగంగా పితృదేవతలనూ, ముఖ్యంగా తల్లితండ్రులనూ భక్తి పూర్వకంగా స్మరిస్తాము. ఈ దేహాన్ని మనకు ఇచ్చిన దైవాలుగా వారిని భావించి కృతజ్ఞతగా అంజలి ఘటిస్తాము. వారి మాట వేదవాక్కుగా పాటిస్తాము. ఇదీ మనకూ పాశ్చాత్యులకూ మధ్యన గల తేడా.

ఈ రోజు ఉదయం నాకు తెలిసిన ఒక టీనేజి యువకుణ్ణి " నేటి ప్రాముఖ్యత ఏమిటి" అని అడిగాను.

"టుడే ఈస్ మదర్స్ డే" అని ఇంగ్లీషులో చెప్పాడు.

నాకు చాలా బాధనిపించింది.

"ఆది శంకరుల" పేరు విన్నావా? అని అడిగాను.

" విన్నాను " అని కాజువల్ గా జవాబిచ్చాడు.

"ఆయన జన్మించిన మహత్తరమైన రోజు ఈ రోజు." అని చెప్పాను.

నేటి యువతకు మన మహాపురుషుల గురించి తెలీదు. కొందరికి చూచాయగా తెలుసు, కాని వారేమి చెప్పారు? వారి జీవితాలు ఎంత మహత్తరంగా, జాజ్వల్యమానంగా గడిచాయి? అన్న విషయాలు తెలీదు. తెలుసుకోవాలని ప్రయత్నమూ లేదు. పాశ్చాత్య వ్యామోహాల మత్తులో పడి కొట్టుకుపోతున్నవారికి తమవైన ఉన్నతసంస్కృతీ మూలాలు ఎలా తెలుస్తాయి?


ఆది శంకరుల మహత్తర మేధా శక్తి ఎంతటి గొప్పదో, సూక్ష్మమైనదో తెలుసుకోవాలంటే ఆయన వ్రాసిన భాష్యాలూ గ్రంధాలూ చదవాలి. అప్పుడు గాని ఆయన యొక్క మేధస్సూ ఆత్మశక్తీ మనకు అర్ధం కావు. హిందువులకున్న రుణాల్లో రుషిఋణం ఒకటి. అది తీరాలంటే మన ప్రాచీన గ్రంధాలను చదివి అర్ధం చేసుకుని వారికి అంజలి ఘటించడమే మార్గం. ఆచరణ లో పెట్టడం తరువాత సంగతి, కనీసం వారు చెప్పినది అర్ధం చేసుకునే ప్రయత్నం చెయ్యకపోవడం మన జాతిచేసుకున్న దౌర్భాగ్యాల్లో ఒకటి. శంకరుల వంటి మహనీయుడు పాశ్చాత్యదేశాల్లో పుట్టి ఉన్నట్లయితే ఆయన్ను ఒకవిశ్వప్రవక్తగా నిలబెట్టి ప్రపంచమంతా ఆయన భావజాలాన్ని వ్యాపింప చేసి ఉండేవారు. మనమో? మన మధ్యన ఎందరుమహనీయులు పుట్టినా మనకు చీమ కుట్టినట్లు కూడా ఉండదు.

శంకరులు మహా జ్ఞాని అన్నది వాస్తవం. ఆయనది ఉత్త మేధా శక్తి కాదు. ఆధ్యాత్మిక సాధనా, అనుభవ జ్ఞానమూ, గొప్పపాండిత్యమూ ఆయనలో సామరస్య పూర్వకంగా మిలితమైనాయి. ఆయన జ్ఞానే కాని, అంత మాత్రం చేత కర్మనూ, భక్తినీ, యోగాన్నీ , తంత్రాన్నీ నిరసించలేదు. వాటి విలువ వాటికుంది. కాని జ్ఞానం సర్వోత్తమం అనీ, జ్ఞానమే మనిషికళ్ళు తెరిపిస్తుంది అనీ, సత్యాన్ని ముఖాముఖి దర్శింప చేయ గలుగుతుంది అనీ ఆయన చెప్పారు. అది వాస్తవంకూడా. ఆయన వ్రాసిన మహత్తరమైన గ్రంధాలూ, భాష్యాలూ పదహారేళ్ళ వయసులోనే వ్రాసి పూర్తిచేసారన్న సంగతి గుర్తుంచుకుంటే మన కళ్ళు గిర్రున తిరుగుతాయి.

శంకరుల గురించి రాధాకృష్ణన్ పండితుడు ఏమన్నాడో చూద్దామా?

‘The Advaitism of Shankara is a system of great speculative daring and logical subtlety .Its austere intellectualism, its remorseless logic, which marches on indifferent to the hopes and beliefs of man, its relative freedom from theological obsessions, make it a great example of a purely philosophical scheme.

It is impossible to read Shankara’s writings, packed as they are with serious and subtle thinking, without being conscious that one is in contact with a mind of a very fine penetration and profound spirituality. With his acute feeling of the immeasurable world his stirring gaze into the abysmal mysteries of the spirit, his unswerving resolve to say neither more nor less than what could be proved, Shankara stands out as a heroic figure of the first rank in the somewhat motley crowd of the religious thinkers of medieval India ....

అపూర్వ మేధాసంపన్నులనూ మహనీయమూర్తులనూ కులాలకూ మతాలకూ పరిమితం చేసి వాళ్ళు కొందరిమనుషులు, మనకు సంబంధం లేదు, అని అనుకుంటూ వారి భావాలనూ బోధలనూ నిర్లక్ష్యం చెయ్యడం మనభారతీయులకు పట్టిన దురదృష్టం అని నా భావన.

ఆదిశంకరుల వంటి అద్బుతమూర్తిని స్మరిస్తూ, ఆయన వ్రాసిన అనేక మహత్తర గ్రంధాలలో నుంచి కనీసం "వివేక చూడామణి ", "ఆత్మబోధ " వంటి చిన్న చిన్న గ్రందాలనైనా రోజు చదివి ఆయన చెప్పినది ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చెయ్యటం భారతీయులుగా మన కనీస కర్తవ్యం .
read more " విచిత్ర దినాలు "

5, మే 2011, గురువారం

భస్మాసుర హస్తం

గత రెండు రోజులుగా ఒక ఫన్నీ మెసేజి మొబైల్స్ లో సంచారం చేస్తున్నది.

"పాకిస్తాన్ లో ఎవరికీ రక్షణ లేదు. చివరికి లాడెను క్కూడా. ఇండియాలో ఎవరికీ ప్రమాదం లేదు. చివరికి కసబ్ క్కూడా.  "

చూట్టానికి ఫన్నీగా తోచినా, ఈ మేసేజిలో ఉన్న సత్యం ఎవరూ కాదనలేనిది. మనకొక పురాణకధ ఉంది. అందులో భస్మాసురునికి శివుడు వరమిస్తే, ఆ అసురుడు చివరికి ఆ చెయ్యిని శివునిమీదేపెట్టబోతే విష్ణువు మోహినీ అవతారంలో అసురుణ్ణి మోహింపచేసి తన నెత్తిన తానే చెయ్యేసుకుని బూడిదగా మారేటట్లుచేసి కధసుఖాంతం చేస్తాడు. ఇది పురాణగాధ.

మోడరన్ భస్మాసురుల్లో భింద్రన్ వాలేనూ, ప్రభాకరన్నూ, బిన్ లాడెన్నూ ప్రముఖంగా చెప్పుకోవాలి. ఇందిరా గాంధీ పెంచి పోషించిన భింద్రన్ చివరికి ఆమె చావుకే కారకుడయ్యాడు. తమిళ పులుల్ని పెంచినందుకు అవి రాజీవుని చావుకు కారణమయ్యాయి. లాడెన్ను పెంచిన పాపానికి అమెరికా అధ్యక్షులెవరూ ఆపదలో చిక్కుకోక పోయినా, వేలాది అమాయకులు మాత్రం ట్విన్ టవర్స్ పేల్చివేతలో బలయ్యారు. మనదేశంలో వేలాదిమంది ఈ రాక్షసి చేతిలో బలైపోయారు. కాని మోడరన్ భస్మాసురున్ని, పెంచి, పోషించి, వరమిచ్చిన అమెరికా మాత్రం అతన్ని చివరికి పదేళ్ళ సుదీర్ఘ వేటలో వెంటాడి మట్టుబెట్టింది.  

ఈ క్రమంలో పాకిస్తాన్కూ అమెరికాకూ విభేదాలు రావటం ఖాయం. ఇన్నాళ్ళూ పాకీని నమ్ముతున్నట్లు నటిస్తున్న అమెరికా ఇక బయటపడక తప్పదు. కాని పాకీదేశం మాత్రం తెలివిగా చైనాతో స్నేహాన్ని బాగా గట్టి చేసుకుంటున్నది. ఇకపోతే భారత ఉపఖండంలో ఇంకే దిక్కూ లేదుగనక, అమెరికా మన దేశంతో దగ్గర కాక తప్పదు. పవర్ ఈక్వేషన్స్ లో వస్తున్న మార్పులు జాగ్రత్తగా గమనిస్తే, భవిష్యత్తులో చైనా పాకీ భాయిభాయి, అమెరికా ఇండియా భాయీభాయి అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అదలా ఉంచితే, లాడెన్ను మట్టుబెట్టింది అమావాస్య ఘడియలకు అతిదగ్గరలో అర్ధరాత్రిపూట కావటం గమనార్హం. దీపావళి అమావాస్య నరకాసుర సంహారానికి గుర్తుగా మిగిలిపోతే, చైత్ర అమావాస్య లాడెన్ పీడ విరగడ అయినందుకు గుర్తుగా మిగిలింది.  

లాడెన్ పోయాడని ప్రపంచం సంబరాలు చేసుకోవలసిన పని లేదు. అతను విడిచిపెట్టి పోయిన విషం అన్ని దేశాల్లోనూ విష వృక్షాలను, విష సర్పాలనూ సృష్టించింది. ఆ వృక్షాలకు కాస్తున్న ఫలాలు చాలా ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకుంటే సమస్య శాశ్వతంగా పరిష్కారం అయినట్లు ఏమీ కనిపించటం లేదు. ముందుముందు ఆ సర్పాలు పెరిగి పెద్దవై ఎవర్ని ఎక్కడ కాటేస్తాయో ఎవరికీ తెలియదు. నిరంతరజాగరూకతా, చిత్తశుద్దులే ఏదేశపు ప్రజలకైనా ప్రభుత్వాలకైనా శ్రీరామరక్ష. అవి లేనంతవరకూ,ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీ కానంతవరకూ,ఓటుబ్యాంకు రాజకీయాలు పోనంతవరకూ ప్రమాదపు అంచునే ప్రజాజీవనం సాగక తప్పదు.
read more " భస్మాసుర హస్తం "