“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

18, మే 2011, బుధవారం

జిడ్డు కృష్ణమూర్తి జీవితం-ఒక పరిశీలన

గత వందసంవత్సరాలలో ప్రాచ్య పాశ్చాత్య తాత్విక చింతనను ప్రభావితం చేసిన దార్శనిక యోగులలో జిడ్డుకృష్ణమూర్తి  పేరు ప్రధమస్థానంలో నిలుస్తుంది.  అలాగే, చూస్తున్న కాసేపు అద్భుతంగా ప్రభావితం చేసి తరువాత ఏమీ గుర్తుండని  ఇంద్రజాల ప్రదర్శనలాగా ముగిసిన తాత్వికుని పేరు చెప్పమన్నా ఈయన పేరే గుర్తొస్తుంది. సత్యాన్ని విడవకుండా ఉండటంలోనూ, అవసరమైతే దానికోసం దేనినైనా పరిత్యజించడంలోనూ ఆయన చూపిన తెగువ అనన్య సామాన్యం. ఆయన త్యాగం బుద్ధుని త్యాగమంత గొప్పది అని, నా అభిప్రాయం.

జిడ్డు కృష్ణముర్తి, రమణ మహర్షి, రజనీష్ ఈ ముగ్గురిదీ ఒకటే తత్త్వం. ప్రాధమికంగా వీళ్ళు ముగ్గురూ జ్ఞానులు. వీళ్ళలో మళ్ళీ సున్నితమైన తేడాలున్నాయి. మహర్షి సాంప్రదాయజ్ఞాని. ఆయన విధానం ప్రాచీనం. సాంప్రదాయ బద్ధం. రజనీష్ అత్యంత స్వేచ్చావాది. నవీనకాలానికి కావలసిన ధ్యానవిధానాల రూపకర్త. ప్రాచీనులకు ప్రాచీనుడు నవీనులకు నవీనుడు. ఇకపొతే జిడ్డు, ప్రాచ్య జ్ఞానమార్గానికీ, టిబెటన్ మార్మికతంత్రానికీ, పాశ్చాత్య తత్వశాస్త్రానికీ కలగలుపు అయిన తియోసాఫీలో నలిగి విసిగి వేసారి, శుద్ధ జ్ఞానం వైపు మళ్ళిన సత్యప్రేమికుడు అని చెప్పవచ్చు.

జిడ్డు కృష్ణమూర్తి 12 -5 -1895 న 00 -22 గంటలకు మదనపల్లె లో జన్మించాడు. ఆయన జాతకాన్ని ఇక్కడ ఇస్తున్నాను. ముందుగా ఆయన జాతకం లోని కొన్ని యోగాలను పరిశీలించి తరువాత ఆయన జీవితంలోని సంఘటనలనూ ఆయన తత్వాన్నీ జ్యోతిష్య శాస్త్ర రీత్యా పరిశీలిద్దాం.

సహజ రాశి చక్రంలోని దశమ స్థానం మకరం. సహజ కర్మ స్థానం గనుక ఈ రాశిలో కర్మ క్షాళన తత్పరులైన  ఉత్తమ జీవులు జన్మించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కర్మక్షయం చేసుకొని జీవిత పరమగమ్యం వైపు పట్టుదలగా ప్రయాణం సాగించే సాధకులకు ఈరాశిలో జన్మ కలుగుతూ ఉంటుంది. కర్మభూమి అయిన మన భారత దేశం కూడా మకర రాశితోనే సూచింపబడుతూ  ఉండటం గమనార్హం. మొరాయిస్తున్న వెనుక భాగాన్ని ప్రయాసతో ఈడ్చుకుంటూ, గమ్యం మీద దృష్టితో బాధను లెక్క చెయ్యకుండా మొండిగా ముందుకే సాగిపోయే సగం మృగం  సగం  జలచరం అయిన మకర స్వరూపాన్ని చక్కగా గమనిస్తే ఈ రాశి జాతకుల స్వభావం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది.  

లగ్నాధిపతి అయిన శని దశమంలో చరరాశిలో  ఉచ్ఛస్తితిలో బలవంతుడై ఉండటం ఆయన నిరంతర కర్మ శీలతను సూచిస్తుంది. అందుకే ఆయన ఎప్పుడూ ఒక చట్రంలో బంధింపబడటాన్ని  వ్యతిరేకించేవాడు. నిరంతర అన్వేషణకూ, అంతఃప్రపంచంలో విసుగులేని పరిశీలనా పూర్వక చలనశీలతకూ ఆయన ప్రాధాన్యతనిచ్చాడు.  కాని ఆ శని వక్రించి ఉండటం వల్ల -- ఈయనకు లోకంతో కర్మశేషం చాలా మిగిలి ఉందన్న విషయం కనిపిస్తున్నది. అందుకే తన దర్శనాన్ని లోకానికి చెబితే -- ఎవరైనా దాన్ని అర్ధంచేసుకుని ఆ అనుభూతిని వారుకూడా పొందుతారేమో -- అనే ఆశతో జీవితమంతా ప్రసంగాలు ఇస్తూనే గడిపాడు. కాని ఆయన ఆశ నెరవేరినట్లు కనిపించదు. ఏ మహాపురుషుని ఆకాంక్ష అయినా సరే ఈ ప్రపంచంలో నెరవేరడం అనేది ఎన్నటికీ జరుగదు. ఈ ప్రపంచపు  చిక్కని చీకటిని కరిగించడానికి ఒక్క కొవ్వొత్తి సరిపోదు. ఆ ప్రయత్నంలో కొవ్వొత్తి కరిగిపోతుంది కాని చీకటి తరిగిపోదు. అలాగని కొవ్వొత్తి తన ప్రయత్నం ఆపడమూ చెయ్యదు. అదే ఈ ప్రపంచపు మాయాపూరిత మైన లీల.

లగ్నారూడమైన మేషంలో అష్టమాధిపతి (లగ్నారూడాత్ మంత్ర స్థానాధిపతి) యగు ఉచ్ఛరవి స్తితివల్ల కూడా ఈయన నిగూఢజ్ఞాని అన్న విషయం తెలుస్తున్నది. 

మహనీయుల జాతకాలలో శనిచంద్రుల పరస్పరసంబంధం నేను గమనించిన నిర్దుష్టమైన సూత్రాలలో ఒకటి. వివేకానందాది మహాపురుషుల జాతకాలలో ఈ సంబంధం స్పుటం గా కనిపిస్తుంది. దీనివల్ల జాతకునికి లౌకిక విషయాలలో నిర్లిప్తతా, అంతర్ముఖత్వమూ, వైరాగ్యమూ స్థిరంగా కలుగుతాయి. జిడ్డు గారి జాతకంలో కూడా ఈ విలక్షణతను  మనం గమనించవచ్చు. వక్రించిన శని దృష్టి ద్వాదశ చంద్రునిపైన ఉండటం వల్ల, చంద్రునికి సప్తమాదిపత్యం కలగటం వల్లా, ఈయనలోని కామవాసనలు నిగ్రహింపబడ్డాయని తెలుస్తుంది. 

లోకం యొక్క బాధలను తనమీద ఆరోపించుకొని ఆ బాధల నుండి లోకంలోని జీవులను విముక్తం చెయ్యాలన్న తాపం ఇటువంటి శని చంద్రుల సంబంధం ఇస్తుంది. ఈ యోగం అనేక మంది బోధిసత్వుల జాతకాలలో మనం చూడవచ్చు. వారు తమ మోక్షం తాము చూచుకొని,  లోకాన్ని పట్టించుకోని ఏకాంతయోగుల కోవకు చెందినవారు కారు. లోకంలోని దుఖం తో మమేకమైన హృదయంతో లోక పరితాపాన్ని తీర్చాలని తపన పడేవారు అయి ఉంటారు.

మోక్ష త్రికోణం అయిన 4 -8 -12 ఇరుసు ఈయన జాతకంలో విలక్షణం గా కనిపిస్తుంది. నాలుగింట ఉచ్ఛ స్థానంలో ఉన్న అష్టమాదిపతీ, ఆత్మజ్ఞాన కారకుడూ అయిన గ్రహరాజు సూర్యుడు, ఎనిమిదింట ఆధ్యాత్మికతకూ మార్మిక జ్ఞానానికీ కారకుడైన కేతువూ, పన్నెండింట మనః కారకుడూ కామ భావాదిపతీ అయిన క్షీణ చంద్రుడూ స్తితులై ఉండటం చూస్తే, ఈయన ఒక జ్ఞాని అన్న విషయం కనిపిస్తుంది.   
   
కామాదిపతి అయిన చంద్రుని క్షీణ స్థితి వల్లా, ద్వాదశ స్థితివల్లా, కామవాసనలు క్షీణ స్థితిలో ఉంటాయి. ఈ చంద్రునిపైన గురువు, శని , కేతువుల దృష్టి ఉన్నది. గురువువల్ల-- సాంప్రదాయ ఆధ్యాత్మిక జ్ఞానమూ,  గురుత్వమూ, శనివల్ల-- వైరాగ్యమూ, ఏకాంతాభిలాషా, కేతువువల్ల--మార్మిక జ్ఞానమూ, అతీన్ద్రియానుభూతీ  ఈయనలో కలగలిసి ఉంటాయి అని తెలిసిపోతున్నది.

ఇక విమ్శాంశ చక్రాన్ని పరిశీలిద్దాం.

బుద్ధికారకుడైన బుధుని మిధున లగ్నం కావడమూ, భావ వ్యక్తీకరణకు సూచిక అయిన సహజ తృతీయస్థానం కావడమూ, ఈయన బోధనలు బౌద్ధిక స్థాయిలో ఉంటాయి అన్న విషయం సూచిస్తున్నాయి. పంచమ స్థానంలో ఉచ్ఛ శని, నీచ రవుల వల్ల ఒక విచిత్ర పరిస్తితి తలెత్తుతున్నది. ఇందులో మళ్ళీ శని వక్రీకరణ ఒక చిక్కు ముడి. శనికి పట్టిన అష్టమ నవమాదిపత్యం వల్ల, ఉచ్ఛ స్థితి వల్లా ఉన్నత ఆధ్యాత్మిక స్థాయి సూచితం అవుతున్నది. వక్రత వల్ల అంతర్ముఖత్వం సూచితం అవుతున్నది.లాభ స్థానం నుంచి వీరిపైన గురు బుధుల దృష్టి వల్ల, ఈయన సాధనా బోధనా అంతా శుద్ధ జ్ఞానమయం అన్న సత్యం వెంటనే స్పురిస్తున్నది. తృతీయ అధిపతి అయిన రవి నీచత్వ బలహీనత వల్ల, ఈయన చెప్పేది లోకులకు అస్సలు అర్ధం కాదు అన్న విషయం తెలుస్తున్నది. అలాగే జరిగింది కూడా. అందుకే ఈయన పడక్కుర్చీ వేదాన్తులకూ, ఆచరణలేని ఊకదంపుడు ఉపన్యాసకులకూ ఆరాధ్యుడిగా మిగిలిపోయాడు.  

ఇక్కడ ఇంకొక్క విషయం ప్రస్తావించాలి. నవాంశలో ఒక విచిత్ర యోగం ఈయన జాతకంలో ఉన్నది. అదే గురువు యొక్క నీచత్వం. దీనినుంచి రెండు విషయాలు రాబట్టవచ్చు.

ఒకటి- ఈయన  విజయవంతమైన గురువు కాదు. అంటే, ఈయన తత్త్వం ఎంత అద్భుతంగా ఉన్నప్పటికీ, లోకాన్ని ఉర్రూతలూగించి ఈయనకు మంచి తత్వవేత్త అన్న బిరుదునూ ఖ్యాతినీ ఆర్జించి పెట్టినప్పటికీ, ఈయన మార్గాన్ని అనుసరించి జీవితపరమగమ్యాన్ని చేరినవారు లేరు. ఈ విషయాన్ని ఆయనే తన జీవిత చరమాంకం లో ఒప్పుకున్నాడనీ, లోకులకు తాను చెప్పినది ఎక్కలేదన్న నిరాశతోనే ఆయన తనువు చాలించాడనీ ఆయన జీవితాన్ని పరిశీలించిన వాళ్ళు చెప్తారు. అంటే ఈయన మంచి గురువు కాదన్నమాట. 

రెండు- ఈయన గురువులు పరిపూర్ణ సిద్ధ గురువులు కారు. లెడ్ బీటరూ, అనీబెసంటూ జీవితాలు చదివితే ఆ సంగతి స్పష్టంగా తెలుస్తుంది. అందుకే తియాసఫీ అనేది  ప్రపంచానికి గొప్ప ఆధ్యాత్మికమైన మేలును చెయ్యలేకపోయింది. ఒక నిష్ఫలపదకోశ భాండాగారం గా మిగిలిపోయింది.

వచ్చే పోస్ట్ లో ఆయన జీవితాన్నీ, తత్వ చిన్తననూ వరుసగా పరిశీలిద్దాం.