“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

30, సెప్టెంబర్ 2021, గురువారం

ఆట

ఎన్నోమెట్లను దిగుతూ

వచ్చానీ ఆటలోకి

ఆడి ఆడి అలసిపోయి

పోబోతున్నా ఇంటికి


ఇష్టంగానే దిగాను

ఇష్టంకాని ఊబిలోకి

కష్టమైనా నష్టమైనా

మింగేశా లోలోనికి


అలవాట్లూ అగచాట్లూ

పొరబాట్లూ వెన్నుపోట్లు

సర్దుబాట్లు అనుకుంటూ

నా ఆటను ఆడాను


ఆటకు అంతం లేదని

గెలుపు శాశ్వతం కాదని

ఆటే ఒక భ్రమ అని

త్వరగానే గ్రహించాను


మొదలైన ఈ ఆటను

మధ్యలోనే ఆపలేను

ఆట ముగిసిపోవాలి

ఇల్లు చేరుకోవాలి


చూస్తున్నా ముగింపు కోసం

ఆటను ముగించే తెగింపు కోసం

ఇంకెందుకు కలవడం నేస్తం?

మళ్ళీ మళ్ళీ విడిపోవడం కోసం?

read more " ఆట "

పనిలేని పయనం

మహాలయపు రోజులలో 

మరుగుపడిన గతమంతా

మళ్ళీ మనసును తడుతూ

మారాకులు తొడిగింది


అదే రంగస్థలంపైన

అవే రంగులద్దుకుంటు

సాగే వేరొక నాటిక

కనులముందు నిలిచింది


ఎగుడుదిగుడు దారులలో 

ఎన్నో సుడి మలుపులలో

పయనించే బ్రతుకునావ

ఎటో సాగిపోతోంది


అపరిచితుల లోకంలో

అంతులేని పయనంలో

అయోమయపు పిచ్చిమనసు

అలసిపోయి తూలింది


కపటనగర వీధులలో

కలల విపణి దారులలో

కరువు యాచనెందుకంటు

కంటినీరు తొణికింది


పగలూ రాత్రులనెన్నో

పరికించిన ఈ హృదయం

పనికిరాని పయనాన్నిక 

పాతరెయ్యమంటోంది


లెక్కలేని మజిలీలను

తట్టుకున్న ఈ బిడారు

మరుమజిలీ వద్దంటూ

పాదాలను పట్టుకుంది

read more " పనిలేని పయనం "

21, సెప్టెంబర్ 2021, మంగళవారం

మహంత్ నరేంద్ర గిరి మరణం - ఇది ఆత్మహత్యేనా?

Anand Giri - Narendra Giri
ప్రయాగ రాజ్ లో ABAP ( అఖిల భారతీయ అఖారా పరిషత్) అధ్యక్తుడు మహంత్ నరేంద్ర గిరి ఉరిపోసుకుని చనిపోయారని వార్త.  అయిదు  పేజీల సూయిసైడ్ నోట్ వ్రాసిపెట్టి మరీ ఆయన చనిపోయాడు. బాగంబరి గడ్డి మఠానికి ఈయన అధిపతే గాక, బడే హనుమాన్ మందిరానికి మహంత్ కూడా. ఈయన శిష్యుడైన స్వామి ఆనంద్ గిరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకొక ఇద్దరు శిష్య పరమాణువులు పరారీలో ఉన్నారు.

ఈయన శిష్యుడైన స్వామి ఆనంద్ గిరికిప్పుడు 40 ఏళ్ళు. ఇతనికి పన్నెండేళ్ల వయసులో, హరిద్వార్ లో తన గురువైన స్వామి నరేంద్ర గిరిని కలిశాడు. అప్పటినుంచీ ఆయన శిష్యరికంలో ఉంటూ, నేటికి ఉప మహంత్ అయ్యాడు. స్వామి అయినప్పటికీ, తన కుటుంబంతో సన్నిహిత  సంబంధాలను కలిగి ఉన్నాడు. ఈ విషయమై, స్వామి నరేంద్రగిరి ఈయనను మందలించినట్లు తెలుస్తోంది. అంతేగాక, హనుమాన్ ఆలయం ఫండ్స్ ని దుర్వినియోగం  చేస్తున్నాడని, అలా చెయ్యవద్దని కూడా గురువైన నరేంద్రగిరి, తన శిష్యుడైన ఆనందగిరిని మందలించినట్లు వార్త. ఇంత చెప్పినా, వినక, గురువుపైననే తిరిగి ఆరోపణలు మోపాడు ఆనందగిరి. ఆశ్రమం నుండి ఆనందగిరిని బహిష్కరించాడు నరేంద్రగిరి. ఆ తరువాత లిఖితపూర్వకంగా క్షమాపణ కోరిన ఆనందగిరిని క్షమించి, మళ్ళీ ఆశ్రమంలోకి తీసుకున్నాడు. ఇదంతా గత చరిత్ర. ప్రస్తుతం ఇలా అనుమానాస్పద పరిస్థితులలో, అర్ధాంతరంగా చనిపోయాడు గురువైన మహంత్ నరేంద్ర గిరి.

శిష్యుడైన ఆనందగిరి యోగా శిక్షకుడు. ఈయన ఇండియాలోనూ, విదేశాలలోనూ యోగా నేర్పిస్తూ ఉంటాడు. పైగా కొంచం జల్సా మనిషిలా కనిపిస్తాడు. ఈ సంఘటన జరిగిన సమయానికి  ఇతను హరిద్వార్ లో ఉన్నాడు. పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేశారు.

తన మరణానికి, శిష్యుడైన ఆనందగిరి, ఇంకా ఇద్దరు శిష్యులూ కారకులని సూయిసైడ్ నోట్ లో వ్రాసి ఉంది. అది అబద్దమని, ఇదంతా కుట్రని ఆనందగిరి అంటున్నాడు. సర్వసంగపరిత్యాగి అయిన నరేంద్రగిరి ఆత్మహత్య చేసుకోవలసిన పనేమిటి? సన్యాసికి చావైనా బ్రతుకైనా ఒకటే కదా? పైగా ఆత్మహత్య మహాపాపమని మన ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి కదా ! ఒక మఠాధిపతి ఆత్మహత్యా? ఎంత విడ్డూరం? అసలేం జరిగింది?

ఇప్పుడు జ్యోతిష్యశాస్త్ర సహాయం తీసుకుందాం.

గురువు వక్రించి మకరంలోకి అడుగుపెట్టిన కొద్దిరోజులకే ఈ సంఘటన జరిగింది.  మకరం భారతదేశం  గనుక, గురువు మఠాధిపతులకు సూచకుడు గనుక, వక్రించి వక్రశనితో కలసి ఉన్నాడు గనుక, నీచస్థితిలో ఉన్నాడు గనుక, వివాదాస్పదమైన ఈ సంఘటన జరిగింది. చూచారా ఎంత కరెక్ట్ గా ఉంటాయో గ్రహప్రభావాలు?

గురుశిష్యులిద్దరివీ జాతకాలు మనకు తెలియవు. కనుక ప్రశ్నశాస్త్ర సహాయం తీసుకుందాం.

ప్రశ్న సమయం: 21 సెప్టెంబర్ 2021; ఉదయం 9. 42 గంటలు; హైదరాబాద్;

తులా లగ్నాధిపతి శుక్రుడు లగ్నంలోనే ఉన్నాడు కనుక లగ్నబలం ఉన్నది. ఆత్మహత్య కాదు. లగ్నానికి పాపార్గళం పట్టి ఉన్నది. ద్వాదశంలో రవికుజ ఉచ్చబుధులున్నారు. రవికుజులు దగ్గరగా ఉన్నారు. రవి ఏకాదశాధిపతిగా గుప్తశత్రువులను సూచిస్తాడు. అంటే, తనవారిగా నటిస్తూ తనకే గోతులు త్రవ్వెవారన్నమాట. బుధుడు అతితెలివిని సూచిస్తున్నాడు. రవి అధికారులను సూచిస్తున్నాడు. ద్వాదశం రహస్య కుట్రలను సూచిస్తున్నది. అంటే, పక్కలో బల్లాల్లాంటి, తెలివైన, అధికారం చేతిలో ఉన్న, శత్రువులని అర్ధం. ద్వితీయంలోని ఉచ్ఛకేతువు మళ్ళీ  కుజుని సూచిస్తూ, తన కుటుంబంలోనే ఉన్న బలమైన శత్రువుల వైపు వేలెత్తి  చూపిస్తున్నాడు. ఇది ధనస్థానం కావడంతో, లక్షలాది రూపాయల ఫండ్స్ దుర్వినియోగం కన్పిస్తున్నది. ఈ  ఇద్దరి మధ్యనా మహంత్ నరేంద్ర గిరి నలిగిపోయాడని గ్రహాలు చూపిస్తున్నాయి.

చతుర్దంలో ఉన్న వక్ర నీచ గురువు, వక్రశనుల వల్ల, ఇంటిపోరు, కుట్రలు, కుతంత్రాలు సూచితం అవుతున్నాయి. సాటి సాధువులు, ఆశ్రమ అధికారుల పాత్ర స్పష్టంగా కన్పిస్తున్నది. వారు వక్రించి తృతీయమైన ధనుస్సులోకి  రావడం, ఆయుస్సు దెబ్బతింటుందని సూచిస్తున్నది. గురువు మకరంలోకి వచ్చాకనే ఇది జరిగింది. గురువు షష్ఠాధిపతిగా, శత్రువైన మరొక మతగురువుకు సూచకుడు.

మనఃకారకుడైన చంద్రుడు షష్ఠంలో ఉంటూ, శత్రువుల కుట్రను సూచిస్తున్నాడు. ఈయన దశమాధిపతి కావడం వల్ల, ఆశ్రమంలో ఆధిపత్య పోరు ఈ మరణానికి కారణమని తెలుస్తున్నది.

అష్టమంలో ఉన్న ఉచ్చరాహువు కుట్రలకు, కుతంత్రాలకు, నాశనానికి సూచకుడు. ఈయన పంచమదృష్టి ద్వాదశంలో ఉన్న మూడు గ్రహాలపైన పడుతున్నది. కనుక, ఇదంతా పెద్ద కుట్ర అన్న విషయం స్పష్టంగా కన్పిస్తున్నది.

సప్తమంలో 20 డిగ్రీలలో ఉన్న యురేనస్, లగ్న డిగ్రీలైన 24 ను చాలా దగ్గరగా వీక్షిస్తూ, ఇది బలవన్మరణమని, హత్యేనని స్పష్టంగా సూచిస్తున్నాడు.

తృతీయంలో  పాపగ్రహాలు లేవుగాని, తృతీయానికి పాపార్గళం పట్టింది. కనుక జైమిని మహర్షి సూత్రం మళ్ళీ నిజమైంది. ఉరే మరణానికి కారణమైంది. అయితే, అది తను పోసుకున్నదా, పోయబడిందా అంటే, రెండోదే నిజమని అనిపిస్తున్నది.

నవాంశ చక్రాన్ని రాశితుల్య నవాంశ విధానంలో పరిశీలిద్దాము. రాశిలగ్నాత్ సప్తమంలో ఉన్న భయంకరమైన శపితయోగం వల్ల, మరణం తప్పదని తెలుస్తున్నది. రాశిలగ్నాన్ని కొట్టిన రాహుకేతువుల వల్ల హత్య అని గ్రహాలు చెబుతున్నాయి. దశమాధిపతి అయిన చంద్రునిపై సంచరిస్తున్న ఉచ్చ శుక్ర కుజులవల్ల, శిష్యులలో అమ్మాయిల గొడవలు, అనైతిక ప్రవర్తనలు ఉన్నాయని తెలుస్తున్నది.

ప్రశ్నదశ, శని-బుధ-కేతువుల దశ అయింది. శని వల్ల, ఆశ్రమంలో కుట్రలు, బుధుని వల్ల మతపరమైన లుకలుకలు, అతితెలివి కుట్రలు, కేతువు వల్ల ఇంటిలో (ఆశ్రమంలో) ఫండ్స్ దుర్వినియోగం స్పష్టంగా కన్పిస్తున్నాయి.

ఎలాంటి గొడవలకైనా  డబ్బు, అధికారం, అమ్మాయిలు ఈ మూడే కారణాలవుతాయి. అది కుటుంబమైనా, ఆశ్రమమైనా, దేశాలైనా ఇంకేదైనా సరే, ఈ సూత్రం మాత్రం మారదు. ఇది నేటిది  కాదు, మానవజాతి పుట్టిననాటినుండీ నడుస్తున్న చరిత్ర. ఈ చరిత్ర కూడా అదే. కామకాంచనాలకు ఎవరూ అతీతులు కారు, వారు దేవతలైనా సరే. ఒకవేళ అయ్యారంటే, వారు దేవతలకంటే అధికులే.

ఇంతకీ అసలు ప్రశ్నకు జవాబు చెప్పలేదేమంటారా? ఏంటా అసలు ప్రశ్న? ఈయనది హత్యా ఆత్మహత్యా అనేగా? చెప్పేశాను. మీకే అర్ధం కావడం లేదు.  ఇంత చెప్పాక కూడా ఇంకా చెప్పమంటే, ఇంకెంత చెప్పినా మీకర్ధం కాదని అర్ధం !

ఉంటా మరి !

read more " మహంత్ నరేంద్ర గిరి మరణం - ఇది ఆత్మహత్యేనా? "

20, సెప్టెంబర్ 2021, సోమవారం

మకరంలో వక్ర శని గురువులు - యూరప్, అమెరికాల పైన ప్రభావాలు

సెప్టెంబర్ 15 న వక్ర గురువు మకరంలోకి ప్రవేశించాడు. అప్పటికే అక్కడ వక్ర శని ఉన్నాడు. ఇద్దరూ మళ్ళీ మకరంలో కలుసుకున్నారు. అయితే, ఇద్దరూ వక్రస్థితిలో ఉన్నారు. వీరివల్ల, ధనుస్సుకు మళ్ళీ అర్గళం పట్టింది. పరోక్షంగా మిధునానికీ పట్టింది. ఇక, ప్రపంచరంగస్థలం మీద మళ్ళీ క్రొత్త నాటకాలు మొదలయ్యాయి. మళ్ళీ కాలదిక్సూచి యూరప్, అమెరికాల పైకి మళ్లింది.

హైతీ అనే కరీబియన్ ద్వీపదేశం మీకు గుర్తుండే ఉంటుంది. దీని ప్రెసిడెంట్ ని ఆ మధ్య హత్య చేశారు. తరువాత ఒక భయంకర భూకంపం ఈ దేశాన్ని కుదిపేశింది. అయితే, ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్న గొడవల మధ్యన హైతీ భూకంపాన్ని ఎవరూ పట్టించుకోలేదు. హైతీలోని నిరుపేద నల్లోళ్లు ఏమైతే ఎవరికెందుకు? ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ గడ్డం మావయ్య తుక్కు రేగ్గొడుతున్నాడు. ముందాసంగతి చూడాలి మరి !

ఆ హైతీనుండి, వేలాదిమంది పడవల్లో, నడుచుకుంటూ, రకరకాలుగా వచ్చి టెక్సాస్ బార్డర్ లోనుంచి అమెరికాలో ప్రవేశించాలని చూస్తున్నారు. డెల్ రియో అనే బ్రిడ్జి క్రింద వేలాది మంది వచ్చి తలదాచుకున్నారు. వాళ్లందరినీ కొంత తిండి పెట్టి, పాకెట్ మనీ కింద నూరు డాలర్లిచ్చి, మళ్ళీ విమానాలలో ఎక్కించి, మెక్సికోలో వదిలేస్తున్నారు అమెరికా వాళ్ళు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్లు కొట్టిన దెబ్బకి, దిక్కుతోచక మేముంటే, మధ్యలో మీ గోలేంటి? వెళ్లిపోండి, ఎవరినీ ప్రస్తుతం మా దేశంలోకి తీసుకోలేమంటూ బైడెన్ గారు హుకుం జారీ చేశారు.

మకరంలో ఉన్న గురుశనులు వక్రీకరణవల్ల ధనుస్సులోకి వచ్చినట్లు అవుతుంది. వారి సప్తమదృష్టి కూడా కర్కాటకం నుండి మిధునంలోకి వెళుతుంది. కర్కాటకం, వృశ్చికం, మీనం అనే మూడు రాశులూ ద్వీపాలను, ద్వీపకల్పాలనూ సూచిస్తాయి. కరీబియన్ దీవులు కర్కాటకరాశి అధీనంలో ఉన్నాయి. కనుక అక్కడనుండి ప్రజల వెల్లువ, అమెరికాలోకి ప్రవేశించే ప్రయత్నం చేసింది.  

అమెరికాలో పరిస్థితి అలా ఉంటే, ఇక్కడ యూరప్లో అగ్నిపర్వతం ఒకటి బద్దలైంది.

స్పెయిన్లోని కేనరీ ద్వీపం ఒకదానిలో బ్రద్దలై లావాను వెలువరిస్తున్న అగ్నిపర్వతపు ధాటికి నాలుగు ఊర్లను ఖాళీ చేయించింది ఆ దేశం. ప్రజలనందరినీ ఇళ్లలోనే ఉండమని, బయట తిరగవద్దని హెచ్చరించింది.

అగ్నితత్వ రాశి అయిన ధనుస్సులో ఉన్న శనిగురువులమీద, భూతత్వ రాశి అయిన కన్యనుంచి, భూకారకుడైన కుజుని చతుర్ధ దృష్టిని గమనిస్తే, ఈ అగ్నిపర్వతం ఎందుకు పేలిందో, అదికూడా స్పెయిన్ లోనే ఎందుకు జరిగిందో, స్పష్టంగా అర్ధమౌతుంది.

నవాంశలో, జలతత్వ రాశి అయిన మీనంలో కలసి ఉన్న నీచశని, కుజుల మీద, భూతత్వ రాశి అయిన కన్యనుండి గురువు దృష్టిని గమనిస్తే, అగ్నిపర్వతం పగిలి అగ్నిద్రవమైన లావా ఎందుకు  పారుతున్నదో ఇంకా స్పష్టత వస్తుంది.

ఇప్పుడర్ధమయ్యాయా, టెక్సాస్ లో హైతీ శరణార్ధుల వెల్లువ, స్పెయిన్లో అగ్నిపర్వత ప్రేలుడుల వెనుక ఉన్న  గ్రహస్థితులు?

read more " మకరంలో వక్ర శని గురువులు - యూరప్, అమెరికాల పైన ప్రభావాలు "

19, సెప్టెంబర్ 2021, ఆదివారం

ఆఫ్గనిస్తాన్ పరిస్థితి? జ్యోతిష్య విశ్లేషణ - 5

దేశగోచారాలలో, గురువు, శని, రాహుకేతువులు, యురేనస్ లు ప్రధానపాత్రలు పోషిస్తాయి. 2001 నుంచి ఇరవై ఏళ్లపాటు ఆఫ్గనిస్తాన్ ను నాటో దళాల, ఇంకా చెప్పాలంటే అమెరికా దళాల సహకారంతో పాలించిన ప్రభుత్వం ఆగస్టు 15, 2021 న కూలిపోయింది. అయితే, దీనికి పావులు చాలా ముందునుంచే కదలడం ప్రారంభమయ్యాయి. ఆ సమయానికి మేజర్ గ్రహాల పరిస్థితి ఇలా ఉంది.

శని - మకరం; గురువు - కుంభం; రాహుకేతువులు - వృషభ - వృశ్చికాలు; యురేనస్ - మేషం

వీరిలో శని, 24 మే 2021 నుండి వక్రించడం మొదలుపెట్టాడు. గురువు, 21 జూన్ నుండి వక్రించడం మొదలుపెట్టాడు. ఈ మార్పులవల్ల, అమెరికా బలగాలు త్వరగా వెళ్లిపోవడం, తాలిబాన్ బలగాలు వేగంగా ముందుకు కదిలి కాబూల్ ను ఆక్రమించడం జరిగిపోయింది. దీనిని గమనిద్దాం.

Planet

7-10-2001

15-8-2021

Rahu

Mithuna 7

Vrisha 12

Jupiter

Mithuna 21

Kumbha 3 R

Saturn

Vrisha 20 R

Makara 15 R

Uranus

Makara 27

Mesha 20

దాదాపుగా 20 ఏళ్ల పాటు అమెరికా, అఫ్ఘానిస్తాన్ను పరోక్షంగా పాలించింది. ఇది రాహుకేతువులు రాశిచక్రాన్ని ఒక ఆవృత్తి చేసి వచ్చే సమయం. 2001 లో మిధునంలో ఉన్న రాహువు, 2021 కల్లా వృషభంలోకి వచ్చేశాడు. కనుక ఇది ఖచ్చితంగా  రాహుకేతువుల ప్రభావమే.  ఈలోపల, గురువు ఒకటిన్నర ఆవృత్తిని పూర్తిచేశాడు. శని ఎనిమిది రాశులను దాటాడు.

నిజానికి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా బలగాలు వెనుకకు వెళ్లిపోవడానికి డిసెంబర్ 2020 లోనే బీజాలు పడ్డాయి. 17-12-2020 న శని గురువులిద్దరూ మకరరాశిలో 5 వ డిగ్రీమీద ఖచ్చితమైన యుతిలో ఉన్నారు. ఆనాటినుంచే, ఈ డ్రామాకు రంగం సిద్ధం కావడం మొదలైంది. మకరం నుండి ఆఫ్ఘనిస్తాన్ కు సూచికైన ధనుస్సు ద్వాదశంలో ఉండటంతో, లోకానికి తెలియకుండా రహస్యంగా ఈ పని జరుగుతూ వచ్చింది.

ఫిబ్రవరి 29 న దోహాలో జరిగిన చర్చలలో తాలిబాన్, అమెరికాలు ఒక ఒప్పందానికి వచ్చి, సంతకాలు చేశాయి. డిసెంబర్లో మొదలైన ప్లాన్ ఫిబ్రవరికి ఒక కొలిక్కి వచ్చింది. ఆ సమయానికి కుజ కేతువులిద్దరూ ధనూరాశిలో, ఆఫ్ఘనిస్తాన్ డిగ్రీలకు దగ్గరగా ఉండటాన్ని గమనించవచ్చు. ఇది మతపరమైన విధ్వంసానికి సూచన. అప్పటినుంచే, ఆఫ్ఘనిస్తాన్ కు దుర్దశ మొదలైంది. ఇస్లాం రూపంలో అది మళ్ళీ  అనాగరిక, ఆటవిక, రాతియుగానికి వెళ్లిపోవడం మొదలైంది.

ధనుస్సు, పాకిస్తాన్ కు సూచికైన మేషానికి నవమంలో ఉండటంతో, అర్ధంలేని మతపిచ్చికి, దుర్మార్గానికి, దుష్టత్వానికి వంతపాడటం పాకిస్తాన్ వంతైంది. వెరసి, ప్రపంచదేశాలకు, ముఖ్యంగా అమెరికా, ఇండియాలకు ప్రమాదఘంటికలు మ్రోగడం మొదలైంది. 

(ఇంకా ఉంది)

read more " ఆఫ్గనిస్తాన్ పరిస్థితి? జ్యోతిష్య విశ్లేషణ - 5 "

15, సెప్టెంబర్ 2021, బుధవారం

మార్చలేనప్పుడు, తెలుసుకోవడమెందుకు?

మా బంధువులలో ఒకాయన ఈ మధ్యనే ఫోన్ చేశాడు.

'మీ జ్యోతిష్య పోస్టులు క్రమం తప్పకుండ చదువుతూ ఉంటాను, కానీ నాదొక సందేహం. మీరన్నీ అయిపోయాక వ్రాస్తారేంటి? ముందు వ్రాయాలిగాని' అన్నాడు.

'ముందు వ్రాసేవాళ్ళు బోలెడుమందున్నారు. అందుకని నేను వెనుక వ్రాస్తూ ఉంటాను. ఇది నా పద్ధతి' అన్నా నవ్వుతూ.

'అలాకాదు. చెప్పండి' అడిగాడాయన.

'ఏమీ లేదు. మొదట్లో వ్రాసేవాడిని. తరువాత విసుగొచ్చి ఆపేశాను. జరగబోయేవి తెలుసుకోవడం పెద్ద విషయం కాదు, అది లోకంలో అయినా సరే, మనుషుల జీవితాలలో అయినా సరే. వాటిని ఆపడం మన చేతకానప్పుడు, అది మన పనికూడా కానప్పుడు, అలా వ్రాసి, కాలరెగరేసుకోవలసిన ఖర్మ నాకు లేదు. అలాంటి గొప్పలు నాకవసరం లేదు. అదీగాక, గ్లోబల్ కర్మ మ్యాప్ ను ముందే బజార్నపెట్టడం మంచిది కాదు. అలా చేస్తే, గ్రహాల కోపానికి గురవ్వవలసి వస్తుంది. చాలా మంది జ్యోతిష్కుల జీవితాలలో ఘోరమైన ఎదురుదెబ్బలు తగలడం ఇందువల్లనే. అందుకని, ఏదైనా జరిగాక చెప్పడమే శ్రేయస్కరం.

రెండోది - అలా భవిష్యత్తును చెబుతానని, రెమెడీలు చెబుతానని, టాంటాం వేసుకుని జనాన్ని మోసం చేసి డబ్బులు సంపాదించాల్సిన ఖర్మ నాకు లేదు. వద్దు కూడా. అందుకని నేనింతే. అదంతే' అన్నాను.

'ఇలా చెప్పి ఉపయోగం?' అన్నాడాయన.

'ప్రతిదానికీ ఉపయోగమేముంటుంది? జరిగే సంఘటనలకూ గ్రహచలనానికీ సంబంధాలున్నాయని చెప్పడమే నా ఉద్దేశ్యం. అంతకంటే ఏమీ లేదు' అన్నాను.

'జరిగేవాటిని మార్చలేనప్పుడు, తెలుసుకోవడమెందుకు?' అడిగాడాయన.

'బుద్ధిలేక' అని ముగించాను.

read more " మార్చలేనప్పుడు, తెలుసుకోవడమెందుకు? "

13, సెప్టెంబర్ 2021, సోమవారం

మొన్న ఢిల్లీ; నిన్న ముంబాయి; నేడు హైద్రాబాద్; ఆడదానిగా పుట్టడమే శాపమా?

ఢిల్లీలో నిర్భయ కేసు జరిగింది. దోషులకు ఎనిమిదేళ్ల తర్వాత శిక్ష పడింది. 

హైద్రాబాద్ లో మెడికో హత్యకేసు జరిగింది. ఎన్ కౌంటర్ తో తక్షణ న్యాయం జరిగింది. 

మొన్న ముంబాయిలో ఘోరమైన రేప్ జరిగింది. ఆమె ఆస్పత్రితో చనిపోయింది. నిందితులు దొరకలేదు. 

ఇప్పుడు హైదరాబాద్ లో 6 ఏళ్ల పాపను రేప్ చేసి చంపేశారు. నిందితులను పట్టుకున్నారో లేదో తెలియదు. 

అంతకుముందు రోజు హైద్రాబాద్ లోనే ఒక ఫ్రెంచి వనిత హత్యకు గురైంది. పెంపుడు కూతురే హత్యకు ప్లాన్ చేసి, ప్రియుడిచేత చేయించిందని అంటున్నారు.

నార్త్ లో నేషనల్ కోకో ఛాంపియన్ ఒకమ్మాయి రేపు + హత్యకు గురైంది.

గ్రహప్రభావం అలా ఉంది సరే, అసలు ఆడదంటే మరీ ఇంత అలుసైతే ఎలా సమాజంలో?

మళ్ళీ ఎవరిని కదిలించినా, మతాలు, దేవుళ్ళు, నీతులు ! తెగ చెబుతారు !

అమాయకంగా బలయ్యే ఆడవాళ్లు కొందరైతే, అతితెలివితో ఇతరులను బలిచేసే ఆడాళ్ళు మరికొందరు !

నేరాలలో ఆడామగా తేడా లేకపోయినా, శరీరధర్మరీత్యా చూచినప్పుడు, ఒక ఆడది హింసకు గురవ్వడం చాలా దారుణం, ఘోరం.

చూస్తుంటే, ఇలాంటి నేరస్తులకు తాలిబాన్ శిక్షలే కరెక్ట్ అనిపిస్తోంది ! అప్పుడైనా కొంచం భయం ఏర్పడుతుందేమో నేరస్తులలో?

read more " మొన్న ఢిల్లీ; నిన్న ముంబాయి; నేడు హైద్రాబాద్; ఆడదానిగా పుట్టడమే శాపమా? "

11, సెప్టెంబర్ 2021, శనివారం

Dismantling Global Hindutwa ను వ్యతిరేకించండి !

Dismantling Global Hindutwa అనే పేరుతో నిన్న, నేడు, రేపు - మూడు రోజులుగా ఒక ఆన్లైన్ సమావేశం జరుగుతోంది. దీనికి 50 అమెరికా యూనివర్సిటీల నుంచి ప్రతినిధులు, మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ప్రపంచవ్యాప్తమౌతున్న హిందూ తీవ్రవాదం గురించి వీళ్ళు చర్చిస్తారట ! ఎంత గొప్ప జోకో !

దీనివెనుక అసలేం జరుగుతోందో వినండి !

పాకిస్తాన్ ఏర్పడిన నాటి నుండీ, ఎంతోమంది పాకిస్తానీలను అదే పనిగా చదివించి, PhD లుగా తయారుచేసి, వారిని అమెరికాలోని ఎన్నో యూనివర్సిటీలలో చరిత్ర తదితర విభాగాలలో ప్రొఫెసర్లుగా చొప్పించే కార్యక్రమం చాపక్రింద నీరులాగా జరుగుతోంది. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంలో భాగంగా, ఇస్లామిక్ తీవ్రవాదంతో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. వాళ్లంతా ఇప్పుడు అమెరికాలో యూరప్ లోని యూనివర్సిటీలలో స్లీపర్ సెల్స్ గా ఉంటూ, ఆల్ ఖాయిదాకూ, పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకూ తొత్తులుగా, రిక్రూటింగ్ ఏజెన్సీలుగా సైలెంట్ గా పనిచేస్తున్నారు. వీళ్ళందరూ దీనివెనుక ఉన్నారు.

ఇప్పుడు మరో కోణం !

ఇండియాకు స్వాతంత్రం వచ్చిన నాటి నుండీ, పెద్ద ఎత్తున కోట్లాది డాలర్లను 'సహాయం' పేరుతో లంచం ఇచ్చి , హిందువులను క్రైస్తవమతంలోకి మార్చే పెద్ద ప్రయత్నం సైలెంట్ గా జరుగుతూ  వస్తోంది. అలా వస్తున్న ధనానికి లెక్కా పత్రమూ ఏవీ లేవు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక, వాటికి ఖచ్చితమైన ఆడిట్ ను పెట్టేసరికి, ఆ హవాలా డబ్బంతా ఆగిపోయింది. మతమార్పిడులు ఆగిపోయాయి. వాటికన్ కు దిక్కు తోచడం లేదు. అమెరికాలోని కుహనా క్రైస్తవ సంస్థలకు దిక్కు తోచడం లేదు. వాళ్లంతా ఈ కాన్ఫరెన్స్ వెనుక ఉన్నారు.

ఈ కాన్ఫరెన్స్ వెనుక ఇంత పెద్ద గ్లోబల్ కుట్ర ఉంది.

ఒకప్రక్కన పాకిస్తాన్ ఉగ్రవాదులూ, మరోప్రక్కన క్రైస్తవ మతమార్పిడి వాదులూ కలసి పెట్టిన కాన్ఫరెన్స్ ఇది. కానీ దీని నిర్వాహకులు మాత్రం, తమ పేర్లను ఎక్కడా బయట పెట్టలేదు. స్పీకర్ల పేర్లను మాత్రమే బయటపెట్టారు. దొంగల్లాగా తెరవెనుక ఎందుకు దాక్కుంటున్నారు వీళ్ళు? బయటపడితే వీళ్ళ భాగోతాలు బయటపడతాయని భయమా ?

అసలు, ఆఫ్ఘనిస్తాన్ లో ప్రస్తుతం  జరుగుతున్నదేమిటి? లక్షలాది అమాయకులను చంపుతూ భయోత్పాతాన్ని సృష్టిస్తున్నది  ఎవరు? 9/11 చేసింది ఎవరు? ప్రపంచవ్యాప్తంగా హంతక ముఠాలెవరు? రాడికల్ ఇస్లామే ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యని అందరికీ కనిపిస్తుంటే, ఇప్పుడీ పేరుతో కాన్ఫరెన్సా? మతుందా పోయిందా?

అంటే ఆఫ్ఘనిస్తాన్లో మారణహోమాన్ని చేస్తున్నది హిందువులా? దొంగ, పోలీసును చూపిస్తూ, దొంగ దొంగ అని అరిచినట్లుంది.

మంచివాళ్లను చెడ్డవారుగా, దుర్మార్గులను మంచివాళ్ళుగా ఇలా చిత్రీకరిస్తూ ఉన్నంతకాలం, ప్రపంచపు దరిద్రం ఇలాగే ఉంటుంది. మిమ్మల్నెవరూ మార్చలేరు.

లక్కీగా, అమెరికాలోని హిందూ సంస్థలన్నీ ఈ సమావేశానికి తమ గట్టి నిరసనను ప్రకటించాయి. ఒహాయో సెనెటర్ నీరజ్ అంతాని చాలా గట్టిగా ఈ సమావేశాన్ని నిరసించారు. అమెరికాలోని హిందువులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు, ఒక్కటిగా తమ స్వరాన్ని వినిపించాల్సిన సమయమిది.

ఈ హిపోక్రసీని వదులుకుని ఇస్లామిక్ టెర్రరిజాన్ని వ్యతిరేకించకపోతే, ముందుంది వినాశనం. 9/11 చూచాక కూడా బుద్ధి రాకపోతే ఎలా మీకు? పైగా ట్విన్ టవర్స్ ను పడగొట్టిన సెప్టెంబర్ 11 తో సరిపోయేలాగా ఈ తేదీలలో ఈ సమావేశం పెట్టారు ! అంటే ఏంటి? వాటిలాగే, హిందూమతాన్ని కూడా కూలుద్దామనా మీ ఉద్దేశం? అదెప్పటికీ జరగదు. ఒకవేళ జరిగితే మీ కాళ్లక్రింద నేలను మీరే తవ్వుకున్నట్లు. అప్పుడు మీరూ మిగలరు.

ఇప్పుడందరూ మాట్లాడాల్సింది ఇస్లాం పేరుతో ప్రపంచానికి జరిగిన జరుగుతున్న వినాశనం విధ్వంసం గురించి ! దాన్నొదిలేసి ఈ గోలేంటి?

హిందూమతమొక్కటే ప్రపంచానికి శ్రీరామరక్ష ! అన్ని మతాలనూ ఆదరిస్తున్న భారతదేశమే దీనికి స్పష్టమైన ఉదాహరణ ! ఇంతకంటే ఇంకేం కావాలి మీకు రుజువు?

read more " Dismantling Global Hindutwa ను వ్యతిరేకించండి ! "

తమరు కాశ్మీర్ పండిట్ అని ఇప్పుడు గుర్తొచ్చిందా?

కాశ్మీర్లో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ, 'నేను కాశ్మీర్ పండిట్ను, నాకు వాళ్ళ బాధలు తెలుసు' అని గొప్ప స్టేట్మెంటిచ్చాడు. కరెక్ట్ ! తమరిలో అన్ని రక్తాలూ కలిశాయి  గనుక, ఫార్సీ నని చెప్పుకోవచ్చు, కాశ్మీర్ పండిట్ నని చెప్పుకోవచ్చు, ఇంకొంచం ముందుకెళితే, కొంతమంది చెప్పేటట్లు ముస్లింనని కూడా చెప్పుకోవచ్చు, లేదా ఇటాలియన్నని చెప్పుకోవచ్చు. అయినా, ఉన్నట్టుండి ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చింది సుమా తమరికి కాశ్మీర్ పండిట్ నని? వైష్ణోదేవి యాత్ర చేసే కాలినడకలో జ్ఞానోదయం అయిందేమో?

అదే నిజమైతే, గత 40 ఏళ్లుగా, లక్షలాది మంది కాశ్మీర్ బ్రాహ్మణ కుటుంబాలు, ఢిల్లీ రోడ్లమీద, ఫుట్ పాత్ ల మీద టెంట్లు వేసుకుని, ఓవర్ బ్రిడ్జిల క్రిందా, ఆరుబయట గుడారాలలోనూ ఉంటూ, కూలీ నాలీ చేసుకుంటూ, తమ దేశంలో తామే దిక్కులేకుండా బ్రతుకుతుంటే, అప్పుడంతా ఎందుకు గుర్తు రాలేదు తమరి కాశ్మీర్ పండిట్ మూలాలు? అసలు మీ కుటుంబం ఏం చేసింది కాశ్మీర్ పండితులకు?

అద్భుతమైన కాశ్మీర్ శైవ సంప్రదాయానికి వారసులు కాశ్మీర్ పండిట్స్. వేలాది సంవత్సరాలుగా ఆ సంప్రదాయాన్ని వాళ్ళు రక్షిస్తూ వస్తున్నారు. అలాంటి గొప్ప సంస్కృతి నాశనమైంది. వాళ్ళ దేవాలయాలు ధ్వంసమయ్యాయి. అది వాళ్ళ ఒక్కరి సొమ్ము కాదు. ఈ దేశపు ఘనసంస్కృతి అది. దాన్ని ఒక ప్రధకం ప్రకారం ఏభై ఏళ్లుగా పాకిస్తాన్ నాశనం చేస్తుంటే గుర్తు రాలేదా తమరు కాశ్మీర్ పండిట్ అని? వాళ్ళ ఇళ్ళూ వాకిళ్ళూ ఆక్రమించుకుని, అందిన వారిని అందినట్లు, చిన్నపిల్లలని కూడా చూడకుండా, రాడికల్ పాకిస్తానీ ముస్లిములు కాల్చి చంపుతుంటే, వాళ్ళ ఆడవాళ్లను రేపులు చేస్తుంటే, అప్పుడు గుర్తు రాలేదా తమరు కాశ్మీర్ పండిట్ అని? అప్పుడెక్కడ దాక్కున్నారో తమరు?

అసలు, ఘనత వహించిన తమరి ముత్తాతగారి చలవేగా నేటి కాశ్మీర్ సమస్య? ఆయన కాశ్మీర్ పండిట్ కాదా? ఆయన కాకుండా మీరెలా అయ్యారు? మరి మీ ముత్తాతగారి కాలంనుంచీ ఈ సమస్యను పెంచి పోషించినదెవరు? గత 70 ఏళ్లుగా కాశ్మీర్ రణరంగంగా రగులుతుంటే, పాకిస్తాన్ మూకలు అక్కడ సందుసందుకీ ఆక్రమిస్తుంటే మీరేం చేస్తున్నారు? నిన్నటికి నిన్న చచ్చిన గిలానీ అనే వృద్ధశునకం లాంటి వాళ్ళు కాశ్మీర్లో పెట్రేగి పోవడానికి కారణం మీ కాంగ్రెస్ పార్టీ కాదా? కాదని గుండె మీద చెయ్యివేసుకుని నిజాయితీగా చెప్పండి ! అసలెందుకు మీకు పాకిస్తాన్  అంటే అంత భయం?  అది భయమా లేక ప్రేమా?

గిలానీగాడి శవానికి పాకిస్తాన్ జెండాను కప్పి భారత వ్యతిరేక నినాదాలు చేస్తుంటే, దానిని మెహబూబా లాంటి సిగ్గులేని మనుషులు సమర్దిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? మీరెందుకు కిమ్మనకుండా ఊరుకున్నారు? ఇదే పనిని, పాకిస్తాన్ లో ఎవరైనా హిందువులు చేస్తే ఊరుకుంటారా? ఇన్నేళ్ళుగా ఎవరి సొమ్ముతో, ఎవరు కట్టిన టాక్స్ డబ్బులతో, ఇండియాలో దర్జాగా బ్రతుకుతున్నారు వాళ్ళు? 'తినేది మొగుడి తిండి, పాడేది రంకుమొగుడి పాట' అన్నట్లుగా, భారతదేశంలో ఉంటూ పాకిస్తాన్ కు జై కొట్టే ఇలాంటివాళ్ళను ఇన్నేళ్ళుగా, భారతీయుల టాక్స్ సొమ్ముతో పెంచి పోషించింది ఎవరు? మీ కుటుంబం కాదా?

పాక్ ఆకుపైడ్ కాశ్మీర్ ఎవరి చలవ? శంకరాచార్యులవారు అధిరోహించిన శారదాపీఠం అక్కడే ఉంది. వేలాది ఏళ్ళనుంచీ అది వేదభూమి. ఈనాడది PoK అయ్యి కూచుంది. ఇస్లామిక్ దొంగలను, దోపిడీదార్లను, ఖూనీకోర్లను తయారు చేసి, మనదేశం మీదకు ఉసిగొలిపే ఫెక్టరీగా మారింది.  ఇదెవరి చలవ? మీ కుటుంబానిది కాదా?

అరుణాచలప్రదేశ్ అవతల వేలాది మైళ్ళ భారతభూమిని చైనా ఆక్రమిస్తే చూస్తూ ఊరుకున్నది తమరి ముత్తాత గారు కాదా? ఈ దేశం మీ సొంత జాగీరా అలా ఎవరికిపడితే వారికి వదిలెయ్యడానికి?

ఉన్నట్టుండి  తమరికి, తమ పార్టీ నేతలైన గులాం నబీ ఆజాద్  గారికీ, వారి మిత్రులైన మెహబూబా ముఫ్టీ లాంటి పాకిస్తాన్  తొత్తులకూ, కాశ్మీర్ పండిట్స్ మీద ఇంత ప్రేమ ఎందుకో? కాశ్మీర్లో ఎన్నికలు పెడితే, ఈ సెంటిమెంట్ తో ఓట్లు కొట్టేసి, అక్కడి ముస్లిం పార్టీలతో జతకట్టి, కాశ్మీర్లో ప్రభుతం స్థాపిద్దామనేగా? ఆ తర్వాత కాశ్మీర్ ను పాకిస్తాన్ కి అమ్మేద్దామనేగా? లోకం అంత పిచ్చిది కాదు ! రోజులు మారాయి !

కాశ్మీర్ ను రాష్ట్రం చేస్తే, అక్కడ ఎన్నికలు పెడితే, వస్తే గిస్తే బీజేపీ మాత్రమే అధికారం లోకి రావాలి. ఇంకే పార్టీ వచ్చినా, అక్కడ మళ్ళీ అరాచక ప్రళయమే ఉంటుంది. ఇస్లాం ముసుగులో ముందు పాకిస్తాన్, ఆ తర్వాత చైనాలు అక్కడ అడుగుపెడతాయి. అప్పుడు మళ్ళీ సివిల్ వార్ తప్పదు.

ఆ ప్రమాదం రాకుండా ఉండాలంటే, కాశ్మీర్ తో  సహా, మొత్తం ఇండియాను బీజేపీ మాత్రమే పాలించాలి. మిగిలిన ఏ పార్టీకీ ఆ హక్కు లేదు. ఎందుకంటే, దేశభక్తి అనేది వాటిల్లో ఘోరంగా లోపించింది కాబట్టి. ఇది నేను చెబుతున్నది కాదు. గత 80 ఏళ్లుగా కనిపిస్తున్న నిజం !

కాశ్మీర్ మన దేశానికి తలకాయ లాంటిది. గత 70 ఏళ్లుగా మన దేశం తలేని మొండెం లాగా బ్రతికింది. దానికి శిరస్సును పెట్టి, అది ప్రపంచదేశాలలో తలెత్తుకుని సగర్వంగా నిలబడేలా చేసింది ఒక్క నరేంద్రమోడీ గారు మాత్రమే. మిగతా ఎవ్వరూ ఆపనిని చేయలేకపోయారు. కనీసం చెయ్యడానికి సాహసించలేకపోయారు. కనీసం నోరెత్తి మాట్లాడలేకపోయారు.

నిన్నటికి నిన్న, రష్యా,  అమెరికా, ఆస్ట్రేలియా దేశాల భద్రతా సలహాదారులు ఢిల్లీకి వచ్చి, మన ప్రభుత్వంతో మాట్లాడి ఎందుకు వెళ్లారు? అంటే, ప్రపంచదేశాలలో మన గౌరవం పెరిగినట్లేనా కాదా? మన ప్రాముఖ్యతని వాళ్ళు గుర్తిస్తున్నట్లేనా కాదా? మనం, నిజాయితీపరులమని ఒప్పుకున్నట్లేనా కాదా? మీ కాంగ్రెస్ హయాంలో ఎప్పుడైనా మన దేశానికి ఇంతటి విలువా, గౌరవమూ దక్కాయా మరి?

అవకాశవాద రాజకీయాలతో పాకిస్తాన్ తొత్తులకు వంత పాడకండి. మీరు భరతమాత బిడ్డలన్నది మర్చిపోకండి. దేశాన్ని పాకిస్తాన్ కు తాకట్టు పెట్టకండి. కాశ్మీర్ పండిట్స్ అంటే మీకు నిజంగా అంత ప్రేముంటే, ఇది కాదు మీరు చెయ్యవలసిన పని !

మీ కుటుంబం చేసిన ఘోరమైన పొరపాట్లను, లక్షలాది కుటుంబాలు నాశనం కావడానికి కారణమైన పొరపాట్లను, బీజేపీ, ఆరెస్సెస్ లు నేడు సరిదిద్దుతున్నాయి. దానికోసం ఎంతో తంటాలు పడుతున్నాయి. ఆ శ్రమను గుర్తించండి. వాళ్ళను సపోర్ట్ చెయ్యండి. కులమతాలకు పార్టీలకు, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ఆలోచించండి. దేశభక్తిని గుండెల్లో నింపుకోండి.

మనది పవిత్ర వేదభూమి. ఇది ఇస్లాం కు అమ్ముడుపోయి, మరో ఆఫ్ఘనిస్తాన్ కావడానికి ఎంతమాత్రం వీల్లేదు ! 

read more " తమరు కాశ్మీర్ పండిట్ అని ఇప్పుడు గుర్తొచ్చిందా? "

వెల్లువెత్తుతున్న రేప్ కేసులు - శుక్రునిపై కుజ శని యురేనస్ ల ప్రభావం

23 జూలైన వ్రాస్తూ హెచ్చరించాను, స్త్రీలపైన దౌర్జన్యాలు, రేపులు, డ్రగ్స్ కేసులు పెరుగుతాయని. ఆ తరువాత ఎన్ని జరిగాయో న్యూస్ చూస్తే తెలుసుకోవచ్చు. ఋజువులుగా కొన్నింటిని వ్రాసి, నాకే విసుగొచ్చి, ఇక వ్రాయడం మానేశాను. కానీ ఇప్పుడు ముంబాయిలో జరిగిన రేప్ కేసు మాత్రం నిర్భయ కేసులాంటి దారుణమైన కేసు. న్యూస్ చానల్స్ చూసేవారికి అంతా తెలుసు. అందుకే మళ్ళీ నేను వ్రాయడం లేదు.

అసలిలాంటివి జరగడానికి ప్రధానకారణం, లా అండ్ ఆర్డర్ మీద ప్రజలకు భయమూ, నమ్మకమూ పోవడమేనని గతంలో నిర్భయ కేసు జరిగినప్పుడే వ్రాశాను. అప్పటిమీద ఇపుడు కొద్దిగా భయం పెరిగినా, సరిపోయినంతగా రాలేదు. సమాజం పెద్దగా మారలేదు. దానికి కారణం, సినిమాలు, నెట్, యూట్యూబ్, పోర్న్, తాగుడు, డ్రగ్స్ మొదలైనవి.

ఈమధ్యనే సత్తెనపల్లి దగ్గర్లో రాత్రి తొమ్మిది గంటలసమయంలో ఒక రేప్ జరిగింది. అది కూడా న్యూస్ ఫాలో అయేవారికి తెలిసే ఉంటుంది. దీనికి కారణం ఒరిస్సా బీహార్ల  నుంచి వచ్చిన లేబర్ అంటున్నారు. చీప్ లేబర్ గా, వీళ్ళు తండోపతండాలుగా సౌత్ కి వలసలొచ్చాక, బెంగుళూరు ప్రాంతంలో, చెన్నైలో, ఆంధ్రాలో నేరాలు బాగా పెరిగాయి. వాళ్ళు చేసేది కొంతైతే, వాళ్ళమీద పెట్టి లోకల్స్ చేసేది మరికొంత. మైసూరు చాముండి హిల్స్ లో జరిగిన రేప్ కేస్ కూడా అలాంటిదే. మొన్నటి సత్తెనపల్లి కేసు కూడా అలాంటిదే.

అది తెలంగాణా  అయినా, ఆంధ్రా అయినా, బీహారైనా, బెంగాలైనా - లా అండ్ ఆర్డర్ నిక్కచ్చిగా నిస్పక్షపాతంగా అమలు జరుగుతుంటే, అంతా బాగుటుంది. గల్లీ లీడర్ దగ్గరనించి ప్రతివాడూ అందులో జోక్యం చేసుకుంటూ ఉంటే సమాజం పరిస్థితి ఇలాగే అఘోరిస్తుంది.

మీరు చెప్పినది ఒక నెలే కదా, శుక్రుడు నీచస్థితినుంచి తప్పుకుని తులలోకి వచ్చేశాడు కదా. ఇంకా జరుగుతున్నాయేంటి అని ఔత్సాహికులు అనవచ్చు,. ఒకానొక సమయంలో, గ్రహగతులలో ఒకటి పోతే ఒకటి ఉంటూనే ఉంటుంది. తెరిపి ఉండదు. ప్రస్తుతం శుక్రుడు తులలో ఉన్నప్పటికీ, మేషం నుంచి యురేనస్ దృష్టిలో ఉన్నాడు. కనుక, ముంబాయి రేప్ లాంటి ఘోరమైన నేరాలు జరుగుతున్నాయి. ఇది శుక్రునిపైన కుజ యురేనస్ ల ప్రభావం. అదీగాక వక్రశని దృష్టి కూడా శుక్రుని మీద ఉన్నదని మర్చిపోకండి మరి !

ఏతావాతా, మార్చి 2022 వరకూ ఏదో ఒక విధంగా శుక్రుని పరిస్థితి బాగులేదు. రకరకాలైన గ్రహాల ప్రభావానికి లోనౌతూనే ఉంటాడు. కనుక, అమ్మాయిలూ వంటరిగా బయట తిరుగుతూ సాహసాలు చెయ్యకండి. తస్మాత్ జాగ్రత్త !  

read more " వెల్లువెత్తుతున్న రేప్ కేసులు - శుక్రునిపై కుజ శని యురేనస్ ల ప్రభావం "

9, సెప్టెంబర్ 2021, గురువారం

ఆఫ్గనిస్తాన్ పరిస్థితి? జ్యోతిష్య విశ్లేషణ - 4

7-10-2001 న తాలిబాన్ పైన అమెరికా తన విమానదాడులను ప్రారంభించింది. ఆ రోజున గ్రహస్థితిని ఇక్కడ చూడవచ్చు.

7/11 తరువాత గడచిన నెలరోజులలో, గ్రహస్థితులలో పెద్ద మార్పులేమీ లేవు. కానీ, శనిబుధులలో మార్పుంది. ఇద్దరూ వక్రస్థితిలోకి వచ్చారు. బుధుఁడైతే రాశి మారి, తులారాశిలోకి వచ్చాడు. అదంత ముఖ్యమైన మార్పు కాదు. ముఖ్యమైన మార్పల్లా, శని వక్రీకరణ. దీనితో ఆయన మేషంలోకి వచ్చినట్లౌతుంది. అదాయనకు నీచస్థానమౌతుంది. తాలిబాన్ కు మూడటానికి శనీశ్వరుడే కారణం. ఎందుకంటే, సామాన్యప్రజలు కష్టాలు పడటం, మళ్ళీ ఆ కష్టాలకు కారణమైనవారిని శిక్షించడం, ఇదంతా శనీశ్వరుని ఆధీనంలోనే ఉంటుంది మరి !

ధనుస్సునుంచి శని పంచమంలో నీచస్థితిలోకి రావడం వల్ల తాలిబాన్ కు మూడిందన్న సూచన స్పష్టంగా వచ్చింది. అదే విధంగా, మిధునానికి ఇది లాభస్థానమవ్వడం వలన, అమెరికా ప్లాన్లకు సహకరించే కోవర్ట్ మిత్రులు ఆఫ్ఘనిస్తాన్ లో దొరుకుతారన్న సూచనా ఉన్నది. పంజషీర్ లోని నార్తన్ అలియన్స్ తోడ్పాటుతోనే అమెరికా అక్కడ కాలుమోపింది. నేడు వాళ్ళ ఖర్మానికి వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయింది, అది వేరే సంగతి !

ధనుస్సుకు లాభస్థానంలో ఉన్న బుధుడు, తాలిబాన్ మద్దతుదారులైన పాకిస్తాన్, ఇరాక్ మొదలైన దేశాలను సూచిస్తున్నాడు. అయితే ఇక్కడొక విచిత్రమైన గ్రహస్థితి ఉంది.

కాలస్వరూపాలైన రాహుకేతువులు, మనిషి జీవితంలోగానీ, దేశాల జాతకాలలోగానీ, ప్రధానపాత్రను పోషిస్తాయి. ఆ సమయంలో, రాహుకేతువుల ఇరుసు శనికీ, బుధునికీ కూడా 3/11 స్థానాల్లోనే ఉంది. కానీ, శనినుంచి ఇది 3/11 లో ఉంటే, బుధుని నుంచి 11/3 లో ఉంది. అంటే, శనిస్థానం నుంచే రాహుకేతువులు బలంగా పనిచేస్తున్నాయి. కనుక, శని లాభస్థానంలో ఉన్న అమెరికాకు బలం చేకూరింది. బుధుడు లాభస్థానంలో ఉన్న తాలిబాన్ కు చెడుదశ మొదలైంది.

తాలిబాన్ కూ, అమెరికాకూ జరిగిన యుద్ధంలో విమానదాడులు ప్రధానపాత్ర వహించాయి. ఇవి, రాశిచక్రంలో వాయుతత్త్వరాశులచేత సూచింపబడతాయి. మిధునంలో ఉన్న రాహు గురువుల వల్ల, అమెరికాకు బలం ఎక్కువగా ఉంది. తులలో బుధుఁడున్నప్పటికీ, పైన చెప్పిన గ్రహస్థితివల్ల అతనికి బలం లేదు. కనుక తాలిబాన్ బలహీనంగా ఉంది. కనుక ఈ రెండు దేశాలకూ మధ్యన జరిగిన యుద్ధంలో తాలిబాన్ ఓడిపోయింది.

ఈ విధంగా, మేజర్ గ్రహాలు తమతమ యాత్రలో, రకరకాలైన ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ప్రపంచదేశాల మధ్యన జరిగే సంఘటనలను అర్ధం చేసుకోవడంలో, భారతీయ జ్యోతిష్యశాస్త్రాన్ని ఈ విధంగా ఉపయోగించుకోవాలి.

(ఇంకా ఉంది)

read more " ఆఫ్గనిస్తాన్ పరిస్థితి? జ్యోతిష్య విశ్లేషణ - 4 "

8, సెప్టెంబర్ 2021, బుధవారం

ఆఫ్గనిస్తాన్ పరిస్థితి? జ్యోతిష్య విశ్లేషణ - 3

9/11 గురించి అనుకోకుండా ఆఫ్ఘనిస్తాన్ జాతకాన్ని చూడలేము. ప్రపంచదేశాల బడ్జెట్లను, పాలసీలను, తీవ్రవాదాన్ని అవి చూచే దృష్టిని, మార్చిన సంఘటనలలో ఇది చాలా ముఖ్యమైన సంఘటన. అందుకే దాని కుండలిని కూడా ఇక్కడ ఇస్తున్నాను.

1996 లో ధనుస్సులో ఉన్న గురువు, 11 సెప్టెంబర్ 2001 నాటికి మిధునరాశిలోకి వచ్చేశాడు. అక్కడే రాహువు కూడా ఉన్నాడు. కనుక, గతంలో చెప్పినట్లు గురుఛండాలయోగం మంచి పట్టులో ఉంది. ఆరోజున గ్రహస్థితిని గమనిస్తే, గ్రహాలన్నీ మిధునధనుస్సుల మధ్యలో కాలగ్రస్తయోగంలో ఉన్నట్లుగా ఉన్నాయి, ఒక్క శనిని మినహాయిస్తే.


సూక్ష్మమైన గ్రహవిశ్లేషణలోకి వెళ్లకుండా, స్థూలంగా మాత్రమే నాటి గ్రహ పరిస్థితిని వివరిస్తాను.

  • అమెరికాను సూచిస్తున్న మిధునరాశిలో 17 వ డిగ్రీమీదున్న గురువు, నాశనాన్ని కుట్రలను సూచించే వృశ్చికరాశిలో 18 వ మీదున్న ప్లూటో(యముని)తో ఖచ్చితమైన షష్టాష్టక దృష్టిని కలిగి ఉన్నాడు. మాంది కూడా ప్లుటోతో ఖచ్చితమైన డిగ్రీ సంయోగంలో కలసి ఉంటూ, భయంకరమైన మారణకాండను సూచిస్తున్నాడు.
  • హింసకు దౌర్జన్యాలకు కారకుడైన కుజుడు, మిడిల్ ఈస్ట్ కు సూచికైన ధనుస్సులో 7 వ డిగ్రీ మీదుంటూ, అదే రాశిలో 8 వ డిగ్రీ మీదున్న గురుసూచకుడై, కుహనా మతాలను, అకస్మాత్తు విలయాన్ని సూచించే కేతువుతో చాలా దగ్గరగా ఉన్నాడు. అక్కడనుండి మిధునాన్ని చూస్తున్నాడు.
  • విలాసభవనాలను, విమానాలను సూచించే శుక్రుడు, అధికారులను సూచించే సూర్యునితో ఖచ్చితమైన 2/12 దృష్టిని కలిగి ఉన్నాడు. ఆ రోజున ఈ మూడింటికీ మూడింది. అంటే, విమానాలు ఆయుధాలుగా వాడబడ్డాయి, భవనాలు కూలిపోయాయి, అధికారులు ప్రజలు వేలాదిగా చనిపోయారు.
  • బుద్ధికారకుడైన బుధుడు కన్య 20 వ డిగ్రీ మీద ఉచ్ఛస్థితిలో ఉంటూ, రాహుకేతువులతో అర్గలదోషంలో ఉన్నాడు. అంతేగాక, శనితో ఖఛ్చితంగా కోణదృష్టిలో ఉన్నాడు. దీనివల్ల, కుతంత్రాలు సఫలమవడం, తీవ్రమైన మనోవేదనతో లక్షలాదిమంది బాధపడటం సూచింపబడుతున్నది.
  • సుదూరగ్రహాలైన యురేనస్, నెప్త్యూన్లు మకరంలోనూ, ప్లూటో వృశ్చికంలోనూ ఉంటూ, ధనుస్సుకు భయంకరమైన అర్గలదోషం పట్టించారు. అందుకే, ఆనాటినుంచీ, ఆఫ్ఘనిస్థాన్లోని తాలిబాన్ కు ఇరవయ్యేళ్లపాటు మూడింది.
  • ఒక్క శనీశ్వరుడు తప్ప, మిగతా అన్నిగ్రహాలూ ఏదో ఒక రకంగా బందీలయ్యాయి. ఎలాగంటే, మిధున, కటక, సింహ, కన్యా, ధనూ రాశులు వాటిలోని గ్రహాలూ అన్నీ అర్గలదోషంతో చిక్కుకుని ఉన్నాయి.
  • ఇప్పుడు నవాంశచక్రాన్ని గమనిద్దాం. అందులో, రాహుకేతువులు రివర్స్ అయ్యి, నీచస్థితిలోకి వచ్చాయి. కనుక, తాలిబాన్ విజయం తాత్కాలికమేనని తెలుస్తోంది. అమెరికా కొట్టిన దెబ్బకు ఇరవై ఏళ్లపాటు అజ్ఞాతవాసం చెయ్యవలసి వచ్చింది.
  • శనిబుధులూ, రవిచంద్రులూ కలసి మిధున, ధనూరాశులకు విచిత్రమైన అర్గలదోషాన్ని పట్టించారు, గమనించండి. కనుక, ఆనాటినుంచీ, ఆఫ్ఘనిస్తాన్ కూ అమెరికాకూ విడదీయరాని బంధం ఏర్పడింది. రెండుప్రక్కలా, వేలాదిమంది చావులకు కారణమైంది. లక్షలకోట్ల డాలర్ల వృధాఖర్చును పెట్టించింది.
అప్పుడు మొదలైన ఒక అంకం 15 ఆగస్టు 2021 దాకా, ఇంకా చెప్పాలంటే, ఈరోజు దాకా నడిచింది. ఆఫ్ఘనిస్తాన్ లో మళ్ళీ టెర్రరిస్ట్ ప్రభుత్వం ఏర్పాటుతో, ఇంకో అంకం మొదలైంది.

(ఇంకా ఉంది)

read more " ఆఫ్గనిస్తాన్ పరిస్థితి? జ్యోతిష్య విశ్లేషణ - 3 "

7, సెప్టెంబర్ 2021, మంగళవారం

ఆఫ్గనిస్తాన్ పరిస్థితి? జ్యోతిష్య విశ్లేషణ - 2

తాలిబాన్ కాబూల్ను 27-9-1996 వ తేదీన ఆక్రమించింది. ఆరోజున కొన్ని విచిత్రమైన గ్రహస్థితులున్నాయి. అఫ్కోర్స్ ఏవీ లేకపోతే అలాంటి ఘోరమైన సంఘటన ఎందుకు జరుగుతుంది? జరగదు.

మానవజీవితాన్ని నడిపిస్తున్నట్లే, దేశాల జాతకాలను కూడా గ్రహస్థితులు నడిపిస్తాయి. దీనిని దేశజ్యోతిష్యం. లేదా మేదినీ జ్యోతిష్యం అంటారు. నిత్యనవీనమైన ఈ శాస్త్రంలో ఇదొక భాగం.

యూరప్, మిడిల్ ఈస్ట్ లు, ధనూరాశిలో ఉంటాయని గతంలో  చాలాసార్లు వ్రాసి ఉన్నాను. ఆ ప్రాంతాలలో జరిగిన గణనీయమైన సంఘటనలు, ఆ సమయాలలో ఉన్న గ్రహస్తితులను గమనిస్తే నేను చెప్పినది నిజమని మీకర్థమౌతుంది.

ఆ రోజున గురువు ధనూరాశి 14 వ డిగ్రీమీదున్నాడు. రాహువు కన్య 14 వ డిగ్రీ మీదుంటూ, గురువుతో ఖచ్చితమైన కేంద్రదృష్టిలో ఉన్నాడు. గురువు శుక్రనక్షత్రంలో ఉన్నాడు. శుక్రుడు నీచకుజునితో కలసి కర్కాటకంలో ఉన్నాడు. రాహువు సూర్యుని మ్రింగడానికి సిద్ధంగా ఉన్నాడు. కేతువు, గురువును సూచిస్తూ, చంద్రునితో కలసి సూడో గజకేసరీ యోగంలో మీనంలో ఉన్నాడు. బుద్ధికారకుడైన బుధుడు తీవ్రమైన అర్గలదోషానికి గురై, వక్రశనితో సూటిగా చూడబడుతున్నాడు. ధనూరాశిలో కాబూల్ డిగ్రీలమీదున్న గురువు, రాహుకేతువులతో ఖచ్చితమైన అర్గలదోషానికి గురయ్యాడు.

ఈ మొత్తం గ్రహస్థితిని డీకోడ్ చేస్తే, ఏమర్ధమౌతుంది?

ఆఫ్ఘనిస్తాన్ లోని కుహనా మతశక్తులకు బలం పెరుగుతుంది. కాబూల్ డిగ్రీ, ధనుస్సు 11 నుండి 14 మధ్యలో ఉంటుందని కొందరు లొకేషనల్ జ్యోతిశ్శాస్త్రవేత్తల అంచనా. దానిని గురువు ఆక్రమించడం, రాహుకేతువులు దానిని అర్గలదోషంలో బంధించడం వల్ల, దుష్ట తాలిబాన్ చేతిలోకి కాబూల్ వెళ్లిపోతుందన్న సూచన, ఆరోజున బలాతిబలంగా కనిపిస్తున్నది.

గోచారంలో గురుఛండాలయోగంలోనూ, నీచశుక్రుని స్థితిలోనూ, గురుశుక్రుల సంబంధం కలిగి గురుబలం తగ్గినపుడూ, ఇస్లామిక్ రాక్షసమూకలు పెట్రేగిపోయి, సాటిమానవుల మీద అరాచకాలు దౌర్జన్యాలూ చేయడాన్ని, చరిత్రలో మనం ఎన్నిసార్లయినా గమనించవచ్చు..

ఖచ్చితంగా ఆరోజున అదే జరిగింది !

(ఇంకా ఉంది)

read more " ఆఫ్గనిస్తాన్ పరిస్థితి? జ్యోతిష్య విశ్లేషణ - 2 "

5, సెప్టెంబర్ 2021, ఆదివారం

సిద్ధార్థ శుక్లా ప్రేమికురాలు షెహనాజ్ గిల్ జాతకం

ఈ అమ్మాయి సిద్ధార్థ శుక్లా ప్రేమికురాలు, టీవీ నటి.  సిద్ధార్ధ మరణించాక ఈ అమ్మాయి పరిస్థితి గందరగోళంగా ఉంది. జాతకంలోకి తొంగి చూద్దాం.

ఈ అమ్మాయి 27-1-1993 న సాయంత్రం 4.59 కి అమృత్ సర్ లో పుట్టింది. జాతకాన్ని ప్రక్కన చూడవచ్చు.

సప్తమంలో శని బుధ రవులున్నారు. కనుక కళత్రభావం బాగా దెబ్బతిన్నది. చంద్రలగ్నాత్ సప్తమాధిపతి బుధుడు ఏకాదశంలో అస్తంగతుడయ్యాడు. సూర్యుడు షష్టాధిపతిగా గుండెజబ్బుకు సూచకుడు. ఏకాదశం సహజ దశమభావమైంది. కనుక వృత్తిపరంగా పరిచయమైన ప్రేమికుడు/కాబోయే భర్త గుండెజబ్బుతో మరణిస్తాడని సూచన ఈ అమ్మాయి జాతకంలో స్పష్టంగా ఉంది.

పంచమ లాభస్థానాలలో నీచస్థితిలో ఉన్న రాహుకేతువులు, ప్రేమవ్యవహారం వల్ల ఘోరమైన దెబ్బతగులుతుందని సూచిస్తున్నారు. ఇది భయంకరమైన పుత్రదోషం కూడా. చంద్రలగ్నాధిపతి గురువు సప్తమంలో బాధకస్థానంలో ఉంటూ, తీవ్రమైన ప్రేమను, దానివల్ల కలిగే బాధలనూ సూచిస్తున్నాడు.

దారాకారాకుడిగా శుక్రుడు ఉచ్ఛస్థితిలో ఉన్నట్లు కనిపిస్తాడు కనుక వివాహజీవితం చాలా బాగుంటుందని సాధారణ జ్యోతిష్కులు అనుకుంటారు. కానీ ఆయన సున్నా డిగ్రీలలో ఉంటూ అష్టమభావపు ప్రభావాన్ని పూర్తిగా కలిగి ఉన్నాడు. కనుక భర్త మరణిస్తాడన్న సూచన మళ్ళీ గోచరిస్తున్నది.

సప్తమభావంపైనా, సప్తమాధిపతి శనిపైనా, షష్ఠాధిపతి గురువు దృష్టి, జీవితభాగస్వామి ఆరోగ్యవంతుడు కాడని సూచిస్తున్నది. దారాకారకుడైన శుక్రునిపైన నీచరాహుదృష్టి కూడా దీనినే సూచిస్తున్నది.

ఈ జాతకంలో ప్రస్తుతం బుధ - రాహు - చంద్ర - బుధదశ జరుగుతున్నది. భర్త/ప్రేమికుడు మరణించడం, దానివల్ల కలిగే ఘోరమైన డిప్రెషనూ, గందరగోళ పరిస్థితీ, ఇంటిలో గొడవలూ స్పష్టంగా కనిపిస్తున్నాయి. గోచారంలో ఉన్న దశమశని చతుర్ధాన్ని చూస్తూ, సుఖస్థానాన్ని పాడుచేస్తున్నాడు. లాభస్థానంలోకి వచ్చిన నీచగురువు  బుధుని అస్తంగత దోషాన్ని నిద్రలేపుతున్నాడు. కనుక ప్రస్తుతం ఈ అమ్మాయి ప్రేమికుడైన సిద్ధార్ధ శుక్లా గుండెపోటుతో మరణించాడు.

ఎవరి జీవితంలోనైనా సరే, జరుగుతున్న సంఘటనలు, ఈ విధంగా జాతకంలో స్పష్టంగా ప్రతిఫలిస్తాయి. గ్రహస్థితులను అర్ధం చేసుకునే ప్రజ్ఞా, పరిహారాలతో విధిని మార్చగలిగే శక్తీ, మనలో ఉండాలి. అప్పుడు జాతకం మారుతుంది. లేకుంటే పూర్వకర్మను అనుభవించక తప్పదు.

ఈ అమ్మాయి విషయంలో రెండవదే జరిగింది.

read more " సిద్ధార్థ శుక్లా ప్రేమికురాలు షెహనాజ్ గిల్ జాతకం "

4, సెప్టెంబర్ 2021, శనివారం

అమెరికాను వణికించిన ఇడా హరికేన్

ఒకప్రక్కన ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు విజయసంబరాలు జరుపుకుంటుంటే, ఇంకోప్రక్కన అమెరికాను ప్రకృతి కాటేసింది. ఏంటి ఈ దుశ్శకునం? అంతర్జాతీయంగా అప్రతిష్ట పాలై, అందరిచేతా ఛీ కొట్టించుకుంటున్న అమెరికా, ప్రకృతి చేతిలో కూడా తన్నులు తినాలా? ఏంటి దీనర్ధం? 

క్యూబా మీదుగా అమెరికాను దాటి ఈశాన్యతీరాన్ని వణికించి అట్లాంటిక్ సముద్రంలో అంతమైన ఇడా తుఫాన్ వారంపాటు అమెరికాకు నిద్రపట్టకుండా చేసింది.

ఈ సమయంలో ఉచ్ఛకేతువు జలతత్త్వరాశి అయిన వృశ్చికం 11 వ డిగ్రీమీద సంచరించాడు. మిధునంలో ఇది ఖచ్చితంగా న్యూయార్క్ ను సూచించే డిగ్రీ. షష్టాష్టక దృష్టి వల్ల, అందుకే అక్కడ అంత విధ్వంసం జరిగింది. ఈ సమయంలో మిధునరాశికి డబల్ పాపార్గళం పట్టి ఉండటాన్ని గమనించవచ్చు.

న్యూయార్క్, న్యూజెర్సీలలో ఎమర్జెన్సీ విధించారు. పదిలక్షలమంది కరెంటు లేని రోజులను గడిపారు. న్యూయార్క్ నగరాన్ని వరదనీరు ముంచెత్తింది. సెల్లార్ గదుల్లో అద్దెకున్న చిన్న ఉద్యోగస్తులు దాదాపు 50 మంది, తప్పించుకునే మార్గం లేక నీటిలో మునిగి చనిపోయారు. వెంటిలేషన్ లేని సెల్లారు గదుల్లో జెనరేటర్ పెట్టుకుని దాని పొగకు ఊపిరాడక కొంతమంది చనిపోయారు. వరదనీటిలో నడుచుకుంటూ పోతున్న ఒకరిద్దరిని, నీళ్లలో కొట్టుకొచ్చిన మొసళ్ళు తినేశాయి. ఇవన్నీ జరిగింది ఎక్కడో అడవిలోనో, పల్లెటూళ్లలోనో, పేదదేశాల లోనో కాదు. సాక్షాత్తు న్యూయార్క్ మహానగరంలో !

కూపాలు, గుంతలు, సెల్లార్లు మొదలైనవన్నీ వృశ్చికరాశి అధీనంలో ఉంటాయి. అది జలతత్వరాశి. కనుకనే సెల్లార్లలోకి వరదనీరు దూసుకొచ్చి అంతమందిని చంపేసింది. ఇక, మొసలి అంటే మకరరాశి. అందులో ఉండవలసిన శని వక్రించి ధనుస్సులో కొచ్చాడు. కుంభంలో ఉన్న గురువు వక్రించి మకరంలోకి నీచస్థితిలోకి వచ్చాడు. మొసళ్ళు న్యూయార్క్ నగరంలోకి ప్రవేశించి మనుషులను తినడం వింతగా లేదూ మరి? 

దీనివల్ల అమెరికాకు జరిగిన నష్టం, జస్ట్ 50 బిలియన్ డాలర్లని అంచనా. అంటే మన లెక్కల్లో, కేవలం 3 లక్షల 65 వేల కోట్ల రూపాయలు. చాలా చిన్న మొత్తం కదా !

నలభై ఏళ్లుగా పాకిస్తాన్ కు వంతపాడి, తాలిబాన్లను పుట్టించి, పోషించి, ఇంతమంది చావులకు కారణమై, చివరకు వేలాదిమంది తమవాళ్ల చావులకు కూడా కారణమై, ఇప్పుడు అర్ధాంతరంగా అన్నీ వదిలేసి పారిపోయి, ఇన్ని లక్షలమందిని  ముంచేసి, వాళ్ళ  అగచాట్లకు, శాపనార్ధాలకు కారణమైన పాపం ఊరకే ఎలా పోతుంది మరి?

చేసేటప్పుడు నవ్వుతూ చేసి, ఏడ్చేటప్పుడు ఏడుస్తూ ఏడవడమంటే ఇదే మరి ! సోకాల్డ్ మేధావుల ఫారిన్ పాలసీల నిర్వాకం ఇలా ఉంటుంది ! గ్రహించండి !
read more " అమెరికాను వణికించిన ఇడా హరికేన్ "

ప్రత్యూష బెనర్జీది హత్యా ఆత్మహత్యా?

సిద్ధార్ధ అనే హిందీ నటుడిది జాతకం వేశాక, 'ఇతనితో బాలికా వధు (చిన్నారి పెళ్లికూతురు) అనే సీరియల్లో నటించిన ప్రత్యూష బెనర్జీ అనే అమ్మాయి కూడా చనిపోయిందని, అదికూడా 2016 లో నని  కొందరు నాతో చెప్పారు. నేనీ సీరియల్సూ, చెత్తా చెదారమూ, చూడను గనుక, అసలు మా ఇంటికి టీవీ కనెక్షన్ పీకించేశాను గనుక, నాకీ విషయాలు తెలియవు. ఈలోపల, ఆ అమ్మాయిది హత్యో ఆత్మహత్యో చూడమని, కర్ణపిశాచి నా ఎడమచెవిలో సవాల్ విసిరింది. మనుషులు చూడమని అడిగితే మనం చూడం కదా, సర్లే పాపం పిశాచి అడిగిందని చూస్తున్నా ! మనుషులకంటే అవే నయం మరి !

ఈ అమ్మాయి 10-8-1991 న ఉదయం 4. 20 కి జంషెడ్ పూర్లో పుట్టిందని వివరాలు దొరికాయి. నిజమో కాదో దేవుడికెరుక. అయినా జాతకం చూద్దాం.

తెలుగులో కూడా ఒక ప్రత్యూష అనే నటి ఉండేదని, ఆమె కూడా ఇలాగే చంపబడిందని, ఆమెను రేప్ చేసిన నీచులు హాయిగా తప్పించుకుని, ప్రస్తుతం అమెరికాలో హ్యాపీగా తిరుగుతున్నారని నాతో కొందరన్నారు. ప్రకృతి న్యాయస్థానంలో వాళ్లకు భయంకరమైన శిక్ష తప్పదని వారితో అన్నాను. సరే ఆ విషయమలా ఉంచి, ఈ చార్ట్ లోకొద్దాం.

ఈ అమ్మాయి అమావాస్య రోజున పుట్టింది. అది లగ్నంలోనే ఉంది. కనుక ఈమెది చీకటిజీవితమే. అయితే గురువు కూడా ఉచ్ఛస్థితిలో ఉన్నాడు. గతకర్మ కొంత మంచిది. అందువల్ల అదృష్టం కలసి వస్తుంది. అయితే, ఇది కాలసర్పయోగజాతకం. శత్రుస్థానంలో శపితయోగం కూడా ఉంది. సప్తమ అష్టమాధిపతి అయిన శని, శత్రుస్థానంలో శపితయోగంలో ఉండటం వల్ల, ప్రియుడు లేదా భర్త ఈమె చావుకు కారకుడౌతాడని సూచన స్పష్టంగా ఉన్నది. వక్రులైన బుధశుక్రులు కూడా లగ్నంలోకి వస్తారు. లగ్నం తీవ్రమైన పాపార్గళానికి గురయ్యింది. ఈ కారణాలచేత, ఈ అమ్మాయి చాలా మంచిదని, అమాయకురాలని, తేలికగా మోసపోతుందని, క్రిమినల్స్ నుంచి ఎంతో వత్తిడికి గురవుతుందని, చివరకు విషాదాంతమని చెప్పవచ్చు.

కర్కాటక లగ్నానికి బుధశుక్రశనులు మంచిని చెయ్యరు. వీరిలో బుధశుక్రులు డిగ్రీ కంజంక్షన్ మీదున్నారు. వీరితో పంచమాధిపతి కుజుడు కలిసున్నాడు. వీరందరూ మారకస్థానంలో ఉన్నారు. పైగా, నీచకేతువు నక్షత్రంలో ఉన్నారు. స్నేహాలు, ప్రేమవ్యవహారాలే ఈమె బలవంతపు చావుకు కారణమౌతాయని ఇవి చెబుతున్నాయి.

ఈ అమ్మాయి 1-4-2016 న ఉరేసుకుని చనిపోయినట్లు లోకాన్ని నమ్మించారు. ఆ రోజున, ఈమె జాతకంలో శుక్ర-రాహు-రాహు-కేతుదశ నడిచింది. రాహువు శత్రుస్థానంలో నీచస్థితిలో ఉంటూ శనితో కలసి శపితయోగంలో ఉన్నాడు. శుక్రుని సంగతి పైన చెప్పాను. కేతువు నీచబుధుడిని సూచిస్తూ ద్వాదశంలో ఉంటూ రహస్యాలను, కుట్రలను, బలవంతపు చావును సూచిస్తున్నాడు. ఈ మొత్తం వ్యవహారంలో లగ్నాధిపతి అయిన చంద్రుని పాత్ర లేదు. కనుక ఈమెది ఆత్మహత్య కాదు.

1-4-2016 న  ముంబాయి లో గ్రహస్థితి ఇలా ఉంది.

మారకస్థానంలో గురురాహువులు సంచరిస్తూ గురుఛండాలయోగాన్నిస్తున్నారు.  అంటే, బాంబే సినీ ఫీల్డ్ లోని మాఫియా పాత్ర స్పష్టంగా కనిపిస్తోంది. పంచమంలో దుర్ఘటనాయోగం స్పష్టంగా ఉంటూ తీవ్రమైన షాక్ ను సూచిస్తున్నది. నవమంలో నీచబుధుడు, ఉచ్ఛశుక్రుడు ఉంటూ, ఆయుష్య స్థానాన్ని చూస్తున్నారు. సినీ పెద్దలనుంచి  సెక్స్ పరమైన ట్రాప్ లు, కుట్రలు, వాటిల్లో ఇరుక్కోవడం క్లియర్ గా కనిపిస్తున్నాయి. అదే రోజున ఈ అమ్మాయి చంపబడింది.

ఉరిచావులలో రుజువయ్యే జైమినీమహర్షి సూత్రం ఈ జాతకంలో లేదు. గమనించండి. దీనిగురించి గతంలో కొన్ని జాతకాలలో వ్రాశాను, చూసుకోండి.

కనుక ఈ అమ్మాయిది హత్యేగాని, ఆత్మహత్య కాదని చెబుతున్నాను. ఈ అమ్మాయి సినీమాఫియా ఉచ్చులో ఇరుక్కుంది. మోసపోయింది. బయటకు రాలేకపోయింది.  హత్యకు గురయ్యింది. ఇందులో ప్రియుడిపాత్ర ఖచ్చితంగా ఉంది. లోకాన్ని నమ్మించవచ్చు, నేరస్థులు తప్పించుకుని తిరుగవచ్చు. కానీ వారికి శిక్ష తప్పదు. అదెలా పడుతుందో  మానవమాత్రులకర్ధం కాదు. నాకర్ధమైనా బయటకు చెప్పను, మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు నష్టం లేదు.

సరేనా పిశాచీ ! ఇంకెప్పుడూ ఇలాంటి జాతకాలు చూడమని అడక్కు.

read more " ప్రత్యూష బెనర్జీది హత్యా ఆత్మహత్యా? "

3, సెప్టెంబర్ 2021, శుక్రవారం

కండలున్నంత మాత్రాన ఆరోగ్యం కాదు - సిద్ధార్ధ శుక్లా జాతకం ఏమంటోంది?

సెలబ్రిటీ నటుడు సిద్ధార్ధ శుక్లా, గుండెపోటుతో చనిపోయాడు. ఇతనికి 40 ఏళ్ళు మాత్రమే. జాతకాన్ని గమనిద్దాం.

మీకు గుర్తుందో లేదో? గతంలో ఒక పోస్టులో, 'నేటి నటీనటులు కండలు పెంచడం మీద ఉన్న శ్రద్ధను ఆరోగ్యం మీద చూపడం లేదు. జిమ్ములు చేసి సిక్స్ ప్యాక్ పెంచినంతమాత్రాన ఆరోగ్యంగా  ఉన్నట్లు కాదు' అని వ్రాశాను. అది నిజమైంది చూడండి. అందులోనూ, నటులకు సూచకుడైన శుక్రుడు గోచారంలో నీచస్థితిలో ఉండగా !

సిద్ధార్ధ శుక్లా, 12-12-1980 న ఉదయం 10. 20 కి ముంబాయిలో పుట్టాడని వివరాలు లభిస్తున్నాయి. ఇతని జాతకాన్ని ప్రక్కనే ఇచ్చాను చూడండి. 1980 జాతకాలలో ఒక భయంకరమైన దోషం ఉన్నది. అదే, శనిగురువుల డిగ్రీ సంయోగం. 1980 ప్రాంతాలలో పుట్టినవారికి జీవితమూ, సంసారజీవితమూ రెండూ సరిగ్గా ఉండవు. దీనిని చాలా జాతకాలలో గమనించాను. ఇతనిది మకరలగ్న జాతకం. మకరరాశి కూడా. కనుక కన్య ఇతనికి భాగ్యస్థానమైంది. శని లగ్నాధిపతి కావడంతో యోగమిచ్చింది. కానీ ఇది అవయోగం కూడా. పైగా ఇది కాలగ్రస్తయోగ జాతకం. దశమంలో శుక్రుని స్వక్షేత్రస్థితి వల్ల బుల్లితెరమీద వెలిగాడు. అంతా బాగున్నట్లు భ్రమ కల్పించింది లగ్నాన్ని కొట్టిన రాహుకేతువులు ఇరుసు.

ఇతని నవాంశ చక్రం ఏమీ బాగా లేదు. రాశిచక్రం కంటే అంశచక్రాలు బలమైనవి. నవాంశలో రాహుకేతువులు నీచస్థితిలో ఉన్నారు. శనిగురుయోగం లగ్నంలోనే ఉన్నది. గమనించండి. లగ్నాధిపతి శుక్రుడు మారకస్థానంలో నీచకేతువుతో కలసి ఉంటూ సినిమా రంగమూ, హైఫై జీవితమూ ఇతని చావుకు కారణాలౌతాయని స్పష్టంగా చూపిస్తున్నాడు.

చాలామంది బాలీవుడ్ నటులలాగే ఇతనూ ఫిట్నెస్ ఫ్రీకే, కండలు బాగా పెంచాడు. కానీ గుండెను చూచుకోలేదు. కారణాలు అనేకం. హైఫై సొసైటీ అలవాట్లు, సిగరెట్లు, త్రాగుడు, పిచ్చిపిచ్చి డైటింగులు చెయ్యడం, ఆహారవిహారాలలో నియమం లేకపోవడం, మితిమీరిన ఇంగిలీషు మందులవాడకం, బలం అంటూ విటమిన్ సప్లిమెంట్లు వాడటం, బరువులెత్తి బాడీని పెంచడం - ఇవే కారణాలు. మాకు ట్రెయినర్లు ఉన్నారని అనుకుంటారు. ట్రెయినర్లకు తెలిసింది ఎంత? అన్నది మర్చిపోతారు. కొంపలు మునుగుతాయి.

నటులకు కావలసింది టాలెంట్, అంతేగాని కండలు కావు. పాతతరం నటులు ఫిట్నెస్ చూసుకునేవారు. అంతేగాని, పెద్ద పెద్ద నటులెవరూ కండలు పెంచలేదు.  ఇది నేటి తరానికి పట్టిన దరిద్రం మాత్రమే. అసలైన టాలెంట్ లేనప్పుడు ఒళ్ళు చూపించుకోవడమే కదా వీళ్ళు చెయ్యగలిగింది? కండలతో అమ్మాయిలను మెప్పించవచ్చని చాలామంది నటులు అనుకోవడం పిచ్చిభ్రమ. నీ దగ్గర డబ్బుల్లేనప్పుడు, ఉత్తకండలకు ఏ అమ్మాయీ ఇంప్రెస్ కాదు. పైగా, నేటి తెలుగు నటులలో చాలామందికి స్పష్టమైన ఉచ్చారణ లేదు. తెలుగు మాట్లాడటం రాదు. ఒత్తులు పలకవు. అతివేషాలు తప్ప అసలైన నటన ఎవరిలోనూ లేదు. వీళ్ళను చూచి కుర్రకారు వెర్రెక్కి పోవడం ! ఎంత దరిద్రమో? 

ఇవి కనిపించే కారణాలు. బైటకు కనిపించనివి, మామూలు మనుషులకు అర్ధంకానివి, అయిన కారణాలు జాతకంలో దాగి ఉంటాయి. అవేమిటో చూద్దాం.

శ్లో || అష్టమమ్ ఆయుషష్ఠానమష్టమాదష్టమమ్ తథా
తయోరపి వ్యయస్థానం మారకస్థానముచ్యతే || 

అంటుంది జాతకచంద్రిక. 

దీనినిబట్టి అష్టమం, తృతీయం ఆయుష్యస్థానాలు. వీటికి వ్యయాలైన సప్తమం, ద్వితీయాలు మారకస్థానాలని అర్ధం. మకరరాశికి అష్టమాధిపతి సూర్యుడు. సూర్యుడు గుండెజబ్బులను సూచిస్తాడు. మకరలగ్నజాతకులు చాలావరకూ గుండెజబ్బుతో చనిపోవడం కొన్ని వేల జాతకాలలో కనిపించిన వాస్తవం. సూర్యుడీ జాతకంలో నెప్ట్యూన్ తోనూ, షష్టాధిపతి అయిన బుధునితోనూ కలసి, త్రాగుడు, మత్తుపదార్ధాలు ఇతని ఆరోగ్యాన్ని చెడగొట్టి గుండెను పాడుచేస్తాయని స్పష్టంగా చెబుతున్నాడు. తృతీయాధిపతి గురువు నవమంలో శత్రుస్థానంలో ఉంటూ ఆహారపు అలవాట్ల వల్ల ఆరోగ్యం ఆయుష్షు రెండూ పాడవడం సూచిస్తున్నాడు. ఈ ఇద్దరూ ఒకరు స్థిరరాశిలోనూ, మరొకరు ద్విస్వభావరాశిలోనూ ఉంటూ,  ఈ జాతకుడు మధ్యాయుష్కుడని చెబుతున్నారు. అంటే 33-66 ఏళ్ల మధ్యలో పోతాడని అర్ధం. అదేగా జరిగింది మరి !

సత్యాచార్యుని అంశాయుర్దాయగణనం చేస్తే ఒక మనిషి ఆయుష్షు ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ విధానం గతంలో చాలా జాతకాలలో వివరించి ఉన్నాను గనుక మళ్ళీ  అవసరం లేదు.

22వ ద్రేక్కాణం, 64 వ నవాంశలు మరణాన్ని స్పష్టంగా చూపుతాయన్నది కొన్ని వేల జాతకాలలో రుజువైన ప్రాచీన జ్యోతిశాస్త్ర సూత్రం. ఈ జాతకంలో దీనిని గమనిద్దాం.

లగ్నం ద్వితీయ ద్రేక్కాణమైంది. అష్టమం నుంచి ద్వితీయ ద్రేక్కాణాధిపతి గురువు. ఆ గురుదశ చివరలో ఛిద్రసమయంలోనే ఇతను చనిపోయాడు గమనించండి.

లగ్నం అయిదవ నవాంశ అయింది. 64 వ నవాంశ సింహంలో ఉంటుంది. సరిగ్గా ఇదే నవాంశ మీద సెప్టెంబర్ 1 న సూర్యుడు సంచరించాడు. సెప్టెంబర్ 2 న ఇతను చనిపోయాడు. గమనించండి.

చంద్రుడు మూడవ ద్రేక్కాణంలో ఉన్నాడు. సింహం నుంచి మూడవద్రేక్కాణం మేషమౌతుంది. ప్రస్తుతం మేషరాశి తీవ్రమైన అర్గలదోషంలో చిక్కుకుని ఉన్నది.  ఇది, స్నేహితులు, పని ఒత్తిడి, టెన్షన్లు, మొదలైన అనేక ప్రభావాలకు సూచిక.

చంద్రుడు ఏడవ నవాంశలో ఉన్నాడు. సింహంనుంచి ఇది తుల అవుతుంది. దీని అధిపతి శుక్రుడు ప్రస్తుతం నీచస్థితిలో ఉంటూ ఆయుష్యస్థానాన్ని చూస్తున్నాడు గమనించండి.

సరిపోయిందా లేదా?

ప్రస్తుతం ఇతనికి గురు - రాహు - శనిదశ జరుగుతున్నది. ఇది ఛిద్రదశలో శపితయోగదశ. గోచారంలో ఏలినాటిశని మంచి పట్టులో ఉన్నది. లగ్నంలో నీచగురువుంటూ గురుదోషాన్ని అనుభవింపజేస్తున్నాడు. గోచార నీచశుక్రుడు, ఉచ్చ బుధుడు, జననకాల శనిగురువులపైన సంచరిస్తున్నారు. జననకాల దోషాన్ని నిద్రలేపుతున్నారు. వీరందరూ కలసి ఆయుష్యస్థానాన్ని చూస్తున్నారు. ఇవి ఏం చేస్తాయో నేను చెప్పనక్కర్లేదు. ఏం జరిగిందో చూచారుగా మరి?

జాతకాలను, గ్రహాలను, తక్కువగా తేలికగా ఎప్పుడూ తీసుకోకూడదు. అవి మన జీవితాలను నడిపే అదృశ్యశక్తులు. జిమ్ము చేసి కండలు పెంచినంత మాత్రాన ఆరోగ్యమనీ భ్రమించకూడదు. మితిమీరిన ఉపవాసాలెంత ప్రమాదమో, మితిమీరిన కీటో డైటూ అంతే ప్రమాదం. మితిమీరిన వెయిట్ లిఫ్టింగ్ చెయ్యడం గుండెకు చెరుపు చేస్తుందన్నది వాస్తవం. ఎంతోమంది బాడీబిల్డర్స్, బాక్సర్స్, వెయిట్ లిఫ్టర్స్ జాతకాలలో ఇది రుజువైంది. తిండి తగ్గించి మితిమీరి పనిచేస్తే, అది గుండెను నాశనం చేస్తుంది. స్మోకింగ్ అలవాటుంటే ఇది ఖచ్చితంగా జరుగుతుంది. సిగరెట్లు త్రాగేవాళ్లకు గుండెపోటు ఖచ్చితంగా వస్తుంది. తిండి, వ్యాయామం, ఆహారపు అలవాట్లు - వీటిమధ్యన చాలా సున్నితమైన బేలన్స్ ఉంటుంది. దీనిని గమనించుకుంటూ వీటిని చెయ్యాలి. అందరికీ అన్ని వ్యాయామాలూ సరిపోవు. అందరికీ అన్ని తిండ్లూ సరిపోవు. ఎవరో చేశారని మనం చేస్తే ఒళ్ళు గుల్ల అవుతుంది,

50 ఏళ్ల క్రితం బ్రూస్లీ చావుకూ అతిగా చేసిన వ్యాయామాలే కారణం. నిన్న సిద్ధార్ధ శుక్లా చావుకూ అవే కారణం.

డియర్ యూత్ ! ఒళ్ళూ మనసూ జాగ్రత్త మరి !
read more " కండలున్నంత మాత్రాన ఆరోగ్యం కాదు - సిద్ధార్ధ శుక్లా జాతకం ఏమంటోంది? "

ఆఫ్గనిస్తాన్ పరిస్థితి? జ్యోతిష్య విశ్లేషణ - 1

ఆఫ్ఘనిస్తాన్ అనే దేశం కొన్ని వేల ఏళ్లుగా, అల్లరిమూకల రణరంగం గానే ఉంటూ వచ్చింది. ఎందుకలా? అంటే, కొన్ని కారణాలున్నాయి. ముఖ్యమైన కారణం మాత్రం ఒకటే.

యూరోప్ కీ ఆసియాకీ ఇది సరిహద్దులాంటిది. ఈ రెండు సంస్కృతులూ ఇక్కడ కలుస్తాయి. ఒకరకంగా చెప్పాలంటే, ఈ రెండు ప్రాంతాలకూ ఇదొక తలుపు లాంటిది. యూరోప్, ఆసియాల మధ్య రాకపోకలు ఆఫ్ఘనిస్తాన్నుంచే జరగాలి. కాబట్టి, వేలాది సంవత్సరాలనుంచీ ఇదొక హైవే సిటీలా ఉంటూ వచ్చింది. దీనిగుండా రాకపోకలు చేసిన ప్రతి తెగా, దీన్ని ఆక్రమించిన ప్రతి తెగా, దీని జీవితాన్ని ప్రభావితం చేస్తూ వచ్చాయి.

హైవే మీద ఒక ఊరుంటే, అదొక మార్కెట్ లాగా అవుతుంది. ప్రయాణం కోసం కొందరు, వ్యాపారం కోసం కొందరు. ఇంకా రకరకాల పనులకోసం కొందరు, ఇలా ఎంతోమంది దానిలోకి వచ్చీపోతూ ఉండటంతో, అదొక కలగూరగంపలాగా తయారౌతుంది. ఎన్నో జాతుల, సంస్కృతుల ప్రభావాలకు లోనౌతుంది. ఆఫ్ఘనిస్తాన్ కు కూడా అదే జరిగింది.

క్రీపూ 1500 ప్రాంతంలో దీనిని గాంధారదేశం అనేవారు. అది ప్రస్తుతపు ఇరాన్ నుంచి సింధులోయ వరకూ వ్యాపించి ఉండేది. ఆ తరువాత కాంభోజరాజ్యం అనేవారు. దానిని అశ్వకులు అనే జాతి పాలించేవారు. గుర్రాలమీద తిరిగేవారినే అశ్వకులనేవారు.  వీళ్ళు ఈనాటికీ హిందూకుష్ పర్వతప్రాంతంలో (నేటి పంజషీర్ ప్రాంతం) అష్కున్, యాష్కున్ అనే పేర్లతో కొనసాగుతున్నారు. ఇవన్నీ 'అశ్వక' అనే సంస్కృతపదానికి అపభ్రంశపదాలే.

500 బీసీ లో బాబిలోనియా రాజు డేరియస్ - 1 దీన్ని జయించాడు. 329 బీసీ లో అలెగ్జాన్డర్ దీనిని జయించాడు. మౌర్యుల కాలంలో ఈ ప్రాంతం అశోకచక్రవర్తి అధీనంలో ఉండేది. తరువాత కుషాణులు దీనిని పరిపాలించారు. ఆ తరువాత చాలామంది దీనిని జయించినప్పటికీ, ఇక్కడ చాలా తెగలు, వాళ్ళ సంస్కృతులు, చిన్నచిన్న రాజ్యాలు ఉన్నందువలన, అదొక కొండప్రాంతమై నందువలన, ఒక దేశంగా ఇది గుర్తింపబడలేదు.

దాదాపు 1500 సంవత్సరాలు ఇలా గడిచాక, 10 శతాబ్దంలో దీనిని జయపాలుడనే భారతరాజు పరిపాలించాడు. 13 వ శతాబ్దంలో చెంగిజ్ ఖాన్ దీనిని జయించాడు. ఇతను ముస్లిం కాదు. ఖాన్ అనేది మంగోలియాలో, 'రాజు' అనే పదానికి సమానార్ధకమే గాని, ఇస్లామిక్ పేరు కాదు. క్రీశ 1700, 1800 వరకూ ఇక్కడ ఇస్లాం మతం వేళ్లూనుకోలేదు. వీళ్ళు జొరాష్ట్రియన్ మతాన్ని, బౌద్ధమతాన్ని, సూర్యారాధనను, హిందూమతాన్ని పాటించేవారు. ఈనాటికీ అక్కడి ముస్లిములలో సూర్యారాధకులున్నారు.

బమియాన్ లో ఉన్న ప్రసిద్ధ బుద్ధవిగ్రహాన్ని తాలిబన్లు షూటింగ్ రేంజ్ టార్గెట్ గా వాడుకుని, కూల్చేశారు. అప్పుడు, పంజషీర్ తిరుగుబాటు నాయకుడు అహమద్ షా మసూద్ సైన్యానికి తాలిబన్లు కొందరు దొరికిపోయారు. మసూద్ కూడా ముస్లిమే అయినప్పటికీ, మోడరన్ భావాలున్న లిబరల్ ముస్లిం. వారిని మసూద్ ఇలా అడిగాడు.

'ఎందుకు మీరు బుద్ధవిగ్రహాన్ని తుపాకులతో కాల్చి ధ్వంసం చేశారు?'

వాళ్లలో ఒకడు ఇలా చెప్పాడు.

'ఇస్లాం ప్రకారం ఏ ఆకారాన్నీ పూజించకూడదు. అందుకే అలా చేశాం'

అప్పుడు, మసూద్ ఇలా అడిగాడు.

'ఈ ప్రాంతంలో చాలామంది సూర్యారాధకులున్నారు. సూర్యుడిని కూడా అలాగే కూల్చేసి, ప్రపంచాన్ని చీకట్లో ముంచేద్దామనుకుంటున్నారా మీరు?'

మూర్ఖ తాలిబన్ ఏం చెప్పాడో తెలీదు. చెప్పడానికి వాళ్ళదగ్గర లాజిక్కేముంటుంది గనుక? బూజుపట్టిన ఖురాన్ను గ్రుడ్డిగా నమ్మడం ఒక్కటే వాళ్లకు తెలిసిన లాజిక్.

లిబరల్ ముస్లిం అయిన మసూద్ ను అతని 46 వ ఏట హత్య చేసి చంపేశారు పాకిస్తాన్ నీచులు. ఇది సరిగ్గా 2001 లో ట్విన్ టవర్స్ కూలిపోవడానికి ఒక వారం ముందు జరిగింది.

ఇస్లాం అడుగుపెట్టాకనే ఆఫ్ఘనిస్తాన్ లో అరాచకం మొదలైంది. అంతకు ముందు, అది చాలావరకూ శాంతిగా బ్రతికిన ప్రాంతమే. అంతెందుకు? ఈనాడు ప్రపంచంలో ఎక్కడ గొడవలున్నా, ఎక్కడ శాంతి లేకపోయినా, ఎక్కడ కుట్రలు కుతంత్రాలూ ఉన్నా, అవి రాడికల్ ఇస్లాం వల్లనేనన్నది అందరికీ తెలుసు. రాడికల్ ఇస్లామన్నది ప్రపంచానికి పట్టిన అతిపెద్ద దరిద్రం. దానిని పోషిస్తున్న సైతాన్ దేశం పాకిస్తాన్. ఈ సంగతి అన్ని దేశాలకూ తెలుసు. ఇన్నాళ్లూ తెలియనట్లు నటించిన అమెరికాకూడా ఇప్పుడు  మూతి పగిలాక ఒప్పుకుంటోంది. రాడికల్ ఇస్లాం, పాకిస్తాన్ ఈ రెండూ లోకంలో లేకుండా పోతే తప్ప, ప్రపంచానికి శాంతి అనేది ఎప్పటికీ ఉండదు.

మనకు స్వాతంత్య్రం రాకముందు పాకిస్తాన్ అనే నీచపు దేశం లేదు. ఆ నీచులందరూ మన దేశంలోనే ఉంటూ, మనకే గోతులు త్రవ్వుతూ ఉండేవాళ్ళు.  ఆఫ్ఘనిస్తాన్ వరకూ అప్పుడు ఇండియా సరిహద్దులు ఉండేవి. అందుకనే స్వాతంత్రపోరాటం సమయంలో సరిహద్దు గాంధీ అని పిలువబడే 'ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్', గాంధీతో కలసి మనవాళ్ళు చేసిన సత్యాగ్రహంలో పాల్గొన్నాడు. తర్వాత స్వాతంత్య్రంరావడం, గాంధీ, నెహ్రు, జిన్నాల నిర్వాకంతో ఇండియా, పాకిస్తాన్లు ఏర్పడటం ఇదంతా చరిత్ర.

ఈలోపల ఆఫ్ఘనిస్తాన్ను రష్యా ఆక్రమించాలని చూడటం, దానితో ఆఫ్ఘనిస్తాన్ లో రాడికల్స్ (పష్టూన్లు), లిబరల్స్ (తాజికులు, మిగతా తెగలు) అంటూ ముస్లిములు రెండు వర్గాలుగా విడిపోవడం, ఒకరినొకరు చంపుకోవడం, వాళ్లకు రష్యా, అమెరికాలు సాయం చేసి, ఎగదోసి, మారణహోమాన్ని రాజెయ్యడం, పాకిస్తాన్ కుతంత్రంతో తాలిబన్ పుట్టుక, విచక్షణారహితంగా అందరినీ చంపుతూ వాళ్ళు భయోత్పాతాలు సృష్టించడం, పాకిస్తానూ తాలిబానూ కలిసి ఆడిన డబల్ గేమ్, 9/11 జరగడం, చివరకు మళ్ళీ నేడు ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్  వశం కావడం - ఇదంతా కూడా చరిత్రే. దానిని మళ్ళీ నేను వ్రాయవలసి అవసరం లేదు.

జ్యోతిష్యపరంగా, ఆఫ్ఘనిస్తాన్ భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఈ గొడవల మధ్యలో మన దేశపరిస్థితి ఎలా ఉంటుంది? అన్నది మాత్రమే నేను వివరిస్తాను.     

(ఇంకా ఉంది)

read more " ఆఫ్గనిస్తాన్ పరిస్థితి? జ్యోతిష్య విశ్లేషణ - 1 "