“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

3, సెప్టెంబర్ 2021, శుక్రవారం

కండలున్నంత మాత్రాన ఆరోగ్యం కాదు - సిద్ధార్ధ శుక్లా జాతకం ఏమంటోంది?

సెలబ్రిటీ నటుడు సిద్ధార్ధ శుక్లా, గుండెపోటుతో చనిపోయాడు. ఇతనికి 40 ఏళ్ళు మాత్రమే. జాతకాన్ని గమనిద్దాం.

మీకు గుర్తుందో లేదో? గతంలో ఒక పోస్టులో, 'నేటి నటీనటులు కండలు పెంచడం మీద ఉన్న శ్రద్ధను ఆరోగ్యం మీద చూపడం లేదు. జిమ్ములు చేసి సిక్స్ ప్యాక్ పెంచినంతమాత్రాన ఆరోగ్యంగా  ఉన్నట్లు కాదు' అని వ్రాశాను. అది నిజమైంది చూడండి. అందులోనూ, నటులకు సూచకుడైన శుక్రుడు గోచారంలో నీచస్థితిలో ఉండగా !

సిద్ధార్ధ శుక్లా, 12-12-1980 న ఉదయం 10. 20 కి ముంబాయిలో పుట్టాడని వివరాలు లభిస్తున్నాయి. ఇతని జాతకాన్ని ప్రక్కనే ఇచ్చాను చూడండి. 1980 జాతకాలలో ఒక భయంకరమైన దోషం ఉన్నది. అదే, శనిగురువుల డిగ్రీ సంయోగం. 1980 ప్రాంతాలలో పుట్టినవారికి జీవితమూ, సంసారజీవితమూ రెండూ సరిగ్గా ఉండవు. దీనిని చాలా జాతకాలలో గమనించాను. ఇతనిది మకరలగ్న జాతకం. మకరరాశి కూడా. కనుక కన్య ఇతనికి భాగ్యస్థానమైంది. శని లగ్నాధిపతి కావడంతో యోగమిచ్చింది. కానీ ఇది అవయోగం కూడా. పైగా ఇది కాలగ్రస్తయోగ జాతకం. దశమంలో శుక్రుని స్వక్షేత్రస్థితి వల్ల బుల్లితెరమీద వెలిగాడు. అంతా బాగున్నట్లు భ్రమ కల్పించింది లగ్నాన్ని కొట్టిన రాహుకేతువులు ఇరుసు.

ఇతని నవాంశ చక్రం ఏమీ బాగా లేదు. రాశిచక్రం కంటే అంశచక్రాలు బలమైనవి. నవాంశలో రాహుకేతువులు నీచస్థితిలో ఉన్నారు. శనిగురుయోగం లగ్నంలోనే ఉన్నది. గమనించండి. లగ్నాధిపతి శుక్రుడు మారకస్థానంలో నీచకేతువుతో కలసి ఉంటూ సినిమా రంగమూ, హైఫై జీవితమూ ఇతని చావుకు కారణాలౌతాయని స్పష్టంగా చూపిస్తున్నాడు.

చాలామంది బాలీవుడ్ నటులలాగే ఇతనూ ఫిట్నెస్ ఫ్రీకే, కండలు బాగా పెంచాడు. కానీ గుండెను చూచుకోలేదు. కారణాలు అనేకం. హైఫై సొసైటీ అలవాట్లు, సిగరెట్లు, త్రాగుడు, పిచ్చిపిచ్చి డైటింగులు చెయ్యడం, ఆహారవిహారాలలో నియమం లేకపోవడం, మితిమీరిన ఇంగిలీషు మందులవాడకం, బలం అంటూ విటమిన్ సప్లిమెంట్లు వాడటం, బరువులెత్తి బాడీని పెంచడం - ఇవే కారణాలు. మాకు ట్రెయినర్లు ఉన్నారని అనుకుంటారు. ట్రెయినర్లకు తెలిసింది ఎంత? అన్నది మర్చిపోతారు. కొంపలు మునుగుతాయి.

నటులకు కావలసింది టాలెంట్, అంతేగాని కండలు కావు. పాతతరం నటులు ఫిట్నెస్ చూసుకునేవారు. అంతేగాని, పెద్ద పెద్ద నటులెవరూ కండలు పెంచలేదు.  ఇది నేటి తరానికి పట్టిన దరిద్రం మాత్రమే. అసలైన టాలెంట్ లేనప్పుడు ఒళ్ళు చూపించుకోవడమే కదా వీళ్ళు చెయ్యగలిగింది? కండలతో అమ్మాయిలను మెప్పించవచ్చని చాలామంది నటులు అనుకోవడం పిచ్చిభ్రమ. నీ దగ్గర డబ్బుల్లేనప్పుడు, ఉత్తకండలకు ఏ అమ్మాయీ ఇంప్రెస్ కాదు. పైగా, నేటి తెలుగు నటులలో చాలామందికి స్పష్టమైన ఉచ్చారణ లేదు. తెలుగు మాట్లాడటం రాదు. ఒత్తులు పలకవు. అతివేషాలు తప్ప అసలైన నటన ఎవరిలోనూ లేదు. వీళ్ళను చూచి కుర్రకారు వెర్రెక్కి పోవడం ! ఎంత దరిద్రమో? 

ఇవి కనిపించే కారణాలు. బైటకు కనిపించనివి, మామూలు మనుషులకు అర్ధంకానివి, అయిన కారణాలు జాతకంలో దాగి ఉంటాయి. అవేమిటో చూద్దాం.

శ్లో || అష్టమమ్ ఆయుషష్ఠానమష్టమాదష్టమమ్ తథా
తయోరపి వ్యయస్థానం మారకస్థానముచ్యతే || 

అంటుంది జాతకచంద్రిక. 

దీనినిబట్టి అష్టమం, తృతీయం ఆయుష్యస్థానాలు. వీటికి వ్యయాలైన సప్తమం, ద్వితీయాలు మారకస్థానాలని అర్ధం. మకరరాశికి అష్టమాధిపతి సూర్యుడు. సూర్యుడు గుండెజబ్బులను సూచిస్తాడు. మకరలగ్నజాతకులు చాలావరకూ గుండెజబ్బుతో చనిపోవడం కొన్ని వేల జాతకాలలో కనిపించిన వాస్తవం. సూర్యుడీ జాతకంలో నెప్ట్యూన్ తోనూ, షష్టాధిపతి అయిన బుధునితోనూ కలసి, త్రాగుడు, మత్తుపదార్ధాలు ఇతని ఆరోగ్యాన్ని చెడగొట్టి గుండెను పాడుచేస్తాయని స్పష్టంగా చెబుతున్నాడు. తృతీయాధిపతి గురువు నవమంలో శత్రుస్థానంలో ఉంటూ ఆహారపు అలవాట్ల వల్ల ఆరోగ్యం ఆయుష్షు రెండూ పాడవడం సూచిస్తున్నాడు. ఈ ఇద్దరూ ఒకరు స్థిరరాశిలోనూ, మరొకరు ద్విస్వభావరాశిలోనూ ఉంటూ,  ఈ జాతకుడు మధ్యాయుష్కుడని చెబుతున్నారు. అంటే 33-66 ఏళ్ల మధ్యలో పోతాడని అర్ధం. అదేగా జరిగింది మరి !

సత్యాచార్యుని అంశాయుర్దాయగణనం చేస్తే ఒక మనిషి ఆయుష్షు ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ విధానం గతంలో చాలా జాతకాలలో వివరించి ఉన్నాను గనుక మళ్ళీ  అవసరం లేదు.

22వ ద్రేక్కాణం, 64 వ నవాంశలు మరణాన్ని స్పష్టంగా చూపుతాయన్నది కొన్ని వేల జాతకాలలో రుజువైన ప్రాచీన జ్యోతిశాస్త్ర సూత్రం. ఈ జాతకంలో దీనిని గమనిద్దాం.

లగ్నం ద్వితీయ ద్రేక్కాణమైంది. అష్టమం నుంచి ద్వితీయ ద్రేక్కాణాధిపతి గురువు. ఆ గురుదశ చివరలో ఛిద్రసమయంలోనే ఇతను చనిపోయాడు గమనించండి.

లగ్నం అయిదవ నవాంశ అయింది. 64 వ నవాంశ సింహంలో ఉంటుంది. సరిగ్గా ఇదే నవాంశ మీద సెప్టెంబర్ 1 న సూర్యుడు సంచరించాడు. సెప్టెంబర్ 2 న ఇతను చనిపోయాడు. గమనించండి.

చంద్రుడు మూడవ ద్రేక్కాణంలో ఉన్నాడు. సింహం నుంచి మూడవద్రేక్కాణం మేషమౌతుంది. ప్రస్తుతం మేషరాశి తీవ్రమైన అర్గలదోషంలో చిక్కుకుని ఉన్నది.  ఇది, స్నేహితులు, పని ఒత్తిడి, టెన్షన్లు, మొదలైన అనేక ప్రభావాలకు సూచిక.

చంద్రుడు ఏడవ నవాంశలో ఉన్నాడు. సింహంనుంచి ఇది తుల అవుతుంది. దీని అధిపతి శుక్రుడు ప్రస్తుతం నీచస్థితిలో ఉంటూ ఆయుష్యస్థానాన్ని చూస్తున్నాడు గమనించండి.

సరిపోయిందా లేదా?

ప్రస్తుతం ఇతనికి గురు - రాహు - శనిదశ జరుగుతున్నది. ఇది ఛిద్రదశలో శపితయోగదశ. గోచారంలో ఏలినాటిశని మంచి పట్టులో ఉన్నది. లగ్నంలో నీచగురువుంటూ గురుదోషాన్ని అనుభవింపజేస్తున్నాడు. గోచార నీచశుక్రుడు, ఉచ్చ బుధుడు, జననకాల శనిగురువులపైన సంచరిస్తున్నారు. జననకాల దోషాన్ని నిద్రలేపుతున్నారు. వీరందరూ కలసి ఆయుష్యస్థానాన్ని చూస్తున్నారు. ఇవి ఏం చేస్తాయో నేను చెప్పనక్కర్లేదు. ఏం జరిగిందో చూచారుగా మరి?

జాతకాలను, గ్రహాలను, తక్కువగా తేలికగా ఎప్పుడూ తీసుకోకూడదు. అవి మన జీవితాలను నడిపే అదృశ్యశక్తులు. జిమ్ము చేసి కండలు పెంచినంత మాత్రాన ఆరోగ్యమనీ భ్రమించకూడదు. మితిమీరిన ఉపవాసాలెంత ప్రమాదమో, మితిమీరిన కీటో డైటూ అంతే ప్రమాదం. మితిమీరిన వెయిట్ లిఫ్టింగ్ చెయ్యడం గుండెకు చెరుపు చేస్తుందన్నది వాస్తవం. ఎంతోమంది బాడీబిల్డర్స్, బాక్సర్స్, వెయిట్ లిఫ్టర్స్ జాతకాలలో ఇది రుజువైంది. తిండి తగ్గించి మితిమీరి పనిచేస్తే, అది గుండెను నాశనం చేస్తుంది. స్మోకింగ్ అలవాటుంటే ఇది ఖచ్చితంగా జరుగుతుంది. సిగరెట్లు త్రాగేవాళ్లకు గుండెపోటు ఖచ్చితంగా వస్తుంది. తిండి, వ్యాయామం, ఆహారపు అలవాట్లు - వీటిమధ్యన చాలా సున్నితమైన బేలన్స్ ఉంటుంది. దీనిని గమనించుకుంటూ వీటిని చెయ్యాలి. అందరికీ అన్ని వ్యాయామాలూ సరిపోవు. అందరికీ అన్ని తిండ్లూ సరిపోవు. ఎవరో చేశారని మనం చేస్తే ఒళ్ళు గుల్ల అవుతుంది,

50 ఏళ్ల క్రితం బ్రూస్లీ చావుకూ అతిగా చేసిన వ్యాయామాలే కారణం. నిన్న సిద్ధార్ధ శుక్లా చావుకూ అవే కారణం.

డియర్ యూత్ ! ఒళ్ళూ మనసూ జాగ్రత్త మరి !