“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

8, సెప్టెంబర్ 2021, బుధవారం

ఆఫ్గనిస్తాన్ పరిస్థితి? జ్యోతిష్య విశ్లేషణ - 3

9/11 గురించి అనుకోకుండా ఆఫ్ఘనిస్తాన్ జాతకాన్ని చూడలేము. ప్రపంచదేశాల బడ్జెట్లను, పాలసీలను, తీవ్రవాదాన్ని అవి చూచే దృష్టిని, మార్చిన సంఘటనలలో ఇది చాలా ముఖ్యమైన సంఘటన. అందుకే దాని కుండలిని కూడా ఇక్కడ ఇస్తున్నాను.

1996 లో ధనుస్సులో ఉన్న గురువు, 11 సెప్టెంబర్ 2001 నాటికి మిధునరాశిలోకి వచ్చేశాడు. అక్కడే రాహువు కూడా ఉన్నాడు. కనుక, గతంలో చెప్పినట్లు గురుఛండాలయోగం మంచి పట్టులో ఉంది. ఆరోజున గ్రహస్థితిని గమనిస్తే, గ్రహాలన్నీ మిధునధనుస్సుల మధ్యలో కాలగ్రస్తయోగంలో ఉన్నట్లుగా ఉన్నాయి, ఒక్క శనిని మినహాయిస్తే.


సూక్ష్మమైన గ్రహవిశ్లేషణలోకి వెళ్లకుండా, స్థూలంగా మాత్రమే నాటి గ్రహ పరిస్థితిని వివరిస్తాను.

  • అమెరికాను సూచిస్తున్న మిధునరాశిలో 17 వ డిగ్రీమీదున్న గురువు, నాశనాన్ని కుట్రలను సూచించే వృశ్చికరాశిలో 18 వ మీదున్న ప్లూటో(యముని)తో ఖచ్చితమైన షష్టాష్టక దృష్టిని కలిగి ఉన్నాడు. మాంది కూడా ప్లుటోతో ఖచ్చితమైన డిగ్రీ సంయోగంలో కలసి ఉంటూ, భయంకరమైన మారణకాండను సూచిస్తున్నాడు.
  • హింసకు దౌర్జన్యాలకు కారకుడైన కుజుడు, మిడిల్ ఈస్ట్ కు సూచికైన ధనుస్సులో 7 వ డిగ్రీ మీదుంటూ, అదే రాశిలో 8 వ డిగ్రీ మీదున్న గురుసూచకుడై, కుహనా మతాలను, అకస్మాత్తు విలయాన్ని సూచించే కేతువుతో చాలా దగ్గరగా ఉన్నాడు. అక్కడనుండి మిధునాన్ని చూస్తున్నాడు.
  • విలాసభవనాలను, విమానాలను సూచించే శుక్రుడు, అధికారులను సూచించే సూర్యునితో ఖచ్చితమైన 2/12 దృష్టిని కలిగి ఉన్నాడు. ఆ రోజున ఈ మూడింటికీ మూడింది. అంటే, విమానాలు ఆయుధాలుగా వాడబడ్డాయి, భవనాలు కూలిపోయాయి, అధికారులు ప్రజలు వేలాదిగా చనిపోయారు.
  • బుద్ధికారకుడైన బుధుడు కన్య 20 వ డిగ్రీ మీద ఉచ్ఛస్థితిలో ఉంటూ, రాహుకేతువులతో అర్గలదోషంలో ఉన్నాడు. అంతేగాక, శనితో ఖఛ్చితంగా కోణదృష్టిలో ఉన్నాడు. దీనివల్ల, కుతంత్రాలు సఫలమవడం, తీవ్రమైన మనోవేదనతో లక్షలాదిమంది బాధపడటం సూచింపబడుతున్నది.
  • సుదూరగ్రహాలైన యురేనస్, నెప్త్యూన్లు మకరంలోనూ, ప్లూటో వృశ్చికంలోనూ ఉంటూ, ధనుస్సుకు భయంకరమైన అర్గలదోషం పట్టించారు. అందుకే, ఆనాటినుంచీ, ఆఫ్ఘనిస్థాన్లోని తాలిబాన్ కు ఇరవయ్యేళ్లపాటు మూడింది.
  • ఒక్క శనీశ్వరుడు తప్ప, మిగతా అన్నిగ్రహాలూ ఏదో ఒక రకంగా బందీలయ్యాయి. ఎలాగంటే, మిధున, కటక, సింహ, కన్యా, ధనూ రాశులు వాటిలోని గ్రహాలూ అన్నీ అర్గలదోషంతో చిక్కుకుని ఉన్నాయి.
  • ఇప్పుడు నవాంశచక్రాన్ని గమనిద్దాం. అందులో, రాహుకేతువులు రివర్స్ అయ్యి, నీచస్థితిలోకి వచ్చాయి. కనుక, తాలిబాన్ విజయం తాత్కాలికమేనని తెలుస్తోంది. అమెరికా కొట్టిన దెబ్బకు ఇరవై ఏళ్లపాటు అజ్ఞాతవాసం చెయ్యవలసి వచ్చింది.
  • శనిబుధులూ, రవిచంద్రులూ కలసి మిధున, ధనూరాశులకు విచిత్రమైన అర్గలదోషాన్ని పట్టించారు, గమనించండి. కనుక, ఆనాటినుంచీ, ఆఫ్ఘనిస్తాన్ కూ అమెరికాకూ విడదీయరాని బంధం ఏర్పడింది. రెండుప్రక్కలా, వేలాదిమంది చావులకు కారణమైంది. లక్షలకోట్ల డాలర్ల వృధాఖర్చును పెట్టించింది.
అప్పుడు మొదలైన ఒక అంకం 15 ఆగస్టు 2021 దాకా, ఇంకా చెప్పాలంటే, ఈరోజు దాకా నడిచింది. ఆఫ్ఘనిస్తాన్ లో మళ్ళీ టెర్రరిస్ట్ ప్రభుత్వం ఏర్పాటుతో, ఇంకో అంకం మొదలైంది.

(ఇంకా ఉంది)