7-10-2001 న తాలిబాన్ పైన అమెరికా తన విమానదాడులను ప్రారంభించింది. ఆ రోజున గ్రహస్థితిని ఇక్కడ చూడవచ్చు.
7/11 తరువాత గడచిన నెలరోజులలో, గ్రహస్థితులలో పెద్ద మార్పులేమీ లేవు. కానీ, శనిబుధులలో మార్పుంది. ఇద్దరూ వక్రస్థితిలోకి వచ్చారు. బుధుఁడైతే రాశి మారి, తులారాశిలోకి వచ్చాడు. అదంత ముఖ్యమైన మార్పు కాదు. ముఖ్యమైన మార్పల్లా, శని వక్రీకరణ. దీనితో ఆయన మేషంలోకి వచ్చినట్లౌతుంది. అదాయనకు నీచస్థానమౌతుంది. తాలిబాన్ కు మూడటానికి శనీశ్వరుడే కారణం. ఎందుకంటే, సామాన్యప్రజలు కష్టాలు పడటం, మళ్ళీ ఆ కష్టాలకు కారణమైనవారిని శిక్షించడం, ఇదంతా శనీశ్వరుని ఆధీనంలోనే ఉంటుంది మరి !
ధనుస్సునుంచి శని పంచమంలో నీచస్థితిలోకి రావడం వల్ల తాలిబాన్ కు మూడిందన్న సూచన స్పష్టంగా వచ్చింది. అదే విధంగా, మిధునానికి ఇది లాభస్థానమవ్వడం వలన, అమెరికా ప్లాన్లకు సహకరించే కోవర్ట్ మిత్రులు ఆఫ్ఘనిస్తాన్ లో దొరుకుతారన్న సూచనా ఉన్నది. పంజషీర్ లోని నార్తన్ అలియన్స్ తోడ్పాటుతోనే అమెరికా అక్కడ కాలుమోపింది. నేడు వాళ్ళ ఖర్మానికి వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయింది, అది వేరే సంగతి !
ధనుస్సుకు లాభస్థానంలో ఉన్న బుధుడు, తాలిబాన్ మద్దతుదారులైన పాకిస్తాన్, ఇరాక్ మొదలైన దేశాలను సూచిస్తున్నాడు. అయితే ఇక్కడొక విచిత్రమైన గ్రహస్థితి ఉంది.
కాలస్వరూపాలైన రాహుకేతువులు, మనిషి జీవితంలోగానీ, దేశాల జాతకాలలోగానీ, ప్రధానపాత్రను పోషిస్తాయి. ఆ సమయంలో, రాహుకేతువుల ఇరుసు శనికీ, బుధునికీ కూడా 3/11 స్థానాల్లోనే ఉంది. కానీ, శనినుంచి ఇది 3/11 లో ఉంటే, బుధుని నుంచి 11/3 లో ఉంది. అంటే, శనిస్థానం నుంచే రాహుకేతువులు బలంగా పనిచేస్తున్నాయి. కనుక, శని లాభస్థానంలో ఉన్న అమెరికాకు బలం చేకూరింది. బుధుడు లాభస్థానంలో ఉన్న తాలిబాన్ కు చెడుదశ మొదలైంది.
తాలిబాన్ కూ, అమెరికాకూ జరిగిన యుద్ధంలో విమానదాడులు ప్రధానపాత్ర వహించాయి. ఇవి, రాశిచక్రంలో వాయుతత్త్వరాశులచేత సూచింపబడతాయి. మిధునంలో ఉన్న రాహు గురువుల వల్ల, అమెరికాకు బలం ఎక్కువగా ఉంది. తులలో బుధుఁడున్నప్పటికీ, పైన చెప్పిన గ్రహస్థితివల్ల అతనికి బలం లేదు. కనుక తాలిబాన్ బలహీనంగా ఉంది. కనుక ఈ రెండు దేశాలకూ మధ్యన జరిగిన యుద్ధంలో తాలిబాన్ ఓడిపోయింది.
ఈ విధంగా, మేజర్ గ్రహాలు తమతమ యాత్రలో, రకరకాలైన ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ప్రపంచదేశాల మధ్యన జరిగే సంఘటనలను అర్ధం చేసుకోవడంలో, భారతీయ జ్యోతిష్యశాస్త్రాన్ని ఈ విధంగా ఉపయోగించుకోవాలి.
(ఇంకా ఉంది)