అయ్యప్ప దీక్షల సీజన్ మొదలైంది.
కొత్తగా కిరస్తానీ మతం పుచ్చుకున్న హిందువులాగా వీళ్ళలో కొందరికి (అందరికీ కాదు) అత్యుత్సాహం ఎక్కువగా ఉంటుంది.కనిపించిన ప్రతివారికీ నల్లబట్టలు తొడుగుదామని ప్రయత్నిస్తారు.తను చేసేది తప్పో రైటో తెలీనప్పుడు తనవంటి వాటినే మరికొందరిని తయారు చేసుకుని గ్రూప్ ఫీలింగ్ లో మునిగిపోయి 'నేను చేస్తున్నది సరియైనదే.లేకపోతే ఇంతమంది నాలాగే ఎందుకుంటారు?' అన్న భావనలో సేదదీరే చవకబారు మనస్తత్వం ఇది.
మొన్నీ మధ్య ఒకాయన నా దగ్గరికి ఏదో పనుండి వచ్చాడు.
మాటామంతీ అయిన తర్వాత మెల్లిగా 'అయ్యప్ప దీక్ష తీసుకుంటున్నారా?' అడిగాడు.
'లేదు' అన్నాను
'నేను పలానా తేదీన మా గ్రూపుతో శబరిమల వెళుతున్నాను.మీరు ఇప్పుడు దీక్ష తీసుకుంటే మాతో బాటు మా బస్సులో రావచ్చు.' అన్నాడు.
'ఇలా లాభం లేదు ఇతనికి శక్తిపాతం చెయ్యాలి తప్పదు'- అనుకున్నా.
'అలాంటి దురలవాట్లు నాకు లేవు' అన్నాను.
ఏమంటున్నానో అర్ధంగాక అతను కాసేపు బిత్తరపోయాడు.
'ఏంటి మీరన్నది?' అడిగాడు అయోమయంగా.
'ఏమీ లేదులేగాని,ఈ దీక్ష తీసుకుంటే ఏమౌతుంది?' అడిగాను.
'అనుకున్న కోరికలు నెరవేరతాయి' అన్నాడు.
'నాకేమీ తీరని కోరికలు లేవు' అన్నాను.
'మంచి జరుగుతుంది' అన్నాడు.
'మీ తాతముత్తాతలకు ఈ దీక్ష తెలీదుగా.వాళ్లకు మంచి జరగలేదా?' అడిగాను 'నువ్వు పుట్టడమే వాళ్లకు పెద్ద చెడులాగుంది' అనుకుంటూ.
'అలాకాదు.కార్తీక మార్గశిర మాసాలలో నియమంగా ఉంటే ఆరోగ్యానికి మంచిది.' అన్నాడు.
ఏదడిగినా అది ఒదిలేసి ఇంకొకటి మాట్లాడుతున్నాడు.
'మిగిలిన పదినెలలు ఏంపాపం చేశాయో పాపం?' అంటూ 'దీక్షలతో ఆరోగ్యాలు వస్తే మెడిసిన్ చదువులెందుకు?'అన్నాను.
'ఫలానా డాక్టర్ గారు మీకు తెలుసుగా.ఆయన రెండు ఎం.డీ.లు చేశాడు.ఆయనకూడా దీక్ష తీసుకున్నాడు. చూడండి.'అన్నాడు.
'కాపీ కొట్టి పాసైన బాపతో,35 మార్కుల బాపతో అయి ఉంటాడు' అన్నాను.
'మీరు ఇంతవరకూ ఏ దీక్షా తీసుకోలేదా?'అడిగాడు.
ఇలా కాదని 'ఇలాంటివి తీసుకోలేదు.వేరే దీక్ష తీసుకున్నాను.' అన్నాను.
'ఏంటది?' అడిగాడు.
'ఒద్దండి.భయపడతారు.' చెప్పాను.
అతనికి ఉత్సుకత ఇంకా పెరిగిపోయింది.
'పర్లేదు చెప్పండి సార్.కొత్త కొత్త దీక్షలంటే నాకు భలే సరదా' అన్నాడు.
'కరిమతక్రాంశ భంభోరుక దీక్ష' అని దానిపేరు.'- అప్పటికప్పుడు నోటికొచ్చిన పేరు చెప్పాను.
'అదేంటి ఎప్పుడూ వినలేదే?' అనుమానంగా అడిగాడు.
'అవును.ఇవన్నీ సీక్రెట్ దీక్షలు.జనసామాన్యానికి అర్ధంకావు.' చెప్పాను సీరియస్ గా.
నేను చెప్తున్న ధోరణిబట్టి అది నిజమో ఎగతాళో అతనికి అర్ధం కాలేదు.
'మాదికూడా తీసుకోవచ్చుగా? బాగుంటుంది.' అన్నాడు.
"ఎవరికి నాయనా బాగుండేది?మీకా నాకా?" అని లోలోపల అనుకుంటూ -"నీటిలో ఉండే చేపకు దాహం ఏముంటుంది?" అడిగాను.
'చేపలేంటి?మీరు చేపలు కూడా తింటారా?' అడిగాడు.
బీరుబాబుకు కబీరు బోధను చెప్పబోవడం నాదే తప్పనిపించింది.
'ఎందుకు తినను? ఈస్ట్ ఇండియాలో నార్త్ ఇండియాలో బ్రాహ్మలు రోజూ నాన్ వెజ్ సుష్టుగా తింటారు.నేను ఏడాది పొడుగునా వాళ్ళ సిస్టమే ఫాలో అవుతాను.మీరు ఈ నలభై రోజులూ మానేస్తారా?' అడిగాను.
'అవును.ఈ నలభై రోజులూ నిష్టగా ఉంటాను?' చెప్పాడు.
'అదే నిష్ఠ మిగిలిన అన్నిరోజులలో కూడా ఉంటె ఎవరు వద్దన్నారు?' అడిగాను.
'కష్టం అండి.ఉండలేము.' అన్నాడు.
'అంటే మీ దీక్ష మీద మీకే నమ్మకం లేదన్నమాట.' అన్నాను నవ్వుతూ.
'అదేంటి?'అడిగాడు.
'అవును.ఈ దీక్ష మంచిది అని మీరే అంటున్నారు.కోరికలు తీరతాయి. ఆరోగ్యం బాగుంటుంది.ఇంకా ఏమేమో చెబుతున్నారు.ఒక్క నలభై రోజులకే ఇంత జరిగితే ఇంక జీవితాంతం ఇలాగే ఉంటె ఎంత బాగుంటుంది?ఆలోచించారా ఎప్పుడైనా? మంచిని నిరంతరం ఆచరించాలిగాని కొన్నాళ్ళు ఆచరించి కొన్నాళ్ళు ఒదిలేస్తే ఉపయోగం ఏముంది? ఈ కొద్దిరోజులు మంచిగా ఉంటున్నాము అంటే మిగతా రోజులు చెడులో మునిగిపోతున్నాము అనేగా అర్ధం?' అడిగాను.
'ఒక్కసారి మా గురుస్వామి దగ్గరికి రండి.ఆయన నాకంటే బాగా మీకు చెప్పగలరు.' అన్నాడు.
ఆ గురుస్వామి ఎవరో నాకు తెలుసు.అతనికి ఇప్పుడు వయసు ఉడిగిపోయిందిగాని వయసులో ఉన్నప్పుడు అయ్యగారు వెయ్యని వేషాలు లేవు.సకల కళాకారుడు.
'ఏం?మీ గురుస్వామికి ఇప్పుడు పళ్ళూడిపోయేసరికి తాగుడూ మాంసం మానేసి మీకందరికీ దీక్షలిస్తున్నాడా?' అడిగాను.
'అదేంటి సార్.అలా అంటారు?'
'నాయనా,మీ గురుస్వామి నాకు గత పదేళ్ళనుంచి తెలుసు.నన్ను ఎక్కువగా కదిలించకు.సూదికోసం సోదికెళితే పాత రంకులన్నీ బయట పడ్డాయన్న సామెత నీకు తెలుసా లేదా? అలా అవుతుంది.' చెప్పాను.
'అయినా ఈ ఒక్కసారికి మా దీక్ష తీసుకొని మాతో రావచ్చు కదా?' అడిగాడు.
'నా దీక్ష మీరు తీసుకుంటే మీ దీక్ష నేను తీసుకుంటాను' చెప్పాను.
'మీ దీక్షా నియమాలేంటి?' కొంచం ఎగతాళిగా అడిగాడు.
'ముందుగా నా బ్యాంక్ ఎకౌంట్ లో కోటిరూపాయలు జమ చెయ్యాలి' అన్నాను.
అతనికి నోరు తెరుచుకుంది.
'ఆ తర్వాత నేనేది చెబితే అది నలభై రోజులపాటు చెయ్యాలి.నా బట్టలు ఉతికి పెట్టాలి.నా కాళ్ళు ఒత్తాలి.మూడు పూటలా నాకు శుష్టుగా ఒండి పెట్టాలి. నువ్వు మాత్రం ఏమీ తినకూడదు.నాకిష్టమై ఏవైనా ఎంగిలి మెతుకులు పెడితే అవే తిని ఉండాలి.లేకపోతే పస్తుండాలి.ప్రతిరోజూ సాయంత్రం నేను వీరవిద్యలు అభ్యాసం చేస్తాను.అందులో పంచింగ్ బ్యాగ్ బదులు నిన్ను సీలింగ్ కి వేలాడదీస్తాను.కిక్కురుమనకుండా ఊరుకొని ఆ దెబ్బలూ తన్నులూ అన్నీ భరించాలి.ఈ నలభైరోజులూ గోచీ పెట్టుకుని తిరగాలి.ఇవీ నియమాలు.' అన్నాను.
'ఏంటి సార్?వేళాకోళానికైనా ఒక హద్దుండాలి.మీ నియమాలు నాకొక ఫార్స్ గా కనిపిస్తున్నాయి.' అన్నాడు.
'నేనేమీ నిన్ను వేళాకోళం చెయ్యలేదు.అడిగావు గాబట్టి నా దీక్షా నియమాలేమిటో చెప్పాను.మీ నియమాలు నాకూ ఫార్స్ గానే కనిపిస్తున్నాయి.శరీరాన్ని హింస పెట్టుకోవడమే గొప్ప అయితే, నా దీక్షలో ఆ హింస extreme levels లో ఉంటుంది.కనుక మీదీక్ష కంటే నాదీక్షే మంచిది.' చెప్పాను.
'సరే.మీ దీక్ష పాటిస్తే నలభై రోజుల తర్వాత ఏమౌతుంది?' అడిగాడు.
'నలభైరోజుల తర్వాత ఒక సాయంత్రంపూట మంచిబట్టలు కట్టుకుని నేనే మీకు దర్శనం ఇస్తాను.నీవు డిపాజిట్ చేసిన డబ్బులు మాత్రం తిరిగి ఇవ్వను.' చెప్పాను.
'వింటున్నాం గదా అని మమ్మల్ని పిచ్చోళ్ళ కింద జమ చేసేయకండి సార్.మీరు ఎగతాళి చేస్తున్నారని నాకు అర్ధమౌతూనే ఉంది.' అన్నాడు.
'బాబూ నేనేమీ నిన్ను కదిలించలేదు.నీవే నన్ను అనవసరంగా కదిలించావు. దీక్ష తీసుకుంటావా అని అడిగావు.నా దీక్ష సంగతి అడిగావు. చెబుతుంటేనేమో ఎగతాళి అంటున్నావు.నేను చెప్పిన దాంట్లో నిన్ను చేసిన ఎగతాళి ఏముందో చెప్పు?' అడిగాను.
ఏమనుకున్నాడో ఏమో,-'వస్తాను సార్.నాక్కొంచం పనుంది' అన్నాడు లేస్తూ.
'అలాగే.నాకూ చాలా పనుంది.బై' అన్నాను నవ్వుతూ.