“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

19, నవంబర్ 2014, బుధవారం

కళ్ళు విప్పి చూడు నేస్తం...

కళ్ళు విప్పి చూడు నేస్తం
మూసిన ముంగిళ్ళు దాటి చూడు నేస్తం
మనసు వాకిళ్ళు తెరచి చూడు నేస్తం
హృదయపు లోగిళ్ళు తరచి చూడు నేస్తం

ఒక అతీతస్వర్గం దిగుతోంది నీకోసం
ఒక అమేయ రోచిస్సు ఉద్భవిస్తోంది నీకోసం
ఒక అద్భుతలోకం వేచింది నీకోసం
ఒక అమానుష తేజం నిలిచింది నీకోసం

విశ్వప్రభుని వేడుకుంటూ నీవు రాల్చిన ప్రతి కన్నీటిచుక్కా
ఆ స్వర్గానికి ఒక్కొక్క మెట్టుగా మారింది
బీటలు వారిన నిరాశలో నీవు చేసిన ప్రతి నిట్టూర్పూ
ఈ ఎడారిలో ఒక చెట్టును చిగురింప జేసింది

వేదనలో నీవు గడపిన నిశిరాత్రులన్నీ
ఉదయభానుని స్వర్ణకాంతులలో తడిసి మెరుస్తున్నాయి
మౌనరోదనలో గడచిన నీ జీవితక్షణాలన్నీ
మృదుమధుర సంగీతంతో నింపబడి పిలుస్తున్నాయి

అంతులేని కాళరాత్రి అంతమైపోయింది
శాంతి నిండిన కాంతిసరస్సు సొంతం కాబోతోంది
యుగయుగాల నిరీక్షణ ముగిసిపోయింది
వగపెరుగని వైచిత్రి ఎగసి లేవబోతోంది

నిరంతరం నీవన్వేషించిన ప్రేమస్వప్నం
సాకారమై నీ కళ్ళెదుట నిలిచింది చూడు
తరతరాలుగా నీవు వెదకిన మధురహృదయం
చకోరమై నిన్ను కలవరిస్తోంది చూడు

ప్రభుని ప్రేమసముద్రాన్ని తన హృదిలో నింపి
ఒక అదృశ్య ఆత్మ నీకోసం వేచి చూస్తోంది
చావెరుగని అమృత భాండాన్ని తన చేత ధరించి
ఒక వెలుగుపుంజం నీ తలుపు తడుతోంది

కళ్ళు విప్పి చూడు నేస్తం
కాంతిసముద్రం నీ ఎదురుగా ఉంది
ఒళ్ళు విరుచుకుని లే నేస్తం
కటిక చీకటి అంతమై చాలాసేపైంది...