“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

7, నవంబర్ 2014, శుక్రవారం

మా స్వామి మిమ్మల్ని రమ్మంటున్నారు

నెట్ లోకంలో నాకు అభిమానులు ఎందఱో ఉన్నట్లే,విమర్శకులూ ఉన్నారని నాకెప్పుడో తెలుసు.వాళ్ళను పట్టించుకోవడం ఎప్పుడో మానేశాను. ఎందుకనగా-మన దారిన మనం పోతుంటే అవి అలా అరుస్తూనే ఉంటాయని నాకు తెలుసు.

అసలు నా పోస్ట్ లను అభిమానుల కంటే విమర్శకులే ఎక్కువ క్షుణ్ణంగా చదువుతారని కూడా నాకు తెలుసు.పాపం వాళ్లకు నామీద ఏదో అసూయ ఎప్పుడూ వేధిస్తూ ఉంటుంది.ఒక మనిషిలో ఇన్ని టాలెంట్స్ ఎలా సాధ్యం?మనలో ఒక్కటి కూడా లేదే? అనే వాళ్ళ బాధను నేనర్ధం చేసుకోగలను.


విమర్శతో పేరు సంపాదించాలనుకునే వారికి ఎలాంటి పేరు వస్తుందో రామాయణ కల్పవృక్షాన్నీ,రామాయణ విషవృక్షాన్నీ రెంటినీ చూస్తే అర్ధమౌతుంది.రెంటికీ పేరొచ్చింది.ఏవి ఎలాంటి పేర్లో ఒక్కసారి గమనిస్తేనన్నా నా విమర్శకుల అకారణ అసూయ చల్లారుతుందేమో అని నా చిన్ని ఆశ. అప్పటికీ ఆ సలుపు ఆగకపోతే అది వారి ఖర్మ.

'చేతనైనవాడిని చూస్తే చేతగానివాడికి ఏడుపు సహజమే'- అని సామెత ఉన్నది.దానిని నేనొప్పుకోను.ఏడుపనేది సహజమెలా అవుతుంది?అందులోనూ అసూయతో కూడిన ఏడుపు?అది పూర్తిగా అసహజమైనదే. శనీశ్వరుని రాశిమార్పు ప్రభావమే ఈ అసహజ చేష్టకూడా.



లోపల్లోపల ఏడిస్తే ఏడిచారు.ఆ ఏడుపును సిగ్గువిడిచి మాటమాటకీ బయటపెట్టుకోవడమే అతిపెద్ద జుగుప్సాకరమైన పనులలో ఒకపని.ఇది కూడా శనీశ్వరుని రాశిమార్పు ప్రభావమే.ఇలాంటివి జరుగుతాయని కూడా ముందే వ్రాశాను.



నాగురించి ఎవరో ఎక్కడో ఏదో వ్రాశారని ఒక ఫ్రెండ్ నిన్న ఫోన్లో చెప్పింది.

"పోనీలే ఆ రకంగానైనా వాళ్ళు నన్ను నిరంతరమూ ధ్యానిస్తున్నారు.అదే చివరికి వాళ్లకు మోక్షాన్నిస్తుంది,అన్ని భక్తులలోకీ వైరభక్తి శ్రేష్ఠమైనది. అలాంటి భక్తులను నేనెప్పుడూ వదిలిపెట్టను.Let them continue." అని చెప్పాను.

  

ఇకపోతే నన్ను ఉద్ధరించాలనుకునే ఆధ్యాత్మికవేత్తలు ఇంకొందరున్నారు. నేను చాలా తప్పుదారిలో ఉన్నానని వారి మహత్తరమైన అభిప్రాయం. అందుకని నన్ను సరియైన దారిలో పెట్టాలని వారు ఉచితవకాల్తా తీసుకుని ముందుకొస్తూ ఉంటారు.వీళ్ళ బాధేమిటో కూడా నాకు తెలుసు.కానీ చెబితే బాగుండదు.అందుకే చెప్పను.

వీరిలో ఒకాయన మొన్న ఒక మెయిల్ ఇచ్చాడు.

'మాఊరి దగ్గర ఒక స్వామీజీ ఉన్నారు.ఆయనకు మీగురించి చెప్పాను.మీ బ్లాగు వ్యాసాలు కొన్ని ప్రింట్ తీసి ఆయనకు ఇచ్చాను.ఆయన చదివారు. (అర్ధమైనవో లేదో మరి?).మిమ్మల్ని వచ్చి ఆయన దర్శనం చేసుకోమని చెప్పమన్నారు. మీరు ఓకే అంటే మిమ్మల్ని ఆయన దగ్గరకు తీసుకెళతాను.' అని ఆ మెయిల్ సారాంశం.

సామాన్యంగా ఇలాంటి చెత్త మెయిల్స్ నేను చదవను.జవాబివ్వను.కానీ ఆరోజున ఎందుకో చదివాను.పాపం ఎవడో అక్కుపక్షి చాలా బాధల్లో ఉన్నాడు లాగుంది అని జాలి కలిగి రిప్లై ఇచ్చాను.

'మీరు మీ స్వామి దగ్గరకు తరచూ వెళుతూ ఉంటారా?' అనడిగాను.

'అవును.నాకు తీరిక దొరికినప్పుడల్లా వెళుతుంటాను.ఆయన పాదాల దగ్గర కూచుంటే చాలా శాంతిగా ఉంటుంది.మీరు ఎప్పుడు వస్తున్నారు?' అని మళ్ళీ మెయిల్ ఇచ్చాడు.

'ప్రస్తుతం నాకు తీరిక లేదు.ఒక పనిచెయ్యండి.ఊరకే ఆయన పాదాల దగ్గర కూచుంటే లాభం లేదు.ముందు మీరాయన పాదాలను గట్టిగా పట్టుకోండి.ఆ తర్వాత మీరూ మీ స్వామీజీ ఇద్దరూ కలసి వచ్చి నా పాదాలు గట్టిగా పట్టుకోండి.అప్పుడు మీ ఇద్దరికీ ఉత్త శాంతినేం ఖర్మ?డైరెక్ట్ గా మోక్షాన్నే ప్రసాదిస్తాను.మీరెప్పుడు వస్తున్నారో ముందుగా చెబితే నా పాదాలకు సాక్స్ వేసుకుని రెడీగా ఉంటాను.' అని జవాబిచ్చాను.

  

నన్ను ఉద్ధరించాలనుకునే ఆయన ప్రయత్నానికి ఆ దెబ్బతో పాపం పురిట్లోనే సంధి కొట్టింది.మళ్ళీ అతనివద్ద నుంచి జవాబు లేదు.

ఏం చేస్తాం?లోకంలో అసూయ అనేక రకాలు.ఇలాంటి వాళ్ళను చూచి మనసారా నవ్వుకోవడమే నేను చెయ్యగలిగిన పని.