“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

26, నవంబర్ 2014, బుధవారం

ఏదీ తప్పనిపించడం లేదు

కొంతమందితో మనకు ట్యూనింగ్ బాగా ఉన్నపుడు ఒక విచిత్రం జరుగుతుంది.వాళ్ళు ఏమి ఆలోచిస్తున్నారో మనకు తెలిసిపోతూ ఉంటుంది. దీనికి దూరంతో సంబంధం లేదు.దీనికి పెద్ద యోగశక్తి లాంటిదేమీ అవసరం లేదు.కొద్దిగా 'ఫీల్' అయ్యే తత్త్వం ఉన్నవారికి ఇది అనుభవమే.

అలాంటి మనుషులతో మనకు 'యాస్ట్రల్ కనెక్షన్' ఏర్పడటమే దీనికి కారణం. అలాంటి వారిలో చరణ్ ఒకడు.ఈరోజు తను వచ్చి కలుస్తాడేమో అని ఒక ఫ్లాష్ లాగా అనిపించడమూ అలాగే తను రావడమూ ఇప్పటికి లెక్కలేనన్ని సార్లు జరిగింది.అయితే అందరితో ఇలాంటి కనెక్షన్ ఏర్పడదు. అవతలి వ్యక్తిది చాలా ప్యూర్ హార్ట్ అయితే తప్ప ఇలాంటి సంబంధం ఏర్పడటం చాలా కష్టం.

మొన్నొక రోజున ఎందుకో ఇలాగే అనిపించింది.ఒక గంటలో నా చాంబర్ తలుపు తోసుకుని చరణ్ రానే వచ్చాడు.

'ఏంటి చరణ్ ఇలా వచ్చావు?'-అడిగాను.

'తెలీదన్నగారు.ఎందుకో మిమ్మల్ని ఒకసారి చూచి పోదామనిపించింది. వచ్చాను.' అన్నాడు ఎదురుగా కుర్చీలో కూచుంటూ.

నేనేమీ మాట్లాడలేదు.మౌనంగా తనవైపు చూస్తూ కూచున్నాను.

ఇద్దరి మధ్యా మాటల్లేవు.కాసేపు అలా మౌనంగా గడిచింది.

మౌనాన్ని భేదిస్తూ 'అన్నగారు.ఈ మధ్య నాకు ఒకటనిపిస్తున్నది' అన్నాడు.

ఏమీ అడగకుండా అతన్నే చూస్తున్నాను.

'ఏదీ తప్పనిపించడం లేదు.' అన్నాడు హటాత్తుగా.

'అదేంటి?ఏదీ తప్పనిపించడం లేదా? 'ఏదీ' అంటే నీ ఉద్దేశ్యం?' అడిగాను.

'ఉదాహరణతో చెప్తాను అన్నగారు.ఇంతకు ముందైతే,ఎవడైనా మన కారుకో బైకుకో రోడ్డుమీద అడ్డదిడ్డంగా పోతూ అడ్దోచ్చాడనుకొండి.విపరీతమైన కోపం వచ్చేది.రోడ్ సెన్స్ ఎప్పుడు నేర్చుకుంటారో ఈ వెధవలు అని తిట్టుకునేవాడిని.ఉక్రోషం వచ్చేసేది.ఇప్పుడు రావడం మానేసింది.' అన్నాడు.

'ఇప్పుడేం అనిపిస్తున్నది?' అడిగాను.

'జాలి కలుగుతున్నది.వాడి తెలివి తక్కువతనానికీ మూర్ఖత్వానికీ జాలి వేస్తున్నది.' అన్నాడు.

నవ్వాను.

'ట్రాఫిక్ విషయంలోనేనా ఇతర విషయాలలో కూడా ఇలాగే అనిపిస్తున్నదా?' అడిగాను.

'అన్నిట్లో అలాగే అనిపిస్తున్నది.ఎవరేం చేస్తున్నా తప్పనిపించడం లేదు.వాడి ఖర్మకొద్దీ వాడు అలా చేస్తున్నాడు.తెలియక అలా చేస్తున్నాడు.అని ఆ చేస్తున్నవాడి మీద జాలి కలుగుతున్నది.పైగా వాడు తప్పు చేస్తే చేశాడు.నేనెందుకు నన్ను దిద్దుకోకూడదు?ఆ తప్పును గుర్తించి నేనెందుకు గింజుకోవాలి? అనిపిస్తోందన్నగారు.' అన్నాడు.

'అంటే ఓషో రజనీష్ చెప్పినట్లు passion అంతా compassion గా మారుతున్నదా?' అడిగాను.

'మనకు passions ఒకప్పుడు ఉంటేకదా అన్నగారు?' నవ్వాడు చరణ్.

'passions అంటే నా ఉద్దేశ్యం అదికాదు చరణ్.వ్యతిరేకదిశలో పనిచేసే మనశ్శక్తి అని నా భావం.ప్రస్తుతం అది మాయమై దాని స్థానంలో జాలి కరుణ కలుగుతున్నాయా?' అడిగాను.

'అవును.' అన్నాడు.

'చరణ్ నీకు కొన్ని ఆప్షన్స్ ఇస్తాను.వాటిలో ఒకదానికి సెలెక్ట్ చేసుకో.' అన్నాను సీరియస్ గా.

సాలోచనగా చూస్తున్నాడు.

'ఒకటి-వయస్సుతో ఓపిక తగ్గిన అశక్తత.
రెండు-ఎవడెలా పోతే మనకెందుకులే అనే నిరాసక్తత.
మూడు-ఒకడిని మనం బాగుచెయ్యగలమా అనే సందిగ్ధత.
ఇప్పుడు ఈ మూడింటిలో ఒకదానిని సెలెక్ట్ చేసుకో- అన్నాను.

చరణ్ చాలా తెలివైనవాడు.

'నాలుగు-పై మూడూ.అని అనుకుంటే నాలుగు నా చాయిస్ అన్నగారు.'-అన్నాడు.

నవ్వాను.

'నాలో ఈ మార్పు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు.నేనేమీ సాధనలు చెయ్యడం లేదన్నగారు.' అన్నాడు మళ్ళీ తనే.

'తమ్ముడూ.నీవు అమ్మ ముద్దుబిడ్డవు.స్వయానా అమ్మ చేతులమీదుగా నీకు ఉపనయనం జరిగింది.స్వయంగా అమ్మే నీకు గాయత్రీమంత్రం ఉపదేశించి బ్రహ్మోపదేశం చేసింది.ఇక నీకు ఇంకేం కావాలి?ఈ అదృష్టం ఎంతమందికి పడుతుంది?ఇది సామాన్యమైన అదృష్టం అనుకుంటున్నావా?' అడిగాను.

తానేమీ మాట్లాడలేదు.

'అమ్మది సహజమార్గం తమ్ముడూ.మనమేమీ చెయ్యనక్కరలేదు.సంపూర్ణ శరణాగతి ఉంటే అన్నీ అమ్మే చూసుకుంటుందనడానికి ఇదే నిదర్శనం.నీ సాధనా తనే చేయిస్తుంది.మార్పులూ తనే తీసుకొస్తుంది.మనం అమ్మ కొంగు వదలకుండా పట్టుకుని ఉంటే చాలు.నువ్వు అది చేస్తున్నావు.అందుకే నీకు తెలీకుండా నీలో ఇన్ని మార్పులు వస్తున్నాయి.' అన్నాను.

'ఈ మధ్యన ఇంకో మార్పు కూడా గమనిస్తున్నాను అన్నగారు.ఏ గురువునూ విమర్శించాలని తోచడం లేదు.ఇంతకు ముందు వాళ్ళలో తప్పులు కనిపించేవి.ఇప్పుడు అలా కనిపించడం లేదు.అందరికీ నమస్కారం చేద్దామనే అనిపిస్తున్నది.వాళ్ళు ఎలాంటివాళ్లైనా సరే.దీనికి కారణం కూడా అమ్మ వాక్యమే కావచ్చు."ఏ పాదాలకు నమస్కరించినా ఈ పాదాలకే చేరుతుంది నాన్నా." అని అమ్మ అన్నది కదా?-అన్నాడు.

మౌనంగా వింటూ చూస్తున్నాను.

'ఇంకో విషయం చెప్తాను అన్నగారు.ఇది చాలా విచిత్రంగా ఉన్నది.మనం రోడ్డు మీద పోతున్నాం అనుకోండి.రోడ్డు పక్కన ఏ కుక్కో లేదా ఇంకే జంతువో ఏదో బాధపడుతూ ఉందనుకోండి.నాకేం అనిపిస్తున్నదో చెప్పనా?అది మనలా సుఖంగా ఎందుకు ఉండలేదు? అది అలా ఎందుకు బాధపడాలి? దానికి నా ప్రాణాన్ని ఇచ్చేస్తే తప్పేమిటి? నా ప్రాణం పోతేపోనీ అది బాగుంటే చాలు' అనిపిస్తున్నది.' అన్నాడు.

చరణ్ అబద్ధాలు చెప్పే రకంకాదు.అందులో ఇలాంటి విషయాలలో పొరపాటున కూడా అబద్ధాలు చెప్పడు.

అతని ముఖంలోకి చూచాను.నూటికి నూరుశాతం నిజాయితీతో ఆ మాటలు అంటున్నాడని తెలుస్తున్నది.

'ఒక్క జంతువులనేనా?మనుషుల బాధలు చూచినా అలాగే అనిపిస్తున్నదా?' అడిగాను.

'మనుషులవి కూడా అలాగే అనిపిస్తున్నదన్నగారు.ఎవరైనా బాధల్లో ఉంటే ఆ బాధ నేను తీసుకుని వాళ్లకు ఆనందాన్ని ఇద్దామని బలంగా అనిపిస్తున్నది' అన్నాడు అమాయకంగా.

నా కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి.బలవంతాన ఆపుకున్నాను.

'ఎంతటి బాధా నన్ను ఏడిపించలేదు.కానీ మనిషిలోని మంచితనం ఏడిపిస్తుంది' అన్న జిల్లెళ్ళమూడి అమ్మ మాటలు గుర్తొచ్చాయి.

'ఈ మూడు విషయాల మీద మీ కామెంట్ ఏమిటి అన్నగారు?' అడిగాడు.

'నో కామెంట్ తమ్ముడూ.నీవు చెబుతున్నవాటినీ నీ మానసిక స్థితిలోని నిజాయితీనీ నేను ఫీల్ కాగలుగుతున్నాను.సాధనామార్గంలో ఇలాంటి మానసిక స్థితులు కలుగుతాయి.ఇవి నిజాలే.కనుక నేను ఏమీ కామెంట్ చెయ్యను' చెప్పాను.

ఆ తరువాత సంభాషణ పెద్దగా సాగలేదు.'శ్రీవిద్యారహస్యం' పుస్తకం గురించీ అదెప్పుడు రిలీజ్ అవుతుంది అన్న విషయం గురించీ కొంత మాట్లాడుకున్నాము.

'వస్తానన్నగారు.ఊరిలోకి స్వామి సుందరచైతన్యానంద వచ్చారట. ఉపన్యాసాలు సాగుతున్నాయి.వినడానికి వెళుతున్నాను.' అన్నాడు లేస్తూ.

'ప్రస్తుతస్థితిలో అవి వినడం నీకు అవసరమా తమ్ముడూ?' అడిగాను.

'చెప్పానుగా అన్నగారు.ఏ పాదాలైనా ఆ పాదాలే.' అన్నాడు.

'సరే,మంచిది.హృదయపూర్వకంగా నీవు అదే నమ్మితే అంతకంటే మించినది లేదు' అన్నాను.

చరణ్ సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు.