“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

10, నవంబర్ 2014, సోమవారం

మహాత్ముడే మన మధ్యకొస్తే...

మొన్నీ మధ్యన జరిగిన 'విజిలెన్స్ ఎవేర్ నెస్ వీక్' లో ఒక చిన్న స్కిట్ వేశాము.గుంటూర్ డివిజన్ కల్చరల్ టీం లో నేను ముఖ్యమెంబర్ని గనుక నన్ను మహాత్మాగాంధీ వేషం వెయ్యమన్నారు.ఆ వేషానికి నాకైతే ఎక్కువగా మేకప్ అవసరం లేదని మావాళ్ళ ఊహ.

సరేనని ముందుగా మావాళ్ళు వ్రాసిన స్క్రిప్ట్ చూచాను.చాలా నిరాసక్తంగా రసహీనంగా ఉన్నది.హాస్యం లేకుంటే మనకు నచ్చదు గనుక అప్పటికప్పుడు కొన్ని జోక్స్ ను ఆ స్కిట్ లో సందర్భానుసారంగా చొప్పించి ఆ స్క్రిప్ట్ ను పరిపుష్టం చేశాను.

పాత్రలు:-

సామాన్యుడు
సివిల్ ఇంజనీరు
కాంట్రాక్టరు
టీటీయీ
ప్రయాణీకుడు
ఆఫీసు ఉద్యోగి
పీ.ఎఫ్ కోసం అప్లై చేసిన ఒక ఉద్యోగి
మహాత్మా గాంధీ

స్క్రిప్ట్ ఇలా సాగుతుంది.


సామాన్యుడు ముందుగా స్టేజీ మీదకు వచ్చి 'లోకంలో ఎక్కడ చూచినా అవినీతి పెరిగిపోయింది. ముఖ్యంగా మన డిపార్ట్ మెంట్ లో ఇంజనీరింగ్ విభాగంలో జరిగే అవినీతి ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం' అంటాడు.



మొదటి సీన్:--
ఒక టెండర్ ఫ్లోటింగ్ విషయంలో ఇంజనీరూ కాంట్రాక్టరు మధ్యన జరిగే అక్రమ లావాదేవీ జరిగే సీన్ అప్పుడు ఉంటుంది.

తర్వాత సామాన్యుడు మళ్ళీ వచ్చి 'ఇప్పుడు టీటీయీ ప్రయాణీకుల మధ్యన జరిగే అవినీతి చూద్దాం' అంటాడు.

రెండవ సీన్:--
అర్జంటుగా ప్రయాణం అయ్యి వెళుతున్న ఒక ప్రయాణీకుడి అవసరాన్ని ఒక టీటీయీ ఎలా వాడుకుంటాడో తరువాత సీన్లో ఉంటుంది.

ఆ తర్వాత మళ్ళీ సామాన్యుడు వచ్చి 'పీ.ఎఫ్ అప్లికేషన్ పెట్టిన ఒక ఉద్యోగి అవసరాన్ని ఒక ఆఫీస్ స్టాఫ్ ఎలా అవినీతికి ఆస్కారంగా మలుచుకుంటాడో చూద్దాం' అంటాడు.

మూడవ సీన్:--
ఆ తర్వాత,తన కూతురి పెళ్ళికోసం పీ.ఎఫ్ డ్రా చెయ్యాలని ప్రయత్నించే ఒక గ్యాంగ్ మేన్ అవసరాన్ని మినిస్టీరియల్ స్టాఫ్ ఎలా వాడుకుంటాడో ఒక సీన్ ఉంటుంది.

ఈ అవినీతిని చూచి సామాన్యుడు బాధపడుతూ 'ఓ మహాత్మా!ఎంతో కష్టపడి ఎన్నో త్యాగాలు చేసి ఈ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చావు.ఇప్పుడు సమాజంలో పెరిగిపోయిన అవినీతిని చూస్తే నీవేం చేసేవాడివి?ఎలా పరిష్కారం చేసేవాడివి ?ఎక్కడున్నావు?మా మధ్యకు రావా?'అని వాపోతాడు.

అప్పుడు గాంధీ మహాత్ముడు ప్రత్యక్షమై మళ్ళీ వెనక్కు ఒక్కొక్క సీన్ లోకి సామాన్యుడిని తీసుకువెళ్ళి ఆయా సందర్భాలలో బాధితులు ఏం చెయ్యాలి?ఆ అవినీతిని ఎలా ఎదుర్కోవాలి? అన్న సలహాలు ఇస్తాడు.


ఈ లోపల స్వర్గం నుంచి మహాత్ముడికి ఫోనోస్తుంది.

'ఆ! ఎవరూ? జవహర్ నీవా? ఏంటీ? స్వర్గంలో కూడా అవినీతి మొదలైందా?పరిష్కారాలు చూపడానికి నన్ను రమ్మంటావా? ఇదుగో వస్తున్నా.' అంటూ గాంధీ మహాత్ముడు నిష్క్రమిస్తాడు.



స్కిట్ వేసే ముందే మా వాళ్లకు చెప్పాను.

"ఒక్క చిన్న పంచె కట్టుకుని అచ్చం గాంధీలా స్టేజి మీద నటించడం నావల్ల కాదు.ఖద్దరు లాల్చీ పైజామా వేసుకుని నటిస్తాను.ఎందుకంటే ఇప్పటికే మనకు అభిమానులు ఎక్కువై పోయారు.ఇక ఆ వేషంలో మనల్ని చూస్తే అభిమాన సంఘాలు కూడా పుట్టుకొస్తాయి.అంత అభిమానం నేను తట్టుకోలేను.వద్దు"- అని చెప్పాను.

తన డ్రస్సు మారడానికి కారణం కూడా ఒక సీన్ లో గాంధీయే చెబుతాడు.



'నా కాలంలో దేశంలో ఎక్కడ చూచినా పేదరికం ఉండేది.సామాన్య జనం కట్టుకోవడానికి బట్టలు కూడా లేని పరిస్థితిలో ఉండేవారు.వారికి సానుభూతిగా నేనూ ఒక్క పంచె మాత్రమే కట్టుకుని ఉండేవాడిని.కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.ప్రస్తుతం జనం దగ్గర డబ్బు విపరీతంగా ఉన్నది.దాచుకోవడానికి మన బ్యాంకులు చాలక విదేశీ బ్యాంకులలో దాచుకునే నల్ల కుబేరులు ఎక్కడ చూచినా తయారయ్యారు.ఇదంతా చూచి విరక్తి కలిగి ఇప్పుడు నేను కూడా నా దుస్తులు మార్చాను.ఈ వేషంలో ప్రస్తుతం ఉంటున్నాను.' అని ఒక డైలాగ్ అప్పటికప్పుడు వ్రాసి చెప్పాను.

స్కిట్ బాగా హిట్ అయింది.నా సహోద్యోగులు కూడా కొందరు నన్ను ఆ వేషంలో గుర్తుపట్టలేదు.జోకులు బాగా పేలాయి.

"సందర్భానుసారంగా పాత్రలకోసం కొన్ని ఉద్యోగాలను ఉదాహరణగా తీసుకోవడం జరిగింది.అంతేగాని ఏ ఉద్యోగినీ ఏ విభాగాన్నీ నొప్పించడం మా ఉద్దేశ్యం కాదు.అన్ని విభాగాలలోనూ అవినీతి పరులూ ఉంటారు,నీతిపరులూ ఉంటారు. అవినీతిపై పోరాడాలని చెప్పడమే మా ఉద్దేశ్యం.అప్పుడే స్వచ్ఛ భారత్ అనేది మన కళ్ళముందు ఆవిష్కరింపబడుతుంది"- అనే సందేశంతో స్కిట్ ముగుస్తుంది.

ఆ విధంగా,నాకంతగా ఇష్టంలేని గాంధీ మహాత్ముడి వేషంవెయ్యడం కూడా జరిగిపోయింది.ఇష్టంలేని పనిని ఇష్టపడుతూ చేసి రక్తి కట్టించడమే కదా యోగంలో ఒక భాగం???