“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

30, ఏప్రిల్ 2020, గురువారం

'నాదబిందూపనిషత్ ' తెలుగు 'ఈ-పుస్తకం' నేడు విడుదలైంది

ఋగ్వేదాన్తర్గతమైన 'నాదబిందూపనిషత్' ను నా వ్యాఖ్యానంతో నేడు విడుదల చేస్తున్నాము. ఈ పదిరోజులలో 'పంచవటి' నుండి వెలువడుతున్న ఆరవ పుస్తకమిది.

నాదోపాసన అనేది మన సనాతనధర్మంలో అంతర్భాగంగా అతి ప్రాచీనకాలంనుంచీ ఉన్నది. ఋగ్వేదకాలంలో ప్రసిద్ధిగాంచిన ఓంకారోపాసన నాదోపాసనయే. నాదమనేది పరబ్రహ్మం యొక్క మొదటి వ్యక్తరూపంగా వేదం చెబుతుంది. భగవంతుని మొదటిపేరును, మనమెవరూ ఆయనకు పేర్లు పెట్టకముందు ఉన్న అసలైన పేరును - 'తస్య వాచక ప్రణవ:' అంటూ ప్రణవనాదంగా అభివర్ణించారు పతంజలిమహర్షి . ఈ ఓంకార ప్రణవనాదం సృష్టిలో నిరంతరం మారుమ్రోగుతూనే ఉన్నది. కానీ విషయలంపటాలలో కూరుకుపోయిన మనం ఆ నిరంతరనాదాన్ని వినలేము. దైవాన్ని దర్శించలేము. కానీ సాధనతో దానిని వినవచ్చు. దర్శనాన్ని పొందవచ్చు. ఆ సాధన పేరే నాదోపాసన.

మన దేశంలో ఎందరో ఎందరెందరో మహనీయులు యోగులు ఈ సాధనతో పునీతులైనారు. ఈ మధ్యకాలంలో మనకు తెలిసినవారు సంగీతత్రిమూర్తులు. 'సంగీతజ్ఞానమూ భక్తివినా సన్మార్గము గలదే మనసా..భృంగి నటేశ సమీరజ ఘటజ మతంగ నారదాదులుపాసించే...' అన్న కీర్తనలో త్యాగరాజు దీనినే గానం చేశారు. మనం ఈనాడు చేస్తున్న పూజలు ఇవన్నీ రాకముందు మన సాంప్రదాయంలో ఉన్నది ఓంకారోపాసనమే. యోగసాధనలో నాద బిందు కళలన్నవి ప్రసిద్ధములే ! వాటిలో నాదం మొదటిమెట్టు.

సమస్త సాధనలనూ ఔపోసన పట్టిన శ్రీరామకృష్ణుల జీవితంలో నాదోపాసనలో అంచులు మనకు గోచరిస్తాయి. లౌకికజీవితంలో మనం అనుకునే అల్పమైన నాదములు కూడా ఆయనను అతీతసమాధి స్థితులలోకి తీసుకుపోయేవి. బ్రహ్మప్రణవనాదంలో ఆయన మనస్సును లీనం చేసేవి. అందుకే సందర్భానుసారంగా ఆయన మాటలను ఈ పుస్తకంలో ఉటంకించి దీనికి పరిపూర్ణతను తెచ్చాను.

నాదోపాసనకు గల వేదప్రామాణికతను ఈ పుస్తకం మీకు అర్ధమయ్యేలా చేస్తుంది.

ఈ పుస్తకం వ్రాయడంలో యధావిధిగా ఎంతగానో సహాయపడిన నా శ్రీమతికి, నా శిష్యురాళ్ళు అఖిల, శ్రీలలితలకు, శిష్యులు రాజు, కవర్ పేజీ డిజైనర్ ప్రవీణ్ లకు, నా కృతజ్ఞతలు, ఆశీస్సులు. ఈ వేదసరస్వతీ ఉపాసనవల్ల వారి ఎకౌంట్లో చాలా పుణ్యం జమ అవుతోంది.

ఈ పుస్తకం కూడా google play books నుంచి లభిస్తుంది. త్వరలో ప్రింట్ పుస్తకంగా తెలుగు ఇంగ్లీషులలో వస్తుంది.
read more " 'నాదబిందూపనిషత్ ' తెలుగు 'ఈ-పుస్తకం' నేడు విడుదలైంది "

28, ఏప్రిల్ 2020, మంగళవారం

'యోగతత్త్వోపనిషత్' తెలుగు 'ఈ-పుస్తకం' నేడు విడుదలైంది

అధర్వణ వేదంలోనూ, కృష్ణయజుర్వేదంలోనూ లభిస్తున్న 'యోగతత్త్వోపనిషత్' అనే ఈ ఉపనిషత్తు యోగసాంప్రదాయం గురించి విస్తృతంగా చర్చించింది. అందుకని, శంకరజయంతి సందర్భంగా ఈ పుస్తకాన్ని నా వ్యాఖ్యానంతో విడుదల చేస్తున్నాము.

ఈ రెండు ఉపనిషత్తులలోనూ, చర్చించిన విషయాన్ని బట్టీ, వాడిన భాషను బట్టీ, అధర్వణవేదంలో ఉన్న ఉపనిషత్తు ప్రాచీనమైనదిగా కనిపిస్తున్నది. కృష్ణయజుర్వేదంలోని ఉపనిషత్తులో మధ్యయుగాల నాటి వైష్ణవభావములు కొంచం కలిసి కన్పిస్తున్నాయి. అంతేగాక, హఠయోగ ప్రామాణిక గ్రంధముల నుండి కొన్ని శ్లోకములను సంగ్రహించి దీనిలో కలిపినట్లుగా కనిపిస్తున్నది. మధ్యయుగాలలో,  హఠయోగ విధానాలు అనేక యోగ తంత్ర గ్రంధములలో కలసిపోయాయి. అదే వరుస ఈ ఉపనిషత్తులో కూడా కనిపిస్తుంది.

అయితే, తనవైన కొన్ని ప్రత్యేక యోగవిధానములను ఈ ఉపనిషత్తు ఉపదేశిస్తున్నది. అధర్వణవేదంలో అయితే, ప్రాచీనకాలపు ఓంకారసాధన దర్శనమిస్తున్నది. యజుర్వేదభాగంలో, 'పంచభూతధారణ' అనే ప్రత్యేక యోగక్రియ కనిపిస్తున్నది. ఈ విధంగా ఈ ఉపనిషత్తుకు తనవైన కొన్ని ప్రత్యేకతలున్నాయి.

ఈ ఏడాది మా పంచవటి పబ్లికేషన్స్ నుండి వెలువడుతున్న ఆరవ పుస్తకం ఇది. ఈ నెలలో వెలువడుతున్న ఐదో పుస్తకం. కరోనా పుణ్యమాని ఈ నెలలో అయిదు ఉన్నత భావధార కలిగిన పుస్తకాలు వ్రాశాను.

ఈ పుస్తకం వ్రాయడంలో ఎంతగానో సహాయపడిన నా శ్రీమతికి, నా శిష్యురాళ్ళు అఖిల, శ్రీలలితలకు, కవర్ పేజీ డిజైనర్ ప్రవీణ్ లకు, నా కృతజ్ఞతలు, ఆశీస్సులు.

ఈ పుస్తకం కూడా google play books నుంచి లభిస్తుంది. త్వరలో ప్రింట్ పుస్తకంగా తెలుగు ఇంగ్లీషులలో వస్తుంది.
read more " 'యోగతత్త్వోపనిషత్' తెలుగు 'ఈ-పుస్తకం' నేడు విడుదలైంది "

27, ఏప్రిల్ 2020, సోమవారం

'శాండిల్యోపనిషత్' తెలుగు 'ఈ - పుస్తకం 'నేడు విడుదలైంది




అధర్వణ వేదాంతర్గతమైన "శాండిల్యోపనిషత్ (శాండిల్య యోగసూత్రములు)" కు నా వ్యాఖ్యానమును ఈ రోజున 'ఈ-పుస్తకంగా విడుదల చేస్తున్నాము. లాక్ డౌన్ ఎత్తేశాక ఇది తెలుగు మరియు ఇంగ్లీషు ప్రింట్ పుస్తకాలుగా వస్తుంది. ఈ ఏడాది మా పంచవటి పబ్లికేషన్స్ నుండి వెలువడుతున్న ఐదో పుస్తకం ఇది. ఈ నెలలో వెలువడుతున్న నాలుగో పుస్తకం.

నాలుగు వేదములకు అనుబంధములైన యోగోపనిషత్తులలో మూడు ముఖ్యమైనవిగా ఉన్నాయి.

1. దర్శనోపనిషత్. దీనికి జాబాల దర్శనోపనిషత్ అని నామాంతరమున్నది. దీనిని ముందుగానే ప్రచురించాము.

2. యోగకుండల్యుపనిషత్. దీనికే యోగకుండలిని ఉపనిషత్ అని నామాంతరమున్నది. దీనిని కూడా ఈ మధ్యనే ప్రచురించాము.

3.శాండిల్యోపనిషత్. దీనికి శాండిల్యయోగసూత్రములని నామాంతరమున్నది. చాలామందికి తెలియని విషయమేమిటంటే, పతంజలిమహర్షి వ్రాసిన యోగసూత్రములకంటే శాండిల్యమహర్షి యోగ సూత్రములే సనాతనధర్మమునకు దగ్గరగా ఉంటాయి. ఆ పుస్తకం ఈ రోజున వస్తున్నది.

ఈ మూడింటిలోనూ వైదిక యోగసంప్రదాయం చాలా స్పష్టంగా మనకు కనిపిస్తున్నది. దాదాపుగా 20 యోగోపనిషత్తులు వేదములలో మనకు లభిస్తున్నాయి. వాటిలో ఋగ్వేదం నుంచి 2, సామవేదం నుంచి 3, శుక్ల యజుర్వేదం నుంచి 4, కృష్ణ యజుర్వేదం నుంచి 5, అధర్వణ వేదం నుంచి 6 ఉన్నాయి. వాటిని వరుసగా ప్రచురిస్తున్నాము.

శాండిల్యమహర్షి పేరు మీద ఈ ఉపనిషత్తు మనకు దర్శనమిస్తుంది. శాండిల్యగోత్రం మనకు ఉత్తరభారతదేశంలోనూ, గోదావరిజిల్లాల లోనూ కనిపిస్తుంది. ఇది అథర్వణ వేదమునకు చెందిన ఉపనిషత్తు. ఇది క్రీ.పూ 1 వ శతాబ్దానికి చెందినదిగా కొందరు పండితులు నిర్ధారించారు. కొందరేమో క్రీ.శ 3 వ శతాబ్దమన్నారు. పతంజలిమహర్షి వ్రాసిన యోగసూత్రముల పైన బుద్ధమతప్రభావం కనిపిస్తుంది. కానీ శాండిల్య యోగసూత్రములలో ఆ ప్రభావం ఉండదు. ఇది పూర్తిగా వైదిక సాంప్రదాయానుసారిగా గోచరిస్తుంది. యోగమునూ, బ్రహ్మవిద్యనూ అధ్యయనం చెయ్యాలన్న ఇచ్ఛతో శాండిల్య మహర్షి, అథర్వణమహర్షిని ఆశ్రయించి ఆయన వద్ద పొందిన ఉపదేశమే ఈ ఉపనిషత్తు. యోగసాంప్రదాయం పైన ఇది సాధికారిక గ్రంథమని చెప్పవచ్చు.

పతంజలిమహర్షి చెప్పిన యమనియమములకూ, ఈ ఉపనిషత్తులు చెప్పిన బోధలకూ భేదములున్నాయి. ఉపనిషద్బోధలు పూర్తిగా వైదిక సాంప్రదాయానుసారులుగా కనిపిస్తున్నాయి.

ఈ ఉపనిషత్తును మొత్తం ఒకే ఒక శ్లోకంలో ఇమిడ్చి ఈ విధంగా చెప్పబడింది.

|తత్ర దశ యమాః | తథా నియమాః | ఆసనాన్యష్టౌ | త్రయః ప్రాణాయామాః | పఞ్చ ప్రత్యాహారాః | తథా ధారణా | ద్విప్రకారం ధ్యానమ్ | సమాధిస్త్వేకరూపః |

యమములో పది అంగములున్నాయి. అలాంటిదే నియమం కూడా. ఆసనములు ఎనిమిది. ప్రాణాయామములు మూడు. ప్రత్యాహారములు అయిదు. ధారణ కూడా అలాంటిదే. ధ్యానం రెండు విధములైనది. సమాధి ఏక రూపమైనట్టిది.

వైదికధర్మం మొదట నిర్గుణ పరబ్రహ్మతత్త్వంతో మొదలుపెట్టి, క్రమేణా సగుణోపాసనగా రూపాంతరం చెందుతూ తదుపరి భగవంతుని అవతారములను ఆరాధించడం ఏ విధంగా మొదలుపెట్టిందో ఆ పరిణామక్రమం ఈ ఉపనిషత్తు చివరి అధ్యాయములో మనకు కనిపిస్తుంది. నిర్గుణపరబ్రహ్మమే దత్తాత్రేయునిగా అవతారం దాల్చిందని చెబుతూ ఈ ఉపనిషత్ ముగుస్తుంది.

యోగసాంప్రదాయమునకు గల వైదికమూలములను మనమీ ఉపనిషత్తును అధ్యయనం చెయ్యడం ద్వారా గ్రహించవచ్చు. చదువరులను అసలైన యోగసాధన వైపు ఈ పుస్తకం మళ్ళించగలిగితే మా ప్రయత్నం సఫలమైనట్లు భావిస్తాము.

ఈ పుస్తకం వ్రాయడంలో ఎంతగానో సహాయపడిన నా శ్రీమతికి, నా శిష్యురాళ్ళు అఖిల, శ్రీలలితలకు, శిష్యులు రాజు, కవర్ పేజీ డిజైనర్ ప్రవీణ్ లకు, యోగాసనముల బొమ్మలను చక్కగా చిత్రించి ఇచ్చిన నిఖిలకు నా కృతజ్ఞతలు, ఆశీస్సులు.

ఈ పుస్తకం కూడా google play books నుంచి లభిస్తుంది.
read more " 'శాండిల్యోపనిషత్' తెలుగు 'ఈ - పుస్తకం 'నేడు విడుదలైంది "

24, ఏప్రిల్ 2020, శుక్రవారం

'యోగ తారావళి' తెలుగు 'ఈ బుక్' నేడు విడుదలైంది


ఆదిశంకరులు అద్వైతజ్ఞాననిధి. అస్తవ్యస్తంగా నూటపదహారు శాఖలతో అల్లాడుతున్న వైదికధర్మాన్ని సరిదిద్ది దానికొక స్పష్టమైన రూపునిచ్చి దిశానిర్దేశం చేసిన   మహనీయుడాయన. వేదములలో ఉన్న జ్ఞానోపనిషత్తులకు ఆయన వ్యాఖ్యానం వ్రాశారు. కానీ యోగోపనిషత్తులను తాకలేదు. బహుశా అవి తర్వాతికాలంలో వచ్చి ఉండవచ్చు. లేదా వాటిని వ్యాఖ్యానించవలసిన అవసరం లేదని ఆయన భావించి ఉండవచ్చు. ఏది ఏమైనా, యోగోపనిషత్తుల జోలికి మాత్రం ఆయన పోలేదు.

కానీ, యోగసాధనను మొత్తం గుదిగుచ్చి 29 శ్లోకములలో 'యోగ తారావళి' అనే చిన్న పుస్తకాన్ని ఆయన వ్రాసినట్లు కనిపిస్తున్నది. ఇవి చూడటానికి 29 శ్లోకములే అయినప్పటికీ మొత్తం యోగశాస్త్రసారమంతా వీటిలో ఇమిడి ఉన్నది. వామనుడు చూడడానికి చిన్నవాడైనా, విశ్వరూపం దాల్చినప్పుడు విశ్వం మొత్తాన్నీ ఆక్రమించాడు. అలాగే, ఈ పుస్తకం చూడటానికి చాలా చిన్నదైనా, 'పిట్టకొంచం కూత ఘనం' అన్నట్లు, భావవిస్తృతిలో చాలా పెద్దది. హఠయోగాన్నీ రాజయోగాన్నీ వాటి సారాన్ని పిండి, అతి తక్కువ శ్లోకములలో చెప్పడం ఆచార్యులవారికే చెల్లింది. ఇంకొకరైతే ఈ పనిని చెయ్యలేరు.

సరిగ్గా చెప్పాలంటే, దీనిలో చెప్పబడిన సాధనలను సాధించాలంటే ఒక మానవజీవితం సరిపోదు. అందులోనూ నేడు మనం జీవిస్తున్న పరుగుపందెపు జీవితాలైతే ఒక నూరు కావాలి, ఈ పుస్తకంలో చెప్పబడిన స్థితులను సాధించడానికి. అంటే ఒక నూరు జన్మలెత్తినా నేటి మానవుడు దీనిలో చెప్పబడిన యోగస్థితులను సాధించలేడు.

మరెందుకు దీనికి మీరు వ్యాఖ్యానం వ్రాయడం? అంటే, అసలు విషయమెంటో జిజ్ఞాసువులకు తెలియకపోతే ఎలా? దారి ఎంత పొడవో  తెలిస్తే, ఎలా ప్రయాణించాలో ఒక ప్లాన్ రూపు దిద్దుకుంటుంది. దారి ఎలా ఉంటుందో, ఎక్కడికి చేరాలో, ఏమీ తెలియకపోతే, ఎటు పోతున్నామో తెలీక, నేడు జనమంతా నడుస్తున్నట్లు పిచ్చినడక అవుతుంది. అందుకే, నడిచినా నడవకపోయినా, గమ్యమూ, దానిని చేర్చే దారీ తెలియడం మంచిది. దానిలో ప్రయాణించడమా లేదా అన్నది తర్వాత, ముందు విషయం అర్ధం కావాలి కదా? అందుకే ఈ ప్రయత్నం !

నా గురువుల నుంచి నేను వినిన బోధలను, నా సాధనానుభవములను నెమరు వేసుకుంటూ ఈ వ్యాఖ్యానం వ్రాశాను. ఆదిశంకరాచార్యులవారు వ్రాసిన ఈ పుస్తకానికి వ్యాఖ్యానం వ్రాయగలగడం నా అదృష్టంగా, జగజ్జనని మహాకాళి కటాక్షంగా, భావిస్తున్నాను.

యోగాభ్యాసపరులకు ఈ పుస్తకం ఒక టెక్స్ట్ బుక్ లాంటిది. దీనిని సరిగ్గా ఉపయోగించుకుంటారని, యోగమార్గంలో ప్రయాణించి, హిందువులుగా పుట్టినందుకు ధర్మమార్గంలో నడుస్తారని, జన్మసాఫల్యతను అందుకుంటారని,  ఆశిస్తున్నాం.

మా సంస్థ నుండి ఈ ఏడాదిలో వస్తున్న నాలుగో పుస్తకం ఇది. లాక్ డౌన్ ఎత్తేశాక తెలుగు ఇంగ్లీషులలో ప్రింట్ పుస్తకాలుగా కూడా వస్తుంది.

ఇది కూడా google play books నుంచి లభిస్తుంది.
read more " 'యోగ తారావళి' తెలుగు 'ఈ బుక్' నేడు విడుదలైంది "

22, ఏప్రిల్ 2020, బుధవారం

'యోగ కుండలినీ ఉపనిషత్' తెలుగు 'ఈ బుక్' నేడు విడుదలైంది


Vision 2020 లో భాగంగా 'పంచవటి పబ్లికేషన్స్' నుండి మూడో పుస్తకంగా కృష్ణ యజుర్వేదాంతర్గతమైన  'యోగ కుండలినీ ఉపనిషత్' కు నా వ్యాఖ్యానాన్ని పుస్తకరూపంలో ఈ రోజు విడుదల చేస్తున్నాము. వేదములలో 20 వరకూ యోగోపనిషత్తులున్నాయి. అవన్నీ ఇప్పుడు వరుసగా 'పంచవటి పబ్లికేషన్స్' నుండి పుస్తకాలుగా వస్తాయి. కాళికామాత కటాక్షమును బట్టి, నా సాధనానుభవములను బట్టి వీటిని నేను వ్యాఖ్యానించ గలుగుతున్నాను.

నా గురువుగారైన పూజ్యపాదులు శ్రీమత్ గంభీరానందస్వాములు పది ప్రముఖములైన జ్ఞానోపనిషత్తులకు వ్యాఖ్యానం వ్రాశారు. వాటిని శ్రీ రామకృష్ణ మఠంవారు ప్రచురించారు. ఉడతాభక్తిగా నా వంతు నేను ఈ యోగోపనిషత్తులకు వ్యాఖ్యానం వ్రాస్తూ ఋషి ఋణాన్ని, గురు ఋణాన్ని తీర్చుకుంటున్నాను.

1988 లో నా గురువులలో ఒకరైన పూజ్యపాదులు నందానంద స్వామివారు నాతో ఇలా అన్నారు 'భవిష్యత్తులో నీవు ఉపనిషత్తులకు వ్యాఖ్యానం వ్రాస్తావు'. 'నామీద ప్రేమతో ఆయనలా అంటున్నారులే' అనుకుని అప్పట్లో నేనది నమ్మలేదు. కానీ ఈనాడది నిజం అవుతోంది. జ్ఞానోపనిషత్తులలో ముఖ్యములైన వాటిని నా 'శ్రీవిద్యా రహస్యం' పుస్తకంలో స్పర్శించాను. నేడు యోగోపనిషత్తులకు వ్యాఖ్యానం వ్రాసే అదృష్టం పట్టింది.

అష్టాంగయోగమును, ఆసన, ప్రాణాయామ, ముద్ర, క్రియ, బంధాది విషయములను ఈ యోగోపనిషత్తులు ఉపదేశిస్తాయి. పతంజలి మహర్షి తన యోగసూత్రములలో చెప్పిన యోగవిధానానికీ వీటిలో చెప్పబడిన విధానానికీ తేడాలున్నాయి. నేను చిన్నప్పటినుండీ సాధన చేసిన మార్గం వీటిల్లో వివరంగా మీకు కనిపిస్తుంది.

ఈ పుస్తకం కూడా మీకు google play books నుంచి లభిస్తుంది.

లాక్ డౌన్ తర్వాత ఇది  తెలుగు మరియు ఇంగ్లీషు ప్రింట్ పుస్తకాలుగా వస్తుంది.
read more " 'యోగ కుండలినీ ఉపనిషత్' తెలుగు 'ఈ బుక్' నేడు విడుదలైంది "

19, ఏప్రిల్ 2020, ఆదివారం

మా క్రొత్త ఇంగ్లీష్ 'ఈ - పుస్తకం' Medical Astrology - Part I ఈరోజు విడుదలైంది


'పంచవటి పబ్లికేషన్స్' నుండి ఒక అద్భుతమైన పుస్తకాన్ని ఈరోజు విడుదల చేస్తున్నాము. దానిపేరు Medical Astrology Part - 1. ప్రస్తుతానికి దీనిని 'ఈ బుక్' గా విడుదల చేస్తున్నప్పటికీ, లాక్ డౌన్ అయిపోయాక ఇది ప్రింట్ బుక్ గా వస్తుంది. Vision 2020 లో  వదలబడుతున్న రెండవ పుస్తకం ఇది. మొదటిది 'మహాస్మృతి ప్రస్థాన సూత్రం' ఇప్పటికే విడుదలయ్యింది.

తెలుగు పాఠకుల కోసం అతిత్వరలో ఈ పుస్తకం తెలుగు అనువాదం 'వైద్య జ్యోతిష్యం - మొదటి భాగం ' అనే పేరుతో తెలుగు 'ఈ బుక్' గా విడుదల అవుతుంది. ఆ తర్వాత అదీ ప్రింట్ పుస్తకంగా వస్తుంది.

'మెడికల్ అస్ట్రాలజీ' మీద ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కొన్ని పుస్తకాలున్నప్పటికీ, మా పుస్తకానికి చాలా ప్రత్యేకతలున్నాయి. ఇది పూర్తిగా నా స్టైల్లో విశ్లేషణ చెయ్యబడిన నూరు జాతకాలున్న అద్భుతమైన పుస్తకం. ఇరవై ఐదేళ్లుగా నేను చేస్తున్న జ్యోతిష్యశాస్త్ర రీసెర్చి వల్ల ఈ శాస్త్రంలో చాలా క్రొత్త కోణాలను నేను కనుక్కున్నాను. వాటిని ఈ పుస్తకంలో వివరించడమే గాక నూరు జాతకచక్రాలను, నూరు రకాలైన వ్యాధులను విశ్లేషణ చేస్తూ ఆయా సూత్రాలనుపయోగించి ముందే రాబోయే రోగాలను ఎలా కనుక్కోవచ్చో వివరించాను. వ్యక్తిగత కారణాల రీత్యా ఆయా జాతకుల వివరాలను మాత్రం పూర్తి గోప్యంగా ఉంచడం జరిగింది.

అసలు మనిషికి కావలసిందే ఇది ! తన జీవితంలో ఏ సమయంలో ఏ రోగం రాబోతున్నదో ముందే తెలిస్తే అంతకంటే ఇంకేం కావాలి? ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకుని దానిని రాకుండా కాపాడుకోవచ్చు. ఒకవేళ అది తప్పకపోతే ఎలా దానిని త్వరగా తగ్గించుకోవచ్చో తెలుసుకోవచ్చు.

ఇలాంటి పుస్తకం మన ఇండియాలోనే కాదు, ప్రపంచ జ్యోతిష్యశాస్త్ర చరిత్రలోనే ఇంతవరకూ లేదని నేను గర్వంగా చెప్పగలను. ఎందుకంటే, 30  ఏళ్ల నుంచీ హోమియోపతి వైద్యంలో నాకున్న అనుభవంతో, రోగాలను జ్యోతిష్యకోణం నుంచి, హోమియోపతి కోణం నుంచి పరిశీలన చేసి వాటి లోతుపాతులను సాధ్యాసాధ్యాలను ఈ పుస్తకంలో వివరించాను. ఒక జాతకాన్ని నేను ఎలా విశ్లేషణ చేస్తాను? అన్న నా పర్సనల్ స్టైల్ ను ఈ పుస్తకంలో మీరు తేలికగా అర్ధం చేసుకోవచ్చు.

జ్యోతిష్యాన్ని సరియైన కోణంలో నేర్చుకోవాలని అనుకునేవారికి, జ్యోతిష్యశాస్త్ర విద్యార్థులకూ, జ్యోతిష్య పండితులకూ, అందులో ఇప్పటికే పండిపోయామని అనుకునేవారికి - అందరికీ ఈ పుస్తకం ఎన్నో క్రొత్త కోణాలను చూపిస్తుంది. వాళ్ళ కళ్ళు తెరిపిస్తుంది.

ఈ సంవత్సరం అయిపోయేలోపల ఈ పుస్తకం రెండవ భాగమైన Part - 2 ను మరొక్క నూరు జాతకాల విశ్లేషణతో ప్రచురిస్తాము. ఈ రెండు పుస్తకాలను చదివాక మీరు నోరెళ్లబెట్టకుండా ఉండాలని ఎంత ప్రయత్నించినా, అలా ఉండలేరు. అంత గొప్ప సైన్స్ ఇది !

ఈ పుస్తకం వెలుగు చూడటానికి ఎంతో శ్రమించి నాకు చేదోడువాదోడుగా ఉంటూ వారిదైన ఎంతో సమయాన్ని దీనికోసం వెచ్చించిన అఖిల, శ్రీలలిత, రాజు సైకం, ప్రవీణ్ లకు, పుస్తకం వ్రాయడంలో అనుక్షణం నాకు సపోర్ట్ గా ఉన్న నా శ్రీమతి సరళాదేవికి నా కృతజ్ఞతలు.

ఈ పుస్తకం కూడా యధావిధిగా google play books నుండి లభిస్తుంది.


అమెజాన్ లో ఇక్కడ లభిస్తుంది

https://www.amazon.com/dp/B087BKK5N2/ref=cm_sw_r_wa_apa_i_enlNEbN5968WE
read more " మా క్రొత్త ఇంగ్లీష్ 'ఈ - పుస్తకం' Medical Astrology - Part I ఈరోజు విడుదలైంది "

16, ఏప్రిల్ 2020, గురువారం

శాపాన్ని వరంగా ఎలా మార్చుకోవాలి? Vision 2020

'శాపాన్ని వరంగా ఎలా మార్చుకోవాలి?' అనేదే నా సాధనామార్గంలో నేను బోధించే అంశాలలో ఒక ముఖ్యమైన అంశం.

మనలో ప్రతివారికీ శాపాలున్నాయి. ఉంటాయి. కొంతమందికి ఆరోగ్యపరంగా ఉంటాయి. మరికొంతమందికి కుటుంబపరంగా ఉంటాయి. ఇంకొంతమందికి డబ్బుపరంగా ఉంటాయి. ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఇవి ఉంటాయి. శాపాలు లేనిదే ఎవడూ ఈ భూమ్మీదకు రాడు. ఆ శాపాలను తొలగించుకునే మార్గాలు కూడా వాటి పక్కనే ఉంటాయి. అయితే, మన అహంకారం వల్ల, మొండితనం వల్ల, నాకేంటి? అనుకోవడం వల్ల ఆ మార్గాలను మనం అందిపుచ్చుకోలేక అఘోరిస్తుంటాం. ఆయా శాపాలతోనే బాధపడుతూ ఉంటాం గాని వాటిని పోగొట్టుకునే పనులు మాత్రం ఎప్పటికీ చెయ్యం. ఏ మనిషి జీవితమైనా ఇలాగే నడుస్తూ ఉంటుంది. ఇలాగే ముగుస్తుంది కూడా. అది సామాన్యుడి జీవితమైనా అసామాన్యుడినని అనుకునే వాడి జీవితమైనా చివరకు ఇలాగే ముగుస్తుంది.

ఈ ధోరణిని ఎలా మార్చుకోవాలి? మనకున్న శాపాలను ఎలా పోగొట్టుకోవాలి? అనేది నేను నేర్పించే అంశాలలో అతి ప్రధానమైన అంశం.

ఈ విషయాన్ని అలా ఉంచితే, దీనికీ Vision 2020 కీ ఏమిటి సంబంధం అంటే, ఉంది అంటాను. నేను చెబుతున్నది రాజకీయంగా నాయకులు చెప్పే Vision 2020 గురించి కాదు. నా విజన్ గురించి.

ప్రస్తుతం మనందరం కరోనా బాధితులం. హౌస్ అరెస్ట్ అయ్యాము. ఏమి చెయ్యాలో తెలీక ఇరవై నాలుగ్గంటలూ టీవీ చూస్తున్న అర్భకజీవులు కోట్లల్లో మన దేశంలో ఉన్నారు. పొద్దున్న లేచిన దగ్గరనుంచీ రాత్రి పడుకోబోయే దాకా నెట్లో కాలం గడుపుతున్న అల్పజీవులు మళ్ళీ కోట్లలో ఉన్నారు. నా దృష్టిలో వీరందరూ ఒక గమ్యం లేకుండా గాలికి పోతున్న గాలిపటాలు.

ఇప్పుడు విషయం లోకొస్తున్నాను.

నిన్న మా పుస్తకాల ప్రింటర్స్ కి ఫోన్ చేసాను 'ఏం చేస్తున్నారు?' అంటూ.

అదీ ఇదీ మాట్లాడాక 'మీరేం చేస్తున్నారు?' అని ఆయనడిగాడు.

'పెద్దగా తేడా ఏమీ లేదు. ఇంతకు ముందు ఏం చేస్తున్నానో ఇప్పుడూ అదే చేస్తున్నాను. కాకపోతే ఇంకా తీవ్రస్థాయిలో చేస్తున్నాను.' అని చెప్పాను.

'పుస్తకాలు ఏమైనా వ్రాస్తున్నారా/' అడిగాడాయన.

'నేను పుస్తకాలు వ్రాయడం వింత ఏముంది? అది చిన్నప్పటి మాట, ఇప్పుడు నా శిష్యుల చేత కూడా వ్రాయిస్తున్నాను. మంచి మంచి పుస్తకాలు వాళ్ళు కూడా వ్రాస్తున్నారు' అని చెప్పాను.

'వాళ్ళు సరే సార్, మీరు కనీసం ఒకటైనా వ్రాశారా ఈ లాక్ డౌన్ సమయంలో?' అడిగాడాయన.

'మీ ప్రెస్సు ఎప్పుడు తెరుస్తున్నారు?' అడిగాను.

'ఏమో తెలీదు. ఈ లాక్ డౌన్ ఎత్తేశాక తెరుస్తాం' అన్నాడు. 

'సరే, తెరిచాక రెడీగా ఉండండి. ఒక 20 పుస్తకాలు ప్రింట్ చెయ్యవలసి ఉంటుంది' అన్నాను.

'అవతల్నించి 'దబ్బు' మని ఎవరో పడిపోయిన శబ్దం వినిపించింది.

నవ్వుకుంటూ 'మెల్లిగా లేవండి' అన్నాను.

'ఆ. లేచాగాని, నిజంగా అన్ని రాశారా?' అడిగాడు.

'వ్రాస్తున్నా. అన్నీ ఒకేసారి ముందుకు సాగుతున్నాయి. కొన్ని అయిపోయాయి. కొన్ని అయిపోవస్తున్నాయి. కొన్ని మొదట్లో ఉన్నాయి. కానీ 2020 లో 20 పుస్తకాలు విడుదల చేస్తాను, ప్రస్తుతానికి ఇదీ నా విజన్' అన్నా.

'మీకంత లీజర్ టైం ఎలా ఉంటుంది? టీవీ చూడ్డానికే మాకు టైం సరిపోవడం లేదు' అడిగాడాయన.

'మీకు లేని లీజర్ నాకేమీ ఉండదు. కానీ నాదగ్గర ఒక లేజర్ ఉంది. అదేంటంటే నన్ను నడిపించే ఒక శక్తి. నా ఫెవరెట్ కొటేషన్ చెప్తా వినండి. ఇది నాదే. చాలాసార్లు దీనిని చెబుతూ ఉంటా. 'అడుక్కునే వాడికైనా అమెరికా ప్రెసిడెంట్ కైనా ఉండేది అవే 24 గంటలే' అనేదే ఆ కొటేషన్. టైం మేనేజిమెంట్ తెలిస్తే అన్నీ చెయ్యవచ్చు. అది తెలీకపోతే నిద్ర లేచేసరికే మధ్యాన్నం 12 అవుతుంది. అలాంటివాళ్ళు జీవితంలో ఏమీ సాధించలేరు. అదీ సంగతి' అన్నా.

'ఇంతకీ ఏ సబ్జెక్ట్ మీద వ్రాస్తున్నారు? అడిగాడాయన.

'వేరే ఏ సబ్జెక్టూ ఉండదు. ఆధ్యాత్మికం తప్ప వేరేదీ నేను వ్రాయను. అయితే మధ్య మధ్యలో కొన్ని జ్యోతిష్య పుస్తకాలు వ్రాస్తూ ఉంటాను. అయితే వాటిల్లో కూడా అంతిమంగా ఉండేది ఆధ్యాత్మికమే అనుకోండి' అన్నాను. 

' సరే సార్ ! ప్రెస్ తెరిచాక ఫోన్ చేస్తా' అని ఫోన్ పెట్టేశాడాయన.

ఆ 20 పుస్తకాల పరంపరలోనుంచి, ఒకటి రెండు రోజులలో రిలీజ్ కాబోతున్న మొదటి 'ఈ - బుక్' గురించి ఆలోచిస్తూ నేనూ ఫోన్ పెట్టేశాను.

శాపాన్ని వరంగా ఎలా మార్చుకోవాలో అర్థమైందా మరి ?
read more " శాపాన్ని వరంగా ఎలా మార్చుకోవాలి? Vision 2020 "

13, ఏప్రిల్ 2020, సోమవారం

ఇవిగో శని-కుజ-గురు-యోగప్రభావాలు - 4

నిన్న ఉత్తర్ ప్రదేశ్ లోని ఘజియాబాద్ కు దాదాపు 17 కి. మీ దూరంలో సార్ధనా అనే ఊరిలో 3. 8 స్థాయి భూకంపం వచ్చింది. దీని కంపనాలు ఢిల్లీలో కూడా కనిపించాయని అంటున్నారు.

గత వారంలో మన దేశంలో మూడు భూకంపాలు వచ్చాయి. అవి బంకురా పశ్చిమ బెంగాల్, అరుణాచల ప్రదేశ్ లోని అలాంగ్, అస్సామ్ లోని తేజ్ పూర్.

ఏంటి మరి? జ్యోతిష్యశాస్త్రం నిజమా కాదా? మకరం లోని గ్రహయోగం పనిచేస్తున్నదా లేదా? మకరరాశి భారతదేశానికి సూచిక అవునా కాదా?
read more " ఇవిగో శని-కుజ-గురు-యోగప్రభావాలు - 4 "

ఎందుకౌతుంది?

మిస్సవకపోతే
బస్సెందుకౌతుంది?
బుస్సుమనకపోతే 
పామెందుకౌతుంది?

మాడిపోకపోతే
పప్పెందుకౌతుంది?
నీళ్లు తాగించకపోతే
ఉప్పెందుకౌతుంది?

మడత పడకపోతే 
మడమెందుకౌతుంది?
మాడ్చి చంపకపోతే 
ఎండెందుకౌతుంది?

గుచ్చుకోకపోతే
ముల్లెందుకౌతుంది?
పుచ్చు రాకపోతే
పండెందుకౌతుంది?

తప్పు చెయ్యకపోతే
వయసెందుకౌతుంది? 
మెప్పు కోరకపోతే 
మనసెందుకౌతుంది?

ఏడిపించకపోతే
ప్రేమెందుకౌతుంది?
వాడిపోకపోతే
ఫువ్వెందుకౌతుంది?

తనను వీడిపోయేది
జ్ఞాపకమెలా అవుతుంది?
వలచి ప్రేమ చూపేది
నాటకమెలా అవుతుంది?

అనుదినమూ తెల్లగానే ఉంటే 
కాగితమెందుకౌతుంది?
అంతా అనుకున్నట్లే జరిగితే
జీవితమెందుకౌతుంది?
read more " ఎందుకౌతుంది? "

10, ఏప్రిల్ 2020, శుక్రవారం

ఈరోజు వైద్యతపస్వి జన్మదినం

ఈరోజు వైద్యతపస్వి జన్మదినం. ఆయనెవరో కాదు హోమియోపతి సృష్టికర్త డా || శామ్యూల్ హన్నేమాన్. ఈయన గురించి ఎంతైనా అనుకోవచ్చు.ఒక్క మందును కనిపెట్టిన మనిషికి నోబెల్ ప్రైజ్ ఇస్తే నూరు మందులు కనిపెట్టిన మనిషికి ఏమివ్వాలి? డా || హన్నేమాన్ తన జీవితంలో నూరు మందులు కనిపెట్టాడు. మానవాళికి మహోపకారం చేసిన మనుషులలో హన్నేమాన్ పేరు నిజానికి ప్రధమస్థానంలో ఉండాలి. కానీ విచిత్రం ఏమంటే, ఈరోజున ఆయన్ను తలుచుకునే వాళ్ళే లేరు. అదీ విచిత్రమంటే !

అసలీ లోకమే పెద్ద దరిద్రపు విశ్వాసహీనమైన లోకం. మనుషులలో చాలామంది జంతువులే అన్నది నా ఖచ్చితమైన అభిప్రాయం. దీనికి తిరుగులేదు. ఎందుకంటే, మనుషుల్లో చాలామందికి విశ్వాసం ఉండదు. పొందిన మేలును గుర్తుంచుకునే తత్త్వం ఉండదు, కృతజ్ఞత ఉండదు, ఏది సత్యం ఏదసత్యం అన్న విచక్షణ ఉండదు, ఒకవేళ ఉన్నా సత్యాన్ని అనుసరించే ధైర్యం అసలే ఉండదు. వీళ్ళకు తెలిసిందల్లా సంపాదించడం, తినడం, బ్రతకడం, నిరర్ధకంగా చావడం. మరి ఇలాంటి చవకబారు జంతువులకి మానవాళి కోసం తపించిన నిస్వార్ధజీవులు ఎలా గుర్తుంటారు? వాళ్ళొక పనిలేని పనికిమాలిన పక్షులుగా వీళ్ళకు కనిపిస్తారు. ఏదో రకంగా డబ్బులు సంపాదించేవాడే ఈ చెత్తలోకం దృష్టిలో గొప్పవాడు. వాడెంత నిరర్ధకంగా బ్రతికినా సరే !

డా || హన్నేమాన్ లాంటి మహనీయులు ఎప్పుడో ఒకసారి మాత్రమే ఈ లోకంలో జన్మిస్తారు. ఎందుకంటే, చీకటిలో కూడా ఎప్పుడో ఒకసారి మెరుపు మెరుస్తుంది కదా అలాగన్నమాట. కానీ విచిత్రమేమంటే మనిషి స్వార్ధానికి వాళ్ళ జీవితాలు బలై పోతుంటాయి. వారిని ఎవరూ గుర్తుంచుకోకపోగా తిట్టిపోస్తారు. ఇంతే లోకం తీరు. కానీ వాళ్ళిదంతా ఏమీ పట్టించుకోరు. అది వేరే విషయం అనుకోండి.  

హన్నేమాన్ బ్రతికున్న రోజులలో అతన్ని ఒక మాంత్రికుడని, సైతాన్ భక్తుడని ముద్రవేసి తరిమితరిమి కొట్టారు సాంప్రదాయ క్రైస్తవులు. ఇంకా నయం సజీవదహనం చెయ్యలేదు సంతోషం ! తనను తరిమేవారి బారినుండి తప్పించుకోవడం కోసం తన కుటుంబాన్ని తీసుకుని 36 ఊర్లు మారాడు ఆయన. ఎందుకోసం? తనకు అర్ధమైన ప్రకృతిసత్యాలను నమ్మి అనుసరించడం కోసం ! లోకం గుడ్డితనాన్ని తాను హర్షించలేక పోయినందుకు ! స్వార్ధంకోసం తన విలువలను వదిలిపెట్టకపోయినందుకు !

పోనీ ఇదంతా 250 ఏళ్ళ క్రితం జరిగిందిలే. ప్రస్తుతం మనం ఎంతో ఎదిగాం. 21 వ శతాబ్దంలో ఉన్నాం. మనకన్నీ తెలుసు అని విర్రవీగుతున్నాం కదా ! ఈ నాటికీ హోమియోపతి అనేది అసలొక వైద్యమే కాదని ప్రపంచమంతా నమ్ముతోంది. ఇదేం వింతో మరి? కాకపోతే ఎప్పుడు ఏ ఎపిడెమిక్ వచ్చినా హోమియోనే దిక్కూ మొక్కూ అవుతుంది మనకందరికీ ! ఇది ఇంకొక వింత !

'ఆ ! హోమియో పనిచెయ్యదు. అదొక వైద్యమే కాదు' అనేవాళ్ళు కూడా డెంగూలూ, చికన్ గున్యాలూ, కరోనాలూ వచ్చినపుడు మాత్రం హోమియో మందులే మింగుతారు. అప్పుడు వాళ్ళు కొన్ని సామెతల చాటున దాక్కుంటారు. వాటిల్లో ఒకటి - 'ఏ పుట్టలో ఏ పాముందో? చూద్దాం. చేస్తే మంచి చేస్తుంది. లేకపోతే ఉత్త చక్కెరమాత్రలే కదా సరదాగా చప్పరిద్దాం.' అంటారు. ఇలాంటి హిపోక్రైట్స్ ని చూస్తుంటే వీళ్ళనే అసలు సజీవదహనం చెయ్యాలన్నంత కోపం వస్తుంది నాకు. చెత్తమనుషులు ! చెత్తలోకం !

కరోనా కాటేస్తున్న ఈ రోజులలో కూడా, ఎన్నో దేశాలలో హోమియోను ఆదరిస్తున్న ఈ రోజులలో కూడా, హన్నేమాన్ నూ హోమియోనూ ఎవరూ తలచుకోకపోవడానికి కారణాలేంటి? ఒక్కటే కారణం. అదే ఫార్మా కంపెనీల లాబీయింగ్. ప్రపంచమంతా వీటి వ్యాపారగుప్పిట్లో చిక్కిపోయి ఉంది. అవి చేసే అబద్దప్రచారం వల్లనే హోమియో అంటే లోకంలో మూడనమ్మకాలు బలంగా పాతుకుని ఉన్నాయి. హోమియోడాక్టర్ల చేతగానితనం ఇంకొక కారణం అనుకోండి. మెరిట్ కి విలువ లేని మన విద్యావిధానం మరొక కారణం అనుకోండి. లక్ష కారణాలు !

ఫార్మాకంపెనీలు ఎంత బలమైనవంటే, ప్రభుత్వాలు కూడా అవి చెప్పినట్టే వింటాయి. వాటి వ్యాపారానికి ప్రభుత్వాలు కూడా తందానతాన అంటాయి. ఇంకా విచిత్రమేమంటే, కనీసం మన ప్రభుత్వం మన దేశం చాలా మంచివి. కనీసం హోమియో అనేది ఇక్కడ ఒక వైద్యంగా ఒప్పుకోబడింది. అనేక తెల్లదేశాలలో అయితే ఈనాటికీ అదొక కల్ట్ మెడిసిన్ గానే చూడబడుతోంది. ఇదే మానవాళి ఖర్మ.

నేడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కూడా చైనా సృష్టి అనీ, దాని బిజినెస్ చేసుకోవడం కోసం ప్రపంచమీదకు దానిని వదిలింది చైనానే అనీ కొన్ని వర్గాలంటున్నాయి. కావచ్చు. చదరంగపు పావులకు గేమ్ ప్లాన్ అర్ధం కానట్లే, సామాన్య మానవులకు హైలెవల్లో జరిగే ప్లానులు అర్ధం కావు. వీడు గుర్రంలాంటి వాడు. కళ్లకున్న గంతల్లోంచి కనిపించే రోడ్డువరకే వీడి దృష్టి ఉంటుంది గాని అంతకు మించి ఉండదు. పొద్దున్న లేస్తే 'నా పాలపాకెట్టు రాలేదే' అన్నదే వీడి సమస్యగాని, పెద్దపెద్ద ప్లానులకు తను ఎలా బలౌతున్నాడో వీడికి అనవసరం. ఆఫ్ కోర్స్ ! తెలిసినా చేసేదేమీ లేదనుకోండి అది వేరే విషయం ! 

అసలిలా ఎందుకు జరుగుతుంది? ఎందుకు జరుగుతుందో చెప్తా వినండి.

ప్రపంచంలో అన్నీ సవ్యంగా ఉంటే, మనిషి తన ఖర్మను తను అనుభవించేది ఎలాగ? నానా చెత్తపనులు చేస్తూ, ప్రకృతికి విరుద్ధంగా, దైవానికి విరుద్ధంగా బ్రతుకుతున్న మనిషికి తన పాపాలకు శిక్షలు పడేది ఎలాగ? ఎలాగంటే, సత్యం వాడి ఎదురుగా ఉన్నా కూడా వాడికి కనిపించకుండా ఉండాలి. దానిని వాడు గుర్తించలేకుండా ఉండాలి. అనుసరించలేకుండా ఉండాలి. సత్యం అని భ్రమిస్తూ అసత్యాన్ని వాడు అనుసరించాలి. దైవాన్ని పూజిస్తున్నా అనుకుంటూ సైతాన్ని వాడు పూజించాలి. అప్పుడే వాడి పాపం పండుతుంది. అప్పుడే వాడి ఖర్మను వాడు అనుభవించే పరిస్థితి తయారౌతుంది. లేకపోతే, అన్నీ సవ్యంగా అందుబాటులో ఉంటె వాడు నేలమీద నడుస్తాడా?

సరిగ్గా ఈ కారణం వల్లనే, వెలుగు ఎదురుగా ఉన్నా కూడా మనిషి చీకట్లోనే ఉంటాడు. చీకటినే వెలుగు అనుకుంటూ విర్రవీగుతూ ఉంటాడు. ఏమీ తెలియకపోయినా అన్నీ తెలుసనుకుంటూ పొగరుగా ఎగురుతూ ఉంటాడు. నాశనమౌతూ ఉంటాడు. కర్మ ప్లాన్ ఇంతే. దైవన్యాయం ఇంతే. అందుకే ఈ ప్రపంచం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. ఇది మారదు. తెలివైనవాళ్ళు తాము మారాలి. ఈ సత్యాన్ని గ్రహించాలి. ఈ చెత్తలోకంలో ఉన్నప్పటికీ దీనికి అంటకుండా ఉండాలి. అందరూ చీకట్లో ఏడుస్తున్నా తాము మాత్రం వెలుగులో నడవాలి. ఇదే ఈ ప్రపంచన్యాయం. ఇదే కర్మన్యాయం. ఇదే దైవన్యాయం.

అందుకే డా || హన్నేమాన్ లాంటి వాళ్ళు లోకానికి గుర్తుండరు. మరేం పరవాలేదు. సత్యాన్ని గుర్తించే అతి కొద్దిమందికి గుర్తుంటే చాలు. భర్త్రుహరి తన నీతిశతకంలో మహనీయులను గురించి చెబుతూ 'వసంతవత్ లోకహితం చరన్త:' అంటాడు. అంటే, మహనీయులైనవాళ్లు వసంతఋతువు లాగా చడీచప్పుడు లేకుండా వచ్చి లోకానికి వాళ్ళు చెయ్యవలసిన మేలును చేసి అలాగే నిశ్శబ్దంగా వెళ్ళిపోతారని అర్ధం. వసంతం రాకుంటే లోకం బ్రతకదు. కానీ వసంతం ఎందరికి గుర్తుంటుంది? ప్రతిదాన్నీ వాడుకుని వదిలేసే నీచమనస్తత్వం ఉన్న మనుషులలో ప్రకృతిపట్ల కృతజ్ఞత ఎందరికుంటుంది? ఎక్కడో కొద్దిమందిలో ఇది ఉంటే ఉంటుందేమో? హోమియోపతి కూడా అలాంటి విస్మృతవైద్య విధానమే. దానిని లోకం ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు. కానీ లోకానికి అది చేసే మేలును అది చేస్తూనే ఉంటుంది.

సత్యం ఈ లోకంలో ఎప్పుడూ మైనారిటీయేగా !
read more " ఈరోజు వైద్యతపస్వి జన్మదినం "

9, ఏప్రిల్ 2020, గురువారం

అనుబంధపు పూలతావి...

మండుతున్న ఎండనేమొ
నల్లమబ్బు కమ్మింది
ఎండుతున్న నేలనేమొ
చల్లదనం నమ్మింది

పోరుతున్న మనసులోకి
హోరువాన కురిసింది
వాడుతున్న తోటలోన
మల్లెపువ్వు విరిసింది

పిచ్చి మనసు పరుగునాపి
నిలిచి తేరి చూచింది
నిశ్శబ్దపు చీకటిలో
నింగి మెరుపు మెరిసింది

వర్తమాన ఛాయలోకి
గతం అడుగుపెట్టింది
గుర్తులేని జ్ఞాపకాల
గుండె తలుపు తట్టింది

గతంలోని ఆరాటం
నేడు శిధిలమయ్యింది
చెయిజారిన అనుబంధం
లోలోపల మెరిసింది

జ్ఞాపకాల మబ్బులలో
జాడలేని నీకోసం
మూగమనసు సాయంతో
బేలచూపు వెదికింది

బ్రతుకునావ మజిలీలో
దిగిపోయిన నిన్ను తలచి
నడుస్తున్న పడవలోని
వెర్రిమనసు వగచింది

ఒకనాటి నిజాలన్నీ
నేటి కలలు ఔతుంటే
కలలలోన కన్నువిప్పి
ఎదురుచూపు ఏడ్చింది

జనం లేని దారులలో
అంతమవని వీధులలో
వెదుకుతున్న నన్ను చూచి
నిశిరాత్రే నవ్వింది

అర్ధరాత్రి మౌనంలో
ఒక్కనాటి ఉదయాలను
స్మరిస్తున్న నను జాలిగ
చుక్కలన్ని చూచాయి

గురుతురాని జన్మలలో
నాకోసం విలపించిన
నీ ప్రేమను తలచి తలచి
నా మనసే నీరైంది

నా బ్రతుకున బలం నింపి
నా మనసున వెలుగు నింపి
మాయమైన నీ తలపును
మనసు మరువలేకుంది

అనుదినమూ చేజారే
అంతులేని జీవితాన
అనుబంధపు పూలతావి
నన్ను విడచి పోనంది....
read more " అనుబంధపు పూలతావి... "

8, ఏప్రిల్ 2020, బుధవారం

Phir Se Mausam Baharon Ka Ane Ko Hai - Jagjit Singh

Phir Se Mausam Baharon Ka Ane Ko Hai


అంటూ జగ్జీత్ సింగ్ మధురాతి మధురంగా ఆలపించిన ఈ ఘజల్ ను నా స్వరంలో కూడా వినండి. ఇది Smule App లో నేను పాడిన పాట. ఈ మధ్యన బ్లాగులో నా పాటలు రావడం లేదని కొందరు ఫిర్యాదు చేస్తున్నారు. వారికి నా సలహా ఏమంటే, మీ మొబైల్లో Smule App ఓపన్ చేసి అందులో SNSarma అని కొట్టండి. నా Smule Account Page మీరు చూస్తారు. అందులో ఇప్పటికే నేను పాడిన తెలుగు హిందీ పాటలు 540 ఉన్నాయి. వినండి. వరసబెట్టి రెండున్నర రోజులపాటు రాత్రీ పగలూ మీరు వింటూనే ఉండవచ్చు.


ఇది 1992 లో జగ్జీత్ సింగ్ పాడిన Visions అనే ఆల్బమ్ లోనిది.
దీనిని రాసినది జాహిద్ అనే ఉర్దూ కవి.
------------------------------------------
Fir se mausam baharon ka aane ko hai
Fir se rangin zamana badal jaayega
Abki bazme charaagon saja lenge hum
Ye bhi armaan dil ka nikal jaayega

Aap karde jo mujhko nigaahe karam
Meri ulfat ka reh jaayega kuch bharam
Yun fasana to mera rahega yahi
Sirf unwaan uska badal jaayega

Phiki Phiki si kyoon shaam-e-maikhanaa hai
Lutf -e-saaqi bhi kam khaali paimaana hai
Apnee nazron se hee kuch pila de jiye
Rang mehfil ka khud hee badal jaayega

Mere mitne ka unko zara gam nahin
Julf bhi unki ae dosth war ham nahin
Apne hone na hone se hotha hai kya
Kaam duniya ka yun hee to chal jaayega

Aapne dil jo 'zaahid' ka toda to kya
Aapne uski duniya ko choda to kya
Aap itne to aakhir pareshaan na hon
Wo sambhalte sambhalte sambhal jaayega

Meaning

Again, the spring season is on the way
Again, the world is going to change
This time I will decorate my place with lamps
This wish of mine will be fulfilled then.

Keep me in front of your eyes
I will continue my illusion that you love me
Though the story will remain the same
But its title will change a little

Why this evening of intoxication so dry?
O Saaqi, the bliss is absent and my goblet is empty
Let me drink through your eyes
The mood of this evening will change then

She is not bothered even if I am dead
Her hair, my friend, is not tangled at all
If I am here or not, doesnt make much difference
The world will move on as if nothing has happened

What if you broke the heart of Zahid
If you left his world, so what?
Dont worry much about all this my dear
He will forbear, forbear and live along

Again, the spring season is on the way
Again, the world is going to change
This time I will decorate my place with lamps
This wish of mine will be fulfilled then.

తెలుగు స్వేఛ్చానువాదం

మళ్ళీ వసంతం వస్తుంది
మళ్ళీ లోకంలో వెలుగు కనిపిస్తుంది
ఈసారి నా ఇంటిని దీపాలతో అలంకరిస్తాను
నా హృదయపు కోర్కె ఈసారైనా నెరవేరనీ

నన్ను నీ కన్నుల ముందు కొంచం ఉంచుకో
నా ప్రేమకు కాస్తైనా జీవం అప్పుడు ఉంటుంది
నా కధలో ఏమీ మార్పు ఉండకపోవచ్చు 
కానీ దాని పేరు కాస్త మారుతుందంతే 

ఈ మత్తైన సాయంత్రం ఎందుకు నీరసంగా ఉంది ?
ఏదో వెలితిగా ఉంది సాకీ ! నా మధుపాత్ర ఖాళీగా ఉంది
కనీసం నీ కన్నులనుంచి మధువును త్రాగనీ
అప్పుడే ఈ సాయంత్రానికి కొంచం కళ వస్తుంది

నేను చనిపోయినా తనకు లెక్క లేదు
తన ముంగురులు కొంచమైనా చెదరలేదు 
నేను ఉంటే ఎంత? లేకుంటే ఎంత?
ప్రపంచం ముందుకు పోతూనే ఉంటుంది !

నువ్వు జాహిద్ హృదయాన్ని ముక్కలు చేస్తే ఏమైంది? 
నువ్వతని ప్రపంచాన్ని విడచిపెట్టిపోతే ఏమైంది?
ఏం పరవాలేదు
అతను సహిస్తాడు, సహిస్తాడు, అలాగే బ్రతుకుతాడు

మళ్ళీ వసంతం వస్తుంది
మళ్ళీ లోకంలో వెలుగు కనిపిస్తుంది
ఈ సారి నా ఇంటిని దీపాలతో అలంకరిస్తాను
నా హృదయపు కోర్కె ఈసారైనా నెరవేరనీ.... 
read more " Phir Se Mausam Baharon Ka Ane Ko Hai - Jagjit Singh "

6, ఏప్రిల్ 2020, సోమవారం

కరోనా కతలు - 5 (బెమ్మంగారెప్పుడో చెప్పారు)

ప్రపంచవ్యాప్తంగా జనాలలో, ముఖ్యంగా మన భారతీయులలో, ఇంకా ముఖ్యంగా మన తెలుగోళ్లలో ఒక పెద్ద రోగముంది. అదేంటంటే - ఏదైనా జరిగినప్పుడు 'అదుగో పలానాయన ఇలా జరుగుతుందని ఎప్పుడో చెప్పాడు' అంటూ గోల మొదలుపెడతారు. ఇంకా ముదుర్లయితే 'ఇలా జరుగుతుందని నేను ఎప్పుడో చెప్పాను' అంటారు. ఆఫ్ కోర్స్ అలాంటి ముదుర్లలో నేనూ ఒకడిననుకోండి !

వెస్ట్ లో అయితే నోస్ట్రాడెమస్ అనేవాడు వ్రాసిన క్వార్ట్రైన్స్  అనే పద్యాలను ఉటంకిస్తూ తెగ రాస్తారు. అదే మనమైతే ఒకాయన్ని హఠాత్తుగా లేపి కూచోబెడతాం. ఇన్నాళ్లూ ఆయన ఎక్కడ నిద్రపోతున్నాడో మాత్రం మనకనవసరం. మన బిజినెస్ కి పనికొచ్చినంత వరకే కదా ఎవడైనా !

ఇంతకీ ఆయన పేరేమిటో తెలుసా - బెమ్మం గారు. 

మనకేం జరిగినా ఆయన కాలజ్ఞానం నుంచి తవ్వకాలు జరిపి, ఆ మార్మిక పద్యాలను బూజు దులిపి, ఇప్పటి సంఘటనలకు అతికి, ఊదరగొడతారు మనవాళ్ళు. పాపం బెమ్మంగారి గురించి మిగతా ప్రపంచానికి ఏమీ తెలీదు గనుక ఆయన బ్రతికిపోయాడు. లేకపోతే ఎప్పుడో చచ్చి ఉండేవాడు మూడోసారి.  అంటే, సిద్దయ్య కోసం ఒకసారి సమాధి లోనుంచి బయటకు వచ్చాడులే అందుకే మూడోసారి అంటున్నా !

ఒకవేళ బెమ్మంగారి పద్యాలలో మనకు పనికొచ్చే సమాచారం ఏమీ దొరకకపోతే, మనమే కొన్ని పద్యాలు రాసేసి అవి ఆయనే రాశాడని చెప్పేద్దాం. ఎలా ఉంది ఐడియా? అన్ని పద్యాలు ఎవడు రాస్తాడు అనుకుంటున్నారా? ఆఫ్టరాల్ నేనే ఇప్పటికి 5000 పద్యాలు రాశాను. బాగా చెయ్యి తిరిగిన పండితులకి అదొక లెక్కా? కావాలంటే ఇప్పుడే రాస్తా చూడండి !

ఆ || భారతమును మోది బాలించు వేళలో
తంపు ఏలుచుండ దెల్లవారి
కరుణ యొకటి బుట్టి కష్టంబు దెచ్చురా
కాళికాంబ ! హంస కాళికాంబ !

అంటే, బెమ్మంగారు ఈ మకుటంతో కాళికాంబ శతకం అనే ఒక శతకం రాశార్లే. అందుకే అదే మకుటాన్ని వాడానన్నమాట. ఎలా ఉంది బెమ్మంగారు కరోనా గురించి "ఎప్పుడో" వ్రాసిన పద్యం? అయినా, ఎన్ని పద్యాలు చదివినా మనకి బుద్ధి మాత్రం రాదుకదా? అది వేరే సంగతి అనుకోండి !

ఇంకొంతమంది ఇంకో అడుగేసి, మిగతా ప్రాచీనగ్రంధాలను కూడా జల్లెడబట్టి, వాటిలోంచి మరికొన్ని నగ్నసత్యాలను తవ్వి తీస్తారు. ఏ నగ్నత్వాన్నీ ఎవడూ ఎక్కువసేపు భరించలేడు గనుక, వీటిని కూడా అందరూ హర్షించరు. అలాంటి వాటిల్లో ఒకటి ఈ మధ్యనే జరిగింది. 

యోగవాసిష్ఠం అనే ప్రాచీనగ్రంధంలో 'కర్కటికా వృత్తాంతము' అనే అధ్యాయం ఒకటుంటుంది. ఇది నేను 15 ఏళ్ల వయసులో చదివాను. అందులో, హిమాలయాలలో ఉండే కర్కటి అనే ఒక రాక్షసి బ్రహ్మవరాన్ని పొంది మానవాళిని తినడానికి ఒక చిన్నపురుగు రూపంలో వఛ్చి జనాన్ని చంపుతూ ఉంటుంది. ఆ కథను అప్పట్లోనే కొందరు ప్రబుద్ధులు అప్పటి మహమ్మారి అయిన కేన్సర్ కి ముడిపెట్టి కధలు అల్లారు. వాళ్లకూ ఒక లాజిక్ ఉంది. అప్పట్లో నేనూ అది చదివి తెగ హాశ్చర్యపోయాను.

అదేంటంటే - కర్కటి అంటే కర్కాటకం కదా? ఇంగిలీషులో రాశిచక్రంలోని 'కేన్సర్' అదే కదా. కనుక యోగవాశిష్ఠంలో వశిష్ఠుడు శిష్టంగా రాసింది ఇప్పుడు మనకొస్తున్న కేన్సర్ గురించేనని కొంతమంది అప్పట్లోనే అప్పుడున్న మీడియాలో తెగరాశారు. అవన్నీ పాత రోజులు. ఇప్పుడు కేన్సర్ మనకు వక్కపొడి అయిపొయింది. ఇప్పుడు నడుస్తోంది కరోనా టైమ్స్. కనుక మళ్ళీ కర్కటికా వృత్తాన్తమును బయటకు తీసి 'కరోనా గురించే వశిష్ఠుడు రాసింది' అంటున్నారు. ఇప్పుడు కేన్సరూ కరోనా రెండూ టైటిల్ కోసం కొట్టుకుచస్తుంటే మనం చికెన్ కబాబ్స్ చీకుతూ తమాషా చూడాలా? బాబోయ్ ఒద్దులే. చికెన్ తింటే మళ్ళీ కరోనా నేనున్నా అంటూ మీదకొస్తుందంట. ఏమ్ చేస్తాం? హైదరాబాద్ లో ఉంటున్నా పారడైజ్ బిరియానీ తినే అదృష్టం పట్టలేదు ఇప్పటిదాకా ! ముందు నా జాతకం చూసుకోవాలి.

ఈ కరోనా కర్కటి వీడియో ఈ మధ్యనే ఒక వీరేశలింగం నాకు పంపించాడు. కంగారుపడకండి ఆయనెప్పుడు బ్రతికొచ్చాడా అని. సంఘాన్ని బాగుచెయ్యాలని, ఎవేర్నెస్ పెంచాలని, "షేర్ చేసుకోవాలని" చూసేవాళ్ళని నేనలాగే పిలుస్తాను. పోనీ మీకభ్యంతరం అయితే పేరు మారుస్తాను. వీరేశలింగం వద్దంటే ఏదో ఒక బోడిలింగం అని పెట్టుకుందాం ప్రస్తుతానికి. ఏం బాలేదా? దీనికంటే మొదటిదే బాగుందా? పోనీ అలాగే పిలుచుకోండి కాసేపు నాదేం పోయింది?

సరే ఆ వీడియో కాసేపు చూడగానే విషయం నాకర్ధమైంది. వెంటనే ఎమ్ జరిగిందో మీరు ఊహించగలరు కదూ. దీనికి పెద్ద ఆస్ట్రాలజీ అస్త్రాలు తెలీనక్కరలేదు. వీడియో డిలీట్, సెండర్ బ్లాక్. అదీసంగతి !

ఇదంతా ఉపోద్ఘాతమన్నమాట. ఇప్పుడు అసలు విషయం లోకొద్దాం.

బెమ్మంగారైనా, నోసుపొడుగు నోస్ట్రడెమస్ అయినా, లేకపోతే వశిష్టులవారు విశిష్టంగా చెప్పినా ఎవరెన్ని చెప్పినా నేనొకటి చెబుతాను. సరే వాళ్ళందరూ చెప్పారు. దానివల్ల మనకేం ఒరిగింది? నేనూ అయిదేళ్ల నుంచీ చెబుతున్నాను. "ఒరే బాబూ, ప్రకృతిని పాడు చెయ్యకండిరా, మీ బ్రతుకులనీ మనసులని పాడు చేసుకోకండిరా, చేటుకాలం ముందుంది, చస్తార్రా" అంటూ కొన్ని వందల పోస్టులు తెలుగులోనూ ఇంగిలీషులోనూ తెగ రాశాను. టైం స్లాట్స్ కూడా చెప్పాను. ఎవడు విన్నాడు? అయినా నా పిచ్చిగానీ బెమ్మం గారికే ఇక్కడ దిక్కు లేదు. ఇక మనమాట ఎవడు వింటాడు? పైగా ఆయనకున్నట్టు మనకేమీ శక్తులు లేకపాయె ! ఎలా మరి?

ఇంతకీ నేను చివరాఖరికి చెప్పేదేమంటే, ముందు ముందు ఏదో జరుగుతుందని వాళ్ళు చెప్పిన పద్యాలూ శ్లోకాలూ తవ్వి తీసి ఊదరగొట్టడం కాదు మనం చెయ్యవలసింది. ఆ పద్యాల పక్కనే, మనం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చెబుతూ రాసిన పద్యాలూ శ్లోకాలూ కూడా ఉంటాయి. వాటిని కూడా చూడండి కాస్త. ఎలా బ్రతికితే ఇలాంటి విపత్తులు రాకుండా ఉంటాయో కూడా వాళ్ళు చెప్పారు. వాటినీ కాస్త తలకెక్కించుకొండి, మీకు తలంటూ ఉంటే? లేకపోతే ఏదో ఒకరోజున తలంటు పోస్తుంది ప్రకృతి.

బెమ్మమ్ గారు ఈరోజు మనకు మహనీయుడైనాడు. ఆయన బ్రతికున్న రోజుల్లో ఆయన ఒక సామాన్యకంసాలి మాత్రమే. వేమన ఈనాడు మనకు గొప్పవాడయ్యాడు. ఆయన బ్రతికున్న రోజులలో ఎవడూ ఆయన్ను పట్టించుకోలేదు. పైగా పిచ్చొడంటూ రాళ్లతో కొట్టారు. ఏదో బంగారం చేసే విద్య ఆయనకు తెలుసు కాబట్టి, పైగా మన రెడ్డిగారే కాబట్టి, కొండవీటిరాజులు కొన్నాళ్లు ఆయన్ను ఆదరించి దగ్గరుంచుకుని బంగారం చేయించుకున్నారని అంటారు. లేకపోతే ఆయన పిచ్చి పద్యాలెవడికి కావాలి?

ఏదేమైనా, ఎదురుగా ఉన్నవాళ్ళు ఎప్పుడూ మనకు కనిపించరు. ఎందుకంటే మన ఎదురుగా ఉన్న మనలాంటి మనిషిని గొప్పవాడని ఒప్పుకోవాలంటే మన అహం చాలా ఘట్టిఘా అడ్డొస్తుంది మరి ! అందుకే పోయినోళ్ళు చెప్పినవే మనం తవ్వితీసి వాళ్ళ పేరును వాడుకుని ఆ తర్వాత వాళ్ళను విసిరి అవతల పారేస్తాంగాని మన ఎదురుగా ఉండి మన చెవుల్లో ఘోషపెడుతున్న వారిని మాత్రం డోర్ మ్యాట్ లాగా తొక్కి పారేస్తాం. ఇదీ మన విజ్ఞత ! మనం మానవులం ! భలే ఉంది కదూ !

బెమ్మంగారైనా వేమన అయినా ఇప్పటికీ కొన్ని కులాలకు సొత్తుగా మారిపోయి ఉన్నారు. వాళ్ళ యూనివర్సల్ అప్పీల్ అనేది  Ph.D లకే పరిమితం అయి కూచుంది. ఇకపోతే మనం ఎలా బ్రతకాలో వాళ్ళు చెప్పిన మాటలు మాత్రం మనకనవసరం ! అయినా మనం ఎలా బ్రతకాలో వాళ్లెవరు చెప్పడానికి? కరోనా ఎప్పుడొస్తుందో చెప్పమనండి చాలు ! దానికి కావలసిన జాగ్రత్తలు తీసుకుని ఆ కొద్దిరోజులు ఇంట్లో కూచుంటాం. ఆ తర్వాత మళ్ళీ పైలా పచ్చీస్ అంతే !

అయినా ఒకళ్ళు చెప్పాలా ? మన బ్రతుకులు చూస్తుంటే మనకు తెలీడం లేదూ ముందు ముందు మునుగుతామని? తెలిసినా ఈ పరుగు ఆపలేమని? పోయి పోయి ఎక్కడో చావక తప్పదని ?

ఈ మానవాళిని ఎవడూ మార్చలేడు. వీళ్ళింతే !
read more " కరోనా కతలు - 5 (బెమ్మంగారెప్పుడో చెప్పారు) "

5, ఏప్రిల్ 2020, ఆదివారం

కరోనా కతలు - 4 (మా మంచి కరోనా)

మా మంచి కరోనా
మా మంచి కరోనా
మనుషుల్ని చంపితే చంపావ్ 
భూమాతను మాత్రం కాపాడావ్

భూమి బ్రతికితే కదా 
జనం బ్రతికేది 
భూమాతను చంపుతూ
వాళ్ళెందుకు  బ్రతకాలి?

కాలుష్యం తగ్గింది
కారుణ్యం పెరిగింది
జల్సాలు మాయమై
జనం చల్లగున్నారు 
అంతా నీ పుణ్యమే

నువ్వు మాకు చుక్కలు చూపిస్తున్నా
చాలా ఏళ్ల తర్వాత రాత్రిపూట
చుక్కలు కనిపిస్తున్నాయ్
ఇదంతా నీ చలవే

ఎగ్జాస్ట్ పొగలు మాయమై
గాలి బాగుపడింది
ఊపిరి ఆహ్లాదంగా అనిపిస్తోంది
ఇది కూడా నీ చలవే

మనిషి దౌష్ట్యం మాయమై
ప్రకృతి తేటపడింది 
చెట్లు ఊపిరి పీల్చుకుంటున్నాయ్
ఇదీ నీ చలవే మరి

ఇన్నాళ్లూ
భూమాత మరణశయ్యమీదుంటే
మనుషులు జల్సాలు మరిగారు
ఇప్పుడు మనుషులు ఇళ్లల్లో దాక్కుంటే
భూమాత ఐసీయూను వీడి ఐసీ అంటోంది
ఇదీ నీ చలవే

తమ దేశాలను విడచి
ఎక్కడికో వలసపోయిన పక్షులు
తిరిగి వెనక్కొస్తున్నాయ్
హిమశిఖరాలు వేడికి కరగడం మాని
చల్లగా ఏసీల్లో ఉంటున్నాయ్ 
ఇదీ నీ చలవే

సీ జోన్ అంతా
ఇదేం వింత అంటూ
నాట్యం చేస్తోంది
ఓజోన్ అంతా
ఓపిక తెచ్చుకుని
ఒళ్ళువిరుచుకుంటోంది

మాకు ఫీవర్స్ వస్తే వచ్చాయ్
భూమాతకు మాత్రం ట్రెమర్స్ తగ్గాయ్
మాకు సొల్యూషన్ లేకపోతే మానె
ప్రపంచవ్యాప్తంగా పొల్యూషన్ మాయమైంది
ఇదీ నీ చలవే

మనిషనే ఈ దరిద్రుడు
ఇంటికి పరిమితం అయితే
నదులు బాగుపడుతున్నాయ్
సముద్రాలు స్వచ్ఛంగా మారుతున్నాయ్ 
గాలి ఊపిరి పీల్చుకుంటోంది

చెట్లు నవనవలాడుతున్నాయ్
పక్షులు జంతువులూ బ్రతికిపోతున్నాయ్
ప్రకృతి మొత్తం కళకళలాడుతోంది
భూమాతకు జీవం పెరుగుతోంది
ఇదంతా నీ చలవ కాదూ?

పిచ్చి లోకులు
నువ్వు పిశాచానివంటున్నారు
కానీ నే చెబుతున్నా
నువ్వు భూమాతను బ్రతికిస్తున్న దేవతవు

మానవుడు రాక్షసుడై
తన తల్లిని తానే చంపుతుంటే
వాడిని చంపడానికి వఛ్చిన నువ్వు
దయ్యానివి భూతానివి ఎలా అవుతావు?
నా దృష్టిలో నువ్వు దేవతవే

మనిషనే రాక్షసిని చంపుతున్న
నువ్వు రాక్షసివైతే
రావణుడిని చంపిన రాముడు
దేవుడెలా అయ్యాడు?
కనుక నువ్వూ దేవతవే

భలే బాగుంది నీ ప్లాన్ 
నువ్వు చెబితే గాని ఈ మనిషి వినడు
నువ్వు తంతేగాని వీడు దారికి రాడు
అందుకే నువ్వు మమ్మల్ని వీడిపోవద్దు

నువ్వు ఎప్పటికీ మాతోనే ఉండాలి
ఇలాగే మమ్మల్ని చంపుతూ ఉండాలి
మనిషి చచ్చినా పరవాలేదు
భూమాత మాత్రం బ్రతకాలి

మా మంచి కరోనా
మా మంచి కరోనా...
read more " కరోనా కతలు - 4 (మా మంచి కరోనా) "