“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

24, ఏప్రిల్ 2020, శుక్రవారం

'యోగ తారావళి' తెలుగు 'ఈ బుక్' నేడు విడుదలైంది


ఆదిశంకరులు అద్వైతజ్ఞాననిధి. అస్తవ్యస్తంగా నూటపదహారు శాఖలతో అల్లాడుతున్న వైదికధర్మాన్ని సరిదిద్ది దానికొక స్పష్టమైన రూపునిచ్చి దిశానిర్దేశం చేసిన   మహనీయుడాయన. వేదములలో ఉన్న జ్ఞానోపనిషత్తులకు ఆయన వ్యాఖ్యానం వ్రాశారు. కానీ యోగోపనిషత్తులను తాకలేదు. బహుశా అవి తర్వాతికాలంలో వచ్చి ఉండవచ్చు. లేదా వాటిని వ్యాఖ్యానించవలసిన అవసరం లేదని ఆయన భావించి ఉండవచ్చు. ఏది ఏమైనా, యోగోపనిషత్తుల జోలికి మాత్రం ఆయన పోలేదు.

కానీ, యోగసాధనను మొత్తం గుదిగుచ్చి 29 శ్లోకములలో 'యోగ తారావళి' అనే చిన్న పుస్తకాన్ని ఆయన వ్రాసినట్లు కనిపిస్తున్నది. ఇవి చూడటానికి 29 శ్లోకములే అయినప్పటికీ మొత్తం యోగశాస్త్రసారమంతా వీటిలో ఇమిడి ఉన్నది. వామనుడు చూడడానికి చిన్నవాడైనా, విశ్వరూపం దాల్చినప్పుడు విశ్వం మొత్తాన్నీ ఆక్రమించాడు. అలాగే, ఈ పుస్తకం చూడటానికి చాలా చిన్నదైనా, 'పిట్టకొంచం కూత ఘనం' అన్నట్లు, భావవిస్తృతిలో చాలా పెద్దది. హఠయోగాన్నీ రాజయోగాన్నీ వాటి సారాన్ని పిండి, అతి తక్కువ శ్లోకములలో చెప్పడం ఆచార్యులవారికే చెల్లింది. ఇంకొకరైతే ఈ పనిని చెయ్యలేరు.

సరిగ్గా చెప్పాలంటే, దీనిలో చెప్పబడిన సాధనలను సాధించాలంటే ఒక మానవజీవితం సరిపోదు. అందులోనూ నేడు మనం జీవిస్తున్న పరుగుపందెపు జీవితాలైతే ఒక నూరు కావాలి, ఈ పుస్తకంలో చెప్పబడిన స్థితులను సాధించడానికి. అంటే ఒక నూరు జన్మలెత్తినా నేటి మానవుడు దీనిలో చెప్పబడిన యోగస్థితులను సాధించలేడు.

మరెందుకు దీనికి మీరు వ్యాఖ్యానం వ్రాయడం? అంటే, అసలు విషయమెంటో జిజ్ఞాసువులకు తెలియకపోతే ఎలా? దారి ఎంత పొడవో  తెలిస్తే, ఎలా ప్రయాణించాలో ఒక ప్లాన్ రూపు దిద్దుకుంటుంది. దారి ఎలా ఉంటుందో, ఎక్కడికి చేరాలో, ఏమీ తెలియకపోతే, ఎటు పోతున్నామో తెలీక, నేడు జనమంతా నడుస్తున్నట్లు పిచ్చినడక అవుతుంది. అందుకే, నడిచినా నడవకపోయినా, గమ్యమూ, దానిని చేర్చే దారీ తెలియడం మంచిది. దానిలో ప్రయాణించడమా లేదా అన్నది తర్వాత, ముందు విషయం అర్ధం కావాలి కదా? అందుకే ఈ ప్రయత్నం !

నా గురువుల నుంచి నేను వినిన బోధలను, నా సాధనానుభవములను నెమరు వేసుకుంటూ ఈ వ్యాఖ్యానం వ్రాశాను. ఆదిశంకరాచార్యులవారు వ్రాసిన ఈ పుస్తకానికి వ్యాఖ్యానం వ్రాయగలగడం నా అదృష్టంగా, జగజ్జనని మహాకాళి కటాక్షంగా, భావిస్తున్నాను.

యోగాభ్యాసపరులకు ఈ పుస్తకం ఒక టెక్స్ట్ బుక్ లాంటిది. దీనిని సరిగ్గా ఉపయోగించుకుంటారని, యోగమార్గంలో ప్రయాణించి, హిందువులుగా పుట్టినందుకు ధర్మమార్గంలో నడుస్తారని, జన్మసాఫల్యతను అందుకుంటారని,  ఆశిస్తున్నాం.

మా సంస్థ నుండి ఈ ఏడాదిలో వస్తున్న నాలుగో పుస్తకం ఇది. లాక్ డౌన్ ఎత్తేశాక తెలుగు ఇంగ్లీషులలో ప్రింట్ పుస్తకాలుగా కూడా వస్తుంది.

ఇది కూడా google play books నుంచి లభిస్తుంది.