“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

5, ఏప్రిల్ 2020, ఆదివారం

కరోనా కతలు - 4 (మా మంచి కరోనా)

మా మంచి కరోనా
మా మంచి కరోనా
మనుషుల్ని చంపితే చంపావ్ 
భూమాతను మాత్రం కాపాడావ్

భూమి బ్రతికితే కదా 
జనం బ్రతికేది 
భూమాతను చంపుతూ
వాళ్ళెందుకు  బ్రతకాలి?

కాలుష్యం తగ్గింది
కారుణ్యం పెరిగింది
జల్సాలు మాయమై
జనం చల్లగున్నారు 
అంతా నీ పుణ్యమే

నువ్వు మాకు చుక్కలు చూపిస్తున్నా
చాలా ఏళ్ల తర్వాత రాత్రిపూట
చుక్కలు కనిపిస్తున్నాయ్
ఇదంతా నీ చలవే

ఎగ్జాస్ట్ పొగలు మాయమై
గాలి బాగుపడింది
ఊపిరి ఆహ్లాదంగా అనిపిస్తోంది
ఇది కూడా నీ చలవే

మనిషి దౌష్ట్యం మాయమై
ప్రకృతి తేటపడింది 
చెట్లు ఊపిరి పీల్చుకుంటున్నాయ్
ఇదీ నీ చలవే మరి

ఇన్నాళ్లూ
భూమాత మరణశయ్యమీదుంటే
మనుషులు జల్సాలు మరిగారు
ఇప్పుడు మనుషులు ఇళ్లల్లో దాక్కుంటే
భూమాత ఐసీయూను వీడి ఐసీ అంటోంది
ఇదీ నీ చలవే

తమ దేశాలను విడచి
ఎక్కడికో వలసపోయిన పక్షులు
తిరిగి వెనక్కొస్తున్నాయ్
హిమశిఖరాలు వేడికి కరగడం మాని
చల్లగా ఏసీల్లో ఉంటున్నాయ్ 
ఇదీ నీ చలవే

సీ జోన్ అంతా
ఇదేం వింత అంటూ
నాట్యం చేస్తోంది
ఓజోన్ అంతా
ఓపిక తెచ్చుకుని
ఒళ్ళువిరుచుకుంటోంది

మాకు ఫీవర్స్ వస్తే వచ్చాయ్
భూమాతకు మాత్రం ట్రెమర్స్ తగ్గాయ్
మాకు సొల్యూషన్ లేకపోతే మానె
ప్రపంచవ్యాప్తంగా పొల్యూషన్ మాయమైంది
ఇదీ నీ చలవే

మనిషనే ఈ దరిద్రుడు
ఇంటికి పరిమితం అయితే
నదులు బాగుపడుతున్నాయ్
సముద్రాలు స్వచ్ఛంగా మారుతున్నాయ్ 
గాలి ఊపిరి పీల్చుకుంటోంది

చెట్లు నవనవలాడుతున్నాయ్
పక్షులు జంతువులూ బ్రతికిపోతున్నాయ్
ప్రకృతి మొత్తం కళకళలాడుతోంది
భూమాతకు జీవం పెరుగుతోంది
ఇదంతా నీ చలవ కాదూ?

పిచ్చి లోకులు
నువ్వు పిశాచానివంటున్నారు
కానీ నే చెబుతున్నా
నువ్వు భూమాతను బ్రతికిస్తున్న దేవతవు

మానవుడు రాక్షసుడై
తన తల్లిని తానే చంపుతుంటే
వాడిని చంపడానికి వఛ్చిన నువ్వు
దయ్యానివి భూతానివి ఎలా అవుతావు?
నా దృష్టిలో నువ్వు దేవతవే

మనిషనే రాక్షసిని చంపుతున్న
నువ్వు రాక్షసివైతే
రావణుడిని చంపిన రాముడు
దేవుడెలా అయ్యాడు?
కనుక నువ్వూ దేవతవే

భలే బాగుంది నీ ప్లాన్ 
నువ్వు చెబితే గాని ఈ మనిషి వినడు
నువ్వు తంతేగాని వీడు దారికి రాడు
అందుకే నువ్వు మమ్మల్ని వీడిపోవద్దు

నువ్వు ఎప్పటికీ మాతోనే ఉండాలి
ఇలాగే మమ్మల్ని చంపుతూ ఉండాలి
మనిషి చచ్చినా పరవాలేదు
భూమాత మాత్రం బ్రతకాలి

మా మంచి కరోనా
మా మంచి కరోనా...