“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

5, సెప్టెంబర్ 2021, ఆదివారం

సిద్ధార్థ శుక్లా ప్రేమికురాలు షెహనాజ్ గిల్ జాతకం

ఈ అమ్మాయి సిద్ధార్థ శుక్లా ప్రేమికురాలు, టీవీ నటి.  సిద్ధార్ధ మరణించాక ఈ అమ్మాయి పరిస్థితి గందరగోళంగా ఉంది. జాతకంలోకి తొంగి చూద్దాం.

ఈ అమ్మాయి 27-1-1993 న సాయంత్రం 4.59 కి అమృత్ సర్ లో పుట్టింది. జాతకాన్ని ప్రక్కన చూడవచ్చు.

సప్తమంలో శని బుధ రవులున్నారు. కనుక కళత్రభావం బాగా దెబ్బతిన్నది. చంద్రలగ్నాత్ సప్తమాధిపతి బుధుడు ఏకాదశంలో అస్తంగతుడయ్యాడు. సూర్యుడు షష్టాధిపతిగా గుండెజబ్బుకు సూచకుడు. ఏకాదశం సహజ దశమభావమైంది. కనుక వృత్తిపరంగా పరిచయమైన ప్రేమికుడు/కాబోయే భర్త గుండెజబ్బుతో మరణిస్తాడని సూచన ఈ అమ్మాయి జాతకంలో స్పష్టంగా ఉంది.

పంచమ లాభస్థానాలలో నీచస్థితిలో ఉన్న రాహుకేతువులు, ప్రేమవ్యవహారం వల్ల ఘోరమైన దెబ్బతగులుతుందని సూచిస్తున్నారు. ఇది భయంకరమైన పుత్రదోషం కూడా. చంద్రలగ్నాధిపతి గురువు సప్తమంలో బాధకస్థానంలో ఉంటూ, తీవ్రమైన ప్రేమను, దానివల్ల కలిగే బాధలనూ సూచిస్తున్నాడు.

దారాకారాకుడిగా శుక్రుడు ఉచ్ఛస్థితిలో ఉన్నట్లు కనిపిస్తాడు కనుక వివాహజీవితం చాలా బాగుంటుందని సాధారణ జ్యోతిష్కులు అనుకుంటారు. కానీ ఆయన సున్నా డిగ్రీలలో ఉంటూ అష్టమభావపు ప్రభావాన్ని పూర్తిగా కలిగి ఉన్నాడు. కనుక భర్త మరణిస్తాడన్న సూచన మళ్ళీ గోచరిస్తున్నది.

సప్తమభావంపైనా, సప్తమాధిపతి శనిపైనా, షష్ఠాధిపతి గురువు దృష్టి, జీవితభాగస్వామి ఆరోగ్యవంతుడు కాడని సూచిస్తున్నది. దారాకారకుడైన శుక్రునిపైన నీచరాహుదృష్టి కూడా దీనినే సూచిస్తున్నది.

ఈ జాతకంలో ప్రస్తుతం బుధ - రాహు - చంద్ర - బుధదశ జరుగుతున్నది. భర్త/ప్రేమికుడు మరణించడం, దానివల్ల కలిగే ఘోరమైన డిప్రెషనూ, గందరగోళ పరిస్థితీ, ఇంటిలో గొడవలూ స్పష్టంగా కనిపిస్తున్నాయి. గోచారంలో ఉన్న దశమశని చతుర్ధాన్ని చూస్తూ, సుఖస్థానాన్ని పాడుచేస్తున్నాడు. లాభస్థానంలోకి వచ్చిన నీచగురువు  బుధుని అస్తంగత దోషాన్ని నిద్రలేపుతున్నాడు. కనుక ప్రస్తుతం ఈ అమ్మాయి ప్రేమికుడైన సిద్ధార్ధ శుక్లా గుండెపోటుతో మరణించాడు.

ఎవరి జీవితంలోనైనా సరే, జరుగుతున్న సంఘటనలు, ఈ విధంగా జాతకంలో స్పష్టంగా ప్రతిఫలిస్తాయి. గ్రహస్థితులను అర్ధం చేసుకునే ప్రజ్ఞా, పరిహారాలతో విధిని మార్చగలిగే శక్తీ, మనలో ఉండాలి. అప్పుడు జాతకం మారుతుంది. లేకుంటే పూర్వకర్మను అనుభవించక తప్పదు.

ఈ అమ్మాయి విషయంలో రెండవదే జరిగింది.