1, మే 2026, శుక్రవారం

మా 78 వ పుస్తకం 'త్రిపురా రహస్యము' విడుదల

ఈరోజు వైశాఖ పౌర్ణమి పర్వదినం.

శ్రీహరికి మహాభక్తుడు మరియు  సంకీర్తనాచార్యుడైన అన్నమయ్యకూడా ఈరోజే   జన్మించాడు. ఇవాళే బుద్ధునికి కూడా జ్ఞానోదయం కలిగింది. కనుక ఈరోజుకు గొప్ప ప్రాముఖ్యత ఉన్నది.

నా కలం నుండి వెలువడుతున్న 78 వ పుస్తకంగా 'త్రిపురా రహస్యము' 'ఈ-బుక్' ను నేడు విడుదల చేస్తున్నాను. శాక్తాద్వైత సాంప్రదాయానికి చెందిన మహత్తరమైన గ్రంథాలలో ఇది పేరుగన్నది.

ఇది జ్ఞానఖండము. అంటే, పూర్తిగా జ్ఞానభాగము. చిక్కని శాక్తాద్వైతభావజాలంతో కూడిన దీని శ్లోకార్థములను సాధ్యమైనంత తేలికైన తెలుగుభాషలో వివరించే ప్రయత్నాన్ని ఇందులో చేశాను.

దీనికంటే ముందు మాహాత్మ్యఖండమని ఒక భాగమున్నది. అది లభిస్తున్నది. దీని తరువాత చర్యాఖండమని ఇంకొక భాగమున్నది. అది లభించడం లేదు. ఇవన్నీ కలిపి మొత్తము 12 వేల శ్లోకములని చెప్పబడినది. మొత్తము 'త్రిపురారహస్యము' ఈ మూడు ఖండముల ఉద్గ్రంధము.

మాహాత్మ్యఖండములో 6687 శ్లోకములున్నాయి. జ్ఞానఖండములో 2163 శ్లోకములున్నాయి. కనుక చర్యాఖండములో 3150 శ్లోకములుండాలి. దేవీ సాధనావిధానములన్నీ దానిలోనే ఉన్నవి. కానీ అది దొరకడం లేదు. ఏ తురకల రాక్షసకాండలోనో తగలబడిపోయి ఉంటుంది. వీటిలో ప్రస్తుతము లభిస్తున్న జ్ఞానఖండమును మాత్రము ఇక్కడ విడుదల చేస్తున్నాము.

దత్తాత్రేయులవారు మహాజ్ఞాని మరియు మహాసిద్ధుడు. ఈయన పరశురాముని గురువు. ఇద్దరూ ఋషిపుత్రులే. ఒకరు అత్రితనయుడైతే, మరియొకరు జమదగ్ని తనయుడు. ఒకరు త్రిమూర్తిస్వరూపుడైతే, మరియొకడు దశావతారములలో ఒకరు. కనుక, వీరి సంవాదరూపమైన 'త్రిపురారహస్యము' నకు మన అద్వైతవేదాంతవాఙ్మయములో అత్యంతప్రముఖమైన స్థానమున్నది.

దత్తాత్రేయులకు అవతారములు లేవు. ఉన్నవని నేటివారు కల్పించారు. ప్రతివారినీ దత్తాత్రేయుల అవతారమని చెప్పుకోవడం కలిమాయలలో ఒకటి. అది వ్యాపారం మాత్రమే గాని, సత్యం కాదు. అన్నింటికీ అతీతుడై, పరమజ్ఞానరూపియైన దత్తాత్రేయుడు, మానవరూపంలో తిరిగి అవతరించడం, అల్పములైన మహత్యాలను అద్భుతాలను చెయ్యడం జరిగేపనులు కావని దత్తతత్త్వం కొద్దిగా తెలిసిన చిన్నపిల్లలకైనా అర్థమౌతుంది.

ముఖ్యంగా ఈ పిచ్చిభ్రమ మహారాష్ట్రలో ఎక్కువగా ఉన్నది. దానిని చూసి మన తెలుగువాళ్లు వాతలు పెట్టుకుంటున్నారు. కొంతమంది సోకాల్డ్ స్వామీజీలు దీనిని ప్రోత్సహిస్తున్నారు. స్వాములు సత్యాన్ని చెప్పాలి. ఆశలకు అతీతంగా ఉండాలి. కానీ అలా లేరు. స్వార్ధం కోసం అబద్ధాలను వ్యాప్తి చేస్తున్నారు. అధర్మాన్ని అనుసరిస్తూ, ధర్మక్షీణతకు కారకులౌతున్నారు. రక్షించవలసినవారు చెడగొట్టడం, దిద్దవలసినవారు పెడదారి పట్టించడం కలిమాయలలో ఒకటి.

నేడు ప్రతివారినీ దత్తాత్రేయుని అవతారమని చెబుతున్నారు. అలా చెప్పుకుంటున్నవారు తెలుగురాష్ట్రాలలో కనీసం నలుగురున్నారు.  ధనదాహం, కీర్తికండూతి, అహంభావం - వీటికోసం ఏ విలువలనైనా వదులుకోవడానికి సిద్ధపడటం ఈ నాలుగూ తెలుగువారి దౌర్భాగ్యాలు. హిందువులలో తమ మతాన్ని గురించిన అసలైన జ్ఞానం పెరిగినప్పుడు మాత్రమే ఈ అజ్ఞానానికి, దత్తాత్రేయుని పేరుతో జరుగుతున్న మతవ్యాపారానికి అంతం కలుగుతుంది.

త్వరలో దీని ఇంగ్లీష్ అనువాదం కూడా విడుదల అవుతుంది. రమణభక్తులైన శ్రీ మునగాల వెంకట్రామయ్యగారి ఇంగ్లీష్ అనువాదమే ఇప్పటివరకూ మనకు లభిస్తున్నది. ఇప్పుడు నా వ్యాఖ్యానరూపమైన ఇంగ్లీషు అనువాదం కూడా మీ ముందుకు వస్తుంది.

నవీనకాలపు జ్ఞానులలో ముఖ్యులైన రమణమహర్షి ఈ గ్రంధమును ఎంతగానో అభిమానించేవారు. తన సంభాషణల మధ్యలో దీనినుంచి శ్లోకాలను కోట్ చేసేవారు. దీనిని బట్టి ఈ గ్రంధము యొక్క విలువ ఎంతటిదో అర్ధం చేసుకోవచ్చు.

సృష్టి ఎలా జరిగిందన్నది కాశ్మీరశైవమనబడే త్రికసంప్రదాయంలో చాలా చక్కగా వివరించబడింది. ఇటువంటి వివరణ ఏ మతంలోనూ, ఏ గ్రంథంలోనూ ఇవ్వబడి లేదు. అలా చెప్పగలగాలంటే ఆయా మతాలలో గొప్పవైన మేధాశక్తి, పరిశీలన, సత్యతృష్ణ, ఋజుజీవనములుండాలి. అవి లేవుగా మరి !

త్రికమనేది ఆధ్యాత్మికలోకంలో అత్యున్నతమైన సాంప్రదాయము, దీనికే శివాద్వైతమని పేరున్నది. ప్రస్తుతగ్రంధము శాక్తాద్వైత సాంప్రదాయమునకు చెందినది. శివశక్తులకు వేర్వేరుగా ఇవ్వబడిన ప్రాముఖ్యత తప్ప, మిగిలిన భావజాలమంతా ఈ రెండింటిలో దాదాపు ఒక్కటిగానే కనిపిస్తుంది. ఆ వివరణను, జ్ఞానులలోని భేదములెలా ఉంటాయన్న వివరమును, ఇతరములైన ఎన్నో అంతుబట్టని జ్ఞానరహస్యములను కూడా ఈ గ్రంధంలో మీరు చూడవచ్చు.

ఈనాడు సైన్సు ఊహిస్తున్న మల్టీ డైమెన్షనల్ యూనివర్స్, టైం ట్రావెల్, హోలోగ్రామిక్ మోడల్  ఆఫ్ యూనివర్స్ మొదలైన భావాలు ఈ ప్రాచీనగ్రంధంలో దాదాపు వెయ్యి సంవత్సరాలనాడే చెప్పబడి ఉండటం చూడవచ్చు.

ప్రస్తుతం ఈ బుక్ గా ఇక్కడ లభిస్తుంది.  త్వరలో ఇది ప్రింట్ పుస్తకంగా లభిస్తుంది. ఈ ఏడాది జరుగబోయే హైద్రాబాద్, విజయవాడ బుక్ ఎగ్జిబిషన్లలో మా స్టాల్లో దొరుకుతుంది. 

యధావిధిగా, ఈ గ్రంథరచనలో నాకు సహకరించిన శిష్యులకందరికీ ఆశీస్సులందిస్తున్నాను.

మహత్తరమైన ఈ గ్రంధమునకు నాచేత చేయబడిన వ్యాఖ్యానము జిజ్ఞాసువులకు, జ్ఞానపిపాసులకు అమితానందమును కలిగిస్తుందని, తెలుగుభాషలో ఈ గ్రంధము  ఒక మణిపూసగా మిగిలిపోతుందని ఆశిస్తున్నాను.