మనదేశానికి అనేక సమస్యలున్నాయి. పదేళ్లక్రితం వ్రాశాను, త్వరలో మనం ఎదుర్కోబోతున్న అతిపెద్ద సమస్య 'ఊబకాయం' అని. ఇప్పటికీ ఈ సమస్య తీరలేదు. ఇంకా ఎక్కువైంది.
ఇప్పుడు మరొకసమస్య వచ్చిపడింది. నిజానికి ఈ సమస్య పదేళ్లక్రితం నుంచే ఉన్నప్పటికీ, నేడు ఇంకా ఎక్కువైంది. అదే 'సీనియర్ సిటిజెన్స్' సమస్య.
పదేళ్లక్రితం సీనియర్ సిటిజెన్స్ గా ఉన్నవాళ్లు ఇప్పుడు 'సూపర్ సీనియర్ సిటిజెన్స్' అయ్యారు.
ప్రస్తుతం మన దేశజనాభా 147 కోట్లు. దీనిలో 7 వ భాగం సీనియర్ సిటిజెన్స్ ఉన్నారు. అంటే, 21 కోట్లు. అందుబాటులోకి వచ్చిన మెడికల్ సదుపాయాలతో, మెరుగుపడిన ఆర్ధికవనరులతో, ఇప్పుడు మనం ఎక్కువకాలం బ్రతుకుతున్నాం. 90 దాకా బ్రతుకుతున్నవారు నేడు చాలామంది ఉన్నారు.
అయితే, వీరిలో క్వాలిటీ లైఫ్ ఉందా? అంటే, లేదనే చెప్పాలి. మందులేసుకుంటూ, సోఫాలకు, వీల్ చెయిర్లకు పరిమితమైపోయి, టీవీలు చూసుకుంటూ బ్రతుకుతున్నవారు కనీసం వీరిలో 5 కోట్లమంది ఉంటారు. ఇంకా పైమాటే కావచ్చు. వీరికి ఎదురౌతున్న అతిపెద్ద సమస్య - చూసుకునేవాళ్ళు లేకపోవడం.
వీళ్ళదగ్గర డబ్బులున్నాయి. ఇంకా కావలసివస్తే, పంపడానికి అమెరికావంటి దేశాలలో పిల్లలు మంచిపొజిషన్లలో ఉన్నారు. కానీ వాళ్ళిక్కడికి రాలేరు. వీళ్ళక్కడికి పోయి ఉండలేరు. ట్రంప్ రానివ్వడు. అయన ఒప్పుకున్నా యుద్ధం రానివ్వదు. అక్కడకెళ్లినా చివరకు ఏదో ఒక వృద్ధాశ్రమంలో చేరవలసిందే.
ఇక్కడా వీళ్ళను చూసుకునేవారు లేరు. అక్కడా ఉండరు. మరేం చెయ్యాలి?
మా ఆశ్రమం దగ్గర్లోనే ఒక ఊరుంది. అందులో, ఇంటికొకరు చొప్పున అమెరికాలో ఉన్నారు. ఇక్కడేమో, ఇంటిలోని ముసలాళ్ళు అరుగులమీద కూచుని శూన్యంలోకి చూస్తూ ఉంటారు. పెద్దపెద్ద ఇళ్ళు. చేసేవారు లేరు. చూసేవారు లేరు. ఏం చెయ్యాలో తెలియని స్థితి.
ఇదీ నేడు మన దేశంలో ఉన్న అతిపెద్ద సమస్యలలో ఒకటి.
అందుకనే వృద్ధాశ్రమాలు ఎక్కువౌతున్నాయి. అయితే వాటిలో కూడా తేడాలున్నాయి. కొన్నింటిలో మంచి సదుపాయాలుంటే, చాలావాటిల్లో అరకొర సదుపాయాలే ఉంటున్నాయి.
కొంతమంది సాఫ్ట్ వేర్ నిపుణులు కూడా 40కే ఉద్యోగాలు మానేసి వృధ్ధాశ్రమాలు నడుపుకుంటూ జీవిస్తున్నారు. టెన్షన్ ఉండదు. వృద్ధులకు సేవ చేసినట్లు ఉంటుంది. అన్న ఆలోచనతో దీనిని చేస్తున్నారు.
వృద్ధాశ్రమం అంటే బాగుండదని, వీటిని 'కమ్యూనిటీ లివింగ్ సెంటర్స్' అంటున్నారు. అమెరికాలో అయితే, సీనియర్ సిటిజెన్స్ కోసం పెద్దపెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. అక్కడే సెటిలైన కొంతమంది మనవాళ్ళు కూడా వీటిని పెట్టారు. పెట్టబోతున్నారు.
మొన్న హైద్రాబాద్ వెళ్ళినపుడు ఒకాయన్ని కలిశాను. ఆయనకు 85 ఏళ్ళు.
'నేను 125 వరకూ బ్రతుకుతాను' అన్నాడాయన. 'డైట్ లో జాగ్రత్తగా ఉంటూ, మంచిమందులు వాడుకుంటూ ఉంటే 125 దాకా బ్రతకడం పెద్ద కష్టమేమీ కాదు' అన్నాడు.
'అన్నాళ్ళు బ్రతికి ఏం చేద్దామని?' అన్నాను చనువుగా.
'ఏమీ లేదు. బ్రతికినన్నాళ్ళు బ్రతకడమే. కొత్తగా చేసేదేమీ లేదు. చేసేదంతా వయసులో ఉన్నపుడు చేశాం. ఇప్పుడు చేసేదేమీ లేదు' అన్నాడాయన.
'మిమ్మల్ని చూసుకునే పనివారి జీతభత్యాలకు నెలకు ఎంత ఖర్చవుతుంది?' అనడిగాను.
'దాదాపుగా లక్షా ఏభై వేలౌతుంది' అన్నాడు.
'మీరు భరించగలరు కాబట్టి భరిస్తున్నారు. అందరూ పెట్టుకోలేరు. వాళ్ళ గతేంటి?' అడిగాను.
'వాళ్లకు తగిన కమ్యూనిటీ లివింగ్ సెంటర్స్ వారికున్నాయి' అన్నాడాయన.
స్వయానా ఆయనే అటువంటి ఒక సెంటర్ను కొన్నేళ్లపాటు నడిపి ఇప్పుడు చేతకాక విరమించుకున్నాడు.
'మీ ఆశ్రమంలో ఇటువంటి ఫెసిలిటీ పెడితే బాగుంటుంది కదా' అని కొందరడిగారు.
'మాది సాధనాశ్రమం, వృద్ధాశ్రమం కాదు' అని వారికి చెప్పాను.
ఈ వృద్ధులకు హఠాత్తుగా ఏదైనా అయినా కూడా, విదేశాలనుండి వెంటనే వచ్చే పరిస్థితిలో వీళ్ళ పిల్లలు లేరు. 'ఏదో ఒకటి చేసెయ్యండి. వీడియోలో చూస్తాం. డబ్బులు పంపిస్తాం' అని కొందరంటున్నారని ఒక వృద్ధాశ్రమం నడిపేవారు నాతో అన్నారు.
కాళ్ళూచేతులూ సరిగ్గా ఉన్నంతవరకే ఎవరి ఆటలైనా సాగుతాయి. ఏదైనా తేడా వస్తే, మామూలు మనిషైనా, రిటైర్డ్ ఐఏఎస్ అయినా, డిప్యూటీ సిఎం అయినా, ఆస్పత్రిపాలు కావలసిందే. ఒకరిపైన ఆధారపడవలసిందే. డబ్బుంటే కొంతవరకూ నడుస్తుంది. ప్రేమగా చూడకపోయినా, ఏదోరకంగా చూసుకునేవారైనా కనీసం ఉంటారు. అదికూడా లేకపోతే, ఆ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది.
నేడు అలాంటి దారుణపరిస్థితిలో ఉన్న పెద్దవారి సంఖ్య 21 కోట్లు. ముందుముందు ఈ సంఖ్య ఇంకా పెరగనుంది.
వీళ్ళను జాగ్రత్తగా చూసుకునే 'కమ్యూనిటీ లివింగ్ సెంటర్లు' మరిన్ని రావలసిన అవసరం ఉన్నది. టెన్షన్ లేని జీవితం మనదేశంలోనే గడపాలని అనుకునేవారికి ఇదొక మంచి బిజినెస్ అవకాశం. ఔత్సాహికులు ముందుకొస్తే బాగుంటుంది.
రేప్పొద్దున వీళ్ళ పరిస్థితైనా, ఇంకెవరి పరిస్థితైనా ఇంతేగా మరి!