14, ఏప్రిల్ 2026, మంగళవారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 59 (ఆధ్యాత్మిక అనుభవాలు - బైబిలు వాక్యాలు)

'కనుక ఈ అనుభవాలన్నీ ఇంతే. అవేవో గొప్పగొప్ప ఆధ్యాత్మికమైనవి అనుకోకు. అవి చిన్నచిన్న సతోరి స్థితులు మాత్రమే' అన్నాను.

'ఏవైనా సరే, అవి మామూలు మనుషులకు అందేవి కావు కదా' అన్నాడు

'మామూలు మనుషులకు ఏవి అందుతాయి అసలు? పొద్దున్న లేస్తే తిండి, సంపాదన, ఆవేషాలు, బ్రతుకుపరుగులు ఈ రొచ్చే కదా. వీటిల్లో పడి ఉండే సామాన్యుడికి అసలేం అందుతుంది? ఏమీ అందదు.

సతోరిలు ఉంటాయి. నాకు 12 ఏళ్ల వయసులో కలిగింది. దీనికేమంటావు మరి? 'వెలుగుదారులు' లో కూడా అదంతా వ్రాశాను. చదివావా?'అడిగాను.

'లేదు. చదవలేదు' అన్నాడు.

'మరేం చదువుతావు? బైబిలా?' అన్నాను నవ్వుతూ.

తనేమీ మాట్లాడలేదు.

'అలాంటి అనుభవాలు రోజుకు పది కలుగుతై నాకు. ఒక్కోరోజున ఇంకా ఎక్కువ ఉంటాయి. అంతమాత్రం చేత అదేదో రామకృష్ణులకు కలిగే సమాధిస్థితులవంటివని అనుకోకూడదు. అంతెందుకు? ఇందాక నువ్వు నన్ను పలకరించినప్పుడు నేనేం స్థితిలో ఉన్నానో నీవు గమనించగలిగావా?' అన్నాను.

'లేదే? మీరు అలాంటి స్థితిలో ఉన్నారా?' అన్నాడు.

'అదేమరి. నీ దృష్టి ఎక్కడో ఉంది. ఎదురుగా ఉన్నదాన్ని మిస్సయ్యావు. ఇది అందరికీ జరిగేదే. ఇప్పటిదాకా నేను చెబుతున్నది అదే. మన దృష్టిని బట్టి మనకు కనిపిస్తుంది. మన దృష్టి ఎక్కడో ఉంటే, ఎదురుగా ఉన్నది కూడా కనిపించదు' అన్నాను.

'ప్రతిరోజూ ఎలా కలుగుతాయి అలాంటి అనుభవాలు?' అన్నాడు.

'ఎందుకు కలగవు? పొద్దున్న లేస్తే, ఎవడికి కలిగే అనుభవాలు వాడికి కలుగుతూనే ఉంటాయి కదా. నువ్వున్న స్థితిని బట్టి నీ అనుభవాలుంటాయి. జ్ఞానీ ఇక్కడే ఉంటాడు. అజ్ఞానులూ ఇక్కడే ఉంటారు. ఈ సృష్టిని దాటి ఎవడున్నాడు? ఇదే సృష్టి ఎవడి అనుభవాన్ని వాడికిస్తుంది.  సృష్టిరహస్యాలు తెలిస్తే, వాటిని ఎలా పొందాలో తెలిస్తే, చక్కగా కలుగుతాయి. దానికి అభ్యంతరమేముంటుంది? గ్రహరహస్యాలు, ధ్యానరహస్యాలు, ప్రకృతిరహస్యాలు తెలిస్తే అన్నీ జరుగుతాయి. అన్నీ చేయవచ్చు' అన్నాను.

'అదే ఎలా?' అన్నాడు.

'చూడు. ఇందాక భరద్వాజగారికి కలిగిన అనుభవం వెనకున్న గ్రహస్థితులను వివరించాను కదా. అలాంటి రహస్యాలు జ్యోతిషశాస్త్రంలో కొన్ని వందలున్నాయి. వాటిని సరిగ్గా ఉపయోగించుకుంటే, నీ జీవితంలో ఏరోజు ఏం జరుగుతుందో నీకు స్పష్టంగా అర్ధమౌతుంది. వాటిని ఆధ్యాత్మికంగా ఉపయోగించుకున్నావనుకో, అనుభవాలెందుకు కలగవు? మామూలు మనుషులు జ్యోతిష్యాన్ని లౌకికంగా ఉపయోగించుకుంటారు. మనం దానిని ఆధ్యాత్మికంగా ఉపయోగించుకోవాలి. తంత్రమంటే అదే. అలాంటి టైం స్లాట్లు అనంతమైన కాలంలో ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. వాటిని ఉపయోగించుకోవడం నీకు తెలియాలి. తంత్రసాధనలో ఇదొక భాగం. అప్పుడన్నీ అవుతాయి. అంతే ' అన్నాను. 

ఆ సబ్జెక్ట్ వదిలేసి ఇంకోదానికి దూకాడు.

'మీరిందాక బైబిలన్నారే. నిజానికి నాకు మన గ్రంధాల కంటే బైబిలే ఎక్కువ ఇష్టం. దానిలోని మాటలు నన్ను చాలా కదిలిస్తాయి' అన్నాడు.

'అలాగా నాయనా. నువ్వుకూడా ఈ పిచ్చిలో పడ్డావన్నమాట ! ఈసారి కలిసేసరికి 'శ్రీనివాస్ దైవసహాయం' అని పేరు మార్చుకుంటావేమో?' అన్నాను.

'ఛీ ఛీ అలా ఎందుకు చేస్తాను. ఊరకే బైబిలంటే నాకిష్టం అని చెప్పానంతే' అన్నాడు.

తన పాండిత్యాన్ని ప్రదర్శించాలని తెగ ఉబలాటపడుతున్నాడు కదా, చూద్దాంలే అనిపించి, 'సరే బైబిల్లోంచి నీకు నచ్చిన ఒక మంచిమాట చెప్పు వింటాను' అన్నాను.

వెంటనే ఉత్సాహంగా, 'ఒకడు సమస్తలోకమునూ జయించినప్పటికీ తన ఆత్మను పోగొట్టుకున్నట్లైతే అతనికేమి ప్రయోజనము?' అని జీసస్ అన్నాడు. ఇదెంత బాగుందో చూడండి' అన్నాడు.

జ్ఞానోపదేశ కాండం మొదలుపెట్టక తప్పదనిపించింది.

'దాంట్లో అంత పరవశించిపోయేది ఏముంది?' అన్నాను.

'అది నిజమే కదా' అన్నాడు భక్తిగా.

'ఎలా నిజమౌతుంది? దానిలో రెండున్నాయి. ఒకటి, లోకాన్నంతా సంపాదించడం లేదా జయించడం. అది కుదిరేపని  కాదు. అలెగ్జాండర్ వల్లే ఆ పని కాలేదు. ఇక మామూలు మనిషి వల్ల ఏమౌతుంది? రెండోది నీ ఆత్మను పోగొట్టుకోవడం. అదీ కుదరదు. కనుక అదొక అర్ధం లేని స్టేట్ మెంట్ మాత్రమే' అన్నాను.

'అదేంటి?' అన్నాడు అయోమయంగా.

'నీ ఆత్మను నీవెలా పోగొట్టుకోగలవు? నిన్ను వదలి నీ ఆత్మ ఎక్కడికి పోతుంది? ఎలా పోతుంది? అసలు ఆత్మంటే ఏమిటి? ఆత్మ ఉందా అసలు? ఏదీ ఒకసారి నీ ఆత్మని పోగొట్టుకొని చూపించు, చూస్తాను' అన్నాను.

నిర్ఘాంతపోయాడు.

'నిజమే కదా. మీరు చెబుతుంటే అర్థమౌతోంది. ఈ విధంగా నాకెవరూ చెప్పలేదు ఇప్పటిదాకా' అన్నాడు.

'ప్రపంచాన్ని జయించడమూ సాధ్యం కాదు. ఆత్మను పోగొట్టుకోవడమూ సాధ్యం కాదు. వెరసి అదొక అర్ధంపర్ధం లేని స్టేట్ మెంట్ మాత్రమే. ఇలాంటివి చదివి, నీలాంటివాళ్ళు గుడ్డలు చించుకోవడం తప్ప ఏమీ ఉపయోగం లేదు. అంతే' అన్నాను.

' మరి ఈ ఊరి పాస్టర్ అలా చెప్పలేదే?' అన్నాడు.

' కూటాలకి పోతున్నావా ఏంటి? 'ఇంత బ్రతుకూ బ్రతికి ఇంటెనకాల' అన్నట్టుంది నీపని' అన్నాను.

' ఛీ ఛీ అదేం లేదు. ఇక్కడొక పాస్టరున్నాడు. అతను అప్పుడప్పుడూ వాకింగ్ లో కలుస్తాడు' అన్నాడు.

'ఓహో. వాకింగులో టైం వేస్ట్ చెయ్యకుండా, నీకు బైబిలెక్కించి, బ్రెయిన్ వాష్ చేద్దామని చూస్తున్నాడు. నీక్కూడా కొద్దో గొప్పో ఎక్కింది. అంతేనా?' అన్నాను.

'అబ్బే అదేం లేదు' అన్నాడు. 

'మరైతే బైబిల్ని అంత భక్తిగా చెబుతున్నావేంటి? సరే బైబిలువాక్యం ఒకటి చెప్పావు. భగవద్గీతలోనించి కూడా నాలుగుశ్లోకాలు వినిపించు వింటాను.' అన్నాను.

పిచ్చిచూపులు చూస్తున్నాడు.

'అదీ సంగతి. నువ్వు చదవాల్సింది భగవద్గీత, ఉపనిషత్తులు, ఇతర మన గ్రంధాలు. ముందు వాటినేడువు. ఆ తర్వాత బైబిలు సంగతి చూద్దువుగాని. నీది నీకు తెలీకపోతే రోడ్డుమీదవన్నీ బానే ఉంటాయి' అన్నాను.

'మరి ఆ బైబిలు వాక్యంలో ఏమీ లేదా?' అన్నాడు.

'ఉంది. వేదాంతం ఉంది. జీసస్ నేర్చుకున్నదంతా మన దేశంలోనే నేర్చుకున్నాడు. ఆత్మతత్త్వాన్ని, అవతారతత్త్వాన్ని అన్నీ ఇక్కడున్నపుడే స్టడీ  చేశాడు వాటిని తీసుకెళ్లి అక్కడ చెప్పబోయాడు. అవన్నీ పాతనిబంధనకు విరుద్ధమైన భావాలు. వాళ్లకు కోపమొచ్చింది. అందుకే చంపబడ్డాడు' అన్నాను.

'మరి ఆ మాటకు మీరు చెప్పే అర్థమేమిటి?' అన్నాడు.

'నేను చెప్పే అర్ధంకాదు. ఉన్న అర్ధం ఒకటే. 'నువ్వు ప్రపంచసుఖాలను ఎన్నాళ్ళు అనుభవించినా, ఆత్మజ్ఞానివి కానంతవరకూ నీ బ్రతుకు వృధానే' అని ఆ వాక్యం అంటోంది. మన వేదాంతం చెప్పినది అదేగా. రామకృష్ణులు, రమణులు అందరూ అదే అన్నారు. ఇందులో వింతేముంది?

వాళ్ళకేమో ఆత్మ అంటే ఏమిటో తెలీదు. ఆత్మజ్ఞానం అంటే అసలే తెలీదు. కనుక, 'నీ ఆత్మను పోగొట్టుకోవడం' అంటే, 'క్రైస్తవాన్ని కాకుండా వేరే మతాలను నమ్మడం' అని పెడర్ధాన్ని తీసుకుని, మతమార్పిడులు చేస్తూ,  వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు.

మన వేదాంతం చెప్పినదాన్నే జీసస్ కాపీ కొట్టి ఇజ్రాయెల్ లో చెప్పబోయాడు. బైబిల్ నీకు అర్ధం కావాలంటే, వేదాంతపు పునాదులమీదనే అది సాధ్యమౌతుంది. ఈ మాట నేను చెప్పడం లేదు. వివేకానందస్వామి అంతటివాడే ఈ మాటన్నాడు. మనదగ్గర లేనిది బైబిల్లో ఏమీ లేదు.

ఆ వాక్యానికి నిలువెత్తు నిదర్శనం రమణమహర్షి వారే. ఆ వాక్యంలో జీసస్ చెబుతున్నది రామకృష్ణులు, రమణమహర్షి, అమ్మగారు వంటి జ్ఞానులగురించి మాత్రమే.' అన్నాను.

'ఇంకొక్క చిన్నసందేహం ఉంది. అది చెప్పి మన చర్చ ముగిస్తాను' అన్నాడు శ్రీనివాస్.

అప్పటికి చర్చ మొదలై రెండుగంటలైంది. నేనేదో చిన్నవాకింగ్ కని  వచ్చి, మనవాడి చేతుల్లో ఇరుక్కుపోయాను. నాకోసం చూసీ చూసీ, మూర్తి సంధ్యలు భోజనం చేయకుండా, రెండు అరటిపండ్లు తిని, నిద్రపోయారు. మిగతావాళ్ళు మాత్రం డిన్నర్ చేయకుండా నాకోసం వేచిచూస్తున్నారు.

'చూడు నాయనా. అవతల, తిండితినకుండా నాకోసం చూస్తున్నవాళ్లున్నారు. నీతో తెల్లవార్లూ మాట్లాడటానికి నేను సిద్ధమే. కానీ ఈ సోదిచర్చలవల్ల ఉపయోగమేమీ లేదు. 

ఎన్ని మాట్లాడుకున్నా, నువ్వు సాధనేమీ చెయ్యవు. చెయ్యకుండా జ్ఞానాన్ని పొందలేవు. దానికి, దారిచూపేవాడు ఒకడు కావాలి. వాడు ఎదురుపడినా, నువ్వు గుర్తించలేవు. పైగా, వాడికే నీ విజ్ఞానప్రదర్శన చెయ్యాలని చూస్తావు.

పోనీ చర్చలో అన్నా consistency ఉందా అంటే, అదీ ఉండదు. ఒక టాపిక్ నుంచి ఇంకోదానికి దూకుతావు. చివరకు ఏదీ తేలదు. ఇంకెందుకు ఈ గోల? కాలక్షేపచర్చలకు అంతూపొంతూ ఉండదు. ఇక చాల్లే. రేపు చూద్దాం' 

చివరగా ఒక మాట ! రేపటినుంచీ వాకింగుకెళ్ళినపుడు, అతను చెప్పే బైబిలువాక్యాలు నువ్వెక్కించుకోవడం కాదు, అతనికి నీ భగవద్గీతను ఎక్కించు. దారితప్పిన ఒక్క సోదరుడినైనా మళ్లీ సరైనదారిలోకి తీసుకురా. అలా చెయ్యాలంటే దానిలో ఏముందో ముందు నీకు తెలియాలి. అర్జెంట్ గా గీత చదవడం మొదలుపెట్టు' అని లిఫ్ట్ దగ్గరికి దారితీశాను.

' సరేనండి. గుడ్నైట్' అని తానూ సెలవు తీసుకున్నాడు.

ఆ చర్చ అలా ముగిసింది.