25 వ తేదీన అనంత పద్మనాభవ్రతం వచ్చింది. అది మా అమ్మగారు పుట్టినరోజు. తల్లిని మించిన దైవం లేదు గనుక, లేదా, దైవమే తల్లిరూపంలో ప్రత్యక్షమౌతుంది గనుక, ప్రతి ఏడాదీ ఆ రోజునుండి మూడురోజులపాటు మా ఆశ్రమంలో సాధనాసమ్మేళనం జరుగుతుంది. ఈ ఏడాదికూడా జరిగింది. అన్ని పండుగలలోకీ అదే మాకు ముఖ్యమైన పండుగ.
రాశి కంటే వాసికే ప్రాధాన్యతనిచ్చే మా విధానంలో, కులమత వర్గ విభేదాలను పక్కనపెట్టి, మానవత్వాన్ని పెంపొందిస్తూ, మనుషులను మనుషులుగా తీర్చిదిద్దుతూ, దైవత్వాన్ని అందుకునే సాధనామార్గాన్ని నేర్పిస్తూ, ఈ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా క్రొత్త తంత్రసాధనా ప్రక్రియలను శిష్యులకు ఉపదేశించడం జరిగింది.
శిష్యులు ఆశ్రమానికి వచ్చినపుడు ఉండటానికై కట్టించిన 'సాధనానివాస్' భవనం ఈ సందర్భంగా ప్రారంభించబడింది. ఈ భవనంతో ఆశ్రమానికి ఒక క్రొత్త నిండుదనం వచ్చింది.
రాబోయే నెలలలో, హైదరాబాద్, విజయవాడ, తిరుపతి బుక్ ఫెస్టివల్స్ లో పెట్టబోయే పంచవటి స్టాల్లో శిష్యులందరూ కలుసుకోవడం జరుగుతుంది. ఆ తరువాత, మార్చిలో జరుగబోయే వేసవి విషువత్ సాధనా సమ్మేళనంలో మళ్ళీ ఆశ్రమంలో అందరం కలుసుకుందామన్న సంకల్పంతో ఈ కార్యక్రమం ముగిసింది.

