అయోధ్య రామమందిరం మొదలవడమే గొడవలతో మొదలైంది.
మొదలుపెట్టి రెండేళ్లు కూడా కాకముందే పెద్ద వివాదంలో చిక్కుకుంది. భక్తులిచ్చిన చందాలు దొంగిలించబడటం చాలా బాధాకరం. దేశం మొత్తంమీద హిందువుల నమ్మకం దెబ్బతిన్నది.
తిరుమలలో ఇదే జరిగింది. పట్టుకున్న S.I హత్యకు గురయ్యాడు. ఇప్పుడు అయోధ్యలోనూ అదే నేరం జరిగింది. పద్మనాభస్వామి ఆలయంలో వేరేరకంగా ఇదే జరిగింది. మొత్తానికి, దేవుడంటే భక్తులకు భక్తి ఉన్నప్పటికీ, ఆలయంలో పనిచేసేవాళ్లకు ఉండదని తేలిపోయింది.
ఆలయాలలో అవినీతి, దొంగతనాలు, జరగడం. అదికూడా భక్తులు చేయడం చాలా బాధాకరం. ' మిశ్రా ' అంటే బ్రాహ్మణులు. ' చంపత్ రాయ్ బన్సాల్' అంటే వైశ్యులు. వాళ్ళే ఇలాంటిపనులు చేస్తే ఇక ఎవర్ని ఏమనుకోవాలి? మేనేజ్మెంట్ లో వేరే కులాలు మతాలవాళ్ళు ఉన్నపుడు వారిని అనుకున్నాం గతంలో. ఇప్పుడు చేసిందెవరు? ఎవర్ని అనాలి? ఏమనాలి?
చిన్నదొంగలను పట్టిచ్చి. లేదా పట్టుకున్నవారిని లేపేసి, సినిమాటిగ్గా పెద్దదొంగలు తప్పించుకుంటారని గతంలో చాలావాటిలో రుజువైంది. ఇప్పుడేమౌతుందో చూడాలి.
ఎప్పుడూ ఎదురుగా కనిపిస్తుంటే దేవుడు కూడా చీపై పోతాడు. అందుకే, దూరాన్నించి దర్శనంకోసం వచ్చిన భక్తులకున్న భక్తి, అక్కడున్న పూజారికి ఉండదు. హుండీ డబ్బులు లెక్కించేవారికి అసలే ఉండకపోవచ్చు.
ఎదురుగా ఊరిస్తున్న డబ్బూ బంగారాలు ముఖ్యంగాని, గుళ్లో ఉన్న రాతిబొమ్మ మనకెందుకు? మనం పెడితేనేగా దానికి తిండి? అయినా తినేది దేవుడు కాదుగా, మనమే. కనుక మనకు మనమే ముఖ్యం, దేవుడు కాదు.
దేవుడికి కూడా డబ్బుతోనే విలువ. ఇంకా చెప్పాలంటే, అసలు విలువ డబ్బుకే గాని, దేవుడికి కాదు.
నిజానికి, డబ్బు సంపాదించడానికి దేవుడొక ఆధారం. ఇది వాస్తవం.
ఇదే వాస్తవం !
అదంతా అలా ఉంచితే, జ్యోతిషం ఏమంటున్నదో చూద్దాం.
ప్రాణప్రతిష్ఠ 22 జనవరి 2024 న మధ్యాన్నం 12. 30 కు జరిగింది.
అప్పట్లోనే పుష్యమాసం ముహూర్తం మంచిది కాదని చాలామంది అన్నారు. ఎవరూ వినలేదు. అది శూన్యమాసం. ఫలితం స్పష్టంగా కనిపిస్తోంది.
దేవాలయ శిఖరం, కలశం పూర్తి కాకుండానే ప్రాణప్రతిష్ట చేయడం మంచిది కాదని కూడా చాలామంది అన్నారు. కానీ చేసేవారు చేశారు. ఇప్పుడిలా అయింది.
ఆనాటి గ్రహస్థితులు ఇలా ఉన్నాయి.
ఉచ్ఛచంద్రుడు ఎదురులేని ప్రజాభిప్రాయాన్ని సూచిస్తున్నాడు. కనుక దేశంలోని హిందువులందరి మద్దతుతో ఆలయం నిర్మాణమైంది.
అష్టమంలో కుజ బుధ శుక్రులున్నారు. శుక్రుడు ఇంటిదొంగలకు సూచకుడు. బుధుడు కుటుంబసభ్యులకు, అనుచరులకు సూచకుడు. కుజుడు రహస్యశత్రువులకు సూచకుడు. ఈ ముగ్గురూ కలసి నష్టానికి సూచికైన అష్టమంలో ఉన్నారు. ప్రస్తుతం జరిగింది అదే !
ప్రస్తుతం నడుస్తున్న దశ -- కుజ శుక్ర చంద్ర దశ. కుజశుక్రులిద్దరూ పెద్దనష్టాన్ని సూచిస్తున్న అష్టమంలో ఉండటాన్ని చూడవచ్చు. ఈ దశ మార్చి 2026 నుండి ఏప్రియల్ 2027 వరకూ ఉంది. మార్చిలోనే ఈ గొడవంతా బయటపడటం మొదలుపెట్టింది.
అధికారయంత్రాగాన్ని సూచించే సూర్యుడు మతసంబంధమైన నవమంలో పాపార్గళంలో చిక్కుకుపోయాడు. కనుక అధికారులూ యంత్రాంగమూ ఇరుకున పడ్డారు. సూర్యవిదశ సరిగ్గా మే - జూన్ నెలలలోనే నడిచింది.
దశమాధిపతి శని దశమంలో ఉన్నప్పటికీ, పాపార్గళంలో చిక్కుకున్నాడు. లాభస్థానంలోని గురుఛండాలయోగం నీతిలేని అనుచరులను (ఆలయ సిబ్బందిని) సూచిస్తున్నది. వీరివల్ల ఆలయమర్యాదకు ఘోరమైన కళంకం చుట్టుకుంది.
కుజదశ మార్చి 2028 వరకు ఉన్నది. అంతవరకూ పరిస్థితి బాగుపడదు.
ఆ పైన వచ్చే రాహుదశ 2046 వరకూ ఉంటుంది. అప్పుడూ, గురుఛండాలయోగం వల్ల ఏదో ఒక వివాదం ఉంటూనే ఉంటుంది.
2046-2062 మధ్యలో వచ్చే గురుదశ మాత్రమే బాగుంటుంది. కానీ అప్పుడుకూడా చికాకులు ఉంటూనే ఉంటాయి.
ఆ తర్వాత 2081 వరకూ నడిచే శనిదశ స్థిరంగా ఉన్నప్పటికీ చికాకులు తప్పవు.
ఆపైన 2098 వరకూ నడిచే బుధదశ బాగా యోగిస్తుంది. కానీ ఇలాంటి ఘోరాలు అప్పుడు కూడా మళ్ళీ జరుగుతాయి.
2098-2105 మధ్యలో వచ్చే కేతుదశ మాత్రమే అద్భుతంగా ఉంటుంది.
ఇంతకంటే చూడనవసరం లేదు.
బయటనుండి వచ్చి దేవాలయాలను కొల్లగొట్టారని, కూలగొట్టారని రాక్షసులమాదిరిగా ప్రవర్తించారని తురకలను అనుకోవడం దేనికి? ఇంటిదొంగల సాయం లేకుండా వాళ్ళు ఆపనులు చేయగలిగేవారా? ఇప్పుడు మనవాళ్ళు చేస్తున్నదేమిటి?
ఇప్పుడు దోషులు కూడా ఇంటిదొంగలే. హిందూమతం ముఖ్యంగా దృష్టి పెట్టాల్సింది ఇంటిదొంగలమీదనే.
మన దేవుళ్ళపైన దేవాలయాలపైన మనకే గౌరవం లేదు. ఇక బయటవాళ్ళకెలా ఉంటుంది?
దేవుడికే ద్రోహం చేసేవాళ్ళు, మనుషులను ఒదులుతారనుకోవడం వెర్రితనం ! కాకపోతే, నీతికి మారుపేరుగా నిలవాల్సిన వాళ్ళే ఇలా చేస్తే, ఇక ఎవర్ని నమ్మగలం? అందులోనూ VHP, RSS కార్యకర్తలా? కోట్లాది హిందువుల హృదయాలు గాయపడ్డాయి.
వచ్చిన చెడ్డపేరు పోవడం చాలా కష్టం.
ముహూర్తసమయంలో నవాంశలో గురువు ఉచ్ఛస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు రాశిలోనే ఉన్నాడు. గురువు అనుగ్రహిస్తే కష్టాలనుండి తేలికగా బయటపడవచ్చు. కానీ, ఆ అనుగ్రహానికి తగిన అర్హత మనలో ఉండాలి. అప్పుడే అది మనకు లభిస్తుంది. ఊరకే మాత్రం రాదు.
ఈ మొత్తం వ్యవహారంలో యోగి ఆదిత్యనాథ్ ఒక్కడే నిజాయితీగా, ధైర్యంగా నిలబడ్డాడు.
చూద్దాం దీనినెలా పరిష్కరిస్తారో? పోయిన పరువునెలా తిరిగి రాబట్టుకుంటారో?
