“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

6, జనవరి 2013, ఆదివారం

అమ్మాయిలకు మార్షల్ ఆర్ట్స్ ఉపయోగపడతాయా?

ఈ మధ్య జరుగుతున్న రేపులు అమ్మాయిల మీద దాడుల దృష్ట్యా కొన్ని రాష్ట్రాలలో అమ్మాయిలకు మార్షల్ ఆర్స్ నేర్పాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. మంచిదే. ఈ సందర్భంగా మార్షల్ ఆర్ట్స్ లో గత 30 ఏళ్ళుగా నాకున్న అనుభవాన్ని బట్టి కొన్ని విషయాలు చెప్తాను.

ప్రస్తుతం మన దేశంలో ఉన్న మార్షల్ ఆర్ట్స్ శిక్షకులలో బోగస్ శిక్షకులే ఎక్కువ.వీళ్ళలో చాలామందికి అసలైన మార్షల్ ఆర్ట్స్ రావు.వీరికి సరైన సంస్థలతో అఫిలియేషన్  ఉండదు.ఏవో కొన్ని మాయ టెక్నిక్స్ నేర్చుకుని ఇక కుంగ్ ఫూ సినిమాలూ,నెట్టూ పట్టుకుని వాటితో నేట్టుకోస్తుంటారు.ఇలాంటి వారు చాలామంది స్కూళ్ళూ కాలేజీల వెంట తిరిగి మేము ఆధరైజేడ్ మాస్టర్లము అని చెప్పి ఆయా ప్రిన్సిపాళ్ళను, కాలేజీ యాజమాన్యాలను మోసగించి అక్కడ క్లాసులు చెప్పడానికి కుదురుతారు. పిల్లలకు ఏవేవో పిచ్చి పిచ్చి టెక్నిక్స్ నేర్పుతూ పబ్బం గడుపుకుంటూ ఉంటారు.

యూనిఫాం అని, బెల్ట్ టెస్ట్ లని, స్పెషల్ క్లాసులని మాయమాటలు చెప్పి వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తారు కాని వారు నేర్పేది ఏమీ ఉండదు.ఇదొక మాయలోకం.పిల్లలేమో తమకు ఎదో వచ్చేసిందన్న భ్రమలో ఉంటారు.వారికి ఏమీ రాదు.ఆ వచ్చిన స్టెప్స్, పంచేస్,కిక్స్ తో వారు ఆత్మరక్షణ చేసుకోలేరు. ఆ టెక్నిక్స్ వారికి ఏ విధంగానూ ఉపయోగపడవు.

నాలుగు ఐదేళ్ళ పాటు కరాటే నేర్చుకున్న వారు కూడా స్ట్రీట్ ఫైట్ లో మామూలు మనుషుల చేత తన్నులు తిన్న కేసులు నాకు తెలుసు.బ్లాక్ బెల్త్స్ అని చెప్పుకున్న వారిని మామూలు పల్లెటూరి మనుషులు తుక్కు కింద కొట్టిన సందర్భాలున్నాయి. కనుక ఏదో ఫేన్సీ గా నేర్చుకున్న కరాటే కుంగ్ ఫూ ల వల్ల ఆత్మరక్షణ చేసుకోగలం అని భ్రమపడకండి. ఆ విద్యలలో మాస్టరీ రావాలంటే అనేక ఏళ్ళు కఠోరంగా శ్రమిస్తేనే సాధ్యం అవుతుంది. స్కూళ్ళలో కాలేజీలలో ఒక గంటో అరగంటో ప్రాక్టీస్ చేస్తే ఆ స్కిల్ రానేరాదు.

క్రిమినల్స్ కరుడుగట్టి ఉంటారు. వారికి దయా దాక్షిణ్యాలు ఉండవు. కనుక అలాంటి వారి ముందు ఫేన్సీ గా నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ఉపయోగపడవు. మీ అమ్మాయి స్కూల్లో ఒకటి రెండు మూమెంట్స్ నేర్చుకున్నంత మాత్రాన "మా అమ్మాయికి ఇక ఏమీ కాదు,తను ఎటువంటి పరిస్తితినైనా ఎదుర్కోగలదు" అన్న భ్రమలో మీరుంటే ముందు దానినుంచి  బయటకు రండి. సరదాగా నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ నిత్యజీవితంలో ఉపయోగపడవు. సినిమాలో హీరోయిన్ పదిమంది వస్తాదులను మట్టికరిపించవచ్చు.కాని నిజజీవితంలో అది అసంభవం. అసాధ్యం.

స్కూళ్ళలో నేర్పే కరాటే, స్ట్రీట్ ఫైట్ లో ఉపయోగపడదు.దానికి వేరే టెక్నిక్స్ వాడాలి.స్కూళ్ళలో స్పోర్ట్ కరాటే నేర్పుతారు. అది టోర్నమెంట్ వరకు ఉపయోగ పడుతుంది. కాని స్ట్రీట్ ఫైట్ లో అది ఉపయోగ పడదు.ఎందుకంటే స్ట్రీట్ ఫైట్ లో పరిస్తితులు రింగ్ లో పరిస్తితి లాగా ఉండవు. స్ట్రీట్ ఫైట్ లో పాయింట్ సిస్టం ఉండదు. ఇక్కడ చంపడమో చావడమో రెండే మార్గాలుంటాయి. టోర్నమెంట్ కు వాడే వీరవిద్యలు వేరు. ప్రాక్టికల్ గా ఉపయోగపడే వీరవిద్యలు వేరు.కనుక స్కూళ్ళలో కాలేజీలలో నేర్పించే వీర(రణ)విద్యలు నిత్యజీవితంలో ఉపయోగపడవు అని గ్రహించండి.

నాకు తెలిసిన కొన్ని కేసులలో దారుణ రేప్ కు గురైన వారు మార్షల్ ఆర్ట్స్ వచ్చినవారే. వారు ప్రతిఘటించడం వల్ల నిందితులు ఇంకా రెచ్చిపోయి, ఆ కోపంలో ఇంకా తీవ్రంగా వారిని హింసించారు. కనుక ఏదో రెండు మూడు మూమెంట్స్, నాలుగు పంచేస్ కిక్స్ వచ్చినంత మాత్రాన వీర విద్యలలో ప్రావీణ్యం వచ్చిందని భ్రమించకండి.అది అంత త్వరగా పట్టుబడదు. నిత్యజీవితంలో ఉపయోగపడదు కూడా. తాగిన మత్తు లోనో,డ్రగ్స్ మత్తు లోనో, లేక ఒకరి కంటే ఎక్కువగానో ఉన్న నేరస్తులను ప్రతిఘటించడానికి లేతగా ఉండే అమ్మాయిల శారీరిక బలం ఎంతమాత్రం సరిపోదు.తూతూ మంత్రం గా నేర్చుకునే వీరవిద్యల వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ.  

పోలీస్ వ్యవస్థ నిద్రలేవాలి.పౌరులను భయపెట్టడానికి కాదు,వారిని రక్షించడానికి తామున్నాం అన్న సంగతి తెలుసుకోవాలి. చట్టాలు నిక్కచ్చిగా అమలు జరగాలి.నేరం చెయ్యాలంటే పౌరులలో భయం పెరగాలి. ఈ నేరాలకు అదే అసలైన సొల్యూషన్.అంతేగాని,పదేళ్ళ ఆడపిల్లలు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడమూ,లేకుంటే బురఖాలు ధరించడమూ పరిష్కారాలు కానే కావు.అన్ని సమస్యలూ వ్యక్తి స్థాయిలోనే పౌరులు పరిష్కరించుకుంటే ఇక ప్రభుత్వమూ చట్టాలూ ఎందుకు?

ఇంతకంటే మంచిగా ఉపయోగపడే కిటుకులున్నాయి.సెల్ ఫోన్స్ లో అందుబాటులో ఉన్న అనేక అప్లికేషన్స్ వాడుకొని ఆపదలో ఉన్నపుడు 'హెల్ప్ మి' అన్న సిగ్నల్ కొన్ని నంబర్లకు పంపడమూ,తద్వారా ఆ అమ్మాయి ఎక్కడ ఉందొ తెలుసుకుని వెంటనే అక్కడకు చేరుకునే లాంటి విధానాలు అమలులోకి తేవాలి. లేదా,'SOS' మెసేజి పోలీస్ కంట్రోల్ రూమ్ కు చేరేలా సెల్ ఫోన్స్ లో అప్లికేషన్లు డెవెలప్ చెయ్యాలి. లేదా 'పెప్పర్ స్ప్రే' వంటివి దగ్గర ఉంచుకోవాలి.

క్రైం రేట్ అధికంగా ఉన్న డిల్లీ వంటి నగరాలలో స్పెషల్ పార్టీ పోలీసులు మఫ్టీలో తిరుగుతూ ఆ నేరాలు అధికంగా జరిగే స్థలాల వద్ద కాపు కాసి ఈవ్ టీజర్స్ ని పట్టుకొని చితక్కొట్టి లాకప్ లో వేస్తూ ఉండాలి. వీరిలో లేడీ పోలీసులు కూడా ఉండాలి. వీరికి మాత్రం నిజమైన మార్షల్ ఆర్ట్స్ యొక్క డెడ్లీ టెక్నిక్స్ లో ట్రైనింగ్ ఇవ్వాలి.

అటువంటి పనిచేసే విధానాలు అమలులోకి తెవాలిగాని, ఉపయోగపడని మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని ఆ డొల్లధైర్యంతో వేళగాని వేళలలో తిరిగితే ప్రమాదంలో పడే అవకాశాలే ఎక్కువ.మార్షల్ ఆర్ట్స్ లో చాలా ఎడ్వాన్సుడు స్కిల్ ఉంటెగాని వాటిని స్ట్రీట్ ఫైట్ లో వాడలేము.ఈ విషయం ఒక మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ గా నేను అనుభవ పూర్వకం గా చెప్పగలను.