“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

24, ఆగస్టు 2017, గురువారం

ఛిన్నమస్తా సాధన - 5

బౌద్ధంలో పంచ కులములు
తంత్రయానం, మంత్రయానం, వజ్రయానం అనేవి మూడూ దాదాపుగా ఒకటే విషయాన్ని చెబుతాయి. బుద్ధత్రిపిటకాలలో ఉన్న సూత్రాలు బట్టీ పట్టడం, ఉత్త మేధాపరమైన చర్చలలో కాలం గడపడం, అనవసరమైన చాదస్తపు నియమాలు పాటించడం మొదలైన అబ్యాసాలను తంత్రయానం నిరసిస్తుంది.

సరాసరి ఇప్పుడే ఇక్కడే జ్ఞాన/మంత్ర/తంత్రసిద్ధిని అందుకోవడమే తంత్రం యొక్క ముఖ్యోద్దేశ్యం. దానికోసం మనిషికి తెలిసిన అన్ని కట్టుబాట్లనూ, ఆచారాలనూ, బంధాలనూ త్రెంచి అవతల పారెయ్యమని అది చెబుతుంది. బుద్దుడు అదే చేశాడు. నేడు బుద్ధుని పూజించేవాళ్ళందరూ ఇళ్ళల్లో కూచుని కాఫీలు త్రాగుతూ కబుర్లు చెబుతున్నారు. కానీ బుద్ధుడు అలా చెయ్యలేదు. రాజ్యాన్ని గడ్డిపోచలాగా తృణీకరించి బయటకొచ్చాడు. నేడు చాలామంది అంటారు. 'బుద్ధుడు చేసింది పిచ్చిపని. ఆయన రాజుగా ఉండికూడా అది సాధించవచ్చు.' అని. వాళ్ళేం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. ఇళ్ళలో ఉండి అందరూ అన్నీ సాధించగలిగితే పాతకాలంలో ఋషులందరూ అడవులలో ఆశ్రమాలు కట్టుకుని ఎందుకున్నారు? పైగా అప్పుడు క్రూరమృగాల నుండి దొంగల నుండీ రక్షించుకోడానికి వాళ్లకు మనలాగా గన్స్ లేవు. అయినా సరే వాళ్ళు ప్రాణాలకు తెగించి అడవులకూ హిమాలయాలకూ పోయేవారు. తపస్సు చేసేవారు. అదీ అసలైన తెగింపు అంటే. అంతేగాని నేటి కుహనా గురువులలాగా ఏసీ ఆశ్రమాలలో నివసిస్తూ, టీవీలలో ఉపన్యాసాలివ్వడం కాదు.

తానే మానసికంగా ఎన్నోరకాలైన బంధాలలో చిక్కుకుని ఉన్నవాడు బయటకు ఎన్ని ఆచారాలు నియమనిష్టలు పాటించినా ఏమీ ఉపయోగం లేదు. అన్ని బంధాలకూ అతీతుడుగా వెళ్ళడమే బుద్ధత్వం అయినప్పుడు ప్రతి నిముషమూ అనేక బంధాలలో ఇరుక్కుని ఉన్న మనిషి దానిని ఎలా చేరుకోగలడు? అని తంత్రం ప్రశ్నిస్తుంది. ఇది చాలా సరియైన ప్రశ్న.

అయితే 'బంధాలను దాటడం' అంటే విచ్చలవిడి సెక్స్ జీవితాన్ని గడపడం కానే కాదు. చాలామంది తంత్రం అంటే ఇక్కడే తప్పుగా అర్ధం చేసుకుంటారు.తంత్రమంటే సెక్స్ లో పాఠాలు నేర్చుకోవడమనే భావన పాశ్చాత్యదేశాలలో ముఖ్యంగా అమెరికాలో ఎక్కువగా ఉంది. ఇది పూర్తిగా తప్పు భావన. కామాన్ని జయించడానికి తంత్రం అనేక విధాలైన విప్లవాత్మక మార్గాలను సూచిస్తుంది. వాటినే తంత్ర సాధనలంటారు. అవి indulgences కానేకావు. దానిలోనే ఉంటూ దానినే జయించే మార్గాలవి. అయితే ఈ విధానాలు బయటవాళ్ళకు అస్సలు అర్ధం కావు. ఈ రహస్యాలను అర్ధం చేసుకోలేని సో కాల్డ్ అమెరికన్ తంత్రాటీచర్స్ అమెరికాలో ముఖ్యంగా కాలిఫోర్నియా ప్రాంతాలలో కుప్పలు తెప్పలుగా ఉన్నారు. వీళ్ళంతా ఎక్కువగా ఓషో శిష్యులు. వీళ్ళు నేర్చుకున్న తంత్రం అంతా ఓషో ఆశ్రమంలో రాత్రి పదకొండు గంటల తర్వాత జరిగే 'తంత్రా వర్కుషాపు'కే పరిమితం. ఈ వర్కుషాపును నేను 1998 లో దగ్గరనుంచి చూచాను. అదొక sexual orgy. అందులో పాల్గొనే వాళ్ళంతా అమెరికన్లూ యూరోపియన్లూను. అది అసలైన తంత్రం కాదు. ఈ విషయాన్ని నేను పూనాలోని ఓషో ఆశ్రమంలో 1998 లో ఉన్నప్పుడు గమనించాను. వారికి అసలైన తంత్రం తెలియదు.

'కామాన్ని నువ్వు జయించాలిరా బాబూ' - అని తంత్రం చెబుతుంటే మోడరన్ తంత్రగురువులేమో 'బెటర్ సెక్స్ ఎలా ఎంజాయ్ చెయ్యాలో మేము నేర్పిస్తాం. అదే తంత్రం' అని తప్పుడు భావాలను పాశ్చాత్య దేశాలలో ప్రచారం చేస్తున్నారు. ఇదే కలిమాయ అంటే !!

అయితే ఈ రహస్యాలను ఎవరు నేర్పిస్తారు? వీటిని అభ్యాసం చెయ్యడం ఎలా? అంటే దానికి సమాధానం ఒక్కటే. ఇది రహస్యమైన మార్గం. నువ్వు ఆ దారిలో నడిస్తేనే నీకు ఆ రహస్యాలు బోధించబడతాయి. అలా నడవాలంటే నీకు కొన్ని అర్హతలుండాలి. అవి లేకపోతే నీకు తంత్రయానం అర్ధం కాదు. ముందసలు అందులోకి ప్రవేశమే నీకు లభించదు. అందుకే తంత్రసాధన నీకు కావాలంటే "నీ అర్హతను నువ్వు ముందు నిరూపించుకో" అని తంత్రం చెబుతుంది. అయితే ఈ అర్హతలు లక్షమందిలో ఒకరికో ఇద్దరికో మాత్రమే ఉంటాయిగాని అందరికీ ఉండవు. తంత్రం అంటే అందరికీ సరదాగా ఉంటుంది. కానీ ఎవరు బడితే వారు తంత్రసాధనకు అర్హులు కారు. కొన్ని కొన్ని కులాలలో పుట్టినవారే దీనికి అర్హులు.కులం అంటే మనకు తెలిసిన కులం కాదు. కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఉండటమే 'కులం' అనే పదానికి అర్ధం.

బుద్ధధర్మంలో అయిదు కులాలనేవి ఉన్నాయి. కులం అనే పదం బుద్ధుని కంటే ముందుగా మన సమాజంలో ఉన్నప్పటికీ బుద్ధధర్మంలో కూడా ఈ పదం ప్రవేశించింది. కులం అంటే ఒక గుంపు అనేది అసలు అర్ధం. ఒకే రకమైన ఆచారాలు పద్ధతులూ పాటిస్తూ ఉండే ఒక గుంపుకు 'కులం' అని పేరు.

నిజమైన హిందూమతమంటే ఎలాగైతే హిందువులలో చాలామందికి తెలియదో, నిజమైన బౌద్ధమతం అంటే కూడా బౌద్దులలో చాలామందికి తెలియదు. బుద్దుడు కులవ్యవస్థను నిరసించాడనీ, వేదాలను నిందించాడనీ, సమాజాన్ని సంస్కరించాలని ప్రయత్నించాడనీ చాలామంది అపోహ పడుతూ ఉంటారు. ఈ భావనలేవీ నిజాలు కావు.

బుద్ధుడు సంఘసంస్కర్త కాడు. సంఘాన్ని సంస్కరించాలని ఆయన అనుకుంటే రాజుగానే ఆ పని చేసేవాడు. దానికి భిక్షువు కావాల్సిన పని లేదు. రాజుగా చెయ్యలేని పనిని భిక్షువుగా అస్సలు చెయ్యలేడు. కనుక బుద్ధుని ఉద్దేశ్యాలు ఇవేవీ కావు.

'దుఃఖనాశన మార్గాన్నే' ఆయన వెదికాడు. దానిని సాధించాడు. దానినే బోధించాడు. ఆ మార్గానికి కలిసిరాని అన్నింటినీ, అవి వేదాలైనా సరే, దేవుళ్ళైనా సరే, సమాజపు కట్టుబాట్లైనా సరే, వాటిని త్రోసివెయ్యమన్నాడు. ఆయన ప్రాధమికంగా ఒక అనుభవజ్ఞాని. తను పొందిన జ్ఞానానికి దారిని అర్హులైనవారికి బోధించాడు. ఆ దారిలో వారిని నడిపించాడు. అంతే.

బుద్ధుడు మొదట్లో బోధించినది ఒకటే ధర్మం అయినప్పటికీ కాలక్రమేణా దానిలో అయిదు శాఖలు ఏర్పడ్డాయి. అవే పంచకులాలు. అవి - రత్నకులం, వజ్రకులం, పద్మకులం, కర్మకులం.  తధాగతకులం. వీటిలో అక్ష్యోభ్యుడు, వైరోచనుడు, అమితాభుడు, రత్నసంభవుడు, అమోఘసిద్ధి అనేవారు అధిష్టానదేవతలు. వీరినే బౌద్ధంలో కులేశ్వరులంటారు. వీరితో సంభోగంలో (అంటే ఒకటిగా కలసి) ఉండే స్త్రీదేవతా మూర్తులను "కులేశ్వరి" అంటారు.

వీరిలో వజ్రయానానికి అక్షోభ్యుడూ, పద్మయానానికి అమితాభుడూ, రత్నయానానికి రత్నసంభవుడూ, కర్మయానానికి అమోఘసిద్దీ, తధాగతయానానికి వైరోచనుడూ దేవతలు. ఈ కులాల నుంచే కులాచారం, కౌలాచారం, కౌలమార్గం అనేవి పుట్టుకొచ్చాయి. దీనిని హిందూ తంత్రాలు కాపీ కొట్టాయి.  వీటిలో వజ్రకులమే వజ్రయానం లేదా తంత్రయానం అయింది. ఇవి వరుసగా, భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశ మార్గాలుగా భావించబడ్డాయి. వీటిలో జలం అనేది స్వాదిష్టానచక్రాధి దేవత గనుకా, అది శుక్రగ్రహం అధీనంలో ఉంటుంది గనుకా, శుక్రుడూ స్వాధిష్టాన చక్రమూ కామాన్ని కంట్రోల్ చేసే శక్తులు గనుకా వజ్రయానంలో సంభోగం అనేది ముఖ్యసాధనగా వచ్చింది. ఎందుకంటే కామాన్ని సబ్లిమేట్ చెయ్యందే (జయించనిదే) ఈ సాధన కుదరదు.    

ఇవి హిందూతంత్రంలో చెప్పబడిన పంచకోశాలకూ పంచభూతాలకూ పంచమార్గాలకూ సూచికలు. శైవంలో ఇవే పరమశివుని అయిదు ముఖాలైన సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన ముఖాలుగా వర్ణింపబడ్డాయి.


కురుకుళ్ళా దేవత
బౌద్ధతంత్రాలలో ఈ అయిదు మార్గాలూ అయిదు తంత్ర యానాలుగా చెప్పబడ్డాయి. అవే క్రియాతంత్రము, చర్యాతంత్రము, యోగతంత్రము, యోగోత్తర తంత్రము, అనుత్తర తంత్రము. ఈ అయిదూ కూడా మన్మధుని పంచ పుష్పబాణాలకు సంకేతాలు. అవిద్య, రాగము, ద్వేషము, గర్వము,అసూయ అనే అయిదు పాశాలకు కూడా ఇవి సంకేతాలు. ఈ పుష్ప బాణాలు అనేవి మన్మధుని చేతిలోనూ లలితాదేవి చేతిలోనూ ఉన్నట్లు మన సాంప్రదాయంలో చూస్తాం. అలాగే బౌద్ధంలో ఉన్న కురుకుళ్ళా దేవతను మనం చూస్తే ఈమె చేతిలో ఒక పుష్పధనుస్సూ, అయిదు పుష్పబాణాలూ ఉంటాయి. మిగతా రెండు చేతులలో పాశమూ అంకుశమూ ఉంటాయి. సరిగ్గా లలితాదేవి చేతిలో కూడా చెరుకుగడ దనుస్సూ, అయిదు పుష్పబాణాలూ, పాశమూ అంకుశమూ ఉంటాయి. కనుక లలితాదేవియే బౌద్ధ తాంత్రికదేవత ఐన కురుకుళ్ళ. దీనికి రుజువుగా, బౌద్ధతంత్రాలలో వాడబడిన అనేక పదాలు యధాతధంగా మనకు లలితా సహస్రనామాలలో దర్శనమిస్తాయి.

"కులకుండాలయా కౌలమార్గ తత్పర సేవితా" - అనేది లలితా సహస్ర నామాలలోని ఒక నామం.ఈ నామం అందరికీ తెలుసు. కానీ ఇది దేనిని గురించి చెబుతున్నదో ఎవరికీ తెలియదు. మనవాళ్ళు అర్ధాలు తెలుసుకోకుండా ఊకదంపుడు పారాయణాలు చెయ్యడంలో సిద్ధహస్తులు కదా !

ఈ నామం కులమార్గాన్ని గురించి చెబుతుంది. కౌలమార్గం అనేది కూడా మొదటగా బుద్ధమార్గంలోని అయిదు కులాల నుంచే వచ్చింది. ఈ కులాలలో దేనికో ఒక దానికి చెందిన వారిని కౌలాచారులు లేదా కౌలమార్గావలంబులు అనేవారు. వారిచే పూజించబడే దేవత గనుక లలితాదేవికి "కౌలమార్గ తత్పర సేవితా" అనే నామం వచ్చింది. బౌద్ధంలో ఉన్న తారాదేవియే హిందూమతంలో అనేకరూపాలలో పూజింప బడుతూ ఉంటుంది. అందులో ఒక రూపమే లలితాదేవి. బౌద్ధంలో తారాదేవిని అందరు బుద్ధులకూ తల్లిగా భావిస్తారు.

లలితా సహస్రనామాల అసలైన అర్ధాలు తెలుసుకోవాలని అనుకునేవారు వచ్చే నెలలో రాబోతున్న నా పుస్తకం ' లలితా సహస్రనామ రహస్యార్ధ ప్రదీపిక' చదవండి.

ప్రాచీనకాలంలో బయట ప్రకృతికీ, లోపలి సాధనా మార్గానికీ సమన్వయం చెయ్యాలని అనేక ప్రయత్నాలు ప్రతి మతంలోనూ జరిగాయి. దాని ప్రభావాలే బౌద్ధతంత్రంలోనైనా హిందూ తంత్రంలోనైనా ఈ శాఖోపశాఖల సృష్టి. ఈ క్రమంలో, హిందూ, బౌద్ధ, జైన మతాలలోని దేవతలందరూ కలసిపోయారు. ఎందుకంటే ప్రాధమికంగా ఇవన్నీ ఒకటే మూలం నుంచి, వేదమూలం నుంచి, పుట్టిన శాఖలు కాబట్టి. అందుకే ఈ మతాలన్నింటిలోనూ, బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన అనేకమంది వేదకాలపు దేవతలు మనకు కనిపిస్తారు. వీరే గాక అనేకమంది తాంత్రికదేవతలు కూడా ఈ తంత్ర/పురాణ కాలంలో సృష్టించబడ్డారు. అందుకే హిందూ బౌద్ధ తంత్రాలలో అనేక దేవతలు కామన్ గా మనకు దర్శనమిస్తారు.


21 తారారూపాలు
ఉదాహరణకు - లలితా సహస్రనామాలు చదివే అందరికీ ఈ నామం సుపరిచితమే - "కురుకుళ్ళా కులేశ్వరీ". ఇందులో కురుకుళ్ళ అనే తాంత్రిక దేవత గురించి చెప్పబడింది. ఈమె మనకు హిందూతంత్రాలలో ఎక్కడా కనిపించదు. ఒక్క తంత్రరాజ తంత్రమే ఈమె సాధనను ఉపదేశించింది. కానీ బౌద్ధంలో ఈమె తారాదేవికి ఒక రూపంగా మనకు దర్శనమిస్తుంది. తంత్రసాధనలో తారాదేవికి 21 రూపాలు/ అవతారాలున్నాయి. కురుకుళ్ళా దేవతను 'అరుణతార' అని బౌద్ధంలో పిలుస్తారు. ఈమె రంగు అరుణవర్ణమని అంటే లేత ఎరుపురంగని చెప్పబడింది. లలితాదేవి ధ్యానశ్లోకాలలో కూడా 'అరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం...' అని ఉంటుంది.  కురుకుళ్ళా దేవత కూడా నృత్యం చేస్తూ పుష్పబాణాన్ని సంధిస్తున్న భంగిమలో ఉంటుంది. కనుక ఈ ఇద్దరూ ఒక్కరే అనేది నిర్వివాదాంశం.

వజ్రయాన బౌద్ధంలో కురుకుళ్ళా దేవతకు 'ఆర్యతారా కురుకుళ్ళా కల్పం' అనే గ్రంధం ఉన్నది. దీనిని అతిశ దీపాంగారుని శిష్యుడైన మృత్యుంజయుడు టిబెటన్ భాషలోకి అనువదించాడు. ఈమెకు తారోద్భవ కురుకుళ్ళ అని కూడా పేరుంది. ఈమె ప్రాధమికంగా ఒక జ్ఞానదేవత అయినప్పటికీ ఈమె మంత్రాన్ని ఎక్కువగా వశీకరణంలో, సమ్మోహనక్రియలో ప్రయోగిస్తారు. ఒక వ్యక్తిని మనం వశం చేసుకోవాలంటే ఈమె మంత్రప్రయోగం అత్యుత్తమం. ఈ గ్రంధంలో కామ్యకర్మలకు వాడవలసిన అనేక మంత్రతంత్ర విధానాలు ఇవ్వబడ్డాయి. కల్ప గ్రంధాలన్నీ ఇలాంటివే.

తంత్రాన్ని లౌకిక ప్రయోజనాలకు వాడటం మీద అయిదేళ్ళ క్రితం కొన్ని పోస్టులు వ్రాశాను. నిజానికి ఇలాంటి పనులు నిషిద్ధం అయినప్పటికీ కొన్నికొన్ని సార్లు మంచి ఉద్దేశ్యంతో ఇలా వాడవలసి వస్తుంది. అయితే చెడు పనులకు వాడితే మాత్రం దాని ప్రతిఫలం తప్పకుండా అనుభవించవలసి ఉంటుంది. ఇది ప్రతి తాన్త్రికుడూ గుర్తుంచుకోవాలి.

తంత్రాన్ని నిత్యజీవితంలో నాలుగు రకాలుగా వాడవచ్చు.

1. శ్వేతకర్మ. దీనినే శాంతికర్మ లేదా White Magic అని అంటారు. జాతకంలోని మొండిదోషాలను తొలగించడానికి, తగ్గకుండా పీడిస్తున్న రోగాలను తగ్గించడానికి, భూత ప్రేతాలను వదిలించడానికి దీనిని వాడాలి. దీని దేవతలు తెల్లగా ఉంటారు. ఉదాహరణకు శ్వేతతార.

2. కాలకర్మ లేదా రౌద్రకర్మ. దీనిని Black Magic అంటారు. ఇతరులను నాశనం చెయ్యడానికి (మారణం) దీనిని వాడాలి. నిజానికి సాధనలో అడ్డు వస్తున్న మొండి దుష్ట సంస్కారాలను కర్మను నాశనం చెయ్యడానికే దీనిని ఉపయోగించాలి. దీనిలో ఉపాసింపబడే దేవతలు నల్లగా ఉంటారు. ఉదాహరణకు కాలతార, క్రోధకాళి, స్మశానకాళి, చిన్నమస్త, చాముండ.

3. పీతకర్మ లేదా పుష్టికర్మ. దీనిని Yellow Magic అంటారు. ధనధాన్య వృద్ధికి, సంపద వృద్ధికి, కుల వృద్ధికి, అధికార వృద్ధికి, అన్నిరకాలుగా ఔన్నత్యం కలగడానికి దీనిని వాడాలి. ఈ దేవతలు పసుపురంగులో ఉంటారు. ఉదాహరణకు స్వర్ణతార.

4.అరుణకర్మ లేదా వశ్యకర్మ. దీనిని Red Magic అంటారు. మనకు నచ్చిన స్త్రీలను, క్రూరజంతువులను, శత్రువులను వశం చేసుకోవాలంటే దీనిని వాడాలి. ఈ దేవతలు ఎర్రని రంగులో ఉంటారు. లలితాదేవి, కురుకుళ్ళ, అరుణతార మొదలైన దేవతలు ఈ కోవలోకి వస్తారు.

తెలుపురంగు శాంతికీ, నలుపురంగు మరణానికీ, పసుపురంగు వృద్ధికీ, ఎరుపురంగు సంమోహనానికీ సూచికలు. కొద్దిసేపు ఆ రంగుల మీద ధ్యానం చేస్తే వాటి ఆరాలు ఏమిటో బాగా అర్ధం అవుతాయి. చిన్న ఉదాహరణ ఇస్తాను. ప్రకృతిలో ఎర్రగా ఉన్న ప్రతిదీ మనిషిని ఆకర్షిస్తుంది. తెల్లనిది ప్రతిదీ శాంతిని కలిగిస్తుంది. ఈ రంగుల గుణాలు ఇలా ఉంటాయి. అలాగే ఒకే తారాదేవి అయినా కూడా ఆమె ఉన్న రంగును బట్టి ఆమె మంత్రంలో ఉన్న వైబ్రేషన్ ను బట్టి ఆమె చేసే పని ఉంటుంది.

సరే ఇవన్నీ కామ్యకర్మలు. వీటిని ఇలా ఉంచి మన సబ్జెక్ట్ లోకి వద్దాం.

పైన చెప్పబడిన అయిదుగురు బుద్ధులకు కులేశ్వరులని పేరుందని చెప్పాను. వీరితో ఉండే స్త్రీదేవతా శక్తులకే 'కులేశ్వరీ' అని పేరు. ఇదే నామం మనకు లలితా సహస్రనామాలలో "కురుకుళ్ళా కులేశ్వరీ" అంటూ కనిపిస్తుంది.

నిజానికి తంత్ర/పురాణకాలంలో (క్రీ.శ. 300 నుంచి 800 వరకూ) కొత్తగా వచ్చిన అనేకమంది బౌద్ధదేవతలనే ఈనాడు మనం హిందూమతంలో పూజిస్తున్నాం. వీరిలో చాలామంది నలందా, విక్రమశిల విహారాలలోని ఆచార్యులు సృష్టి చేసిన వారే. ఈ ఆచార్యులందరూ సంస్కృత, ప్రాకృతాలలోనూ, కొందరు టిబెటన్, చైనీస్ భాషలోనూ మహా పండితులు. వీళ్ళు అనేక తంత్ర గ్రంధాలను వ్రాసి వాటిని ప్రచారంలోకి తెచ్చారు.

ఉదాహరణకు చూస్తే - సరహుడు బుద్ధకపాల తంత్రాన్నీ, చక్రసంవర తంత్రాన్నీ, లూయిపా సిద్ధుడు యోగినీ సంచర్యా తంత్రాన్నీ, కంబలుడూ సరోరుహుడూ హేవజ్రతంత్రాన్నీ, క్రిష్ణాచార్యుడు సంపుటతిలక తంత్రాన్నీ, కుక్కురి మహామాయా తంత్రాన్నీ, పిటాచార్యుడు కాలచక్ర తంత్రాన్నీ సృష్టించారని బౌద్ధ తంత్రాలు చెబుతున్నాయి. ఈ తంత్రాలలో అనేక మంది తాంత్రిక దేవతలు మనకు దర్శనమిస్తారు. వీరిలో చాలామంది ప్రస్తుతం మనకు హిందూమతంలో కూడా వివిధ రకాలైన పేర్లతో పూజింపబడుతూ ఉన్నారు.

ఈ దేవతలను సృష్టించిన బౌద్ధ గురువులందరూ క్రీ.శ. 600-800 మధ్యలో ఒరిస్సా బెంగాల్ ప్రాంతాలలో ఉన్న విహారాలలో బౌద్దాచార్యులు. వీరిలో చాలామంది హిందూకుటుంబాల నుంచి వచ్చిన బ్రాహ్మణులే. నేటి దేవతలూ పూజావిధానాలూ అన్నీ వీరి సృష్టే. వీరిలో సరోరుహ అనే ఆచార్యుడు గుహ్యసిద్ధి అనే తంత్రాన్ని ఆచరించాడు. ఇదే హిందూ తంత్రాలలో గుహ్యసమాజ తంత్రం, గుహ్యాతిగుహ్య తంత్రం అయింది. డోంబి హేరుకాచార్యుడు నైరాత్మ్యతంత్రాన్ని బోధించాడు. ఈయన నైరాత్మ్య యోగినీ సాధన, ఏకవీరా సాధన, గుహ్యవజ్ర తంత్రరాజ తంత్రం అనే గ్రంధాలను వ్రాశాడు. ఈ చివరి గ్రంధమే హిందూ తంత్రాలలో తంత్రరాజతంత్రంగా అవతరించింది. ఇందులోనే మనకు కురుకుళ్ళా దేవత వివరాలూ, చిన్నమస్తా దేవత వివరాలూ లభిస్తున్నాయి.

ఈ 'నైరాత్మ్య' దేవతే వేదాలలో ఉన్న 'నిఱ్ఱుతి' అనే దేవత అని తంత్రపరిశోధకుల అభిప్రాయం. దిక్కులలో నైరుతిదిక్కుకు ఈమె అధిష్టానదేవత. జ్యోతిశ్శాస్త్రంలో రాహువు ఈ దిక్కుకు అధిపతి గనుకా, ఈమె బౌద్ధ తంత్రాలలోని దేవత గనుకా బౌద్ధమతానికి రాహువు అధిదేవత అనే కారకత్వం మనకు జ్యోతిష్య గ్రంధాలలో ఇవ్వబడింది. అంతేగాక, కురుకుళ్ళా దేవత యొక్క కాళ్ళక్రింద రాహువు తొక్కబడుతూ ఉన్నట్లు మనం ఆమె చిత్రంలో చూడవచ్చు.అంటే ఈమె ఉపాసన పూర్వకర్మ యైన రాహువును తొక్కేస్తుందని అర్ధం. ఇలా దేవతల కాళ్ళక్రింద పడి తొక్కబడుతూ ఉన్నట్లు మనకు అనేక చిత్రాలలో అనేకమంది కనిపిస్తారు. అంటే ఆయా క్షుద్ర శక్తులను ఈ దేవతలు అణిచి పారేస్తారని అర్ధం.

ఉదాహరణకు నటరాజు కాళ్ళక్రింద ఒక చిన్నరాక్షసుడు తొక్కబడుతూ ఉండటం మనం చూడవచ్చు. ఈ రాక్షసుడు బద్ధకానికి, అలసత్వానికి, లేదా శనీశ్వరునికి సూచిక. బద్దకాన్ని జయిస్తేనే కదా నాట్యాన్ని నేర్చుకోగలిగేది?  అలాగే దక్షిణామూర్తి కాళ్ళక్రింద కూడా ఒక రాక్షసుడు తొక్కబడుతూ ఉన్నట్లు మనం చూడవచ్చు. వీడు అజ్ఞానానికి సూచిక. అంటే అజ్ఞానాన్ని తొక్కేసి జ్ఞానాన్ని ఇస్తాడని దక్షిణామూర్తి స్వరూపానికి అర్ధం. అలాగే ఛిన్నమస్తాదేవి కాళ్ళక్రింద రతీమన్మధులు సంభోగంలో ఉన్నారంటే అర్ధం ఈ దేవతోపాసన కామాన్ని అణచిపారేస్తుందని, కామజయాన్ని అందిస్తుందని.

కామాన్ని జయించకుండా తంత్రసిద్ధి ఎన్నటికీ కలగదని ఎన్నోసార్లు ఇంతకు ముందే వ్రాశాను.

(ఇంకా ఉంది)