“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

19, ఆగస్టు 2017, శనివారం

ఛిన్నమస్తా సాధన - 3

భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో మూడో శతాబ్దం నుంచి పదో శతాబ్దం వరకూ ఒక విచిత్రమైన యుగం నడిచింది. ఈ కాలవ్యవధిలోనే మన దేశంలో రకరకాల పురాణాలూ తంత్రాలూ పుట్టుకొచ్చాయి. ఇవన్నీ బౌద్ధం యొక్క ప్రభావాన్ని తట్టుకోడానికి మనవాళ్ళు రచించి వ్యాసునికి ఆధర్ షిప్ తగిలించినవే గాని ఇవన్నీ వ్యాసుడే వ్రాశాడన్నది నిజం కాదు. ఎందుకంటే దాదాపు 1000 సంవత్సరాల కాలవ్యవధిలో వ్రాయబడిన అన్ని రచనలూ ఒకే వ్యక్తి వ్రాయడం ఎలా సంభవం? ఆయనెంత చిరంజీవి అనుకున్నా సరే??

'వశిష్టుడు' అన్నది ఎలాగైతే ఒక వ్యక్తి కాకుండా రఘువంశపు రాజులకందరికీ కులగురువైన ఒక పదవో అలాగే 'వ్యాసుడు' అన్నది కూడా ఒక వ్యక్తి కాదని నా అభిప్రాయం. సాధారణంగా మనం అనుకునేటట్లు పద్దెనిమిది పురాణాలనూ పద్దెనిమిది ఉపపురాణాలనూ వ్రాసినది ఒకే వ్యాసుడనేది నిజం కాదనీ, అవి దాదాపు వెయ్యి సంవత్సరాల కాలవ్యవధిలో వ్రాయబడినవనీ అనేకమంది చరిత్రకారులు భావిస్తారు. నేనూ ఈ భావనను విశ్వసిస్తాను. ఎందుకంటే మనం మతపిచ్చికి లోనైతే మూఢనమ్మకాల వలలో పడిపోతాం. చాదస్తంగా తయారౌతాం. నాకది ఇష్టం లేదు. అందుకే నేను వాస్తవిక దృక్పధాన్నే అనుసరిస్తానుగాని హిందూత్వంలో ఉన్న అన్ని భావనలూ నిజాలే అని మూర్ఖంగా నమ్మను.

ఇదే వాస్తవిక భావనను కొంచం పొడిగిస్తే మనకు ఒక విషయం అర్ధమౌతుంది. తంత్రములు అన్నవి కాలక్రమేణా ఆ తరువాత వచ్చిన భావనలేగాని వేదాలలో ఉన్న భావనలు కావు. ఎందుకంటే వేదకాలపు దేవతలు వేరు, తాంత్రిక దేవతలు పూర్తిగా వేరు. ఈ రెండు వర్గాలకూ హస్తి మశకాంతరం ఉన్నది. ఒక విధంగా చూస్తే, తంత్రాలనేవి వేదాలమీద ఒక విధమైన తిరుగుబాటుతో వ్రాయబడిన గ్రంధాలని నా అభిప్రాయం. ఈ నా అభిప్రాయానికి రుజువులను ముందుముందు చూపిస్తాను. ఇప్పుడు ఇంకో సంచలనాత్మక నిజాన్ని చెబుతాను.

పురాణాలూ తంత్రాలూ కూడా బౌద్ధం యొక్క ప్రభావం నుంచి హిందూ సమాజాన్ని బయటకు లాగడానికి ఉద్దేశించి అనేక రకాలైన కట్టు కధలతో కల్పించి వ్రాయబడినవే తప్ప వాటిలో అంతా నిజం కాదు. అయితే అన్నీ అబద్దాలు కూడా కావు. వీటిల్లో చరిత్రా, వాస్తవమూ, కల్పనా, పిట్టకధలూ, ప్రాంతీయ సంఘటనలూ అన్నీ కలగా పులగంగా మనకు కనిపిస్తాయి. దీనిక్ తోడుగా, సంస్కృతం కొద్దిగా వచ్చిన ప్రతివాడూ వాడికి తోచిన/నచ్చిన కధ వ్రాసేసి ఆయా పురాణాలలో ఎక్కడ బడితే అక్కడ ఇరికించి పారేశాడు. అందుకే మన పురాణాలు అతుకుల బొంతల్లాగా కనిపిస్తాయి గాని వాటిల్లో చారిత్రక వాస్తవాలు కరెక్ట్ గా మనకు ఎక్కడా దొరకవు. అందుకే, పురాణాలను అనుసరించి చరిత్రను తిరగ వ్రాయాలని సంకల్పించిన అనేకమంది పరిశోధకులు బోర్లా పడ్డారు.

అసలు తంత్రం అనేది బుద్ధుని సృష్టి అనేది నా ప్రగాఢ విశ్వాసం.ఆధ్యాత్మిక పరంగా చూస్తే, బుద్దుని జన్మ అనేది మన దేశంలో జరిగిన మహత్తరమైన సంఘటనల్లో ఒకటి. ప్రాచీన కాలంలో ఆయన ప్రభావం ఎంత గట్టిగా లోతుగా ఉందంటే, ఆయనకు అవతారం అన్న స్టేటస్ ను బలవంతంగా (ఇష్టం లేకపోయినా సరే) ఇవ్వవలసిన పరిస్థితి ఏర్పడింది మనవాళ్ళకి.

బుద్ధుడు తన వద్దకు ఉపదేశం కోసం వచ్చిన వారికి అందరికీ ఒకే విధమైన బోధను ఇవ్వలేదు. ఆయా వ్యక్తుల పరిణతిని బట్టి ఆయన బోధలు రకరకాలుగా ఉండేవి. కానీ వాటిల్లో అంతర్గతంగా ఒకటే ఫ్లేవర్ ఉండేది. ఆయన తరచుగా ఇలా అనేవాడు.

'సముద్రంలో నీటిని ఎక్కడ రుచి చూచినా ఉప్పగానే ఉన్నట్లు, నా బోధలు ఎక్కడ మీరు చూచినా ఒక రకంగానే ఉంటాయి.'

తన వద్దకు వచ్చిన మామూలు మనుషులకు (గృహస్థులకు) ఆయన ఒక విధమైన పైపైని బోధనలు చేసేవాడు. ఇవి కాలక్రమేణా మహాయానంగా రూపుదిద్దుకున్నాయి. అర్హులైన కొందరు సాధకులకు మాత్రం ఆయన తను అనుసరించిన సాధనా మార్గాన్ని బోధించాడు. అది హీనయానం అయింది. ఇంకా తీవ్ర అర్హత ఉన్న అతి తక్కువమందికి మాత్రం ఆయన అసలైన సాధనా విధానాలను బోధించాడు. అది వజ్రయానంగా రూపుదిద్దుకుంది. ఈ వజ్రయానమే తంత్రం. ఈ బోధనలు చాలా విప్లవాత్మకములే గాక అతి తక్కువ కాలంలో సిద్ధిని కలిగించేవిగా ఉండేవి. అయితే వీటిని పాటించడానికి అందరికీ అర్హతలు ఉండేవి కావు.

క్రీస్తు పూర్వమే హీనయానం అనేది శ్రీలంక, బర్మా, థాయిలాండ్ మొదలైన దేశాలకు విస్తరించింది. దీనిని దక్షిణమార్గం అంటారు. అంటే భారతదేశం నుంచి దక్షిణంగా ఇది పయనించింది. దీనికి విభిన్నంగా చైనా, మంగోలియా, జపాన్, కొరియా మొదలైన దేశాలకు మహాయానం విస్తరించింది. ఇది ఉత్తరమార్గం అయింది. మహాయానాన్ని ప్రచారంలోకి తెచ్చినవాడు ఆచార్య నాగార్జునుడు. ఈయన మన తెలుగువాడే. గుంటూరు జిల్లా వాడే. ఈయన్ను కొందరు 'రెండవ బుద్ధుడు' అని గౌరవంగా పిలిస్తే, అసలైన బౌద్దాన్ని నాశనం చేసిన వ్యక్తిగా మరి కొందరు తలుస్తారు. ఈ ఉత్తర దక్షిణ మార్గాలు కాకుండా మూడో మార్గం అయిన తంత్రం క్రీ.శ. ఏడో శతాబ్దంలో నేపాల్, టిబెట్ లకు విస్తరించి బాగా వేళ్ళు పాతుకుంది. దీనిని వాళ్ళు వజ్రయానం అన్నారు. ఈ వజ్రయానంలో అనేక మంది దేవతలు సృష్టింపబడ్డారు. వారిలో ఒక్కరే ఈ చిన్నమస్త/ చిన్నముండ అనే దేవత.

బౌద్ధంలో ఉన్న ఈ దక్షిణ, ఉత్తర, తంత్ర, మార్గాలనే హిందూతంత్రాలు కాపీ కొట్టి దక్షిణాచారం, వామాచారం, సమయాచారం అని పిలిచాయని నా నమ్మకం. ఎందుకంటే దక్షినాచారం శుద్ధమైన మార్గమని నమ్మిక. అలాగే దక్షిణమార్గం అయిన హీనయానం/ ధేరావాదం అనేది బుద్దుడు అనుసరించిన అసలైన పధం. ఇక వామాచారం అనేది భయాన్నీ అసహ్యాన్నీ కలిగించే అనేక తంతులతో నమ్మకాలతో కూడిన విధానం. వజ్రయానం కూడా (సరిగ్గా అర్ధం కాకపోతే) దాదాపు అలాంటిదే. ఇక మహాయానమూ సమయాచారమూ దగ్గర దగ్గరగా ఉంటాయి. కనుక మన తంత్రాల భాషకూ విధానాలకూ బౌద్ధ తంత్రాలకూ దగ్గరి సంబంధం ఉన్నదని నేను నమ్ముతాను. అంతేగాక, ఈ రెంటిలో బౌద్ధ తంత్రాలే ప్రాచీనమైనవని కూడా నా విశ్వాసం.

ఉదాహరణకు - హిందూ తంత్రాలలో ఒకటైన శ్రీవిద్యాతంత్రంలో భాగమైన  శ్రీచక్ర పూజలో నాలుగు ఆవరణలతో కూడిన త్రైలోక్య మోహనచక్రం లోని దేవతలలో బుద్ధుడు కూడా ఒకడు. ఆ ప్రాకార పరిక్రమలో ఒకచోట ఆయన్ను 'ఓం బుం బుద్ధాయ నమ:' అన్న మంత్రంతో పూజిస్తాము. అంటే శ్రీవిద్యకంటే బుద్ధుడు ప్రాచీనుడే అనే కదా అర్ధం !! కాకపోతే మన పండితులు ఈ మంత్రంతో పూజింపబడేది బుద్ధుడు కాదనీ 'బుద్ధి' అనే దేవతనీ వక్రభాష్యాలు చెబుతారు. అది వేరే సంగతి !!

కానీ అదే నిజమైతే ఆ మంత్రం 'ఓం బుద్ధ్యై నమ:" అని ఉండాలిగాని 'ఓం బుద్ధాయ నమ:' అని ఉండకూడదు మరి. కనుక ఈ మంత్రంలో చెప్పబడినది బుద్ధుడే అన్నది నిజం !! శ్రీవిద్యకు కూడా బుద్ధుడే మూలప్రేరణ అనేది కూడా నేడు మన పండితులు ఎవరూ ఒప్పుకోని పచ్చి నిజం !! నేనీ మాట అన్నందుకు చాలామంది సనాతన హిందూవాదులకు కోపాలు రావచ్చు. కానీ ఎవరికో కోపాలు వస్తాయని నేను నిజాలు చెప్పకుండా ఆత్మద్రోహం చేసుకోలేను.

సరే ఆ సంగతి అలా ఉంచుదాం.

ఈ తంత్రాల రచనా కాలమంతా క్రీ.శ.మూడో శతాబ్దం నుంచి పదో శతాబ్దం వరకూ అని ముందే చెప్పాను. ఈ సమయంలోనే తక్షశిల నలందా విశ్వవిద్యాలయాలు ఒక వెలుగు వెలిగాయి. వాటిల్లో - ఆర్యదేవుడు, అతిశ దీపాంగారుడు, ధర్మపాలుడు, ధర్మకీర్తి, దిన్నాగుడు, నాగార్జునుడు, శైలభద్రుడు మొదలైన బౌద్ధవిజ్ఞానులు ఆచార్యులుగా ఉండేవారు. ఈ కాలంలోనే, ముఖ్యంగా పాల, శైలేంద్ర సామ్రాజ్యాల కాలంలో బీహార్లో అనేక బౌద్ధతంత్రాలు వ్రాయబడ్డాయి. వాటికి పోటీగా హిందూ తంత్రాలు - శైవ, వైష్ణవ, శాక్త సాంప్రదాయాలలో వ్రాయబడ్డాయి.మేమూ తక్కువ తినలేదని అనేక పురాణాలు కూడా ఈ సమయంలోనే వ్రాయబడ్డాయి. దేవతలందరూ ఒక సాంప్రదాయంలోనుంచి ఇంకొక సాంప్రదాయంలోకి తీసుకోబడి, ఆయా మార్గాలకు తగినట్లుగా మార్పులు చేర్పులు చెయ్యబడ్డారు. పనిలో పనిగా శరభసాళువం, గండభేరుండం, మొదలైన కొత్త కొత్త దేవతలూ సృష్టింపబడ్డారు. ఒకరిని చూసి ఒకరు వాతలు పెట్టుకున్నట్టు ఈ గోల అంతా సాగింది.

నేడు మనం పూజిస్తున్న అనేకమంది దేవీదేవతలు ఈ సమయంలోనే ఆయా ప్రముఖ బౌద్ధ, హిందూ పండితుల చేత సృష్టింపబడ్డారు. అందుకే దీనిని పురాణయుగం అంటారు. అంతకు ముందరి వేదకాలంలో ఈ దేవతలెవ్వరూ నేడు మనం చూస్తున్న రూపాలలో లేరు. ఈ దేవతలలో కొందరి పేర్లు వేదాలలో ఉంటె ఉండవచ్చుగాక కానీ నేడు మనం చూస్తున్న రూపాలలో మాత్రం వారు అప్పటికి లేరు.

చిన్నమస్త అనే తాంత్రిక దేవత చిన్నముండగా బౌద్ధంలో దాదాపు ఏడో శతాబ్దం నుంచే ఉన్నట్లు ఆధారాలున్నాయి. కానీ హిందూతంత్ర గ్రంధాలైన శాక్తమహా భాగవతం, ప్రాణతోషిణి తంత్రం, ముండమాలా తంత్రం, గుహ్యాతిగుహ్య తంత్రం, స్వతంత్ర తంత్రం మొదలైనవన్నీ పదో శతాబ్దం నాటివి లేదా ఆ తరవాతవి కావడంతో ఈ దేవత ముందుగా బౌద్ధంలో ఉన్న దేవతేననీ, అక్కడ నుంచి హిందూమతంలోకి దిగుమతి అయిందనీ ప్రొ. భట్టాచార్య, తారానాధ్ వంటి తంత్ర పరిశోధకులు నిర్ధారించారు. కనుక ఈమె ప్రాధమికంగా ఒక బౌద్ధ తాంత్రిక దేవత అనేది నిర్వివాదాంశం.

బౌద్ధ హిందూ తంత్రాలలో ఆమె వర్ణన ఎలా ఉందో, బౌద్ధంలో నుంచి హిందూ తంత్రంలోకి దిగుమతి అయినప్పుడు ఈమె మంత్రాలూ ఆకారాలూ ఉపాసనా విధానాలూ ఎలా మార్పులకు గురయ్యాయో గమనిద్దాం.

(ఇంకా ఉంది)