“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

18, ఆగస్టు 2017, శుక్రవారం

ఛిన్నమస్తా సాధన - 2

ఈ పోస్ట్ మొదటి భాగం చదివాక అమెరికా నుంచి ఒక శిష్యురాలు నాతో ఫోన్లో మాట్లాడుతూ 'అదేంటి పాటలూ లైట్ టాపిక్స్ నడుస్తుండగా ఉన్నట్టుండి మళ్ళీ తంత్రం మీద వ్రాస్తున్నారు?' అనడిగింది.

'అవన్నీ  బయటకు కనిపించేవి. లోపల సరస్వతీ నదిలా నిత్యం ప్రవహించేది ఆధ్యాత్మికమే.' అని చెప్పాను.

కానీ ఈ టాపిక్ ఇప్పుడు వ్రాయడానికి ఒక కారణం ఉన్నది. అదేమిటో ఇప్పుడు చెబుతాను.

రెండురోజుల క్రితం నాకు ఒక ఫోనొచ్చింది. యధావిధిగా పరిచయాలయ్యాక ఆయన సరాసరి సబ్జెక్ట్ లోకి వచ్చాడు.

'నేను మీ బ్లాగ్ చదువుతూ ఉంటాను. మీ ప్రొఫైల్ కూడా చూచాను. మీకు తంత్రం తెలుసని దానివల్ల అర్ధమైంది. మీకు తంత్రంలో ఏ దేవతాసిద్ధి ఉన్నదో తెలుసుకోవచ్చా?'

నేనూ సూటిగానే మాట్లాడుతూ - 'అలా తెలుసుకున్నందువల్ల మీకేంటి ఉపయోగం?' అన్నాను.

'మాకు దానితో పని ఉంది. మీకు ఏ సిద్ధి ఉన్నదో చెబితే మా పని గురించి చెబుతాము' అన్నాడు.

'అది నా పర్సనల్ విషయం. దానిని మీకు చెప్పవలసిన పని నాకు లేదు.మీరెందుకు ఫోన్ చేశారో చెప్పండి.' అన్నాను.

'సరే వినండి. నల్లమల అడవులలో ఒకచోట నిధి ఉన్నదని మాకు కాన్ఫిడెన్షియల్ గా తెలిసింది. చాలా నమ్మకమైన ఇన్ఫర్మేషన్. ఆ నిధిని మీరు తీసి మాకు ఇవ్వాలి. అలా చెయ్యాలంటే ఛిన్నమస్తాన్ అనే దేవత సిద్ధి ఉన్నవారే చెయ్యగలుగుతారని, మామూలు మంత్రగాళ్ళు చెయ్యలేరని మాకు తెలిసింది. అందుకే మీకు ఫోన్ చేశాను. ఈ సహాయం మాకు చేస్తారా?' అడిగాడు.

'వీడి బొందలా ఉంది. చిన్న మస్తాన్ ఏమిట్రా నీ మొహం. విషయం తెలీదుగాని దురాశ మాత్రం చాలా ఉంది వీడికి' అని మనసులో అనుకుని ' ఆమె చిన్న మస్తాన్ కాదు. ఛిన్నమస్త అనే దేవత' అన్నాను.

'సరే ఏదో ఒకటి. ఏదైతే మాకెందుకు? మాకు నిధి కావాలి. మీరు తీసి ఇవ్వగలరా?' అన్నాడు డైరెక్ట్ గా పాయింట్ లోకి వస్తూ.

'చెయ్యగలను. డీల్ చెప్పండి.' అన్నాను.

'నిధిలో 25% మీకు. 75% మాకు.' అన్నాడు.

'మాకు అంటున్నారు. మీ గ్రూపులో ఎంతమంది ఉన్నారు?' అడిగాను.

'అది మీకెందుకు? అయినా అడిగారు గాబట్టి చెబుతున్నాను. మా గ్రూపులో ఆరుగురం ఉన్నాం. ఒక ఎమ్మెల్యే, ఒక ఎస్.పీ కూడా మాలో ఉన్నారు.' అన్నాడు.

'నాకు మీ ఆఫర్ నచ్చలేదు. ఎందుకంటే నిధి విలువ వందల కోట్లలో ఉంటుంది. వేల కోట్లు కూడా ఉండవచ్చు. చెప్పలేము. ప్రాణాలకు తెగించి దానిని తియ్యాలి. నల్లమల అడవులలో అంటున్నారు. అంటే ఏ విజయనగర రాజుల కాలందో అయి ఉంటుంది. అందులో ఉన్న వజ్ర వైడూర్యాలను బట్టి దాని విలువ ఎంతైనా ఉండవచ్చు. నాకు 50% ఇస్తే ఆలోచిస్తా' అన్నాను.

'అంతా మీకే ఇస్తే ఇక మాకేం మిగుల్తుంది? అయినా మీకొక్కరికే అంతెందుకు? 25% మీకు చాలా ఎక్కువ.' అన్నాడు.

'మీకర్ధం కావడం లేదు. మామూలు మంత్రగాళ్ళు ఈ పనిని చెయ్యలేరని మీరే అన్నారు. అంటే ఆ నిధికి కాపలాగా బలమైన శక్తులు ఉన్నాయని మీకు తెలుసు. అవి ఎన్నో, ఎంత శక్తివంతమైనవో మీకు తెలీదు. వాటిని నేను తట్టుకుని మీకా నిధిని తీసి ఇవ్వాలి. రిస్క్ నాకే ఎక్కువ. ప్రాసెస్ మధ్యలో ఏదైనా అయితే నాకే అవుతుంది గాని మీకేం కాదు. మీరంతా సేఫ్ గా ఉంటారు. కాబట్టి నా డీల్ కు మీరు ఒప్పుకుంటే చేస్తా' అన్నాను.

'కుదరదండి. మీకిష్టమైతే మా డీల్ ఒకే చెయ్యండి. పని మొదలు పెడదాం. లేదంటే మేం వేరే వాళ్ళను వెతుక్కుంటాం. మాకు తెలిసిన ఇంకొక స్వామీజీ ఉన్నాడు. ఆయనా చిన్నమస్తా ఉపాసకుడే. మీకంటే ఎక్కువ శక్తిగలవాడు. ఈ మధ్యనే మావాళ్ళలో ఒకరికి కాన్సర్ వస్తే ఆయన హోమం చేసి తగ్గించాడు. ఆయన్ను పట్టుకుంటాం.' అన్నాడు.

'ఓకే ఆయన దగ్గరికే వెళ్ళండి. నేను చెయ్యను.' అని చెప్పేశాను.

'లైఫ్ టైం చాన్స్ మిస్ అవుతున్నారు మీరు' అన్నాడు.

'పరవాలేదు. నా లైఫ్ లో నేను కొత్తగా మిస్ అయ్యేది ఏమీ లేదు. ఏది పొందాలో అది పొందాను చాలు. నేను మీకు మొదట్లోనే చెబుదామని అనుకున్నాను. తంత్రసిద్ధిని ఇలాంటి పనులకు వాడకూడదు. అది అసలైన సిద్ధికి సంకేతం కాదు. మీరు 100% వాటా ఇచ్చినా నేనిలాంటి పనులు చెయ్యను. కానీ మీనుంచి విషయం మొత్తం తెలుసుకుందామని అలా చెప్పాను. దయ్యాలు వదిలించడం, నిధులు తియ్యడం, రోగాలు తగ్గించడం, పనులు సాధించడం వంటి క్షుద్ర ప్రయోజనాలకు నేను నా సిద్ధిని వాడను. వాడలేను. అలాంటి పనులకు మీరు చెప్పిన లాంటి స్వామీజీలు ఉంటారు. వారి వద్దకు వెళ్ళండి. సారీ.' అని చెప్పి ఫోన్ కట్ చేశాను.

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, చాలామంది ఇదే భ్రమలో ఉంటారు. ఎవరైనా ఒక వ్యక్తి కొంత సాధన చేసి సిద్ధిని సంపాదిస్తే ఇక ఆ మనిషి చుట్టూ చేరి వారి గొంతెమ్మ కోరికల చిట్టా విప్పుతూ ఉంటారు. ఇది దురాశకు సంకేతం గాని ఇంకేమీ కాదు. ఇలాంటి వాటికి తంత్రశక్తులను పొరపాటున కూడా వాడకూడదు.

ఇలాంటి మనుషుల లాజిక్ ఏమంటే - ' మీరు కష్టపడి సిద్ధిని సాధించారు. దానిని మీలోనే దాచుకుంటే ఉపయోగం ఏముంది? నలుగురికీ పంచినప్పుడే కదా దాని ఉపయోగం?' అంటారు.

అలాంటి దురాశా పరులకు నేను ఇలా జవాబిస్తూ ఉంటాను.

'నిజమే మీరు చెప్పింది. ముందు మీరు పాటించి తర్వాత నాకు చెప్పండి. ముందు మీ ఆస్తినంతా అందరికీ పంచేసి ఆ తర్వాత నా దగ్గరకు రండి. అప్పుడు నేను కూడా నా సిద్ధిని మీకు పంచుతాను. మీది మీ దగ్గరే ఉండాలా? నేను మాత్రం నా సిద్ధిని అందరికీ తేరగా పంచాలా? మీ లాజిక్ చాలా బాగుంది.'

'తేరగా పంచమని మేము చెప్పడం లేదు. మీకూ ఉపయోగం ఉంటుంది కదా? డబ్బు తీసుకొని పని చేసి పెట్టండి.'

'మీరు ప్రతిదాన్నీ 'డబ్బు' అనే కోణంలో మాత్రమే చూస్తున్నారు గనుక మీకు అలాగే ఉంటుంది. నా కోణం అది కాదు. సాధనా సిద్ధిని వాడి డబ్బు సంపాదించవలసిన ఖర్మ నాకు లేదు. పైగా ప్రతివారి పాపఖర్మలో పాలుపంచుకుని వారికి తేరగా ఆ బాధలు పోగొట్టే అవసరం నాకు లేదు. ఎవరికి నా నిజమైన సహాయం అవసరమో నాకు తెలుసు. వారికి మాత్రమే అది చేస్తాను. మీక్కావలసిన పనులు చేసే చీప్ మంత్రగాళ్ళు చాలామంది ఉన్నారు. వారిని కలవండి. నిజమైన తంత్రం ఏమిటో తెలుసుకోవాలనుకుంటే మాత్రమే నా దగ్గరకు రండి.' అని వాళ్ళతో చెబుతూ ఉంటాను. ఆ దెబ్బతో వాళ్ళు పత్తా లేకుండా పారిపోతూ ఉంటారు.

దీనిలో ఇంకో కోణం కూడా ఉంటుంది.

సాధారణంగా ఇలాంటి నిధుల వేటగాళ్ళు క్రిమినల్స్ అయి ఉంటారు. వీరికి ఫారెస్ట్ దొంగలతోనూ, మాఫియాలతోనూ సంబంధాలు ఉంటాయి. ఇలాంటి పనులు అడవులలో, పాడుబడిన కోటలలో అర్ధరాత్రి పూట చేస్తూ ఉంటారు. కానీ ఇలాంటి క్రిమినల్స్ చెప్పే మాటలను మంత్రగాళ్ళు నమ్మరాదు. ఎందుకంటే వీరికి నీతీనియమాలు ఉండవు. వాటా ఎగరగొట్టడం కోసం, పని అయ్యాక ఆ మంత్రగాడిని అక్కడే చంపేసి ఆ అడివిలోనే పూడ్చేసిన సంఘటనలు నాకు కొన్ని తెలుసు. వీరికి రాజకీయ అండదండలూ, పోలీస్ పలుకుబడీ ఉంటాయి గనుక ఆ నేరాలు బయటకు రావు. కనుక ఇలాంటి వాళ్ళను నేను త్వరగా నమ్మను.

ఇది ఈ మధ్యనే జరిగిన సంఘటన. ఇలాంటి ఫోన్ కాల్స్ నాకు చాలా వస్తూ ఉంటాయి.

దశ మహావిద్యలనేవి 'పనులు' కావడం కోసం ఉపయోగించే పొట్టకూటి విద్యలనే పొరపాటు అభిప్రాయాన్ని నేటి చాలామంది గురువులు పెంచి పోషిస్తూ ఉన్నారు. తెలీనివాళ్ళు నమ్ముతున్నారు. ఈ రకంగానే హిందూతంత్రం భ్రష్టు పట్టిపోయింది. తంత్రం యొక్క పరమ ప్రయోజనం అది కాదు.

అసలైన తంత్రం ఏమిటో, అసలైన ఛిన్నమస్తా సాధన ఏమిటో చెప్పాలన్న నా ఊహకు, ఈ మధ్యన జరిగిన ఈ సంఘటనే ఆధారం. అందుకే ఈ సీరీస్. ఇక ముందుకెళదామా మరి?

(ఇంకా ఉంది)