“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

30, మే 2022, సోమవారం

ఈ అమావాస్య గిఫ్ట్ - నేపాల్ విమాన ప్రమాదం - జ్యోతిష్య విశ్లేషణ

ఈరోజు అమావాస్య. నిన్న ఆదివారం ఉదయం 9 55 ప్రాంతంలో నేపాల్ లో 'తారా ఎయిర్ వేస్' అనే ప్రయివేట్ ఎయిర్ లైన్స్ సంస్థకు చెందిన విమానం కూలిపోయింది. పోఖారా అనే టూరిస్ట్ సిటీ నుండి ఇంకొక టూరిస్ట్ ప్రాంతమైన జోమ్సంకు బయలుదేరిన ఈ విమానం 12 నిముషాలలోనే కొండలలోని కోవాంగ్ అనే పల్లెటూరి దగ్గరగా కూలిపోయింది. సాధారణంగా ఈ ప్రయాణం 20 నిముషాలే పడుతుంది. 9.55  AM కి బయలుదేరిన ఈ విమానం 12 నిముషాల తర్వాత 10.07 కి కంట్రోల్ తో సంబంధాలు కోల్పోయింది. అప్పటినుంచీ విమానం అడ్రస్ లేదు. కొండలు, మంచుల వల్ల విమానం కూలిపోయిన ప్రదేశానికి అధికారులు వెంటనే చేరలేకపోయారు. ప్రస్తుతం చేరుకున్నారు. అందులో ఉన్న 22 మంది ప్రయాణీకుల శరీరాలు గుర్తుపట్టలేనివిధంగా ముక్కలైపోయాయి. 

జ్యోతిష్య పరంగా చూద్దాం.

ప్రస్తుతం కుంభరాశి నుండి వృషభరాశి వరకూ గ్రహాలన్నీ గుమిగూడి ఉన్నాయి. ఏదో దుర్ఘటన జరిగినప్పుడు జనం గుంపులుగా గుమిగూడి చూచినట్టు ఈ దృశ్యం ఉన్నది. గత వారం నుంచీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అన్ని దుర్ఘటనలకూ ప్రస్తుతం ఖగోళంలో ఉన్న ఈ గ్రహస్థితే కారణం.

కుజుడు, గురువు దాదాపుగా ఒకే డిగ్రీమీద ఉంటూ, శపితయోగంలో బందీలై ఉన్నారు.  వారిమీద శని, ప్లూటో, శుక్ర, బుధుల ప్రభావాలున్నాయి. అందుకనే, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దుర్ఘటనలు గత వారం నుంచీ జరుగుతున్నాయి. అవన్నీ వివరించడం నా ఉద్దేశ్యం కాదు.

మేషరాశి కొండకోనలను సూచిస్తుంది, అదేవిధంగా నేపాల్ దేశాన్ని కూడా సూచిస్తుంది. ప్రస్తుతం మేషరాశి తీవ్రమైన అర్గలదోషంతో ఉన్నది. అందులోనే, చంద్రుడు రాహుగ్రస్తుడై, విమానాలకు సూచకుడైన శుక్రునితో కలసి అర్గళంలో ఉన్నాడు. మరణానికి కారకుడైన యముడు (ప్లూటో) యొక్క కేంద్రదృష్టి వీరిపైన ఉన్నది. నవాంశచక్రంలో, నీచరాహువుతో కూడి ఉన్న చంద్రుడిని వక్రబుధుడు కలుస్తున్నాడు. అంటే, యాంత్రికప్రమాదం సూచింపబడుతున్నది. లెక్క సరిపోయిందనుకుంటాను.

ఈ విమానంలో 22 మంది ప్రయాణీకులున్నారు. రూట్ నంబర్ 4 అవుతున్నది. 2, 4 అనే అంకెలు రాహుకేతువులకు సూచికలు. వీళ్ళు నవాంశలో నీచస్తితులలో ఉన్నారు. 4 అంకెను సూచించే కేతువు ఒంటరివాడుగా తులలో దూరంగా ఉన్నాడు. అందుకే, ఎక్కడో కొండల్లో విమానం కూలిపోయింది. ప్లూటో (మరణం) యొక్క కేంద్రదృష్టి ఈయనమీద కూడా ఉన్నది. 24 గంటలు గడిచిన తర్వాత కూడా శవాలు కొండలలో దిక్కులేకుండా పడి ఉన్నాయి. ఇలాంటి చావులకు కేతువే కారకుడు. ఈ గ్రహయోగాలన్నీ కలసి ఈ భయంకర విమానప్రమాదానికి కారణమైనాయి.

సూక్ష్మవిషయాలను స్పష్టంగా చూపించే షష్ట్యంశ (D-60) చక్రాన్ని గమనిద్దాం.

9.55 కి ఆ ప్రాంతపు షష్ట్యంశ చక్రం ఇలా ఉంది. లగ్నాధిపతి గురువు బాధకుడు బుధునితో కలసి అస్తమయయోగంలో ఉన్నాడు. అంటే, చావు మూడబోతున్నదని అర్ధం. విమానానికి కారకుడైన శుక్రుడు నీచకేతువుతో కలసి, విమానం ధ్వంసం అవుతుందని సూచిస్తున్నాడు. కర్మ కారకుడైన శని, నేపాల్ ను సూచించే మారకరాశి మేషంలో నీచస్థితిలో ఉన్నాడు. ఈ విమానం చాలా చెడుఘడియలలో బయలుదేరింది. 

షష్ట్యంశచక్రంలోని లగ్నం ప్రతి రెండు నిముషాలకు మారిపోతూ ఉంటుంది. 9.57AM కి ఇది మేషలగ్నమైంది. అంటే, నీచశని మీదకు వచ్చింది. ప్రమాదం వేగంగా దగ్గరవడం మొదలుపెట్టింది.

9.59AM కి నీచకేతు, శుక్రుల (విమానవిధ్వంసయోగం) తో కూడిన వృషభలగ్నమైంది. విమానంలో యాంత్రికలోపాలు తలెత్తి ఉంటాయి.

10.07AM కి సింహలగ్నమైంది. అక్కడే వక్రప్లూటో (మరణం) ఉన్నాడు. ప్లూటో, గురుబుధులనూ, సూర్యకుజులనూ ఆచ్ఛాదిస్తున్నాడు. వక్రబుధ, వక్రప్లూటోల వల్ల పైలట్ బుద్ధి వక్రిస్తుంది. అంటే, జడ్జ్ మెంట్ లోపిస్తుంది. జీవకారకుడైన గురువును మరణకారకుడైన ప్లూటో ఆచ్ఛాదించడం వల్ల మరణం వరిస్తుంది. సూర్య కుజులపై ప్లూటో ఆచ్చాదన భయంకరమైన యాక్సిడెంట్ ను ఇస్తుంది. ఖచ్చితంగా ఇవే యోగాలు, షష్ట్యంశ (D-60) చక్రంలో ఉండటాన్ని చూడవచ్చు.

ఈ పాయింట్స్ అన్నిటినీ అన్వయం చేసుకోండి. నేనక్కర్లేదు, మీరే చెప్పగలుగుతారు ఏం జరిగి ఉంటుందో?

ప్రస్తుతం అమెరికానుండి, మిడిల్ ఈస్ట్ నుండి, యూరోప్ నుండి, ఇండియానుండి, శ్రీలంక వరకూ ప్రతిచోటా జరుగుతున్న దుర్ఘటనలన్నిటికీ ఈ చార్ట్ లో కనిపిస్తున్న గ్రహయోగాలే కారణం. ఇవి ఒక్కొక్క ప్రాంతంలో, ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క విధంగా ప్రభావాన్ని చూపిస్తాయి.

మొత్తం మీద ఈ అమావాస్య, ప్రపంచానికి ఈ బహుమతిని ఇచ్చింది !