“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

11, మే 2022, బుధవారం

దోశా ఫౌండేషన్

మొన్న సాయంత్రం బ్రేక్ ఫాస్ట్ టైంలో శ్రీమతి ఒక మాటంది.

అదేంటి? బ్రేక్ ఫాస్ట్ అనేది ఉదయం కాకుండా సాయంత్రం కూడా ఉంటుందా? అని చచ్చుప్రశ్న అడక్కండి. ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడే ఉంటుంది. విషయం లోకి రండి.

'మా అత్త ప్రస్తుతం కోయంబత్తూర్ లో ఉంది'.

మింగుతున్న దోశముక్క నా గొంతుకు అడ్డం పడింది.

తలమీద కొట్టుకుంటూ, 'అదేంటి ఆమె డల్లాస్ లో కదా ఉండేది?' అన్నాను.

'అవును. డల్లాస్ నుంచి వచ్చి మొన్నటిదాకా హైదరాబాద్ లోనే ఉంది. ఇప్పుడు కుర్తాళం మీదుగా కోయంబత్తూర్ చేరుకుంది' అన్నది.

'అక్కణ్ణించి ఇంకా కిందకెళితే కన్యాకుమారి వస్తుంది. ఇంకా ముందుకు పోతే శ్రీలంక వస్తుంది. కొంపదీసి అక్కడకు కూడా పోతుందేమో? శ్రీలంకంతా గందరగోళంగా ఉంది. అక్కడికెళ్లొద్దని చెప్పు ఫోన్ చేసి' అన్నా ఇంకో దోశముక్కను తాపీగా నములుతూ.

శ్రీమతికి కోపం వచ్చింది.

'దేన్నీ సరిగా తీసుకోరా మీరసలు?' అంటూ గొంతు పెంచింది.

'సరిగానే తీసుకుంటున్నా చెట్నీతో కలిపి. ఇంకో దోశ వెయ్యి' అన్నా నవ్వుతూ.

'అదికాదు నేనంటున్నది మా అత్త సంగతి' అంది తగ్గి.

'సరే చెప్పు' అన్నా ఇంకో దోశ ముక్కని నోట్లో పెట్టుకోబోతూ.

'ప్రస్తుతం ఆమె 'ఈశా ఫౌండేషన్' ఆశ్రమంలో ఉంది' అంది శ్రీమతి.

ఈసారి నవ్వుతో కొరబోయింది నాకు.

నవ్వీ నవ్వీ ఆపి, తలమీద మళ్ళీ చరుచుకుని, 'ఏం మన 'దోశా ఫౌండేషన్' నచ్చలేదా?' అడిగా.

'అంటే?' అంది తను.

'రోజూ దోశలొద్దంటే వినవు నువ్వు. ఆమె మనింటికి వచ్చినరోజు కూడా దోశలే పెట్టావు. చూశావా ఆమెకి 'దోశా ఫౌండేషన్' అంటేనే విరక్తి కలిగింది. ఈశా ఫౌండేషన్ వైపు చూపు మళ్లింది. అందుకే అప్పుడప్పుడూ ఇడ్లీ చెయ్యమని నీకు చేప్పేది' అన్నా నవ్వుతూ.

'ఏ అప్పుడు 'ఇడ్లీ ఫౌండేషన్' కు పోతుందా?' అడిగింది ఎగతాళిగా.

దానికి సమాధానం చెప్పకుండా సీరియస్ గా ఆలోచిస్తూ, 'గణపతి, కులపతి, దళపతి' అన్నా.

'అవేంటి కొత్త మంత్రాలా?' అంది శ్రీమతి అయోమయంగా.

'మంత్రాలూ కాదు చింతకాయపచ్చడీ కాదు. ఎప్పుడూ నీకదే గోల. కాస్త లౌకికంలోకి రా. ఇరవై ఏళ్ళనాడు గణపతి సచ్చిదానంద భక్తురాలు కదూ ఈమె?' అడిగా ఆలోచిస్తూ.

'అవును. వీర భక్తురాలు. ఆయన్ని తెగ ఫాలో అయ్యేది' అన్నది.

అందుకే ఫస్ట్ గణపతి అన్నా. తర్వాత సిద్దేశ్వరానంద భక్తురాలైంది కదూ? అందుకే కులపతి అన్నా.  మూడోది దళపతి. అంటే, తమిళతంబి. లెక్క సరిపోలా?' అన్నా.

'ప్రస్తుతం కూడా ముందు కుర్తాళం వెళ్లి, తీర్ధం తీసుకుని అక్కణ్ణించి కోయంబత్తూర్ చేరుకుంది' అన్నది.

'అదేంటి తీర్ధం తీసుకుంటే మోక్షం రావాలే? రాలేదా? అయినా తీర్ధం కోసం అంతదూరం పోవాలా? ఇక్కడ హైదరాబాద్లో దొరకదా?' అడిగా అనుమానంగా.

'ఆ తీర్ధం కాదు' అంది కోపంగా.

'ఓహో కుర్తాళం తీర్ధం స్పెషలేమో? అవున్లే అడివి మూలికలన్నీ కలుపుతారేమో దాంట్లో?' అన్నా.

'అదేమో తెలీదు. ఇంకా కొంతమంది లేడీస్ బ్యాచ్ కూడా ఆమెతో ఉన్నారు. అందరూ కలసి ఇప్పుడు కోయంబత్తూరులో ఉన్నారు' అంది. 

'ఓహో ఆడంగుల అరవదేశయాత్రనా? రొంబ సాంబారు. అవున్లే మంత్రం తంత్రం అన్నీ కలిస్తేనే కదా మోక్షం? ట్రై చేస్తే మంచిదే' అన్నా తాపీగా దోశ నములుతూ.

'అక్కడామెకు వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్నారట' అన్నది.

'ఈమె వీఐపీ కాదు కదా? ఎందుకిస్తున్నారో?' అడిగాను.

'ఏమో మరి' అన్నది

'నేచెప్తా విను. డల్లాస్ లో ఉంటానని చెప్పి, డాలర్స్ కురిపిస్తే వీఐపీ ఏం ఖర్మ? దాని బాబులాంటి ట్రీట్మెంటిస్తారు. వాళ్ళక్కావలసింది ఇలాంటి బకరాలేగా మరి' అన్నా.

'ఎందుకలా?' అడిగింది.

'చెప్తా విను' అంటూ దోశకు ఫౌండేషన్ వెయ్యడం ఆపి, అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతోపదేశం చేసిన ఫోజులో చెప్పడం మొదలెట్టా.

'ఇదొక సింబియాసిస్ అన్నమాట ! స్వాములకేమో డాలర్లు కావాలి. అమెరికాలో బ్రాంచి పెట్టడానికి మీ అత్తలాంటి ఏజంట్లు కావాలి. మీ అత్తలాంటి వాళ్ళకేమో అమెరికాలో వాళ్ళ సర్కిల్లో లోకల్ గురువులుగా చెలామణీ కావాలన్న దురద ఉంటుంది.  అందుకని ఒక ఇండియా ఫ్రాంచైసీ కావాలి. కాబట్టి ఇద్దరికిద్దరూ సరిపోతారు. ఇంతే దేవరహస్యం' అన్నా.

'అవునా?' అంది ఆశ్చర్యపోతూ.

'అవును. ఇంతకుముందు మన పంచవటిలో కూడా కొంతమంది ఉండేవాళ్ళు. వాళ్ళూ అమెరికాలో లోకల్ గురువులే. నువ్వు గమనించావా లేదో వాళ్ళూ బ్రాహ్మలే. ఈ బ్రాహ్మలకి ఇదొక జబ్బు. పంచాంగాలు, మంత్రాలూ, పూజలని చెప్పి ఎదుటివాళ్ళ దగ్గర, ముఖ్యంగా అమాయకులైన ఇతరకులాల భక్తుల దగ్గర పోజు కొట్టడం వీళ్లకున్న నయంకాని దీర్ఘజబ్బులలో ఒకటి. ఈ బ్రాహ్మణ రుబాబు భరించలేకే నిమ్నకులాలు మతాలు మారేది. అసలు క్రైస్తవం ఇంతగా ఎదగడానికి ఇన్ డైరెక్ట్ గా నీరు పోసింది మీవాళ్లే.

ఉదాహరణకు, మన ఇండియాలో కూడా చూడు. అపార్ట్ మెంట్ లోని ఆడంగులంతా కలిసి 'లలితాసహస్రనామ బ్యాచ్' అని ఒకటి పెడతారు. లేదా 'విష్ణుసహస్రనామ బ్యాచ్' అని పెడతారు. అందులోకూడా మన ఆడంగులే లీడర్లుగా ఉంటారు. పండగలని, పబ్బాలని, తిధులని, నోములని ఉన్నవీ లేనివీ చెప్పి ఆ గ్రూపుమీద అజమాయిషీ చేస్తుంటారు. పాపం అమాయకులైన ఇతరకులాల ఆడవాళ్ళు వీళ్ళ మాటలన్నీ నమ్ముతుంటారు. మన రుబాబు సాగుతూ ఉంటుంది. మనవాళ్ళు మొగయినా ఆడైనా, అమెరికా పోయినా, అంటార్కిటికా పోయినా సరే, ఈ జాడ్యం మాత్రం వదలదు. 

అందుకని అక్కడ బ్రాంచీ పెట్టాలంటే ఇక్కడనుంచి ఒక స్వాములోరి సరిటిఫికేట్ కావాలి. ఊరకే మంచిమాటలు చెబితే ఎవరు వింటారు? మంత్రాలూ, మహత్యాలూ కావాలి, లేదా సోషల్ స్టేటస్ కావాలి. ప్రస్తుతం 'ఈశా' అంటే ఒక స్టేటస్ సింబల్ గా చాలామంది అమాయకులు భావిస్తున్నారు. ఎందుకంటే సినిమా యాక్టర్లు, సెలబ్రిటీలు అందులో ఉన్నారు కాబట్టి. అమెరికాలో దాని బ్రాంచి అయితే తేలికగా సక్సెస్ అవుతుంది.

ఇంతా చేస్తే, ముందుగా సరియైన దారిలో సాధనచేసి అనుభవాన్ని పొందుదామని మాత్రం ఎవరికీ ఉండదు. 'ఇన్ స్టెంట్ గా గురువులైపోవాలి, వేరేవాళ్లకు బోధించాలి' ఇదే దురద ఎక్కడ చూసినా. ఇలాంటి దురదగాళ్ళకు, దురదగొండాకు స్వాములోర్లే తగులుకుంటారు. ఉన్న దురదను వదిలిస్తారు.

ఇదంతా ఐడెంటిటీ క్రైసిస్సూ,  బిజినెస్సూ మాత్రమే. మీ అత్తలాంటి వాళ్ళకేమో ఐడెంటిటీ క్రైసిస్సు. మన స్వాములోర్లకేమో మంచి బిజినెస్సు. అయినా,  మీ అత్తకు ఈ రెండు రోగాలూ ఇంత ఎక్కువగా ఉన్నాయని నాకు తెలీదు సుమీ' అన్నా ఆశ్చర్యాన్ని నటిస్తూ.

'ఇంతుందా దీనివెనుక? ఆమ్మో' అంది శ్రీమతి.

'అవును, చాలా ఉంటుంది కధ. పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి. ఎవరి కర్మ వారిది. సరేగాని, ఇంకో దోశ పడేయ్ ఇటు. పొద్దున యోగా కొంచం ఎక్కువైంది. అందుకే 'దోశా ఫౌండేషన్' సరిపోలేదు' అన్నా.

'తిండిబోతు రామన్న' అని విసుక్కుంటూ వంటింట్లోకి దారితీసింది శ్రీమతి.

నేను ప్లేట్లో ఉన్న దోశకు మంచి ఫౌండేషన్ వెయ్యడం మొదలుపెట్టా. అదన్నమాట దోశా ఫౌండేషన్ భాగోతం.

కథ కంచికి. మనం హాల్లోకి.